పెగాసస్ స్పైవేర్ కొనుగోలుపై కేంద్రంలోని మోడీ ప్రభుత్వం దేశ ప్రజలకు, పార్లమెంటుకు, చివరికి సుప్రీంకోర్టుకు సైతం చెప్పినవన్నీ అబద్ధాలేనని ప్రముఖ అంతర్జాతీయ పత్రిక ‘న్యూయార్క్ టైమ్స్’ ”ది బ్యాటిల్ ఫర్ ద వరల్డ్ మోస్టు పవర్‌ఫుల్ సైబర్ వెపన్” అనే టైటిల్‌తో బాంబు పేల్చింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ముందు జనవరి 28న సునామీలా మోడీ ఫ్రభుత్వంపై పడింది. మోడీ సర్కార్ నిజ స్వరూపం బయటపడి కన్నంలో దొంగలా పట్టుబడినట్టైంది. ప్రజాస్వామ్య సంస్థలు, రాజకీయ నాయకులు, హక్కుల సంఘాల నాయకులు, జర్నలిస్టులు, ప్రజలపై నిఘా పెట్టేందుకు పెగాసస్‌ను మోడీ సర్కార్ కొనుగోలు 2017లో చేసింది. పెగాసస్ కోసం ఎన్‌ఎస్‌వోతో ఎలాంటి లావాదేవీలూ జరపలేదని కేంద్రం గతంలో ప్రకటన చేయగా, అది పచ్చి అబద్ధమని తేలింది. పెగాసస్‌పై మోడీ అబద్ధాలాడి దేశాన్ని తప్పుదోవ పట్టించారంటూ ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. న్యూయార్క్ టైమ్స్ బయటపెట్టిన ఈ ‘స్నూప్‌గేట్’ (స్పైవేర్ కుంభకోణం) వ్యవహారం దేశంలో ప్రకంపనలు సృష్టిస్తుంటే ప్రధాని మోడీ ఇజ్రాయిల్‌తో భారత్ సంబంధాలను మరింత ఉన్నత స్థితికి తీసుకెళ్తామని పేర్కొనడం ఆయన ఆహాంకారానికి, నిరంకుశ ధోరణికి పరాకాష్ట. మరోవైపు ఆయన మంత్రివర్గ సహచరులు న్యూయార్క్ టైమ్స్ పత్రికపై దూషణలకు దిగారు.
ఏమిటీ కుంభకోణం ?
‘పెగాసస్’ను ‘మిలటరీ గ్రేడ్’ నిఘా సాఫ్ట్‌వేర్‌గా పేర్కొంటారు. స్మార్ట్‌ఫోన్లు, మొబైల్ ఫోన్లు, ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌లలో దీనిని రహస్యంగా ప్రవేశపెడతారు. అక్కడ్నుంచీ వాటిని వాడే వ్యక్తులపై నిఘా కొనసాగుతుంది. సాధారణంగా దీనిని తీవ్రవాద చర్యలు, దేశ వ్యతిరేక శక్తులను ఎదుర్కోవడానికి వాడాలి. కానీ భారత్‌లో మోడీ సర్కార్ దేశ ప్రజలపైనే ప్రయోగించింది. ప్రతిపక్ష నాయకులు, న్యాయమూర్తులు, హక్కుల కార్యకర్తలు, జర్నలిస్టులపై పెగాసస్‌ను ప్రయోగించిందని ‘ఇంటర్నేషనల్ ఇన్వెస్టిగేటివ్ కన్సార్టియం’ ఆధారాలు సేకరించింది. దీనికి సంబంధించిన వివరాల్ని మనదేశంలో న్యూస్ వెబ్ పోర్టల్ ‘ద వైర్’ విడుదల చేసింది. మోడీ సర్కార్ పెగాసస్‌తో దాదాపు 300 మందిపై నిఘా చర్యలకు పాల్పడిందని ‘ద వైర్’ గత ఏడాది వార్తా కథనం ప్రచురించింది. ఇది దేశ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది. పార్లమెంట్‌ను సైతం కుదిపేసింది. దీనిపై సమాధానం ఇవ్వాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి.
