ఎన్ఐఏ దాడులు, విచారణల మధ్యనే ఎగిరిన విరసం జెండా

విరసం 22 వ సాహిత్య పాఠశాల ఏప్రిల్ 12 న విజయవాడలో జరిగింది. ఒక వైపు కరోనా భయం మరో వైపు ఎన్ఐఏ సోదాలు, విచారణలు . యాభై ఏళ్ళు పూర్తి చేసుకున్న విరసం మరో యాభైల్లోకి.. ఫాసిస్టు కల్లోలంలో రూపొందుతున్న కొత్త పోరాటాల ప్రపంచంతో పనిచేస్తానని కలిసి నడుస్తానని బాస చేసింది. ఈ సాహిత్యపాఠశాలలో ఉండాల్సిన కవులు, కళాకారులు, ప్రజా సంఘాల బాధ్యులు కొందరు జెయిళ్లలో ఉన్నారు. చాలామంది ఎన్‌ఐఏ విచారణలో ఇరుక్కుపోయారు. ఆ వెలితి ఉన్నప్పటికీ ఎప్పటిలాగే ఉత్తేజభరితంగా పాఠశాల జరిగింది.

ఫాసిస్టు కల్లోలంలో రూపొందుతున్న కొత్త పోరాటాల ప్రపంచం అనే ఇతివృత్తంగా ఈ సారి విరసం తన సాహిత్య పాఠశాలను జరపాలని ముందుగానే నిర్ణయించింది. దానికి తగ్గట్టుగా సాహిత్య, రాజకీయ అంశాలు పాఠాలుగా ప్రణాళికను రూపొందించుకుంది. వాస్తవానికి ఈ పాఠశాల మార్చిలో జరగవలసి ఉంది. ఎలక్షన్ కోడ్ కారణంగా ఒక నెల పాటు వాయిదా పడింది. ఇంతలో కరోనా వ్యాప్తి పెరిగింది. మిత్రులు, అభిమానుల ఆరోగ్యాలు దృష్టిలో ఉంచుకుని సాహిత్య పాఠశాలను ఒక రోజుకి కుదించాల్సిన ఒక అనివార్య స్థితి ఏర్పడింది. ఇది ఒక కాదనలేని స్థితి.

ఈ లోగా మార్చి 31 సాయంత్రం 4 గంటల నుండి ఏప్రిల్ 1 తెల్లవారుజామున 4 గంటల వరకు కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ 30 మంది ప్రజాసంఘాల నేతల ఇళ్లలో సోదాలు జరిపింది. ఆ తరువాత రోజు నుంచి విడతల వారిగా విచారణ పేరుతో మనుషులను వేధించింది. కొందరిని రెండు సార్లు మూడు సార్లు ఇప్పటికీ పిలుస్తూనే ఉన్నారు.

ఇలాంటి ఒక ఉద్రిక్త స్థితిలో విరసం తన పాఠశాలను జరుపుకుంది. సాహిత్య పాఠశాలకు రావడం అంటే ప్రభుత్వ నిఘా నీడలోకి వెళ్లడం. కరోనా కంటే ప్రమాదకర వాతావరణం ఉన్న స్థితి. అలాంటి స్థితిలో ఎంతమంది మిత్రులు వస్తారు? అసలు సభ జరుగుతుందా ? అనే సందేహాలతో సభ ఆరంభమైంది. రెండు వందలకు పైగా మిత్రులు, రచయితలు రావడం అనేది ఒక గొప్ప ఆశావాహ దృక్పథాన్ని కల్గించింది. ఎన్ఐఏ విచారంలో ఉన్న మిత్రులు సభలు ఎలా జరుగుతున్నాయో కనుక్కోవడమే కాకా సభకు రాలేకపోవడం గురుంచి తమ బాధను తెలియచేస్తూనే మేము మీతోనే అంటూ మాట్లాడటం ఉత్తేజాన్ని కలిగించింది.

అయితే ఈ దాడులు, సోదాలు ఇప్పటికిప్పుడు వచ్చినవని, సభలను ఆటంక పర్చడంకోసం జరిగినవని కూడా కాదు. ఒక దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగా ఒక వరుస క్రమంలో జరిగాయి.

