“నేరమే అధికారమై
ప్రజల్ని నేరస్థుల్ని చేసి వేటాడుతుంటే
ఊరక కూర్చున్న నోరున్న ప్రతివాడూ నేరస్థుడే”
– వరవరరావు

 భారతదేశంలోని జాతీయ భద్రతా చట్టాలు సహజ న్యాయ సూత్రాలను పాటించకుండా వ్యక్తులను అరెస్టు చేయడానికి అనుమతిస్తాయి. అయినప్పటికీ, అవి మరింత బలోపేతమవుతూనే ఉన్నాయి. ఎటువంటి న్యాయపరమైన ప్రక్రియను అనుసరించకుండా వ్యక్తులను ఉగ్రవాదులుగా ప్రకటించడానికి రాజ్యానికి అనుమతినిస్తూ చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం, 1967కు చట్టపరమైన హక్కుల చట్టబద్ధమైన వినియోగాన్ని నిరోధించే, “నేరం రుజువయ్యే వరకు నిర్దోషిగా భావించాలి” అనే ప్రాథమిక భావనను ఉల్లంఘించే సవరణను 2019లో చేశారు. 

2023 మార్చి లో, UA(P)A కింద నేరంగా పరిగణించటానికి నిషేధిత సంస్థలో సభ్యత్వం మాత్రమే సరిపోతుందని నిర్ధారించడానికి భారతదేశ సుప్రీం కోర్ట్ 2011లో అరుప్ భుయాన్ vs అస్సాం గృహ శాఖ తీర్పులో తానే యిచ్చిన న్యాయపరమైన పూర్వాపరాలను (ప్రిసిడెంట్స్) ఉల్లంఘించింది.

అదేవిధంగా, దేశద్రోహాన్ని నేరంగా పరిగణించే చట్టాలను, ప్రత్యేకించి భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 124A సుప్రీంకోర్టు తాత్కాలికంగా సస్పెండ్ చేసింది.  అయితే అందుకు భిన్నంగా 22వ లా కమిషన్ ఆఫ్ ఇండియా ఈ నిబంధన కింద పరిధిని,  శిక్షలను విస్తరించాలని సిఫారసు చేసింది. UA(P)Aని బలోపేతం చేయడం, దేశద్రోహానికి వ్యతిరేకంగా వలసరాజ్యాల కాలం నాటి చట్టాలను బలోపేతం చేయాలనే డిమాండ్లు కేవలం యాదృచ్ఛికం కాదు. అవి ఈ దేశ ప్రజలపై జరుగుతున్న తీవ్రస్థాయి ఫాసిస్టు దాడికి, బ్రాహ్మణీయ హిందూత్వ ఫాసిస్ట్ ప్రాజెక్టుకు ప్రజాస్వామిక సాధనాలు కీలక సాధనాలుగా మారాయి.

భారతదేశం లాంటి అర్ధ-వలస,అర్ధ-భూస్వామ్య దేశంలో, వర్గ ప్రయోజనాల పరిరక్షణ, తీవ్ర దోపిడీ,  సామ్రాజ్యవాదులకు దళారీలుగా పనిచేయడం అనేది రాజ్యమూ, దాని సంస్థల ద్వారా అమలు చేసే పాలకవర్గ సిద్ధాంతంగా వుంటుంది. అలాగే, భారత ప్రజాస్వామ్యం అనే ప్రహసనం తీవ్ర దోపిడీ, విస్తృతమైన అవినీతిపై నడుస్తుంది. ఎంత చిన్న వ్యతిరేకత వచ్చినా రాజ్యం భయోత్పాతం, హింసలతో ప్రతిస్పందిస్తుంది.

చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం రాజ్యం చేపట్టిన అనేక చర్యలలో ఒకటి మాత్రమే. గత ఏడాది భారత ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రకటనలతో ఈ భావజాలం స్పష్టంగా కనిపిస్తుంది, “మనం అన్ని రకాల నక్సలిజాన్ని ఓడించాలి – అది తుపాకీతో అయినా లేదా కలంతో అయినా. అన్నింటికీ మనం పరిష్కారం కనుగొనవలసి ఉంటుంది.” ఫాసిజానికి ప్రతిఘటన ఏ రూపంలో అయినా -అవి ప్రజాస్వామిక, ప్రగతిశీల శక్తులే అయినప్పటికీ-  ఫాసిజానికి సాయుధ విప్లవ ప్రతిఘటనతో సమానం అవుతుంది.

