వాళ్ల భాష ఏమిటో
మనకు అర్థం కాదు
తలలు విదిలిస్తూ
చేతులు తిప్పుతూ
కళ్ళలో నిప్పులు కురిపిస్తూ
ఎదలు గుద్దుకుంటూ
దుమ్ము కొట్టుకుపోయిన దేహాల్తో
వాళ్ళు ఏమంటున్నారో తెలువదు.
చిన్నపిల్లలు సైతం
చేతుల జెండాలు పట్టుకుని
సైనికులకు ఎదురేగి
ఏమంటున్నారో తెలియదు
శిథిలాల మధ్య నిలిచి
ఒరిగిపోయిన సీకుకు
తన జెండానుగట్టి
ఆ తల్లి
ఏమని నినదిస్తున్నదో తెలియదు..
*
మొరాకో ,ఈజిప్ట్ , జోర్డాన్
కెనడా, బ్రిటన్ మలేషియాల్లో
వీధులు
జన సంద్రాలై పోటెత్తుతున్నాయి .
రాళ్లకు రాపిడైనట్లు
సముద్రం ఘోషించినట్లు
గుండెను డప్పు చేసి
మంటలతో మాట్లాడించే
వాళ్ళ భాషకు
అర్థ మేమిటో తెలువదు
అయితేనేం
భాషొక్కటి తెలవకపోతే
భావం జేరదా
నదులెక్కడ పారినా
ఘోష తెలవదా
కొండ గుండెల్లోంచి
జలపాతం ఉప్పొంగినట్లు
అన్ని భాషల్లోంచి
ఆవేశం పెగులుతోంది
ఇప్పుడు
ఎల్లలు దాటిన భాషలన్నీ
మౌనం వీడిన భాషలన్నీ
వినిపిస్తున్నదీ
ప్రపంచాన్ని కుదిపేస్తున్నదీ
ఒకే ఒక ఘోష ..
FREE PALESTINE..
30..11..23
Related