చెరబండరాజు సాహిత్య సర్వస్వం, అలిశెట్టి ప్రభాకర్ కవిత్వ విశ్లేషణ ‘కల్లోల కవితా శిల్పం’ పనిలో ఉన్నప్పుడు వీరిద్దరికి కొనసాగింపుగా కౌముది, సముద్రుడు, మంజీర, ఎమ్మెస్సార్ గుర్తుకు వచ్చారు. విప్లవ కవిత్వంలోకి చెర, అలిశెట్టి ప్రభాకర్ తీసుకొచ్చిన విప్లవ వస్తు శిల్పాలు ఆ తర్వాతి కాలంలో మరింత గాఢంగా, ఆర్దృంగా, సౌందర్యభరితంగా విస్తరించాయి. 1990ల విప్లవ కవిత్వం మొత్తంగా తెలుగు కవితా చరిత్రనే సాంద్రభరితం చేసింది. ఇందులో అనేక మంది విప్లవ కవులు ఉన్నారు. వాళ్లలో కూడా ప్రత్యక్ష విప్లవాచరణను, కవితా రచనను ఎన్నుకున్న వాళ్లు కూడా చాలా మంది ఉన్నారు. తెలంగాణ నేపథ్యం, విభిన్న రంగాల్లో పోరాట అనుభవం, విస్తారమైన ప్రజా జీవితం ఉన్న కవిగా మంజీరను ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
విప్లవ కవిత్వంలో మొదటి నుంచి ఉన్న సూటిదనాన్ని మంజీర కొనసాగించాడు. రాజకీయ కవిత్వంలో ఉండగల సౌందర్యానికి ఆయన కవిత్వం గొప్ప ఉదాహరణ. మంజీర సుమారు పాతికేళ్ల విప్లవ జీవితం గడిపాడు. బహుశా ఊహ వచ్చాక, చైతన్యవంతమైన మానవుడిగా ఎదిగాక ఇక వెనక్కి తిరిగి చూసుకోకుండా జీవితమంతా విప్లవంలో గడిపాడు. కవిగా, విప్లవకారుడిగా ఆయన రూపాంతరం చెందిన కాలం కూడా అలాంటిదే. చెర, అలిశెట్టి ప్రభాకర్ విప్లవోద్యమ తొలి కాలానికి చెందిన కవులు. ఆ చరిత్ర 1990ల నుంచి ఒక నూతన దశలోకి చేరుకున్నది. వర్గపోరాటం తీవ్రమైంది. సమాజాన్ని అంతక ముందుకంటే ఎక్కువగా తన ప్రభావంలోకి తీసుకున్నది. తొలి రోజుల్లో విప్లవోద్యమ ప్రభావం సోకని అనేక రంగాల్లోకి విస్తరించింది. ఒక కొత్త తరం ఉద్యమంలోకి వచ్చింది. ఈ క్రమం 1980ల చివరిలోనే మొదలైంది. ప్రజాపోరాటాల వల్ల, పాలకుల ప్రతిఘాతుక విధానాల వల్ల, వ్యవస్థ అంతర్గత చలనాల్లోనే వచ్చిన మార్పుల వల్ల సమాజంలోని అన్ని పొరలూ విచ్చుకోవడం మొదలైన కాలం అది.
ఆ కాలంలో క్రియాశీల, సృజనకారుడిగా మంజీర ప్రజా జీవితంలోకి వచ్చాడు. కార్యకర్తగా ఆ సంఘర్షణలో తన మార్గాన్ని ఎంచుకున్నాడు. బుద్ధిజీవిగా దాని లోతుపాతులు తెలుసుకున్నాడు. కవిగా ఆ కాల సంఘర్షణను అందుకోగల ఊహాశక్తిని సంతరించుకున్నాడు. అందుకే విద్యార్థి ఉద్యమంతో మొదలై అనేక రంగాల్లో, ఆ రోజుల్లో సవాల్‌గా నిలిచిన అన్ని సమస్య పరిష్కారానికి ముందు నిలిచాడు. జైలు జీవితం గడిపాడు. బైటికి వచ్చి హైదరాబాదు విప్లవోద్యమంలో భాగమయ్యాడు. ఉద్యమ అవసరం కోసం దండకారణ్యం దాకా ప్రయాణించాడు. అక్కడి నుంచి పల్నాడుకు, నల్లమలకు చేరుకున్నాడు.
