కవిని ఆలూరి . 

నేను గత 22 సంవత్సరాలు గా  లెక్చరర్ గా పనిచేస్తున్నాను . పది సంవత్సరాల క్రితం మా కుటుంబం హైదరాబాద్ లోని శివం రోడ్ లో ఉన్న బాగ్ అంబర్ పేట్ లో ఉండేది . కాలేజీకి వెళ్ళటానికి  బతకమ్మ కుంట దగ్గర ఉన్న బస్ స్టాప్ లో బస్ ఎక్కేదాన్ని . బాగ్ అంబర్ పేట్ నుంచి బతుకమ్మ కుంట మీదుగా నడుచుకుంటూ బస్టాప్ కు వెళ్ళే దాన్ని . కాలేజీ కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు బతుకమ్మ కుంట గుడిసెవాసులను చూస్తుండేదాన్ని . ఆడవాళ్ళు ఎక్కువ శాతం చిత్తుకాగితాలు ఏరేవాళ్ళు  ,మొగవాళ్ళు చెత్త బండీని నడపటం లాంటివి చేస్తుండే వాళ్ళు . ఒక గుడిసె ముందు అయిదు సంవత్సరాల లోపు వయస్సు ఉన్న అక్కా తమ్ముళ్ళు ఆడుకుంటూ ఉండేవాళ్ళు . తల్లి చిత్తుకాగితాలు ఏరుకోవటానికి వెళ్ళి సాయంత్రానికి తిరిగి వస్తుండేది . బతుకమ్మ కుంటకు ఎదురుకుండా రోడ్ మీద ఒక గప్ చుప్ బండీ ఉండేది . ఆ బండి దగ్గరకు వెళ్ళి ఈ పిల్లలిద్దరూ గప్ చుప్ లు పెట్టమని చెయ్యి చాపి అడుగుతూ ఉండేవాళ్ళు . ఆ బండి అతను పిల్లలు చెయ్యి చాపి అడిగినప్పుడల్లా కర్రతో చేతుల మీద కొడుతుండేవాడు . వీళ్ళను కొట్టటానికి కర్ర దగ్గర పెట్టుకొని ఉండేవాడా ?అన్నట్టు ఉండేది అతని పద్ధతి .ఒక రోజు ఆ పిల్లవాడు మట్టి తింటున్నాడు . అప్పుడే వచ్చిన పిల్లవాడి తల్లితో ఒకామె ఇలా అంటోంది “మట్టి తిననీయకు .. మట్టి తినకుండా కొట్టు “అని . పిల్లవాడిని ఎత్తుకుంటూ “తిండే లేకపోతే మట్టి తినక ఏమి తింటాడు “అని ఆర్ద్రత తో ఆమె అన్నది . ఆమె మాటలు ,వాళ్ళ జీవనం నా మనసును కదిలించాయి . గుడిసెవాసుల జీవితాలను ప్రధానం గా    స్లం లలో ఉండే మహిళల జీవితాలను రాయాలని నిర్ణయించుకున్నాను .2016  సెప్టెంబర్ నుండి 2019 జూన్ దాకా 200 పైగా స్లం లను పరిశీలించాను . ఐతే 2016 జూన్  నుంచే నేను ప్రణాళికా బద్దంగా వెళ్ళటం మొదలు పెట్టాను.

  • హైదరాబాద్   స్లమ్  లకు సంబంధించిన అవగాహన ఉన్న ప్రముఖులను కలవటం.  స్లమ్ లలో పని చేసే ఎన్ . జి .ఒ లను ,ప్రజాసంఘాలకు సంబంధించిన మేధావులను ఇతరులను  కలిశాను. 
  • గ్రంథాలయాలు ,ఇతర రిసోర్స్  ద్వారా  హైదరాబాద్ గురించి అలాగే ఇతర మెట్రోపాలిటన్ నగరాలలో  స్లమ్ ల స్థితిగతులపై  అవగాహనను పెంచుకోవటం. సిటీ సెంట్రల్ లైబ్రరీ కి ఎక్కువగా వెళ్ళేదాన్ని. హైదరాబాద్ నగరానికి సంబంధించిన పుస్తకాలను చదివాను. పాయింట్లు నోట్ చేసుకునే దానిని. 
  •   2016 జూన్ నుండి 2016 సెప్టెంబర్ దాకా పైన చెప్పినట్లు గా అధ్యయనం చేసాను. తర్వాత స్లమ్ లకు వెళ్ళటం మొదలు పెట్టాను.
  •   ఒక చిన్న కెమెరా ,వాయిస్ రికార్డర్ ,సెల్ ఫోన్ ,ఒక నోట్స్ ,పెన్ ,వాటర్ బాటిల్ వీటిని నాతో పాటు ఎక్కడికి వెళ్ళినా తీసుకు వెళ్ళేదాన్ని. 