తెలంగాణలోని తాడ్వాయిలో దాదాపు ఏడాది క్రితం నమోదైన యూఏపీఏ కేసు ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఎఫ్ఐఆర్లో దాదాపు 152 మంది నిందితులు ఉన్నారు. IPC సెక్షన్లు 120 (B), 147, 148 r/w 149, UAPA సెక్షన్లు 10, 13, 18, 20,  38, ఆయుధాల చట్టంలోని సెక్షన్ 25(1-B)(a) కింద నేరాలు నమోదు అయ్యాయి.

నిందితుల్లో హైదరాబాద్ యూనివర్సిటీలో స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్ పూర్వ డీన్ ప్రొఫెసర్ జి. హరగోపాల్, ఉస్మానియా యూనివర్సిటీలో జర్నలిజం ప్రొఫెసర్ పద్మజా షా, విశ్రాంత బాంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హోస్బెట్ సురేష్ ఉన్నారు. ఈ అభియోగాలు ఇండియన్ పీనల్ కోడ్  క్రింద ఒక ఉమ్మడి ఉద్దేశ్యంతో చట్టవిరుద్ధంగా సమావేశమై చేసిన నేరపూరిత కుట్ర, అల్లర్లకు సంబంధించిన (మారణాయుధాలతో) నేరాలను సూచిస్తాయి. నిందితులు “భారత సార్వభౌమాధికారానికి” వ్యతిరేకంగా తీవ్రవాద చర్యకు పాల్పడ్డారని సూచిస్తున్నాయి.

తెలంగాణ రాష్ట్రంలోని తాడ్వాయిలో మరో తప్పుడు కేసు ఎఫ్ఐఆర్ ప్రకారం, తాడ్వాయి అడవుల్లో మావోయిస్టులు సమావేశమయ్యారని తెలుసుకున్న పోలీసులు భారీ బలగాలతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎవరూ పట్టుబడనప్పటికీ, పోలీసులు సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నారట, అందులో వారికి 152 పేర్లు వున్న కాయితాలు కనబడ్డాయట. ‘యాక్టస్ ర్యూస్’ ను (Actus Reus లాటిన్ భాషలో “అపరాధ చర్య” అని అర్థం. ఈ పదాన్ని సాధారణంగా “మెన్స్ రియా” అనే పదంతో కలిపి సూచిstaaru . దీని అర్థం “అపరాధ మనస్సు”. ఒక వ్యక్తి ఏదైనా నేరపూరిత చర్య చేసినందుకు  బాధ్యత వహించాలంటే, వారు దానిని నేరపూరిత ఉద్దేశ్యంతో లేదా నిర్లక్ష్యంగా చేసి ఉండాలి) నిర్థారించకుండానే ,  అక్కడ దొరికిన సాహిత్యంలో 152 మంది వ్యక్తుల పేర్లు వున్నాయంటూ  కేసు పెట్టారు.  ఆ విధంగా ఎలాంటి చట్టపరమైన ఆధారం లేకుండా, చట్టంలోని ప్రాథమిక సూత్రాలకు విరుద్ధంగా  నేరాన్ని నమోదు చేసారు. విషాదం ఏమిటంటే, కేసులను ఛేదించే పోలీసులు, ఎలాంటి చట్టపరమైన ఆధారాలు లేకుండానే కేసులు నమోదు చేస్తారనే అనుభవం మేజిస్ట్రేట్లకు ఉన్నప్పటికీ, ఎఫ్ఐఆర్‌ను యాంత్రిక పద్ధతిలో న్యాయపరమైన ఆలోచన లేకుండా నమోదు చేయడం జరిగింది.

