మనది ప్రజాస్వామ్య లౌకిక సర్వసత్తాక గణతంత్ర దేశం. గణతంత్ర రాజ్యమంటే యావత్తు దేశం స్వీయ సంపుష్టి పొందడం. స్వావలంబన (ఆత్మనిర్భర్‌) అంటే స్వంత వనరులు, స్వంత పరిజ్ఞానం, స్వంతశ్రమతో ఉత్పత్తి చేసి వినియోగించడంగా ఉంటుంది. దీనికోసం పౌరులకు స్వేచ్చ కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వాలు అడుగులు వేయాలి. ఇప్పుడు ఈ రెండూ ప్రమాదంలో ఉన్నాయి. అయితే మోడీ ప్రభుత్వ ఆర్థిక విధానాలు దేశ వనరులను, దేశ సంపదను, దేశ శ్రమను స్వదేశీ, విదేశీ కార్పొరేట్లకు దారాదత్తం చేసేవిధంగా ఉంది. గణతంత్ర దేశంలో ప్రజలే విదాన నిర్ణయ కర్తలు. పాలకులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. సమాజ సంపుష్టితత్వం కోసం ప్రధాన రంగాలైన రక్షణ, రవాణా కమ్యూనికేషన్‌, ఆర్థికానికి నాడీ వ్యవస్థలైన బ్యాంకింగ్‌, ఇన్సూరెన్స్‌, మౌలిక సదుపాయాల కల్చనలతో పాటు, ప్రధాన వనరులైన చమురు, ఇనుము, ఉక్కు విద్యుత్తు వంటి పరిశ్రమలన్నీ ప్రభుత్వ అజమాయిషీలో ఉంటేనే మానవాభివృద్ధి సాధ్యమని సామాజిక ఆర్థిక వేత్తలు చెబుతున్నారు.

నెహ్రూ పాలన కాలంలో దేశ భవిష్యత్తు అభివృద్ధికి మౌళిక పరిశ్రమలు ప్రభుత్వ రంగంలోనే కొనసాగాలని నిర్ణయించారు. 1947 నాటికి ఒక అత్యంత వెనుకబడిన, వ్యవసాయక దేశంలో ఆవిర్భవించిన ప్రభుత్వరంగం రెండు కర్తవ్యాలను నిర్వర్తించాల్సి ఉందని గుర్తించారు. మొదటిదీ కీలకమైనదీ, దెబ్బతిన్న పెద్దపులిలాంటి సామ్రాజ్యవాదం తిరిగి పంజా విసరకుండా దేశాన్నీ దేశ సార్వాభౌమత్వాన్నీ కాపాడటం. రెండవది భారతదేశ సర్వతోముఖాభివృద్ధికి పాటుపడటం. అయితే సహజంగానే స్వాతంత్ర్యానంతర భారత పాలకులకుండే “వర్గ” నైజం రీత్యా మిశ్రమ ఆర్థిక వ్యవస్థ పెట్టుబడిదారీ ఆస్తుల పెరుగుదలకు ఎక్కువ మొగ్గు చూపింది. భారత పెట్టుబడిదారులకవసరమైన మౌలిక సరుకులు, గనులు, భారీ యంత్రాలు, విద్యుత్‌, నౌకా నిర్మాణం, చమురు, గనుల తవ్వకం, చమురు శుద్ధి చేయడం మొదలైనవన్నీ ప్రభుత్వరంగంలో నిర్వహిస్తూ, వినిమయ సరుకుల ఉత్పత్తి మాత్రం పెట్టుబడిదారులకే వదిలేసారు. మొదట్లో పాలకులు దీన్ని మిశ్రమార్థిక వ్యవస్థంటూ ముద్దుగా పిలుచుకున్నా దేశంలో నిర్మితమైంది పక్తు పెట్టుబడిదారీ విధానమే!