2016 లో విజయవాడలోనే విరసం తన 25వ మహాసభలు జరుపుకుంది. ఆ సభలలో ఆత్మహత్యలు, హిందూత్వ హత్యలు, మంద్ర స్థాయి యుద్ధ సందర్భం అనే ఇతివృత్తంతో జరుపుకుంది. రైతు ఆత్మహత్యలు, విద్యా ప్రైవేటికరణ, హిందూత్వ శక్తులు ముస్లింలపై జరుపుతున్న దాడులను ఆ సభలు విశ్లేషించాయి. వీటన్నిటిని పాలకుల మంద్రస్థాయి యుద్ధంలో భాగంగా చూడాలని తెలుగు సమాజం ముందు విరసం ఉంచింది. ప్రగతిశీల శక్తుల మీద సాంస్కృతిక భావజాల రంగాలలో దాడులు జరగడం కూడా మంద్రస్థాయి యుద్ధంలో భాగమే. ఆ తరువాత దీనిని ఇంకో వైపు నుంచి బ్రాహ్మణీయ హిందూత్వ ఫాసిజంగా నిర్వచించింది.

ఆ రోజుల్లో కొందరు మంద్రస్థాయి యుద్ధం, బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిజం అనే రెంటి మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. కానీ ఆ తరువాత ఐదేళ్ల కాలక్రమంలో ప్రగతిశీల శక్తుల మీద, దళిత, ముస్లిం మైనార్టీల మీద జరుగుతున్న దాడుల పరంపర వాటిని నిజం చేశాయి. భీమాకోరేగాం కుట్ర కేసుతో దేశంలో ఉన్న ప్రజాస్వామిక వాదులను, ప్రగతిశీలవాదులను భాజపా ప్రభుత్వం జైలు పాలు చేసింది. రెండవసారి అధికారంలోకి వచ్చిన తరువాత అనేక చట్టాలలో వేగవంతమైన మార్పులను తీసుకువచ్చింది. ఇవన్నీ కూడా కార్పొరేట్లకు అనుకూలమైనవే. అలాగే యూఏపిఏ వంటి నిర్బంధ చట్టాలను మరింత క్రూరంగా తయారు చేసింది. కార్పొరేట్ అనుకూల చట్టాలకు, ప్రభుత్వం చేపట్టిన అప్రజాస్వామిక చట్టాలకు వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళందరి గొంతు నొక్కడానికి వీటిని ఉపయోగించింది. సిఏఏ, ఎన్ఆర్సి వ్యతిరేక ఆందోళనకారుల మీద, ఆదివాసుల కోసం పనిచేసే వారి మీద వీటిని విరివిగా ఉపయోగించడం చూశాం. రెండు తెలుగు రాష్ట్రాలలో దశాబ్దాలుగా పనిచేస్తున్న ప్రజాసంఘాల నేతలపై అక్రమ, నిరాధార ఆరోపణలు చేసి ఉపా కింద కేసులు పెట్టారు. ఇప్పుడు మళ్ళీ సోదాలు, విచారణలు. ఇవన్నీ కూడా వేటికవే విడివిడిగా లేవు. ఇవి అన్ని కూడా బ్రాహ్మణీయ ఫాసిస్టు శక్తుల అణిచివేతలో భాగమే.

అంతిమంగా దీని ఉద్దేశం భిన్న స్వరాల అణిచివేతనే. దేశంలో గత మూడు దశాబ్దాలుగా అవలంబిస్తున్న మార్కెట్ సరళీకరణ విధానాలు మరింత ముందుకు తీసుకుపోవడానికి దేశవ్యాప్తంగా వర్గపోరాటాలు, ప్రజాస్వామిక పోరాటాలు ఆటంకంగా ఉన్నాయి. వీటికి తోడుగా దేశంలో సంఘ్ పరివార్ హిందుత్వ ఎజెండాను ముందుకు తీసుకుపోవాలన్న పీడిత అస్తిత్వ పోరాటాలు, ప్రజాస్వామిక పోరాటాలు అడ్డుగా ఉన్నాయి. పాలకుల రాజకీయార్థిక విధానాలు, బ్రాహ్మణీయ ఫాసిజం వేరువేరు కాదు. ఇవి రెండు కూడా విడిగా లేవు.

