అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్‌లో మనదేశ పరిస్థితి చూస్తే రూపాయి విలువ వెలవెలపోతూ… రికార్డు స్థాయి పతనాన్ని చవి చూస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. చరిత్రలోనే ఇదివరకూ ఎప్పుడూ లేని స్థాయిలో రూపాయి పతనమయ్యింది. అమెరికా ఫెడరల్‌ రిజర్వు వడ్డీరేట్ల పెంపునకు తోడు పలు దేశీయ కారణాలతో సెప్టెంబర్‌ 27న రూపాయి విలువ 82కు పతనమయ్యింది. అంతర్జాతీయ ద్రవ్య మార్కెటులో డాలరుతో రూపాయి మారక విలువ అక్టోబర్‌ 19న ఏకంగా 79 పైసలు కోల్పోయింది. తొలిసారి రూపాయి మారకం విలువ 83.20కి క్షీణించింది. రూపాయి మారక విలువ చరిత్రలోనే ఇది అతిపెద్ద పతనం. పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో రూపాయి మారకం విలువ డాలర్‌తో మరింత పతనమయ్యే ప్రమాదముంది. వర్షాకాల పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మంత్రి జూలై 11న తెలిపిన వివరాల ప్రకారం గత ఎనిమిదేళ్లలో డాలరు మారకంతో రూపాయి విలువ రూ. 16.08(26.39 శాతం) పతనమైంది. ఆ రోజు రూపాయి మారకం విలువ డాలరుతో రూ.79.41గా ఉంది. ఇప్పుడు రూ. 83కు చేరింది.

అమెరికా ఫెడ్‌ రిజర్వు కీలక వడ్డీరేట్లు పెంచడంతో స్టాక్‌ మార్కెట్లతో పాటు రూపాయి పతనం అవుతోంది. భారత్‌ ఫారెక్స్‌ నిల్వలు 545 బిలియన్ల డాలర్లకు పడిపోయింది. ఈ పరిణామం ఇప్పటికే మందగించిన ఆర్థిక వ్యవస్థపై మరింత తీవ్ర ప్రతికూలతలను పెంచనుంది. రూపాయి విలువ పటిష్టానికి ఆర్‌బిఐ తీసుకున్న చర్యలు బలియంగా లేవని పలువురు ట్రేడర్లు రాయిటర్స్‌తో పేర్కొన్నారు. ప్రబల డాలరు ఉరుములతో కాంతిలేని భారత రూపాయి అనే శీర్షికతో అక్టోబర్‌ 7వ తేదీన రాయిటర్‌ సంస్థ ఒక వార్తను ప్రపంచానికి అందించింది. ఆ వార్తలో పేర్కొన్నట్లు డాలర్‌తో రూపాయి మారక విలువ రికార్డుల మీద రికార్డులు నమోదవుతోంది. మన్మోహన్‌సింగ్‌ ఏలుబడిలో రూపాయి విలువ ప్రభుత్వం చేతగాని తనం వల్లనే పతనమైందని ధ్వజమెత్తిన నరేంద్ర మోడీ ఇంతవరకు తన పాలనలో రూపాయి పతనం గురించి ఎక్కడా మాట్లాడలేదు.

అమెరికా ఫెడరల్‌ రిజర్వు చైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌ వడ్డీరేట్లను డిసెంబర్‌ నాటికి మరో 75 పాయింట్లు పెంచనున్నట్లు ప్రకటించారు. ద్రవ్యోల్భణాన్ని అదుపు చేయడానికి మున్ముందు రేట్ల పెంపు విషయంలో మరింత కఠినంగా వ్యవహరిస్తామని పావెల్‌ పేర్కొన్నారు. అమెరికాలో వడ్డీరేట్లు పెరిగినప్పుడు మన దేశీయ మార్కెట్ల నుంచి మదుపర్లు తమ పెట్టుబడుల్ని ఉపసంహరించుకుంటారు. అధిక రాబడి కోసం వాటిని అమెరికాకు తరలిస్తారు. ఫలితంగా డాలర్‌కు డిమాండ్‌ మరింత పెరిగి బలపడుతుంది. ఈ క్రమంలోనే డాలర్‌ విలువ రెండేళ్ల గరిష్ట స్థాయికి చేరింది. ఇది రూపాయిపై ఒత్తిడిని పెంచుతోంది. ఫెడ్‌ వడ్డీ రేట్ల పెంపుతో డాలర్‌ బలపడడం, భారత ఈక్విటీ మార్కెట్లలో ఒత్తిడి, చమురు ధరలు స్తబ్దుగా ఉండడం, దేశ వాణిజ్య లోటు పెరగడం తదితర పరిణామాలు రూపాయి విలువను ఆగాథంలో పడేశాయి.

