కొన్ని పువ్వుల్ని ఏరుతున్నాను నేస్తం
కాస్త పరిమళం కోసం!

మనుషులు మనుషుల వాసన వేయడం లేదు
అనేక వాసనల్లో వెలిగిపోతున్నారు
అనుమానాల వాసన
అబద్ధాల వాసన
అసూయల వాసన
ద్వేషాల వాసన...
ఊపిరి సలపని వాసనల నుండి
కొంచెం దూరం జరిగి-

కొన్ని పువ్వుల్ని ఏరుతున్నాను నేస్తం
కాస్త పరిమళం కోసం!

సున్నితత్వాలు నామోషీ అయ్యాయి
వజ్ర సదృశ పొరలలో నాగరికత నవ్వుతోంది
ఎవరు పడిపోతున్నా
ఎవరు వెనకపడిపోతున్నా
ఎవరు చస్తున్నా
ఎవరు ఏడుస్తున్నా 
కులాసాగా చూస్తున్న గొప్పతనాలకు
కొంచెం దూరం జరిగి-

కొన్ని పువ్వుల్ని ఏరుతున్నాను నేస్తం
కాస్త పరిమళం కోసం!

ఎంతైన పువ్వులు పువ్వులే కదా
పోటీ ఏ సాటి లేని మేటి నవ్వులనిస్తాయి
కాసేపు పువ్వుల దగ్గర కూర్చుంటే
జీవితం తేలికవుతుంది వాటిలాగే...
అవి వాడిపోతే
నేను అశృబిందువులు రాల్చుతాను
కానీ అవి ఎక్కువసేపు ఏడ్వనీయవు
మళ్ళీ తెల్లారే నవ్వుతూ పలకరిస్తాయి
మళ్ళీ మళ్ళీ చల్లని నవ్వులనిస్తాయి!

కొన్ని పువ్వుల్ని ఏరుతున్నాను నేస్తం
కాస్త పరిమళం కోసం!

ఎవరికెవరూ కాలేని మనుషులపై కూడా
ఈ పువ్వులు ప్రేమనే చూపుతాయి
పసి పిల్లలను పసిడి వయస్కులను వృద్ధులను
కలల్లో ముంచెత్తుతాయి
ఒకరినొకరు మోసం చేసుకునే మనుషులకు
మోసాల కన్నా మోహాల కన్నా హృదయాల జాడలు ముఖ్యమని చెబుతుంటాయి
పువ్వులను చూడటం పువ్వులను వినడం నేర్చుకోవాలి
వాటి పరిమళం కాస్త శక్తినిస్తుంది
సంక్లిష్ట ప్రపంచంలో ధైర్యంగా బతికేంత తాత్వికతనిస్తుంది
పువ్వుల చెంతకు వెళ్ళిన మనిషి కొంతైనా శుభ్రపడతాడు!

కొన్ని పువ్వుల్ని ఏరుతున్నాను నేస్తం
కాస్త పరిమళం కోసం!

ఎవరికైనా మనం ఇవ్వగల గొప్ప బహుమతి
పువ్వులకంటే ఇంకేముంటుంది...
గెలిచిన చేతుల చెంతకు పువ్వులు
అలసిన మనుషుల వద్దకు పువ్వులు
ఉత్సవ ఉత్సాహాల దరికి పువ్వులు
సమాధుల దగ్గరికి పువ్వులు...!
హృదయాల దగ్గరి దగ్గరికి పువ్వులు వచ్చినా కొద్దీ
మనం కొంచెం పరిమళమవుతాం!

ఏమో... పువ్వులే లేకపోతే ఈ ప్రపంచమెలా ఉండేదో
పరిమళం లేని ఒట్టి గాలులతో!

Leave a Reply