మార్కెట్ సరళీకరణ విధానాలకు మతాన్ని ఈ దేశ పాలకులు వాడుకోవడం అనేది ఎప్పటి నుంచో ఉంది. ఇది ఇప్పుడు తీవ్రమైంది. దీనికోసమే సంఘ్ పరివార్ దేశభక్తి అనే ఒక భావనను ప్రజల్లో ముఖ్యంగా మధ్య తరగతి వర్గాలలో బలంగా తీసుకెళుతుంది. ఇది ఒక విష ప్రచారంగా మారింది. భాజపా, సంఘ్ పరివార్ శక్తులు దేశభక్తి అనే ఒక చట్రాన్ని తీసుకువచ్చాయి. దానికి కొలమానాలు తయారు చేశాయి. ఆ కొలమానాలలో ఎవరైతే ఉండరో వారంతా దేశద్రోహులే.

ఈ అణిచివేతకు వ్యతిరేకంగా, మార్కెట్ విస్తరణ విధానాలకు వ్యతిరేకంగా, హిందుత్వ ఫాసిస్టు విధానాలకు నలిగిపోతున్న ప్రజలు తిరగబడి పోరాడుతున్నారు. చర్యకు ప్రతిచర్య ఉన్నట్టే అణిచివేతకు ప్రతిగా తిరుగుబాటు ఉంటుంది అలా పోరాడుతున్న ప్రజలు ఈ నాడు దేశంలో అసంఖ్యాకంగా ఉన్నారు. వారికీ మద్దతిస్తున్న ప్రజాస్వామిక, ప్రగతిశీల శక్తులు ఉన్నాయి. ఈ పోరాటాల వల్లే ఒక కొత్త ఉద్యమ ప్రపంచం తయారవుతుంది. చరిత్ర పట్ల నమ్మకం కలుగుతుంది. విముక్తి కోసం ప్రజలు పోరాడగలరనే భరోసా కలుగుతున్నది.

ఈ పోరాట శ్రేణులన్నీ కూడా భాజపా ప్రభుత్వం తెచ్చిన దేశభక్తి కొలమానాల్లో లేనివాళ్లు. సహజంగానే ఆ వర్గాల మీద నేడు దాడి జరుగుతుంది. అది అధికారక నిర్బంధాల మొదలు అనధికారిక హత్యలు దాక. ఇవన్నీ చట్టబద్దం, సమాజానికి ఆమోదం పొందేలా చేయడనికి రాజ్యం ప్రయత్నిస్తున్నది. ఇలాంటి విపత్కర సందర్భంలో మనం ఉన్నాం. ప్రభుత్వం చేసే అన్నిటినీ అంగీకరించడమే ఈ రోజు దేశభక్తికి కొలమానం. మనిషి తన జ్ఞానాన్ని, ఆలోచనలను ఆపివేసి ఒక యంత్రాలా ఉండటమే ఈ రోజు దేశభక్తికి కొలమానం. మనిషి సహజ సిద్ధమైన తెలివితేటలతో తప్పు ఒప్పులను తర్కిస్తే అది దేశద్రోహం అవుతుంది.

ఈ దేశభక్తిని తిరస్కరించడమే ఈ రోజు ప్రగతిశీలశక్తుల కర్తవ్యం. ఈ దిశగా పోరాట ప్రజలతో కలిసి విరసం సాంస్కృతిక, భావజాల శక్తిగా మరో యాభైల్లోకి ప్రయాణిస్తుందని ప్రకటించడానికే ఈ అననుకూల పరిస్థితుల్లో కూడా సాహిత్య పాఠశాలను నిర్వహించింది. అణిచివేతకు గురవుతున్న పోరాట శక్తులకు ఒక సాహిత్య గొంతుకుగా మరింత బలంగా ఉంటానని ఈ సందర్భంగా మరోసారి ప్రకటించింది. పీడిత సమూహాల వెంట నడుస్తున్న సాహిత్య శక్తులన్నీ కలవాలని పిలుపు ఇచ్చింది. ఇది ఇవాళ దేశంలోని, తెలుగు సమాజాల్లోని ప్రగతిశీల రచయితలు, కళాకారులు, మేధావులందరి ఉమ్మడి చారిత్రిక బాధ్యత.

Leave a Reply