8 మార్చ్, అంతర్జాతీయ శ్రామిక మహిళా దినం. 114 ఏళ్ల క్రితం ప్రపంచ కమ్యూనిస్టు నాయకుల చొరవ, కృషితో ప్రారంభమైన ఈ దినం ప్రపంచ వ్యాప్తంగా పీడిత వర్గాల మహిళలందరూ జరుపుకుంటున్నారు. వారందరికి అభినందనలు. వాస్తవంగా శ్రామిక మహిళలను మించి సంపన్న కుటుంబాల మహిళలు, కమ్యూనిస్టులను మించి బూర్జువా పార్టీలు ఈ దినాన్ని మరీ అట్టహసంగా జరుపుకోవడం యేటేటా పెరుగుతోంది. ఇందులో గత కొద్ది సంవత్సరాలుగా హిందుత్వ శక్తులు ముందు పీఠిన నిలుస్తున్నాయనడం అతిశయోక్తి కాదేమో! అధికారం రుచి మరిగిన హిందుత్వ శక్తులు, వారి తిరుగులేని నాయకుడు మోదీ తన అధికారాన్ని నిలుపుకోవడానికి దేనికైనా సిద్ధపడుతాడని, ఎంతకైనా తలపడుతాడని చూస్తున్నాం. వర్ణ, కుల వ్యవస్థలను సమర్థించే వారు దానిని చీల్చి చెండాడిన డాక్టర్ అంబేడ్కర్‌ను తమ అవసరం రీత్యా ఎంతగా ఎత్తిపడుతున్నారో చూస్తున్నాం. మహిళలను రాజకీయాలకు, పురుషులతో సమానంగా గుర్తించడానికి, గౌరవించడానికి ససేమిరా సిద్ధపడని తమ భావజాలన్ని మరుగున పెడుతూ మహిళా దినాన్ని పాటించడమే కాదు, అనునిత్యం అవమానించిన సావిత్రీబాయి పూలేను స్మరించడం, ఆరాధించడం కపట బ్రాహ్మణవాదానికి, దాని అధికారలాలసతకు నిదర్శనం.
మన దేశంలోని ఎన్నికల రాజకీయ పార్టీలన్నీ మహిళలను ఓటు బ్యాంకు రాజకీయాలతో లోబరుచుకోడానికి చాలా చలాకీగా వ్యవహరిస్తున్నాయి. వారి ఓట్ల కోసం అనేక తాయిలాలు ప్రకటించడం అన్ని పార్టీల ఎన్నికల ప్రణాళికలలో అగుపడుతాయి. 18వ లోక్ సభ ఎన్నికలకు యేడాది ముందు ఏకంగా మోదీ ప్రభుత్వం ‘నారీ శక్తి వందన అంటూ మహిళలకు చట్టసభలలో 33 శాతం రిజర్వేషన్ హక్కును కల్పించింది. అదీ, ప్రత్యేక పార్లమెంట్ సభల ద్వారా! ఈ అవకాశం తనకు అది దైవమిచ్చిన భాగ్యం అనేంత వరకు మోదీ వెళ్లడం తెలిసిందే. నిజానికి ఆ పార్టీ గత మూడు దశాబ్దాలుగా ఆ బిల్లును అనేక సాకులతో అడ్డుకుంటూ వచ్చింది. కానీ, ఈసారి అదే లోకసభలో తనకున్న మెజార్టీతో చట్టం చేయపూనుకోడానికి కారణం.. తన గెలుపుపై తనకే నమ్మకం లేకుండా పోవడమనేది స్పష్టం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తమ ప్రభుత్వం ఏర్పాటు అయితే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం సహ చేసిన ఇతర వాగ్దానాలు అందరికి తెలిసినవే.