జాతీయోద్యమ ఆకాంక్షల ఫలితంగా నిర్మితమైన ప్రభుత్వరంగానికి లాభనష్టాలు ప్రాతిపదిక కానే కాదు. సామాజిక న్యాయం, ప్రజల ప్రయోజనాలు, దేశ శ్రేయస్సు మాత్రమే ప్రాతిపదిక. ప్రైవేటు సంస్థలకు సొంత ప్రయోజనాలూ, లాభాలవేటే ఏకైక లక్ష్యం అన్నదాంట్లో ఎవరికీ ఏ సందేహమూ లేదు. కానీ ప్రభుత్వ సంస్థలకు ఉత్పత్తితో పాటు, ప్రజలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం, దేశ సంపదను పెంచడమే లక్ష్యం. ఈ లక్ష్యసాధనలో మన ప్రభుత్వరంగం కొంతమేరకు విజయవంతమైంది కూడా. కానీ ఈ సంపద సృష్టికి ప్రభుత్వరంగం వేసిన దారులు, కార్మికవర్గం ధారపోసిన నెత్తురే కారణమన్న చారిత్రక సత్యాన్ని కావాలనే మోడీ ప్రభుత్వం విస్మరిస్తోంది. పైగా పెట్టుబడిదారులే సంపద సృష్టికర్తలంటూ ప్రభుత్వం వారికి సాగిలపడుతోంది. 1951 నాటికి కేవలం‌ ప్రభుత్వ రంగ సంస్థలు మాత్రమే ఉన్నప్పటికీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొనడం వలన కాలక్రమేణా 2019 మార్చి నాటికి 348 వరకూ ప్రభుత్వ రంగ సంస్థలు పెరిగినాయి. ఇందులో ప్రభుత్వ పెట్టుబడి 16.41 లక్షల కోట్లు కాగా అధికృత వాటాధనం 2.76 లక్షల కోట్లకు చేరుకుంది. కేవలం 2018-19 ఆర్థిక సంవత్సరంలో వీటి వార్షికాదాయం 25.43 లక్షల కోట్లు. మిశ్రమ ఆర్థిక విధానంపై కొన్ని విమర్శలు ఉన్నప్పటికీ ప్రభుత్వ రంగంలో పెద్దఎత్తున ఉద్యోగ కల్పన జరగడంతో ఎస్సీ, ఎస్టీ, బిసి ఇతర బడుగు బలహీన వర్గాలు, స్త్రీలు రిజర్వేషన్ల ద్వారా ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు పొంది ఆర్థికంగా ఎదిగారు.

దేశంలో 1991 నుంచి సామ్రాజ్యవాద ప్రపంచీకరణ ఆర్థిక విధానాల అమలుతో ప్రైవేటు రంగం పుంజుకోవడం, రాజ్యాంగం నిర్దేశించిన లక్ష్యాలకు వ్యతిరేక దిశగా పాలన సాగించడం, ప్రభుత్వ రంగాన్ని నిర్లక్ష్యం చేస్తూ ‘పైవేటును ప్రోత్సహించడం జరిగింది. 1990వ దశకంలో వ్యవస్థీకృత సర్దుబాట్ల కార్యక్రమం రాజ్యాంగ లక్ష్యాలకు విరుద్ధంగా కొనసాగింది. దాని ఫలితంగా 1990 నుంచి భారత ఆర్థిక వ్యవస్థ విపరీతమైన సంక్షోభంలో కూరుకుపోతోంది. దేశీయ పెట్టుబడిదార్ల వద్ద పోగుపడ్డ సంపదను నియంత్రణ చేయలేని ప్రభుత్వాలు పెట్టుబడుల కోసం, సాంకేతిక పరిజ్ఞానం కోసం, వాణిజ్య లోటు చెల్లింపుల కోసం ఐఎంఎఫ్‌, ప్రపంచ బ్యాంకుల నుండి అవి విధించిన షరతులను అంగీకరించి పెద్ద ఎత్తున రుణం తీసుకోవాల్సి వచ్చింది. వ్యవస్థీకృత సర్దుబాట్లతో మొదలైన ఈ రకమైన లొంగుబాటు క్రమంగా లిబరలైజేషన్‌, ప్రైవేటెజేషన్‌, మార్కెటైజేషన్‌ ఆ క్రమంలో వచ్చిన గ్లోబలైజేషన్‌ పేర ఆర్థికరంగంపై రుద్దబడ్డాయి. పర్యావసానంగా వనరులను ప్రజల నుండి లాక్కుని కార్పొరేట్లకు అప్పగించే ఫెసిలిటేటరుగా మాత్రం ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి.

