వేసవికాలం సెలవుదీసుకుంటూ వర్షాకాలం ప్రారంభమవుతున్న సమయం. అది జూన్‌ చివరి వారం. వేసవి ఎండలతో మోడుబారిపోయి ముఖం మాడ్చుకున్న ఆ అడవితల్లి అప్పుడప్పుడే కురుస్తున్న వర్షాలకు చిగురిస్తూ అడివంతా తన అందాన్ని సంతరించుకుంటున్నవేళ. ఆ చుట్టుపక్కల ఆదివాసీ పల్లెలన్నింటిని గలగలమనే శబ్దాలతో పలకరిస్తూ పారుతున్న బలిమెల నది. ఈ సహజసిద్ధమైన ప్రకృతి అందాల మధ్య ఆ ఊరి ప్రజలందరూ దుక్కులు దున్నుతూ విత్తనాలు వేస్తున్నారు. వర్షానికి తడిసి బురదగా మారిన మట్టిలో స్వేచ్ఛగా ఆడుకుంటున్నారు చిన్నపిల్లలు. ప్రకృతి ఇచ్చే ఊట నీటితో బిందెలు నింపుకొని నాలుగైదు వరసలు తలపై పెట్టుకొని కూనిరాగాలు తీస్తూ పొలం గట్లపై నడుస్తూ ఇళ్లకు చేరుకుంటున్నారు యువతులు. వీటన్నింటిని ఆస్వాదిస్తూ నాలుగు గజాల దూరంతో ఒకరి వెనకాల ఒకరు నడుస్తున్నాం. అలా ముందుకు వెళ్లిన ఫార్మేషన్‌ మధ్యలో మామిడి చెట్ల నీడలో సేద తీరి భోజనం ముగించుకొని మళ్లీ నడక మొదలుపెట్టాం.

సమయం ఆగదు, అది ప్రకృతి సహజం. చూస్తుండగానే ఏడేళ్లు గడిచిపోయాయి. అయినా జూన్‌ నెల చివరికి వచ్చేసరికి రెండు వేల పదిహేను జూన్‌ నాటి ఘటనలు కళ్లముందు కదలాడుతాయి. సరిగ్గా ఆరోజు కూడా ఇలాగే ఇదే దారిలో నడుస్తున్నాం.

                                                “`

సాయంత్రం ఆరు గంటలయ్యింది. కమ్మేసిన మబ్బుల్లోంచి  మెల్లమెల్లగా చందమామ బయటికొస్తున్నాడు. ఆ వెలుగులో ఆలీవ్‌ గ్రీన్‌ దుస్తులు ధరించి బందూకులు భూజాన వేసుకొని ధీరత్త్వంతో నడుస్తున్న ఆ ప్రజాసైన్యం ఐదారు గంటల నడకతో ఏ రాత్రికో మల్లెపూట్‌ గ్రామ సమీపానికి చేరుకుంది. ఆప్యాయంగా మనసు నిండా ప్రేమతో ఆ గ్రామస్తులందరూ లాల్‌సలామ్‌ చేస్తూ ఆహ్వానించారు. అరగంటలోనే అన్ని ఇళ్లలో అన్నం అడగడం, ఒక చోటుకి చేర్చడం అయిపోయాయి. ఈ లోపు కమిటీవాళ్లు పరిస్థితి అంతా బాగేనని చెప్పి పెట్రోలింగ్‌లు, సెంట్రీలు ప్రారంభించారు. రాత్రి భోజనాలు ముగించుకొని తమ సెంట్రీలు కూడా పెట్టుకొని వారి వాకిళ్లలోనే నిద్రలోకి ఉపక్రమించింది ఆ ప్రజాసైన్యం. 