మన విదేశీ నిల్వలు వరుసగా తొమ్మిదో వారం తిరోగమన దిశలో ఉన్నట్లు అక్టోబర్‌ 7 నాటి నివేదికలో రిజర్వు బ్యాంకు వెల్లడించింది. ఆర్‌బిఐ డాలర్లు విక్రయిస్తున్నప్పటికీ, రూపాయి ఈ ఏడాది 10 శాతం క్షీణించి 83 స్థాయికి పడిపోయింది. ఇండియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు షేర్లు, బాండ్లను విక్రయించి మార్కెట్‌ నుంచి నిధుల్ని తీసుకోవడంతో అమెరికా డాలర్‌ అత్యంత బలోపేతం అవుతున్నది. ఫలితంగా డాలర్‌ మారకంతో రూపాయి విలువ పతనమవుతున్నది. కరెంటు అకౌంట్‌ ఖాతా లోటు పెరగడం, పోర్ట్‌పోలియో నిధుల తరలింపులతో చెల్లింపుల (బివోపి) లోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 69 బిలియన్‌ డాలర్లకు చేరుతుందని అంచనా వేస్తున్నామని ఐడి ఎఫ్‌సి ఫస్ట్‌ బ్యాంకు ఎకనమిస్టు గౌరత్‌ సేన్‌గుప్తా తెలిపారు.
రూపాయి విలువ తగ్గుతున్న కొద్దీ దిగుమతుల విలువ పెరుగుతూ పోతుంది. మన దేశ అవసరాల్లో 80 శాతం చమురును దిగుమతి చేసుకుంటున్నాం. చమురు ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. దాంతో ఇంధన వ్యయం, రవాణా ఖర్చు పెరిగి, అన్నిటి ధరలూ ఆకాశానికి ఎగబాకుతాయి. కొవిడ్‌ నేపథ్యంలో ఉపాధి, ఆదాయాలు కోల్పోయిన ప్రజలకు కష్టాలు మరింత పెరుగుతాయి. ఇంకోవైపున ద్రవ్యోల్భణాన్ని అదుపు చేయాలన్న పేరుతో బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచుతాయి. గడచిన మూడు ద్రవ్య సమీక్షల్లోనూ రిజర్వ బ్యాంకు రెపో రేటు పెంచుతూనే పోతోంది. భవిష్యత్తులోనూ ఆ దారినే కొనసాగించవచ్చు. అందువల్ల వడ్డీలు పెరిగి గృహ నిర్మాణానికో లేక ఇతర అవసరాలకో బ్యాంకుల నుండి రుణాలు తీసుకున్న వారికి పెను భారమవుతుంది. కొత్తగా అప్పులు పుట్టడమూ కష్టమే అవుతుంది. దిగుమతుల విలువ పెరిగిపోవడంతో దేశ వాణిజ్య లోటు అధికమవుతుంది. విదేశీ వాణిజ్య లోటు పెరగడంతో పాటు ప్రభుత్వానికి ద్రవ్యలోటు కూడా పెరుగుతుంది. దాంతో ప్రజలకిచ్చే సబ్సిడీలకు, ఇతర రాయితీలకు కోతలు పెట్టడం జరుగుతుంది. ఇలా ఎటు చూసినా జనానికి బాదుడే.

