(ప్రజా జీవితం వెల్లివిరియడమనే కవితాత్మక వాక్యానికి ఆర్‌కె ఎంత విస్తృత రాజకీయ వ్యాఖ్యానం చేశాడో ఈ వ్యాసంలో చూడవచ్చు. జీవితాన్ని ఈ దోపిడీ వ్యవస్థ, అసమ సాంఘిక సంబంధాలు పట్టి ఉంచిన తావులన్నిటా విప్లవం జరగలవసిందే అంటాడు ఆర్‌కె. కొందరనుకున్నట్ల విప్లవం ఏదో ఒకానొక సమస్య పరిష్కారమైతే పరిపూర్తి కాదు. అదొక సింగిల్ పాయింట్ ప్రోగ్రాం కాదు. అది బహుముఖీనమైన కర్తవ్యం. ఈ విషయంలో విప్లవకారుల అవగాహనను ఇంత చిన్న వ్యాసంలో ఆర్‌కె రాశాడు. జీవితం వెల్లివిరిసేలా చేసుకోవడం ఈ రాజ్యం ద్వారా సాధ్యం కాదని, ఈ రాజ్యాంగ పరిధిలో అయ్యేపని కాదని చెప్పడం ఆయన అసలు ఉద్దేశం. ఇంత విశాలమైన, మౌలికమైన అవగాహనతో ఆర్‌కె చర్చల సందర్భంలో విప్లవోద్యమ లక్ష్యాన్ని తెలియజేస్తూ చర్చ ఫర్ డెమోక్రటిక్ స్పేస్ పత్రిక బులిటెన్6(నవంబర్ 10, 2014)లో ఈ వ్యాసం రాశాడు. రెండు విప్లవ పార్టీల చర్చల బృందం తరపున ఆయన ఈ రచన చేశాడు. – వసంతమేఘం టీం)
మా పోరాటం ఎందు కొరకు? ప్రస్తుతం చర్చల నమయంలో నిర్దిష్టంగా మేం ఏమి కోరుతున్నాం? ఈ మామూలు ప్రశ్నలకు ఎవరికి తోచిన సమాధానం వాళ్ళిచ్చుకుంటున్నారు. మేం నాయకత్వం వహిస్తున్న ప్రజా ఉద్యమం గురించి, మేం చర్చలకు సిద్ధపడిన కారణాల గురించి విభిన్నమైన వ్యాఖ్యానాలు చెలరేగుతున్నాయి. పాలక వర్గాల దృష్టిలో మా ఉద్యమం ఒక శాంతిభద్రతల సమస్య లేదా ఒక సామాజిక ఆర్థిక సమస్య. దాన్ని అటు అణచివేతతోనో ఇటు, ఆకర్షణలతోనో రూపుమాపవచ్చునని ముప్పై ఏడు సంవత్సరాలుగా అన్ని రకాల పాలకులూ భావిస్తున్నారు. పోలీసు, న్యాయ అధికారిక యంత్రాంగాల దృష్టిలో మేం కేవలం హింసావాదులం. దౌర్జన్యపరులం. రాజ్యాంగం అంగీకరించకపోయినా మా మీద బలప్రయోగం అమలు చేస్తే మేం రద్దయిపోతామని వాళ్ల అభిప్రాయం. పోలీసు యంత్రాంగానికి మా ఉద్యమం ఒక ఆదాయ వనరుగా, అడ్డులేని అధికారానికి మార్గంగా కూడా మారిపోయింది. మా పేరు చెప్పి లెక్కలేని నిధులు అనుభవించవచ్చు. సమాజం మీద అంతులేని నిరంకుశత్వాన్ని అమలుచేయవచ్చు. ప్రచార, ప్రసార సాధనాల దృష్టిలో మా ఉద్యమమంటే అక్కడక్కడా, అప్పుడప్పుడు జరిగే సంచలనాత్మక సంఘటనలు. కొందరి దృష్టిలో మేం దారితప్పిన ఆదర్శవాదులం. మరి కొందరి దృష్టిలో మేం ఆచరణ సాధ్యం కాని ఆశయాల వెంట పడిపోతున్న వాళ్ళం. 37 సంవత్సరాల అవిశ్రాంత పోరాటం తర్వాత, వేలాదిమంది మెరికల వంటి యోధులు బలైపోయిన తర్వాత కూడా మా ఉద్యమం ఇంత వక్రీకరణకు గురై, మధ్యతరగతి దృష్టిలో తప్పుడు చిత్రణతో వుంది.
