దేశ జిడిపికి సంబంధించి జాతీయ గణాంకాల కార్యాలయం ఫిబ్రవరి 29న విడుదల చేసిన గణాంకాలు ఆశ్చర్యపరిచాయి. నిపుణులను కలవరపరిచాయి. ప్రభుత్వ అంచనాలను, స్వంత డేటాను తారుమారు చేసింది. కారణం ఏమి కావచ్చు? ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌తో ముగిసిన ముడో త్రైమాసికం (క్యూ3)లో జిడిపి 8.4 శాతం పెరిగిందని ఎన్‌ఎస్‌ఓ గణాంకాలు చూపుతున్నాయి. క్యూ1, క్యూ2 వృద్ధి రేటును కూడా సవరించింది. 2023-2024 ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో భారత జిడిపి వృద్ధిరేటు విశ్లేషకుల అంచనాలను అధిగమించింది. ఇంతకుముందు త్రైమాసికంలో నమోదైన 8.1 శాతంతో పోల్చితే ఇది అధికం. గతేడాది ఇదే త్రైమాసికంలో నమోదైన 4.5 శాతం వృద్ధి రేటుతో పోల్చితే చాలా ఎక్కువ. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్యూ1లో జిడిపి వృద్ధిరేటు 7.8 శాతంగా ఉండగా 8.2 శాతంగా నమోదైనట్లు తెలిపింది. అలాగే క్యూ2లో వృద్ధిరేటు 7.6 శాతంగా ఉండగా 8.1 శాతానికి పెంచింది.

స్థూల దేశీయోత్పత్తి (గ్రాస్‌ డొమెస్టిక్‌ ప్రొడక్ట్‌) లేదా జిడిపి లెక్కించే పద్ధతిలో చాలా సమస్యలు ముడిపడి ఉన్నాయి. మనదేశంలో సేవా రంగాన్ని కూడా లెక్కలోకి తీసుకోవడం జరుగుతోంది. సేవారంగతంలో పని చేసేవారు అదనంగా ఉత్పత్తి చేసే సరుకులు ఏమీ ఉండవు. గతంలో సోషలిస్టు దేశాలుగా ఉన్నప్పుడు సోవియట్‌ యూనియన్‌లో, తక్కిన తూర్పు యూరప్‌ దేశాలలో జిడిపి అని కాకుండా, స్థూల పాదార్థిక ఉత్పత్తి (గ్రాస్‌ మెటీరియల్‌ ప్రొడక్ట్‌)ని లెక్కించేవారు. అందులో సేవారంగం లెక్కలోకి వచ్చేది కాదు. ఇటువంటి అవగాహనతో ముడిపడిన సమస్యలతో బాటు చిన్నస్థాయి ఉత్పత్తి రంగంలో నమ్మకమైన, క్రమబద్ధమైన గణాంకాలు సకాలంలో లభించే పరిస్థితి లేదు. దానివలన కూడా జిడిపి లెక్కలు వేయడం సమస్య అవుతుంది. మన దేశంలో చాలామంది ఆర్థికవేత్తలు మన జిడిపి వృద్ధిరేటు లెక్కలు వాస్తవ వృద్ధి కన్నా చాలా ఎక్కువ చూపిస్తున్నాయని భావిస్తున్నారు.