ప్రభుత్వ రంగ సంస్థ (పిఎస్‌యూ)లను మహారత్న నవరత్న మినీ రత్న అనే భాగాలుగా వర్గీకరించారు. పాలనాపరమైన, ఆర్థిక స్వయం ప్రతిపత్తికి సంబంధించిన సంస్కరణలు, అవగాహనా ఒప్పందాల ద్వారా స్వీయ బాధ్యత వంటివి ప్రభుత్వం విరమించుకుని పిఎస్‌యూల ద్వారా సొంతంగా బిజినెస్‌ నిర్వహించాలనే భావనను ముందుకు తీసుకొచ్చాయి. ఈ పంథాలో తొలి లక్ష్యం నష్టాలు తెస్తున్న పిఎస్‌యూలను పునర్‌ వ్యవస్థీకరించడం, నష్టాలతో నడుస్తున్న పిఎస్‌యూలను వదిలించుకోవడానికి మొదటగా పెట్టుబడుల ఉపసంహరణ, ‘పైవేటీకరణలను ఒక విధానంగా తీసుకొచ్చారు. రెండోది, లాభదాయకంగా నడుస్తున్న పిఎస్‌యూలకు ఆర్థిక పాలనాపరమైన స్వయంప్రతిపత్తిని కల్పించారు. అయితే నష్టాలతో నడుస్తున్న పిఎస్‌యూలు కూడా ప్రభుత్వ రంగ సంస్థలు గానే చలామణి అవుతూ వచ్చాయి. 

1930 ఆర్థిక సంక్షోభం తర్వాత అమెరికా, ఫ్రాన్స్‌, బ్రిటన్‌ దేశాల్లో పరిశ్రమలను ప్రోత్సహించినట్లుగా కాకుండా మనదేశంలో కీన్సియన్‌ తరహా సంస్థలను పరిత్యజించడాన్ని ఒక ప్రత్యామ్నాయంగా భావించారు. అంటే సంక్షేమ రాజ్యంగా ఉంటున్న భారతదేశాన్ని నయా ఉదారవాద దేశంగా మార్చివేయడంలో ఇది ఒక భాగం. మొత్తం ప్రభుత్వ రంగాన్ని ‘పైవేటీకరించడమే లక్ష్యం అయినప్పటికీ, లాభదాయకంగా నడుస్తున్న పిఎస్‌యూల విషయంలో ఇది సమర్థనీయంగా ఉండదు. పైగా పిఎస్‌యూల నుంచి పెట్టుబడుల ఉపసంహరణను ప్రభుత్వ ఆధారిత అభివృద్ధిని ప్రోత్సహించడానికి అంటే సామాజిక సంక్షేమ ప్రభుత్వ లక్ష్యాన్ని చేరుకోవడానికి అని రాజకీయంగా దగాకోరు భాష్యం చెప్పారు. పెట్టుబడుల ఉపసంహరణకు ఇది కొత్త భాష్యం అన్నమాట.

సామ్రాజ్యవాద ప్రపంచీకరణ దీర్గకాలిక లక్ష్యాలను నెరవేర్చడానికి సామ్రాజ్యవాదులు పన్నిన ఈ కుట్రలకు భారత పాలకులు ఎలాంటి ప్రతిఘటన లేకుండా లొంగిపోయారు. దేశ స్వావలంబనను సామ్రాజ్యవాదులకు తాకట్టుపెట్టి ఆర్థిక సంస్కరణలు చేపట్టిన తొలి ప్రధాని మన తెలుగువాడైన పివి నరసింహారావు కావడం సిగ్గుపడాల్సిన విషయం. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థలకు, బహుళజాతి సంస్థలకు దేశ ఆర్థిక వ్యవస్థను అప్పగించిన వారిలో ప్రథములు పివినే. ఆ తర్వాత సుదీర్భ కాలం ప్రపంచబ్యాంకులో పనిచేసి ఆర్థిక మంత్రిత్వశాఖ నిర్వహించిన మన్నోహన్‌ సింగ్‌. భారత ఆర్థిక వ్యవస్థను సామ్రాజ్యవాదుల ముంగిట్లో పడేశాడు. ఆ తర్వాత ఏర్పడ్డ ఎన్‌డిఎ ప్రభుత్వం 1998 నుండి 2004 వరకు అటల్‌ బిహారీ వాజ్‌పేయి నాయకత్వంలో ప్రభుత్వ సంస్థల అమ్మకం కోసం ఒక మంత్రిత్వ శాఖనే ఏర్పరిచి ఆ శాఖద్వారా లాభాల్లో ఉన్న ప్రభుత్వరంగ సంస్థల వాటాలను విక్రయించడం మొదలు పెట్టారు. 2004లో యుపిఎ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రధానిగా మన్నోహన్‌ సింగ్‌ పైవేటీకరణనే అనుసరించారు. 2014లో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ మరింత దూకుడుగా పెట్టుబడిదార్లు, బహుళజాతి సంస్థలకు ఉపయోగపడే విధానాల ద్వారా దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మకానికి పెట్టడం జరిగింది.