డాలర్‌ బలపడడం వల్ల దాని విలువ పెరగడంతో రూపాయి విలువ తగ్గుతుందని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ జనాన్ని మభ్య పెడుతున్నారు. ఒకవేళ డాలర్‌ మాత్రమే బలపడితే రూపాయి మారకం విలువ దానితోనే పడిపోవాలి. కాని పౌండ్‌, యూరోతోనూ ఎందుకు దిగజారుతోంది? రిజర్వు బ్యాంకు గణాంకాల ప్రకారమే నెల రోజుల క్రితం అంటే సెప్టెంబర్‌ 20న ప్రపంచంలో ప్రధాన కరెన్సీలుగా చలామణి అయ్యే డాలర్‌, పౌండ్‌, యూరోలకు రూపాయి మారకపు విలువ వరుసగా 79.68,91.16, 79.95గా ఉండగా అక్టోబర్‌ 20న 83.20, 93.36, 81.42కు దిగజారింది. బ్రిటన్‌ ప్రధానమంత్రి లిజ్‌ ట్రస్‌ రాజీనామా చేయవలసినంతగా ఆ దేశ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైనా పౌండ్‌తో రూపాయి మారక విలువ దిగజారిందంటే సాధారణ పరిస్థితులే ఉంటే ఏమయ్యేదో! వర్ధమాన దేశాలపై ఇది సుదీర్ఘ ప్రభావమే చూపవచ్చని ప్రపంచ బ్యాంకు అధ్యకక్షులు డేవిడ్‌ మాల్ఫాస్‌ ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు దేశ సార్వభౌమ పరపతిని దెబ్బతీసే పలు అంశాల్ని భారత్‌ ప్రస్తుతం ఎదుర్కొంటున్నదని అంతర్జాతీయ రేటింగ్‌ ఏజెన్సీ ఎస్‌ అండ్‌ పి హెచ్చరించింది. తాజాగా రేటింగ్‌ ఏజెన్సీ.. ‘ప్రపంచ పరిణామాల కారణంగా ఇండియా సావరిన్‌ రేటింగ్స్‌ను నిలుపుకుంటుందా’ అనే టైటిల్‌తో ఒక క్రెడిట్‌ ఎఫ్‌ఏక్యూను విడుదల చేసింది.

భారత ద్రవ్యలోటు ప్రస్తుతం జిడిపిలో దాదాపు 10 శాతం ఉందని ఐఎంఎఫ్‌ అధికారి తెలిపారు. ఇది పలు వర్ధమాన దేశాల ఆర్థిక వ్యవస్థలో కెల్ల ఎక్కువ. ద్రవ్యోల్భణాన్ని, ద్రవ్యలోటును అదుపు చేయకుండా దేశ ఆర్థిక వృద్ధి సాధించడం అసాధ్యం. పరిస్థితులు ఇంత దారుణంగా ఉంటే అబద్ధాలు చెప్పి ప్రజలను మోసగించడం సంఘపరివార్‌ నేతలకు వెన్నతో పెట్టిన విద్య. ఆ కుదురు నుండి వచ్చిన ఆర్థిక మంత్రి ఈ విషయాన్ని మరోసారి రుజువు చేశారు. భారత ఆర్థిక వ్యవస్థ చిక్కుల్లో పడుతోందని, మరోవైపు అమెరికా బ్యాంకుల వడ్డీ రేట్లు పెరుగుతున్నందున ఈ దేశంలోని పెట్టుబడులు వెనక్కు తీసుకుపోవడం మూలంగా రూపాయి బలహీనపడుతోందన్నది విశ్లేషకుల మాట. ఏ దేశంలోనైనా కరెన్సీ విలువ తరగడం, ద్రవ్యోల్బణం పెరగడం జరిగితే అక్కడ విదేశీ పెట్టుబడులు నిలవవని ప్రపంచ అనుభవం చెబుతోంది. కాబట్టి ఇదో విష చక్రం. పర్యవసానంగా రూపాయి విలువ మరింత దిగజారడం, ధరలు ఇంకా ఇంకా పెరగడానికే దారి తీస్తుంది.
రిస్క్‌ సాధనాలపట్ల ఇన్వెస్టర్లు విముఖత చూపిస్తున్నందున, రూపాయి కొత్త కనిష్టాలకు పతనమయ్యిందని రిలిగేర్‌ బ్రోకింగ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సుగంధ సచ్‌దేవా చెప్పారు. ఈక్విటీ మార్కెట్లు పతనం కావండంతో దేశీ కరెన్సీ క్షీణించిందన్నారు. పశ్చిమ దేశాలు ద్రవ్య విధానాన్ని కఠినతరం చేస్తుండటం, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ మందగిస్తుందన్న ఆందోళనలతో ఇతర ఆసియా కరెన్సీలు చైనా యువాన్‌, జపాన్‌ యేన్‌లతో పాటు రూపాయి కూడా తగ్గుతున్నదని సచ్‌దేవా వివరించాడు. విదేశీ మారక నిల్వలు తగ్గిపోవడంతో ఫారెక్స్‌ మార్కెట్లో రిజర్వ్‌ బ్యాంక్‌ జోక్యం అంతంత మాత్రంగానే ఉన్నదని, దీనికి తోడు ఫారెక్స్‌ ట్రేడర్లు రూపాయిల్ని భారీగా విక్రయించి డాలర్లుగా మార్చుకుంటున్నారని, ఈ పరిణామాలతో దేశీ కరెన్సీ పతనం వేగవంతమైనట్లు తెలిపారు. సెప్టెంబర్‌ 27, 28 తేదీలలో విదేశీ ఇన్వెస్టర్లు రూ.5,500 కోట్ల విలువైన షేర్లను నికరంగా విక్రయించినట్టు స్టాక్‌ ఎక్స్చేంజీల గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