న్యూయార్క్ టైమ్స్ కథనం :
పెగాసస్ స్పైవేర్ కొనుగోలుకు సంబంధించి 2017లో ఇజ్రాయిల్‌తో ఒప్పందం కుదుర్చుకోవడంలో ఇంటిలిజెన్స్‌కు చెందిన అగ్ర నాయకుల ప్రమేయం ఉందని ఇజ్రాయిల్‌లో ఉన్న న్యూయార్క్‌టైమ్స్ రిపోర్టర్ రొనెన్ బర్గ్‌మాన్, అతని సహోద్యోగి మార్క్ మజ్జెట్టి మరో సంచలనాత్మక విషయాన్ని వెల్లడించారు. ఈ సైబర్ ఆయుధ పరికరం కొనుగోలుకు సంబంధించి 2017 జూలైలో ప్రధాని నరేంద్ర మోడీ, అప్పటి ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు మధ్య ఒప్పందం కుదిరిందని స్పష్టమైంది. దీనికి ముందు అంటే ఆ ఏడాది ఫిబ్రవరి, మార్చిలో భారత ప్రభుత్వ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఇజ్రాయిల్ వెళ్లి, అక్కడి జాతీయ భద్రతా అధికారులతో చర్చలు జరిపినట్లు తమ పరిశీలనలో తేలిందని బర్గ్‌మాన్ తెలిపారు. పెగాసస్ స్పైవేర్ తయారీదారు అయిన ఇజ్రాయిల్ కంపెనీ ఎన్‌ఎస్‌ఓలోనూ, డజనుకు పైగా దేశాల్లోనూ న్యూయార్క్ టైమ్స్ విలేకరులు విస్తృతంగా పరిశోధించి అనేక మందిని ఇంటర్వ్యూ చేసి నిర్ధారణలకు వచ్చారు.
2017లో ఇజ్రాయిల్‌తో భారత్ కుదుర్చుకున్న 200 కోట్ల డాలర్ల ఆయుధ ఒప్పందంలో భాగంగానే ఈ స్పైవేర్ కొనుగోలు చేశారని న్యూయార్క్ టైమ్స్ కథనం తెలిపింది. ఇటువంటి స్పైవేర్‌ను ఇజ్రాయిల్ నుంచి కొనుగోలు చేసిన మొట్టమొదటి ప్రభుత్వం మోడీ ప్రభుత్వమేనని బర్గ్‌మాన్ తెలిపారు. ఇజ్రాయిల్ ప్రధాని నేరుగా జోక్యం చేసుకోవడం వల్లే ఎన్‌ఎస్‌ఓ ఈ స్పైవేర్ లైసెన్స్‌ను భారత్‌కు ఇచ్చిందని ఆయన అన్నారు. అత్యంత అధునాతనమైన ఈ హ్యాకింగ్ పరికరాన్ని భారత్ నుంచి ఇద్దరు కస్టమర్లు కొనుగోలు చేశారని ఎన్‌ఎస్‌ఓ రికార్డుల్లో ఉందని, ఆ ఇద్దరు కస్టమర్లు ఎవరా అని వెతికితే ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబి), రీసెర్చి అండ్ అనాలిసిస్ వింగ్ (రా) అని తేలిందని బర్గ్‌మాన్ తెలిపారు. ‘ప్రపంచ అత్యంత శక్తిమంతమైన సైబర్ ఆయుధం కోసం పోరాటం’ పేరిట వెల్లడించిన నివేదిక సంచలనమైంది. దేశంలో పెగాసస్ గూఢచర్యంపై గతేడాది అంతర్జాతీయ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చినప్పుడు, గిట్టనివారి ప్రచారమని మోడీ ప్రభుత్వం తప్పించుకుంది. తాజాగా వెలువడిన ‘న్యూయార్క్ టైమ్స్’ కథనంతో ప్రభుత్వ పరిస్థితి కన్నంలో దొరికిపోయిన దొంగకు మల్లే తయారైంది.
