తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాల్సి ఉందని  కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే అనింది. అంటే పదేళ్లపాటు ప్రజాస్వామ్యంపట్ల ఖాతరు లేని బీఆర్‌ఎస్‌ ఎన్నికల్లో ఒకటికి రెండుసార్లు గెలిచి అధికారంలోకి వచ్చి ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేసిందని అర్థం. ప్రజాస్వామ్యం ధ్వంసమైపోయి కేవలం ఎన్నికల ప్రక్రియ మాత్రమే మిగిలింది.  దాని ద్వారా ఇంకో పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ వచ్చిన పార్టీ భారతదేశాన్ని, ఉమ్మడి తెలుగు రాష్ట్రాన్ని మరే పార్టీకంటే ఎక్కువ కాలం పాలించింది. బిజెపిని మినహాయిస్తే మరే పార్టీకంటే ఎక్కువ దుర్మార్గాలకు, ప్రజా వ్యతిరేకత చర్యలకు పాల్పడిన గతం కాంగ్రెస్‌కు ఉన్నది. అలాంటి పార్టీ అధికారంలోకి రాగానే రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాల్సి ఉందని అన్నది.  ఇలాంటి ఆశ్చర్యాలకు బోలెడు అవకాశం ఉన్న ప్రజాస్వామ్యం మనది.

రేవంత్‌రెడ్డి ఈ మాట  బీఆర్‌ఎస్‌ మీది కోపంతోనే అని ఉండవచ్చు. వాళ్లలో వాళ్లకు ఒకరి మీద ఒకరికి ఎంత వ్యతిరేకతైనా ఉండవచ్చు. అది అటుంచితే  ప్రజాస్వామ్య పునరుద్ధరణ అంటే ఏమిటో తెలిసే ముఖ్యమంత్రి ఆ మాట అన్నాడా? అనే సందేహం కలుగుతోంది. ఆయన ప్రమాణ స్వీకారం సమయంలో తప్ప మళ్లీ ప్రజాస్వామ్యం ఊసే ఎత్తలేదు. పైగా ఈ మూడు నెలల్లో స్పష్టంగా అందరికీ కనిపించేలా కొన్ని అప్రజాస్వామిక చర్యలు జరిగాయి. ప్రజాస్వామ్యబద్ధంగా పాలిస్తానని చెప్పాక ఇట్లాంటి ఘటనలు జరగవచ్చునా? ఇవి ఏ సంకేతాలను ఇస్తాయి? అని ముఖ్యమంత్రికి అనిపించినట్లు లేదు. ప్రజాస్వామ్యంపట్ల సూత్రబద్ధమైన వైఖరి ఉంటే, అదొక ఒక విలువల ఆచరణ అనుకొని ఉంటే పరిస్థితి ఇంకోలా ఉండేది. సీఎంకు అంత పట్టింపు ఉన్నదా? ఉంటే కనీసం రెండు మూడు ఘటనలు తెలంగాణలో జరిగి ఉండేవి కావు.  ఒకటి: ఫిబ్రవరి 8వ తేదీ హైదరాబాదులో వీక్షణం ఎడిటర్‌ ఎన్‌ వేణుగోపాల్‌, విప్లవ రచయిత ఎన్‌. రవి ఇండ్ల మీద ఒక అబద్ధపు కేసును ఆధారం చేసుకొని  ఎన్‌ఐఏ అధికారులు దాడి చేశారు. రెండు: చత్తీస్‌ఘడ్‌ పోలీసులు యథేచ్ఛగా తెలంగాణలోకి వచ్చి పౌరహక్కుల సంఘానికి చెందిన పోగుల రాజేశంను ఒక అక్రమ కేసులో ఎత్తుకుపోయారు. మూడు: సిపిఐ  ఎంఎల్‌ న్యూడెమోక్రసీ నాయకత్వాన్ని అరెస్టు చేసి, సుమారు 24 మంది మీద పూసపల్లి కుట్ర కేసులో ఇరికించారు.

