తెలంగాణ ప్రభుత్వం కొత్త గా నిషేధించిన ప్రజాసంఘాలన్నీ అణగారిన వర్గాల కోసం రాజ్యాంగ బద్ధ హక్కుల కోసం నిబడ్డవే.  ఇన్ని సంఘాలపై ఇంత పెద్ద ఎత్తున నిర్బంధం ఇంతకు ముందు ఎప్పుడూ జరగలేదు. దశాబ్దాలుగా ప్రజాక్షేత్రంలో పనిచేసే రచయితలు కళాకారులు పౌరహక్కుల కార్యకర్తలు రైతులు కార్మికులు మహిళలు ఆదివాసీలు విద్యార్థులు రాజకీయ కార్యకర్తలు అందరూ ప్రభుత్వం దృష్టిలో సంఘ విద్రోహ శక్తులు కావడం ఆశ్చర్యం.  ఇప్పుడు నిషేధానికి గురైన ఈ ప్రజాసంఘాలు తెలంగాణ రాష్ట్ర సాధనకు ప్రాణాలు పణంగా పెట్టి ఉద్యమంలో అగ్ర భాగంలో నిలబడినవే. అధికారంలో భాగస్వాములు కాకుండా ప్రజల పక్షంలో నిలబడి ఉండటమే నేరమైంది. ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించడమే రాజద్రోహమైంది. భిన్నాభిప్రాయం కలిగి ఉండటమే పాపమైంది.

ప్రపంచం యావత్తు కరోనా విపత్తు లో తగలడుతున్న వేసవిలో ప్రజా సంఘాల పై నిషేధాగ్ని  కురిపించడం క్రూర ఫాసిస్టు చర్య తప్ప మరేం కాదు. ఈ నిషేధ చట్టాలు స్థానిక పాలకుల మానస పుత్రికలా కేంద్ర ప్రభుత్వ చోదితాలా ? ప్రమేయం ఎవరిదైనా  మెదడు లేని పాలకులే ప్రజలకు గొంతులు లేకుండా చేస్తారు. భిన్నాభిప్రాయాల్ని గౌరవించి సంహించని చోట కక్ష పూరిత రాజకీయ చర్యలు ఇలా నిర్బంధ రూపం ధరించి హింసాత్మక శాసనాలుగా తయారౌతాయి.  తెలంగాణ నేల మీద ఇటువంటి పరిష్కారాలు ఎప్పుడూ నిలవలేదు , గెలవలేదు.

 2005 , ఆగష్టు లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విరసం మీద విధించిన నిషేధాన్ని మూడు నెలల్లో వెనక్కి తీసుకొనేలా ఈ నేల ప్రతిఘటించిన చరిత్ర జ్ఞాపకాల్లో  ఇంకా పచ్చిగానే ఉంది. 

తెలంగాణ కోసం ఆత్మాహుతులు చేసుకున్న విద్యార్థులు సకలజనుల సమ్మె చేసిన శ్రామికులు  కలాలు గళాలు అంకితం చేసిన రచయితలు కళాకారులు  తమ శక్తి యుక్తుల్ని ధారపోసిన విద్యావంతులు ఇలా వీరంతా కొట్లాడితేనే కదా తెలంగాణ సాకారమైంది! ఈ విషయాల్ని చరిత్ర పాఠాల నుంచి చెరిపేయడానికి ప్రణాళికలు రచించారు సరే ;  ఫెడరల్ స్ఫూర్తిని తుంగలో తొక్కి రాష్ట్రాల హక్కుల్ని హరిస్తూ కేంద్రం తీసుకునే నిర్ణయాలకు వ్యతిరేకంగా గొంతు విప్పడంలో  ఈ ప్రజాసంఘాలే ముందుకు వచ్చాయని శాసకులు మర్చిపోయారా ?  ప్రజాస్వామ్యంలో అసమ్మతిని తెలియజేసే అవకాశం సేఫ్టీ వాల్వ్ వంటిదని ఎవరైనా విజ్ఞులు పాలకులకు తెలియజేయండి.

 ‘రాజన్నంతనె పోవునా కృపయు’ పద్యపాదాన్ని మార్చి ‘రాజైనంతనె పోవునా మతియు / స్మృతియు?’ అని రాయాలి కాబోలు ఇప్పుడు?!

నిషేధాలు నిర్బంధాలు తెలంగాణ ప్రజలనెన్నడూ కట్టిపడేయలేవని గుర్తుంచుకోండి. ధర్నా చౌక్ ఉదంతం నుంచి పాఠం నేర్చుకోండి.

విప్లవ రచయితల సంఘంతో పాటు 16 ప్రజా సంఘాలపై విధించిన నిషేధాన్ని వెంటనే ఎత్తివేయండి. ఈ సంఘాలేవీ హింసని ప్రేరేపించినవి కావు. హింసాత్మకంగా వ్యవహరించినవీ కావు. హింస వాటి ఎజెండా కానే కాదు. వీటిలో ఏ ఒక్కటీ రాజ్యాంగ విరుద్ధంగా ప్రజావ్యతిరేక కార్యక్రమాలు చేపట్టినవీ కావు. మరెందుకు ఈ నిషేధం ? ఎవర్ని సంతోషపెట్టేందుకు ఈ నిర్బంధం ? పాలకుల ఈ దుశ్చర్యని ప్రజాస్వామ్యవాదులంతా ముక్తకంఠంతో ఖండించాలని విజ్ఞప్తి.

Leave a Reply