ఉదాహరణకు, న్యాయ విద్యార్థి, తెలంగాణ విద్యార్థి వేదిక (TVV) పూర్వ జాయింట్ సెక్రటరీ ఎడ్ల కిషోర్ ఈ కేసులో మొదటిసారిగా  PT వారెంట్ మీద 2023,  మార్చి 17న హాజరు కాగా, పేట్రియాటిక్ డెమోక్రటిక్ మూవ్మెంట్ (PDM) ఉపాధ్యక్షుడు చంద్రమౌళిని  2023 మే 19న రిమాండ్ చేశారు. ఎడ్ల కిషోర్ నిందితుడు నెం. 18. కానీ ఈ నేరంలో 78వ నిందితుడిగా పేర్కొన్నారు. చంద్రమౌళి నిందితుడు నెం, కానీ ఈ నేరంలో 11గా రాశారు. ఇది రిమాండ్ రిపోర్ట్ తయారు చేసిన యాంత్రిక విధానాన్ని స్పష్టంగా చూపిస్తుంది.

తాడ్వాయి కేసులో ఎఫ్ఐఆర్లో నమోదైన 152 మందిలో, 14 మంది సభ్యులు,  పౌర హక్కుల కోసం పోరాడిన గొప్ప చరిత్ర కలిగిన ప్రజాస్వామ్య హక్కుల సంస్థ అయిన పౌర హక్కుల సంఘానికి చెందినవారు. ఇందులో CLC సీనియర్ కార్యవర్గ కమిటీ సభ్యుడు ప్రొఫెసర్ జి. హరగోపాల్ (నిందితుడు-42) ఉన్నారు. నిందితుల్లో మరికొందరు ప్రొఫెసర్ పద్మజా షా (నిందితురాలు-41), మేధావి,  దివంగత విశ్రాంత బాంబే హైకోర్టు న్యాయమూర్తి హోస్బెట్ సురేష్ (నిందితుడు-137). ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ పీపుల్స్ లాయర్స్ (IAPL) కార్యకర్తలు సుధా భరద్వాజ్, ఎం. వెంకన్న, సురేంద్ర గాడ్లింగ్, అంకిత్ గ్రేవాల్, సురేష్ కుమార్, అరుణ్ ఫెరీరా, దశరథ్, ఆర్తి, అమర్ నాథ్ పాండే, బల్లా రవి, గురునాథం, కె. ఎస్. చలం, మహదేవన్, శివప్రసాద్ సింగ్‌లను నిందితులుగా చేర్చారు. కార్యకర్తలను ఇరికించడానికి దర్యాప్తు అధికారి IAPL లెటర్‌హెడ్‌ను బట్టి రాసి ఉండవచ్చు.1 భీమా కోరేగావ్ కార్యకర్తల పైన మరో తప్పుడు కేసు

2018 భీమా కోరేగావ్ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న కార్యకర్తలు,  న్యాయవాదులు కూడా ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. భీమా కోరేగావ్‌ కేసుకు సంబంధించి, మానవ హక్కులపై పని చేస్తున్నందుకు ప్రతీకారంగా న్యాయవాదులు,  కార్యకర్తలను అరెస్టు చేయడంపై అమెరికన్ బార్ అసోసియేషన్‌లోని నాలుగు లక్షల మంది సభ్యులు 2019 అక్టోబరులో ప్రాథమిక నివేదికను విడుదల చేశారు. పౌర, ప్రజాస్వామ్య హక్కుల సంస్థలు ఈ మేధావుల అరెస్టును ఖండిస్తూ, వారి విడుదల కోసం డిమాండ్ చేస్తూంటే, తాడ్వాయి కేసులో సుధా భరద్వాజ్, సురేంద్ర గడ్లింగ్, అరుణ్ ఫెర్రెరా వంటి వ్యక్తులపై మరో ఆధారం లేని నేరం నమోదైంది. తప్పుడు కేసును తయారు చేసేందుకు పూణె పోలీసులు, కార్యకర్తల ఎలక్ట్రానిక్ పరికరాలపై నిఘాను ఉంచారని అమెరికాకు చెందిన స్వతంత్ర సైబర్‌ సెక్యూరిటీ సంస్థలు సెంటినెల్‌వన్,  ఆర్సెనల్ కన్సల్టింగ్ యిచ్చిన నివేదిక, ఇప్పటికే ఈ కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఎల్గార్ పరిషత్ యునైటెడ్ ఫ్రంట్‌కు వ్యతిరేకంగా రాజ్యం చేసిన ఫాసిస్ట్ కుట్రనే భీమా కోరేగావ్ కేసు అనే వాస్తవాన్ని బయటపెట్టింది.

