ప్రముఖ కథా, నవలా రచయిత ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి మే 22న మృతి చెందారు. ఆయన కథ, నవల, సాహిత్య విమర్శ, సంపాదకత్వం వంటి అనేక ప్రక్రియల్లో విరివిగా పని చేశారు. విశ్వవిద్యాలయ అధ్యాపకుడిగా వృత్తి సంబంధమైన పనుల్లో కూడా ఆయన ప్రత్యేకత ఉన్నది.  ఆయన సుదీర్ఘ సాహిత్య జీవితంలో అనేక ఉద్యమాలు, వాదాలు వచ్చినా ఆయన నేరుగా వాటితో ప్రభావితం కాలేదు.  తన తొలినాళ్ల గ్రామీణ జీవితానుభవం ఆయన కాల్పనిక రచనలకు చోదకంగా పని చేసింది. అక్కడి నుంచే ఆయన ప్రపంచంలో జరుగుతున్న చాల పరిణామాలను చూశారని ఆయన కథలనుబట్టి చెప్పవచ్చు. అట్లా రాయలసీమ ప్రాదేశిక జీవితానుభవం, అక్కడి సాంస్కృతిక ప్రత్యేకతలు, సామాజిక జీవిత సంఘర్షణ ఆయన సాహిత్యాన్ని నడిపించాయి. అందుకే కేతు విశ్వనాథరెడ్డి అనగానే రాయలసీమ గుర్తుకు వస్తుంది.  నేరుగా  ఆ ప్రాంత ఇతివృత్తం లేని కథలు కూడా ఆయన మొదటి నుంచీ రాస్తూ వచ్చారు.  అభ్యుదయ దృక్పథం వల్ల తొలి రోజుల నుంచే స్త్రీల, దళితుల, బహుజనుల జీవన వైరుధ్యాలను కూడా చిత్రించారు.

            కడప జిల్లాలో రాచమల్లు రామచంద్రారెడ్డిలాంటి వారి వల్ల ఏర్పడి ఉన్న సాహిత్య, రాజకీయ వాతావరణం ఆయన ప్రాదేశిక దృష్టికి ప్రగతిశీల చైతన్యాన్ని అందించాయి. అందువల్ల ఆయన రాయలసీమ భూస్వామ్య, మొరటు మానవ సంబంధాల్లో చిక్కుకపోయిన  ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక జీవితాన్ని విమర్శనాత్మకంగా చూడగలిగారు. అలాంటి జీవితంలో కూడా మానవుల సౌహార్దృతను, వివేకాన్ని ఎత్తి చూపించారు. యథాతధ స్థితిగా బైటికి కనిపిస్తున్నప్పటికీ అందులోని చలనాలను పట్టుకోగలిగారు. అందువల్లే ఆయన ఒక పక్క ఫ్యూడల్‌ ఫ్యాక్షనిజాన్ని  చిత్రిస్తూనే ఇంకో పక్క అందులోని ప్రగతిదాయక మార్పులను చూపించారు. ఈ రెండు రకాల చలనాల మధ్య సంఘర్షణను చూపడమే ఆయన ప్రధాన సాహిత్య ఇతివృత్తం. ప్రాంతీయ, ప్రాదేశిక జీవితాన్ని చిత్రించడమంటే ఉన్నది ఉన్నట్లు రాయడం కాదని, అందులోంచే విప్పారుతున్న ప్రగతిశీల పరిణామాలను గుర్తించడం అనే స్పష్టత ఆయనకు ఉన్నది. దాన్ని ఆయన స్త్రీలు, అంటరానికులాలు, బహుజన వృత్తి కులాలు, మధ్య తరగతి సమూహాల  వైపు నుంచి గుర్తించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో సామాజిక, సాహిత్య రంగాల్లో ప్రవేశిస్తున్న నూతన ఆలోచనలు ఆయనను ప్రభావితం చేశాయి.