రేటింగ్‌ ఎజెన్సీలు, దిగ్గజ విత్త సంస్థల పరిశోధన సంస్థల అంచనాలను మించి జిడిపి పెరుగుదల చోటు చేసుకోవడం నిపుణులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అక్టోబర్‌- డిసెంబర్‌ క్యూ3లో భారత వృద్ధి 6.5 శాతంగా ఉండొచ్చని ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రీసెర్చ్‌ అంచనా వేయగా.. 6.7-6.9 శాతంగా నమోదు కావొచ్చని ఎస్‌బిఐ రీసెర్చ్‌ విశ్లేషించింది. మరోవైపు ఆర్‌బిఐ అంచనాలు 6.5 శాతం మించి ఉండదని ప్రకటించగా ఎన్‌ఎస్‌ఒ అనుహ్యా గణాంకాలను ప్రకటించడం విస్మయాన్ని కలిగిస్తోంది. ప్రజల ఆదాయాల్లో పెద్ద మార్పులు లేకపోయినప్పటికీ.. పెట్టుబడులు, ఆర్థిక వ్యవస్థలో గొప్ప సానుకూలాంశాలు కానరాకపోయినప్పటికీ 8 శాతం ఎగువన జిడిపి పెరగడం విమర్శలకు దారి తీస్తోంది. రేటింగ్‌ ఎజెన్సీలతో పాటు దిగ్గజ ఆర్థిక సంస్థల, పరిశోధన సంస్థల అంచనాలను మించి జిడిపి పెరుగుదల చూపడం ఎన్నికల మాయాజాలమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ప్రస్తుత 2023-24 పూర్తి ఆర్థిక సంవత్సరానికి వృద్ధి అంచనాల్ని ఎన్‌ఎస్‌ఓ 7 శాతం నుంచి 7.6 శాతానికి పెంచింది. ఇది 2011-12 స్థిర ధరల ప్రకారం రూ.172.90 లక్షల కోట్లు. 2022-23 సంవత్సరంలో సవరించిన అంచనాల ప్రకారం వాస్తవ జిడిపి రూ.160.71 లక్షల కోట్లు. ప్రస్తుత ధరల ప్రకారం 2022-23లో ఇది రూ.269.50 లక్షల కోట్లుగా ఉంది. ఈ అంచనా గణాంకాలకు అనుగుణంగా 2023-24లో వృద్ది 7.6 శాతం పెరుగుతున్నట్టవుతుందని ఎన్‌ఎస్‌ఓ వివరించింది. ప్రస్తుత దరల ప్రకారం 2023-24 ఆర్థిక సంవత్సరంలో జిడిపి రూ.293.90 లక్షల కోట్లకు చేరుతుందని ఎన్‌ఎస్‌ఓ అంచనా వేసింది.  జిడిపి 9.1 శాతం వృద్ధి రేటును ప్రదర్శిస్తుంది.

మోడీ ప్రభుత్వం ఎన్నికల వేళ మరో మాయాజాలానికి పాల్పడింది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కుంచించుకు పోవడంతో పాటు పెరుగుతున్న ధరలతో విలవిలలాడుతున్న సామాన్యుని ఆగ్రహాన్ని పక్కదోవ పట్టించేలా, దేశ ఆర్థిక వ్యవస్థ బ్రహ్మాండంగా ఉన్నట్లు చూపుతోంది. దీనిలో భాగంగా క్షేత్రస్థాయి వాస్తవాలతో సంబంధం లేకుండా కాగితాలపై వృద్ధి అంకెలను భారీగా పెంచి వేసింది. ఒక్కసారి ఇంత వృద్ధి ఎలా సాధ్యమైందన్న ప్రశ్నలకు తావు లేకుండా చూపేందుకు గడిచిన ఆరుమాసాల కాలపు వృద్ధి అంకెలను కూడ పెంచుతూ సవరించింది. అనూహ్యంగా వెలువడిన ఈ గణాంకాల పట్ల దేశవ్యాప్తంగా ఆర్థిక రంగ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కృత్రిమ వృద్ధి లెక్కలు దేశానికి భవిష్యత్తులో తీవ్ర హాని చేస్తాయని వారు హెచ్చరిస్తున్నారు. అయితే బిజెపి నాయకులు, వారి మద్ధతుదారులు, కార్పొరేట్‌ మీడియా మాత్రం భారీ వృద్ధి పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఆర్‌బిఐ వేసిన అంచనాల ప్రకారం మూడవ త్రైమాసికంలో 6.5 శాతం మాత్రమే వృద్ధి నమోదయ్యే అవకాశం ఉంది. ఎకనామిక్‌ టైమ్స్‌ 15 మంది నిపుణులతో నిర్వహించిన పోల్‌ 6 నుండి 7.2 శాతం మధ్య వృద్ధి ఉండే అవకాశం ఉందని అంచనా వేసింది. 17 మంది ఆర్థికవేత్తల అభిప్రాయాలను ఆధారం చేసుకుని 6.64 శాతంకు వృద్ధి పరిమితమయ్యే అవకాశం ఉందని మింట్‌ పేర్కొంది. అన్ని సంస్థలు గత త్రైమాసానికన్నా తక్కువ వృద్ధినే అంచనా వేయగా, కేంద్ర ప్రభుత్వం మాత్రం భారీగా పెరిగిందని పేర్కొనడం గమనార్హం. ఆర్థిక వ్యవస్థలో గొప్ప సానుకూలాంశాలు లేవని, పెట్టుబడులు పెద్దగా పెరగలేదని వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగంలో వృద్ధి లేదని నిపుణుల చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం గొప్పగా చెప్పుకున్న తయారీ, నిర్మాణ రంగంలో కూడా భారీ వృద్ధి లేదని, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పనులకు పెరుగుతున్న డిమాండే దీనికి నిదర్శనమని వారు వివరిస్తున్నారు.

