అవును, నాడు నాలుగోడలమధ్య నిండు సభ(నాటి పార్లమెంటు)లో ఒక మహిళను వివస్త్రను చేస్తుంటే హాహాకారాలు, ఆక్రందనలు లేకపోయినా, మౌననిరశన కనపడిండి. మరిప్పుడు మణిపూర్ లో నట్ట నడివీధిలో మహిళలను నగ్నంగా ఊరేగిస్తుంటే అప్పటిలాగా కనీసం మౌనం రాజ్యమేలడం లేదు .హాహాకారాలు, ఆక్రందనల బదులు హాహాలు, శభాష్ లు, అదీ తోటి మహిళల నోటివెంట వినపడడం ఎంత పురోగతి? ఇక దేశం మోదీ పాలనలో విశ్వగురు స్థానాన్ని సుస్థిరం చేసుకున్నట్టే.
హిట్లర్ ,ముస్సోలినీలకు మారుపేరైన మోదీ, మణిపూర్ తగలబడుతుంటే, ఆ ప్రజల, ఆక్రందనలు హాహాకారాలు వినపడనంత దూరంగా విదేశీ పర్యటనలో ఆయుధ బేహారీల మన్ననలందుకుoటూ ఆధునిక కాలపు నీరోను తలపించడం లేదూ? దేశానికి తిరిగి వచ్చాక కూడా ప్రజల ఆక్రoదనలు ఆయనకు విన్పించవు కదా, 79 రోజుల తర్వాత గాని ఆయన మొద్దుబారిన శరీరం స్పందిoచనంది. అదీ పొడిపొడి, తడిలేని మాటల్లో సుమండీ.
“చరిత్ర పునరావృత మవుతుంది, తొలుత విషాదంగా, తర్వాత ప్రహసనంగా ” అన్న మార్క్స్ మహాశయుని మాటల్ని , మార్క్సిజంకు బద్ధ శత్రువైన మోదీ కూడా నేడు రుజువు చేయడం ఎంత వైచిత్రి. అంతే కాదండి, ఆయన అనుంగు మిత్రుడు షా కూడా, అర్జునుడు నాటి మణిపూర్ రాణి చిత్రాంగదను వివాహమాడాడని వివాదాస్పద వ్యాఖ్య జేస్తూ మరో పురాణపు ఘట్టాన్ని గుర్తుకు తేవడం కాకతాళీయం అనుకోవాలా? అర్జునుడు అంటూ ఖాండవ దహన పురాణ గాథను గుర్తుకు తేవాలనుకున్నాడేమో? నాడు, అగ్నిహోత్రునికి తిన్న ఆహారం అరగక అజీర్తితో బాధప డుతూ, ఖాoడవ వనంలో అజీర్తి మాత్రలు, అదేనoడి, ఔషధ మొక్కలు ఉన్నాయని తెలిసి దాన్ని ఆరగించాలనుకుంటాడు. దానికి సహాయపడమని బావ, బావ మరదులను కోరుతాడు. ఇకనేం, అంతవరకూ, తమకెమాత్రం సంబంధంలేని, ఎలాంటి శత్రుత్వం లేని నివాస ప్రాంతమైన ఖాండవ వనాన్ని తగలబెట్టడానికి అర్జునుడు శ్రీకృష్ణుని సలహా మేరకు పూనుకుంటాడు. ఆధునిక యుగంలో అర్జునుడి పాత్రలో మోదీ, శ్రీకృష్ణుని పాత్రలో సంఘ్ పరివార్ , అగ్ని పాత్రలో కార్పోరేట్ సంస్థలు సరిగ్గా
కుదురుకుంటాయనుకుంటా. నాటి అర్జునుని సహాయానికి కృతజ్ఞతతో దేవతలు ఆయనకు మారణాయుధాలు అందించారు. నేటి అర్జునుడికి ఏమoదుతుందో అందరికీ తెలిసిందే!