నిన్నటి వరకు ఉన్న సంఖ్య కంపెనీ ఫార్మేషన్‌. కానీ లోకల్‌ దళంతోపాటు నాయకత్వ కామ్రేడ్‌ బద్రుతో సహా ఇరవై మంది కామ్రేడ్స్‌ ఐదువేల మంది పోలీసు బలగాలతో చేపట్టిన ‘ఆపరేషన్‌ ఆలౌట్‌’ను ప్రజల్లో బహిర్గతపరుస్తూ జులై ఏడు, ఎనిమిది తేదీల్లో బంద్‌ పాటించాలని ప్రచారం పనుల్లో భాగంగా ఊళ్లకు వెళ్లే కార్యక్రమాల కోసం విడిపోయారు. ఇక ఇప్పుడు మిగిలిన వారి సంఖ్య ప్లటూన్‌ ఫార్మేషన్‌. ఉదయం నాలుగు గంటలకే మేల్కొని గంటదూరం నడిచి ఆగాల్సిన విడిదికి చేరుకున్నాం. తమ బరువులను భూమికి అప్పగించి కాలకృత్యాలు ముగించుకున్నాం.

సమయం ఐదు గంటలు. రోల్‌కాల్‌ విజిల్‌ మోగడంతో చక చక ఎవరి సెక్షన్‌లలో వారు క్యూలో నిలబడిపోయారు. ఆ రోజుకు సంబంధించిన సమాచారం చెప్పాడు ప్లటూన్‌ కమాండర్‌ లాలు. ఆ తర్వాత మరోసారి ఎవరి కవర్‌లు వారు చూసుకొని, శతృ సమీపించే దిశలో సెంట్రీ పెట్టుకొని ఎక్సర్‌సైజ్‌లు ప్రారంభించారు అందరూ. ఈ సైన్యం సమాచారం రాత్రే తెలిసిన గ్రామ ప్రజలు తెల్లవారురaామునే వారి దగ్గర అడవి నుండి లభించే తిండి సామాగ్రిని మా వద్దకు చేరవేసారు. టీ తాగి, ఎక్సర్‌సైజులు ముగియగానే అందరు కలిసి కట్టెలు, నీళ్లు సమిష్టిగా కిచెన్‌ వద్దకు చేరవేసి టిఫిన్‌లు చేయడం కోసం కిచెన్‌ వద్దకు చేరుకున్నాం. వార్తల టైం సమీపించడంతో రేడియోలు లేని కామ్రేడ్స్‌ అందరూ రేడియో ఉన్న చోటులో గుమిగూడి వార్తలు వినడంతో రెండువేల పద్నాలుగులో అధికారాన్ని హస్తగతం చేసుకున్న పాలనాధిపతులు ‘మావోయిస్టులు ఎజెండానే నా ఎజెండా’ అన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, నూతన రాజధానే లక్ష్యమని గెలిచిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇక కేంద్రంలో బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిజాన్ని విస్తరింపజేయడమే కర్తవ్యంగా ఉపన్యాసాలతో ప్రజలను ఊదరగొడుతున్న నరేంద్రమోడీ … వీళ్ల గురించి మాట్లాడుతూ తెలియకుండానే చర్చలోకి దిగిపోయారు.

టైం చూసుకొని చర్చలోనుంచి తేరుకొని వారి వారి స్థావరాలకు చేరుకున్నాం. ఆయుధాలు శుభ్రపర్చడం పూర్తి చేసుకొని సమిష్టి అధ్యయనం స్థలంలో కూర్చున్నారు సభ్యులందరూ. మిగతా కామ్రేడ్స్‌ కూడా ఎవరి పనుల్లో వాళ్లు మునిగిపోయారు. బోల్షివీకరణ క్యాంపెయిన్‌లో గత సంవత్సర కాలంగా వచ్చిన మార్పులను అంచనా వేసుకొని ఇంకా రావాల్సిన మార్పుల గురించీ, అందుకోసం చేయాల్సిన కృషి కోసం అధ్యయనం చేస్తున్నాడు సీనియర్‌ నాయకత్వ కామ్రేడ్‌ దేవాల్‌.

రాత్రంతా వర్షం కురవడంతో, కట్టెలు మండకపోవడంతో వంట ఊరిలోనే చేయాలని నిర్ణయించి లోకల్‌ కామ్రేడ్‌ మున్నితో కలిసి కిచెన్‌ డ్యూటీ కామ్రేడ్స్‌ను ఊరుకి పంపించాడు కమాండర్‌. అంతలోనే పోలీసుల వార్త విన్న పక్కూరి ప్రజలు మున్నికి విషయం చెప్పడంతో ఈ సమాచారాన్ని డేరాకి చేరవేసింది. లాలు అందర్ని జమచేసి శతృ సమాచారాన్ని వివరించడంతో ఎవరి కవర్‌లలోకి వారు చేరుకున్నారు. డేరా ఖాళీ చేయడానికి ఊళ్లో ఉన్న కిచెన్‌ కామ్రేడ్స్‌ కోసం ఎదురుచూస్తున్నాడు లాలు. ఈ లోగా ఊరిదాద టీ క్యాన్‌తో డేరాకు చేరుకున్నాడు.

