మాస్టారు ఇక మనల్ని విడిచి ఏ క్షణమో వేలిపోతారని గత ఏడాది మార్చిలో ఆయన ఆసుపత్రిలో చేరినపుడు అన్పించింది. అయితే ఆయన గట్టి పిండం. వైద్యుల వూహకు అందని రీతిలో కొన్నాళ్ళకు తేరుకున్నారు. ఆసుపత్రిలో చేరిన నాటికి కిడ్నీ, వూపిరితిత్తులు అర్ధ భాగాలే పనిచేస్తున్నయట. పనిచేయని అర్ధభాగాలను మరి బాగు చేయలేరట, పనిచేసే భాగాలు కూడా ఎన్నాళ్ళో చేయవని వైద్యులు జ్యోతిశ్యం చెప్పారు నమ్మకంగా. అంచేత అలా ఇక ఏ క్షణమో అననుకున్నాము. కానీ మాస్టారు వైద్యుల జ్యోతిశ్యాన్ని వమ్ము చేసి ఆసుపత్రి నుంచి వచ్చాక ఏడాది పైగా నిలబడ్డారు.
ఈమధ్యలో కొన్నాళ్ళు శరీరం అతని మాట వినలేదు. తొంభై ఏడేళ్ళు అతను శరీరాన్ని శాసించాడు. ఎన్ని గంటలు నిద్ర పోవాలో, ఎన్ని గంటలు శ్రమ చేయాలో, ఎంత తినాలో (పచ్చడితో ఓ ముద్దా, వేపుడు కూరతో ఓ ముద్దా, నెయ్యితో, పెరుగుతో ఇలా లెక్క ముద్దలు), తిన్నదంతా జీర్నమయ్యేట్టు ఏయే పనులు చేయాలో శరీరానికి లెక్కలు చెప్పాడు. లెక్క ప్రకారం శరీరం నడుచుకుంది.
(ఆసుపత్రి నుండి వచ్చాక మంచం మీద ఉన్నపుడు కూడా లెక్క తప్పకూడదని కాగితం మీద శాసనం రాసి దానిని ఒక ప్లాస్టిక్ ఫోల్డర్ లో పెట్టేంత దాకా చిన్న కొడుకు ప్రసాద్ ని మరో పని చేయనీయ లేదు.) ఆ శాసనం ప్రకారం శరీరం నడవాలి. ఇంతలో మంచానికి ఎదురుగా వుండే గోడ గడియారం రిపేరు. చేతికి వాచీ నిత్యం వుండేది, కానీ ఆసుపత్రి నుంచి వచ్చాక చేతికి పెట్టుకునే వీలు కాలేదు, అంతకు ముందర రోజుల్లో చేతికి వాచీ వుండాల్సిందే. ఇపుడు గోడ గడియారం ఆధారం. అది ఆగిపోయి రెండు రోజులు.
బాగు చేయమని చెప్పి రెండు రోజులు..! ఏదీ? అందుకే దేనికీ ఒకరి మీద ఆధార పడకూడదు గురూ – అంటాను అన్నట్టుగా ఓ చూపు చూసేవారు అప్పుడే వచ్చిన నన్ను. తరవాత నా మొహం లోకీ, గోడ వేపూ పదే పదే చూసే వాడు. మనం ఆ చూపుని అర్ధం చేసుకోవాల.
మనమా? మన వశామా? అతగాని కతలూ, చేతలూ, మాటలూ మనకి అర్ధమయినయా?
కాసేపు చూసి అరచేతితో తల కొట్టుకునే వాడు. లెక్క తప్పింది, శరీరం తన మాటను ధిక్కరించింది. నిష్టూరంగా తన శరీరం వేపు చూసి ఆ సమయంలో రామచంద్రరావు1 వస్తే ఫిర్యాదు చేసేవాడు.
మీకంటే ఎంతో తక్కువ వయసులో వున్నాం, మామాటే మా శరీరాలు వినవు. నయం, ఇన్నేళ్ళ దాకా మీ శరీరం మీ మాట విన్నాదని సర్ది చెప్పబోయే వాళ్ళము మా ఇద్దరమూ.