ఈ కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఎల్గార్ పరిషత్ యునైటెడ్ ఫ్రంట్‌కు వ్యతిరేకంగా రాష్ట్రం చేసిన ఫాసిస్ట్ కుట్రగా భీమా కోరేగావ్ కేసు కొట్టిపారేసింది, అమెరికాకు చెందిన స్వతంత్ర సైబర్‌ సెక్యూరిటీ సంస్థలు సెంటినెల్‌వన్, ఆర్సెనల్ కన్సల్టింగ్ నివేదికలప్రకారం తప్పుడు కేసు పెట్టడం కోసం  పూణె పోలీసులు కార్యకర్తల ఎలక్ట్రానిక్ పరికరాలపై సాక్ష్యాలను పెట్టారు.

హక్కుల కార్యకర్త జస్టిస్ హోస్బెట్ సురేష్‌ 

దివంగత హక్కుల కార్యకర్త, జస్టిస్ హోస్బెట్ సురేష్‌ను యూఏపీఏ  చట్టం కింద నిందితుడిగా చేర్చడం ఆశ్చర్యకరమేమీ కాదు. ప్రగతిశీల విలువలను సమర్థించే న్యాయమూర్తులు కూడా ఫాసిస్టు హింస నుండి సురక్షితంగా లేరు. సోహ్రాబుద్దీన్ షేక్ హత్య కేసులో బిజెపి అమిత్ షాను కోర్టుకు హాజరుకావాలని కోరినందుకు జస్టిస్ బ్రిజ్‌గోపాల్ హరికిషన్ లోయా హత్యకు గురయ్యారు.

ఈ విషయాన్ని సుప్రీంకోర్టు రెండో నుంచి ఐదో సీనియర్ న్యాయమూర్తుల పత్రికా సమావేశం మరింత ధ్రువీకరించింది. అందులో వారు అప్పటి భారత ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా, పాలక ఫాసిస్ట్ శక్తుల రాజకీయ ప్రయోజనాలకు ఎలా సేవ చేశారో వివరించారు. దివంగత న్యాయమూర్తి సురేశ్‌ను యూఏపీఏ కేసులో ఇరికించిన ఈ చర్య ద్వారా ప్రభుత్వ సంస్థలపై వున్న ఫాసిజం ప్రభావాన్ని చూడగలం.

2002 గోద్రా రైలు ఘటన తర్వాత 2002 గుజరాత్ హింసాకాండపై దర్యాప్తు జరిపిన న్యాయమూర్తి విఆర్  కృష్ణయ్యర్ నేతృత్వంలోని ఇండియన్ పీపుల్స్ ట్రిబ్యునల్ (IPT) బృందంలో దివంగత న్యాయమూర్తి జస్టిస్ సురేష్, పిబి సావంత్ సభ్యులుగా ఉన్నారు. హిందుత్వ ఫాసిస్ట్ హింసాకాండ సమయంలో జరిగిన అత్యాచార దాడులపై కూడా కమిటీ విచారణ జరిపింది. “క్రైమ్ ఎగైనెస్ట్ హ్యుమానిటీ” పేరుతో ఒక నివేదికలో బృందం తమ పరిశోధనలను నమోదు చేసింది. హత్యలు చేస్తున్న హిందుత్వ ఫాసిస్టులను అరికట్టవద్దని ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ పోలీసులను ఆదేశించారని రాష్ట్ర మాజీ హోంమంత్రి హరేన్ పాండ్యా తనకు, సావంత్‌కు తెలియజేసినట్లు 2012 ఫిబ్రవరిలో దివంగత న్యాయమూర్తి సురేశ్ వెల్లడించారు. 2003 మార్చిలో పాండ్యా హత్యకు గురయ్యారు.

గుజరాత్‌లో జరిగిన మారణహోమకాండకు ప్రతిస్పందనగా, దివంగత జస్టిస్ సురేశ్ “ది ప్రివెన్షన్ ఆఫ్ జెనోసైడ్ అండ్ క్రైమ్స్ ఎగైనెట్ హ్యుమానిటీ యాక్ట్ 2004” అనే ప్రతిపాదిత చట్టాన్ని రూపొందించడంలో చురుకుగా పాల్గొన్నారు. నిర్దిష్ట పౌర సమూహాన్ని లక్ష్యంగా చేసుకుని సామూహిక హింసాకాండను నియంత్రించడంలో విఫలమైతే  అందుకు మంత్రులు, అధికారులు బాధ్యులను చేయాలని ఈ చట్టం లక్ష్యంగా పెట్టుకుంది.