చారిత్రకంగా పాలస్తీనాకు భారత్ మిత్ర దేశం. ఇజ్రాయెల్‌ను వ్యతిరేకించడం మన విదేశాంగ విధానంలో చాల ముఖ్యమైన అంశం. 2014లో హిందూ జాతీయవాద నినాదంతో మోడీ అధికారంలోకి వచ్చారు. అంతకు ముందు దశాబ్దాలపాటు పాలస్తీనాకు సంఘీభావంగా భారతదేశం నిలుస్తూ వచ్చింది. ఇజ్రాయెల్‌తో లోతైన సంబంధాలు ఉండేవి కావు. ఇజ్రాయెల్‌ను సందర్శించిన తొలి భారత ప్రధాని మోడీయే. ఆ దేశంలో చాలా పకడ్బందీగా మోడీ పర్యటన జరిపి కాళ్లకు చెప్పులు లేకుండా సముద్రం ఒడ్డున నడిచాడు. నెతాన్యాహుతో కలిసి దాదాపు 200 కోట్ల డాలర్ల విలువైన అత్యాధునిక ఆయుధాలతో పాటు పెగాసస్ రహస్య పరికరాలతో పాటు క్షిపణులకు సంబంధించిన ఒప్పందాన్ని మోడీ చేసుకున్నారు. వెనువెంటనే నెలల వ్యవధిలోనే నెతాన్యాహు భారతదేశంలో పర్యటించాడు.
జూన్ 2019లో ఐక్యరాజ్యసమితిలో పాలస్తీనాకు మానవ హక్కుల సంస్థ పరిశీలన హోదాను నిరాకరించటానికి ఇజ్రాయెల్‌కు మద్దతుగా భారత్ వ్యవహరించింది. మొట్టమొదటిసారి ఇటువంటి ఇజ్రాయెల్ అనుకూల నిర్ణయాన్ని భారత ప్రభుత్వం తీసుకొంది… అంటూ ప్రపంచ ప్రముఖ పత్రిక ది న్యూయార్క్ టైమ్స్ రాసి, భారతదేశ రాజకీయాల్లో దుమారాన్ని లేపింది. ఇజ్రాయెల్ ఆగడాలకు అనుకూలంగా తమ విధానాలను మార్చుకొని ఓటింగులో పాల్గొన్నారు. ఇరాన్‌కు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ చేస్తున్న ప్రచారానికి అరబ్ దేశాలలో మద్దతు పొందటానికి, ఇజ్రాయెల్ దీర్ఘకాలిక విరోధులను తమ వైపునకు తిప్పుకోవడానికి పెగాసస్ ఉపయోగపడింది. పాలస్తీనాకు వ్యతిరేకంగా ట్రంప్ చేసిన అబ్రహం ఒప్పందాల వెనుక పెగాసస్ కీలక పాత్ర పోషించిందని టైమ్స్ పత్రిక పేర్కొంది. మానవ హక్కులపై సందేహాస్పదమైన రికార్డులు ఉన్నప్పటికీ పోలాండ్, హంగేరీ, భారతదేశాలకు పెగాసస్‌ను ఇజ్రాయెల్ విక్రయించిందని న్యూయార్క్ టైమ్స్ పత్రిక రాసింది.
