(ఈ వ్యాసం ఆజ్ తక్ మే రెండో వారం  సంచికలో అచ్చయింది . ఛత్తీస్ ఘడ్ లో క్షేత్ర పరిశీలన చేసి రాశారు. ఈ ప్రాధాన్యత రీత్యా  వసంత మేఘం పాఠకులకు దీన్ని  హిందీ నుంచి అనువదించి అందిస్తున్నాం. పాపులర్ జర్నలిజం లోని    అటు ఇటుకాని *సత్యాన్వేషణ*, పరస్పర వ్యతిరేక  వైఖరి,   కార్పొరేట్ల, పాలకుల   దృష్టి కోణం ఇందులో ఉన్నప్పటికీ కొన్ని నిజాలు కూడా ఉన్నందువల్ల దీన్ని ప్రచురిస్తున్నాం- వసంతమేఘం టీం )

*ప్రభుత్వ నలువైపుల దాడితో బలహీనపడ్డ మావోయిస్టులు; భద్రతా బలగాలు వైమానిక దాడి చేశాయని ఆరోపణ*

తేదీ ఏప్రిల్ 25 న  దర్భా డివిజన్‌లో మావోయిస్టులు ఉన్నట్లు దంతెవాడ పోలీసులకు సమాచారం అందడంతో 200 మంది ఛత్తీస్‌గఢ్ పోలీసులు, సీఆర్పీఎఫ్ జవాన్లను రాత్రికి రాత్రే దర్భకు పంపించారు. మరుసటి రోజు ఉదయం నిహారి అనే గ్రామానికి సమీపంలో పెట్రోలింగ్ బృందానికి మావోయిస్టులు ఎదురు పడడంతో జరిగిన కాల్పుల్లో ఇద్దరు అనుమానిత మావోయిస్టులకు బుల్లెట్ గాయాలు తగిలాయి. పోలీసు బృందం తమ చర్య ముగించుకుని గాయపడిన మావోయిస్టులను అరెస్టు చేసి దంతెవాడకు తిరిగి వస్తోంది.

అది అక్షయ తృతీయ రోజు. బస్తర్‌లో దీనిని ఆమ్-పండుం (మామిడి పండుగ)గా జరుపుకుంటారు. ఈ రోజున మామిడి పండ్లు కొనడానికి చిన్న పిల్లలు తమ పెద్దలను డబ్బులు అడుగుతారు. గత రాత్రి దర్భ వైపు వెళ్ళిన భద్రతా బలగం ఆ తోవనే తిరిగి రావాలి. భద్రతా బలగాలు వెళ్ళిన తర్వాత, అదే రోజు రాత్రి జాగరగుండ, దంతెవాడలను కలుపుతూ ఈ మధ్యనే వేసిన రోడ్డు మీద 40 నుంచి 50 కిలోల పేలుడు పదార్థాలను మావోయిస్టులు అమర్చారు.

ఆమ్-పండుం సందర్భంగా, రోడ్డు మీద వివిధ ప్రదేశాలలో ఏర్పాటు చేసిన తాత్కాలిక బారికేడ్‌లలో పండుగ కోసం గ్రామస్థులు ప్రతి ప్రయాణీకుడి నుంచి డబ్బు వసూలు చేస్తున్నారు. భద్రతా బలగాల కాన్వాయ్ అరన్‌పూర్ చేరుకోబోతుండగా, అలాంటి బారికేడ్ ఒకటి ఎదురైంది. అక్కడ వారి కంటే ముందు మరో మూడు-నాలుగు వాహనాలు ఆగి వున్నాయి. వాటిలో సాధారణ పౌరులు వున్నారు.

అక్కడ నుంచి ఒక కిలోమీటరు కూడా దాటకుండానే భద్రతా దళాల వాహనం ఒకటి ఐఇడి పేలుడుకు గురైంది. మావోయిస్టుల ప్రణాళికలో భాగంగానే ఆమ్-పండుం పోస్టు ఏర్పాటు చేశారని ప్రాథమిక విచారణలో అనుమానిస్తున్నారు. ఈ పోస్టులో మావోయిస్టులు సాధారణ గ్రామస్తుల్లా వున్నారు. ఈ ప్రాంతం అంతటా మొబైల్ నెట్వర్క్ పని చేస్తుంది. ఈ అవుట్‌పోస్టు వద్ద ఉన్న మావోయిస్టులు భద్రతా బలగాల కదలికలపై మొబైల్ ద్వారా సమాచారం అందించడం ద్వారా భద్రతా బలగాలు ప్రయాణిస్తున్న వ్యాన్‌ను లక్ష్యంగా చేసుకున్నారని చెబుతున్నారు.

ఇది ఛత్తీస్‌గఢ్ జిల్లా రిజర్వ్ గార్డ్ (డిఆర్‌జి) పోలీసు సిబ్బంది ఉపయోగించే ఒక ప్రైవేట్ వ్యాన్. డిఆర్‌జి అనేది 2008లో ఏర్పడిన ఛత్తీస్‌గఢ్ పోలీసు ప్రత్యేక విభాగం. ఆ తరువాత ఏడు మావోయిస్టు ప్రభావిత జిల్లాలలో (నారాయణపూర్, సుక్మా, దంతేవాడ, రాజ్‌నంద్‌గావ్, కంకేర్, బస్తర్, బీజాపూర్) వేర్వేరు సమయాల్లో ఏర్పాటు చేసారు. ఈ దాడిలో 10 మంది డిఆర్‌జి సిబ్బంది, ఒక డ్రైవర్ మరణించారు.

