సెప్టెంబరు 5న మా ఇంటితో పాటు ఎనిమిది చోట్ల ఎన్‌ఐఏ దాడులు చేసిన తర్వాత.. ‘మీ ఇంటిపైనే ఎందుకు దాడులు చేశారు.. మా ఇంటిపై ఎందుకు దాడి చేయలేదు?” అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. ముందుగా, ఈరోజు మేం పడుతున్న మానసిక వేదన మరెవరికీ రాకూడదని కోరుకుంటున్నామని చెప్పాలి. అయితే, అది మన యిష్టాయిష్టాలపై  ఆధారపడి ఉండదు.

కానీ ఎవరైనా ముస్లింలని అరెస్టు చేసినప్పుడు లేదా వారి యింటిపై దాడి జరిగినప్పుడు, సాధారణంగా ముస్లింలు మీ యింటి మీదనే ఎందుకు దాడి చేశారు అని ప్రశ్నించరు.

సూరత్‌లో అరెస్టయిన ముస్లింలను నిర్దోషులుగా జైలు నుంచి విడుదల చేసిన తర్వాత ప్రముఖ చిత్రనిర్మాత ‘శుభ్రదీప్ చక్రవర్తి’ తన సినిమా ‘ఆఫ్టర్‌ ది స్ట్రామ్‌’ కోసం ఒక ముస్లింని ఇంటర్వ్యూ చేస్తూ, ‘మిమ్మల్నే పోలీసులు ఎందుకు ఎత్తుకెళ్లార’ని ప్రశ్నించాడు. ఆ ముస్లింకి చిన్న కోళ్ల ఫారం ఉంది. తన కోళ్లను తాత్విక దృష్టితో చూస్తూ.. “ప్రభుత్వం కోళ్ల ఫారమ్ యజమాని లాంటిది, ప్రజానీకం కోళ్లలాంటివారు. ప్రభుత్వానికి ఆకలి వేసినప్పుడల్లా ఒక కోడిని ఎత్తుకుపోతుంది. ఈ కోడినే ఎందుకు ఎత్తుకుపోయిందన్న ప్రశ్న ఇక్కడ అర్థరహితం” అని సమాధానమిస్తాడు. దాదాపు ముస్లిం సమాజమంతటినీ ప్రభుత్వం లేదా రాజ్యం లక్ష్యంగా చేసుకుందని తన అనుభవంతో తెలుసుకున్నట్లు ఆ ముస్లిం చెప్పిన సమాధానంలో స్పష్టంగా ఉంది.

అదేవిధంగా, మీరు ఆదివాసీ సముదాయం మధ్యకు వెళితే, అక్కడ కూడా ఈ సమస్య రాదు. ‘సల్వాజుడుం’ సమయంలో వేలాది ఆదివాసీల ఇళ్లను తగులబెట్టారు, లక్షలాది మందిని నిర్వాసితులను చేసారు. దాంతో ఆ సముదాయం మొత్తం ప్రభుత్వం/రాజ్యం, బడా పెట్టుబడిదారుల లక్ష్యం అని వారికి అర్థమైంది. అందువల్ల, అక్కడ కూడా మీ ఇంటినే ఎందుకు తగులబెట్టారు లేదా పారామిలిటరీలు బలగాలు నీ పైనే ఎందుకు అత్యాచారం చేశారు అనే ప్రశ్న తలెత్తదు.

ప్రభుత్వ మద్దతు ఉన్న గూండాలు తన ఇంటిని ఎందుకు తగులబెట్టలేదని లేదా వారి కుటుంబ స్త్రీలపై మహిళలను ఎందుకని నగ్నంగా ఊరేగించలేదని నేడు ‘సురక్షితంగా’ వున్న కుకీనెవరైనా  ప్రశ్నించగలరా?

ఒకవేళ మీరు కాశ్మీర్‌లో ఉంటే, సైన్యం కొడుకులను అదృశ్యం చేసినఎన్నో కుటుంబాలను, ‘మరి మా కొడుకులను ఎందుకని ఎత్తుకెళ్లలేదని లేదా ఫలానా వారి పిల్లలనే ఎందుకు ఎత్తుకెళ్లిందని’ ప్రశ్నిస్తారా? కశ్మీరీలందరూ ప్రభుత్వ/రాజ్య లక్ష్యంగా వున్నారని తమ స్వంత అనుభవం నుండి కశ్మీరీలకు తెలుసు.

దళిత సమాజంలో కూడా కుల దౌర్జన్యాలు కేవలం ఫలానా వారిమీదనే ఎందుకు జరిగాయన్న ప్రశ్న తలఎత్తదు.

నిజానికి, ఈ ప్రశ్న హిందూ ‘ప్రగతిశీల’ మధ్యతరగతి ప్రశ్న మాత్రమే. ఎందుకంటే ‘అర్ధరాత్రి తలుపు తట్టడం’ అనే చిత్రహింసలు వారి అనుభవ ప్రపంచంలోకి ఇంకా ప్రవేశించలేదు, వారి ‘ప్రగతిశీల’ పొరలు ఇంకా దెబ్బతినలేదు.

కానీ మనం చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోకపోతే ఏదో ఒక రోజు ‘అర్ధరాత్రి తలుపుతట్టే’ చిత్రహింసల నుండి తప్పించుకోలేని స్థితికి చేరుకుంటాం, మనం కాకుండా ఇంకెవరి ఇంటి మీద దాడి జరిగిందో తెలుసుకోలేని స్థితిలో వుంటాం.

పాస్టర్ నీమోల్లర్ కవిత ‘కమ్యూనిస్టుల కోసం మొదట వచ్చారు’ కేవలం కవిత మాత్రమే కాదు, అది గత కాలపు ‘కవితా పత్రం’.

దీని నుండి మనం గుణపాఠం నేర్చుకుంటామా లేదా అనేది పూర్తిగా మన ‘చరిత్ర అవగాహన’పై ఆధారపడి ఉంటుంది.

(సెప్టెంబరు 5న ఉత్తర ప్రదేశ్ లోని వారణాసి, అజాంఘర్, చందోలి మొదలైన  ఎనిమిది ప్రాంతాల్లో NIA బృందాలు సోదాలు  చేశాయి. రచయిత, సామాజిక కార్యకర్త  మనీష్ ఆజాద్  ఇంటి మీద కూడా ఆ రోజు దాడి జరిగింది)

తెలుగు: పద్మ కొండిపర్తి

Leave a Reply