పొతే,నాటి అగ్నిహోత్రునికి అజీర్తి బాధ. నేటి కార్పోరేట్లకు సహజవనరుల కై , లాభాల కై వేదన, అంతులేని ఆరాటం, ఆకలి. మరి, ఆ ఆకలి తీర్చే బాధ్యత ఆధునిక శ్రీక్రిష్ణార్జునులదే కదా! వారు తమవంతు కర్తవ్యాన్ని నిర్వహించాలి కదా!
ఇక మణిపూర్ పరిస్థితిని విశ్లేషించాలంటే అక్కడి విభిన్న తెగల మధ్య గల వైరుధ్యాలు, వారి, వారి ఆకాంక్షలు, వారి భయాలు, వాటిని తమ స్వప్రయోజనాలకై వినియోగించుకుoటున్న పాలవర్గపు కుట్రలూ, కుతంత్రాలను అర్థం జేసుకోవల్సి వుంటుంది.
మణిపూర్ రాష్ట్ర చరిత్ర:
1950 లలో స్వతంత్ర నాగాలాండ్ ఉద్యమo NSCN-IM నేతృత్వం లో సాయుధ పోరాట రూపం తీసుకుంది. దాని తాకిడి పక్కనే వున్న మణిపూర్ కు తగిలింది. మరోవైపు, మైతీలు భారత ప్రభుత్వానికి మణిపూర్ రాజు భోధన చంద్రతో చేసుకున్న ఒప్పందాన్నివ్యతిరేకించారు. మైతీ సాయుధ ముఠాలు -PREPAK,PLA లాంటి వాటికి చైనా ఆయుధాలు సరఫరా జేసింది. శిక్షణ ఇచ్చింది. వీటి లక్ష్యాలు భారతదేశం నుండి మైతీ ప్రాంతం విముక్తి, నాగా సాయుధ గుంపుల నుండి స్వీయ రక్షణ. ఇక కుకీ జోమో గ్రూప్, మరికొన్ని గ్రూపులు నాగా తిరుగుబాటుదారుల NSCN-IM వ్యతిరేకంగా ఆయుధాలు చేప ట్టాయి. అంటే గతంలో శత్రువులుగా మెసిలిన నాగా, కుకీలు నేడు మిత్రులయ్యారు. మైతీలకు వ్యతిరేకంగా జమకట్టడానికి కారణం మైతీల ఆక్రమణల నుండి తమ ప్రాంతాన్ని రక్షించుకోవడమేనని వారు చెబుతున్నారు..
నేటి మణిపూర్ జనాభా కేవలం 32 లక్షలు. అందులో మెజారిటీ53% ప్రజలు మైదాన ప్రాంతం (20%)లో నివశిస్తున్న మైతీలు. మైతీలలో మెజారిటీ హిందువులు. ఇక కొండప్రాంతాల (80%)లో నివశిస్తున్న తెగలు, కుకీలు, నాగాలు, మరికొన్ని చిన్న చిన్న తెగలు. 43% వున్న నాగా, కుకీలలో మెజారిటీ క్రైస్తవులు. ఈ కొండప్రాంతా ప్రజలకు ఎస్ టి హోదా వుంది. రాజ్యాంగ అమలు గాకముందు మైతీలు ఎస్ టి లు గా పరగణిoపబడ్డారు. 1950 తర్వాత వారికి ఆ హోదా తొలగించ బడ్డది. వారిప్పుడు ఓబిసి కేటగిరి లో వున్నారు.
