(ప్రముఖ సాహిత్య, జీవిత చరిత్రల పరిశోధకుడు డా. కె ముత్యం *శ్రీకాకుళ విప్లవోద్యమం – తెలుగు సాహిత్యంపై ప్రభావం* అనే అంశంపై 1984 – 90 మధ్య పరిశోధన చేశారు. ఆ సందర్భంగా ఆయన శ్రీకాకుళ విప్లవోద్యమంతో, ఆ  సాహిత్యంతో  పరిచయం ఉన్న అనేక మందిని కలిశారు. వారి అభిప్రాయాలు సేకరించారు. వాటిని ఇటీవల ముత్యం  వెలుగులోకి తెచ్చారు. ఎక్కడా అచ్చుకాని అభిప్రాయాలు ఇవి. ఇందులో ప్రముఖ బుర్ర కథ కళాకారుడు షేక్ నాజర్ 9-3- 1987  కె ముత్యంతో పంచుకున్న అనుభవాలు పాఠకుల కోసం .. వసంతమేఘం టీం )

1. శ్రీకాకుళం ప్రాంతమంతా మీరు కలెదిరిగారు కదా! ఆ ప్రాంత ప్రజల ప్రత్యేకత ఏమిటి? మీరు  ఏమి గ్రహించారు..

            శ్రీకాకుళ జనం తెలుసుకోవాలనే  తపన కలవాళ్ళు.  వాళ్లు ఆకర్షితులు అయ్యేటట్టు చెప్తే, వాళ్లు ఒప్పుకుంటే మాత్రం ఏమైనా చేయగలరు.

2. బుర్రకథకునిగా అక్కడి  మీ అనుభవాలు చెప్పండి.

            ..ముందు ‘కష్టజీవి’ బుర్రకథ చెప్పేవాడిని. అయితే మధ్యతరగతి నాయకత్వంను సమర్థిస్తున్నట్లు, కోరుతున్నట్లుగా ఆ కథ ఉంది కాబట్టి1949లోనే ` ఆ కథచెప్పడం ఆపాను. ఎవరైనా కోరితేమాత్రం చెప్పేవాన్ని.

.. తర్వాత ‘పల్నాటి యుద్ధం’ బుర్ర కథ రాసి చెప్పేను.  బ్రహ్మనాయుడు చాపకూడు కుడవటం,  తర్వాత పరిస్థితులు, దాని మీద అధికార వర్గానికి మిగతా జనానికి సంగతులు చెప్పేవాణ్ణి.  కథ అంతరంగాన్ని నడుస్తున్న సంఘటనల ఆధారంగా చెప్పడం జరిగేది.

3. ‘బొబ్బిలి యుద్ధం’ ఆ ప్రాంతంలో జరిగిన కథ కదా! అక్కడి జనాన్నిఎలా, ఏం చెప్పి  మెప్పించగలిగారు…

            విజయనగరంలో టిక్కెట్లు అమ్ముకునే నిర్వాహకులు నన్ను పిలిచారు. ప్రార్థన మొదలుపెట్టేసరికి అందరూ లేచి నిల్చున్నారు. వాళ్లకు దండం పెట్టి, ఈ కథ  కొత్త. ఈసారి మీ యాసలో మీ కథ చెబుతాను. ఈసారి మాత్రం నా హావ భావాలతో సరిపెట్టుకోండి. జనం ఒప్పుకున్నారు. నేను కథను నా హావభావాలతో ముగించాను.

ఆ తర్వాత  బొబ్బిలి కథను చెప్పటానికి అంతకుముందున్న పెద బొబ్బిలిరాజు కథ, శ్రీపాద, వేదం వెంకటరాయశాస్త్రి నాటకాలు చూశాను. వాటిలో ఏది కూడా వాస్తవానికి దగ్గరగా లేదు.  వాటిల్లో ఉన్నది  ఉన్నట్లు చూపిస్తే జనం  చూడరు.

            రెండు నెలలపాటు కథ రాయాలి అని, ఈ జిల్లాలోనే ఉండి పరిశీలించాను. రెండు జమిందారి ల మధ్య కోడిపందాల యుద్ధం జరిగినట్లయితే జనంఎందుకు పాల్గొంటారు? దీనికి మించిన బలీయమైన  కారణం ఉండొచ్చని పరిశీలించాను. అప్పటికి దానిపై పరిశీలన జరుగలేదు.

            చివరికి పాచిపెంట వద్ద వేగావతి, సువర్ణముఖీ నదులు కలుస్తాయి. అక్కడ ఒక  పెంకుటిల్లు ఉంది. దానిలో విజయనగరం సైన్యం ఉంది. ఆ నదుల సంగమ స్థానంపై  కట్టినకట్టను బొబ్బిలి రాజులు తెంపకుండా కాపలా కాస్తారు. నీటిపారుదల విషయం ప్రధానం. ఈ కారణాన్ని వివరిస్తూ, ‘‘బొబ్బిలి యుద్ధం’’  బుర్రకథ రాసాను.

