పదేళ్ల భారత రాష్ట్ర సమితి పాలన ముగిసి  తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ సాధనలో చోదకశక్తి అని , తెలంగాణ తెచ్చింది తామేనని టిఆర్ఎస్ నాయకత్వం తెలంగాణ సమాజాన్ని వంచన చేసింది. అనేక బలిదానాలు, త్యాగాలు , వర్గాల సమీకరణలో భాగంగా దశాబ్దం క్రితం తెలంగాణ సాకారమైంది‌. పోరాడి సాధించుకున్న తెలంగాణ  ప్రజాస్వామిక తెలంగాణగా తమ వనరులు తమకు దక్కడమేగాక  నూతన రాష్ట్రంలో తమ ఆకాంక్షలన్నీ  నెరవేరాలని, ప్రజాస్వామిక  భావనలు మరింత విస్తృతం కావాలని ప్రజలు ఆశించారు‌. తెలంగాణ కోటి రతనాల వీణ అన్న కవి వాక్కు నిజం కావాలని ప్రజలు భావించారు . ఎదురు చూశారు. ఏ ఉద్యమాల ప్రభావం వల్ల తెలంగాణ కల వాస్తవం అయిందో ఆ ఉద్యమ చైతన్యాలు వెల్లి విరిసి  తెలంగాణ సమాజం నిత్య చలనశీలంగా ఉండాలని ఆశించారు.

దొరలపాలనలో అహంకారం, ఆధిపత్యం కలగలసి తెలంగాణ తమ సొంత ఆస్తి అనే  భావన పాలకవర్గానికి ఏర్పడింది . ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణంగా సాగాల్సిన పాలన  అణిచివేతకు కారణమైంది. ఆరుగాలం శ్రమించే రైతు చేతులకు, కాళ్లకు సంకెళ్లు వేసి వేధించిన కాలం నడిచింది. ఇదేమిటి అని ప్రశ్నిస్తే ధర్నాచౌక్ ను శాశ్వతంగా తొలగించడం ఒక జవాబుగా వచ్చింది. ఈ పదేళ్లలో తెలంగాణ పాలకవర్గం ప్రజలపై స్వారీ చేసింది. సహజంగానే స్వేచ్ఛాకాంక్ష , ధిక్కారం    కలగలిసిన తెలంగాణ సమాజం ఉక్కపోతకు గురయింది. త్యాగాల పరంపరలో సాకారమైన కల తమ కళ్ళముందే పొరలు , పొరలుగా విడిపోవడం తమ భవిష్యత్తు అంధకారంగా మారిందనే ఆక్రోశం తెలంగాణ సమాజంలో ఏర్పడింది.

 తమ అవసరాలు తీర్చే, తమ వ్యక్తీకరణకు చోటు ఉండే  ప్రజాస్వామికతను ఆశించారు. ఉమ్మడి రాష్ట్రంలో  విస్మరణకు గురైన తమ ప్రాంతం తిరిగి నిలదొక్కుకొని నిధులు, నీళ్లు, నియామకం అనే పునాదిపై విస్తరించాలి అనే  సంకల్పం. వాస్తవంలో ఇవేవీ ఫలించలేదు‌. లక్ష కోట్ల కాళేశ్వరం బీటలు వారింది .రాజధాని నగరం  మినహా మిగతా ప్రాంతం అభివృద్ధికి ఆమడ దూరం నిలిచింది. అభివృద్ధి , సంక్షేమం సరే ప్రజల నిరసనలు , ఆందోళనలు కనీసపు ప్రతిఘటనను ప్రభుత్వం  సహించలేకపోయింది‌. ప్రజాస్వామ్యంలో ప్రజల  వ్యక్తీకరణలపై వందలాది అక్రమకేసులు బనాయించి జైలు వైపుకు నడిపింది. మాట, పాట, రచన నిషేధమైంది . విరసంతో సహా పదహారు ప్రజా సంఘాలను నిషేధించింది. ఉద్యమకారులపై మాత్రమేనా! సృజనాత్మక తలంలో పనిచేసిన వారిని నిర్బంధించింది. ఇదే సమయంలో రెండు శిబిరాలు ఏర్పడినాయి. పాలక వర్గాన్ని సమర్థించే వర్గం. నిరసించే వర్గం ‌‌. ఎందరో కవులు, కళాకారులు పాలకవర్గంతో మమేకమైనారు. ఈ రెండింటి పరిణామాలను సమాజం అవలోకించింది.