కానీ ఈ దేశ సువిశాల గ్రామీణ ప్రాంతాల్లో, ఆదివాసీ ప్రాంతాల్లో కోటానుకోట్ల ప్రజలు మా కార్యకర్తలను తమ సొంత బిడ్డలుగా భావిస్తున్నారు. తమ సమస్యలకు మేమే పరిష్కారం చూపగలమని విశ్వసిస్తున్నారు. మాకు అన్ని విధాలా సహకరించడం మాత్రమే కాదు, మా నిర్మాణాలలో వాళ్ళు భాగమవుతున్నారు. వాళ్ళ జీవితాలలో మమ్మల్ని భాగం చేసుకుంటున్నారు.
అవును, మేము ఈ దేశపు సమస్యలలో ఒకరం కాము. ఈ దేశపు పరిష్కారాలలో ఒకరం. ఈ దేశపు ప్రజానీకానికి సమస్యలు సృష్టిస్తున్న పాలక వర్గాలను తొలగించడం ద్వారా మాత్రమే ఆ సమస్యలు పరిష్కారమవుతాయని భావిస్తున్న వాళ్ళం. ఆ తొలగించే క్రమం ఒక పాలకవర్గ ముఠాను దించి, మరొక పాలక వర్గ ముఠాను ఎక్కించే ఎన్నికల ద్వారా సాధ్యం కాదనీ అంతిమంగా ప్రజా రాజ్యాధికారాన్ని సాధించే, ప్రజా చైతన్యాన్ని పెంపొందించే, దీర్ఘకాలిక సాయుధపోరాటం మాత్రమే మార్గమనీ మేం విశ్వసిస్తున్నాం. ఈ పోరాటం అధికారంతో ఉన్న శక్తులను దించి వేస్తుంది గనుక, ఆ శక్తుల చేతుల్లో సకల బలప్రయోగ సాధనాలూ ఉన్నాయి గనుక ఇది సాయుధ పోరాటం కాక తప్పదని మా విశ్వాసం.
మా దీర్ధకాలిక సాయుధ పోరాట లక్ష్యం ‘దున్నేవారికే భూమి’ నినాదంతో, వ్యవసాయ విప్లవం ఇరుసుగా, నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని సాధించడం. మరో మాటలో చెప్పాలంటే మా లక్ష్యాన్ని మూడు అతి చిన్న మాటల్లో చెప్పవచ్చు. అవి భూమి, భుక్తి, విముక్తి. ఈ మూడు మాటలూ పైకి చూడడానికి చిన్న మాటలే కానీ వీటి వెనుక విశేష అర్ధాలు వున్నాయి. ఈ మూడింటినీ సాధించడం ఒక బృహత్తరమైన కృషి ఈ మూడింటినీ ప్రజల వైపునుంచీ నిర్వచించడమే. ఒక విస్తృత ప్రయత్నం.