మీకూ, నాకూ సాపత్యమా అన్నట్టుగా మా వేపు చూసి విషయాన్ని మార్చేసే వారు. సాహిత్యం వేపు బండి తిప్పేవారు.
+++ +++ +++
నిజంగా ఆయనతో మాకు గానీ, మరెవరికి గానీ సాపత్యమా? ఆయన లాగా క్షణకాలమయినా జీవించగలమా? మా చింతా అప్పలనాయుడు2 అన్నట్టు ఆయనలాగా కతని రాయడం కాదు చూసి కాపీ కూడా రాయలేము. కత కాదండీ అతగాని లాగా కారా కిళ్ళీ కట్టగలవండీ? ఆతగాను కిళ్ళీ కట్టడం చూస్తే, ఆ తమలపాకు మోడిమ కత్తెరతో కత్తిరించడం, ఆకు చివరను చిక్కడం, సుతారంగా సున్నం రాయడం, తరవాత కారా సామాన్లు ఒకొక్కటీ లెక్క మీద వేయడం, ఉప్పుచెక్కలని ముక్కలు చేసి వేసేక అప్పుడు చుడతాడు చూడు కిళ్ళీ …. మనకి నోరూరి పోతాది. మేస్టార్ని బతిమాలి అయినా కిళ్ళీ అడిగి తీసుకొని ఏసిద్దుమా అనిపిస్తాది…అనంటాడు చింతాడ తిరుమలరావు3.
ఓయ్ … కత కూడా అలాగే రాస్తాడువోయ్ … అన్నీ లెక్కలే.
పాత్రల వొడ్డూ, పొడుగూ,రంగు…అన్నీ సదివినోడికి తెలిసిపోతాయి, కత నడస్తంతే! అతగాను ఆ వివరాలు రాయడు. అయినా తెలస్తాయి. కత జరిగే చోటు, సమయం కళ్ళకి కడతాడు చూడు … మనం అక్కడ తిరుగాడతాము. అలాగా రాస్తాడు. ఓయ్ … గడపల పడిన ఎండని కూడా లెక్క గట్టి రాసి పెడతాడోయ్…(ఆర్తి కత లో…”ధనుర్మాసం ఉదయం, మాలపేటలో వాకిట రెండు చదరపు గజాల ఎండ ఉంటే అందులో కూర్చున్నాడు పైడయ్య”.) ఏదీ పై పై న చూసి చెప్పడు, లోపలికి తవ్వుతాడు, ఏది ఏందుకు జరిగిందో, దాని చరిత్ర అంతా బయటికి లాగతాడు, అందికే అతగాని కతలు పొడుగు కతలయినాయి… అనంటే,
మా చింతా అప్పలనాయుడు అంటాడు –
అన్నీ కరణీకం లేక్కలండీ, తండ్రి అయిదూల్ల కరణం కదా … అంటాడు. యగ్యం కతలో ఏటుంది, కరణీకం లెక్కలే కదా? ఎవుడి భూమి ఎవుడికి క్రేయిం అయ్యింది, పట్టాదారు పాసుపుస్తకం ఎవుడి పేరన వుంది… కరణం గారి రికార్డుల్లో బోల్డు కతలు దొరుకుతాయి, అందలోది ఒకటి ‘యగ్యం’ అంతే. అంతకి మించి ఏటుందని ఆయమ్మ అన్నందుకు పడిపోనారు శిష్యులు …ఆ అమ్మ మీద అని గూడా చింతావోడు మేష్టారు ఎదరగా వాలకం కట్టి అన్నాడు, మేస్టారు కిళ్ళీ నోటితో ఏమి నవ్వినారో ! అప్పుడే మేస్టారి ఆ నవ్వు చూసి … అయితే ఒకటి లే … నిజిం చెప్పాలంటే … మన లాంటోల్లం యగ్యం లాటి కతని చూసి అయినా రాయలేం అని ముక్తాయింపు ఇచ్చేవోడు చింతోడు .
+++ +++ +++
“నేనెప్పుడు ఎందుకు రాయడం ఆరంభిన్చానో ఇప్పుడు నాకంత బాగా గుర్తు లేదు……..