ఈ   ఘటనలు తెలంగాణలో ఎంతో కొంత చర్చనీయాంశమయ్యాయి. ప్రభుత్వం మీద విమర్శలు వచ్చాయి. అయినా ముఖ్యమంత్రి స్పందించలేదు.  ఇలాంటివి జరగవనే భరోసా ఇచ్చినప్పుడే పాలకులకు ప్రజాస్వామ్య స్పృహ ఉన్నదనే కనీస నమ్మకం కలుగుతుంది. ప్రజలకు ఇలాంటి విశ్వాసాన్ని కలిగించాలని పాలకులు అనుకోవాలి. కనీసం మూడు నెలలపాటైనా  అరెస్టులు, అక్రమ కేసులు, దాడులు నిరోధించలేని బలవత్తర అప్రజాస్వామిక స్థితి ప్రభుత్వంలో ఉన్నదని ఇలాంటి ఘటనలు రుజువు చేస్తాయి. గత ప్రభుత్వం చేసిన తప్పులను సవరించడం చాలా పెద్ద పని. తన ప్రభుత్వంలో అలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్త తీసుకోవాలని రేవంత్‌రెడ్డి అనుకోలేదు.   ఒక వేళ జరిగాక అయినా ప్రజలకు వివరణ ఇవ్వాలని అనుకోలేదు. 

 ప్రజాస్వామ్యమనే విస్తారమైన, లోతైన భావనను ఆచరణలోకి తేవడానికి సమాజంలో అనేక ప్రక్రియలు జరగాలి. వాటన్నిటికంటే ముందు ప్రభుత్వం అప్రజాస్వామిక, అణచివేత విధానాలకు పాల్పడకుండా ఉండాలి. ప్రజాస్వామ్యానికి ఇది కనీస షరతు. పౌర ప్రజాస్వామిక హక్కులకు అవకాశం ఇవ్వకుండా ప్రజాస్వామ్యాన్ని  పునరుద్ధరిస్తామనే గంభీరమైన మాటలకు అర్థం ఉండదు.

గతంలో అధికారంలో ఉండిన పార్టీలు,  కొత్తగా వచ్చిన పార్టీలు,  వద్దామని అనుకుంటున్న పార్టీలు నిత్యం రాజకీయాలే నెరపుతూ ఉంటాయి. కానీ రాజకీయ స్వేచ్ఛ అంటే ఏమో ఆ పార్టీల నాయకులకు తెలియదు. రాజకీయ స్వేచ్ఛను ఎన్నికల రాజకీయాలకు పరిమితం చేసి చూస్తారు. ఏకంగా రాజ్యాంగాన్నే  ఎన్నికల రాజకీయాలకు ముడిపెట్టి చూసే వాళ్లకు రాజకీయ స్వేచ్ఛ గురించి ఇంత కంటే ఎక్కువ తెలిసే అవకాశం లేదు. ఎన్నికల ద్వారా అధికారం పొందడమే ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగబద్ధతకు గీటురాయి. ఎక్కువ ఓట్లు ‘సంపాదించుకొని’ అధికారంలోకి వచ్చాం కాబట్టి తమది ప్రజాస్వామ్య ప్రభుత్వమని అన్ని పార్టీలు అనుకుంటాయి.  గత బీఆర్‌ఎస్‌ అదే అనుకుంది. అంతక ముందు పాలించిన కాంగ్రెస్‌ అదే అనుకొని ఉంటుంది. ఆ కాంగ్రెస్‌ పరంపరకు చెందిన  రేవంత్‌రెడ్డి కూడా అట్లాగే అనుకుంటున్నాడా? దీనికి భిన్నంగా  రాజకీయ స్వేచ్ఛ బతికి ఉంటేనే ప్రజాస్వామ్యం ఉన్నట్లని,  ప్రజాస్వామ్య పునరుద్ధరణ అంటే భిన్నమైన రాజకీయాలను విశ్వసించడం అని అనుకోగలడా?   పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని అంగీకరించని రాజకీయాలు కూడా ఉంటాయని, అలాంటి  పార్టీలను, సంస్థలు పని చేయడానికి అవకాశం ఉండటమే నిజమైన   రాజకీయ స్వేచ్ఛ అని అనుకోగలడా? ప్రజాస్వామ్యమంటే భిన్నమైన మార్గాల్లో ప్రజల   కోసం  పని చేసే అవకాశం ఉండటమని అంగీకరించగలడా?