మోడీ రెండవసారి అధికారం చేపట్టాక ప్రభుత్వ ఆర్థిక విధానాలలో పూర్తిగా ప్రజావ్యతిరేక కార్పొరేట్‌, ఆశ్రిత పెట్టుబడి అనుకూల ఆర్థిక విధానాలు ప్రజలపై బలవంతంగా రుద్దబడుతున్నాయి. కార్పొరేట్ల కోసం పాలకులూ, పాలకుల కోసం కార్పొరేట్లు! క్విడ్‌ ప్రా కో ఆట యధేచ్చగా సాగిపోతోంది. మన దేశంలో ఈ ఆటను దాపరికం లేకుండా బట్టబయలు చేసారు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌. “అన్నీ అమ్మివేయడమే మా విధానం” అంటూ పార్లమెంటు సాక్షిగా కుండబద్దలు కొట్టారు. “లాభాల్లో ఉన్న సంస్థలను కూడా అమ్ముతున్నారెందుకు?” అన్న పలువురు ప్రతిపక్ష సభ్యుల ప్రశ్నలకు సమాధానంగా… “అసలు మా అమ్మకాలకు లాభనష్టాలు ప్రాతిపదికే కాదు. ప్రయివేటీకరించాలనుకున్నాం అదే చేస్తున్నాం” అంటూ ప్రభుత్వం ఉద్దేశాన్ని మరోసారి స్పష్టం చేసారు. సమస్త ప్రభుత్వరంగాన్ని తెగనమ్మడమే తమ విధానమని పార్లమెంటులోపలా వెలుపలా ప్రధాని సహా మంత్రులంతా ఇదే బృందగానాన్ని పదే పదే ఆలపిస్తున్నారు. ఎన్టీఏ ప్రభుత్వం ఏర్పాటయిన 2014-19 మధ్యకాలంలో పెట్టుబడుల ఉపసంహారణ ద్వారా దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయలను ప్రభుత్వం సమీకరించింది.

గత రెండున్నర మాసాలుగా వ్యూహాత్మక రంగాలు మినహా మిగతా అన్ని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలలో 100 శాతం పెట్టుబడుల ఉపసంహరణ దిశగా కేంద్ర ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది. అందుకు అనుగుణంగా బిపిసిఎల్‌, ఎయిర్‌ ఇండియా, షిప్పింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, కంటైనర్‌ కార్పొరేషన్‌, ఐడిబిఐ బ్యాంక్‌, బిఇఎంఎల్‌ తదితర సంస్థలలో వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణకు రంగం సిద్ధం చేస్తోంది. జీవిత బీమా సంస్థ ఎల్‌ఐసి నుంచి ఐపివోను కూడా తీసుకువస్తున్నట్లు బడ్జెట్‌లోనే ప్రభుత్వం ప్రకటించింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రెండు ప్రభుత్వ బ్యాంకుల్లో తమ వాటాను కూడా విక్రయించడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. తాజాగా 2021-22 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టే సమయంలో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ. 1.75 లక్షల కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు. ఈ టార్లెట్‌ కంటే ఎక్కువగానే పెట్టుబడులను వెనక్కి తీసుకోగలమని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