‘దాద పోలీసులు చుట్టుపక్కల గ్రామాలకు వరకు వచ్చారంట, టిఫిన్‌ ఇంకా కాలేదు. టీ తాగి మీరు తొందరగా ఇక్కడి నుండి వెళ్లండి, టిఫిన్‌ మేము తీసుకొస్తాం’ అంటూ టీ క్యాన్‌ ఏరియా కమిటీ సభ్యుడి చేతిలో పెట్టి వెళ్లిపోయాడు. ఎదురుచూసే కిచెన్‌ కామ్రేడ్స్‌ మాత్రం రాలేదు. సమయం గడిచేకొద్ది శతృవు సమీపిస్తుండటంతో ‘శతృ సమాచారం తెలిసి కూడా నిర్లక్ష్యం చేయడం సరైంది కాదు, ప్రమాదం కూడా. వీలైనంత తొందరగా డేరా ఖాళీ చేస్తే మంచిది లాలు’ అని శతృవును అంచనా వేసుకొని తాను ఆలోచించిన విషయాన్ని తెలియజేసాడు కామ్రేడ్‌ దేవాల్‌.

మరోసారి రోల్‌కాల్‌ స్థలంలో క్యూలో నిలబడ్డారు కామ్రేడ్స్‌ అందరూ. ‘మన సమాచారం తెలిసే వాడు కదలికలు కొనసాగిస్తున్నాడు. వాడి ఇన్‌ఫార్మర్‌ నెట్‌వర్క్‌ ద్వారా బహుశా తెలిసుంటుంది. కాబట్టి శతృవు ఎదురుపడితే కమాండర్‌ కాషన్‌ ఫాలో అవుతూ, కౌంటర్‌ ఫైర్‌ చేస్తూ ముందుకెళ్లాలి. ముఖ్యంగా దేవాల్‌ ప్రొటక్షన్‌టీం ఫైరింగ్‌ చేస్తూ తన నుండి విడిపోకుండా ఉండాలి. ఒకవేళ విడిపోతే కూడా ఆర్‌వీ గ్రామంలో కలవాలి. ఎట్టిపరిస్థితిలో గందరగోళానికి గురికాకుడదు’ అంటూ రోల్‌కాల్‌ ముగించాడు కమాండర్‌. ప్లటూన్‌ ఫార్మేషన్‌లో నడక ప్రారంభించింది ప్రజాసేన.

శతృవు వెంబడిస్తూనే ఉన్నాడు. ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైన నడక సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగి ఓ గూడానికి చేరుకున్నాం. తిండి తినక పన్నెండు గంటలవుతుంది. విషయం తెలసుకున్న గూడెం జనాలు రాగిజావ తేవడంతో తలా ఒక గ్లాసుతో కొంత ఉపశమనం పొందాం. ఆర్గనైజేషన్‌ గ్రామం కూడా కాకపోవడంతో వారిని నాయకత్వం మోటివేట్‌ చేయడంతో ఆలస్యంగానైనా భోజనాలు తెచ్చారు ఊరివాళ్లు. కొత్త ఊరు కావడం వల్ల వెంటనే ప్రజలను అంచనా వేయడం కష్టం. కాబట్టి అక్కడి నుండి వెళ్లాలని నిర్ణయించుకున్నాం. అన్నం పెట్టిన ఆ గ్రామస్తులకు లాల్‌సలామ్‌ చెబుతూ ఆ గ్రామం నుండి సెలవుదీసుకుంది ప్రజాసైన్యం.