ఈ దుర్ఘటన తర్వాత భద్రతా లోపంపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పోలీసు మాన్యువల్ ప్రకారం, డిఆర్‌జి సిబ్బంది మోటారు సైకిళ్ళలను మాత్రమే వాహనాలుగా ఉపయోగించడానికి అనుమతి ఉంది. బైక్ కఠినమైన రోడ్లపై నడపడానికి మోటారు సైకిల్ అనుకూలంగా ఉంటుంది. ఐఇడి  పేలుడు సంభవిస్తే జరిగే నష్టం తక్కువగా ఉంటుంది. భద్రతా బలగాలు కదలికలో వున్నప్పుడు ప్రతి కాన్వాయ్ ముందు ల్యాండ్ మైన్‌లను గుర్తించే పరికరాలు ఉన్న రహదారి ప్రారంభ పార్టీ తప్పనిసరిగా వుండాలి. కానీ ఆ నియమం పాటించలేదు. దంతెవాడ నుంచి జాగరగుండ వరకు ఇటీవల నిర్మించిన రెండు వరుసల రహదారి ఇందుకు ఒక కారణం. ఈ రహదారిని నిర్మించిన తర్వాత, ఈ ప్రాంతాన్ని మావోయిస్టుల నుంచి విముక్తి పొందిన ప్రాంతంగా భావిస్తున్నారు. ప్రభుత్వం దీనిని పెద్ద విజయంగా పరిగణించింది, కానీ మావోయిస్టులు ఇంత పెద్ద హింసాత్మక చర్య చేపట్టడం వల్ల ప్రభుత్వ వాదనలు ప్రశ్నార్థకంగా మారాయి.

ఈ ఘటన తర్వాత, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ మావోయిస్టులపై ప్రభుత్వ పోరాటం చివరి దశలో ఉందని అందరికీ తెలిసిన ప్రకటన ఒకటి చేసారు. మరోవైపు, సీపీఐ (మావోయిస్టు) దర్భా డివిజన్ కమిటీ విడుదల చేసిన ఒక ప్రకటనలో ఇటీవల మావోయిస్టులపై జరిగిన వైమానిక దాడులకు నిరసనగా ఈ దాడిని చేసినట్లు పేర్కొంది.

మధ్య భారతదేశంలోని ఆదివాసీ  జనాభా అధికంగా ఉన్న ప్రాంతంలో నాలుగు దశాబ్దాల హింస- ప్రతిహింసల పరంపరకి తాజా లింకులు ఎక్కడ ఉన్నాయి? వాద, ప్రతివాదనల మధ్య వున్నవాస్తవం ఏమిటి? ఇండియా టుడే బృందం ఘటనజరిగిన 15 రోజుల క్రితమే ఆ ప్రాంతానికి వెళ్లింది. ప్రత్యక్ష పరీక్ష ద్వారా ప్రమాద మూలాలను జోడించడానికి, సందేహాలను తొలగించడానికి ప్రయత్నం చేసింది. పదండి – బీజాపూర్ లోని బాసగుడా గ్రామానికి వెళ్దాం.

ఏప్రిల్ 7 వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 1 గంట. ఉదయం బీజాపుర్ బయలుదేరినప్పుడు, ఇటీవల నిర్మించిన బీజాపుర్, జగర్‌గుండాలను కలిపే రహదారిని చూస్తూ డోర్నపాల్ వెళ్ళాలని మా ప్రణాళిక. అక్కడి నుంచి అబూజ్‌మడ్ ప్రాంతంలోని మెట్టాగుడా గ్రామానికి వెళ్లాలి. భద్రతా బలగాలు ఆదివాసీ ప్రాంతాలపై డ్రోన్లతో బాంబు దాడులు చేశారని గత జనవరిలో మావోయిస్టులు ఒక పత్రికా ప్రకటనలో ఆరోపించారు. ఘటనపై గ్రామస్తులను అడిగి తెలుసుకునేందుకు మెట్టగూడ వైపు వెళ్తున్నాం. బాసగూడ పోలీస్ స్టేషన్ ఎదుట ఉన్న పోలీసు చెక్‌పోస్టు దగ్గర మమ్మల్ని అడ్డుకున్నారు.

“మీరు లోపలికి వెళ్లకండి. అక్కడ ఆపరేషన్ జరుగుతోంది’’ అని బాసగూడ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్ఓ డి.కె. సింగ్ మమ్మల్ని హెచ్చరించారు. కానీ  ఎలాంటి ఆపరేషన్ అనేదాని గురించి ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. ఇంతలో, కొండపల్లికి సమీపంలోని కొన్ని గ్రామాలపై వైమానిక దాడులు జరిగాయని సీపీఐ (మావోయిస్ట్) సదరన్ సబ్ జోనల్ బ్యూరో అధికార ప్రతినిధి సమత విడుదల చేసిన ప్రెస్ నోట్ వాట్సప్‌లో రావడం మొదలైంది. ఈ ప్రాంతం బాసగూడ నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది.

2021 ఏప్రిల్ 5న గృహ మంత్రి అమిత్ షా సందర్శించిన ప్రదేశం బాసగూడ. జోనగుండలో నక్సలైట్ల దాడి తర్వాత జవాన్ల మనోధైర్యాన్ని పెంచేందుకు షా వచ్చారు. 2006-07లో మావోయిస్టులకు వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రభుత్వ ప్రాయోజిత ప్రైవేట్ మిలీషియా సల్వాజుడుం ఇక్కడ అనేక ఇళ్లను తగలబెట్టింది. ప్రస్తుతం, బీజాపూర్ నుండి జగర్‌గుండాను కలిపే రహదారిపై నిర్మించిన ప్రధాన క్యాంపులలో బాసగూడ ఒకటి. ఇందులో రెండువేలమంది మంది సిఆర్‌పిఎఫ్ సిబ్బంది ఉన్నారు. ఈ క్యాంపుకి దాని స్వంత హెలిప్యాడ్ ఉంది. షా హెలికాప్టర్ ఇక్కడే దిగింది.

బాసగూడ నుంచి కొండపల్లి వెళ్లే రోడ్డు ఎంత అధ్వానంగా ఉందంటే ఈ 30 కిలోమీటర్ల మార్గాన్ని దాటడానికి మాకు దాదాపు రెండున్నర గంటల సమయం పట్టింది. సాయంత్రం 5 గంటలకు కొండపల్లి చేరుకున్నాం. స్థానిక ఆదివాసీ కుటుంబం మమ్మల్ని ఆప్యాయంగా ఆహ్వానించింది. ఉదయం ఆరు నుంచి ఎనిమిది గంటల మధ్య చాలా పెద్దగా బాంబు పేలుళ్ల శబ్దం వినిపించిందని వారు చెప్పారు. అనేక బాంబులు పడ్డాయి కానీ ఈ బాంబు దాడి కారణంగా జరిగిన ప్రాణ, ఆస్తి నష్టం గురించి వారికి ఏమీ తెలియదు. మా రాక గురించి వార్తను ఓ గ్రామస్థుడి ద్వారా స్థానిక మావోయిస్టు నాయకత్వానికి తెలియజేశాం. రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో మా ముందు 5-7గురు వున్న బృందం ఒకటి మా ముందు నిలబడింది. చీకటి పడింది. ఇంట్లోంచి సోలార్ బల్బు వెలుగు వస్తోంది. అతను బల్బు వైపు తిరిగి మాతో మాట్లాడడంతో వెనుక నుంచి పడుతున్న వెలుతురు వల్ల అతని ముఖాన్ని స్పష్టంగా చూడలేకపోయాం. ఈ వ్యక్తి మావోయిస్టుల జనతన  ప్రభుత్వానికి స్థానిక నాయకుడు.