            ఆ తర్వాత విజయనగరంలో పండగ జరుగుతున్నప్పుడువెళ్లి, కథ మొదలు పెట్టాను.  తుని యువరాజులు వచ్చారు.   ‘‘ఎవరినీ గాయపరచకుండా బాగా చెప్పారు’’ అన్నారు. తాండ్రపాపారాయునికి  సంబంధించిన  చివరి ఘట్టం ’టాక్టు’గా చెప్పారన్నారు. కాబట్టి అక్కడి జనం స్వీకరించేటట్లు వాళ్ల  భాషలో,  వాళ్ల కథను  సహేతుకమైన కారణ కేంద్రంగా రాసి చెప్పాను. ఆ తర్వాత  పార్టీ వాళ్ళు పిలిచినా ప్రధానంగా ఇదే కథను చెప్పేవాణ్ని.

4. మీ బుర్రకథలకు జనం ఎలా  స్పందించేవారు….? చెప్పండి?

            నేను చెప్పే బుర్రకథ  జనంకు బాగానచ్చితే వాళ్ల శక్తికి మించి ఇస్తారు ప్రజలు.  కొన్నిసార్లు నాకు1200,1300 రూపాయలు వచ్చేవి. ఎక్కువ వచ్చినప్పుడు పార్టీ కామ్రేడ్స్‌ ను పిలిచి ఇచ్చేవాన్ని.  వెంపటాపు సత్యంలాంటి  నాయకులను కలిశాను. ఇచ్చేవాన్ని.

వాళ్లు చాలా ఆనందపడేవాళ్ళు.

5. సుబ్బారావు జముకుల కథ చూసారు కదా! దానిపై మీ అభిప్రాయం….

            సుబ్బారావు ‘జముకుల కథను’ చూశాను. బాగా రాశాడు. ఆయన బృందంలో ఒక బాలుడు అత్యద్భుతంగా చేస్తాడు. ఆ  ఆ కుర్రవాణ్ణి నాకు ఇవ్వమన్నాను. ఆ కుర్రాడితో చాలాఅనుబంధం(అటాచ్మెంట్‌). ఎలా ఇవ్వమంటావు?! అన్నారు. జముకుల కథ మాత్రం  ఇప్పటి పరిస్థితులలో ‘కష్టజీవి’ని తిరిగిరాయడం కాదు. ఆ ఆరోపణ పూర్తిగా అవాస్తవం. ఇందులో ఉన్నది గిరిజన సమస్యలు, వారి జీవితం. దానిలోంచి  కొంత ’అల్లూరి సీతారామరాజు బుర్రకథ’లో నేను గిరిజనుల జీవితం చెప్పడానికి తీసుకున్నాను.

6. కమ్యూనిస్టుపార్టీ కోసం ప్రచారంలో భాగంగా మీరు ఎక్కువగా బొబ్బిలి ప్రాంతంలో కథలు చెప్పినట్లు ఉన్నారు..

            నిజమే! విప్లవకారులు  మార్క్సిస్టుపార్టీ నుంచి వేరయిన తర్వాత, నన్ను నాగిరెడ్డి, పుల్లారెడ్డిలు ఉద్యమానికి ఉపయోగకరంగా ఉంటానని (ఆర్థికంగా, ప్రచారం రీత్యా) నన్ను బొబ్బిలి తీసుకెళ్లారు. ఒక హోటల్లో ఉంటూ చుట్టుపక్కల గ్రామాల్లో కథలు చెప్పేవాణ్ని.  తరువాత ఒక కాంగ్రెస్‌ నాయకుడు పోలీస్‌ అధికారులకు ఫిర్యాదు ఇచ్చి నన్ను అక్కడినుంచి ఖాళీ చేయించాడు..

…శ్రీకాకుళంలో అన్ని సెంటర్లు తిరిగాను. బుర్రకథలు చెప్పాను. నిజమే!!

7. మీ బుర్రకథ ప్రదర్శనకు, పాణిగ్రాహి ప్రదర్శనకు తేడా  ఏమిటి?

            నేను కథలోని ఘట్టాలను వివరిస్తూ, కథలో భాగంగా జనాన్ని  స్పందింపచేసేవాణ్ని.   కానీ, సుబ్బారావు సమస్య గురించి  ఉపన్యసిస్తూంటే, జనం లేచి’’ తేల్చుకుందాం పదండి’’ అన్నంత బ్రహ్మాండంగా మాట్లాడేవాడు. ప్రదర్శించేవాడు. అదీ…!

8. మీ బుర్రకథ  ప్రదర్శన జీవితంలో  ఎన్నో  విలువైన అనుభవాలు ఉంటాయి కదా! మీరు ఇష్టపడే ఒక సంఘటనను వివరించండి?

            .. మీరన్నది నిజమే! ఒకసారి ఖమ్మం జిల్లా మదిరలో, కాంగ్రెస్‌ ఆఫీస్‌ వేదికమీద బుర్రకథ చెప్తున్నప్పుడు, ఓ వ్యక్తి లేచి’ కథ  ఆపండి’ అన్నాడు.  జనంలో నుంచి ఇంకో  ఆయన లేచి, వేదికపైకివచ్చి, ‘‘ఈ  భవనానికి మేము చందాలిచ్చాం. పిచ్చిగా మాట్లాడి, కథను ఆపాలనుకుంటే మాత్రం నరుకుతాం’’  అన్నాడు. కథసాగింది  అలా!

Leave a Reply