ఒక పక్క, దేశమంతా ఎండలు భగ భగ మండుతున్నాయి. మండుతున్న సరుకుల ధరలు ఆకాశానికి ఎగుస్తున్నాయి. ఈ మంటలకు భారతదేశ శ్రామికులు కుతకుత ఉడికిపోతున్నారు.
మరో పక్క, దేశం ప్రయివేటీకరణ వెల్లువలో కొట్టుకుపోతోంది. గుప్పెడు పెట్టుబడిదారుల చేతుల్లోకి ప్రజా సంపద అంతా ప్రవహిస్తోంది. 75 ఏళ్లుగా పార్లమెంటరీ ఓట్ల రాజకీయం దేశంలో నిరాటంకంగా కొనసాగుతోంది. ఇప్పుడు దానికి అమృతోత్సవ పండగ.
ప్రజలు నమ్మి, ఓట్లేసి, గెలిపిస్తున్న పార్లమెంటరీ పార్టీలు, పాలనా వ్యవస్థలు.. శ్రామిక ప్రజా శ్రేణులను స్వాతంత్రం, గణతంత్రం, రాజ్యాంగం సాక్షిగా వంచిస్తూనే ఉన్నాయి. సామాజిక సంపదను వ్యక్తిగత సంపదగా మార్చుకునే క్రమాన్ని అవిరామంగా కొనసాగిస్తు న్నాయి. ఇప్పుడు ఆ దూకుడు, వేగం మరింత పెరిగింది.
శ్రామిక శ్రేయోరాజ్యమనే మాట గాలి మూటయ్యింది. సంపదను దోచుకుంటున్న వ్యవస్థీకృత పెట్టుబడి, నూతన భూస్వామ్యం, దళారీ వ్యవస్థలు, 75 ఏళ్ళనుండి రాజ్యమేలుతున్నాయి.
ఈ అప్రజాస్వామిక, శ్రామిక వ్యతిరేక పాలనకు, అణచివేతకు, వ్యతిరేకంగా దేశంలో ఏదో చోట నిత్యం ప్రజలు తమ ఆందోళనను, నిరసనను తెలియ చేస్తున్నారు. పంటలు పండించే రైతులు, ఆదివాసీలు, ఉత్పత్తి రంగ కార్మికులు, సేవారంగ ఉద్యోగులు, మైనారిటీలు, ఈ అరాచక పాలనా వ్యవస్థపై తమ ఆగ్రహావేశాలను ప్రకటిస్తూనే ఉన్నారు.
గత రెండేళ్లలో ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా మహమ్మారి మన దేశ అసంఘటిత శ్రామిక ప్రజల అత్యంత దైన్యతను, వారిని పట్టి పీడిస్తున్న ఈ దుర్మార్గపు వ్యవస్థ వికృత రూపాన్ని బహిర్గతం చేసింది. దేశంలో ఆకలి, పేదరికం, నిరుద్యోగం ఎక్కడున్నాయ్? అనే ఆర్థిక నిపుణుల దగాకోరు పెట్టుబడి దాశ్యతను అది బహిర్గతం చేసింది.
ప్రజలు ఓట్లు వేయడానికే కాని, ఓట్లేసి ప్రశ్నించడానికి కాదు. ప్రభుత్వం తన ఇష్టానుసారం చట్టాలు చేస్తుంది. ప్రభుత్వం, తన ఆస్తులు అమ్మేయాలను కుంటే అమ్మేస్తుంది. అడ్డుకోవడానికి మీరెవరని ప్రభుత్వం ప్రజలను బెదిరిస్తూ, పొగరుబోతు ఫాసిస్టుగా ప్రవర్తిస్తోంది.
ఈ ప్రభుత్వ ప్రవర్తనకు సమాధానంగా దేశంలో ఓ సంవత్సరంపాటు మహత్తర రైతాంగ పోరాటం నడిచింది. ప్రభుత్వరంగ పరిశ్రమలు, బ్యాంకులు, బీమా, ఇతర ఆస్తుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక, ఉద్యోగ వర్గాలు దేశవ్యాప్త సమ్మెలు చేశాయి. ఇవన్నీ ఓ రాజకీయ లక్ష్యం లేకుండా జరుగుతున్న ఆర్థిక పోరాటాలు. పెట్టుబడిపై, రాబోయే రోజుల్లో,
జరపబోయే మరిన్ని పదునైన పోరాటాలకు అవసరమైన ముందస్తు తర్ఫీదు కవాతులుగా వీటిని పరిగణించాలి.