ఇంత విస్తారమైన ప్రయాణంలో ఆయనను సిద్ధాంత రాజకీయాలు ఎంత నడిపించాయో కవిత్వం అంత నడిపించింది. విరసం సభ్యుడిగా కూడా ఆయన వ్యక్తిత్వంలో, జీవితంలో కవిత్వం కలగలసి పోయింది. కళా సాహిత్యాలకు ఎవరు ఎన్ని నిర్వచనాలు చెప్పినా, మౌలికంగా జీవితానుభవమే వాటికి ఒట్టిపోని వనరు. జీవితంలోని భావోద్వేగాలు, అనుభవ గాఢత కాల్పనిక శక్తిని తట్టిలేపుతాయి. సామూహిక సంబంధాల నుంచే కవిత్వంలోకి ఆ శక్తి వస్తుంది. విప్లవకారుడు కూడా అయిన కవికి రాజకీయ పోరాటాలు, వాటి లక్ష్యాల వలెనే అంత విస్తారమైన జీవితానుభవం కవిత్వ రచనకు ప్రేరేపిస్తుంది. అంతక ముందు కవిత్వం రాయని వాళ్లు కూడా విప్లవ జీవితానుభవం వల్ల కవితా రచనలోకి వస్తారు. వర్గపోరాట జీవితం, అజ్ఞాత ఉద్యమ అనుభవం ఉన్నమంజీరలాంటి వాళ్లకు కవిత్వ రచన ఒక ఆచరణ రూపం. ఈ కారణం వల్లే వాళ్ల కవిత్వంలో ఒక రకమైన సున్నితత్వం ఉంటుంది. సూటిదనం ఉంటుంది. గాఢమైన ప్రభావశీల శక్తి ఉంటుంది. ఇవన్నీ మానవ జీవితంలో కవిత్వమే నిర్వహించగల పనికి తగిన శిల్ప సౌందర్యంగా మారుతాయి. మంజీర కవిత్వం దీనికి గొప్ప ఉదాహరణ.
మంజీర అమరత్వం తర్వాత విరసం ప్రచురించిన ఆయన కవితా సంపుటి ‘మంజీర మూడ్స్’ను ఇప్పుడు మరోసారి చదివితే 1990ల నాటి విప్లవ కవిత్వ దశ అర్థమవుతుంది. నిజానికి ఈ పుస్తకంలో ఆయన రాసిన కవితలన్నీ ఉండే అవకాశం లేదు. ఆజ్ఞాత కవులందరి విషయంలో ఇలాగే జరుగుతుంది. వాళ్లు రాసిన కవిత్వంలో అందుబాటులోకి వచ్చేది కొంతే. అట్లా ‘మంజీర మూడ్స్’ చిన్న సంపుటేగాని ఒక కాలానికి చెందిన విప్లవ కవిత్వాన్ని అంచనా వేయడానికి పనికి వస్తుంది. ఇందులో కొన్నిటికి రచన, ప్రచురణ తేదీలు ఉన్నాయి. కొన్నిటికి లేవు. అయినా కవిగా మంజీర పరిణామాన్ని కూడా వాటి నుంచి అర్థం చేసుకోవచ్చు. విప్లవ విద్యార్థి ఉద్యమంలో ఉండగా అరెస్టయిన మంజీర 1988, 89 సంవత్సరాలు జైలు జీవితం గడిపాడు. విప్లవ జీవితంలో యుద్ధం, జైలు రెండు ముఖ్యమైన భాగాలు. మంజీర సహజంగానే జైలు జీవితంలో కవిత్వ రచన ఆరంభించాడు.
ఈ సంపుటిలో ‘నేనున్నాను’ అనే కవిత ఉంది. రచనా వివరాలు లేనందు వల్ల బహుశా అది తొలి దశలో రాసి ఉండవచ్చని అనుకోవచ్చు.