ఘర్షణలకు దారితీసిన, పైకి కనిపించే కారణం:
దశాబ్దకాలంగా మైతీలు తమను ఎస్ టి కేటగిరిలో చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. దాన్ని ఆదివాసీ తెగలు, కుకీ, నాగాలు వ్యతిరేకిస్తున్నారు. ఈ ఏప్రిల్ లో మణిపూర్ హైకోర్ట్ ఒక నెలలోగా మైతీల డిమాండ్ పై చర్య చేపట్టాలని ఆదేశించింది. ఆ తర్వాత న్యాయస్థానాలకు రిజర్వేషన్ కేటాయింపుల అధికారం లేదని, అధి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వపు పరిధిలో వుందని సుప్రీం కోర్టు, హైకోర్ట్ ను తప్పుపట్టింది. హైకోర్ట్ ఆదేశాలపట్ల కుకీలు, నాగాలు మే 3 , అఖిల ఆదివాసీ విద్యార్థి యూనియన్ ఆధ్వర్యాన నిరశన ర్యాలీ ఇంఫాల్ లో చేపట్టడంతో వారికీ ,మైతీల మధ్య ఘర్షణలకు దారి తీసింది. పర్యావసనంగా నాగా, కుకీల గృహాలపై దాడులు, దాదాపు 500 చర్చిల ధ్వంసం, ఆదివాసీ మహిళలపై సామూహిక అత్యాచారం లాంటివి జరగడం – ఆ ఘర్షణలో ఇరుపక్షాలు మారణాయుధాలును విచ్చలవిడిగా ఉపయోగించుకున్నారని తెలుస్తుంది. దాంతో ఇరు పక్షాలలో ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. కుకీలకు మయన్మార్ నుండి ఆయుధాలు సరఫరా అవుతున్నాయనే ఆరోపణలూ వున్నాయి. మైతీలు ఆధిపత్య వర్గంగా వుండటం, ఇంఫాల్ లో మెజారిటీ ప్రజలు వారేకావడం, అంతేగాక మణిపూర్ ముఖ్యమంత్రి మైతీ తెగకు చెందినవాడు కావడంతో, శాంతిభద్రతల యంత్రాంగం నిర్లిప్తతతో ఉండటమే గాక, పరోక్షంగా మైతీల పక్ష వహించారని నిజనిర్ధారణకు వెళ్ళిన వారు చెబుతున్నారు. పోలీస్ స్టేషన్ల, ఆయుధగారాల నుండి దాదాపు 3,500 తుపాకులు, 5 లక్షల తూటాలు ఎటువంటి అడ్డూ, అదుపూ లేకుండా ఎత్తుకెల్లారంటే, మైతీలకు ఆయా అధికారుల మద్దతు వున్నట్టు స్పష్టమవుతుంది. దీనికి తోడూ, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, కుకీ మిలిటెంట్లు ఉగ్రవాదులంటూ దుయ్యబట్టడమేగాక, మహిళలపై అత్యాచారాలు మరెన్నో జరిగాయని , అందుకే వాటిని వెలుగులోకి రాకుండా రాష్ట్రం ఇంటర్నెట్ బంద్ చేసానని నిస్సిగ్గుగా గొప్పగా చెప్పుకున్నాడు. ఇదంతా అతని మైతీ పక్షపాత వైఖరిని తెలియజేస్తుంది. దాన్ని అతని పార్టీ శాసన సభ్యులే ఖండిస్తున్నారు. అతని రాజీనామాను, కేంద్రప్రభుత్వ జోక్యాన్ని కోరుతున్నారు. కానీ, మోదీ మాత్రం ఏ ముఖంపెట్టుకొని అలాంటి చర్యలు తీసుకోగలడు?. 2002 లో గుజరాత్ లో జరిగిన ముస్లింల దారుణ మారణకాండకు భాధ్యుడయిన తానేమైనా రాజీనామా చేసాడా? పోగా, ఆ ముస్లింల హననం అతన్ని ప్రధాని పదవికి పదోన్నతి కల్పించింది గదా! మణిపూర్ ముఖ్యమంత్రికి ఆదర్శం మోదీనే కదా. కంటితుడుపు చర్యగా కేంద్ర గృహశాఖా మంత్రి మే 28న ఇంఫాల సందర్శించినా ఫలితం శూన్యం. కారణం, రాష్ట్ర బిజెపి ప్రభుత్వం పై అక్కడి ప్రజలు విశ్వాసం కోల్పోవడమే. ఇక రాష్ట్ర కేంద్రప్రభుత్వాల మధ్య తేడా చూడలేక పోవడమే. అందుకే కుకీ ప్రతినిధులు శాంతి చర్చలను బహిష్కరించారు. అందులో పాలుపంచుకోమని నిక్కచ్చిగా చెప్పారు.