చాల మంది లాగే చదవగా చదవగా నాకూ రాయాలని బుద్ది పుట్టినట్లు కొంత గ్యాపకం వుంది….”
మాస్టారి ఈ నెమరువేత విశాఖ రచయితల సంఘం వారు రచయితల చేత ‘నేనెందుకు రాసేను’ అన్న శీర్షికకు రాసినప్పటిది… 1963 చివరలోనో, 1964 మొదటిలోనో రాసినది.
అప్పటికి ఆయన తనకు ఇష్టమయిన రచనలు రాయలేక, రాసినవి (పందొమ్మిదివందల నలభై మూడులో ‘ప్లాటుఫారమో’ అన్న కతతో ఆరంభించి ‘అభిశప్తులు’ 1955 కధతో ఆపేసారు రాతను) ఇష్టపడక రాతను విరమించుకున్న రోజులు. 1955 నుంచి 1964 దాకా దాదాపు పదేళ్ళు ఆయన కధలు రాయలేదు. అరవై నాలుగు తరవాత రాసిన గొప్ప కధలకు పిండ దశ ఆ పదేళ్ళు.
మాస్టారిలో విశేషం ఏమంటే…ఆయన కధారచనకు విరామం ఇచ్చారు గానీ కధా ఆవరణను విడిచి పెట్టలేదు. ఆయన విశ్రాంత ఉపాధ్యాయుడు తప్ప విశ్రాంత కధకుడు కాడు.
అందరిలాగే చదవగా చదవగా రాయాలన్పించినా, అలా ఆరం భించినా … తొలినాళ్ళలోనే ఆయనను ఓ పెద్దాయన హెచ్చరించారట – ‘కధలు, నవలలు ఏదో చెప్పడానికి రాస్తారు (అందరూ కాదనుకోండి), అవి రాయదలిస్తే ఇతరులకు ఏమేనా చెప్పగల తాహతు ఉండాలి. ముందు అది సాధించు అని అన్నారట. (ఆ పెద్దాయన మాస్టారి తండ్రి గారే అని తరవాత తెలుసుకున్నాను). ఆ హెచ్చరికతో ఏదో చెప్పడం కోసమే రాసేరు తొలినాటి కతలు కూడా (అవి ఒక సామాజిక వర్గపు కుటుంబాల్లో జరిగే ఘటనలే కావచ్చు, ఆ ఘటనల వలన మనుషులు ఎన్నెన్ని హింసలు పడుతున్నారో, ఆ హింసల వెనక సామాజిక కట్టుబాట్లు, నియమాలు, ఆచారాలు ఎలా కారకాలో చూపేరు) దీన్నే మనం సామాజిక ద్రుక్పధం అంటామా?
నేను చేసిన రచనలు ఇతరుల మీద ఏ ప్రభావం చూపినా, చూపకపోయినా అవి రాయడానికి నేను చేసిన ఆలోచనల వల్ల నేను మారాననడానికి నిదర్శనాలున్నాయి .
‘ఇంతా చేస్తే’ అనే రచన కోసం నేను చేసిన ఆలోచనలు రచయితనై ఆచంద్ర తారార్కం కీర్తిని సాధించ వచ్చనే భ్రమను తొలగించాయి, ‘కీర్తి కాముడు’ రచన చేయడం వలన కాముకత్వం కన్నా కీర్తి కాముకత్వం ఏ విధంగా ఘనమో ? అనీ, ‘పలాయితుడు’ మొదలైన కధలు రాసిన సందర్భంలో నేను చేసుకున్న తర్కం, దాని ఫలితంగా చూసిన విషయాలు … మనిషి బతుకు మనిషి చేతుల్లో లేదని చూపాయి. ఇలా ఏదో ఒక ప్రయోజనం సాధించిన కధలే కాక ఏ ప్రయోజనం లేని కధలు కూడా కొన్ని రాసేను. రాగమయి లాంటివి, అవి స్పర్ధ నాచేత రాయించిన కధలు.”
“ఎవురితో స్పర్ధ మేస్టారు?” అనడిగాను. నా కళ్ళల్లోకి చూసి, చెప్పడమా, మానడమా అని లోన తర్కించుకొని, సన్నగా నవ్వి… బలివాడ కాంతారావు గారితో … అనన్నారు.