ఇజ్రాయెల్ నుంచి పెగాసస్ స్పైవేర్‌ను కొనుగోలు చేసిన దేశాల్లో అగ్రదేశం అమెరికా కూడా ఒకటి. ఈ విషయం న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో బయట పెట్టింది. కొని దగ్గర ఉంచుకున్నా ఇంతవరకు ఈ సాఫ్ట్‌వేర్‌ను అమెరికా నిఘా సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్ట్టిగేషన్(ఎఫ్‌బిఐ) ఇంతవరకు ఎవరి పైనా ప్రయోగించలేదని తెలిపింది. ”ప్రైవేటు కంపెనీలు, ప్రభుత్వ నిఘా సంస్థలు సైతం చొరబడలేని తావులకు మా సాఫ్ట్‌వేర్ చేరుతుంది. ఐఫోన్, ఆండ్రాయిడ్ వంటి అత్యంత గోప్య సమాచార కవచాలను కలిగిన స్మార్ట్ ఫోన్లలోకి చొరబడి వాటిని బద్దలు కొడుతుంది” అని అమ్మకాల విషయంలో తన కస్టమర్లకు ఎన్‌ఎస్‌వో హామీ ఇచ్చేదట! ఈ విషయం కూడా ఆ పత్రికే వెల్లడించింది. మనదేశంలో మోడీ ప్రభుత్వం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఆయన వద్ద పనిచేస్తున్న ఐదుగురు అధికారులు, మాజీ ప్రధాని దేవెగౌడ, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రులు సిద్దరామయ్య, కుమారస్వామి, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధరారాజే, విహెచ్‌పి నేత ప్రవీణ్ తొగాడియా, సిబిఐ మాజీ డైరెక్టర్‌లో అలోక్‌వర్మ, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఓఎస్‌డి, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, పలువురు ఐఎఎస్ అధికారులు, న్యాయవాదులు, ప్రజాసంఘాల కార్యకర్తలు, జర్నలిస్టులపై స్పైవేర్‌ను ప్రయోగించింది.
ఒకవైపు పార్లమెంటులో, దేశవ్యాప్తంగా చర్చ సాగుతుండగానే, నిరుడు డిసెంబర్‌లో అమెరికన్ ఫోరెన్సిక్ దర్యాప్తు సంస్థ ఆర్సెనెల్ కన్సల్టింగ్ మరో సంగతి వెల్లడించింది. బీమా కోరేగావ్ కేసులో ఉద్యమకారుడు రోనా విల్సన్‌ను జైలులో పెట్టిన వ్యవహారమూ పెగాసస్ పుణ్యమే అని బయట పెట్టింది. విల్సన్ మొబైల్ ఫోన్‌పైన కనీసం 49 సార్లు సైబర్ దాడులు జరిగిందనీ, ఆయన కంప్యూటర్‌లో, ఆయన సహ నిందితుడైన సురేంద్ర గాడ్లింగ్ కంప్యూటర్‌లోనూ స్పైవేర్‌ను ప్రవేశపెట్టారనీ తేల్చింది. ఇప్పుడు న్యూయార్క్ టైమ్స్ జనవరి 28 నాటి కథనం సంచలనమైంది. ఇజ్రాయెల్‌కు చెందిన ‘ఎన్‌ఎస్‌ఓ గ్రూపు’ ఈ ‘పెగాసస్’ నిఘావేర్‌ను ఎలా రూపొందించింది. ప్రపంచవ్యాప్తంగా తన ప్రయోజనాల్ని కాపాడుకోవడానికి ఇజ్రాయెల్ ఎలా వాడుకున్నదీ ఆ పరిశోధనాత్మక కథనం వివరించింది. పాలస్తీనా విషయంలో సుదీర్ఘకాలంగా తమను వ్యతిరేకిస్తున్న దేశాలను సైతం తమవైపు తిప్పుకోవడానికి ఈ సాఫ్ట్‌వేర్ అమ్మకాన్ని తాయిలంగా చూపింది. 2020 ఆగస్టులో ఇజ్రాయెల్‌కూ, పొరుగున ఉన్న అరబ్ దేశాలకూ మధ్య ‘అబ్రహమ్ శాంతి ఒప్పందాలు’ కుదరడానికీ ఇదే కారణమట. అలాగే, పాలస్తీనా విషయంలో ఏళ్ళ తరబడి ఇజ్రాయెల్‌ను వ్యతిరేకించిన భారత్ సైతం ఇటీవల చెట్టపట్టాలేసుకోవడానికీ ఇదే కారణమని ఆరోపణ.