మొదట నేను స్లమ్ లలో ఉండే  మహిళల జీవితాల గురించి కథలుగా రాయాలనుకున్నాను .బాగ్ లింగంపల్లి లోని భగత్ సింగ్ నగర్ వెళ్ళినప్పుడు ఒక రేకుల  ఇంటి ముందు నిలబడి ఆ స్లమ్ కు సంబంధించిన  సమాచారాన్ని తీసుకుంటూ ఉన్నాను. ఆ ఇల్లు సగానికి పైగా కాలిపోయి ఉన్నది . బేబమ్మ కు జరిగిన అన్యాయాన్ని గురించి చెప్పారు అక్కడి మహిళలు. అంతకు  ముందు రోజే బేబమ్మ ఈ ఇంట్లోనే తగలపెట్టుకొని చనిపోయిందని ,భర్త ను పోలీసులు అరెస్ట్ చేశారనీ ,ఇద్దరు  పిల్లలు అనాథ లయ్యారనీ చెప్పారు .కారణాలనూ చెప్పారు . పెయింటర్  రాములు  వ్యసనపరుడు . జూదగాడు .  ప్రతి రోజు రాత్రి 8 గంటలకల్లా ఎవరో ఒకరి   గుడిసె ముందు ఒక పది మంది బస్తీ వాళ్ళు కూడుకొని పేకాట మొదలు పెట్టేవాళ్ళు. నూటికి తొంభై శాతం రాములు ఆట లో  ఓడిపోతూనే ఉండేవాడు . డబ్బులు ఉంటే కడతాడు లేకపోతే పెళ్ళాన్ని పణంగా పెడతాడు. ఏంటి ఈ అన్యాయం అని ఎవరన్నా అడిగితే “నా దగ్గర డబ్బులు లేవు . నా పెళ్ళాం ఉంది. నా ఇష్టం నేను నా పెళ్లాన్నే పెడతాను . “అని దబాయిస్తాడు . బేబమ్మ భర్తకు ఎంతో చెప్పి చూసింది … ఏడ్చింది …. భర్తను బతిమిలాడుకుంది … మొత్తుకుంది . ఐనా అతనిలో ఏ మార్పు రాలేదు.  ఎప్పటిలాగానే ఆ రోజు కూడా పేకాటలో ఓడిపోయాడు రాములు. డబ్బులు లేవు కాబట్టి ఆ రోజు రాత్రికి తన భార్యను  తీసుకోమని చెప్పాడు. బేబమ్మ ఏడుస్తూ … ఇంక ఎప్పటికీ నువ్వు  మారవు … ఈ నరకం ఇక పడలేను “అంటూ గుడిసెలోకి వెళ్ళి ఒంటిమీద కిరోసిన్ పోసుకొని నిప్పు అంటించుకుంది. బస్తీ లో సగం మంది ఆ గుడిసె దగ్గరకు వచ్చారు .. వాళ్ళు ఎంత వారించినా ఆమె వినలేదు. ఆమె 90 శాతం కాలిపోగా, గుడిసె సగానికి పైగా కాలిపోయింది. తెల్లవారి రాములును పోలీసులు అరెస్ట్ చేశారు . గాంధీ హాస్పిటల్ కు బస్తీ వాళ్ళు తీసుకు వెళ్ళే లోపే బేబమ్మ చనిపోయింది. పిల్లలు అనాథలయ్యారు … !