ఇలా ఏ రచయితేనా తన రచనల గురించి స్వీయ విమర్శ చేసుకొన్న సందర్భాలు ఉన్నాయా? నిజానికి ఈ ఆత్మ పరిశీలనే, తను అప్పటిదాకా రాసిన కదల పట్ల ఈ అసంతృప్తే మాస్టార్ని గొప్ప కధలు రాసేందుకు తోవ తీసింది. రచయితకు స్వీయ విమర్శ, అసంతృప్తి ఉండాలి అని మాస్టారు బోధించేరు.
+++ +++ +++
గురూ, పలానీ నీ ప్రత్యామ్నాయం కతలో చంద్రమ్మ పుట్టిన తేదీ ఎపుడు? అనడిగాడు. పలానీ పాత్ర ఒద్దూపొదుగూ ఏమిటి? అని ఓసారి….! కతలో ఆ వివరాలు రాయక పోయినా, నీ మనసులో ఆ వివరాలు ఉండాల. అవి నీ సృష్టి కదా?
నీ పాత్రల్లో మంచి వాళ్ళు ఈశ్వర నామాలు, చెడ్డ వాళ్ళు విష్ణు నామాలతో ఉంటన్నాయి. గురుడు రావిశాస్త్రీ కూడా ఇలాగె పెట్టేవాడు అనన్నాడోసారి. ఎన్నెన్ని ఆలోచిస్తాడో కతలో పాత్రల గురించి, వస్తువు గురించి…
గురువా… రచనల మీద వచ్చిన ఆదాయం ఏం చేస్తావు? సడెన్గా అడిగాడు మాస్టారు ఒకసారి.
ఆ ప్రశ్నకి నవ్వు వొచ్చింది. రచనలకి ఆదాయం వస్తాదా?
మాస్టారికి అర్ధమయిపోయింది – ఎంతో కొంత గురూ, వస్తంది కదా? అన్నాడు కళ్ళద్దాల్లోంచి వోరగా చూస్తా.
హమ్మ, గురువా!
అప్పుడికి నాకు రెండు, మూడు పోటీల్లో బహుమతులు, ఎవరో ఏదో అవార్డ్ రూపంలో ఎంతో కొంత ఇవ్వడం తెలిసి అడిగాడు.
అసలకి అంతకు ముందర పైసా ఇవ్వని రోజులలో గురువా ఎలాగా గడుస్తంది అని అడిగిన పాపాన పోలేదు, ఈ మనిషి .
నువ్వు మా కానోడివి గురువా అనన్నాను.
అప్పుడు –
మా తండ్రి గారు (నాన్న గారు అనే కంటే తండ్రి గారు అనే ఎక్కువగా అనే వారు, దానికీ ఏదో భావార్ధం వుంది వుంటుంది, గానీ అడిగి తెలుసుకోలేదు.) నాకు రెండు పాఠాలు చెప్పారు.
రచన ఆరంభ రోజుల్లో నా రచనలు చూసి ఏమన్నారో చెప్పానుగదా, అది ఒక పాటం – (ఆ చెప్పినదేమిటో పైన ‘నేనెందుకు రాసేను’ శేర్షికలో వుంటుంది. చదివి ఉంటారు) నేను అవును చెప్పారన్నట్టు తల వూపితే – రెండోది …
అప్పటికి నేను ఎస్సేస్ ఎల్సీ పరీక్ష రాసి సెలవుల్లో వున్నాను. బరంపురం లో పండగ అవుతోంది, బంధువులున్నారు వెళ్ళాలని పించి, మా తండ్రి గారిని నేరుగా డబ్బులు అడగలేక మా అమ్మ చేత అడిగించాను. మా అమ్మ అడిగితె – పెద్దవాడు అయినాడు గదా, పండగ పబ్బాలకో, యాత్రలకో, శికార్లకో స్వయంగా డబ్బులు సంపాదించి వెళ్ళమని చెప్పు. మనుషులు స్వయం సంపాదన మీద బతకాలి… ఇలా యేవో అన్నారు. అప్పటి నుంచి నేను స్వయం సంపాదన మీద తప్ప ఇతరత్రా మీద ఆధార పడలేదు. ఉద్యోగంమీద వచ్చే జీతంతోనే కుటుంబాన్ని పెంచాను. సాహిత్యం మీద వచ్చే పైసా కూడా సాహిత్యానికే ఖర్చు పెట్టాను తప్ప, స్వంతానికి పెట్టలేదు, అదో నియమంగా బతికాను… అని చెప్పి విరామం తీసుకున్నారు.