మోడీ ప్రభుత్వ దబాయింపు – కోర్టు జోక్యం :
ఇంతకాలం పార్లమెంట్ లోపల, బయట, చివరికి సర్వోన్నత న్యాయస్థానానికి సైతం ప్రభుత్వం అబద్ధాలే చెప్పిందని తేలిపోయింది. పెగాసస్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కేంద్రాన్ని అఫిడవిట్ వేయమని కోరినప్పుడు పొంతన లేని సాకులు చెప్పింది. దేశ రక్షణ సంబంధ వ్యవహారాలను కోర్టుకు సమర్పించలేమని బొంకింది. రాఫెల్ యుద్ధ విమానాల్లోనూ ఇలాగే చెప్పి బయట పడింది. ప్రతి సందర్భంలోనూ ఆ కారణం చెల్లుబాటు కాబోదన్న సుప్రీంకోర్టు పెగాసస్‌ను వాడారా లేదా అని విచారించేందుకు జస్టిస్ ఆర్‌వి రవీంద్రన్ నేతృత్వంలో కమిటీని నియమించాల్సి వచ్చింది. అయినప్పటికీ ప్రభుత్వంలో కనీస పశ్చాత్తాపం లేదు. పెగాసస్‌ను ప్రభుత్వం కొనుగోలు చేసిందనడాన్ని ‘న్యూయార్క్ టైమ్స్’ వెల్లడించిన అంశాలన్నీ బలపరిచేవే.
2017లో ఇజ్రాయెల్‌లో పర్యటించిన ప్రధాని మోడీ, అప్పటి ఆ దేశ ప్రధాని బెంజిమెన్‌తో రూ.15 వేల కోట్ల రక్షణ సంబంధ ఒప్పందం కుదుర్చుకున్నారు. బెంజిమెన్‌ను దోస్త్‌గా అభివర్ణించారు. బెంజిమెన్ సైతం మన దేశానికొచ్చి అలాగే మోడీని పొగిడారు. ఆ బంధానికి కారణం ‘పెగాసస్’ భారీ డీల్ అని ఇప్పుడు అర్థమవుతోంది. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో భారీ కుంభకోణం జరిగినట్లు ప్రాథమిక ఆధారాలున్నప్పటికీ మోడీ ప్రభుత్వం దర్యాప్తునకు అంగీకరించలేదు. విపక్షాలన్నీ సంయుక్త పార్లమెంటరీ సంఘాన్ని (జెపిసి) ఏర్పాటు చేయమని కోరినా తిరస్కరించింది. సాంకేతిక కారణాలతో సుప్రీంకోర్టు నుండి క్లీన్ చిట్ పొంది అదే తమ సచ్ఛీలతగా ప్రచారం చేస్తోంది. రాఫెల్ విమానాల్లో భారీగా ముడుపులు చేతులు మారాయని ఫ్రాన్స్ కోర్టుల్లో విచారణ సాగుతోంది. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా అజ్ఞాత కార్పొరేట్ల నుండి అత్యధిక మొత్తంలో విరాళాలు పొందిన పార్టీ బిజెపి. ఈ విషయాలపై నోరు మెదపకుండా అవినీతిపై పోరాడతామని ప్రధాని చెప్పడం గోముఖ వ్యాఘ్రం తంతు కాదా?
