మేడే అమరగాథ

నేటికి 136 ఏండ్ల క్రితం 1886లో మే 1న అమెరికాలోని చికాగో నగర కార్మికులు ‘ఎనిమిది గంటల పనిదినం’ కోసం చారిత్రాత్మక పోరాటానికి నాంది పలికారు. ఆ రోజుల్లో పని గంటలకు ఏ నియమమూ లేకుండింది. పొద్దు పొడిచింది మొదలు చీకటయ్యే దాకా కార్మికులు కార్ఖానాల్లో రెక్కలు ముక్కలు చేసుకుంటూ వుండేవాళ్లు.

ప్రారంభ దినాల్లో అమెరికాలో కార్మికులకు రోజుకు 12 నుండి 18 గంటల వరకూ శ్రమించవల్సి వచ్చేది. అత్యధిక కార్మికులు చిన్న వయసులోనే ప్రమాదకరమైన రోగాల బారినపడేవారు. చనిపోయేవారు కూడా. దీనికి వ్యతిరేకంగా పోరాడిన కార్మికులపై  ప్రైవేటు గూండాలూ, పోలీసులూ, సైన్యంతో దాడులు చేయించేవాళ్లు. పరిస్థితి అత్యంత దారుణంగా వుండేది.

నిర్బంధం నుండి ప్రతిఘటన పుడుతుంది. పోరాట కాంక్ష అలలను సృష్టిస్తుంది. అమెరికా కార్మికయోధులు పోరు మార్గాన్ని ఎంచుకున్నారు. 1877 నుండి 1886 వరకూ ఇక్కడి కార్మికులు దేశవ్యాప్తంగా ఎనిమిది గంటల పని దినపు డిమాండ్ పై ఏకం కావడం, సంఘటితం కావడం ప్రారంభించారు. 1886లో అమెరికా అంతటా కార్మికులు ‘ఎనిమిది గంటల కమిటీలు’ ఏర్పాటుచేసుకున్నారు. చికాగోలోని కార్మిక ఉద్యమం అన్నింటికంటే బలంగా వుండింది. మే 1న కార్మికులందరూ తమ పని ముట్లను పక్కన పెట్టి రోడ్ల మీదికి పోవాలని, ఎనిమిది గంటల పనిదినపు నినాదాన్ని హెూరెత్తించాలని చికాగో కార్మికులు నిర్ణయించుకున్నారు. 

ఇలా పుట్టింది మేడే ఉద్యమం

1886, మే 1న అమెరికా అంతటా లక్షలాది కార్మికులు ఒకేసారి సమ్మె ప్రారంభించారు. ఈ సమ్మెలో పదకొండు వేల ఫ్యాక్టరీలకు చెందిన కనీసం మూడు లక్షల ఎనభై వేల మంది కార్మికులు పాల్గొన్నారు. చికాగో నగర దరిదాపుల్లోని రైలు రవాణా మార్గమంతా స్థంభించిపోయింది. చికాగోలోని అత్యధిక కార్యానాలూ, వర్క్  షాపులూ బందయ్యాయి. నగరంలోని ప్రధాన మార్గమైన మిషిగన్ ఎవెన్యూపై అల్బర్ట్ పార్సన్స్ నాయకత్వంలో కార్మికులు ఒక భారీ ర్యాలీ నిర్వహించారు.

పెరుగుతున్న కార్మికుల బలమూ, వాళ్ల నాయకుల తొణకని సంకల్పంతో భయభ్రాంతులైన పారిశ్రామికవేత్తలు కార్మికులపై నిరంతరాయంగా దాడులు చేసే ఎత్తుగడలు అవలంబించారు. పెట్టుబడిదారుల యాజమాన్యంలోని మొత్తం పత్రికలన్నీ ‘ఎర్ర ప్రమాదం’ గురించి మొత్తుకోసాగాయి. పెట్టుబడిదారులు చుట్టుపక్కల ప్రాంతాల నుండి కూడా పోలీసులనూ, సాయుధ బలగాలనూ పిలిపించి మోహరింపజేశారు. వీరితోపాటు కుఖ్యాత పింకర్టన్ ఏజెన్సీకి చెందిన గూండాలను కూడా సాయుధం చేసి కార్మికులపై దాడులు చేయడానికి సర్వసన్నద్ధంగా వుంచారు. పెట్టుబడిదారులు ‘అత్యవసర స్థితి’ని ప్రకటించారు. నిరంతరం వాళ్ల సమావేశాలు నడుస్తూనే వుండినాయి. ఆ సమావేశాల్లో ఈ ‘ప్రమాదకరమైన స్థితి’ నుండి బయటపడడానికి సమాలోచనలు జరుగుతూనే వుండినాయి.