మావోయిస్టు సంస్థ నిర్మాణంలో స్పష్టమైన బాధ్యతల విభజన ఉంది. దానిలో ఒక విభాగం స్థానిక పరిపాలన బాధ్యతలను వహిస్తుంది. ఇందులోకి  స్థానిక స్థాయిలో జరిగే  సామూహిక వ్యవసాయం, జన తన   (ప్రజల)ప్రభుత్వం నిర్మించిన చెరువులు, పాఠశాలల బాధ్యత వుంటుంది. ఈ శాఖ గ్రామస్తుల నుండి నిర్ణీత లెవీని వసూలు చేస్తుంది. ఒక నెలలో ఒక వ్యక్తి ఒక రోజు సంపాదన పార్టీ ఖాతాలోకి వెళ్తుంది. మీ దగ్గర ఒక మోటార్ సైకిల్ ఉంటే, పార్టీకి సంవత్సరానికి రూ. 500 లెవీ చెల్లించాలి. ట్రాక్టర్ వుంటే సంవత్సరానికి లెవీ రూ.5,000.

ఈ ప్రాంతాల్లో అమలులో వున్న మూడంచెల పాలనా విధానంలో ఎన్నికైన సర్పంచ్‌లు కూడా ఉన్నారు. మావోయిస్టులు తమ ప్రభావం ఉన్న ప్రాంతాల్లో ఎన్నికలను బహిష్కరించడంతో ప్రతి పంచాయతీ నుంచి సర్పంచ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నారు. మావోయిస్టుల అంగీకారంతోనే ఈ పని జరుగుతుంది. ఏకగ్రీవంగా ఎన్నికైన ఈ సర్పంచ్‌లు సాధారణంగా అలంకారప్రాయంగా ఉంటారు. ఇక్కడ ప్రతి పరిపాలనా నిర్ణయాన్ని జనతన   ప్రభుత్వం నియమించిన ముఖ్యులు తీసుకుంటారు. అలాంటి ఒక నాయకుడు వచ్చీ రాని హిందీలో మాతో మాట్లాడాడు. మేము ఎటువంటి సమాచారం యివ్వకుండా మావోయిస్టుల ప్రాంతంలోకి ప్రవేశించామని తీవ్ర స్వరంతో అన్నాడు. మీరు ఇక్కడ నుండి ముందుకు వెళ్ళకూడదు, మర్నాడు ఉదయం పది గంటల కల్లా తిరిగి వెళ్లిపోవాలని ఆదేశించాడు. చాలాసేపు చర్చ జరిగిన తరువాత మా లేఖను ఉన్నత నాయకత్వం దగ్గరకు తీసుకెళ్లడానికి అంగీకరించాడు.

మరుసటి రోజు మధ్యాహ్నం 1 గంట వరకు మావోయిస్టుల నుండి కబురు కోసం ఎదురుచూశాక వెలిసిపోయిన ఆకుపచ్చ తువ్వాలు వేసుకున్న ఒక వ్యక్తి సైకిల్ మీద వచ్చాడు. అతను మావోయిస్టుల ఏరియా కమిటీ సభ్యుడు. ఇది మావోయిస్టుల సంస్థాగతనిర్మాణంలో రెండవ భాగం, వీటి కింద వారి యుద్ధ దళాలు వుంటాయి.

దూతగా వచ్చిన ఆ ఏరియా కమిటీ సభ్యుడు తన  పేరు సుధాకర్ అని చెప్పాడు. మావోయిస్ట్ కార్యకర్తలు తరచుగా బయటి వ్యక్తులకు మారుపేర్లను ఇస్తుంటారు కాబట్టి ఇది అతని అసలు పేరు అయి వుండకపోవచ్చు. మరుసటి రోజు అంటే ఏప్రిల్ 9 ఉదయం 11 గంటలకు కవర్‌గట్టాలో ఇటీవల జరిగిన డ్రోన్ దాడికి వ్యతిరేకంగా గ్రామస్తులు నిరసన ప్రదర్శన జరపబోతున్నారని, మేము ఈ నిరసనను కవర్ చేయవచ్చని సుధాకర్ చెప్పారు. కవర్‌గట్టా ఇక్కడికి 15 కి.మీ దూరంలో ఉంది.

మేము అక్కడికి చేరుకునేప్పటికి చుట్టు పక్కల  గ్రామాల నుండి వచ్చిన సుమారు వెయ్యి మందికి పైగా ఆదివాసీలు సమావేశమై ఉన్నారు. డ్రోన్ దాడులకు వ్యతిరేకంగా గోండి, హిందీ భాషల్లో నినాదాలు చేశారు. బీజాపుర్‌కు చెందిన 23 ఏళ్ల జగదీష్ అనే బి. ఎ. విద్యార్థి కూడా హాజరయ్యారు. ఏడవ తేదీ ఉదయం ఏం జరిగింది అనేది  జగదీష్ మాటల్లో- ”మేమంతా ఉదయాన్నే మహువా పూలను సేకరించడానికి వెళ్ళాము. 6 గంటల సమయంలో రెండు డ్రోన్లు వచ్చి అడవిలో బాంబులు కురిపించాయి. పేలుళ్ల శబ్దం విని మేము ఇళ్ల వైపు పరుగెత్తాము. ఆ తర్వాత ఎనిమిది గంటల సమయంలో రెండు హెలికాప్టర్లు వచ్చాయి. అవి చాలా సేపు కాల్పులు జరిపాయి. బాంబు పేలుడులో ఎవరూ గాయపడలేదు కానీ అందరూ భయాందోళనలో ఉన్నారు.”