మోదీ ప్రభుత్వం చేసిన చట్టాన్ని ఉద్దేశపూరితంగానే తక్షణం అమలులోకి తేలేదు. రేవంత్ రెడ్డి సర్కార్ చేసిన విధానాలను అమలు చేయడం వల్ల ఆ భారం ప్రజల మీద, పరోక్షంగా ఆ మహిళల కుటుంబాల మీదే పడుతుంది తప్ప కాంగ్రెస్ నాయకులకు వచ్చే వ్యక్తిగత నష్టమేమీ లేదు. పైగా మహిళలలో తమ పార్టీ ప్రతిష్ట, గుర్తింపు పెరుగుతుంది. వీటి మాట ఎలా వున్నా, ఇప్పటికే పంచాయతీలలో రెండు దశాబ్దాలకు పైగా మహిళలకు 50 శాతం రిజర్వేషన్ అమలవుతున్న విషయం చూస్తున్నాం. అయితే, ఎంత మంది మహిళలు పురుషాధిక్యతను ఎదుర్కొంటూ నిజమైన పంచాయతీ ప్రతినిధులుగా తమ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారనేది కూడా పరిశీలించుకోవాలి. ఎందుకంటే, వీటిని ‘‘విమెన్ ఎంపవర్ మెంట్’’ (మహిళా సాధికారిత) అనే పేరుతోనే ముందుకు తెస్తూ పాలకులు వారిని ఉబ్బుతబ్బిబ్బు చేస్తున్నారు. కాబట్టి స్త్రీలు నిత్య జీవితంలో తమ హక్కులను ఏమేరకు అనుభవిస్తున్నదీ మార్చ్ 8 సందర్భంగా సమీక్షించుకోవాలి. అప్పుడే మహిళా సాధికారిత ఆచరణలో ఏమేరకు అమలవుతున్నదీ అర్థం చేసుకోగలరు. కొన్ని రాష్ట్రాలలో పురుషులతో పాటు మహిళలకు భూములపై పట్టాలు ఇచ్చారు. కానీ, ఆచరణలో ఎంత మంది మహిళలు తమ పట్టా హక్కును సద్వినియోగం చేసుకున్నారనేది ప్రశ్నార్థకమే!
మన దేశంలో పాలకుల వైఖరి చూస్తుంటే, చాలా పరస్పర విరుద్ధంగా వుంటుంది. కర్ణాటకలో హిజాబ్‌ను వ్యతిరేకిస్తూ మహిళలను, వారి మత సంప్రదాయాలను అవమానించిన తీరు చూశాం. చదువుకునే అమ్మాయిలను వేధించిన, హింసించిన వైనం చూశాం. ఢల్లీిలో తమపై లైంగిక అత్యాచారాలకు పాల్పడుతున్నాడంటూ రెజ్లర్స్ రోజుల తరబడి ధర్నా చేస్తే అంతిమంగా చతురోపాయాలతో దుష్ట హిందుత్వ పాలకులు వారి నోళ్లు మూయించిన చందం తెలిసిందే. ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలు.
మన దేశంలో అన్ని రకాల అవకాశాలు వుండి, ప్రోత్సాహం వున్న ముఖ్యంగా సంపన్న కుటుంబాల మహిళలు వివిధ రంగాలలో అరుదైన విజయాలు సాధిస్తున్నారు. వారు ప్రశంసనీయులే! అయితే, చాలా వరకు వారు తమ విజయాల వెనుక తమ పాత్ర కన్నా పురుషుల పాత్రనే ప్రధానం చేసి చూడడం వారిలో నరనరాన జీర్ణించుకుపోయిన పితృస్వామ్య వ్యవస్థ భావజాల ఫలితమనే విషయాన్ని అర్ధం చేసుకోవాలి. వారిని ముందు పెట్టి రాజకీయ నాయకులు, పాలకులు యావత్తు మహిళా రంగాన్ని భ్రమలలో ముంచుతున్నారు. మరోవైపు దేశానికి ఒక మహిళ ప్రధానమంత్రి అయితేనో, లేద రాష్ట్రపతి అయితేనో మహిళలందరూ పితృస్వామ్య సంకెళ్ల నుండి విముక్తి అయినంతగా పాలకులు మురిపింపచేయడం వారి వంచనా శిల్పానికి పరాకాష్ట.