నా ఎదురుకుండా సగం కాలిన ఆ ఇంటిని చూస్తుంటే నా మనసు కకావికలమైపోయింది . ఎంతో ఆలోచించాను. ఒక్క మహిళల గురించి అనే కాకుండా మొత్తం మురికివాడల స్థితిగతులను  అధ్యయనం చెయ్యాలని అనుకున్నాను. అధ్యయనం కోసం నేను ఒక పద్దతిని ఏర్పరచుకున్నాను. 

  • స్లమ్ లను అవి ఉన్న ప్రాంతాన్ని బట్టి ,అక్కడ ఉండే సమస్యలను బట్టీ ,స్థితిగతులను బట్టీ విభజించుకోవటం . 
  • పాత బస్తీ 
  • కంటోన్మెంట్ 
  • పారిశ్రామిక ప్రాంతం 
  • ఇతర ప్రాంతాలు 
  • ప్రతి స్లమ్ కు కనీసం మూడు సార్ల నుండి ఐదు సార్ల దాకా  వెళ్ళాలి .  
  1.  మొదటగా వెళ్ళినప్పుడు అక్కడి వాళ్ళతో పరిచయం 
  2. రెండవసారి వెళ్ళినప్పుడు కొంత సమయాన్ని వెచ్చించి సరియైన సమాచారాన్ని ఇచ్చే వాళ్ళను గుర్తించటం . 
  3. మూడవసారి వెళ్ళినప్పుడు ఎక్కువ సమయం వాళ్ళతోనే ఉండి పూర్తి సమాచారాన్ని తీసుకోవటం …. కుదరకపోతే మళ్ళీ వెళ్ళటం . 
  • వంద ప్రశ్నలతో కూడిన ఒక ప్రశ్నావళిని తయారు చేసుకున్నాను . ప్రభుత్వ గణాంకాల సర్వే లాగ—
  •   ప్రభుత్వ ఆఫీస్ లకు వెళ్ళాను .  

మురికి వాడల  సర్వే ప్రశ్నావళి :

మురికి వాడ  పేరు :

1. మురికి వాడగా గుర్తించ బడినది   :

1. భౌగోళిక పరిస్థితుల బట్టి  

2. పరిసరాల బట్టి 

3. ఆర్ధిక ,సామాజిక అంశాల బట్టి  

4. సాంకేతికతను బట్టి 

5. ఇతరములు 

2.  మురికి వాడ చరిత్ర :

1. ప్రభుత్వం గుర్తించినది 

2. వార్తాపత్రికలు గుర్తించినది 

3. టి .వి ఛానల్స్ గుర్తించినది 

4. తనకు తానుగా ప్రకటించుకున్నది 

5.ఇతరములు 

3. ప్రస్తుతమున్న  సౌకర్యాలు :

1. నీరు ,కాలువలు 

2. కరెంటు 

3. ఓపెన్ టాయిలెట్స్ 

4. కమ్యూనిటీ హాలు 

5.ఇతరములు 

4. కాలానుగుణ,చిరు  వ్యాపారాలు :

1. తోపుడు బండ్లు

2. పాత సామాను,బట్టలు ,పుస్తకాలు ,పేపర్లు ,ఇతరత్రా 

3.  వాయిదా పద్ధతిలో వస్తువుల అమ్మకం 

4. చిట్ల వ్యాపారం ,వడ్డీలకు డబ్బులు ఇవ్వటం 

5. ఇతరములు 

11. 1. వంట మనుషులు 

      2. ఆయాలు 

      3. నర్సులు 

      4. రేషన్ కార్డుల లాంటివి తాకట్టు పెట్టటం 

      5. ఇతరములు 

5. అలవాట్లు 

1. లాటరి టికెట్స్ 

2. జూదం 

3. పేకాట 

4.             

5. ఇతరములు 

6. ఆరోగ్య సమస్యలు 

1. టి.బి 

2. హెచ్ .ఐ .వి 

3. రక్త హీనత 

4. పోలియో, వికలాంగులు 

5. ఇతరములు 

7. పండగలు 

8. సామూహిక అన్నదానాలు 

9. పంటలు ,పశువుల పెంపకం 

1. పెరటి తోటలు 

2.  కోళ్లు ,బాతులు 

3. మేకలు ,గొర్రెలు 

4. ఆవులు ,గేదెలు 

5. ఇతరములు 

10. ఆహారం ఎక్కువగా ఏమి తీసుకుంటారు ?