ఇదీ క్లుప్తంగా అక్కడ జరిగిన సంఘటనల సారాంశం. అలా ఘర్షణలు జరగడానికి మనకు హైకోర్ట్ తీర్పు, నిరశన కార్యక్రమాలు తక్షణ కారణాలుగా కనిపించినా , వాటి వెనుక దాగివున్న దశాబ్దాల విభేదాలు, తెగల మధ్య వైరుధ్యాలు, మరెన్నో కారణాలు చూడాలి.
నాగాల వల్ల, కుకీల ప్రత్యేక పాలనాధికార ప్రాంత డిమాండ్ వల్ల మైతీలకు తమ ప్రాముఖ్యత తగ్గుతుందనే భయం వుంది. అంతేగాక గతంలో కుకీలు మూడుసార్లు జాతీయ రహదారులను, 2010 లో 68రోజులు, 2011 లో 121 రోజులు, 2016-17 లో139 రోజులు నిర్భంధం చేయడం వల్ల మైతీలకు కలిగిన ఇబ్బందులూ వారికీ ఇంకా మదిలో మెదులుతూనే వున్నాయి. అయితే, గతంలో నాగాలకూ, కుకీలకు మధ్య కూడా సాయుధ ఘర్షణలూ జరిగాయి అనేది మరో వాస్తవం. అంటే తెగల మధ్య ఉనికి ఘర్షణలూ అప్పుడూ వున్నాయి.
మణిపూర్ కు మయన్మార్ కు దాదాపు 400 కి.మీ.సరిహద్దు వుంది. అందువల్ల అక్కడి సరిహద్దు ప్రాంతాల ప్రజల మధ్య సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. మయన్మార్లో జరిగిన తిరుగుబాటు అక్కడి లక్షలాది కుటుంబాలను నిరాశ్రయుల జేసాయి. ఫలితంగా, సరిహద్దు ప్రాంతాలో వున్న ప్రజలు, ముఖ్యంగా కుకీ తెగకు చెందివారు మణిపూర్ కు కాందిశీకులుగా చేరారు. దాంతో, రాష్ట్రంలో తమ ఆధిక్యత తగ్గుతుందనే భయం మైతీలకు పట్టుకుంది. అంతేగాక, కొత్తగా వచ్చినవారు నివాసాలకై అడవులను నరికి గృహాలు నిర్మించుకోవడంతో, ప్రభుత్వం జోక్యం కల్పించుకొని వారిని తరిమివేయడంతో అక్కడ ఉద్రిక్త పరిస్తితులేర్పడ్డాయి. కుకీ, ప్రభుత్వ దళాల మధ్య ఘర్షణలు జరిగాయి కూడా. ఆ సందర్భంగా2008 లో కేంద్రానికీ,కుకీ సాయుధ గుంపులకు మధ్య తాత్కాలిక పోరాట విరమణ (సస్పెన్షన్ ఆఫ్ ఆపరేషన్) ఒప్పందం జరిగింది. అయితే తాత్కాలిక శిబిరాలలో వసతి కల్పించిన కుకీలకు, శాశ్వత పునరావాసం ప్రభుత్వం కల్పించలేదని కుకీలకు ప్రభుత్వం పట్ల ఆగ్రహం వుంది. ప్రభుత్వ హామీల పట్ల విశ్వాసం సన్నగిల్లింది. నాడు ఆ శిబిరాల్లో ఉంచిన ఆయుధాలనే నేడు కుకీలు లాక్కొన్నారనే ఆరోపణలూ వున్నాయి. అయితే దాన్ని అడ్డుకొనే ప్రయత్నం చేయక పోవడం ఎందుకు జరిగింది? కుకీల, మైతీల మధ్య జరుగుతున్నా ఘర్షణల వల్ల ఎవరు లబ్ది చెందుతారు?