డ్రోన్, హెలికాప్టర్ దాడుల గురించి చెప్పిన గ్రామస్తుల్లో ఎవరికీ కూడా ఏం నష్టం జరిగింది, ఎంత జరిగింది అనేది తెలియదు. మావోయిస్టుల ప్రకారం, గత మూడు సంవత్సరాలలో భద్రతా దళాలు వారిపై నాలుగు వైమానిక దాడులు జరిపాయి. జోనాగుడా – టేకుల్‌గూడెం ఎన్కౌంటర్ జరిగిన రెండు వారాల తరువాత 2021 ఏప్రిల్ 19 నుండి ఈ దాడులు ప్రారంభమయ్యాయి. జోనాగుడాలో మావోయిస్టులు భద్రతా బలగాలపై చేసిన మెరుపుదాడిలో 23 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన జరిగిన రెండు వారాల తర్వాత బిజాపూర్‌లోని పాలాగూడం, బోటాలంకా ప్రాంతాల్లో మావోయిస్టుల క్యాంపు మీద వైమానిక దాడులు జరిగాయనే విషయం బయటికి వచ్చింది.

ఈ ఘటన జరిగిన ఏడాది తర్వాత సుక్మా జిల్లాలోని మెట్టాగుడా, బోటెథోంగ్ గ్రామాల్లో భద్రతా దళాలు వైమానిక దాడులు చేశారని మావోయిస్టులు ఆరోపించారు. 2022 ఏప్రిల్ 14-15 మధ్య రాత్రి ఈ రెండు గ్రామాలపై డ్రోన్ల ద్వారా 12 కంటే ఎక్కువ బాంబులు వేసారని వారన్నారు. ఈ ఏడాది జనవరిలో మెట్టాగుడా, బోటెథాంగ్‌లలో మరోసారి వైమానిక దాడులు జరిగాయి. మీడియా నివేదికల ప్రకారం 2023 జనవరి 11న ఉదయం 11 గంటలకు డ్రోన్‌లు బాంబుల వర్షం కురిపించాయి.

అయితే భద్రతా బలగాలు ఈ ఆరోపణలను తిరస్కరించాయి. “మావోయిస్టులను అన్ని వైపుల నుండి చుట్టుముట్టేశాం. ఈ ఆరోపణలు వారి ప్రచారంలో భాగం. మా దగ్గర ఉన్న డ్రోన్లు శత్రువును గుర్తించగలవు అంతే. వాటి నుంచి బాంబులు వేయలేం. జనవరిలో, మా రెండు హెలికాప్టర్లు జవాన్లను ఫార్వర్డ్ ఆపరేటింగ్ బేస్‌కు తీసుకెళ్తున్నాయి. ఈ హెలికాప్టర్లపై మావోయిస్టులు కాల్పులు జరిపారు. మేము వారి దాడికి ప్రతిస్పందించాము. కానీ అప్పుడు కూడా బాంబు వేయలేదు”అని సీఆర్‌పిఎఫ్ ఛత్తీస్‌గఢ్ రేంజ్ ఐజి సాకేత్ కుమార్ సింగ్ అన్నారు.

మావోయిస్టులను చుట్టుముట్టేశామని  సింగ్ అంటున్నాడు కానీ దండకారణ్య, దక్షిణ బస్తర్‌లలో వారి విస్తరణ గాథ ఎంతో ఆసక్తికరంగా వుంది. 1980 లలో మావోయిస్టుల దళాలు గోదావరి నదిని దాటి దక్షిణ బస్తర్, దండకారణ్య ప్రాంతాల్లోకి ప్రవేశించాయి. అప్పటి వరకు ఇక్కడి ఆదివాసీలకు ప్రభుత్వం అంటే అటవీ శాఖనే. ఇక్కడ ఆదివాసీలలు నిరక్షరాస్యులుగా ఉండేవారు, తెందు ఆకు, ఇతర ఉత్పత్తులను కొనుగోలు చేసే వ్యాపారుల దోపిడీకి గురయ్యేవారు.

ఇది మావోయిస్టులకు అనుకూలమైన పరిస్థితి. మావోయిస్టులు ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశాలలోని ఆదివాసీ ప్రాంతాల్లో తమ స్థానాన్ని సంపాదించుకోగలిగారు. రాష్ట్రాల ఈ కూడలి స్థలం మావోయిస్టుల పురోగతికి అవసరమైన ఇతర మెరుగైన పరిస్థితులను కూడా కల్పిస్తోంది. మావోయిస్టులు ఒక రాష్ట్రంలో దాడులు చేసి మరొక రాష్ట్రంలోకి ప్రవేశించడంతో అక్కడ వారి జాడ కనుక్కోవడం కష్టమయ్యేది. మావోయిస్టుల ఈ వ్యూహాన్ని అడ్డుకునేందుకు తొలి ప్రయత్నం 2019లో ప్రారంభమైంది.

ముర్కుట్‌దోహ్ అనే గ్రామం మధ్యప్రదేశ్-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో మహారాష్ట్రలోని గోండియా జిల్లాలో ఒక కొండపై ఉన్న ఆదివాసీ గ్రామం. ఇక్కడ 2019 ప్రారంభంలో భద్రతా దళాల కదలిక ప్రారంభమైంది. గతంలో ఈ ప్రాంతం మావోయిస్టులకు సురక్షితమైన ఆశ్రయం. భద్రతా దళాలు ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించినప్పుడు ఇక్కడకు చేరుకోవడానికి దారి కూడా లేదు. కానీ 2019 నవంబర్ నాటికి వారు తమ బలమైన కోటను ఏర్పాటు చేసుకున్నారు. ఈ రోజు ఈ స్థలాన్ని ముర్కుట్‌దోహ్ క్యాంపు అంటారు. 