కుదేలవుతున్న భారత ఆర్థిక వ్యవస్థ :

ఇప్పటికే భారీగా తగ్గిన విదేశీ మారక నిల్వలు మరింతగా క్షీణిస్తాయని ఆర్తిక వేత్తలు అంచనా వేస్తున్నారు. అమెరికా డాలర్‌ భారీగా పెరుగుతున్నందున, రూపాయి రక్షణకు కొంతమేర విదేశీ కరెన్సీని రిజర్వ్‌ బ్యాంక్‌ ఖర్చు చేస్తుందంటూ రాయిటర్స్‌ నిర్వహించిన ఒక పోల్‌లో ఆర్థిక వేత్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు. గత ఏడాది కాలంగా దేశం వద్దనున్న విదేశీ మారక నిల్వలు 100 బిలియన్‌ డాలర్ల మేర తరిగిపోయి 642 బిలియన్ల నుంచి 545 బిలియన్లకు పడిపోయాయి. ఈ సంవత్సారాంతానికల్లా ఇవి 500 బిలియన్‌ డాలర్ల వరకూ పడిపోతాయని పోల్‌లో పాల్గొన్న ఆర్థికవేత్తలు అంచనా వేశారు. 2008 అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం తర్వాత విదేశీ మారకం ఇంతగా క్షీణించడం ఇదే ప్రథమం. ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్‌ చివరి నాటికి విదేశీ మారకపు నిల్వల్లో 67 శాతం క్షీణతకు అమెరికా డాలరు బలోపేతం కారణంగా విలువల్లో వచ్చిన మార్పులు, అమెరికా బాండ్లపై అధిక ప్రతిఫలాలే కారణమని శక్తికాంత దాస్‌ తెలిపారు. ఏప్రిల్‌ 2న 606.475 బిలియన్‌ డాలర్లుగా ఉన్న విదేశీ మారకపు నిల్వలు.. సెప్టెంబరు 23కు 537.5 బిలియన్‌ డాలర్లకు పరిమితమయ్యాయి. రూపాయి మారకపు విలువ ఇంత ఉండాలని ఆర్‌బిఐ నిర్దేశించడం లేదని, అయితే ఒడిదొడుకులకు లోనైప్పుడే జోక్యం చేసుకుంటున్నట్లు ఆయన స్పష్టం చేశారు. తగినంత విదేశీ మారకపు నిల్వలు కలిగి ఉండాలన్నదే లక్ష్యమని వివరించారు.