ప్రభుత్వ రంగం వాటాలను అమ్మడం ద్వారా సమకూరే సొమ్ము ప్రభుత్వ వ్యయానికి వినియోగించవచ్చునని, తద్వారా ద్రవ్యలోటు పెరగకుండానే ప్రభుత్వ వ్యయాన్ని పెంచవచ్చునని వాదించే వారున్నారు. ఈ వాదనే మోడీ ప్రభుత్వం కూడా ముందుకు తెస్తోంది. అందుకే ద్రవ్యలోటును అదుపు చేయడానికి పెద్ద స్థాయిలో ప్రభుత్వ రంగ వాటాలను అమ్మకానికి పెట్టింది. అయితే ఈ వాదన పూర్తిగా అర్ధరహితం. ప్రభుత్వం బ్యాంకుల నుండి రుణం తీసుకుని ఖర్చు చేస్తే ఐఎంఎఫ్‌కి, అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడికి అభ్యంతరం ఉంటుంది. అదే ప్రభుత్వ రంగ వాటాలనమ్మి అదనపు ఖర్చు చేస్తే అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడికి అభ్యంతరం ఉండదు. అంటే ఆర్థిక సూత్రాల ప్రాతిపదికపైన గాత తమ స్వప్రయోజనాల రీత్యా ఐఎంఎఫ్‌, అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి వ్యవహరిస్తున్నాయని మనం గ్రహించాలి. వాళ్ళ ఆధిపత్యానికి, దోపిడీకి ప్రధాన ఆటంకంగా ఉన్న ప్రభుత్వ రంగాన్ని అంతం చేయడమే లక్ష్యం. ప్రభుత్వ రంగం పూర్తిగా లేకుండా పోవాలని అది కోరుకుంటున్నది.

ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వ వ్యయాన్ని పెంచడాన్ని అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి ఎంతమాత్రం అంగీకరించదు. ద్రవ్య పెట్టుబడి గీసిన గీతను దాటే ధైర్యం మోడీ ప్రభుత్వానికి లేదు. ఈ పని చేయడానికి బదులు బడా పెట్టుబడిదారులకు పన్నుల్లో రాయితీలు ఇస్తే దేశంలోకి పెట్టుబడులు పోటెత్తుతాయని, తద్వారా ఆర్థిక వ్యవస్థ కొత్త పుంతలు తొక్కుతుందనే వింత వాదనను మోడీ ప్రభుత్వం ముందుకు తెస్తోంది. నిజానికి ప్రజల కొనుగోలు శక్తి పెరగకుండా పెట్టుబడి ఉత్పత్తిని పెంచదు, నూతన పరిశ్రమలు స్థాపించదు. మోడీ ప్రభుత్వం వర్షాలది ఎంత పనికిమాలిన వాదనో దేశీయ, విదేశీ ఆర్థికవేత్తలు ఇప్పటికే తేల్చి చెప్పేశారు. ప్రస్తుత పరిణామాలు కూడా దీనినే ధ్రువీకరిస్తున్నాయి. బడా కార్పొరేట్లకు యేటా లక్షల కోట్ల రూపాయలు కేవలం పన్ను రాయితీల రూపంలో ప్రభుత్వం ఇస్తున్నది. ఈ లోటును భర్తీ చేసుకోవడానికి ప్రజలపై పరోక్ష పన్నుల రూపంలోను, పెట్రో ఉత్పత్తులపై ఎడాపెడా పన్నులు వేయడం ద్వారా రాబట్టుకుంటున్నది. ఇప్పుడు ద్రవ్యలోటును పూడ్చుకోవడానికి ప్రభుత్వ రంగ సంస్థలను గుండుగుత్తగా అమ్మకానికి పెట్టింది. ప్రతి రోజూ బంగారు గుడ్డు పెట్టే బాతును కోసేస్తే, ఇంకా ఎక్కువ బంగారం ఒకేసారి పొందవచ్చునన్న తెలివితక్కువ దురాశ ఇది.

సామ్రాజ్యవాద ప్రపంచీకరణ ఆర్థిక విధానాలలో భాగమైన పాలక వర్గాలు పెట్టుబడిదారీ వ్యవస్థలో “వ్యాపార మిత్రులకు” జాతి సంపదను దోచిపె ట్రే ఆధ్రిత పక్షపాత ధోరణి (కోనీ క్యాపిటలిజం) ఒక వికృత పార్యం. ఈ విధానంలో ప్రభుత్వం తనకు కావలసిన వారికి గ్రాంట్లు, పన్ను మినహాయింపులు, అనుచిత పర్మిట్లు, ముందే నిర్భరించిన టె టెండర్లు, ప్రోత్సాహకాలు… ఇలా పలు రూపాల్లో లాభం సమకూరుస్తుంది. పాలకవర్గ అనుంగు వ్యాపారవేత్తలు (ఆదాని, అంబాని వంటివారు) ప్రభుత్వాలను తమ చెప్పుచేతల్లో పెట్టుకుంటారు. ప్రభుత్వ విధానాలను ప్రభావితం చేస్తారు. ప్రజాశ్రేయస్సు, జాతీయ ప్రయోజనాలు పణంగా పెట్టి వక్తిగత సంపదను అపారంగా పెంచుకుంటారు. రాజకీయ వ్యాపారవర్థాల నడుమ బిగిసిన అపవిత్ర బంధం వ్యాపార విజయానికి ఆధారంగా మారుతుంది. ఆభ్రిత పక్షపాత పెట్టుబడిదారీ విధానంలో పన్ను రాయితీలు, బ్యాంకుల అక్రమ రుణాలు రూపేణా భారీ ఆర్థిక మూల్యం చెల్లించాల్సి వస్తుంది. దీంతో, మానవాభివృద్ధికి కొలమానాలైన వైద్యం విద, ఉపాధి, ఆహారభద్రత వంటి రంగాలకు కేటాయింపులు క్షీణిస్తాయి. ఇది సామాజిక మూల్యం.