ముర్కుట్‌దోహ్ క్యాంప్ అనేది ఒక ప్రత్యేకమైన ప్రయోగం. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌ పోలీసుల సంయుక్త బృందం ఇక్కడ పని చేస్తోంది. దీంతో పాటు మూడు రాష్ట్రాల్లోనూ నక్సల్స్ వ్యతిరేక చర్యల కోసం ఏర్పాటు చేసిన స్పెషల్ ఫోర్స్ సైనికులను కూడా ఇక్కడ మోహరించారు. మేము అక్కడికి చేరుకున్న రోజు వారపు సంత జరుగుతోంది. క్యాంపు నుండి కేవలం 30 అడుగుల దూరంలో ఉన్న సంతలో పండ్లు-కూరగాయలు, ఇతర అవసర వస్తువులు అందుబాటులో ఉన్నాయి. సంతలో దుకాణం పెట్టుకొనే ప్రతి దుకాణదారుడు ఇక్కడి సైనికులకు సుపరిచితుడు. వారి  ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకుంటున్నారు. అక్కడ కూచున్న ఒక జవాను దినేష్ కుమార్ ఈ క్యాంపు ప్రారంభ దినాల విషయాలు చెప్పడం మొదలుపెట్టాడు. “అప్పుడు ఇక్కడ మావోయిస్టుల మాటే చెల్లేది. మేము పెట్రోలింగ్‌కి వెళ్లినప్పుడు గ్రామస్తులు నీళ్ళు యివ్వడానికి కూడా సిద్ధపడేవారు కాదు. మెల్ల మెల్లగా మేము వారి విశ్వాసాన్ని పొందాము. ఇవాళ వాళ్ళు మమ్మల్ని పెళ్లిళ్లు లేదా యితర శుభ కార్యాలకు పిలుస్తారు.

మధ్య ప్రదేశ్ లోని సరిహద్దు గ్రామం కట్టీపార్ ఇక్కడ నుంచి 15 కిలో మీటర్ల దూరంలో వుంటుంది, ఛత్తీస్‌ఘడ్‌కు చెందిన కాటెమా సుమారు ఆరు కిలో మీటర్ల దూరంలో వుంటుంది. ముర్కుటదోహ్ క్యాంపులో మూడు రాష్ట్రాలకు చెందిన పోలీసులు వున్నారు. “మేము ఏ రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలోనైనా సెర్చి ఆపరేషన్ చేయవచ్చు. ఈ క్యాంపువల్ల మావోయిస్టులు ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి వెళ్ళడం అనేది దాదాపు ఆగిపోయింది. ఈ ప్రాంతంలో క్రియాశీలంగా వుండిన మావోయిస్టు నేతలు అబూజ్‌మడ్ వైపు వెళ్ళిపోయారు” అని  క్యాంపు ఇంచార్జీ వివరించాడు.

మహారాష్ట్రలోని చంద్రాపూర్, గడ్చిరోలి, గోండియా, భండారా అనే నాలుగు జిల్లాల్లో మావోయిస్టులు ఒకప్పుడు తమ సమాంతర అధికారాన్ని నడిపేవారు. కానీ గత కొన్నేళ్లుగా మావోయిజం మహారాష్ట్రలో గఢ్చిరౌలీ, గోండియా జిల్లాల సరిహద్దు ప్రాంతాలకు పరిమితమైంది.

మావోయిజాన్ని ఎదుర్కోవడంలో మహారాష్ట్ర మోడల్ గురించి చాలా చర్చ జరుగుతోంది. ఒకదాని తర్వాత ఒకటి పోలీసు క్యాంపులను తెరుస్తూ మావోయిస్టు ప్రాంతాల్లో మహారాష్ట్ర పోలీసులు తమ పట్టును పటిష్టం చేసుకున్నారు. గ్రామాలను రహదారులతో అనుసంధానం చేసేందుకు పనులు చేపట్టారు. పోలీసుల తరపున ‘దాదా లోరా ఖిడ్కీ’ పథకం నడిచింది. ఈ పథకం కింద మావోయిస్టు ప్రాంతాల్లోని ఓపెన్ పోలీస్ క్యాంపులను ప్రభుత్వ పథకాల అమలు కోసం సింగిల్ విండోగా మార్చారు. ఏ గ్రామస్థుడైనా ఆధార్ కార్డు, మార్కు షీట్, రేషన్ కార్డు వంటి ప్రభుత్వ పత్రాలను ఇక్కడ నుంచి పొందవచ్చు. ఏదైనా ప్రభుత్వ పథకానికి అర్హులైన వ్యక్తికి ఆ పథకం ప్రయోజనం అందేందుకు సహాయం చేస్తారు.

ఛత్తీస్‌గఢ్‌లో కూడా ఈ ప్రయోగాన్ని పునరావృతం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ మొత్తం మోడల్‌ను సులభమైన భాషలో క్యాంప్-రోడ్-క్యాంప్ మోడల్ అని పిలుస్తారు. అంటే ఒక సీఆర్‌పిఎఫ్ క్యాంపుకి కొన్ని కిలోమీటర్ల దూరంలో మరో కొత్త క్యాంపు ప్రారంభమవబోతోందని అర్థం చేసుకోవచ్చు. సీఆర్‌పిఎఫ్ జవాన్ల పర్యవేక్షణలో రెండు క్యాంపుల మధ్య రోడ్డును వేస్తారు. అంటే రోడ్డు చివరకు చేరుకోగానే మరో క్యాంపు వుంటుంది. మావోయిస్టులకు వ్యతిరేకంగా ఈ కొత్త వ్యూహపు మొదటి ప్రయత్నం మనల్ని 2015 సంవత్సరానికి తీసుకువెళుతుంది.

ఆ సంవత్సరం  కేంద్ర ప్రభుత్వం మావోయిజానికి వ్యతిరేకంగా తన వ్యూహంలో పెద్ద మార్పు చేసింది. వామపక్ష తీవ్రవాదానికి వ్యతిరేకంగా అప్పటి గృహమంత్రి రాజ్‌నాథ్ సింగ్ కొత్త జాతీయ విధానం, కార్యాచరణ ప్రణాళికలను ఆరంభించాడు. నూతన విధానంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం 2016లో 11,724.53 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వం కొత్త వ్యూహాన్ని రూపొందిస్తూనే ఉంది. మరో పక్క సుక్మా లోని బుర్కాపాల్ లో జరిగిన నక్సల్ దాడి అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది.

2017 మే 8వ తేదీనాడు బుర్కాపాల్ లో జరిగిన నక్సల్స్ దాడిలో 25 మంది సిఆర్ పిఎఫ్ జవాన్లు మరణించిన రెండు వారాల తరువాత, మావోయిజం వ్యతిరేకంగా కొనసాగుతున్న సమగ్ర భద్రత, అభివృద్ధి కార్యక్రమాన్ని సమీక్షించడానికి అప్పటి గృహ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మావోయిజానికి వ్యతిరేకంగా పోరాడటానికి “సమాధాన్ (SAMADHAN-పరిష్కార) సూత్రం” రూపొందించారు. రాజ్ నాథ్ సింగ్ సమాధాన్ అనే పదానికి ఇలా వివరణ ఇచ్చారు.