దేశ ఆర్థిక వ్యవస్థ సంక్షోభం ముంగిట్లో ఉన్నదా?… భారత్‌ మాంద్యంలోకి జారుకుంటున్నదా?.. గత రెండు నెలలుగా వెలుగులోకి వస్తున్న పరిణామాలు నిజమేనని చెప్తున్నాయి. ఓ వైపు దేశ జిడిపిలో 84 శాతానికి రుణ భారం చేరిందని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్‌) ప్రకటించింది. మరోవైపు అంతర్జాతీయంగా ఇండియా రుణ పరపతి ప్రమాదంలో పడిందని గ్లోబల్‌ క్రెడిట్‌ రేటింగ్‌ దిగ్గజ ఏజెన్సీ స్టాండర్డ్‌ అండ్‌ పూర్స్‌ హెచ్చరించింది. సెప్టెంబర్‌లో రిటైల్‌ ద్రవ్యోల్బణం వరుసగా 9వ నెల ఆర్‌బిఐ లక్ష్యాన్ని దాటి 7.4 శాతంగా నమోదైంది. ఆగస్టులో దేశ పారిశ్రామికోత్పత్తి సూచీ 18 నెలల కనిష్ఠాన్ని తాకుతూ మైనస్‌ 0.8 శాతానికి పరిమితమైంది. ఇవన్నీ భారత ఆర్థిక వ్యవస్థ.. మాంద్యం దిశగా నడుస్తున్నదన్న సంకేతాలనే ఇస్తున్నాయి. దీంతో భారతదేశ సావరిన్‌ క్రెడిట్‌ రేటింగ్‌ తగ్గే అవకాశముంది. దేశానికి వచ్చే విదేశీ పెట్టుబడుల ప్రవాహం తగ్గిపోతోంది. భారత్‌ తీసుకున్న రుణాల వడ్డీరేట్‌ పెరిగి పోతోంది. కేంద్ర ప్రభుత్వం చెప్తున్న ఆర్థిక పరిపుష్ఠి వట్టి అబద్దమని రుజువు చేసే సంకేతాలే ఇవన్ని.

రూపాయి పతనంతో దేశానికి ప్రమాదం :

రూపాయి రికార్డ్‌ పతనం భారతీయులందరిపై ప్రత్యక్షంగా.. పరోక్షంగా తీవ్ర ప్రభావం చూపనుంది. దిగుమతులు భారం అవుతాయి. దేశంలో చమురు, ఎలక్ట్రానిక్స్‌ తదితర దిగుమతి ఉత్పత్తుల ధరలు పెరుగుతాయి. అనేక ముడి సరుకుల ధరలకు రెక్కలు రావడంతో ద్రవ్యోల్భణానికి ఆజ్యం పోస్తాయి. విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించే భారత విద్యార్థుల కుటుంబాలపై అధిక భారం పడుతుంది. భవిష్యత్తులో ఇది మరింత క్షీణించొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. రూపాయి పతనంతో పరిశ్రమలు, సర్వీసు రంగంలో ఉత్పత్తి, ఉత్పాదకత క్షీణిస్తుంది. వ్యక్తులు, సంస్థలు దివాళా తీయడం సర్వసాధారణం అయిపోతుంది. రాష్ట్రాలు, కేంద్రం కూడా అప్పులు చెల్లించలేని పరిస్థితి దాపురిస్తుంది. వర్తక, వాణిజ్యం కుంటుపడుతుంది. అంతర్జాతీయ వాణిజ్యం కూడా దెబ్బతింటుంది. స్టాక్‌ మార్కెట్లు కుప్పకూలుతాయి. ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున నష్టపోతారు.

భారత్‌ ప్రపంచంలోనే అయిదో అతిపెద్ద బొగ్గు నిల్వలు ఉన్న దేశం. అయినా, గత ఆర్థిక సంవత్సరంలో రూ.2.5 లక్షల కోట్ల విలువైన బొగ్గును దిగుమతి చేసుకున్నాం. ఇండియా ప్రపంచంలోనే అతి పెద్ద పత్తి ఉత్పత్తిదారు. వ్యవసాయ ఉత్పత్తుల్లో భారత్‌ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దేశం. కానీ, పత్తి, వంట నూనెలు, పప్పుధాన్యాలు, పండ్లనూ భారీగానే దిగుమతి చేసుకుంటున్నాం. మనకున్న వనరులు, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా స్వదేశంలో ఉత్పత్తి పెంచడాన్ని విస్మరించి దిగుమతి చేసుకోవడమే సులభ మార్గమని భావిస్తున్నాం. దేశీయంగా భారీగా బొగ్గు నిల్వలు ఉన్నా, మన విద్యుత్‌ ప్లాంట్లకు నాణ్యమైన బొగ్గును అందించలేకపోతున్నాం. మైనింగ్‌ రంగంలో సాంకేతికతను మెరుగుపరచి, తగిన మౌలిక వసతులను కల్పించి ఈ సమస్యను అధిగమించవచ్చు.