11. పెళ్ళిళ్ళు 

 12. ఆచారాలు ,నమ్మకాలు 

13. కళాకారులు 

14. ప్రభుత్వ పధకాల అమలు 

     1. ఆధార్ కార్డు 

      2. ఓటర్ నమోదు 

     3. బర్త్ సర్టిఫికెట్ 

     4. పెన్షన్ 

     5. ఇతరములు 

15. వైద్యం 

   1. నాటు వైద్యాలు 

    2. ప్రభుత్వ ఆసుపత్రులు 

    3. ప్రైవేట్ ఆసుపత్రులు 

    4. పోలియో డ్రాప్స్ ,టీకాలు ఇతరత్రా 

     5. ఇతరములు

16. హౌస్ టాక్స్ కడుతున్నారా ?లేదా ?

17. గవెర్నమెంట్ ఆఫీసర్స్ ఉన్నారా ?లేదా ?

18. ఎన్ .జి .ఓ ల పాత్ర ?

19. ఇళ్ళు 

1. పక్కా ఇళ్ళు /లీజ్ /అద్దె /సొంత / ఆక్రమించినవి 

2. సర్వే నెంబర్ / ఇంటి నెంబర్ 

3. తూర్పు ,పడమర లలో ఏమున్నది ?

4. ఉత్తర ,దక్షిణాలలో ఏముంది ?

5. ఇతరములు 

20. అనాధ పిల్లలు /తండ్రి లేని పిల్లలు / తల్లి లేని పిల్లలు 

21. పిల్లల అమ్మకాలు /దత్తత తీసుకోవటం 

22. మరణాలు ,అత్యాచారాలు 

     1. హత్యలు 

      2, ఆత్మ హత్యలు 

      3. అనుమానాస్పద మరణాలు 

      4. ప్రమాద వశాత్తు మరణాలు 

      5. ఇతరములు 

23. వార్డ్ నంబర్లు / సర్పంచులు ఇతరత్రా 

24.  బ్యాంకు /పోస్టల్ 

25. విద్య 

1. అంగన్వాడి 

2. ప్రాధమిక పాఠశాలలు 

3. ఉన్నత విద్య 

4. ఇతరములు 

25. అక్షరాస్యత 

1. మహిళలు 

2. పురుషులు 

3. బాలికలు 

4. బాలురు 

26. జనాభా 

1. మహిళలు 

2. పురుషులు 

3. బాలికలు 

4. బాలురు 

27.  మహిళలు —- సమస్యలు 

           
ఈ సర్వే  ప్రశ్నావళి జనాభా లెక్కలకు పనికి వచ్చినంతగా అధ్యయనానికి పనికి రాదనిపించింది . అయితే సంబంధిత స్లమ్ కు సంబంధించిన ప్రాథమిక సమాచారం తెలుస్తుంది .’తర్వాత ప్రశ్నావళిని పక్కకు పెట్టేసి ఈ విధంగా రాసుకోవటం మొదలు పెట్టాను . 

  •   జూబ్లీ హిల్స్ లో  ప్రభుత్వ లెఖ్ఖల ప్రకారం మొత్తం 18 మురికివాడలు ఉన్నాయి .20 వేలకు పైగా జనాభా నివసిస్తున్నారు . వాటిలో 3 మురికి వాడలను సందర్శించటం జరిగింది . ఆ మురికి వాడల వివరణ :

 1.మురికి వాడ పేరు /అడ్రస్ : అంబేడ్కర్ నగర్ +అంబేడ్కర్ కాలనీ ,జూబ్లీ హిల్స్ / సర్వే నెంబర్ :403

 2. జనాభా :  500 జనాభా ఉండవచ్చు . 