ఎస్ అంటే స్మార్ట్ నాయకత్వం, ఎ అంటే (అగ్రెసివ్)దూకుడు విధానం, ఎమ్ అంటే ప్రేరణ- శిక్షణ (మోటివేషనల్ ట్రైనింగ్), ఎ అంటే యాక్షనబుల్ ఇంటెలిజెన్స్, డి అంటే డాష్బోర్డ్ కెపిఐ (కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్-కీలక పనితీరు సూచికలు), కెఆర్ఏ (కీ రిజల్ట్ ఏరియా-కీలక ఫలితాల ప్రాంతం), హెచ్ అంటే హార్నేసింగ్ టెక్నాలజీ (సాంకేతికత నియంత్రణ), ఎ అంటే యాక్షన్ ప్లాన్ ఫర్ ఎవ్రి థియేటర్(ప్రతి రంగానికి కార్య ప్రణాళిక), ఎమ్ అంటే నో యాక్సెస్ టు ఫైనాన్స్ (డబ్బు అందుబాటులో లేకుండా చేయడం).

రాజ్ నాథ్ సింగ్ మావోయిస్టులకు వ్యతిరేకంగా తీసుకున్న పరిష్కారం ఆ తరువాతి సంవత్సరాల్లో ప్రభావం చూపడం ప్రారంభించింది. మహారాష్ట్ర మాదిరిగానే ఇతర నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో క్యాంప్ – రోడ్ – క్యాంప్ వ్యూహంపై పని ప్రారంభమైంది. ఛత్తీస్‌గఢ్ లోని ఏడు నక్సల్ ప్రభావిత జిల్లాల్లోనూ వేగంగా రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి.

ఈ జిల్లాల్లో సుమారు 2,500 కిలోమీటర్ల పొడవు రోడ్లు నిర్మించాల్సి ఉంది. అయితే రోడ్డు నిర్మాణం అనుకున్న  దానికంటే చాలా నెమ్మదిగా సాగుతోంది. అయినప్పటికీ, ‘క్యాంప్ – రోడ్ – క్యాంప్’ విధానం కింద భద్రతా బలగాలు ఐదు సంవత్సరాల క్రితం వరకు మావోయిస్టుల బలమైన స్థావరంగా భావించిన ప్రాంతాలకు చేరుకోగలిగాయి. అలాంటి ప్రదేశాల్లో ఒకటి దంతెవాడలోని జగర్‌గుండా గ్రామం.

జగర్‌గుండా మావోయిస్టు ప్రభావిత జిల్లాలైన బీజాపుర్, సుక్మా, దంతెవాడలకు కేంద్రంగా ఉంది. ఈ శతాబ్దం మొదటి దశాబ్దం మధ్యలో మావోయిస్టులు ఈ ప్రాంతాన్ని పూర్తిగా ఆక్రమించుకున్నారు. ఇది దక్షిణ బస్తర్‌లో మావోయిస్టుల రాజధాని అని పిలిచేవారు. బీజాపూర్, దంతెవాడ, సుక్మాలకు జగర్‌గుండాను అనుసంధానం చేయడం, క్యాంప్-రోడ్- క్యాంప్ వ్యూహానికి మొదటి పరీక్ష.

 సుక్మా జిల్లాలోని డోర్నాపాల్ నుండి జగర్‌గుండా మధ్య 58 కిలోమీటర్ల రహదారిని మరణపు ఉరి అని పిలిచేవారు. మావోయిస్టుల హింసాత్మక ఘటనలు ఈ రోడ్డుమీదే ఎక్కువగా జరిగాయి. 2010లో ఈ రహదారిపై తాడ్‌మెట్లాలో మావోయిస్టులు జరిపిన అతిపెద్ద దాడిలో 76 మంది, 2017లో ఇదే రహదారి వెంట ఉన్న బుర్కాపాల్ లో 25 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు మరణించారు. 2020లో మిన్పాలో జరిగిన నక్సల్ దాడిలో ఛత్తీస్‌గఢ్ పోలీసుల యాంటీ నక్సల్ ఫోర్స్ డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్‌లు 17 మంది ప్రాణాలు కోల్పోయారు.

డోర్నాపాల్ నుండి జగర్‌గుండా వరకు భద్రతా దళాలకు ఈ రహదారి నిర్మించడం కష్టతరమైన పనిగా అవుతోంది. 58 కిలోమీటర్ల నిర్మాణంలో కూడా చివరి దశ పని మిగిలి ఉంది. సిఆర్ పిఎఫ్ ఇటీవల మిన్పాలో కొత్త శిబిరాన్ని ప్రారంభించింది. ఈ 58 కిలోమీటర్ల రహదారిలో ప్రారంభమైన 12వ శిబిరం ఇది. ఈ రహదారిపై ఆరు కొత్త పోలీస్ స్టేషన్లు కూడా వున్నాయి.

అదేవిధంగా, జగర్‌గుండాను బీజాపూర్‌తో అనుసంధానించడానికి, భద్రతా దళాలు చాలా కష్టపడాల్సి వచ్చింది. దీనికి కారణం కేవలం మావోయిస్టు హింస మాత్రమే కాదు. వాస్తవానికి రోడ్డు నిర్మాణానికి వ్యతిరేకంగా ఈ ప్రాంతంలో అనేక ఆందోళనలు జరిగాయి. వీటిలో ఎక్కువ కాలంగా నడుస్తున్న ఉద్యమం సిలంగేర్. ఆదివాసీలు ఇప్పటికీ ఈ రహదారిపై నిరసనలు చేస్తున్నారు. బాసగూడ నుంచి జగర్‌గుండా మధ్య నిర్మిస్తున్న రోడ్డు పనులు చివరి దశలో ఉన్నాయి. ఈ 33 కిలోమీటర్ల పొడవైన రహదారిని నిర్మించడానికి సిఆర్పిఎఫ్ ఎనిమిది క్యాంపులను పెట్టాల్సి వచ్చింది.