పారిశ్రామిక రంగాన్నే కాదు, దేశానికి జీవనాధారమైన వ్యవసాయరంగాన్ని కూడా అమ్మకానికి పెడుతూ మూడు వ్యవసాయ చట్టాలనూ, నూతన విద్యుత్‌ సవరణ చట్టాన్ని ఖనిజ తవ్వకం సవరణ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తెచ్చింది. రైతును భూమి నుండి తరిమేసి విదేశీ స్వదేశీ కార్పొరేట్ల ముంగిట కట్టుబానిసగా నిలబెట్టే కుట్ర చేస్తున్న సర్కారు, ఉద్యోగ, కార్మికవర్గాలను బజారుకీద్చే కుతంత్రాన్ని కూడా ఇప్పుడు కార్మిక చట్టాల సవరణ ద్వారా మరింత వేగవంతం చేసింది. ఇది పసిగట్టిన రైతాంగం మూడున్నర నెలలుగా ఢిల్లీ సరిహద్దుల్లో పోరాడుతున్నారు. ఇప్పుడీ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యోగ కార్మిక సంమాలు కూడా ఉద్యమిస్తున్నాయి. అయినా తాము దేశాన్ని అమ్మేయడానికి కట్టుబడి ఉన్నామని నిస్సిగ్గుగా ప్రకటిస్తోంది మోడీ ప్రభుత్వం. ఈ దేశ ప్రజలకు ఉరి బిగించడానికి పాలకులు అమ్ముడు పోయారనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి?

ప్రభుత్వ రంగమన్నదే లేకుండా పోతే ప్రజాసంక్షేమానికి దిక్కెవరు? అన్నీ ప్రయివేటు పరం చేసేవాడు ప్రజలకు ఎలా బాధ్యత వహించగలడు? కంపెనీలన్నీ అమ్మేసేవాడు వారికి ఉద్యోగాలేమివ్వగలడు? ప్రభుత్వాల కనీస బాధ్యతైన విద్యా వైద్యరంగాలను కూడా పెట్టుబడికే అప్పచెప్పేవాడు రేపు పిల్లలకు చదువులు చెప్పగలడా? ప్రజల ఆరోగ్యాల్ని కాపాడగలడా? బ్యాంకుల్ని తెగనమ్మేవాడు ప్రజల డబ్బుకు హామీ ఇవ్వగలడా? రైళ్లూ, బస్సులతో పాటు రోడ్లు, విమానాశ్రయాలను కూడా అమ్ముకునేవాడు ప్రజలకు చౌక రవాణా ఇవ్వగలడా? వ్యవసాయాన్ని కూడా వ్యాపారానికి ముట్టజెప్పాలనుకునేవాడు ప్రజల ఆకలి ఎలా తీర్చగలడు? చివరికి రక్షణ రంగాన్ని సైతం పెట్టుబడికి తాకట్టు పెట్టేవాడు దేశాన్ని మాత్రం ఎలా రక్షించగలడు? సమస్త ప్రకృతి వనరులతో పాటు మానవ వనరులను కూడా కార్పొరేట్లకు ధారాదత్తం చేస్తే ఇక ప్రజల మౌలిక అవసరాలు తీర్చెదెవరు? భారత రాజ్యాంగం ఈ దేశానికి సంక్షేమ రాజ్యాన్ని వాగ్దానం చేసింది. ప్రభుత్వరంగమన్నదేలేనప్పుడు ఈ సంక్షేమానికి ఎవరు బాధ్యత వహించాలి? ప్రజలకు బాధ్యత వహించలేని ప్రభుత్వాలకు పాలించే అర్హత మాత్రం ఉంటుందా…?!