టి ఆర్ ఎస్ పాలన మొదలయ్యాక శృతి,సాగర్ ల ఎన్ కౌంటర్ తో ఆరంభించి, తెలంగాణా తిరిగి  ఎన్ కౌంటర్ల  తెలంగాణగా మారింది. మొత్తంగా దళ సభ్యులనే ఎన్ కౌంటర్ చేసిన రక్తచరిత్ర ఈపదేళ్ల కాలంలో గడిచింది .  నిరసనలకు, ధర్నాలకు ఎలాంటి అనుమతులు లేవని నిర్ధారించింది . హద్దు మీరిన వారిపై అనేక కేసులు నమోదు చేసింది ‌. ఇంతటి నిర్బంధాన్ని తెలంగాణ సమాజం జీర్ణం చేసుకోలేదు. తాజాగా ఇధనాల్ పరిశ్రమ ను వ్యతిరేకిస్తున్న ఆ ప్రాంత ఉద్యమకారులపై కేసులు మోపి ఎన్నికల ముందు జైల్లో నెట్టింది.

 ఎటు చూసినా అంధకారమే మిగిలింది‌. తెలంగాణ ప్రజల సంపద  నాయకుల ఇళ్లల్లోకి చేరింది . దళారీ పాలకవర్గం తమ పదేళ్ల పాలనలో ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేసింది. ఇవన్నీ ఉద్యమ ముసుగులో చేసింది..ప్రజా వ్యతిరేక  పాలనకు చరమగీతం పాడి , కాంగ్రెస్ గత  చరిత్ర తెలిసినా, మారిన సామాజిక, ఆర్థిక రాజకీయాల సందర్భంలో కాంగ్రెస్ ను ప్రజలు గెలిపించారు .  ఈ ఉక్కపోత  నుండి ఊపిరి పీల్చుకుంటే చాలుననే భావనకు కాంగ్రెస్  ఊతం ఇచ్చింది .  కాంగ్రెస్ ను తెలంగాణ సమాజం. ఏమడుగుతున్నది ? ఎలాంటి పాలనను ఆశిస్తున్నది? ఇది ప్రధాన అంశం.   

 తెలంగాణ ఊపిరి నక్సల్బరి . ఈ వెలుగులోనే తెలంగాణ తనని  తాను ధ్రువీకరించుకున్నది. నక్సలిజం సమస్య కాదు పరిష్కారం. తెలంగాణలో ప్రజాస్వామిక హక్కుల విధ్వంసం అంతా మావోయిస్టు పార్టీ మీద విధించిన నిషేధాన్ని సాకు చేసుకొనే సాగింది.  కాబట్టి ప్రజాస్వామ్య పునరుద్ధరణలో తొలి అడుగు గా  మావోయిస్టు పార్టీపై విధించిన నిషేధం ఎత్తివేయాలి. వందలాది ప్రజాసంఘాల కార్యకర్తలపై నమోదైన  ఉపా కేసులను తొలగించాలి. తెలంగాణలో ఉపా కేసులు నమోదు చేయడానికి లేదు. ఇవి  తెలంగాణ సమాజం కోరుకుంటున్న  డిమాండ్లు.  ఇది సాధారణ డిమాండ్ కాదు.   ఈ దేశంలో ‘నేషనల్ ఇన్వెస్టిగేషన్’ పేరుతో ప్రజలపై దాడి జరుగుతున్నది .ఫెడరిలజంపై ముప్పేట దాడి కొనసాగుతున్నది.  అక్రమ కుట్ర కేసులను ఆధారంగా చేసుకుని అనేక రాష్ట్రాల్లో  హక్కుల హననం జరుగుతుంది . ప్రజా సంఘాల నాయకులపై ఇతర రాష్ట్రాలలో మోపబడిన కేసులను, జైళ్ళ పాలైన రచయితలను , ప్రజాసంఘాల నాయకులను, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి విడుదల చేయించాలి అనే డిమాండు  కూడా తెలంగాణా సమాజపు ఆకాంక్షగావుంది. అంత మాత్రమే కాదు, కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగాన్ని కట్టడి చేయాలనేది కూడా.

ఇది మావోయిస్టు సమస్య మాత్రమే కాదు . మావోయిస్టులపై  నిషేధం పేరుతొ తెలంగాణ ప్రభుత్వం రైతుల దగ్గర నుండి , విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ల వరకు పాత్రికేయులు వరకు, చివరకు ప్రాణాలను నిలిపే వైద్యుల వరకు, ప్రజాక్షేత్రంలో పనిచేసే వారందరి హక్కులను హరించింది. కాంగ్రెస్ అనే కొత్త పాత్రధారి తన కాలం చెల్లిన ఆలోచనలను పక్కనపెట్టి తెలంగాణపై దృష్టి పెట్టాలి. కొన్ని సంఘాలలోని వ్యక్తుల  భావజాల స్వేచ్ఛను హరించడం ద్వారా తెలంగాణ పాలకవర్గాలు సాధించగలిగిందేమీ లేదని బిఆర్ఎస్ పనితీరు నిరూపించింది. దానికి  తగిన  మూల్యం చెల్లించింది. ఇంకొక వైపు బ్రాహ్మణీయ హిందుత్వం బలపడుతుంది.  బ్రాహ్మణీయ సాంస్కృతిక ఫాసిజం వివిధ మార్గాల ద్వారా బలపడడానికి ప్రయత్నం జరుగుతుంది . తాజా ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ఎక్కువ సంఖ్యలో స్థానాలను గెలవడం ద్వారా ఇది నిరూపితమైంది . నిజానికి ఈ కాలం చాలా ప్రమాదకారి. ఒకవైపు ప్రగతిశీల శక్తుల అణిచివేత ద్వారా హిందుత్వకు ఊపిరినిచ్చిన వారమవుతామనే ఎరుక కూడా తెలంగాణ పాలకవర్గాలకు అవసరం.