మే 3న మైకార్మిక్ హార్వెస్టింగ్ మెషీన్ కంపెనీ కార్మికులు తమ పోరాటాన్ని ముందుకు తీసుకుపోయినపుడు నగర పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తతకు చేరుకున్నాయి. కార్మికులు ప్రతిఘటనా సభ  ప్రారంభించగానే నిరాయుధ కార్మికులపై తూటాలు కురిపించబడ్డాయి. నలుగురు కార్మికులు చనిపోయారు. చాలా మంది గాయపడ్డారు. ఆ తర్వాతి రోజు కూడా కార్మిక బృందాలపై దాడులు కొనసాగాయి. ఈ క్రూరమైన పోలీసు నిర్బంధానికి వ్యతిరేకంగా మే 4వ తేదీ రాత్రి చికాగో నగర ప్రధాన మార్కెట్ అయిన హే మార్కెట్ స్క్వేర్ వద్ద ఒక ప్రజా సభ జరిగింది. దీనికి నగర మేయర్ నుండి అనుమతి కూడా లభించింది.

సభ రాత్రి ఎనిమిది గంటలకు ప్రారంభమయింది. దాదాపు మూడు వేల ప్రజల సమక్షంలో కార్మిక నాయకులు పార్సన్స్, స్పాయిస్ ఐక్యంగా, సంఘటితంగా వుండి పోలీసు నిర్బంధాన్ని ఎదుర్కోవాలని కార్మికులకు పిలుపునిచ్చారు. మూడవ వక్త సామ్యూల్ ఫీల్డెన్ మాట్లాడ్డానికి లేచేప్పటికి రాత్రి పది గంటలు కావొస్తుండింది. వర్షం కూడా ప్రారంభమైంది. అప్పటికి స్పాయిస్, పార్సన్లు తమ భార్యలూ, ఇద్దరూ పిల్లలతో పాటు అక్కడి నుండి వెళ్లిపోయారు. జనం పల్చబడ్డారు. సభ ముగింపుకు చేరువవుతుండగా కుఖ్యాత కెప్టెన్ బాన్ ఫీల్డ్ నాయకత్వంలో గుంపులు గుంపులుగా పోలీసులు ధడేల్ మని సభాస్థలిలోకి చొరబడ్డారు. సభికులను వెంటనే అక్కడి నుండి వెళ్లిపొమ్మని హుకూం జారీ చేశారు. ఇది శాంతియుత సభ అని సామ్యూల్ పోలీసులకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుండగానే ఎవరో ఒక బాంబును విసిరారు. బాంబు విసిరిన వాళ్లు పోలీసుల కిరాయి మనుషులని భావించబడుతున్నది. బాంబు పేలుడులో ఒక పోలీసు చనిపోయాడు. అయిదుగురు గాయపడ్డారు. పిచ్చెక్కిన పోలీసులు మార్కెటును నాలుగు వైపులా చుట్టుముట్టి సభికులపైకి విచక్షణా రహితంగా కాల్పులు జరపడం మొదలు పెట్టారు. పారిపోవడానికి ప్రయత్నించిన వాళ్లపైనా తూటాల, లాఠీల వర్షం కురిపించారు. దీంట్లో ఆరుగురు కార్మికులు చనిపోయారు. రెండు వందలకు పైగా గాయపడ్డారు. కార్మికులు తమ నెత్తుటితో ఎరుపెక్కిన గుడ్డను ఎగిరేసి దానిని కార్మికుల జెండాగా మలిచారు.

ఈ సంఘటన తర్వాత పోలీసులు చికాగో వ్యాప్తంగా కార్మికుల బస్తీలపై, కార్మిక సంఘాల కార్యాలయాలపై, ప్రచురణాలయాలపై దాడులు చేశారు. వందలాది నిర్దోషులను కొట్టారు. తీవ్రంగా హింసించారు. వేలాది మందిని అరెస్టు చేశారు. ఎనిమిది మంది కార్మిక నాయకుల – అల్బర్ట్ పార్సన్స్, ఆగస్ట్ స్పాయిస్, జార్జ్ ఏంజెల్, ఎడాల్ఫ్ ఫిషర్, సామ్యూల్ ఫీల్డెన్, మైఖేల్ శ్వాబ్, లుయిస్ లింగ్, ఆస్కర్ నీబె – పై తప్పుడు కేసు బనాయించారు. విచారణ జరిపి వాళ్లను దోషులుగా నిర్ధారించారు. వీళ్లలో కేవలం సామ్యూల్ ఫీల్డెన్ మాత్రమే బాంబు పేలిన సమయంలో ఘటనా స్థలంలో వున్నాడు. విచారణ ప్రారంభమైనపుడు ఏడుగురే బోనులో వున్నారు. నెలన్నర పాటు పరారీలో వున్న అల్బర్ట్ పార్సన్స్ కార్మికుల పక్షాన స్వయంగా కోర్టుకు వచ్చాడు. ‘నేను నిర్దోషులైన నా సహచరులతో పాటు బోనులో నిలబడ్డానికి వచ్చాను’ అని ఆయన జడ్జితో అన్నాడు. 