భారత్‌లో పలు రకాల పండ్లను పండించడానికి అనువైన వాతావరణం ఉంది. ఈశాన్య రాష్ట్రాలు, హిమాలయ ప్రాంతాల్లో పండే పండ్లకు దేశీయంగా, అంతర్జాతీయంగా గిరాకీని పెంచడంలో పాలకులు విఫలమవుతున్నారు. విదేశాల నుంచి భారత్‌ దిగుమతులు ఏటేటా పెరుగుతున్నాయి. ఫలితంగా అధికమవుతున్న వాణిజ్యలోటు కరెంటు ఖాతాలోటు, క్షీణిస్తున్న రూపాయి విలువ పాలకుల్లో, ఆర్థికవేత్తల్లో, విధానకర్తల్లో తీవ్ర ఆందోళన రేపుతున్నాయి. మొదటి పంచవర్ష ప్రణాళిక కాలంలో భారత్‌ దిగుమతుల విలువ రూ.130 కోట్లు. 2021-22 నాటివి అవి దాదాపు రూ. 49.79 లక్షల కోట్లకు చేరాయి. ఒకవైపు ఇండియా ఎగుమతులు సైతం పెరుగుతున్నాయి. అయితే, దిగుమతులు-ఎగుమతుల మధ్య భారీ వ్యత్యాసం ఏటా అధికమవుతూనే ఉంది. అలా కాకుండా అనుత్పాదకమైన వాటిని, స్వదేశంలో ఉత్పత్తి చేసుకోగల అవకాశం ఉన్న వాటినీ దిగుమతి చేసుకోవడం సహేతుకం కాదు. కేంద్ర ప్రభుత్వ అనాలోచిత ఆర్థిక విధానాలతో దేశంలో ఇప్పటికే అధిక ధరలు బెంబేలెత్తిస్తున్న తరుణంలో విదేశీ కరెన్సీ క్షీణత ద్రవ్యోల్బణానికి మరింత ఆజ్యం పోయనుంది. ప్రజల ఆదాయం పడిపోనుంది. వస్తువులకు డిమాండ్‌ తగ్గనుంది.. అంతిమంగా ఇది తీవ్ర ఆర్థిక సంక్షోభానికి దారి తీయనుంది.

దేశంలో పారిశ్రామికోత్పత్తి ఢమాల్‌ :

దేశంలో పారిశ్రామిక ఉత్పత్తి పడకేసింది. నిరుద్యోగం పెరిగింది. పర్మినెంట్‌, కాంట్రాక్ట్‌… అందర్నీ ఉద్యోగాల నుంచి తీసేసి కార్పొరేట్‌, ప్రయివేట్‌ రంగం వేతనాల బిల్లును తగ్గించుకున్నాయి. లాభాలు పోగేసుకున్నాయి. నేడు దేశం నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, అధిక ధరలతో సతమతమవుతోంది. మోడీ సర్కార్‌ ఆర్థిక విధానాల ఫలితమిది. పన్ను ప్రయోజనాలు, రుణ సౌకర్యం, కార్పొరేట్‌ నిబంధనల్లో సడలింపులు ఇచ్చినా పారిశ్రామిక ఉత్పత్తి మెరుగుపడలేదు. ఫిబ్రవరి 2020లో పారిశ్రామిక ఉత్పత్తి సూచికలో వృద్ధి 5.2 శాతం నమోదు కాగా, ఆగస్టు 2022 నాటికి ‘మైనస్‌ 0.8’ శాతానికి చేరుకుంది. అప్పట్నుంచీ ఇప్పటివరకూ ఎన్నడూ పారిశ్రామిక ఉత్పత్తి మెరుగుపడలేదు. గనుల తవ్వకం, వస్తు ఉత్పత్తి, విద్యుత్‌ రంగాల్లో వృద్ధి దాదాపు స్తంభించింది. సుదీర్ఘకాలంగా (రెండేండ్లుగా) ఇది కొనసాగటం వల్లే నేడు దేశాన్ని అనేక సమస్యలు చుట్టుముట్టాయని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.