ఈ స్పష్టత కాంగ్రెస్‌ ప్రభుత్వానికి, ముఖ్యంగా రేవంత్‌రెడ్డికి ఎంత ఉంటే అంత ప్రజాస్వామ్య పునరుద్ధరణకు అవకాశం ఉంటుంది. ఆ మేకు రాజకీయ స్వేచ్ఛకు  హానీ జరగకుండా ఈపాటికి చర్యలు తీసుకొనేవాడు.  పోలీసులకు అలవాటైన అణచివేత పద్ధతులను, అప్రజాస్వామిక చర్యలను ప్రభుత్వం నిరోధించేది. అధికారంలోకి వచ్చి మూడు నెలలు తిరగకముందే తెలంగాణ ప్రజల్లో ఎప్పటి నుంచో పని చేస్తున్న ఒక రాజకీయ పార్టీ కార్యదర్శిని  నిర్దిష్టంగా  ఏ నేరం జరగకపోయినా పోలీసులు అరెస్టు చేసి ఉండవారు కాదు. ఆసాకుతో ఆ పార్టీ ప్రముఖులనందరినీ ఆ కేసులో నమోదు చేసేవారు కాదు. కుట్ర కేసులు రాయవలసిన దుస్థితిలో ప్రభుత్వం ఉన్నాక ఇక సమాజంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఎట్టా సాధ్యం? కోట్లాది మంది ప్రజలు వింటూ ఉండగా రేవంత్‌రెడ్డి ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తానని అన్నమాట చుట్టూ ఇన్ని ప్రశ్నలు ఉన్నాయి. దీనికి సరైన సమాధానం  ఆయన చెప్పాలి. లేకపోతే  ముఖ్యమంత్రిని అవుతున్నాననే విజయోత్సాహంలో ఆరోజు ఆ మాట దొర్లిందేగాని, దాని మీద ఆయనకేమీ గురి లేదని ప్రజలు అనుమానించాల్సి వస్తుంది. రాజకీయ స్వేచ్ఛపట్ల ప్రభుత్వానికి సరైన వైఖరే ఉంటే అధికార రాజకీయాలకు భిన్నమైన రాజకీయ తాత్విక పునాది మీద పని చేసే న్యూడెమోక్రసీ పార్టీ మీద ఈ కుట్ర కేసు పెట్టేవాళ్లు కాదు. ప్రభుత్వానికి ఉన్న ఈ వైఖరిలో  మార్పు రావాలంటే రాజకీయ ఉద్యమం నిర్మించాల్సిందే.   రాజకీయ స్వేచ్ఛ గురించి రాజ్యాంగంలో ఉన్నంత మాత్రాన ప్రజలకు అది దొరకదు. రాజకీయ స్వేచ్ఛ కోసం రాజకీయ పోరాటం చేయాలి. విప్లవ రాజకీయాల మీద నిషేధం, విప్లవ సంస్థల మీద ఆంక్షలు, కుట్ర కేసులు, నిరంకుశ విచారణలు రద్దయ్యే ప్రజాస్వామిక పోరాటం చేస్తేనే ప్రజాస్వామ్య పునరుద్ధరణకు పునాది పడుతుంది.  అక్రమ కేసుల రద్దు, అప్రజాస్వామిక ప్రజాభద్రతా చట్టం  తొలగింపు వంటి వాటి కోసం పోరాడే క్రమంలోనే ప్రజాస్వామ్య పునరద్ధురణ అంటే ఇదీ అని ప్రభుత్వానికి చెప్పగలం.

One thought on “ప్రజాస్వామ్య పునరుద్ధరణ అంటే ఇదేనా?

 1. Pani garu
  Check revanthreddy background —no experience —not a leader
  He is a spokesperson for tdp—sonia politics he became party president and c.m
  13 reddys chief ministers for Telugu states
  Dorala palanalo Marpu ??big joke sir
  ———————————
  Buchireddy gangula

Leave a Reply