హృదయాన్ని అనువాదం చేసి
పేపరుపైకి ప్రసారం చేసి
నీకందించాను
అవసరాల వడిలో పడి
అలా విసిరేయకు
దాని వెనుక నేనున్నాను
వర్గ యుద్ధంలో నీవు
శతృ నిర్బంధంలో నేను
నిర్బంధంలో ఉన్నా
యుద్ధ ఆరాటంలో నేను
అవసరాల వడిలోపడి
దాన్నలా విసిరేయకు
వెనుక నేనున్నాను..
జైలు నిర్బంధంలో ఉండి పోరాట రంగంలో ఉన్న సహచరులతో సాగిన సంభాషణ కావచ్చు. కవిగా మంజీరలోని విమర్శనాత్మకతకు, సున్నితత్వానికి ఇది నిదర్శనం. కఠినమైన జైలు జీవితం నుంచి అంతకంటే కఠినమైన పోరాట క్షేత్రంతో చేసిన సునిశిత చర్చ ఇది. వర్గపోరాటం నుంచి ఆయన ఇంత సుకుమారమైన భావనలను అలవర్చుకున్నాడు. దీన్ని తన కవితా జీవితమంతా కాపాడుకున్నాడు. ఆ తర్వాత రాసిన చాలా కవితల్లో ఈ కాల్పనికత, సున్నితత్వం ఒక జీవధారలాగా కొనసాగింది.
ఎమ్మెస్సార్ అమరుడైనప్పుడు రాసిన కవిత మంజీర కవితా శిల్పానికి తిరుగులేని ఉదాహరణ.
నిన్నటి నీ స్పర్శ మాధుర్యం కోసం
నేడు పేపర్లో వచ్చిన ఫొటో తడిమాను
వెచ్చగా నా కన్నీరు తాకింది
నీ చిరునవ్వు కోసం
ముఖమంతా వెతికాను
చితికిన పెదవిలో
నువ్వు చెప్పని రహస్యం కనిపించింది..
ఇలా సాగుతుంది. మంజీరకు ఏ వస్తువును ఎలా కవిత్వం చేయాలో తెలుసు. అన్ని వస్తువులను ఒకేలా రాయడు. ఇది కేవలం శిల్ప విశేషం కాదు. దృక్పథ పరిణతిని సూచిస్తుంది. మంజీర కవి మూడ్స్‌ను కూడ ఇది తెలియజేస్తుంది. సోవియట్ పరిణామాల నేపథ్యంలో రష్యాలో లెనిన్ విగ్రహాలను కూల్చివేసినప్పుడు విప్లవాన్ని ఆరాధించేవారు కలతకు గురి అయి ఉంటారు. కానీ విప్లవాచరణలో ఉన్న మంజీర మూడ్ చాలా డిఫరెంట్‌గా ఉండింది. ‘కూల్చనివ్వండి లెనిన్‌ను’ అనే కవితలో..
కూల్చనివ్వండి, వాళ్లను ఆపకండి
అవును మహనీయుడు లెనిన్ విగ్రహమే
అయినా సరే కూల్చనివ్వండి
ముసుగు దొంగల ప్రతినిధిగా
ద్రోహుల చేతిలో కీలుబొమ్మగా
ఇంకెంత మాత్రం లెనిన్‌ను
బ్రతకనివ్వకుండి, కూల్చేయండి… అని రాశాడు.
రివిజనిజం ఇక దాపరికం లేకుండా బట్టబయలైపోయిందని, ఇది జరగవలసిందే అని మంజీర అంటాడు. అందుకే ‘లెనిన్ కూలిపోతే అసలు దొంగలు బైటికి వస్తారు’ అంటాడు. ఇంత గాఢమైన రాజకీయ వైఖరిని సూటిగా, నేరుగా చెప్పి కూడా కవిత్వం చేయగల శక్తి మంజీరకు ఉన్నది. విప్లవాన్ని అర్థం చేసుకోవడంలో లోతైన అభినివేశం, కాల్పనికత ఉన్న వాళ్లకు ప్రతీఘాతుక శక్తుల, రివిజనిస్టుల ధోరణులు స్పష్టంగా తెలుస్తాయి. మంజీర విప్లవాన్ని ఇలా తన అనుభవంలోకి తీసుకున్నాడు. అది చాలా రొమాంటిక్‌గా ఉంటుంది.