భూమి అన్నప్పుడు మా దృష్టి కేవలం భూయాజమాన్యాన్ని మార్చడం మాత్రమే కాదు. వ్యవసాయ ప్రధానమైన మన సమాజంలో భూమే అతి ముఖ్యమైన ఉత్పత్తి సాధనం. ఈ ఉత్పత్తి సాధనం ఇవాల్టికీ భూస్వాముల బందిఖానాలో వుంది. పాలక వర్గాల అస్తవ్యస్త విధానాల వల్ల దుర్వినియోగమవుతూ వున్నది. ప్రజా సంక్షేమానికి ఉపయోగపడని రీతిలో సంసన్నుల సొంత ఆస్తిగా వున్నది. ఈ దుస్థితి నుంచి భూమిని విముక్తి చేయడానికి తొలి షరతు భూసంస్కరణలూ, కౌల్దారీ సంస్కరణలూ, గరిష్ట పరిమితికి మించిన మిగులు భూముల స్వాధీనం, పంపిణీ వంటి కార్యక్రమాలను అన్ని ప్రభుత్వాలూ 50 సంవత్సరాలుగా వాగ్దానం చేస్తున్నప్పటికీ అమలు చేయడం జరగలేదు. ఈ కర్తవ్యాలను, నెరవేర్చటంతోపాటు, భూమిని సరైన ప్రజానుకూల వినియోగంలోకి తెచ్చి, వ్యవసాయానికి అవసరమైన అన్ని ఉత్పాదకాలను రైతాంగానికి సులభంగా, అందించి, వ్యవసాయరంగంలో విదేశి జోక్యాన్ని నివారించి, వ్యవసాయోత్పత్తిని ఇనుమడింపజేసి, స్వయం సమృద్ధి సాధించి, ఉత్పత్తి సాధనాలు ప్రజాపరం చేయడం ద్వారా వ్రజా జీవితంలో సమూలమైన మార్పులు తేగల వ్యవసాయ విప్లవం మా లక్ష్యం. భూమి సమస్య పరిష్కారం గ్రామీణ సమాజంలో పీడనకు కారణమైన కుల అసమానతను, అణిచివేతనూ పరిష్కరించే దిశలో కూడా ఒక ముందడుగు. ఈ క్రమంలో వ్యవసాయం మీద ఆధారపడే జనాభాను తగ్గిస్తూ, మిగిలిన వారిని వ్యవసాయాధార పరిశ్రమలలోకి, ఇతర వరిశ్రమలలోకి తరలించడం మరొక ముఖ్యమైన లక్ష్యం.
భూమిని సరైన ప్రజానుకూల వినియోగంలోకి తెచ్చి, వ్యవసాయానికి అవసరమైన అన్ని ఉత్పాదకాలను రైతాంగానికి సులభంగా అందించి, వ్యవసాయరంగంలో విదేశీ జోక్యాన్ని నివారించి, వ్యవసాయోత్పత్తిని ఇనుమడింపచేసి, స్వయం సమృద్ధి సాధించి, ఉత్పత్తి సాధనాలు ప్రజా పరం చేయడం ద్వారా ప్రజా జీవితంలో సమూలమైన మార్పులు తేగల వ్యవసాయ విప్లవం మా లక్ష్యం.
మా మౌలిక లక్ష్యాలలో ఒకటైన భుక్తికి అర్ధం ఇదే. ఈ 21 వ శతాబ్దంలో దేశంలోను, రాష్ట్రంలోనూ మూడో వంతు జనాభా ప్రభుత్వ లెక్కల ప్రకారమే దారిద్య్ర రేఖకు దిగువన వుండడం, దాదావు నగం జనాభాకు గౌరవనీయమైన మనుగడకు సరిపోయిన ఉపాధి అవకాశాలు లేకపోవడం ప్రస్తుత పాలకుల రాజకీయార్థిక విధానాల వల్లనే. సమాజంలోని, ఉత్పత్తి శక్తులన్నిటినీ, మౌలికంగా మానవ శక్తిని సంపూర్ణంగా వినియోగిం చుకోకపోవడం, బంధనాలలో వుంచడం ఈ పాలక వర్గాల దోపిడి పీడనలకు అవసరం. దేశీయ, అంతర్జాతీయ, సామ్రాజ్యవాద శక్తులకు చౌక శ్రమను అందించడం కోసం అసంఖ్యాక నిరుద్యోగ రిజర్వు సైన్యాన్ని పెంచిపోషించడం అవనరం. ప్రతి మనిషికీ ఆత్మగౌరవంతో, ఆత్మవిశ్వాసంతో, స్వయం సమృద్ధిగా జీవించే అవకాశం ఉందనీ, ఉండాలనీ మేము భావిస్తాం. ఆ విశ్వాసానికి అనుగుణంగానే ప్రతి మనిషికీ తగిన భుక్తి కల్పించగల, జీవనోపాధి. అవకాశాలను హామీ ఇవ్వడం, నిరుద్యోగాన్ని సమూలంగా నిర్మూలించడం మా లక్ష్యాలు. నూతన ప్రజాస్వామిక విప్లవ విజయంతో ఏర్పడే ప్రజా ప్రభుత్వం ఈ హామీని ఇస్తుంది.