ఇవే గాక, పెరుతున్న జనాభాకనుగుణoగా భూమి అందుబాటు లేకపోవడం, భూమికై వివిధ తెగల మధ్య స్పర్థలు. కుకీలు నల్లమందుకై గసగసాల సాగు రాష్ట్ర ప్రభుత్వం కుకీలoదరిపై చేస్తున్న ఆరోపణలు, వారిపై ప్రభుత్వ చర్యలూ ఘర్షణ వాతావరణానికి దారితీసాయని అంటున్నారు . ఇలాంటి ఆశాంతి వాతవరణలో హైకోర్ట్ తీర్పు అగ్నికి ఆజ్యం పోసినట్టయింది.
ఇంతటి వైవిధ్యమున్న ప్రాంతంలో భిన్న తెగల ఆకాoక్షలు,ఆశలు, ఒకరిపట్ల మరొకరిలో నెలకొన్నఅవిశ్వాసం , భవిష్యత్తుపై భయాలు, వెంటాడుతున్న గత పీడనలు-ఇంతటి సంక్లిష్ట సమాజపు ప్రజల మధ్య ఐక్యత సాధించడం అంత సులభం కాదు. ఎంతో నేర్పరితనం, సహనం, సంయమనం, నిష్పాక్షికత, ముందు చూపు అవసరం. అలాంటి సహనం, ఓపిక నేటి పాలక వర్గాలకు అవసరం లేదు. ప్రజల మధ్యగల మిత్రవైరుధ్యాలను శత్రు వైరుధ్యాలుగా మార్చి వాటిని తమ ప్రయోజనాలకనుకూలంగా రూపుదిద్దుకోవడమే ఈ పాలకుల లక్ష్యం, నైజం కూడా. జాతి దురహంకారంతో యూదులను, ప్రజాస్వామ్య వాదులను, కమ్యూనిస్టులను ఊచకోతకు గురిజేస్తూ సంక్షోభలో వున్న కార్పోరేట్లకు సేవజేయడం నాటి హిట్లర్, ముస్సోలినీల లక్ష్యమయితే, మతంపేరుతో మారణహోమం సృష్టిస్తూ దేశ వనరులను తమ కార్పోరెట్ల యజమానులకప్పగించడమే నేటి మోదీ అండకో లక్ష్యం. భూగర్భ శాస్త్రజ్ఞులు నిర్వహించిన సర్వే ప్రకారం అక్కడి కుకీ, నాగాలు నివశిస్తున్న ప్రాంతాల్లో మాలికైట్, అజురైట్, మాగ్నతైట్, నికెల్, కాపర్, ప్లాటినంలాంటి విలువైన ఖనిజ సంపద వుంది. దాన్ని దోచిపెట్టేందుకు అటవీ ప్రాంత రక్షణ చట్టం మరియు ఆర్టికల్ 370 లాంటివి అడ్డువస్తాయి. అంతేగాక తమప్రాంత ఆక్రమణకు కుకీలు, నాగాలు అంగీకరించరు. మైతీలలో తమ భవిష్యత్తుపట్ల గల ఆందోళననూ, కుకీ, నాగల పట్ల గల అవిశ్వాసాన్ని సొమ్ముచేసుకుంటూ, మతం పేరుతొ మైతీలను ఉసిగొల్పి అటవీ ప్రాంతాలనుండి మిగతా తెగలను తరిమివేసే ప్రయత్నం. మైతీల-కుకీల మధ్య మతవిద్వేషాలను సృష్టించి,మెజారిటీ క్రైస్తవులుగా ఉన్నవారిని మారణకాండకు గురి జేసి అటవీ సంపదను కార్పోరేట్లకు దోచిపెట్టడం సంఘ్ పరివార్ లక్ష్యం. దీంతో ఒకే దెబ్బకు రెండు పిట్టలు అఖండ హిందూస్తాన్ కు దారి సుగమం జేసుకోవడం, కార్పోరేట్ల దోపిడీకి అడ్డంకుల తొలగించడం , దానికై