            సారాంశంలో ఆయన తెలుగు కథలోకి చాలా విస్తారంగా రాయలసీమ జీవన పరిణామాలనే ఇతివృత్తాన్ని చక్కటి కడప మాండలికంలో, స్థానీయ సంస్కృతిలో, దేశీయ పాత్రలతో కాల్పనీకరించారు. కె సభాలాంటి వారు ఆరంభించిన రాయలసీమ జీవన ఇతివృత్తాన్ని కేతు విశ్వనాథరెడ్డి అనేక తలాల్లో, పలు కోణాల్లో, గ్రామాల్లోని భిన్న పాత్రలతో, వాటి స్వభావాలతో ముందుకు తీసికెళ్లారు. నిర్దిష్టంగా ఆయన రచనల్లో రాయలసీమ కథ, నవలలను  పరిశీలిస్తే ఆ ప్రాంత ఆధునికతా వికాస క్రమం కూడా కనిపిస్తుంది. తెలుగు సమాజాల్లో ఒక్కో ప్రాంతానికి ఒక్కో రకమైన ఆధునికతా క్రమం ఉంటుందని, అది రాయలసీమలో చాలా భిన్నంగా ఉందనే సామాజిక, సాంస్కృతిక అవగాహనను ఆయన రచనలు అందిస్తాయి. అత్యంత వెనుకబడిన, ఫ్యూడల్‌ స్వభావం మెండుగా ఉన్న ప్రాంతంలో ఆధునిక ఆలోచనలు, విలువలు చిగురించడం, నిలదొక్కుకోవడం చాలా కష్టం. ఇది చాలా సంక్లిష్టమైన  క్రమం. కేతు విశ్వనాథరెడ్డి కథలను  ఇప్పుడు మరోసారి చదివితే రాయలసీమ  స్థలకాలాల్లో, స్థూలంగా తెలుగు సామాజిక ఆవరణలో అలాంటి క్రమాన్ని గుర్తించవచ్చు.

            ఆ రకంగా ఆయన కథలు సీమ కథా సాహిత్యాన్ని చాలా ముందుకు తీసికెళ్లాయి. వెనుకుబాటుతనం ఉన్న నేల మీదనే చాలా ముందస్తు ఆలోచనలను, యథాతథంగా కనిపించే చోటే వేగవంతమైన చలనాలను, సాంస్కృతికంగా లొంగుబాటు ఉన్న నేల మీదనే వ్యక్తిగతస్థాయిలో అయినా తిరుగుబాటును, ప్రశ్నలే లేనట్టు కనిపించే జీవితంలో కాంతివంతమైన కొత్త సమాధానాలను ఆయన రచనల్లో చూడవచ్చు.

            శిల్పపరంగా ఆయన కథలు చాలా సాదాగా ఉంటాయి. కొన్ని కథలను ఒకింత ఓపికగా చదవాల్సిందే. కానీ సామాజికంగా లోతు ఉంటాయి. ఏదో ఒక వైరుధ్యం,  ప్రత్యేకత, చలనం, సంక్లిష్టత లేకుండా ఆయన అలవోకగా కథలు రాసినట్లు కనిపించదు.  అందుకే సీమ సాంస్కృతిక, రాజకీయార్థిక చరిత్రపట్ల ఆసక్తి ఉన్న వాళ్లు తప్పక విశ్వనాథరెడ్డి కథలను అధ్యయనం చేయాల్సిందే.  ఈ కోణంలో మిగతా తెలుగు సమాజానికి వర్తించే కథలు కూడా కొన్ని రాశారు.

            కథ, నవలలా తనదైన ప్రత్యేక ముద్ర లేకపోయినప్పటికీ విమర్శలో కూడా ఆయన కృషి చేశారు. బహుశా ఆయన విమర్శనాత్మ దృష్టి కాల్పనిక రచనకే సన్నిహితమైనది కావచ్చు.  మిగతా పనులు ఎన్ని చేసినా సుదీర్ఘకాలంపాటు కథా రచనతో కేతు విశ్వనాథరెడ్డి జీవితం పెనవేసుకొనిపోయింది. 

అరసం నాయకుడిగా,  అభ్యుదయ రచయితగా, సీమ సాహిత్యకారుడిగా ఆయన చేసిన కృషి నిలిచిపోతుంది. ఆయనకు విరసం నివాళి ప్రకటిస్తోంది.

Leave a Reply