Written by మందరపు హైమావతి
1
గెలుపు గుర్రాలం
ఇక వెనకడుగులన్నీ ముందడుగులే
కుంటి గుర్రాలన్నీ పరిగెత్తే పారశీక జవనాశ్వాలే
పాత చరిత్రలు పాత కథలన్నీ పాదమట్టం
బండరాళ్లకు రెక్కలు మొలిచిన అద్భుతం
అటు అగ్రకులాల ఆధిపత్య భావనల పావురాలనెగరయ్యలేక
కింది కులాల ధిక్కారస్వరంతో గొంతు కలపలేక
ఆత్మన్యూనతాభావంతో ముడుచుకుపోయే అత్తిపత్తులం
స్వేచ్ఛ సీతాకోకచిలుక రెక్కలు విరిచి
కాళ్లకు బదులు మనసుకు సంకెళ్లు వేసి
అమానవీయ అంటరానితనం కొరడా దెబ్బలు
వెలివాడల బహిష్కరణల బహుమతులు మాత్రమే తక్కువ
తరతరాలుగా చాకలోళ్లు మంగలోళ్లు కుమ్మరోళ్లు కంసాలోళ్ళు అంటూ
మా మనసు పుస్తకాలపై చెరగని అవహేళనల రాతలు
'పిల్లలకు పట్టింపులేమిట' ని వసారాలోవడ్డించి
ఎంగిలాకులు ఎత్తించిన కటిక చేదు స్మృతులు
ఇప్పటికీ గుండెల్లో చిల్లులు పొడుస్తున్న అవమానాల మేకులు
శంభూకుని తల నరికిన దృశ్యం
తెంపిన ఏకలవ్యుని అంగుష్టం
పదేపదే మరిచిపోలేని గాయం
ప్రజాస్వామ్యం తలుపులు మూసిన రాజ్యంలో
పొగబెట్టిన కులమిరపకాయల ఘాటు
పుట్టుక చదువు ఉద్యోగం పెళ్లి చావుల్లో
ఈ రాకాసి లేనిదెక్కడ
పైసల్లేకుండానే ప్రభుత్వ కార్యాలయాల్లో
పనులు జరిగిన ఆశ్చర్యాల్లో
అల్లావుద్దీన్ అద్భుతదీపమైనా
కుల రహిత భారత భవనాన్ని సృష్టించలేని కటిక నిజం
**
ఇంకా ఎంతకాలం గద్దెనంటిపెట్టుకుంటారు
అధికారం పల్లకీలో కూర్చుని నడుము పట్టేసినట్లుంది
ఇంక చిత్తం పాఠాలు వల్లెవేయలేము
పరస్పరం పాత్రలు మార్చుకొందాం! పల్లకి దిగి భుజాలకెత్తుకో!
ఇప్పుడు తాబేళ్ళే విజేతలయ్యే ఊహాతీత దృశ్యం!
పరుగు పందేల్లో గెలుపు గుర్రాలం మేమే.
2
యుద్ధమంటే...
తుపాకీ తూటాకు చివర ఉన్నది
చిరునవ్వుల పసిపాపో
మూడు కాళ్ల ముసలి వగ్గో
ఆ జన్మ శత్రువో ఎవరైనా ఒక్కటే
పేలడమే దాని ధర్మం
*
కురుక్షేత్రం కళింగ యుద్ధం
వియత్నాం జాఫ్నా కాశ్మీర్
ఆఫ్ఘనిస్తాన్ జపాన్ ఉక్రెయిన్
యుద్ధ భేరీలు మోగని దేశమెక్కడా
అఖండ సంపదల కోసమో
సామ్రాజ్య విస్తరణ కోసమో
ఆయుధాలెప్పుడూ రక్తాభిషేకాలతో
ఆనందిస్తూనే ఉంటాయి
యుద్ధం ఎందుకు జరిగినా
ఎక్కడ రావణ కాష్టం రగులుతున్నా
బాధితులెప్పుడూ స్త్రీలే
యుద్ధం తర్వాత
శవాల కుప్పల భూమిలో
వంద మంది కొడుకుల్ని కోల్పోయిన
గాంధారి కన్నీటి ధారలు ఆగినదెక్కడ
ప్రపంచంలో వున్న సప్త సముద్రాలన్నీ
స్త్రీల ఎడతెగని కన్నీటి సాగరాలే
*
శత్రువు ఏ రాజ్యంలో విజయ పతాక ఎగరేసినా
అంతఃపురాల్లో స్త్రీల సతీసహగమనాలు సజీవ దహనాలు
స్వీయ గర్భాల్లో శత్రు సైనికుల బీజాలు
*
ఉక్రెయిన్! ఓ ఉక్రెయిన్!
క్షిపణుల ప్రయోగంతో బాంబుల కుంభవర్షంతో
యుద్ధ ట్యాంకుల వీర విహారంతో నీవొక బీభత్స నగరానివి
కంచంలో పెట్టుకున్న రొట్టె ముక్క
నోట్లోకి వెళ్ళేంతవరకు
ప్రాణ హంస ఉంటుందో ఎగిరిపోతుందో ఎవరూ చెప్పలేరు
బడికి వెళ్లిన పిల్లలు సాయంత్రం సజీవంగా
ఇంటికి వస్తారో లేదో
ఆస్పత్రిలో చేరిన రోగి బతికి బట్ట కడతాడో లేదో
నడుస్తున్న నేల కింద ఎప్పుడు ఏమి పేలుతుందో తెలీదు
చుట్టుముట్టిన శత్రువు దాడిలో
ప్రతిక్షణం ప్రాణభయం
ఇప్పుడు గదా తెలిసింది జీవితం క్షణ భంగురమని
*
యుద్ధంలో బతికుంటామో లేదో తెలీని తల్లిదండ్రులు
పిల్లాడి వీపు మీద రాసిన ఊరి పేరు చూసి
విచలితం కాని హృదయం వుంటుందా
ఇప్పుడు
యుద్ధమంటే పురుషాహంకారమే
ఎవరు గెలిచినా ఓడినా
భర్తలు కోల్పోయిన భార్యలు
తండ్రులు లేని కూతుళ్లు
అన్నలు లేని చెల్లెళ్లు
ఒంటరి గీతాలు దిగులు మూటలు.
Related
Madam hymavathi garu —super ones —
75 yrs independence — no change /nothing happened —doralu —agrakulaalu —varasathva Palanalu
Dopidilu—-country needs revolution