నాలుగు రోజుల క్రితం పనులరీత్యా వెళ్లిన నాయకత్వ కామ్రేడ్‌ బద్రుతోపాటు మరో ఇరవై మంది కామ్రేడ్స్‌ లాలు ప్లటూన్‌ను కలవాల్సిన ఏపీటీ సమయం ఆసన్నమవ్వడంతో కలవాలనుకున్న ఊరి సమీప ప్రాంతానికి చేరుకున్నారు. లాలుతో ఉన్న కామ్రేడ్స్‌ సాయంత్రమయినా ఇంకా కలవకపోవడంతో వారికోసమే వేచి చూస్తున్నారు సీనియర్‌ నాయకత్వ కామ్రేడ్‌ దేవాల్‌, ప్లటూన్‌ కామ్రేడ్‌ లాలు. సరిగ్గా ఆరుంపావుకి వార్తల సమయం కావడంతో రోజులాగే రేడియో ఆన్‌ చేసి వింటున్నాడు. ‘విశాఖ జిల్లా, రంగబయలు పంచాయితీ గొబరిపడ గ్రామంలో ఈ రోజు ఉదయం ఏడు గంటలకు పోలీసులకూ, మావోయిస్టులకు జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మరణించారు. మిగతా వాళ్లు తప్పించుకున్నారు. కూంబింగ్‌ కొనసాగుతున్నది’ అనే సమాచారం వినడంతో ఒక్కసారిగా అందరూ విషాద వాతావరణంలో మునిగిపోయారు. ఈ లోగా ఎదురు చూస్తున్న కామ్రేడ్స్‌ రానే వచ్చారు బద్రుతో సహా.

‘ఇందాక వార్తల్లో చెప్పిన ఎన్‌కౌంటర్‌ ఎక్కడ జరిగింది? అందులో సోను అమరుడయ్యాడన్న వార్తల్లో చెప్పిన విషయం నిజమేనా?’ అని దేవాల్‌ బుద్రుని అడిగీ అడగకముందే చెప్పడానికి సిద్ధంగా ఉన్న బద్రు ఆ వార్త మాదేనంటూ చెబుతుండగానే వీరి అడుగుల గుర్తులను చూస్తూ వీరి వెనకాలే వచ్చిన పోలీసులు పూర్తిగా డేరాను చుట్టుముట్టారు.

సమయం ఏడు కావస్తోంది. వర్షం ఏకధాటిగా కురుస్తోంది. వర్షానికి తోడుగా చీకటి అలుముకుంది. లాలు, బద్రులతో ఉన్న కామ్రేడ్స్‌ అందరూ కలవడంతో సంఖ్య కంపెనీ కంటే ఎక్కువగా ఉన్నారు. నాయకత్వం ఉండటంతో డేరాలో చాలా విలువైన సామానులే ఉన్నాయి. శతృవు ఏ దిశలో సమీపిస్తున్నాడో అర్థం కాని పరిస్థితి. మొత్తానికి చుట్టుముట్టాడనేది స్పష్టంగా అర్థమవుతోంది. వరుణుడు మాత్రం కరుణించలేదు. ఆ చీకట్లో ఏమి కనబడకపోవడంతో చేతికి దొరికిన వస్తువులను మాత్రమే తీసుకొని ఫైరింగ్‌ చేస్తూ రిట్రీట్‌ అవుతున్నారు కామ్రేడ్స్‌. ఆ కొండల్లో ఎవరు ఎటువైపు వెళుతున్నారో అర్థం కావడం లేదు. ఎటు చూసినా చీకటే. యాభై మందికి పైగా ఉన్న సంఖ్య రెండు ప్లటూన్‌లుగా రిట్రీట్‌ అయ్యారు. ఏ ప్లటూన్‌ ఎటువైపు వెళ్లింది అనేది ఎవరికీ అర్థం కాలేదు.