ప్రధాని చేసిన వెబినార్‌ ప్రసంగంలో నష్టాలతో నడుస్తున్న పిఎస్‌యూలను మాత్రమే ప్రైవేటీకరిస్తామనే చెప్పలేదు. వ్యూహాత్మక రంగంలోని అతి కొద్ది పిఎస్‌యూలను మినహాయించి తక్కిన మొత్తం ప్రభుత్వ రంగ పరిశ్రమలకు ఈ ఈ ప్రైవేటీకరణ భావనను ఆయన విస్తరించడం విశేషం. వ్యాపారంలో కొనసాగడం ప్రభుత్వం పని కాదనే పచ్చి నయా ఉదారవాద వాదనను ప్రధాని ఈ సందర్భంగా ముందుకు తీసుకొచ్చారు. ప్రభుత్వ వాదన పరిమితమైన ప్రభుత్వం, సత్బరిపాలన భావనకు సంబంధించింది అని చెబుతున్నారు. అయితే ప్రైవేటీకరణ ఒక ప్రభుత్వానికే పరిమితమైనది కాదు. పరిమిత ప్రభుత్వం అనేది ఉండదు. నయా ఉదారవాద ప్రభుత్వం అనేది వాస్తవంగా ఒక రెగ్యులేటరీ ప్రభుత్వం. పాలించడానికి అది నియంత్రణా వ్యవస్థలను రూపొందించి, చట్టాల అనువర్తనం చేస్తోంది. ఇక్కడ సత్బరిపాలన అంటే భాగస్వామ్యం, జవాబుదారీతనం, పారదర్శకం, బాధ్యతాయుతం, సమర్థ్ధవంతం, న్యాయబద్ధత, సమీకృతం, చట్టబద్ధత అనేటువంటి భావజాలపరంగా ప్రజానుకూల లక్షణాలను విస్మరించడం తప్ప మరేమీ కాదు. పరిమిత ప్రభుత్వం, అపరిమిత పాలన అనే నయా ఉదారవాద ఎజెండాను ఇది ముందుకు నెడుతుంది. ఈ విధానం ఫాసిజానికి మార్గం వేస్తోంది.

మోడీ ప్రభుత్వ విధానాలను గమనిస్తే ఒకవైపు దేశభక్తి అంటూనే దేశద్రోహం తలపెడుతుంది. మరోవైపు ఆత్మనిర్భర్‌ అంటూనే సర్వం పెట్టుబడిదారులకు దారాదత్తం చేస్తోంది. దేశ ప్రయోజనాల రీత్యా చూసినా, ఆర్థిక సూత్రాల ప్రకారం చూసినా, ప్రభుత్వ రంగ వాటాలను అమ్మకానికి పెట్టడం ద్వారా మోడీ ప్రభుత్వం వ్యూహాత్మకంగానే తీవ్ర తప్పిదం చేస్తోందని చెప్పాలి. నిజానికి ప్రభుత్వ రంగ సంస్థల లక్ష్యం ఆర్థిక అభివృద్ధి మాత్రమే కాదు. ఇప్పటిదాక పిఎస్‌యూలు సామాజిక న్యాయానికి ఉపకరణాలుగా వ్యవహరించాయి. ప్రైవేట్‌ రంగంలో రిజర్వేషన్‌ లేకపోవడంతో ప్రభుత్వరంగ పరిశ్రమలను ప్రైవేటీకరించడం అంటే తొలిదశలో రిజర్వేషన్ల న్లను తప్పనిసరి చేసిన విధానానికి తూట్లు పొడిచి సామాజిక వివక్షను పునరుద్ధరించడమే అవుతుంది. దేశంలో మేడిపండు స్వాతంత్ర్యమే వర్ధిల్లుతోంది…! ఆర్థిక, సామాజిక సంక్షోభాన్ని తీవ్రతరం చేసే ప్రైవేటీకరణను అనివార్యంగా ప్రతిఘటించాల్సిన చారిత్రక సందర్భం ఇది. కార్పొరేట్లకు ఊడిగం చేస్తూ దేశానికి తీరని ద్రోహం చేస్తున్న ఈ ప్రభుత్వ విధానాలను తిప్పి కొట్టడాన్ని మించిన దేశభక్తి మరొకటి లేదిప్పుడు.

Leave a Reply