జిడిపి పెరిగినా మారని పేదల బతుకులు :

జిడిపి వృద్ధి బాగుంటే దేశం సుభిక్షంగా ఉన్నట్టే అని అనుకోలేం. ఎందుకంటే పెరిగిన సంపదను పంపిణీ చేయడంలో అసమానతలు చోటు చేసుకొంటున్నాయి. అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి వ్యవహరించే తీరు కారణంగా ఒకానొక మూడవ ప్రపంచ దేశంలో నిట్టనిలువుగా అంతరాలు ఏర్పడతాయి. దాని వలన ఆ దేశపు ఆర్థిక పురోగతిని కొలవడానికి జిడిపి ఏ మాత్రమూ ఉపయోగపడదు. వాస్తవానికి జిడిపి దేశంలో ఏర్పడిన అంతరాలను దాచిపెట్టడానికి తోడ్పడుతుంది. ఈ జిడిపి లెక్కలు అన్నీ ప్రాథమికంగా భారీ పరిశ్రమల నుండి లభించే గణాంకాల ఆధారంగానే రూపొందుతాయి. భారీ పరిశ్రమలలో అభివృద్ధి ఉంటే దాదాపుగా అదే స్థాయిలో చిన్న, మధ్య తరహా పరిశ్రమలలోనూ ఉంటుందన్న లెక్కతో జిడిపిని అంచనా వేస్తారు. కాని, వాస్తవానికి చిన్న, మధ్య తరహా పరిశ్రమలు వృద్ధి చెందడం లేదు సరికదా కునారిల్లుతున్నాయి. జిడిపి పెరిగి తలసరి ఆదాయం పెరిగిందని గొప్పగా చెప్పుకుంటున్నారు. కానీ ప్రజల జీవితాలు మారడం లేదు. ఆ విధంగా జిడిపి లెక్కలు వాస్తవానికి దూరంగా ఉంటున్నాయి.

భారతదేశ స్థూల జాతీయోత్పత్తి పెరుగుదలను చూపుతూ దాని చుట్టూ ఎంతో ఘనమైన ప్రచారాలు, వేడుకలు జరుగుతున్నాయి. ఈ ఎదుగుదల గణాంకాలను చూస్తున్న సందర్భములో రెండు ప్రధానమైన అంశాలను విస్మరించడం జరిగిందని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. మొదటి అంశం, ఈ వార్షిక పెరుగుదల గణాంకాలు కోవిడ్‌ కాలంలో బాగా పతనమైన ఆర్థిక వ్యవస్థ నుండి తిరిగి పుంజుకునే క్రమంలో వెలువడినవి. కోవిడ్‌ వ్యాప్తికి ముందున్న స్థాయికి చేరుకోవడంలో మనం ఇంకా సంతృప్తికరమైన పురోగతి సాధించలేదు. రెండోది, కొత్త స్థూల జాతీయోత్పత్తి క్రమాన్ని 2011-12 సంవత్సరం ఆధారంగా నిర్ధారించడం. ఈ సంవత్సరాన్ని ఆధారంగా ఎంచుకోవడంలోనూ, కొత్త గణాంకాల మూలాల ఎంపికలోనూ, లెక్కించే పద్ధతుల మార్పులలోనూ అనేక సమస్యలు ఉన్నాయి. వాటివలనే అభివృద్ధి స్థాయి, రేటు కూడా పెరిగాయి. భారతదేశం సాపేక్షంగా గణనీయమైన అభివృద్ది చెందడమన్నది బహుశా గణాంకాల వలన ఏర్పడ్డ మిథ్య అయి ఉంటుంది. మానవాభివృద్ధి సూచీలో మనది 112వ స్థానం.