మైతీల మద్దతుకై వారిని ఎస్ టి కేటగిరిలో చేర్చడం- ఇవన్నీ సంఘ్ పరివారపు వ్యూహాలు. అది స్పష్టంగా ప్రకటించుకున్నట్టు దాని శత్రువుల ముస్లింలు, క్రైస్తవులు, కమ్యూనిస్టులను పూర్తిగా తుడిచివేయడమే దాని లక్ష్యం. గుజరాత్ ముస్లింల తో మొదలైన దాని మానవాహనన విహారానికి నేడు క్రైస్తవుల వంతయ్యిది. ఇక కమ్యూనిస్టులు మిగులుతారా? అలాంటప్పుడు, సదా వారి సేవలో మునిగితేలే మోడీని అక్కడి ఘర్షణలకు స్పందించమని కోరడం మన అజ్ఞానం కాద? అతడొక స్థితప్రజ్ఞుడు. కష్ట, సుఖాలకు, సoతోష, విచారాలకూ(ప్రజలవే అనుకోండి), మోదీ అతీతుడు. తాను నిమిత్తమాత్రుడు. అంటే కార్పోరేట్ కనుసన్నలలో సంఘ్ పరివార్ చూసుకుంటుంది.
ఇప్పటికే వాట్సాప్ యూనివెర్సిటి మణిపూర్ క్రైస్తవ రాజ్యమవుతున్నదని, ముస్లిం మెజారిటీ వున్న కాశ్మీర్ లాగా , మణిపూర్ విదేశీ శక్తులకు, చొరబాటుదారులకు ఆలవాలమవుతుందని ప్రచారం అందుకుoది. అంతేకాదు, అక్కడ జరుగుతున్నా ఘర్షణ మత సంబంధమైనది కాదనీ, కుకీ, నాగా, మైతీల చర్చిలు తగలబడ్డాయనే విoతవాదన ఒకటి జేస్తున్నారు. తగలబడుతున్నవి కేవలం చర్చీలే కదా(ఏ తెగకు చెందినవైనా)కేవలం తెగల మధ్య ఘర్షణాలైతే చర్చీలే ఎందుకు తగలబడుతున్నాయీ, మరో మతపు ప్రార్థనా మందిరాలు ఎందుకు సురక్షితంగా ఉన్నాయనే ప్రశ్న వస్తుంది.
కాశ్మీర్ లో ఇప్పటికే కార్పోరెట్ల భూఆక్రమణ మొదలయ్యింది. ఆదానీల, అంబానీల ప్రవేశానికి మార్గం సుగమం చేసాడు వారి భ్రుత్యుడు. ఇప్పుడు మణిపూర్ ఆదివాసీ ప్రాంతంపై వారికి కన్ను పడింది. కార్పోరేట్ల సెవకై మోదీ ఎలాంటి దుర్మార్గానికైనా వడిగట్టేందుకు సిద్ధం. ఈ ఖాoడవ దహనకాండ (మణిపూర్ మారణకాండ)కు సంఘ్ పరివార్ శ్రీకృష్ణ పాత్ర వహిస్తే, మోదీ, షాలు అర్జునిని పాత్ర వహిస్తున్నారని తేలిపోయింది. ఇక, ఈ మారణకాండ ఇప్పట్లో అంతoకాదని మైతీలు స్పష్టం జేస్తున్నారు. దేశం సిగ్గుపడేలా ఆడపడుచులను నగ్నంగా ఊరేగించి వారిపై అత్యాచారం జరపడం ఒక ఎత్తయితే, అందులో మైతీ మహిళలు గుంపులుగా పాలు పంచుకోవడం మరో విషాదం. అందరినీ నిశ్చేష్టుల జేస్తున్నఈ అమానుష చర్యలను ప్రపంచమంతా గర్హిస్తున్నది. మన దేశపరిస్థితి జూసి జాలి పడుతుంది. అయినా మన విశ్వగురువు మోదీలో చలనం లేదు.