వసంతాలనీ, వయ్యారాలనీ
వెతుకుతూ తిరిగే నా మనసులోకి
నువ్వెప్పుడు దారి చేసుకున్నావోగాని
పూర్తిగా ఆక్రమించి ఆకర్షించావు… అంటాడు.
మంజీర కవితా శిల్పంలోని క్లుప్తత ఆకట్టుకుంటుంది. ఒక చిన్న పదంతో, వాక్యంతో కవిత్వమెలా అవుతుందో మంజీరకు బాగా తెలుసు. చాలా జాగ్రత్తగా కవిత్వాన్ని అల్లే నేర్పును ఆయన తొలి రోజుల నుంచి సాధన చేసినట్లనిపిస్తుంది. జైలు నేపథ్యం ఉన్న కవితల్లోనే ఈ శైలి కనిపిస్తుంది.
‘తొలకరి కోసం’ అనే కవితలోని నిర్మాణ పద్ధతి గురించి ఎంతయినా రాయవచ్చు. మంజీర వంటి గెరిల్లా కవులకే ఈ కవితా వస్తువును ఎన్నుకోవడం సాధ్యం. కేవలం వస్తుపరంగానే కాదు. దానికి తగిన నిర్మాణ రూపాన్ని ఇవ్వడం కూడా మంజీరకే సాధ్యం అనిపిస్తుంది. జీవితానుభవం, దాని పర్యావరణం ఈ కవితలోకి అద్భుతంగా వచ్చాయి. కవిత ఎత్తుగడ, నడక, ముగింపు మధ్య గొప్ప సమన్వయంతో ప్రవాహ సదృశ్యంగా ఈ కవిత సాగుతుంది.
ఇట్లా మంజీర కవిత్వ శిల్పాన్ని వివరించేందుకు ప్రమాణికంగా నిలిచే కవితలు ఈ సంపుటిలో ఎన్నో ఉన్నాయి. నిజానికి ఇది కేవలం వస్తు శిల్పాల వ్యవహారమే కాదు. విప్లవ దృక్పథంతో ముడిపడిన విషయం. జీవితాచరణ నుంచి, అధ్యయనం నుంచి మంజీర అలవర్చుకున్న దృక్పథం ఆయనలోని శిల్ప నైపుణ్యానికి శోభనిచ్చింది. ప్రభావశక్తిని ఇచ్చింది. విప్లవ కవులందరిలో ఉండే ఈ ప్రత్యేకత మంజీర కవిత్వమంతటా జీవశక్తిగా ప్రసరిస్తుంది. దృక్పథ బలం వల్లనే విప్లవ కవులు తక్షణ, నిర్దిష్ట జీవితానుభవం వెనుక ఉండే సత్యాన్ని అన్వేషించగలుగుతారు. లేకపోతే పడిపోతూ కూడా లేచి నిటారుగా నిలబడటం గురించి, తాత్కాలిక ఓటమిలో కూడా మహాద్భుతమైన చారిత్రక విజయం గురించి, ఒంటరి జైలు నిర్బంధంలో కూడా అనంత మానవ సమూహ స్వప్నం గురించి, కరకు కష్టాల్లో కూడా అతి సున్నితంగా పోటెత్తే భావనల వెల్లువల గురించి ఎలా కవిత్వ చేయగలుతారు. మంజీర కవిత్వంలోని ఆశావాదం, సత్యదృష్టి, సునిశితత్వం విప్లవంలోని చారిత్రక యుగావధికి సంబంధించినవి. ఆయన కవిత్వంలో ఇప్పటికీ మనల్ని ఆకట్టుకొనేది అదే. ఆ శక్తి ఉన్నందు వల్లనే తెలుగు కవిత్వంలోని 1990ల కాలానికి ప్రాతినిధ్యం వహించగల కవిగా ఆయన నిలిచిపోయాడు.