గుజరాత్ కసాయి, అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి భారతదేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. అటవీ ప్రాంతాల్లో సామ్రాజ్యవాద మైనింగ్ కార్యకలాపాలను నిరసిస్తున్న గ్రామస్థుల పైన డ్రోన్లతో వైమానిక దాడులు చేస్తున్నాడు. నరేంద్ర మోడీ పాలనా చరిత్ర భారతదేశంలోని ప్రజానీకానికి వ్యతిరేకంగా హింసాకాండలు, మారణహోమ కార్యక్రమాలతో నిండిపోయింది.

ప్రస్తుతం, జస్టిస్ సురేష్, సావంత్, కృష్ణయ్యర్‌ల దృష్టాంతాలను (ప్రిసిడెంట్స్) అనుసరించే న్యాయమూర్తులు చాలా తక్కువ. న్యాయవ్యవస్థ రాజ్యానికి ఒక అస్త్రంగా ఉన్నప్పటికీ, భారతదేశంలో దళారీ నిరంకుశ బూర్జువా వర్గ పాలన సాధనంగా ఉన్నప్పటికీ, ప్రగతిశీల,  ప్రజాస్వామిక భావాలు కలిగిన న్యాయమూర్తులు సురేష్, సావంత్, కృష్ణయ్యర్‌లు ప్రజానీకానికి ప్రగతిశీల న్యాయవ్యవస్థ అనే భ్రమను కలిగిస్తారు.

2019 అయోధ్య తీర్పులో ఆయన పోషించిన కీలక పాత్ర ద్వారా ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ వంటి ‘ప్రగతిశీలవాదులు’ అని పిలవబడే వారు కూడా కేవలం ఫాసిస్ట్ శక్తుల ఆశ్రితులే అని స్పష్టమవుతుంది. చివరగా, మరణించిన రెండేళ్ల తర్వాత 2022లో జస్టిస్ సురేష్‌కు, న్యాయమూర్తిగా ఆయన చేసిన పనికి మరణానంతర యూఏపీఏతో కృతజ్ఞతలు తెలిపారు.

“ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్యం”లో యూఏపీఏ చట్టం, మరియు దేశద్రోహం ఉనికి భారతదేశ బూటకపు ప్రజాస్వామ్య స్వభావాన్ని బహిర్గతం చేస్తుంది. నిజమైన ప్రజాస్వామిక సమాజంలో, అటువంటి చట్టాలకు చట్టబద్ధత లేదు. తాడ్వాయి కేసులో, వివిధ రాజకీయ శక్తుల ఒత్తిడితో, ములుగు జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఆరుగురిపై, ప్రొఫెసర్ జి. హరగోపాల్, ప్రొఫెసర్ పద్మజా షా, ప్రొఫెసర్ గుంటి రవీందర్, అడ్వకేట్లు సురేష్ కుమార్, వి. రఘునాథ్, గడ్డం లక్ష్మణ్‌లపై అభియోగాలను ఎత్తివేస్తామని తెలిపాడు. అయితే ప్రొఫెసర్ హరగోపాల్ వెంటనే ఎత్తి చూపినట్లుగా, మరణించిన జస్టిస్ సురేశ్‌తో సహా మిగిలిన నిందితులందరిపై కూడా అభియోగాలను ఎత్తివేయాలి.

తాడ్వాయి నేరంలో నిందితులుగా పేర్కొన్న పేర్లను తొలగించేందుకు మెమో దాఖలు చేస్తామని చెబుతున్న ప్రభుత్వం, ఇప్పటికే ప్రొఫెసర్ లక్ష్మణ్, ప్రొఫెసర్ గుంటి రవి, న్యాయవాదులు రఘునాథ్, సురేష్ కుమార్‌లపై ఇలాంటి నిరాధారమైన యూఏపీఏ కేసులను దాఖలు చేసింది.