పారిశ్రామిక ఉత్పత్తి అత్యధిక జనాభా కలిగిన భారత్‌కు చాలా కీలకమైంది. ఇది నేరుగా ఉపాధి, వేతనాలు, ధరలను ప్రభావితం చేస్తుంది. ఇవన్నీ నేడు ఆందోళనకర స్థాయికి చేరుకున్నాయని ‘జాతీయ గణాంక కార్యాలయం’ (ఎన్‌ఎస్‌వో) విడుదల చేసిన సమాచారమే చెబుతోంది. ఉపకరణాల తయారీ, రబ్బర్‌, ప్లాస్టిక్‌ ఉత్పత్తులు ఇవన్నీ గణనీయంగా పడిపోయాయి. ఆహార ఉత్పత్తుల్లో వృద్ధి సున్నాకు చేరుకుంది. గనుల తవ్వకం ‘మైనస్‌ 3.9 శాతం’, వస్తు తయారీ ‘మైనస్‌ 0.7 శాతం, విద్యుత్‌ ఉత్పత్తి 1.4 శాతం వృద్ధి… నమోదు చేశాయి. వస్త్ర పరిశ్రమ, దుస్తుల తయారీ, తోలు, ఫార్మాస్యూటికల్స్‌ ఇవి మైనస్‌ రెండంకెల వృద్ధితో ఉన్నాయి. భారత్‌ ఎగుమతులన్నీ వీటితోనే ముడిపడి ఉన్నాయి. పారిశ్రామిక ఉత్పత్తి పడిపోతే.. ఎగుమతులు కూడా పడిపోతాయి. దిగుమతులు (పెట్రోల్‌, బంగారం, రసాయనాలు మొదలైనవి) పెరిగిపోయి, ఎగుమతులు పడిపోతే భారత్‌ లాంటి దేశానికి నష్టం లక్షల కోట్లలో ఉంటుంది. ఈ ఏడాదిలో కరెంట్‌ ఖాతా లోటు 13.4 బిలియన్‌ డాలర్ల నుంచి 24 బిలియన్‌ డాలర్లకు (ఆగస్టు నాటికి) చేరుకుంది. అయినా మోడీ సర్కార్‌కు అదేమీ పట్టడం లేదు. మనవద్ద ఉన్న డాలర్‌ నిల్వలు అడుగంటడం ప్రారంభించాయి.

ముగింపు :

ప్రపంచ వృద్ధి రేటు 2022లో 3.2 శాతం, 2023లో 2.7 శాతం ఉండవచ్చని ఐఎంఎఫ్‌ అంచనా వేసింది. ప్రపంచంలోని పెద్ద ఆర్థిక వ్యవస్థలన్నీ తిరోగమనాన్ని తలపించే రీతిలో మాంద్యం ఎదుర్కొంటున్నాయని పేర్కొంది. కొవిడ్‌-19 దీర్ఘకాలం ప్రపంచాన్ని అతలాకుతలం చేయడం, చైనాలో లాక్‌ డౌన్లు, ప్రాపర్టీ సంక్షోభం, రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా పెరిగిన ఇంధనం, ఆహార వ్యయాలు అన్ని దేశాల వృద్ది రేటును తీవ్రంగా ప్రభావితం చేసిన అంశాలని తేల్చి చెప్పింది. 2023 సంవత్సరంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మూడో వంతు కుంగిపోతుందని… ప్రధానంగా అమెరికా, యూరోపియన్‌ యూనియన్‌, చైనా ఆర్థిక వ్యవస్థలు వర్ధమాన దేశాల ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపుతాయని ఆ నివేదిక వివరించింది. అయితే, మన పాలకులు జిడిపి వృద్ధి రేటును, సగటు తలసరి ఆదాయం అంటూ రాగాలు తీస్తారు. సంపద పెరుగుదల అంటే పది మంది ఆస్తులు పెరగడం కాదు. ప్రతి మనిషి జీవితంలో గుణాత్మకంగా వచ్చిన మార్పు ఏమిటన్నది గీటు రాయిగా గుర్తించాలి.