ముగింపు :
ఇజ్రాయెల్‌కు చెందిన సంస్థ ఎన్‌ఎస్‌ఓ అభివృద్ధి చేసిన పెగాసస్ స్పైవేర్‌ను 2011 నుండి వివిధ దేశాల నిఘా సంస్థలకు విక్రయిస్తోంది. ఇజ్రాయెల్ విదేశాంగ, రక్షణ శాఖల ఆమోదంతోనే అమ్ముతోంది. తాము ప్రభుత్వ సంస్థలకే అమ్ముతున్నామని ఎన్‌ఎస్‌ఓ మొదటి నుండి నొక్కి వక్కాణిస్తోంది. దానిపై మోడీ సర్కారు నోరు మెదపట్లేదు.పార్లమెంటులో కానీ, సర్వోన్నత న్యాయస్థానంలో కానీ మన పాలకులు నోరు విప్పి అవునని కానీ, కాదని కానీ చెప్పలేదన్నమాటే కాని, అంతర్జాతీయ వేదికలు పెగాసస్ దుర్వినియోగాన్ని నెత్తీ నోరూ కొట్టుకొని చెబుతూనే ఉన్నాయి. తప్పు జరిగిందనే వేలెత్తి చూపుతున్నాయి. పెగాసస్ నిఘా బారిన పడిన 50 వేల పైచిలుకు మందిలో 300 మంది భారతీయులేనని ఓ అంతర్జాతీయ జర్నలిస్టుల కన్సార్టియమ్ గత జూలైలోనే చెప్పింది. ఇలా ఆరోపణలు వస్తున్నా సరే జాతీయ భద్రతను సాకుగా చూపి, పాలకులు దర్యాప్తు జరపకపోవడం సరికాదని సుప్రీంకోర్టే చెప్పాల్సి వచ్చింది. పెదవి విప్పని ప్రభుత్వ ప్రవర్తనతో చివరకు స్వతంత్ర విచారణకూ ఆదేశించాల్సి వచ్చింది. తీవ్రవాద, ఇతర కరడుగట్టిన నేరస్త నెట్‌వర్క్‌లను ఛేదించేందుకు పెగాసస్‌ను సమకూర్చుకున్న అమెరికా ఇన్వెస్ట్టిగేషన్ సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్ట్టిగేషన్ (ఎఫ్‌బిఐ)పై విమర్శలు రావడంతో పెగాసస్ వాడకాన్ని నిలిపివేసింది. సౌదీ అరేబియా, యుఎఇ, మెక్సికో, ఫిన్లాండ్‌లో స్పైవేర్‌ను దుర్వినియోగం చేసినట్లు తేలింది.
అసలు వాస్తవాలేమిటో అధికారికంగా ప్రభుత్వం నిగ్గు తెల్చాలి. బాధితులే కాదు యావద్దేశం నిజాలు తెలుసుకోవాలనుకుంటున్నది. పౌరులపై నిఘా ప్రజాస్వామ్యానికి, వ్యక్తిగత గోప్యతకు ప్రమాదం. ప్రజాస్వామ్య వ్యవస్థలపైనా, వ్యక్తులపైనా ప్రభుత్వ నిఘాను ప్రతి ఒక్కరూ ముక్తకంఠంతో ఖండించాలి. శ్రీరంగ నీతులు చెప్తూ, అవినీతి పంకిలంలో, అబద్దాల ఊబిలో నిలువులోతు కూరుకుపోయిన మోడీ సర్కార్ పాలనార్హత కోల్పోయింది. దేశద్రోహిగా, ప్రజావ్యతిరేకిగా మారింది. అందువల్లనే న్యూయార్క్ టైమ్స్ కథనంపై ప్రభుత్వం ఇప్పటికీ స్పందించలేదు. ప్రభుత్వ మౌనం నేరాన్ని అంగీకరించడమే అవుతుంది. పెగాసస్‌పై విచారణ జరుపుతున్న కమిటీ న్యూయార్క్ టైమ్స్ పత్రిక కథనాన్ని సాక్షిగా స్వీకరిస్తామనలేదు. మన సుప్రీంకోర్టు ఈ కథనాన్ని సూమోటోగా స్వీకరించి విచారించడానికి సిద్ధపడలేదు. ఇది న్యాయవ్యవస్థ బలహీనతకు నిదర్శనం. మోడీ ప్రభుత్వం ప్రజలను వాస్తవాలు తెలుసుకోనిస్తుందా? తమ సచ్ఛీలతను నిరూపించుకుంటుందా? లేక ప్రజల చిత్కారానికి గురవుతుందా? పాలకులే తేల్చుకోవాల్సిన సందర్భం ఇది.