అభివృద్ధి ని అనేక రకాలుగా మాట్లాడుకోవచ్చు.మానవ సౌకర్యాల కల్పనలో అభివృద్ధి అనే ప్రక్రియ మనం వూహించలేనన్ని రూపాలను సంతరించుకుంది. ఆ అభివృద్ధి పాదాల వొత్తిడి కింది ప్రకృతి, వ్యక్తులూ నలిగిపోవడం కూడా అనేక రూపాలుగా వుంది. ఒక వైపునేమో కావాల్సినంత, రావాల్సినంత అభివృద్ధి అందనితనం వెక్కిరిస్తుంటే మరోవైపు అదే అభివృద్ధి కొందరికి యెక్కువగా అంది , దానివల్ల విపరీత పరిణామాలు కూడా చోటుచేసుకోవడం కన్పిస్తుంది. ఈ అసమ అభివృద్ధి మనుషుల జీవితాలను కల్లోలం చేయడంతో పాటు ప్రకృతిలో కూడా దుష్పరిణామాలకు దారితీయడాన్ని సునిశిత దృష్టి గల రచయితలు పట్టుకుంటారు. తమ సృజనతో చదువరులలో ఎరుక కల్గిస్తారు.అలాంటి కథ కె.వీ.కూర్మనాథ్ రాసిన ‘పొదగని గుడ్లు’.
ఈ కథను రచయిత నెగెటివ్ కోణంలో ప్రారంభించి పాజిటివ్ దృక్పథం తో ముగిస్తాడు. ఒక మధ్యతరగతి పట్టణ కుటుంబపు యింట్లో కథ నడుస్తుంది. సర్వసాధారణంగా మధ్యతరగతి తనదాకా రానంతవరకే అన్ని ఆదర్శాలనూ వల్లె వేస్తుంది. తీరా అవి తనను యిబ్బంది పెడతాయని తేలగానే నిర్మమకారంగా వ్యవహరిస్తుంది. అయితే యీ సూత్రం కుటుంబాలకే కాదు మొత్తం వ్యవస్థకే వున్న జాడ్యం. ఒకవేళ ఈ కథలో పేర్కొనబడే కుటుంబం సానుకూలంగా వ్యవహరించినా సమస్య యేమాత్రం తీరని విధంగా వ్యవస్థ దాన్ని చేసిందని యీ కథ ద్వారా అర్థం అవుతుంది.
పావురాలు ఎగురుతుంటే ఆనందించే వాళ్లమే మనమంతా. తెల్లటి పావురాలు శాంతి కపోతాలని మురిసిపోతుంటాం. అవే పావురాల జంట మనింట్లో కొచ్చి గూడు కట్టి గుడ్లుపెట్టి పిల్లల్ని పొదగడానికి ఏర్పాట్లు చేసాయనుకోండి , అప్పుడు తెలుస్తుంది అసలు కథ. పావురాలు చేసే చెత్త ఎత్తిపోసుకోలేకా , ఆ అరుపులు నిరంతరం వినలేక , మధ్య తరగతి మోజు కొన్ని దినాలలో తీరిపోతుంది. ఈ కథలోని చిన్న కుటుంబం తల్లిదండ్రీ, కొడుకూ యిలాగే విసుక్కొని , ఆ పావురాల జంట పెట్టిన గూడును పీకేస్తారు.మళ్లీ మళ్లీ గూడు కడుతున్నా నిర్దాక్షిణ్యంగా గుంజేస్తారు. అయినా యిల్లు వదలని పావురాలను యిక భరించడం ప్రారంభిస్తారు.
చుట్టూ కాంక్రీటు వనాలను అభివృద్ధి పేరుతో మానవుడు నిర్మించాక పావురాలైనా ఎక్కడికెళ్తాయని ఈ యీ కథలోని తండ్రి గ్రహిస్తాడు.’ఈ అపార్ట్మెంట్లు రాకముందు వీటి యిండ్లన్నీ యిక్కడే ఎక్కడో వుండేవేమోకదా ‘ అనిపిస్తుంది అతడికి.ఆ మాటే తన ఆరేళ్ల కొడుకుతోనూ చెబుతాడు , ‘ అవి వుండే చెట్లన్నీ పడగొట్టి యీ అపార్ట్ మెంట్లు కట్టేరు కదా, అందుకే వాటికి ఇల్లే లేకుండా పోయింది’ అని. ఈ స్థలం తమదేనని చెప్పడానికి పావురాలు యిన్నిసార్లు వెళ్లగొట్టినా వస్తున్నాయని గ్రహించాక ఆ కుటుంబం వాటిని చూసే తీరు మారిపోతుంది. ఇక అప్పట్నుంచి ఆ జంట గుడ్లను ఎలా పొదుగుతాయి , పిల్లలు ఎప్పుడెప్పుడు బయటికి వస్తాయని ఎదురు చూస్తుంది. ఎన్ని దినాలు పొదిగినా ఆ గుడ్లు పిల్లల్ని పెట్టవు అని అర్థమై జంట పావురాలు ఆ గూడునూ గుడ్లనూ వదిలేసి ,ఆ కుటుంబానికి బాధ మిగిల్చి ఎగిరిపోతాయి.
నగరీకరణ వల్లనో , అభివృద్ధి అనే ప్రక్రియ ద్వారా విడుదలైన విధ్వంసం వల్లనో ప్రకృతిలోని ప్రాణుల రుతుగతి తీవ్రంగా ప్రభావితమైపోయాక , ఒకరో యిద్దరో , నలుగురో మేల్కొంటే ఏం ప్రయోజనం లేదని కథ చెబుతుంది.పెద్ద పెద్ద విధ్వంసాలను వ్యవస్థ స్థాయిలో ఎదుర్కోవాల్సిన అవసరాన్ని , చాలా సున్నితంగా చెప్పిన కథది. ఒక యింట్లో జరిగే డ్రామాను , ముగ్గురు మనుషులూ , రెండు పావురాల చర్యలతో చెప్పినా , చెప్పిన కథ మాత్రం వ్యవస్థ ది కావడమే యీ కథ ప్రత్యేకత.