 ఇది ప్రగతిశీల , విప్లవ , అభ్యుదయ శక్తుల తండ్లాట మాత్రమే కాదు. మరిన్ని వైరుధ్యాలుతో తలపడుతున్న సంధి కాలంలో పాలకవర్గానికి మరింత మెలకువ అవసరం‌. నిజానికి నూతన ప్రభుత్వం ఓవైపు సంక్షేమం , రెండోవైపు ప్రజాస్వామిక హక్కుల పట్ల ప్రజాస్వామిక భావనలు కలిగి ఉండడం అనే వాగ్దానంతో ముందుకు వచ్చింది. తన పాలన రీతిలోనే ధిక్కారాన్ని సహించే మానవీయ కోణాన్ని కూడా అర్థం చేసుకోవాలి‌. ఈ పదేళ్ల కాలంలో బిఆర్ఎస్ అవలంబించిన రాజకీయ అణిచివేత విధానాల వలన ప్రజల అసంతృప్తి   వెనుక దాగిన నియంతృత్వం పోకడలు ప్రజల దైనందిన జీవన సమస్యలను, వాటిపై పోరాటాలను  అణచివేసాయి ‌. ఈ విషయం పాలకవర్గాలకు తెలియనిది  కాదు. అయితే అధికారం సమస్తాన్ని హరించి వేస్తుంది. కాబట్టి తెలంగాణ సమాజం ఇప్పుడు ఏం కోరుకుంటుంది ? .రైతుబంధు దళిత బంధు, ఆర్టీసీలో మహిళల ఉచిత  ప్రయాణం మాత్రమే కాదు. ఇతరత్రా ప్రజాకర్షణ పథకాలు మాత్రమే కాదు. తమని మాట్లాడనివ్వాలి. తమకేది కావాలో వారు అడుగుతున్నారు . వాళ్ళను మాట్లాడనివ్వాలి. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ఫలవంతం కావాలి. ఈ దిశగా నూతన ప్రభుత్వం ఆలోచించాలి.

 అధికార రాజకీయాలలోకి హిందుత్వ పోకడలు తోవ చేసుకుంటున్న దశలో  ప్రగతిశీల ఆలోచనలను  పూరించాలి‌. మనుషులు విశాలం కావాలి. ఆలోచనలకు కట్టడి ఉండకూడదు. తాజాగా భారత్ బచావో నాయకత్వంపై ఉపా కేసులు, ఇథనాల్ వ్యతిరేక పోరాటంలో ప్రజాసంఘాల కార్యకర్తలు, నాయకులపై   కేసులు బనాయించిన నేపథ్యంలో ప్రజల పోరాటంగా చరిత్రలో నిలబడిన మావోయిస్టు పార్టీపై విధించిన  నిషేధం ఎత్తివేయాలి. ఇది  తెలంగాణ  సమాజపు డిమాండ్గా గుర్తించాలి. ఎన్కౌంటర్లు అరెస్టులు, నిర్బంధం లేని నూతన తెలంగాణ సాధ్యం చేయడం  తక్షణ కర్తవ్యం. నూతన ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఒక వారధి ఏర్పడటం ఇవాల్టి దగా పడిన తెలంగాణాకు అవసరం. ఆ వారథి ప్రజారాజకీయాల వల్లే సాధ్యం. దానికి అవకాశం ఉన్నప్పుడే  ప్రజల త్యాగాలకు ‌ఒక విలువ ఉంటుంది.

15-12-2024

3 thoughts on “మావోయిస్టులపై నిషేధం ఎత్తివేతే ప్రజాస్వామ్య పునరుద్ధరణకు సానుకూలత

  1. Democracy demands discussion and dissent for progress and to adress challenges of the future. Repeal the ban on Maoist organisations for a better tomorrow.

  2. KRISHNA GARU
    I AGREE WITH U SIR—-BUT CONGRESS GOVT —SAME DORALA PAALANA
    ANY DIFFERENCE ???EVERY ONE KNOWS CONGRESS RULED COUNTRY MORE THEN
    50 YEARS — JUST NEHRU FAMILY RULE —-NOTHING CHANGES
    ================
    BUCHI REDDY GANGULA

Leave a Reply