తల్లీ, ముర్మూ, పేరులోని ద్రౌపది వలె కనీసం నోరు విప్పి నిరశన తెల్పవేమమ్మా? అవునులే మీ మనువు చెప్పాడుగా “నస్త్రీ స్వాతంత్రమర్హతీ” అని నీవేం జేస్తావ్, ఒకసారి హిందూత్వ తీర్థం పుచ్చుకున్నాక. రాష్ట్రపదవితో మీ నోటి కట్టడి జరిగిందిగా! తోటి మహిళలకు, అదీ ఆదివాసి మహిళల ఆక్రందనల వినని ఈమె తన సంవత్సరకాల రాష్ట్రపతి పదవిని పురస్కరించుకొని ఆదివాసీ కళల గ్యాలరీని ప్రారంభించడాన్ని ఏమనాలి?
మహిళా కమీషన్ చైర్మన్ ,రేఖా శర్మా గారు కదా! మీ చక్రవరి పట్ల మీ విధేయతకు వందనాలు.
కనీసం న్యాయస్థానాలైనా స్పందిoచాయాయంటే, అదీ లేదు. కంటి తుడుపుగా దాదాపు రెండు నెలల ఘర్షణల తర్వాత కేంద్రాన్ని తగిన చర్యలను తీసుకోవాలనీ, లేకపోతె తాను జోక్యం చేసుకుంటానని అంది. పోనీ ఆదైనా జరిగిందా అంటే అదీ లేదు. అదేమైనా ప్రొ. సాయిబాబా కేసుకొట్టివేయడమా?, వెంటనే జోక్యం జేసుకొని సెలవు రోజుల్లో కూడా NIA అభ్యర్ధన స్వీకరించి మహారాష్ట్ర హైకోర్ట్ తీర్పును రద్దు జేయడానికి. పాపం ఎవరైనా ఈ వ్యవస్థ గొడుగు కిందే పనిజేస్తున్నారు కదా!
రాజకీయపార్టీలకు ప్రజలు కేవలం ఓటర్లు మాత్రమే . సజీవమున్న మనుషులు గారు. వారికై ఏవైనా తాత్కాలిక ఉపశమన చర్యలు చేపడుతారేమో గానీ, వారి సమస్యలకు శాశ్వత పరిష్కారం మాత్రం చూపరు. ప్రజల మెప్పు పొందేoదుకై ప్రతిపక్షాలు పార్లమెంటులో, వీధుల్లో అల్లరి జేస్తాయి. ఆ తర్వాత మరచిపోతాయి. .ప్రజా సంఘాలు, మేధావులు నిరసనలు తెల్పుతాయి. పట్టించుకొనే వారెవ్వరూ వుండరు. పత్రికలూ, టివి లలో ప్రచారమూ జోరందుకుంటుంది. కొంతకాలం తర్వాత అంతా నిశ్శబ్దం. మరలా మరో సంఘటన జరిగే దాక ఎవరి జీవితం వారిది.