ఆయన విరామం తీసుకున్నారంటే – అదే విషయమ్మీద మరొక పాయింట్ బలమైనది చెప్తారన్నమాట, లేదా ఇకా విషయాన్ని అక్కడికి వొదిలేసి బండి మలుపు తిప్పుతారన్నమాట. (కతల విషయం లోనా ఇంతే, రాస్తే బలమైన కత రాయడం, లేదా కలం మూసేయ్యడం)
ఈలోపు నేను – సాహిత్యంమీద వొచ్చేది యెంత లెండి, అదీగాక అదిగో ఆ సాహిత్యం, దాని తోటి ఇతర కార్యకలాపాలు బోల్డు నాకు. కోర్టులు, కేసులు…గొణిగాను.
మరొక పాయింట్ చెప్పాలనుకున్న మనిషి, మరి చెప్పలేదు, కిళ్ళీ వేస్సాడు. సాహిత్యం సమాజానికి చెందుతుంది. సమాజం నుంచే నువ్వు కతా వస్తువుని, సంభాషణల్ని తీసుకొని అల్లుతావు, ఆ అల్లే నైపుణ్యం కూడా సమాజం నీకు ఇచ్చిన విగ్యానమే. నీద్వారా వ్యక్తమవుతుంది తప్ప నీది కాదు. గనక సాహిత్యం ద్వార వ్వచ్చేది సమాజానికే ఇవ్వాలి అని నాకు బోధించాలనుకున్నాడు, గానీ పైన నా సమాధానంతో సంశయంలో పడ్డాడు. అదీ గాక ఆయన ఎవరినీ నియంత్రించడు, ఎవరి నియంత్రణలోన వుండడు.
గొప్పోడివి గురువా అనుకున్నా.
+++ +++
బహుశా మాస్టారి రెండో దశ కధలకు … ఆనాటి విశాఖపట్నం … అక్కడ పరిచయమైన రావిశాస్త్రీ, వారిద్వారా ఇతర వామపక్ష వాదులు, నాటి సామాజిక స్తితిగతులను భూమికగా ఎలా చెప్తామో, అంతకు ముందర కూడా మాస్టారు సమాజం పట్ల, జీవితం పట్ల చేసిన ఆలోచనలు, తండ్రిగారి బోధనలు, సత్యమనేదాని కోసం చింతన, దైవం పట్ల ప్రశ్నలు, సమాధాన పడలేని స్తితిలో ఆత్మహత్యా ప్రయత్నం, ఇంటినుంచి పరారు, చివరికి … తన జీవన యానం పట్ల స్పష్టాస్పష్టంగా కొన్ని నియమాలు, నిర్ణయాలు తీసుకోవడం, ఆ అనుగుణ చర్యలు … ఇలాటివీ (కేవలం చదవడం కోసం, సాహిత్యం కోసం ఎక్కువ రాబడి వచ్చే ఉద్యోగం వొదిలేసి, ఉపాధ్యాయ ట్రైనింగ్ కి వెళ్ళడం, అక్కడ సమస్యల మీద పోరాటం, నాటిక రచన, ఆ సమయమే అనుకుంటా – అప్రగ్యాతము కత రాయటం వంటి కొన్ని విశేషాలు), నాటి శ్రీకాకుళ గ్రామీణ స్తితిగతులు కుడా భూమికలని చెప్పాలి.
