దేహమంతా సూదిపోట్ల సలపరం
పాదాలు ఏనుగేదో తొక్కిపెట్టినట్లు
లోలోపల కరకరమమంటూ బాధ

తనువంతా రెండు ముక్కలయినట్లుగా 
భారంగా వేలాడుతుంది

కను రెప్పలనెవరో పిన్నులతో 
ఎక్కుపెట్టినట్లు నిదుర ఎక్కడికో
తనను మరచి పారిపోయినట్లుంది

రక్తాన్ని తోడుతున్నదెందుకో
ఎన్ని పరీక్షలు చేసినా 
చివరాఖరికి ఏదీ కొత్తగా 
చెప్పారో తెలియని అయోమయం

చికిత్స తెలిసినట్లే వున్నా 
దేహమెందుకో మొరాయిస్తుంది

ఈ తెలవారని రాత్రి
మరో ఉదయాన్ని మాత్రమే 
హామీనివ్వగలుగుతోంది

పున్నమి వెన్నెల రాజి గూడులా
తన కంటి చుట్టూ వలయాలు

అయినా తను 
పగలబడి నవ్వినప్పుడు 
అడవి చుట్టూ 
వెలుతురు పూల కాంతి!!!

(కామ్రేడ్ సహోదరికి ప్రేమతో)

Leave a Reply