సరిగ్గా ఎనిమిది అవుతుండగా తూర్పు దిశగా కొండను ఎక్కిన వాళ్లందరూ ఆగి ఎవరెవరు తమ వైపు వచ్చారో చూసుకోవడంతో బద్రు ప్లటూన్‌లో ఉన్నవాళ్లు లాలువాళ్ల వెనక రిట్రీట్‌ అయ్యారు అని అర్థం అయ్యింది. మొత్తంగా పద్దెనిమిది మంది ఉండటంతో రోల్‌కాల్‌తో క్లియర్‌ చేసుకొని మళ్లీ అదే చీకట్లో నడక ప్రారంభించారు. కష్టమైన కొండ అవ్వడంతో, వర్షంతో బురద పెరగడంతో ఒక్కరొక్కరిగా నడవలేకపోతున్నాం. చివరికి ఒకరి చేతులు ఒకరు పట్టుకొని నడిచాం. నాలుగు రోజులు నుండి కురుస్తున్న వర్షాలకు కొత్తగా వచ్చిన ఇద్దరు మహిళా కామ్రేడ్స్‌కి బూట్లు లేకపోవడంతో కాళ్లంతా వర్షానికి అందరికన్నా బాగా దెబ్బతిన్నాయి. ఏమి కనబడక ఎటు వెళ్లాలో తెలియక దెబ్బతిన్న కాళ్లతో ఆ రాత్రంతా పడరాని పాట్లే పడ్డారు ఆ గెరిల్లాలు.

నిరంతర వర్షంలోనే కూంబింగ్‌ కొనసాగుతూ ఉంది. రెండ్రోజుల తర్వాత ప్రజల సహకారంతో అందరూ ఆర్‌వీ స్థలంలో కలుసుకున్నాం. ఆ రోజు ఉదయం ఎన్‌కౌంటర్‌ నష్టం మినహా సాయంత్రం శతృవు చుట్టుముట్టిన సంఘటనలో విలువైన సామాగ్రి పోగొట్టుకున్నారనేది రెండు ప్లటూన్‌లు కలిసాక తెలిసిన విషయం. ఎన్‌కౌంటర్‌ ఎలా జరిగింది? కామ్రేడ్‌ సోను అమరుడు కావడానికి గల కారణాలు ఏమిటో తెలుసుకోవడం కోసం సమావేశమయ్యారు నాయకత్వ కామ్రేడ్స్‌ దేవాల్‌, బద్రు.

జరిగిన ఎన్‌కౌంటర్‌ రిపోర్టును బద్రు వివరిస్తూ ‘మేము మిమ్మల్ని కలుసుకోవడానికి ఒక రోజు ముందు గొబరిపడ గ్రామానికి చేరుకున్నాం. ఆరోజు జూన్‌ ఇరవై. విస్తరణలో భాగంగా ఆ గ్రామానికి ఈ మధ్యే వెళుతున్నాం. కొత్త గ్రామమే అయినా ప్రజలు బాగానే ఉన్నారు. అప్పటికి పరిస్థితి అంతా బాగానే ఉంది. మరుసటి రోజు భవిష్యత్‌ ప్రోగ్రాం కోసం ఏరియా కమిటీ సమావేశం జరుగుతోంది. వర్షం ఏకధాటిగా కురుస్తుండటంతో వంట కూడా మొదలు పెట్టలేదు. ఉదయం ఏడు గంటలకి కామ్రేడ్‌ సోను (సూర్యం) బహిర్భుమికి వెళ్లి వస్తున్న క్రమంలో సడెన్‌గా ఫైరింగ్‌ శబ్దం వినిపించింది. ఆ శబ్దానికి డేరాలో ఉన్నవాళ్లందరం అలర్ట్‌ అయ్యాం. ఈ లోపు శతృ బలగాలు డేరాకి సమీపిస్తుండటంతో ఫైరింగ్‌ పొజిషన్‌లోనే కవర్స్‌ సహాయంతో వెంటనే రిట్రీట్‌ అయ్యాం. బహుశా వాడు ఉదయాన్నే ఐదు గంటలకే మా డేరాని చుట్టుముట్టి ఉండొచ్చు. సరిగ్గా వాడు ఎవరికి కనబడకుండా కేమోప్లైజ్‌లో ఉండి సోను తలను టార్గెట్‌ చేసాడనిపిస్తోంది. ఎందుకంటే  పేపర్‌లో మనకు స్పష్టంగా తలకు గాయం కనిపిస్తోంది.    