 3. కుటుంబాలు :140 +60 

4. మూలం / ఉద్భవించటం :1999 లో ఈ మురికివాడ ఏర్పడింది . వరంగల్ ,మెహబూబ్ నగర్ ,నల్గొండ ,మెదక్ ,సంగారెడ్డి ల నుండి వలస వచ్చారు . 

 5. మురికి వాడ స్వభావం : ఉపాధి కోసం వచ్చి ఏర్పరచుకున్న మురికి వాడ 

 6. మురికి వాడ ప్రత్యేకత :ఆర్ధికంగా కొంత నిలదొక్కుకున్నారు . దినసరి కూలీ కోసం అడ్డా మీదకు వెళ్లనవసరం లేకుండా ఇక్కడికే వచ్చి పిలుచుకు పోతారు . ఆదివారాలు చర్చి కి సంబంధించిన వాళ్ళు  వచ్చి పిల్లలను తీసుకు పోయి భోజనం పెడతారు . 

 7. ఇళ్ళ పరిస్థితి : రాళ్ళూ ,గుట్టల మధ్య ఇరికిరుకుగా ఉండి ,పాలిథీన్ కవర్లు తో ఉన్న ఇళ్ళు . 

 8. కులాలు /మతాలు : oc :2,Bc:20,ST :20 కుటుంబాలు ,ఎస్ . సి :100 (మాదిగలు )

 9. ఆర్ధిక స్థితి :కొంత మెరుగు 

10.  పిల్లల చదువు :కొంత మెరుగు ,మస్తాన్ నగర్ అంగన్వాడి కి వెళ్తారు 

11. వృత్తి :కూలీ పని ,గార్డెన్ వర్క్ ,మేస్త్రీలు ,డ్రైవర్లు,ఇళ్లల్లో పాచి పని .  

12. ఆర్ధిక స్థితి :    దారిద్య రేఖకు దిగువున  ( below poverty level )

13. భాష :తెలుగు 

14. అవసరాలు : ఇళ్ళు ,టాయిలెట్స్ 

15. జన సముదాయం  :    

  •  ఈ పద్దతిలో తయారు చేసుకున్నా… అయినా  ప్రాథమిక సమాచారమే తప్ప పూర్తి సమాచారం తీసుకోలేకపోయాను . చివరకు ప్రజలు ఏది చెబితే అది రికార్డు చేసుకుంటూ మధ్య మధ్యలో ముఖ్యమైన పాయింట్స్ రాసుకుంటూ … అవసరమైనప్పుడు పైన చెప్పిన ప్రశ్నావళి ని వాడుతూ విషయ సేకరణ చేయటం మొదలు పెట్టాను.   ఎక్కువ టైం తీసుకున్నా ఈ పద్దతే సరైనదిగా నాకు అనిపించింది . 


  • స్లం ల లిస్ట్ 
  • విషయ సేకరణ 
  • సేకరించిన విషయాన్ని సేవ్ చేసుకోవటం 
  • మనం అనుకునే పద్దతిలో విభజించుకోవటం 

                                                                       
విషయాన్ని సేకరించే క్రమములో చాలా సమస్యలనూ ,మానసిక వత్తిడులనూ  ఎదుర్కోవలసి వస్తుంది . మనం ఎంత ప్రణాళికా బద్దంగా తయారు చేసుకొని వెళ్ళినా ఆచరణలో మనం అనుకున్న విధంగా సాధ్యపడకపోవచ్చు . సమాచారము ఎక్కువగా ఇస్తారు అనుకున్న వాళ్ళు అసలేమీ ఇవ్వలేకపోవచ్చు . అనుకోని వాళ్ళు విలువైన సమాచారాన్ని ఇవ్వవచ్చు . ఒక్కోసారి ఎవరు కలవక అలా గంటల తరబడి కూర్చొని వెనక్కు రావాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు . మనలను స్లమ్ కు తీసుకువెళ్ళే వాళ్ళ మనోభావాలు కూడా చాలా ప్రాధాన్యతను సంతరించుకుంటాయి . 