అయితే, ఈ ఆగ్రహావేశాలు శ్రమశక్తి దోపిడిని గాని, సామాజిక సంపద తోడివేతను గాని, నిలువరించలేక పోతున్నాయి. అడ్డుకట్ట వేయలేక పోతున్నాయి. ఇక సమస్త దోపిడీ పీడనలకు చరమగీతం పాడే మార్గం సుదీర్ఘం.
ఈ దేశ సంఘటిత రైతాంగ, కార్మిక, ఉద్యోగ వర్గాలు మరిన్ని పోరాటాలకు, త్యాగాలకు సిద్ధమై, ఉద్యమించాల్సిన చారిత్రిక సందర్భంలో ఈ నాటి భారత కార్మికోద్యమం ఉన్నది. దేశంలో ప్రభలంగా ఉన్న కోట్లాది అసంఘటిత శ్రామిక శ్రేణులను ఎలా సమీకరించి ఐక్య ఉద్యమ బాట పట్టించాలో ఆలోచించి, వ్యూహ రచన చెయ్యాల్సిన బాధ్యత సంఘటిత కార్మిక శక్తులపై ఉంది. అవి అలా చేస్తాయా? చేయగలవా? ఏమో చెప్పలేం!
‘మే డే’ స్ఫూర్తి అంటేనే విస్తృత సంఘటిత తత్వం. పెట్టుబడిపై పోరాటం. శ్రామిక వర్గ విజయ సాధన. అంటే శ్రామిక రాజ్యాధికార సాధన. చరిత్ర పొడవునా ఎందరో సాధారణ శ్రామికులు, శ్రామిక నాయకులు, వారి పక్షాన నిలిచి పోరాడిన బుద్ధిజీవులు… వారు చిందించిన రక్తం, వారి ప్రాణత్యాగాలు, వారి పోరాట పఠిమ.. మన కందించి అమర్చిపెట్టిన వెసులుబాట్లు. ఇలా వారి త్యాగాల ద్వారా ఒనగూరిన కనీస హక్కులే ఇవాళ మనం అనుభవిస్తున్నాం. అలా సమకూరిన ఎనిమిది గంటల పనిదినం కూడా కోల్పోతున్న దుస్థితి ఇప్పుడు పునరావృత మౌతున్నది.
భూమిలేని రైతుకూలీలు, చిన్న, సన్నకారు రైతులు, వలస కార్మికులు, గిగ్-డిజిటల్ ప్లాట్ఫార్మ్ పనివారు, ఇళ్లల్లో పనిచేసేవారు, ఇంకా అనేకానేక లెక్కల కెక్కని శ్రామిక శ్రేణులు… శ్రామిక రాజ్యాధికార సాధన అనే రాజకీయ ఇరుసు చుట్టూ సంఘటితం కానిదే,
ప్రయివేటు పెట్టుబడి, సామ్రాజ్యవాదం, నూతన భూస్వామ్యం, మత ఫాసిజాలను ఓడించడం అసాధ్యం.
ఈ శ్రేణులను సంఘటిత పరచడమంటేనే ‘లాంగ్ రివల్యూషన్’. ఓ సుదీర్ఘ విప్లవ ఆచరణ. ఈ దేశంలో ప్రస్తుతమున్నటువంటి, శ్రామిక వర్గ పార్టీలుగా చెప్పుకుంటున్నటువంటిరకరకాల వామపక్ష, సోషలిస్టు, కమ్యూనిస్టు రాజకీయ పార్టీలన్నీ రద్దై, శ్రామిక రాజ్యాధికార సాధన అనే ఇరుసు చుట్టూ ఏకీకిరణ చెందనిదే, ఓ నూతన ఆచరణాత్మక రాజకీయ రూపం ఉనికిలోనికి రానిదే, సమాజంలో మౌలిక మార్పు సాధ్యం కాదు. శ్రామికులకు రాజ్యాధికారం సిద్ధించదు.