పక్కనే వున్న శ్రీలంకలో అత్యంత అవినీతిపరుడైన అధ్యక్షున్ని దేశం నుండి పారిపోయేలా జేశారు అక్కడి ప్రజలు. దాంట్లో అక్కడి రాజకీయ పార్టీల లేకపోవడం గమనార్హం. అక్కడి మీడియా ప్రజల వైపు నిలిచింది. ఇప్పుడు ఇజ్రాయెల్ లో సుప్రీం కోర్ట్ అధికారాలను తగ్గించే ప్రయత్నాన్ని ఆ దేశప్రజలంతా మూకుమ్మడిగా ఎదిరిస్తున్నారు. మరి అతిపెద్ద ప్రజాస్వామ్యమని చెప్పుకొనే మనదేశం లో పౌరసమాజపు స్పందన అత్యంత బలహీనంగా వుండటం ఎంత బాధాకరం.
ఆదివాసీలూ , ఇతర పీడిత సమూహాలు వ్యవస్థ మార్పుతోనే తమకు వివిధ దోపిడీ, పీడనల నుండి శాశ్వత విముక్తి లభిస్తుందని తెలుసుకోవాలి. వివిధ తెగల మధ్య వున్న వైవిధ్యాలను శత్రు వైరుధ్యాలుగా మారకుండా జాగారూకులు కావాలి. వారి చూపు ఇప్పుడు దండకారణ్యం వైపు మరలాల్సివుoది. ఆ లక్ష్యం తో ప్రజల్ని అప్రమత్తం జేయడం మనoదరి కర్తవ్యం.
“జాతులు విముక్తిని, దేశాలు స్వాతంత్రాన్ని, ప్రజలు విప్లవాన్ని కోరుతారు”—మావో
(కా. సిఎస్ ఆర్ సూచనలకు కృతజ్ఞతలతో)
“””భూగర్భ శాస్త్రజ్ఞులు నిర్వహించిన సర్వే ప్రకారం అక్కడి కుకీ, నాగాలు నివశిస్తున్న ప్రాంతాల్లో మాలికైట్, అజురైట్, మాగ్నతైట్, నికెల్, కాపర్, ప్లాటినంలాంటి విలువైన ఖనిజ సంపద వుంది. దాన్ని దోచిపెట్టేందుకు అటవీ ప్రాంత రక్షణ చట్టం మరియు ఆర్టికల్ 370 లాంటివి అడ్డువస్తాయి. అంతేగాక తమప్రాంత ఆక్రమణకు కుకీలు, నాగాలు అంగీకరించరు. మైతీలలో తమ భవిష్యత్తుపట్ల గల ఆందోళననూ, కుకీ, నాగల పట్ల గల అవిశ్వాసాన్ని సొమ్ముచేసుకుంటూ, మతం పేరుతొ మైతీలను ఉసిగొల్పి అటవీ ప్రాంతాలనుండి మిగతా తెగలను తరిమివేసే ప్రయత్నం. మైతీల-కుకీల మధ్య మతవిద్వేషాలను సృష్టించి,మెజారిటీ క్రైస్తవులుగా ఉన్నవారిని మారణకాండకు గురి జేసి అటవీ సంపదను కార్పోరేట్లకు దోచిపెట్టడం సంఘ్ పరివార్ లక్ష్యం.
ప్రజల మధ్యగల మిత్రవైరుధ్యాలను శత్రు వైరుధ్యాలుగా మార్చి వాటిని తమ ప్రయోజనాలకనుకూలంగా రూపుదిద్దుకోవడమే ఈ పాలకుల లక్ష్యం, నైజం కూడా.
కార్పోరేట్ల సెవకై మోదీ ఎలాంటి దుర్మార్గానికైనా వడిగట్టేందుకు సిద్ధం. ఈ ఖాoడవ దహనకాండ (మణిపూర్ మారణకాండ)కు సంఘ్ పరివార్ శ్రీకృష్ణ పాత్ర వహిస్తే, మోదీ, షాలు అర్జునిని పాత్ర వహిస్తున్నారని తేలిపోయింది. “