విచారణ డ్రామా, దౌర్జన్యపు శిక్ష

పెట్టుబడిదారీ సుదీర్ఘ న్యాయ నాటకం తర్వాత 1887 అగస్టు 20న చికాగో కోర్టు ఏడుగురికి మరణశిక్ష విధించింది. ఆస్కర్ నీబెకు మాత్రం 15 సంవత్సరాల కారాగార శిక్షను విధించింది. స్పాయిస్ కోర్టులో గొంతెత్తి ఇలా చెప్పాడు – ‘మమ్మల్ని ఉరి కొయ్యకు వేళ్లాడదీసి కార్మికోద్యమాన్ని, పేదరికం, దయనీయ పరిస్థితుల్లో రెక్కలు ముక్కలు చేసుకొనే లక్షలాది ప్రజల ఉద్యమాన్ని అణచివేయగలనని నువ్వనుకుంటున్నావా? అలా నువ్వనుకుంటున్నయితే సంతోషంగా మమ్మల్ని ఉరితీయి. అయితే గుర్తు పెట్టుకో. నువ్వీరోజు ఒక అగ్ని కణాన్ని నలిపివేస్తున్నావు. కానీ ఇక్కడా, అక్కడా, నీ వెనుకా, నీ ముందూ, అన్ని దిక్కులా అగ్ని జ్వాలలు భగ్గుమంటాయి. ఇది దావానలం. నువ్వు దీన్ని ఎప్పటికీ ఆర్పలేవు.”

అమెరికా యావత్తూ, ఇతర అన్ని దేశాల్లోనూ ఈ క్రూర తీర్పుకు వ్యతిరేకంగా భగ్గుమన్న ప్రజల ఆగ్రహం ఫలితంగా సామ్యూల్  ఫీల్డెన్, మైఖేల్ శ్వాబ్ మరణ శిక్ష ఆజీవన కారావాసంగా మార్చబడింది. 1887, నవంబర్ 10న అందర్లోకి చిన్నవాడయిన లుయిస్ లింగ్ జైలు గదిలో ఆత్మహత్య చేసుకున్నాడు.

1887, నవంబర్ 11 కార్మిక వర్గ చరిత్రలో చీకటి శక్రవారం. పార్సన్స్, స్పాయిస్, ఏంజెల్, ఫిషర్లను షికాగోలోని కుక్ కౌంటీ జైలులో ఉరితీశారు.

నవంబర్ 13న నలుగురు కార్మిక యోధుల శవయాత్ర షికాగో కార్మికుల భారీ ర్యాలీగా మారింది. అయిదు లక్షలకు మించిన జనం ఈ నాయకులకు ఆఖరి వందనం అర్పించడానికి రోడ్లమీదకి ఉవ్వెత్తున ఎగిశారు.

మూడేళ్ల తర్వాత 1889లో కార్మిక ఉద్యమ ఉపాధ్యాయులు  మే 1ని అంతర్జాతీయ కార్మిక దినంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. అప్పటి నుండి యావత్ ప్రపంచ కార్మికులు దీనిని పోరాట సంకేత దినంగా పాటిస్తున్నారు. సమరశీల ఐక్యతను చాటుతూ తమ విముక్తి పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ప్రేరణను పొందుతున్నారు.

అప్పటి నుండీ గడిచిన ఈ 136 ఏండ్లల్లో అసంఖ్యాకమైన పోరాటాల్లో పారిన కోట్లాది కార్మికుల నెత్తురు అంత సులువుగా భూమిలో ఇంకిపోదు. ఉరి కొయ్య నుండి మారుమోగిన స్పాయిస్ గళం పెట్టుబడిదారుల గుండెల్లో భయాన్ని పుట్టిస్తూనే వుంటుంది. అసంఖ్యాక కార్మికుల నెత్తుటి కాంతితో మెరిసే ఎర్ర జెండా ముందుకు నడవడానికి మనకు ప్రేరణనిస్తూనే వుంటుంది.

Leave a Reply