                                                                   
ఎలాగంటే ఒక స్లం కు నేను వెళ్ళటం జరిగింది . నన్ను ఆ స్లం కు తీసుకు వెళ్ళటానికి  ఒక ఎన్ .జి .ఒ లో పనిచేసే ఒక మహిళా ఆర్గనైజర్ ను ఇచ్చారు . ఆమె ఆలోచన వేరుగా ఉంది . నన్ను ఆ స్లం కు తీసుకువెళ్ళి  మాట్లాడించేసి తను తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలనుకుంది . అయితే నాకు సరిపడా సమాచారాన్ని తీసుకోవాలని ఉంది . స్లమ్ కు వెళ్ళగానే అక్కడ ఉన్నవాళ్ళందరినీ   పిలిచింది నన్ను పరిచయం చేసింది .  ఇద్దరమూ కూర్చున్నాము . నేను అడుగుతుంటే వాళ్ళేదో చెప్తున్నారు . ఆమె కల్పించుకొని “వీళ్ళు చెప్పేది ఏముంది మాడం . ఈ స్లమ్ గురించి నేను చెప్తా రాసుకోండి “అని అన్నది . చెప్తున్న వాళ్ళు ఆగిపోయారు . నేను ఏమి రాయాలనుకుంటున్నానో ?నాకు ఎలాంటి సమాచారం కావాలో ? తనకు అర్థం కాలేదు . జనరల్ గా వాళ్ళ సంస్థకు నిధులు ఇచ్చే డోనార్లు లాగానే అనుకుంది . చిరుద్యోగులు చేసుకునే  మహిళలకు టైం దొరికేదే తక్కువ . తొందరగా ఇంటికి వెళితే పిల్లలతో కొంత టైం గడపవచ్చు అని ఉంటుంది .   నేను ”నీ పని ఏమన్నావుంటే నువ్వు వెళ్ళి చూసుకో లక్ష్మి . నాకు కావలసిన సమాచారాన్ని నేను నెమ్మదిగా తీసుకుంటాను అని చెప్పి ఆమెను పంపించేసి రాత్రి దాకా ఉండి నాకు కావాల్సిన సమాచారాన్ని తీసుకున్నాను . ఆమె వెళ్ళటానికి ఎంతకూ సిద్ధపడలేదు . నేను క్షేమంగా  ఇంటికి చేరుకున్నాక ఫోన్ చేసి తనకు చెప్తానని  మాట ఇచ్చాక  వెళ్ళింది . 

                                               
“మీరు ఆ స్లమ్ కు వెళ్ళండి . అక్కడ ఫలానా మనిషి మీకు కలుస్తాడు . మీకు కావలసిన సమాచారాన్ని తీసుకోండి .మధ్యలో నేను వచ్చి కలుస్తాను . “అని  చెప్పి సహకరించి మొగవాళ్ళు  ఉన్నారు . నాతో పాటు స్లం  లకు వచ్చిన  వాళ్లూ  ఉన్నారు .అలాగే  రమ్మనమని చెప్పి నా ఆధార్ కార్డు,యూనివర్సిటీ ఐ డి కార్డుల   జిరాక్స్ లు తీసుకొని ఎవరినీ పరిచయం చేయకుండానే  తిప్పి పంపించేసిన వాళ్ళు ఉన్నారు . గతంలో ఎప్పుడో ఆయన కార్మిక నాయకుడిగా పని చేశారట ఓల్డ్ సిటీ కాటేదాన్ ను పరిచయం చేస్తా అన్నారు . ఏదన్నా వెహికల్ బుక్ చేస్తే తీసుకువెళ్తామన్నారు .కార్ బుక్ చేసాను . వాళ్ళ ఇంటి దగ్గర నుంచే బయలు దేరాము . మధ్యలో ఇద్దరిని కలుపుకున్నారు . “ఈమె పేరు ఫలానా … స్లం ల మీద రాస్తోంది .. నేనే అన్నీ చూపిస్తోంది .. “ఇలా ప్రతి 5 నిమిషాలకు ఎవరికో ఒకరికి ఫోన్ చెయ్యటం ఇదే విషయం వాళ్ళకు చెప్పటం … నాతో మాట్లాడించటం . యు ట్యూబ్ ఛానల్స్ కు ఫోన్ చేయటం ఇదే విషయం చెప్పటం …. ఇలా ఉదయం నుంచి మొదలు పెట్టి కాటేదాన్ లో ఆయన పనులు చూసుకొని ఇక ఆయనకు ఎక్కడ పని ఉన్నదో  అక్కడి కల్లా తిప్పి లాస్ట్ కు సాయంత్రం 6 గంటలకు నాంపల్లి లో  ఆఫీస్ పని అయినాక “నేను బస్సులో ఇంటికి వెళ్తానమ్మా  మీరు వెళ్లిపోండి” అన్నారు . ఇలా వాళ్ళ అవసరాల కోసం నా సమయాన్ని నష్ట పరిచిన వాళ్ళు ఉన్నారు . సమాచారాన్ని సేకరించకముందే నేను రాయబోతున్న పుస్తకాలకు  గైడ్ లగా ఉన్నామని చెప్పుకున్న వాళ్ళూ ఉన్నారు . ఇక వాట్స్ ఆప్ ,ఫేస్బుక్ ,ఫోన్ లలో చాలా ఎక్కువగా మానసిక వత్తిడిని   కలిగించిన వాళ్ళూ ఉన్నారు .  ఎవరి పేర్లను నేను మెన్షన్ చెయ్యదలుచుకోవటం లేదు . సామాజిక అధ్యయనంలో ఏర్పడే సమస్యలను చెప్పటం మాత్రమే నా ప్రధాన ఉద్దేశ్యం . ఈ అనుభవాలన్నీ ఇప్పటి సమాజం తాలూకు స్థితిని మనకు తెలియపరుస్తాయి. 