దంతెవాడ నుండి జగర్‌గుండా దూరం 74 కిలోమీటర్లు. ఈ రహదారి నకుల్నార్ నుండి అరణ్పూర్ గుండా జగర్‌గుండాకు వెళ్ళాలి. అరణ్పూర్ నుండి జగర్‌గుండా మధ్య 18 కిలోమీటర్ల రహదారి భద్రతా దళాలకు ఒక సాహసయాత్ర లాంటిది. ఈ రహదారిని నిర్మించే సమయంలో 500 బూబీ ట్రాప్స్ (బాంబులను దాచిపెట్టిన సామాగ్రి), వందకు పైగా ఐఈడీలను కనుగొన్నారు.

ఇక్కడ 18 కిలోమీటర్ల మేర మొత్తం ఐదు సీఆర్పీఎఫ్ క్యాంపులను ప్రారంభించారు. ఈ రహదారి నిర్మాణ సమయంలో, నక్సలైట్లు వివిధ సమయాల్లో నిర్మాణ సామగ్రిని తీసుకువెళుతున్న 50కి పైగా వాహనాలకు నిప్పు పెట్టారు. పది మందికి పైగా జవాన్లు మరణించారు. రోడ్డు నిర్మాణానికి అయ్యే ఖర్చుతో పోలిస్తే రోడ్డు రక్షణకు మూడు రెట్లు ఎక్కువ ఖర్చు అవుతుంది. ఈ 18 కిలోమీటర్ల రహదారిని పూర్తి చేయడానికి మొత్తం రూ.100 కోట్లకు పైగా ఖర్చు చేశారు.

రోడ్డు నిర్మాణం తరువాత ఈ ప్రాంతం మొత్తం మావోయిజం ప్రభావం నుండి విముక్తి పొందింది. గత నాలుగేళ్లలో బస్తర్ లోని 2,710 నక్సల్స్ ప్రభావిత గ్రామాల్లో 589 గ్రామాలను మావోయిస్టుల నుంచి విముక్తి చేసినట్లు 2023 జనవరి 12న బస్తర్ రేంజ్ ఐజి పి సుందరాజ్ మీడియాతో చెప్పారు. గత నాలుగు సంవత్సరాలలో భద్రతా దళాలు నక్సల్స్ ప్రభావిత ఏడు జిల్లాల్లో 54 కి పైగా క్యాంపులను ఏర్పాటు చేశాయి. ఇంద్రావతి నదిపై మూడు పెద్ద వంతెనల నిర్మాణం కొనసాగుతోంది. ఈ వంతెనలు పూర్తయిన తర్వాత భద్రతా బలగాలకు మావోయిస్టుల చివరి కోట అయిన అబూజ్‌మడ్‌లోకి ప్రవేశించడం సులభతరం అవుతుంది.

ఈ రోడ్ల నిర్మాణం వల్ల పొరుగు రాష్ట్రాల్లో మావోయిస్టుల కదలికలు కొంతమేరకు తగ్గిన మాట వాస్తవమే. జార్ఖండ్‌లో కూడా, మావోయిస్టుల పురాతన కోట అయిన బుధా పహార్‌nu రెండు దశాబ్దాల తర్వాత ఆపరేషన్ ఆక్టోపస్‌ను అమలు చేయడం ద్వారా మావోయిస్టుల నుండి విముక్తి చేసారు. ఇప్పుడు అక్కడ సిఆర్‌పిఎఫ్ క్యాంపులు తెరిచారు. సర్వత్రా ఒత్తిడి కారణంగా, మావోయిస్టులు తమ స్థావరాన్ని మార్చుకోవలసి వచ్చింది, కానీ ఈ వాస్తవాలన్నీ మావోయిజం క్షీణించటం గురించి పూర్తి చిత్రాన్ని ఇవ్వడంలేదు.

ఇటీవల అరన్‌పూర్‌లో జరిగిన దాడి క్యాంపు-రోడ్-క్యాంపు వ్యూహంపై ప్రశ్నార్థకమైంది. గత జనవరిలో చింతల్నార్-మోరపల్లి రహదారిపై రోడ్డు నిర్మాణం పనిలో వున్న రెండు వాహనాలను మావోయిస్టులు తగులపెట్టారు. ఇటీవలే నిర్మించిన ఈ రహదారులు మావోయిస్టుల రవాణాను నిరోధించాయి. కానీ మీరు రహదారిని విడిచిపెట్టి రెండు కిలోమీటర్ల దూరం లోపలికి ప్రవేశించిన వెంటనే వారి ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ఏడాది ఫిబ్రవరి రెండవ వారంలో మావోయిస్టులు ముగ్గురు స్థానిక బిజెపి నాయకులను హత్య చేశారు.

బీజాపూర్-జాగర్గుండ మధ్య ఉన్న అతిపెద్ద గ్రామం బాసగూడ. ఇక్కడ సీఆర్‌పీఎఫ్‌ క్యాంపు, పోలీస్‌స్టేషన్‌ ఏర్పాటు చేసి రెండేళ్లకు పైగా అయ్యింది. పోలీసులు, సీఆర్‌పీఎఫ్‌ సిబ్బంది ఉన్నప్పటికీ మావోయిస్టులకు మాత్రం డబ్బులు ఇస్తూనే ఉన్నామని ఇక్కడి వారానికోసారి వచ్చే ఓ చిరు వ్యాపారి తెలిపారు. మావోయిస్టులు తమదైన రీతిలో లెవీ సొమ్మును వసూలు చేస్తారు. రోడ్డు నిర్మాణం తర్వాత కూడా మావోయిస్టుల ఆర్థిక స్థితిపై పెద్దగా ప్రభావం చూపలేదు.

అటువంటి పరిస్థితిలో, ఈ ప్రాంతాల్లో మావోయిజం ప్రభావం లేదని ఎలా పరిగణిస్తాం? అనే ప్రశ్నకు బీజాపూర్ ఎస్పీ ఆంజనేయవర్ష్ణే స్పందిస్తూ.. ‘ఆ ప్రాంతంలో మావోయిస్టులు ఉనికిలోకి వచ్చి మూడు దశాబ్దాలు దాటింది. మేము అక్కడికి చేరుకుని మూడేళ్లు కూడా కాలేదు. ఇప్పటికి కూడా ప్రజల మదిలో మావోయిస్టుల భయం పూర్తిగా పోలేదు. దీనికి కొంత సమయం పడుతుంది. సామాన్యులకు భద్రత కల్పించి వారి విశ్వాసాన్ని చూరగొనేందుకు పోలీసులు అన్ని విధాలా కృషి చేస్తున్నారు. త్వరలో మావోయిస్టుల ఆర్థిక వనరులను కూడా అరికడతామని ఆశిస్తున్నాం” అన్నారు.