బహుశా ఇంతగా జీవిత యానం పట్ల స్పష్టమైన ద్రుక్పధం ఏర్పరచుకునే వాళ్ళు, ఆ ద్రుక్పదానికి అనుకూలంగా జీవితాన్ని సాగించే వాళ్ళు అరుదుగా వుంటారు. (కథకులు ఇంకా అరుదుగా ఉంటారు) అలా అరుదైన గొప్ప కథకులు కాళీపట్నం రామారావు గారు. కథా సాహిత్యమే తన ఉచ్వాస, నిస్వాసలుగా జీవించాలనుకున్నారు, జీవించారు.
ఆయన రెండో దశలో రాసిన కథలు – యగ్యం,(రాజ్య వర్గ స్వభావాన్ని) తీర్పు,(ఉత్పత్తి సంబంధాలు) కుట్ర,(రాజ్యాంగ రచన), చావు ( ప్రజల సంస్కృతీ), ఆర్తి (ప్రజల మధ్య మిత్ర వైరుధ్యాలు) కథలు మార్క్సిస్ట్ మౌలిక సూత్రాలను రూపుకట్టినట్టుగా, అందుకే రాసినట్టుగా ఉంటాయి గానీ మాస్టారు అందుకే రాయలేదు, ఆయనకు గల ప్రాపంచిక దృక్పథంతో రాసుకొచ్చాడు, చూసిన సమాజాన్నీ, జీవితాన్నీ తనకు అర్ధమైన, తనకు ఎరుకైన విశేషాలతో చూపించాడు, అవి బై ప్రొడుక్ట్ ల్లాగా మార్క్సిస్ట్ మౌలిక సూత్రాలైనవి. వాటికోసం ఆయన రాయలేదు, అందుకే రాశాననీ చెప్పలేదు… తనకు అర్థమైన దానినే, ఎరుకైన దానినే చూపానన్నారు. (ఆయనకు ఈ వ్యవస్థ పట్ల, దీన్ని నియంత్రించే శక్తుల పట్ల తీవ్ర వ్యతిరేకత ఉంది, ఆ శక్తులను ఎదిరించే విప్లవ శక్తుల మీద గౌరవం వుంది, మెరుపు కళ్ళతో, చెవులు రిక్కించి వినే వారు విప్లవ శక్తుల భోగట్టాలు, వాటి చీలికలూ, విఫలతలూ తలచుకొని నిట్టూర్చే వారు)
+++ +++
ఓ రోజు పదకొండు గంటల వేళ, పలకరిద్దామని వెళ్ళాను. అప్పటికి రెండు రోజుల కిందట కొంత ఇబ్బంది పడ్డారట, చిన్నకొడుకు, కోడలికీ ఇబ్బంది పెట్టారట… విరేచానాలతోను, మరేదో ఇబ్బందితో. నేను వెళ్లేసరికి తేరుకున్నారు. నన్ను చూసి _ ఉషారుగా హాయ్ అని చేయి చాచారు షేక్ హేండ్ కోసం. (కరోనా ను ఆయనేమీ పట్టించుకోలేదు, కరోనా కూడా ఆయన దరిదాపులకు రాలేదు)
ఆ ఉషారు చూసి కోడలు -ఈయన ఎవరో గుర్తుపట్టారా?అని ప్రశ్నించింది. (అంతకు ముందర ఆయన తన బంధువులను ఎవరినీ గుర్తు పట్టడం లేదట. ఒకోసారి చిన్నకొడుకు ప్రసాద్ పేరు కూడా మరచి పోయి ఇందిర భర్త (ఇందిర చిన్న కోడలు పేరు) కదా అని అడుగుతాడట.)
ఆ ప్రశ్నకు కోడలి వేపు చూసి, ఉపాధ్యాయుని ప్రశ్నకు జవాబిచ్చే విద్యార్ధిలా –
అట్టాడ ! నాకెందుకు తెలీదు. ఈయన కథానిలయానికి అటువేపు ఇల్లు కొనుక్కొని వచ్చాడు, అని వివరాలన్నీ చెప్పాడు. తన మంచం పక్క కుర్చీ చూపినాడు నన్ను కూర్చోమని.
అప్పుడు ఇందిరా నవ్వుతూ, గత రెండు రోజుల ఇబ్బందులూ, ప్రసాద్ గారి పేరు మర్చిపోవడాలు చెప్పారు.