భూమి, భుక్తి అనే రెండు మౌలికాంశాలలో ప్రజానుకూల రాజకీయార్థిక విధానం అమలు కావాలంటే నిజమైన ప్రజల ప్రభుత్వం ఏర్పడాలి. అదే మా మూడో లక్ష్యం విముక్తి, ఇప్పటి వరకూ ఈ దేశంలో ఏర్పడిన ప్రభుత్వాలన్నీ ఏ వాగ్దానం చేసినా, ఏ ఆశయాలు ప్రకటించినా, ఏ జెండాలు ఎగరేసినా, ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలు గానే వున్నాయి. భూస్వాముల, పెట్టుబడిదారుల, సామ్రాజ్యవాదుల ప్రయోజనాలు తీర్చేవిగానే వున్నాయి. బూటకవు ఎన్నికల ప్రక్రియ ‘ప్రజాస్వామ్యపు భావనను అపహాస్యం చేస్తూ, ప్రజా వ్యతిరేకులనే ప్రజా ప్రతినిధులుగా ప్రకటిస్తోంది. అన్ని అధికార వ్యవస్థలూ, చట్టాలూ సంపన్నులకే మేలు చేసేవిగా వున్నాయి. సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నప్రజానీకం తమ న్యాయమైన ఆకాంక్షల కోసం ఏ చిన్నపాటి ఆందోళనకు దిగినా పాలకవర్గాలు దుర్మార్గమైన హింసను ప్రయోగిస్తున్నాయి. కనుక ఈ పాలక వర్గాలనుంచి విముక్తి సాధించడానికి సాయుధ పోరాటం మినహా మరొక మార్గం లేదని నక్సల్పరీ శ్రీకాకుళాల నిరుపేద ప్రజానీకం ఈ దేశం ముందర ప్రకటించిన ఎజెండాను నిర్వహించేందుకే విప్లవ పార్టీలు ఆవిర్భవించాయి.
ఈ మార్గంలో గత ముప్పై ఏడు సంవత్సరాలలో మా నాయకత్వాన, ఇతర విప్లవ సంస్థల నాయకత్వాన దేశ వ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు సంఘటితమయ్యారు. వేలాది సమస్యలపైన పోరాటాలు చేపట్టారు. అనేక చోట్ల విజయం సాధించారు. వేలాది మంది మృతవీరుల ఆశలతో ఈపోరాటం మునుముందుకే సాగుతోంది.
ఈ పోరాటంలోనే ఒక భాగంగా ఇప్పుడు మేము ఈ ప్రభుత్వంతో చర్చలకు సిద్ధపడ్డాం. అయితే మా మౌలిక లక్ష్యాల మీద చర్చలేదు. మేము భూమి, భుక్తి, విముక్తి కోసం సాగే దీర్ఘకాలిక సాయుధ పోరాటాన్ని విరమించుకోబోవడం లేదు. కానీ అదే సమయంలో ప్రజా ఆకాంక్షలకు లోబడి, ప్రజల తక్షణ డిమాండ్లలో కొన్నిటినయినా సాధించడానికి, ప్రభుత్వాలు తామే ప్రకటించిన ఆదర్శాలకు అనుగుణంగా నడుచుకోవాలని, నిలదీయడానికి మేము చర్చలకు సిద్ధపడ్డాం.