ఇక ఐదు గంటల సమయానికి ఊరి దాద ఒకరు మన డేరాకి వచ్చాడని మనవాళ్లన్నారు. అతడు ఎందుకొచ్చాడనేది తెలుసుకోవాలి. ఊరి విషయానికొస్తే సీపీఎమ్‌ నాయకుడు ఒకడు, ఊరి పెద్దాల్‌ కొంత తేడాగా ఉంటారు. ప్రజలందరూ తమ కనుసన్నల్లోనే మెలిగేలా పెత్తనం చెలాయిస్తారని మనకు తెలిసిన విషయం. వీరి చేయి ఏమైనా ఈ దాడిలో ఉండొచ్చా? ఆ గ్రామం నుండి ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్నవాళ్లెవరెవరు? అనే విషయలు వివరంగా పరిస్థితి తెలసుకొని ఆ గ్రామానికీ, ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రాంతానికి వెళ్లిరావాలి’ అని జరిగిన సంఘటనను చెప్పాడు. మొత్తంగా రెండు ప్లటూన్‌లు ఆ వారం రోజుల కూంబింగ్‌ పరిణామాలను సమీక్షించుకొని వారి వారి పనుల రీత్యా కామ్రేడ్స్‌ అందరు విడిపోయారు.

పరిస్థితులు అనుకూలించడంతో లోకల్‌ కామ్రేడ్స్‌తోపాటు బద్రు గొబరిపడ గ్రామానికి చేరుకున్నాడు. జరిగిన ఎన్‌కౌంటర్‌ వెనక ఉన్నవారెవరెవరో తెలుసుకోవడం కోసం ఆ గ్రామ ప్రజలతోపాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలను కూడా సమావేశపరిచాడు. ప్రారంభంలో కొంత భయపడినప్పటికీ తర్వాత ధైర్యంగానే తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు ప్రజలందరూ.

‘గొబరిపడ గ్రామంలో సీపీఎమ్‌ లీడర్‌గా చలామణి అవుతున్న రమణ, అదే గ్రామంలో పెద్దాల్‌ (భూస్వామి) కాశి చాలా ఏండ్లనుండి మాపై పెత్తనం చెలాయిస్తున్నారు. మా భూములన్నింటినీ లాక్కునీ, ఆ భూముల్లో మమ్మల్నే కూలీలుగా పని చేయించుకుంటున్నాడు.  నవీన్‌ సర్కార్‌కు అనుకూలంగా ఉంటూ గ్రామానికి వచ్చే అనేక పథకాలను వాళ్లే తింటూ, లెక్కల్లో మాత్రం మా పేర్లు రాస్తాడు. కళ్లముందు జరిగే వాటిని చూస్తూ అదేంటని అడిగితే భయబ్రాంతులకు గురి చేస్తాడు. ఊర్లో ఎలా బ్రతుకుతారో చూస్తానంటాడు. గ్రామస్తులందరూ వాడి చెప్పుచేతుల్లో ఉండాలి. రమణ వీడికన్నా ఏం తక్కువ కాదు. ఇద్దరు కలిసే ఈ అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు’ అంటూ ప్రజలు తాము సంవత్సరాల నుండి భరిస్తున్న భాదలన్నింటిని పార్టీ ముందుంచారు.