సామూహిక-యూఏపీఏ కేసుల ధోరణి :

యూఏపీఏ కింద కనీసం 100 మందిని నిందితులుగా చేర్చి 10కి పైగా కేసులు నమోదయ్యాయి.

తెలంగాణాలో కేసులు

1. జూలై 2018లో, గంటా సత్యంపై ఖమ్మంలోని I అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్‌కి దాఖలు చేసిన ఛార్జ్ షీట్‌లో, ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ జి ఎన్  సాయిబాబా, చిలుక చంద్ర శేఖర్‌లను నిందితులుగా పేర్కొన్నారు. అయితే ఈ ఇద్దరిపై చార్జిషీట్ దాఖలు చేయలేదు.

2. నేర సంఖ్య 86/2018 ను చర్ల పోలీస్ స్టేషన్‌లో 10.09.2018నాడు నమోదు చేసారు. 28 నవంబర్ 2018న, ఈ కేసులో మొదటిసారిగా, నిందితురాలు నెం. 6 నగరం రూప @ సుజాత ఒప్పుకోలు పంచనామా ఆధారంగా, 12 వివిధ సంఘాలకు చెందిన 24గురిని చేర్చారు. అంగీకార పంచనామాలో చేర్చిన వారందరినీ ఆ తర్వాత నిందితులుగా చేర్చి, కొందరిని కోర్టులో హాజరుపరిచారు.

3. పూర్వ వరంగల్ జిల్లాలో 2018లో మడావి అడమ అనే మావోయిస్ట్‌ను అరెస్ట్‌ చేసి,            అతనితో పాటు కొంతమంది విద్యార్థుల పేర్లను చేర్చారు.

4. లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 07.06.2019 నాడు నేర సంఖ్య 101/2019లో డెమోక్రటిక్ స్టూడెంట్ యూనియన్ అనే విద్యార్థి సంస్థలో పనిచేస్తున్న రంజిత్ అనే యువకుడిని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సెక్యూరిటీస్ చట్టం కింద అరెస్టు చేసి, అతనితో పాటు  ఎఫ్‌ఐఆర్‌లో పలువురు ప్రజాస్వామిక సంస్థల నేతలను నిందితులుగా చేర్చారు. రంజిత్‌ను ఒక నెల లోపే విడుదల చేశారు, కానీ తర్వాత ఆ కేసును యూఏపీఏ చట్టం కింద మార్చారు. ఆ తర్వాత ఈ కేసులో అరెస్టయిన వారు నెలల తరబడి జైల్లో ఉండాల్సి వచ్చింది.

5. 05.10.2019 న గద్వాలలో నాగన్న అనే విద్యార్థి నాయకుడిని అరెస్టు చేసి నేర సంఖ్య 191/2019లో ఇప్పటివరకు 37 మందిని నిందితులుగా చేర్చారు.

6. తెలంగాణ విద్యార్థి వేదిక అధ్యక్షుడు మద్దిలేటిపై  08.10.2019 న, హైదరాబాద్ నల్లకుంట పోలీస్ స్టేషన్‌లో నేర సంఖ్య 176/2019 గా కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఆ తర్వాత, ఈ కేసును నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (NIA) తీసుకుంది. ఇంకో నలుగురు నిందితులను చేర్చి, 2020లో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. అరెస్టుల పరంపరలో ఇది మొదటి ఛార్జ్ షీట్ కేసు. ఇతర కేసుల్లో 10 మందికి పైగా సభ్యులు నిందితులుగా పేర్కొన్నప్పటికీ వారిని ఈ కేసులో సాక్షులుగా పేర్కొన్నట్లు సమాచారం.

7. 19.10.2019 న చర్ల పోలీస్ స్టేషన్‌లో నేర సంఖ్య 105/ 2019 నమోదైంది. ఎఫ్‌ఐఆర్‌లో 45 మందిని నిందితులుగా చేర్చారు. విస్తృతంగా తెలిసిన మొదటి కేసు ఇది. ఆంధ్రజ్యోతి దినపత్రిక కవర్ పేజీపై నేతల పేర్లు, వారి సంస్థల పేర్లను ప్రస్తావించారు., ఈ 45 మందిని అరెస్టు చేసిన తర్వాత, ఆరోపించిన ఒప్పుకోలు పంచనామా ఆధారంగా మరికొంత మంది నిందితులను చేర్చారు. ఇప్పుడు వారి  సంఖ్య 80 దాటింది.