ఈ చర్చలలో మా ఎజెండాలో వున్న అంశాలన్నిటికీ పునాది వ్రజాస్వామ్యం, స్వావలంబన, దున్నే వారికి భూమి అనే నినాదాలు.
ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామికమని చెప్పుకొనే ఈ దేశంలో వాస్తవంగా కొనసాగుతున్నది సంపన్నవర్గాల నిరంకుశత్వం. రాజ్యాంగంలో హామీ, ఇచ్చిన హక్కులకు వేటికీ రక్షణ లేకుండా పోయింది. ప్రశ్నించే హక్కు మీద నిత్య నిర్బంధం అమలవుతున్నది. ప్రజల పోరాట హక్కు మీద నిరంతర దమనకాండ సాగుతున్నది. ఈ స్థితిలో కనీస ప్రజాస్వావిక హక్కుల సాధనకే, ప్రజాస్వామ్యం పట్ల పాలకవర్గాల చిత్తశుద్ధిని బహిర్గతం చేసేందుకే మేం ఈ చర్చలకు సిద్ధపడ్డాం.
1984-85 నుంచి రాజీవ్‌గాంధీ ప్రారంభించిన విధానాలతో మొదలయి 1991లో పి.వి.నరసింహారావు, మన్మోహన్‌సింగ్ లతో పరాకాష్టనందుకున్న నూతన ఆర్థిక విధానాలు మన ఆర్థిక వ్యవస్థను సామ్రాజ్యవాద రథ చక్రాలకు కట్టివేసాయి. ఈ దేశ రాజకీయార్థిక విధానాలు మాత్రమే కాదు, ప్రజా జీవనమే ఈ దేశ ప్రజల చేతుల్లో లేకుండా పోయింది. దేశభక్తియుత ప్రజాస్వామిక శక్తులన్నీ ఏకమై సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా స్వావలంబన కోసం పోరాడవలసిన ప్రస్తుత తరుణంలో ఆ దిశగా కొన్ని చర్యలైనా చేపట్టే విధంగా ప్రభుత్వంపై వత్తిడి తేవడానికే మేము చర్చలకు సిద్ధపడ్డాం.
‘దున్నేవారికే భూమి లక్ష్యాన్ని సాధించడానికి ఒక సాయుధపార్టీ ప్రభుత్వంతో చర్చలకు దిగనవసరమే లేదు. ప్రభుత్వాలు తామే చేసిన చట్టాలనూ, వాగ్దానాలనూ అమలులో పెట్టినా ఎంతో కొంత భూ నంన్కరణల కార్యక్రమం ముందుకు సాగుతుంది. ప్రభుత్వం చేయదగిన భూ నంస్కరణల కార్యక్రమమైనా ఎందుకు చేయలేదని నిలదీసేందుకూ, కనీసం కొన్ని ప్రజాస్వామిక డిమాండ్లనైనా సాధించేందుకూ మేం ఈ చర్చలకు పూనుకుంటున్నాం.
మా గురించి అనేక వక్రీకరణలూ, తప్పుడు. ప్రచారాలూ, సదుద్దేశంతోనైనా అరకొర సమాచారపు అభిప్రాయాలూ చెలరేగుతున్నపుడు ఒక నిజమైన ప్రజా రాజకీయ పార్టీగా మేవేమిటో, మా విశ్వాసాలేమిటో, మా ఆచరణ ఏమిటో ప్రజల ముందు బహిరంగంగా ప్రకటించుకోవడమే మా ఈ ప్రయత్నానికి మూలం.
వివ్లవం వర్ధిల్లాలి! భారత రైతాంగ సాయుధ పోరాటాలు వర్ధిల్లాలి!
అమరవీరుల ఆశయాలను కొనసాగిస్తాం!
నూతన ప్రజాస్వామిక భారతదేశాన్ని నిర్మించి తీరుతాం!
12.10.2004