2000 సంవత్సరం మధ్యనుండి పెరిగిన స్థూల జాతీయోత్పత్తి అభివృద్ధి గణాంకాలలోనూ, విశ్లేషణలలోనూ కనిపించిన చలన శీలతా ధోరణులు ఇటీవలి అభివృద్ధిలో ప్రతిబింబించడం లేదు. ఈ అభివృద్ధికి అసలు కారణం, ద్రవ్య సరళీకరణ కారణంగా ఆర్థిక వ్యవస్థలోకి జొప్పించబడిన ద్రవ్యత (లిక్విడిటీ) అనీ, ఈ అభివృద్ధి అంతా సట్టా బుడగలతో (స్పెక్యులేటివ్‌ బబుల్స్‌తో) నిండి ఉందని విమర్శకులు చెబుతున్నారు. అయితే ఈ తరహా అభివృద్ధి దుర్బలంగా ఉంటుంది. ఎందుకంటే, అభివృద్ధికి అనుగునంగా రుణ పంపిణీలు కూడా పెరుగుతాయి కానీ రుణ చెల్లింపులు జరగవు. పారుబకాయిలు పేరుకుపోతాయి. ముఖ్యంగా అప్పులు తీసుకున్న వారు తిరిగి చెల్లించగల శక్తిపై ఎటువంటి వత్తిడి పడినా, దుర్బలంగా ఉన్న వ్యవస్థ కుప్పకూలిపోతుంది. సామ్రాజ్యవాద ప్రపంచీకరణ ఆర్థిక విధానాలు అమలు చేసే దేశాల్లో జరిగే వృద్ధిని ఉపాధి రహితవృద్ధి అంటారు.

ఇటీవల రిజర్వు అండ్‌ ఆఫ్‌ ఇండియా నవంబర్‌ నెల మధ్య వెలువరించిన ప్రకటనలో, బ్యాంకులు తాము  వ్యాపారాలకు, క్రెడిట్‌ కార్డులకు, ఇతర బ్యాంకేతర ఆర్థిక కార్యకలాపాలు నడిపే సంస్థలకు, అరక్షిత అప్పులకు ఇచ్చిన రుణాలపై, ‘భద్రతా భారాన్ని’ మరో 25 శాతం పెంచాలని ఆదేశించింది. ‘భద్రత భారాన్ని’ పెంచడం అంటే బ్యాంకులు అప్పులు ఇవ్వగల మొత్తాల్లో అధిక శాతం పక్కన పెట్టాల్సి ఉంటుంది. అంటే వసూళ్లు కాని రుణాల కోసం నిధులు నిరుపయోగంగా ఉంచవలసి ఉంటుంది. అంటే అప్పులివ్వగల మొత్తాలు తగ్గుతాయి. అందువలన రుణాల ఖరీదు పెరుగుతుంది. వడ్డీరేట్లు పెరుగుతాయి. వడ్డీరేట్లు పెరిగినందువలన తీసుకున్న రుణాలు చెల్లించలేని పరిస్థితి తలెత్తే అవకాశాలు పెరుగుతాయి. అంతేకాక పాలనలో అమానవీయత, అవినీతి, నియంతృత్వం ప్రభలుతుంది.

స్థానిక బడా దళారీ బూర్జువా వర్గాల, ఉన్నత మధ్యతరగతి వర్గాల ప్రజానీకానికి, మరోపక్క పాత, కొత్త పరిశ్రమలలోని కార్మికులకు మధ్య అంతరాలు బాగా పెరుగుతున్నాయి. పరిశ్రమలో వచ్చే లాభాల్లో కార్మికుల వేతనాల వాటా కుంచించుకుపోతుంది. అంటే నిజవేతనాలు తగ్గిపోతున్నాయి. భౌగోళికంగా కూడా పట్టణాలకు, గ్రామాలకు నడుమ అంతరాలు కూడా పెరుగుతున్నాయి. ఈ విధంగా పెరుగుతున్న అంతరాలు అధికారికంగా భారత ప్రభుత్వం విడుదల చేసే గణాంకాలలో సైతం కనిపిస్తున్నాయి. కనీస పౌష్టికాహారం పొందలేకపోతున్న వారు పట్టణ ప్రాంతాలలో 1993-94లో 57 శాతం ఉంటే 2017-18 నాటికి 60 సాతం ఉన్నారు. అదే గ్రామీణ ప్రాంతాలలోనైతే ఇదే కాలంలో వారు 58 శాతం నుండి 80 శాతానికి పెరిగారు.