8. రామజన్మ భూమి కేసుపై 9.11.2019న సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. ఫోరమ్ ఎగైనెస్ట్ హిందూ ఫాసిజం (FAHF) దీనిపై కార్యక్రమాన్ని ప్రకటించింది. వెంటనే 12.11.2019న FAHF నాయకులు అనురాధ, నర్ల రవిశర్మలను అరెస్టు చేశారు. 12 మంది నిందితులపై కేసు నమోదు చేశారు. తెలంగాణకు చెందిన ప్రముఖ పాత్రికేయుడు, వీక్షణం సంపాదకుడు ఎన్.వేణుగోపాల్‌ను కూడా నిందితుడిగా చేర్చారు. న్యాయవాది సమక్షంలోనే పోలీసు కస్టడీ చేపట్టాలని కోర్టు ఆదేశించింది. పోలీసు కస్టడీలో వున్న నర్ల రవి, అనురాధలకు న్యాయవాదిగా వెళ్లిన అడ్వకేట్ ఆరెళ్ళ దశరథను ఈ కేసులో నిందితుడిగా చేర్చారు. ఆ తర్వాత ఒకరిని అరెస్టు చేసి, డజను మందిని, ఆ తర్వాత మరో డజను మందిని చేర్చారు. 25.01.2023 న నిందితుడు నంబర్ 78 విద్యార్థి నాయకుడు కిషోర్‌ను అరెస్టు చేశారు. నిందితుల సంఖ్య 94కి చేరుకుంది. ఇప్పటివరకు ఈ కేసులో చివరి నిందితుడు మావోయిస్టు అగ్రనేత చంద్రన్న, నిందితుడు నెం. 94.

9. సిద్దిపేట జిల్లా, ములుగు పోలీస్ స్టేషన్ లో నేర సంఖ్య  నెం.07/ 2016 కింద 2016లో శ్యామ్ సుందర్ రెడ్డిని అరెస్టు చేసి జైలుకు పంపారు. ఈ కేసులో ఉస్మానియా యూనివర్శిటీ ప్రొఫెసర్‌ కాశింను నిందితుడిగా పేర్కొన్నారు. 18.01.2020న ప్రొఫెసర్‌ కాశింను అరెస్టు చేసి హైకోర్టు ముందు హాజరుపరిచారు కూడా. మరో 50 మందిని ఈ కేసులో నిందితులుగా చేరారు. ఈ కేసులో ఇప్పటి వరకు 59 మందిని నిందితులుగా చేర్చి, వారందరిపై చార్జిషీటు దాఖలు చేశారు. సిద్దిపేట కోర్టులో 2023 ఎస్‌సి నెం. 06/2023 కింద చార్జిషీటు దాఖలు చేసిన రెండవ కేసు.

10. నేర సంఖ్య  21/ 2020, తేదీ 26.02.2020 నాడు నమోదు అయింది. ఇందులో వరంగల్‌కు చెందిన సంఘాలకు చెందిన 20 మందిని నిందితులుగా చేర్చారు. ములుగు జిల్లా వెంకటాపురంలో దార సారయ్య అనే వ్యక్తిని అరెస్టు చేశారు. అతని బంధువులు ఉదయం 8 గంటలకు పోలీసు హెల్ప్‌‌లైన్‌కు ఫోన్ చేసి, సివిల్ డ్రెస్‌లో వున్న సాయుధులైన వ్యక్తులు పొద్దున్నే అతణ్ణి ఇంటి నుండి తీసుకెళ్లారని ఫిర్యాదు చేస్తే, సరైన సమాధానం రాలేదు. ఉదయం 11 గంటలకు జిల్లా మేజిస్ట్రేట్‌కు పోలీసు హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేస్తే సరిగ్గా స్పందించలేదని ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో వెంకటాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో మధ్యాహ్నం 3 గంటలకు వాహనాన్ని తనిఖీ చేస్తుండగా అతను అనుమానాస్పదంగా ఉన్నట్లు గుర్తించి కేసు నమోదు చేశారు.