వీరిద్దరు దోపిడీ ప్రభుత్వ మనుషులు కావడంతో దళం రాక మింగుడు పడలేదు. వారి ఆటలకు మావోయిస్టులు ఆటంకం అవుతారనేది వాళ్లకి అర్థమైంది. ఇదే అదునుగా శతృవు వారిని ఇన్‌ఫార్మర్‌లుగా మలుచుకున్నాడు. దళం తమ పరిసర ప్రాంతాల్లోకి రాగానే శతృవుకు సమాచారం ఇవ్వడం మొదలు పెట్టారు. ఈ క్రమంలో జూన్‌ పద్దెనిమిదిన దళం తమ గ్రామ పరిసర ప్రాంతంల్లోకి వెళ్లడం గమనించిన సీపీఎమ్‌ లీడర్‌ రమణ, పెద్దాల్‌ కాశీ వెంటనే పోలీసులకు సమాచారం చేరవేసారు. వీరి సమాచారంతో సాయంత్రానికి తమ ఊరికి చేరుకున్నారు. పోలీసులు ప్రజలెవరు ఊర్లో నుండి బయటకు వెళ్లడానికి వీల్లేదని ముందుగానే ఆదేశాలు జారీ చేసారు. ఇక వీరిద్దరికీ ఎదురు మాట్లాడేవారు లేరు కాబట్టి పోలీసుల సమాచారం ఎవరూ కూడా బయటకు వెళ్లకుండా జాగ్రత్త పడ్డారు ఈ ప్రజావ్యతిరేకులిద్దరు. వీరితోపాటు పోలీసులు కూడా ప్రజలను బెదిరించడంతో, భయపెట్టడంతో శతృ సమాచారాన్ని ఎవరూ కూడా దళానికి చేరవేయలేకపోయారు. పంతొమ్మిది రాత్రి ఊరిలోనే ఉన్న పోలీసులు ఉదయం ఐదు గంటలకు రమణను రెక్కి కోసం దళం ఉన్న చోటుకు పంపారు. దళం ఉన్న స్థలాన్నీ, చుట్టుపక్కల టెర్రయిన్‌ అంతా చూసుకొని వచ్చి విషయం పోలీసులకు చేరవేసాడు ప్రజాద్రోహి రమణ. వెంటనే ఆంధ్రా`ఒడిశా రెండు రాష్ట్రాల బలగాలు జాయింట్‌ ఆపరేషన్‌ ప్లాన్‌ చేసి కూంబింగ్‌లో పాల్గొన్నాయి. రమణ, కాశిల సమన్వయంతో డేరాను చుట్టుముట్టాయి. మావోయిస్టులపై ఫైరింగ్‌తో దూసుకుపోవడానికి పకడ్బందీగా కవర్స్‌ తీసుకొని ఎదురు చూస్తున్నారు పోలీసులు.

ఉదయం పూట మాములుగానే అలర్ట్‌గా ఉండే గెరిల్లాలు మరింత చురుగ్గా ఉన్నారు. సోను మాత్రం భహిర్భుమికి పోయి, తిరిగి డేరాను సమీపిస్తుండగా అప్పటికే టార్గెట్‌ పెట్టుకున్న శతృవు సోనుపై ఫైరింగ్‌ ఓపెన్‌ చేసాడు. క్షణాల్లోనే కామ్రేడ్‌ సోను ప్రాణాలు విడిచాడు. పీడిత ప్రజల విముక్తికోసం ఎంతో ఆశతో ప్రజల కోసం పోరాడాలనే తన ఆశయం సంవత్సర కాలంతోనే ముగిసింది. తన సేవలను పార్టీ తక్కువ సమయంలోనే కోల్పోయింది. ఈ క్రమంలో ఆదివాసీ ప్రజలతో మమేకమై, యువకులతో పరిచయాలు పెంచుకొని పార్టీ రాజకీయాలనూ, దోపిడీ సమాజం లోగుట్టును వివరించాడు. ఏడాది గడవక ముందే ఆ ప్రజల గుండెల్లో, ఆదివాసీ యువతలో చెరగని ముద్ర వేసాడు. 

పై విషయాలన్నింటిని ప్రజల నుండి సేకరించిన గెరిల్లాలు తమ సహచర కామ్రేడ్‌ సోనును కోల్పోయి శతృవుపై కసితో వాడి నెట్‌వర్క్‌ను అంతమెందించాలని నిర్ణయించుకున్నారు. గొబరిపడతోపాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలను కూడా సమావేశపరిచారు. ఎన్నో సంవత్సరాల నుండి వాళ్ల పెత్తనాన్ని భరిస్తున్న ఆ అమాయక ప్రజలు అందరూ ధైర్యంగా, ఐక్యంగా తమ అభిప్రాయాన్ని చెబుతున్నారు. ప్రజా శతృవులకు ప్రజలతో ఉండే హక్కు లేదంటూ, ఇలాంటి కలుపు మొక్కలను మొదట్లోనే నలిపేయాలనీ, చంపడమే సరైందని ప్రజలు తీర్పునిచ్చారు. ఈలోగా విషయాలన్నింటిని పసిగట్టిన పెద్దాల్‌ (భూస్వామి) కాశి తప్పించుకొని పక్కనే ఉన్న పోలీసుల క్యాంపు చెంతకు చేరుకున్నాడు. వెంటనే పార్టీ నిర్ణయంతో మిలీషియా, కమిటీ కామ్రేడ్స్‌ సీపీఎమ్‌ లీడర్‌ రమణను అదుపులోకి తీసుకొని వీరిద్దరికి మద్దతుగా ఉన్న మరొకడిని బంధించి ఈ ముగ్గురి ఆస్తూలనూ, భూములనూ, ధాన్యాన్ని ప్రజలందరికి పంచారు.