ప్రపంచీకరణ విధానాలను సిగ్గూఎగ్గూ లేకుండా దూకుడుగా అమలు చేస్తున్న ఎన్డీయే ప్రభుత్వ హయాంలో ఈ అంతరాలు మరింత వేగంగా పెరుగుతున్నాయి. దేశంలో రెండు తరగతుల ప్రజల మధ్య అంతరాలు ఇంత కొట్టవచ్చినట్టుగా తీవ్రంగా పెరుగుతున్న నేపథ్యంలో జిడిపి అనే ఒకే ఒక కొలబద్ధ, సర్వరోగ నివారిణి మందు లాగా, దేశ పురోగతికి ప్రాతిపదికగా పరిగణించడం అంటే వాస్తవాన్ని కప్పిపుచ్చడానికి ఉపయోగించే సాధనంగా జిడిపిని ఉపయోగించడమే అవుతుంది. ఈ జిడిపి లెక్కలు కప్పిపుచ్చుతున్నది కేవలం పెరుగుతున్న ఆర్థిక అసమానతలను మాత్రమే కాదు. అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి నిర్దేశిత విధానాల పెత్తనంలో సమాజంలో పెరుగుతున్న అంతరాల రూపంలో సామ్రాజ్యవాదం ఆధిపత్యాన్ని మనపై చెలాయిస్తున్న తీరును కూడా కప్పిపుచ్చుతోంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే సామ్రాజ్యవాదం దోపిడీని కప్పిపుచ్చే సాధనంగా జిడిపి లెక్కలున్నాయి.

గత జనవరిలో ఎనిమిది ప్రధాన మౌలిక రంగాల వృద్ధి 3.6 శాతానికి పరిమితమై.. 15 నెలల కనిష్ఠాన్ని తాకింది. రిఫైనరీ ఉత్పత్తులు, ఎరువులు, ఉక్కు, విద్యుత్తు తదితర రంగాల్లో పనితీరు పేలవంగా చోటు చేసుకుందని స్వయంగా కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన గణాంకాల్లో తేలింది. దేశ పారిశ్రామిక ఉత్పత్తి సూచీలో ఏకంగా 40.27 శాతం వాటా కలిగిన ఎనిమిది అత్యంత ప్రాధాన్యత కలిగిన రంగాలు పేలవ ప్రదర్శన కనబర్చుతుంటే.. మరోవైపు జిడిపి భారీగా పెరగడం బిజెపి సర్కార్‌ మాయాజాలాన్ని స్పష్టంచేస్తోందని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి డిసెంబర్‌లో ఎఫ్‌డిఐల్లో ఏకంగా 13 శాతం పతనమై 32.03 బిలియన్‌ డాలర్లకి పరిమితమయ్యాయి. కంప్యూటర్‌, హార్డ్‌వేర్‌, సాఫ్ట్‌వేర్‌, ట్రేడింగ్‌, సేవలు, టెలికం, ఆటో, ఔషధ, రసాయన రంగాల్లో ఎఫ్‌డిఐలు దిగజారినట్టు తేలింది. ఆదాయాలు తగ్గడం, దిగుమతుల్లో  పతనం, ఎగుమతులు అంతంత మాత్రమే. ఆర్థిక వ్యవస్థలో 90 శాతం వరకు పనిచేస్తున్న అసంఘటిత రంగ కార్మికుల పరిస్థితి దుర్భలంగా ఉంది. వ్యవసాయం కునారిల్లుతుంది.  ఉపాధి మృగ్యం. పారిశ్రామికాభివృద్ధి పుంజుకోవడం లేదు. ఎఫ్‌డిఐల్లో క్షీణత నేపథ్యంలో మరోవైపు జిడిపి అమాంతం పెరుగుదల తీవ్ర అనుమానాలకు దారి తీస్తోంది.

Leave a Reply