సహజంగా వస్తువులకు గిరాకీ పెరిగి, సరఫరా తగ్గినప్పుడు ధరలు ఎగబాకుతాయి. మార్కెట్లో ద్రవ్య లభ్యత అధికంగా ఉన్నా కొనుగోలు విలువ పడిపోయి ధరలు పెరుగుతాయి. ధరలు అదేపనిగా పడిపోతూ ఉంటే ప్రతి ద్రవ్యోల్బణం లేదా డిప్లేషన్‌ అంటారు. కరెన్సీ మారక విలువ పడిపోయినప్పుడూ ద్రవ్యోల్బణం పెరుగుతుంది. భారత్‌లో అధికమవువుతున్న ద్రవ్యోల్బణం భవిష్యత్తును అనిశ్చితం చేస్తోంది. పోనుపోను ధరలు ఎలా ఉంటాయో తెలియనప్పుడు ఉత్పత్తి చేసే వస్తువులకు ధరలు నిర్ణయించడంలో కంపెనీలు ఇబ్బంది పడతాయి. ఉత్పత్తిని పెంచాలా తగ్గించాలా అన్నది తేల్చుకోలేకపోతాయి. ద్రవ్యోల్బణం మరింత ద్రవ్యోల్బణానికి దారితీస్తుందని అందరూ ఆందోళన చెందుతారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఆర్థిక వ్యవస్థలో ఏకకాలంలో ధరల పెరుగుదల, నిరుద్యోగంతో పాటు ఆర్థిక వృద్ధి క్షీణించి స్టాగ్‌ప్లేషన్‌ ఏర్పడే ప్రమాదం ఉంది.

మూడు థాబ్దాలుగా సామ్రాజ్యవాద ప్రపంచీకరణ ఆర్థిక విధానాల అమలు వల్లనే దేశానికి ఈ దుస్థితి దాపురించింది. 1991 నుండి మన పాలకులు ఈ విధానాలు అమలు చేస్తున్నా నరేంద్ర మోడీ గద్దెనెక్కాక మరింత వేగవంతమయింది. ఉదాహరణకు 2014 మే నెలలో మోడీ అధికారానికి వచ్చినప్పుడు ఒక డాలరుకు 58.75 రూపాయలు కాగా ఎనిమిదేళ్ల తరువాత అక్టోబర్‌ 19 నాటికి డాలుర విలువ రూ. 83.20కి పెరిగింది. ఎనిమిదేళ్లలో డాలరుతో రూపాయి విలువ 41.61 శాతం దిగజారిందన్న మాట. ఇదీ మోడీ పాలనా ఘనత! నిరుద్యోగ సమస్య, తక్కువ వేతనాలు, అధిక ధరలు, కొనుగోలు శక్తి పడిపోవటం వంటివి తీవ్రతరం అవుతున్నాయి. ఇందుకు కారణం కేంద్రం అనుసరిస్తున్న ఆర్థిక విధానాలేనని ఇప్పుడు రుజువైంది. నిరుద్యోగ సమస్య కొనసాగటం వల్ల తక్కువ వేతనాలతో మానవ వనరులు తమకు అందుబాటులోకి వస్తాయని కార్పొరేట్లు భావిస్తోన్నాయి. ఈ పరిస్థితి మారాలంటే ప్రభుత్వ ఆర్థిక విధానాలు మారాలి. కాని ఈ ప్రభుత్వం తనంతట తాను అందుకు పూనుకోదు కనుక ప్రజా ఉద్యమాలతో ఒత్తిడి తీసుకురావాలి. అది తప్ప వేరు దారి లేదు. ప్రజలు చైతన్యంతో మేల్కొనీ నిర్ణయాత్మకంగా వ్యవహరించాల్సిన సమయం ఆసన్నమైంది.

Leave a Reply