అవి కొన్ని వినబడ్డాయి గాబోలు, విచారంగా నా వేపు చూస్తూ, తల కొట్టుకొని – మృతువు రావడం లేదు అన్నారు విసుగ్గా. ఆయన కోరుకున్నట్టు అన్నీ అవ్వాలి, అందుకు తగ్గ శ్రమ పడతారు, కానీ మృత్యువు ఎవరి చేతిలోనా లేదుగా!
కాసేపయ్యాక – అనాయాస మరణం వినా దైన్యేనా జీవనం…. దేహిమే పరమేశ్వర శ్లోకం చదివారు…
ఇన్నాళ్ళు పరమేశ్వరుణ్ణి నమ్మని మిమ్మల్ని ఇపుడు మీ అవసరం కోసం మొక్కితే పరమేశ్వరుడు వినేస్తాడా? అని ప్రశ్నించింది ఇందిరమ్మ. ఆమె వేపు ఓసారి చూసి, సన్నగా నవ్వి బండి మలుపు తిప్పీసారు. నావేపు చూసి, గురూ, నీ నవల సగభాగం ఇచ్చావు. మిగిలిన భాగం ఏదీ? అని సాహిత్యంలోకి దిగిపోయారు.
మీ జన్మదినం ఎప్పుడు?
నవంబెర్ తొమ్మిది…
ఆరోజు నా నవల ఇస్తానన్నాను.
అప్పుడు అటూ ఇటూ చూసి, గోడమీది కేలండర్నీ చూసి – అప్పుడి దాకా ఉంటాను – అనన్నారు.
ఆ మాట ఎలా అన్పించిందంటే – యముడ్ని కూడా నవంబెర్ తొమ్మిది తరవాతే రానిస్తానన్నట్టుగా, ఈలోపు రానివ్వనన్నట్టుగా !
మహానుభావుడు అలాగే ఉన్నాడు. నా నవలను పుట్టిన రోజు నాడు అంకితంగా అందుకున్నాడు, ఆ సాయంత్రం తిరుపతి సాహితి మిత్రులు ఏర్పాటు చేసిన గూగుల్ మీటింగ్ కి కన్పించి అందర్నీ పలకరించాడు, హుషారుగా.
అప్పుడు ఆశ కలిగింది, ఈయన మరో మూడు రన్నులే కదా సెంచరీకి, సెంచరీ చేసేస్తాడు అనుకున్నాం.
లేదు. ఆయనకు వుండి ఇంకా చేయాల్సినవి ఏమీ లేవనిపించింది. చేయాల్సినవి అన్నీ చేస్సాను, తీర్చాల్సిన అన్ని రుణాలూ తీర్చేసాను. తల్లిదండ్రుల ఋణం, గురువుల ఋణంతో పాటు మాస్టారు పెట్టుకున్న మరో ఋణం సామాజిక ఋణం… ఇవన్నీ తీర్చేసాను అననుకున్నారు, ఇక కోడలికీ, కొడుకులకీ రుణపడి ఉండలేను అనుకున్నాడు, ఇక వెళిపోతానని నిర్ణయించుకున్నాడు (అంతకు ముందర చాన్నాళ్ళ కిందట తాను సర్వమయి నెలకొల్పిన కథానిలయం బాధ్యతల నుంచే స్వచ్చందంగా తొలగిపోయారు, ట్రస్ట్ సభ్యుల మీద భారం వేసి వదిలేసారు.) ఒకొక్కటిగా వదులుకున్నారు. ఏది ఎంతవరకు పట్టుకోవాలో, ఎపుడు విడిచి పెట్టేయాలో… లెక్కలు తెలిసిన మాస్టారు. లెక్కలన్నీ ముగిసిపోయాయి అని తెలుసుకున్న లెక్కల మాస్టారు. ఎవరికీ బాకీ పడకుండా జూన్ నాలుగవ తేదీన, తన సాహిత్య సర్వస్వాన్నీ, కథానిలయాన్నీ మనకు వొదిలేసి వెళిపోయారు. కథ ఉన్నన్నాల్లూ కారా మాస్తారు వుంటారు!