ప్రజల విశ్వాసాన్ని చూరగొనడం గురించి  ఆంజనేయ మాట్లాడుతున్నాడు. కానీ క్యాంపు-రోడ్-క్యాంపు వ్యూహం ఆదివాసీలలోని ఒక వర్గాన్ని సందేహంలో పడేసింది. మావోయిజానికి వ్యతిరేకంగా ఈ నమూనా మహారాష్ట్ర నుండి ప్రారంభమైంది. దీనికి సంబంధించిన చిక్కులను అర్థం చేసుకోవడానికి మనం మహారాష్ట్రను కూడా చూడాలి.

మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలోని తోడ్‌గట్టా గ్రామం. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో ఉన్న చివరి గ్రామం ఇదే. ఇక్కడ నుండి ఒకటిన్నర కిలోమీటరు దూరం ప్రయాణించిన తర్వాత మీరు ఛత్తీస్‌గఢ్‌లోని మొదటి గ్రామమైన మెండ్రీకి చేరుకుంటారు. తోడ్‌గట్టా చేరేసరికి సాయంత్రం నాలుగయింది. చాలా మంది గ్రామస్తుల గుంపులుగా గ్రామం వైపు వెళ్తున్నారు. తోడ్‌గట్టాలో కొనసాగుతున్న ఆదివాసీల నిరసన ప్రదర్శనలో షిఫ్టు మార్చే సమయం అయిందని స్థానిక గైడ్ అడ్వకేట్ లాల్సు నాగోటి అన్నారు. ఇక్కడ గత నెలన్నర రోజులుగా ఆదివాసీల లు రోడ్డునిర్మాణానికి వ్యతిరేకంగా  నిరసన తెలియచేస్తున్నారు. నిరసనకు కారణం ఈ ప్రాంతం గుండా వెళ్లే రహదారి.

ఈ ప్రదర్శనకు నాయకత్వం వహిస్తున్న మాదియా తెగ నుండి వచ్చిన లాల్సు పంచాయితీ సమితి సభ్యుడు. “ఛత్తీస్‌గఢ్‌లోని బంగేటూరి వరకు నాలుగు లైన్ల రహదారిని నిర్మించారు. ఇప్పుడు ఈ రహదారిని తొడగట్ట మీదుగా ఎటపల్లికి అనుసంధానం చేయాలనే ప్రతిపాదన ఉంది. అయితే ఈ గ్రామీణ  ప్రాంతంలో నాలుగు లైన్ల రోడ్డు మా మంచికోసమే నిర్మిస్తున్నారా? లేదు, దామ్‌కుంద్‌వాహి కొండలపై ఉన్న ఇనుప ఖనిజాన్ని తీసుకెళ్లడానికే ఈ ఆటంతా. ఈ ప్రాంత ఆదివాసీల పట్ల ప్రభుత్వానికి నిజంగా శ్రద్ధ ఉంటే బహుశా రోడ్డు నిర్మాణానికి బదులు ఇక్కడ ముందుగా పాఠశాల, ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించి ఉండేవారు” అని అన్నాడు.

తొడగట్ల ప్రదర్శనలో పాల్గొనేందుకు దాదాపు యాభై గ్రామాల ప్రజలు తరలివచ్చారు. ఇందులో 26 ఏళ్ల రాకేష్ ఆలం కూడా ఉన్నాడు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ప్రస్తుతం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. ఆయన మాట్లాడుతూ, “రోడ్లు నిర్మిస్తున్న వేగాన్ని చూస్తుంటే , పాత రోజులు మళ్లీ తిరిగి వస్తాయేమోననే భయం వేస్తోంది. అనేక తరాల ఆదివాసీలు దోపిడీకి గురయ్యారు.  వారి హక్కులు వారికి తెలియవు. అప్పుడు అటవీ, పోలీసు శాఖల వారు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరించేవారు.

ఛత్తీస్‌గఢ్-మహారాష్ట్రలోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో 30కి పైగా చోట్ల రోడ్డు నిర్మాణానికి వ్యతిరేకంగా ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. ఈ ప్రదర్శనల విషయంలో ప్రభుత్వాలు అయోమయ స్థితిలో ఉన్నాయి. వీరిపై మరింత బలప్రయోగం జరిగితే సల్వాజుడుం కాలం నాటి మాదిరిగానే సామాన్యుల సానుభూతి మావోయిస్టుల వైపు వెళ్లే అవకాశం ఉంది. మరోవైపు రోడ్డు నిర్మించకుండా మావోయిస్టు ప్రాంతాలకు చేరుకోవడం ప్రభుత్వానికి అంత సులభం కాదు.

ప్రస్తుతం మధ్య భారతంలో మావోయిస్టులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. వారు తమ చాలా భూభాగాన్ని కోల్పోయారు. మరోవైపు రోడ్డునిర్మాణ వ్యతిరేక ఉద్యమాలు, మావోయిస్టుల నుండి ఎదురవుతున్న సవాలు కారణంగా రోడ్డు నిర్మాణ పనులు ఆశించినంత వేగంగా సాగడం లేదు, క్యాంపు-రోడ్-క్యాంపు వ్యూహం కూడా అంత ప్రభావవంతంగా కనిపించడం లేదు. వాద, ప్రతివాదనల మధ్య ఈ నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాల్లో పోరాటం సుదీర్ఘంగా కొనసాగుతుందనేది వాస్తవం.

“కేంద్ర ప్రభుత్వం గత రెండు దశాబ్దాల నుంచి మావోయిస్టులకు వ్యతిరేకంగా చర్యలు చేపడుతోంది కాన్ని సఫలమవడం లేదు. అది ఒక రాజకీయ సమస్య అనీ, చర్చల ద్వారానే పరిష్కారమవుతుందనీ మేము ఎప్పుడూ చెబుతూనే వున్నాం.”

– నారాయణ రావు, కార్యదర్శి, పౌర హక్కుల సంఘం

https://www.aajtak.in/india-today-hindi/cover-story/story/jamin-bachane-ki-ladai-1690612-2023-05-09

Leave a Reply