ఎన్నాళ్ల నుండో వారి ఆగడాలను భరిస్తున్న ప్రజలు ఒక్కసారిగా వాళ్ల ఇళ్లను ధ్వంసం చేసారు. ప్రజాద్రోహి రమణను ఖతం చేసారు. మద్దతుగా ఉన్న మూడో వ్యక్తికి దేహశుద్ధి చేసి వదిలేసారు. ఈ సమాచారాన్నంతా తెసులుసున్న పోలీసులు ‘ఆదివాసీలకు అండగా ఉంటామని చెబుతున్న మావోయిస్టులు వారిని చంపి ఆ కుటుంబాలకు అన్యాయం చేస్తున్నారనీ, ఇప్పటికైనా ఆదివాసీలు మావోయిస్టుల కుటిలత్వాన్ని తిప్పికొట్టాలని’ ప్రజల్లో అసత్య ప్రచారం మొదలు పెట్టారు. కానీ ప్రజలు మాత్రం ఎన్నో ఏండ్ల తరవాత రమణ, కాశిలతో తమకు విముక్తి లభించిందనీ, మా దగ్గర కాజేసిన మా భూములన్నింటిని తిరిగి పార్టీ ఇప్పించిందనీ చెబుతూ తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. కాశి భయపడి ఊరు వదిలి శతృ చెంతన చేరడం, రమణను చంపడం… వంటి సంఘటనలతో గొబరిపడతోపాటు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. పెద్దాల్‌ తిరిగి గ్రామానికి వస్తే రమణకు పట్టిన గతే పడుతుందని ధైర్యంగా, సాహసంగా ఎన్నో సంవత్సరాల నుండి మాట్లాడలేని ప్రజలు స్వేచ్ఛగా వారి వారి మనసులోని మాటను వ్యక్తపరిచారు.

పోలీసులు అనేక చోట్ల పోస్టర్లతో అసత్య ప్రచారం చేయడంతో స్వయంగా ప్రజలే ‘మావోయిస్టులపై చేసే ప్రచారం బూటకమనీ, ఏనాడు ఏ సర్కారు మాకు ఎలాంటి సహాయం చేయలేదనీ, అలాంటిదేదైనా ఉంటే ప్రజాద్రోహులు రమణ, పెద్దాల్‌ కాశిలకే చేసిందనీ, సర్కారు   చేయలేని పనిని మాకు పార్టీ చేసి, మా బ్రతుకులను తిరగరాసిందని’ వాడి విషప్రచారాన్ని బట్టబయలు చేసారు ఆ ప్రజానీకం. ఈ ఘటన అనంతరం విస్తరణలో భాగంగా వెళ్ళినపుడు ప్రజలు ఆప్యాయంగా ఆహ్వానించారు. గొబరిపడ గ్రామంతో సహా చుట్టుపక్కల ఏడెనిమిది గ్రామాలలో తమ కోసమే పని చేసే పార్టీకి అనుకూలంగా ఉండటమే కాకుండా, సంఘాలు, మిలీషియా నిర్మాణాలు ఏర్పడ్డాయి. ఇదే సమయంలో ప్రజల బలం పెరుగుతుండటంతో ప్రజావ్యతిరేకలు కూడా కొత్తగా పుట్టుకొస్తున్నారు. దీంతో పార్టీకీ, ప్రజలకు వ్యతిరేకంగా ఉండే ఇన్‌ఫార్మర్‌లను స్వయంగా తామే ప్రజాకోర్టు నిర్వహించి ద్రోహులను శిక్షిస్తున్నారు. తామంతా ఐక్యంగా ఉంటే ఎంతటి బలమైన శతృవునైనా శిక్షిస్తాం అంటూ ధీరత్వాన్ని చాటుతున్నారు. ప్రజల్లో వస్తున్న మార్పును చూసి మరింత సంతోషంతో ప్రజాపనికి పదును పెడుతూ కొత్త కొత్త ఎత్తుగడలతో ముందుకే కదులుతోంది మా ప్రజాసైన్యం.

Leave a Reply