                                           
ఎక్కడైనా ప్రజల సహకారం గొప్పది . దాదాపుగా అన్ని పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు విషయ సేకరణకు సహకరించారు . అయితే ఉదయం పూట ఉన్నట్టుగా  సాయంత్రాలు  స్లం లలో   వాతావరణం  మారుతూ ఉంటుంది  . బోడుప్పల్ లో ఉన్న కళాకారుల బస్తీలో నేను అదే గమనించాను . సాయంత్రం దాకా చాలా విషయాలు మాట్లాడారు . “మేము కళాకారులము … అడుక్కునే వాళ్ళము కాదు . ఇలా ఆడ వేషాలు వేసుకొని అడుక్కోవటం ఇష్టం లేదు . డిగ్రీ దాకా చదువుకున్నాము  అక్కా ప్రభుత్వం  మాకు ఉద్యోగాలు ఇస్తే బాగుండు .. అని  సాయంత్రం దాకా చాలా విషయాలు  మాట్లాడిన వాళ్ళు  .  చూస్తుండగానే చిన్న విషయం మీద కొట్లాడుకొని రక్తాలు కార్చుకున్నారు . రోడ్ అంతా  రక్త సిక్త మై పోయింది. మందు  కల్లు ,సారాయి వాళ్ళ జీవితాలతో ఎలా చెలగాటమాడుతున్నాయో ?ప్రత్యక్షం గా చూడటం జరిగింది .

                                     
ఓల్డ్ సిటీ లో ఉన్న బస్తీ లకు వెళ్ళినప్పుడు నాతో మాట్లాడుతున్న ఆ బస్తీ మహిళలో ఎవరికో ఒకరికి కార్పొరేటర్ నుంచి ఫోన్  వచ్చేది . నన్ను కార్పొరేటర్ దగ్గరకు వాళ్ళు తీసుకొని వెళ్ళేవాళ్ళు . ఆయన బస్తీ అభివృద్ధికి వాళ్ళు చేసిన కృషిని చెప్తూ ..”.యే సభీ లిఖ్ లో … ఔర్ దేఖ్ నె కీ కోయీ జరూరత్ నహీ హై ” అనేవాళ్ళు . అంటే ఇక ఆ బస్తీలో తిరగవద్దని సున్నితంగా చెప్పటం . … !