2.11.2020 నాడు తాడ్వాయి పోలీస్ స్టేషన్‌లో నేర సంఖ్య 169/ 2020 నమోదైంది. తాడ్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలో నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు, 15 మందికి పైగా నిందితులను చేర్చారు. నేరాంగీకార పంచనామాలో నిందితులు కాకుండా 21 సంఘాల ప్రస్తావన ఉన్నట్లు తెలుస్తోంది. వీక్షణం ఎడిటర్ వేణుగోపాల్, భీమా కోరేగావ్ నిందితుడు వరవరరావుతో సహా 90 మందికి పైగా అనేక సంస్థలకు చెందిన కార్యకర్తలను చేర్చినట్లుగా తెలుస్తోంది. అయితే వారిని నిందితులుగా చూపించలేదు. కానీ ప్రభుత్వం కావాలనుకున్నప్పుడు, అలా ఒప్పుకోలు స్టేట్‌మెంట్‌లో పేర్కొన్న వారిలో చాలా మందిని నిందితులుగా పిటి వారెంట్ కింద హాజరు పరిచారు.

ఆంధ్రప్రదేశ్ కేసులు:

1. 22.12.2018న, ఒక నేరం గా నమోదు చేయబడింది. 2018 నేర సంఖ్య 47, జి. మాడుగుల పి.ఎస్. 51 మందిని నిందితులుగా చేర్చారు. వివిధ సంస్థల కార్యకర్తలను నిందితులుగా పేర్కొన్నారు.

2. 23.11.2020న, ముంచుంగిపుట్టు పోలీస్ స్టేషన్‌లో  నేర సంఖ్య 47/2020 లో 64 మంది సభ్యులను నిందితులుగా పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు వి. చిట్టిబాబు (ఏ 41), ప్రధాన కార్యదర్శి చిలుక చంద్రశేఖర్ (ఏ 40) కూడా నిందితులుగా పేర్కొన్నారు.

3. 27.06.2022న, పెదబయలు పోలీస్ స్టేషన్‌లో నమోదు అయిన నేర సంఖ్య 48/ 2022 లోని ఒప్పుకోలు పంచనామాలో చిలుక చంద్ర శేఖర్, పినాక పాణి, మోడెం పద్మలను ప్రస్తావించారు.

4. పిడుగురాళ్ల పోలీస్ స్టేషన్‌లో 24.11.2020న నమోదైన నేర సంఖ్య. 606/2020 లో ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం (APCLC), మానవ హక్కుల వేదిక(HRF), విరసం (విప్లవ రచయితల సంఘం), అమరుల బంధు మిత్రుల సంఘం (ABMS), ప్రగతిశీల కార్మిక సమాఖ్య (PKS), ప్రజా కళా మండలి (PKM), చైతన్య మహిళా సంఘం (CMS ), రాజకీయ ఖైదీల విడుదల కమిటీ (సిఆర్‌పిపి), కుల నిర్మూలన పోరాట సమితి (KNPS)లు మావోయిస్టు పార్టీకి సానుభూతిపరులు అని ఒప్పుకోలు పంచనామాలో వున్నదని అంటున్నారు. వి. చిట్టిబాబు, సిఎల్‌సి (ఎ 19), చిలుక చంద్ర శేఖర్, సిఎల్‌సి (ఎ 5), వరలక్ష్మి, విరసం (ఎ 9), పినాక పాణి, విరసం (ఎ 8) పేర్లను కూడా నిందితులుగా చేర్చారు.

ఆంధ్రప్రదేశ్ కార్యకర్తలపై కేరళ కేసు

1. కేరళలో వరలక్ష్మి, పినాక పాణి తదితరులపై  కల్పిత కేసు, RC 1/2022/NIA/Koc, తేదీ 03.02.2022, పెట్టారు.

ఛత్తీస్‌గఢ్, తెలుగు రాష్ట్రాల కార్యకర్తలపై NIA కేసు.

2019 జులై 28న, ఛత్తీస్‌గఢ్‌లోని నగర్నార్ పోలీస్ స్టేషన్‌లో నేర సంఖ్య 179/ 2019గా నమోదు చేసిన ఒక కేసులో తెలుగు రాష్ట్రాల్లో 10కి పైగా ఇళ్లపై ఎన్ఐఏ దాడులు చేసింది.

Leave a Reply