                                         
ఖాలీ ఖబర్ బస్తీ లో ఆ రోజు మధ్యాహ్నం ఒంటి గంట అవుతోంది .  అప్పటికి దాదాపుగా గంట నుంచీ ఆ ఇరుకు గల్లీ లో ఎండలో అలా నిలబడే ఉన్నాను . నా చుట్టూ 30 మంది దాకా గుమిగూడి ఉన్నారు . వాళ్ళంతా మూడు గ్రూవు లుగా విడి పోయి వాదించుకుంటున్నారు . అక్కడి వాతావరణ మంతా ఘర్షణతో కూడుకొని ఉంది  . నా మాట ఎవరూ వినిపించుకునే స్థితిలో లేరు .  ఆ బస్తీని పరిచయం చేయటానికి నన్ను తీసుకు వచ్చిన రజిత (పేరు మార్చాను ) ఆ గల్లీ చివరన మెయిన్ రోడ్ దగ్గర ఉంది .మాటి మాటికీ ఆ గల్లీ దగ్గరకు వచ్చి   “వచ్చేయండి మేడం”అంటూ గట్టిగా  అంటోంది . ఆమె గల్లీ లోకి రాకుండా   వాళ్ళను తప్పించుకొని నన్నే మెయిన్ రోడ్ మీదకు వచ్చే య మంటోంది .  ఆమె పిలుస్తున్న ప్రతిసారీ నేను “ఇక్కడి ప్రజలు పంపిస్తేనే  వస్తాను” అని గట్టిగా అరుస్తూ  చెప్తున్నాను .  మేము  ఈ స్లంలోకి  రావటానికి ముందే రజిత  పొదుపు సంఘాల గురించి  తను మాట్లాడుతున్నప్పుడే నాకు కావలసిన బస్తీ ఇన్ఫర్మేషన్ నన్ను తీసుకోమనీ  వెంటనే అక్కడ నుంచి బయట పడి వేరే బస్తీకి వెళదామని చెప్పింది .  కానీ నాకు ఆ ఇరుకు గల్లీ లో అంత మంది ప్రజలు ఎలా ఉండగలుగు తున్నారో ?అని బస్తీ మొత్తం చూడాలనిపించింది . చాలా సేపటి తరువాత గొడవ సద్దుమణిగాక నేను చెప్పేది వాళ్ళు విన్నారు …   నాకు సహకరించారు . సుభాష్ నగర్ ,అంబెడ్కర్ నగర్ ,ఇలా కొన్ని స్లం లలో వాళ్ళ పనుల్లో భాగస్వామ్యం అయి విషయ సేకరణ చేసాను . ఎండాకాలం ఎక్కువగా వెళ్లేదానిని . నిమ్మరసం నీళ్ళు ఇచ్చేవాళ్ళు . వాళ్ళతో పాటే తినేదాన్ని . ప్రజలు ఎవరూ నన్ను ఇబ్బంది పెట్టలేదు . నాకు వివరంగా బస్తీల గురించి చెప్పారు . బస్తీకి వెళ్ళినప్పుడు ఆశా వర్కర్లను ,అంగన్వాడీ టీచర్లను ,ప్రాధమిక ఆరోగ్య కేంద్రం ఉంటే వాళ్ళను కలిసేదాన్ని . స్లం లకు సంబంధించిన ఫొటోలన్నీ దాదాపుగా అక్కడి ప్రజలు తీసినవే .. సెల్ ,కెమెరా వాళ్ళకు ఇచ్చేదాన్ని వాళ్ళు తీసేవాళ్ళు .. కొన్ని మాత్రమే నేను తీశాను .దాదాపుగా  అన్ని రాజకీయ పార్టీల కార్యకర్తలూ  విషయ సేకరణలో నాకు సహకరించారు . సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు . 

ఆణిముత్యాల లాంటి ప్రజల జీవితాలు …. అగాధంలో మరుగున పడి ఉన్నాయి . వాటిని వెలికి తీయాలనుకోవటం దుస్సాహసమే అవుతుంది. ఫ్రెండ్స్ చిరు ప్రయత్నం మాత్రమే చేసాను…. సామాజిక అధ్యయనం చేయవలసిన అవసరం ఇంకా ఎంతో ఉన్నది… ఆ ప్రయత్నంలో భాగమవుదాం..! 

Leave a Reply