ఈ పితృస్వామ్య వ్యవస్థలో అన్ని సౌకర్యాలు వుండి, అవకాశాలు వుండి పురుషాధిపత్యాన్ని వినయంగా ఆమోదిస్తూ, ఆ లక్ష్మణ రేఖకు లోబడి ముందుకు వెళ్తున్న ఒక చిన్న సెక్షన్ సంపన్న కుటుంబాల మహిళలు మినహా కోటానుకోట్ల శ్రామిక మహిళలకు నిజమైన సాధికారత ఎలా సాధ్యం? అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలుసుకోవాలి. మహిళలు ముందుగా తమ అన్ని రకాల సమస్యలపై మహిళా విముక్తి లక్ష్యంతో సంఘటితం కావాలి. వారు తమ హక్కుల కోసం అన్ని రకాల సామాజిక సమస్యలలో రాజకీయంగా భాగం కావాలి. వారు సమరశీల పోరాటాలలో పురుషులతో సమంగా, అవసరమైన చోట ముందుపీఠిన నిలవాలి. ఈ అనుభవాలు మనకు ఈనాడు మధ్య భారతంలో జరుగుతున్న ఆదివాసీ పోరాటాలలో సుస్పష్టంగా కానవస్తాయి.
మధ్యభారతంలోని మూలవాసీ మహిళలు అడవులపై తమ న్యాయమైన హక్కుల కోసం వివిధ పోరాట సంఘాలలో సంఘటితమై దృఢంగా పోరాడుతున్నారు. జల్, జంగల్, జమీన్‌పై అధికారం అంటూ రణనినాదం చేస్తున్నారు. అడవుల కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా వారు ఉద్యమిస్తున్నారు. హస్‌దేవ్ అడువులలో అదానీని అడుగు పెట్టనివ్వమని చెట్లను చుట్టేసుకుంటున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ అడవులలో మహిళలు టాటాకు, ఎస్సార్‌కు, జిందల్‌కు, నికోకు స్థానం లేదంటూ అడ్డుకుంటున్నారు. మహారాష్ట్రలోని గడ్‌చిరోలీలో లాయిడ్‌కు చోటు లేదంటూ ప్రకటిస్తున్నారు. రూర్జండ్, ఒడిశా, మధ్యప్రదేశ్‌లలో ఎక్కడికక్కడే మహిళలు తమ అడవుల కోసం, ఆత్మ గౌరవం కోసం, అధికారం కోసం పోరాడుతున్నారు. అనేక పోరాటాలలో వారు పురుషుల కన్నా ఒక అడుగు ముందుంటున్నారు. ఆదివాసీ పురుషులు పోరు మహిళలను గౌరవిస్తున్నారు. వారు పాలకులు ఇచ్చే హక్కుల కోసమో, రూపొందించే పనికిమాలిన చట్టాల కోసమో, ముష్టి సంస్కరణల కోసమో అంగలార్చడం లేదు. వారు పోరాటాల ద్వారా తమ సాధికారతను కోరుకుంటున్నారు. సాధిస్తున్నారు. అదే సరైన మార్గమని పీడిత, తాడిత, వంచిత, శోషిత మహిళలు తెలుసుకోవలసిన అవసరం వుంది.
మధ్య భారతంలో, తూర్పు, ఈశాన్య భారతాలలో తమ హక్కుల కోసం పోరాడుతున్న మహిళలను పాలక వర్గాల భద్రతా దళాలు ఉపేక్షించడం లేదు. మన దేశంలోని అడవులను ఖాకీ వనాలుగా మారుస్తున్న పాలకుల భద్రతా బలగాలు మహిళలతో అమానవీయంగా వ్యవహరిస్తున్నాయి. మణిపుర్‌లో ఉగ్ర హిందుత్వ శక్తులు ఖాకీ బలగాల సమక్షంలో, వారి సమర్థనలో ఆదివాసీ మహిళలను నగ్నంగా ఊరేగించడం చూశాం. ఇపుడు బస్తర్ అడవులలో ఆపరేషన్ ‘కగార్’ పేరుతో పాశవిక సైనిక కేంపెయిన్ నడుస్తున్నది. భారత సైనిక జవాన్‌లు, వాయు సైనికులు, డ్రోన్‌లు, యుద్ధ టాంకులు, వైమానిక దాడులతో ఆ ప్రాంతమంతా శతృ భూభాగంగా మారి దద్దరిల్లుతోంది. అక్కడి ప్రజలను అంతమొందించి అక్కడి వనరులను స్వాధీనం చేసుకోవ డానికి కార్పొరేట్లు కుట్రలు పన్నుతున్నాయి. వారి భద్రతా బలగాలు సైనిక దాడులను తీవ్రం చేస్తున్నాయి.
జనవరి 1న ముద్దుం అనే చిన్న ఆదివాసీ గూడెంలో ‘మంగ్లీ’ అనే 6 మాసాల పాలుతాగే పసిగుడ్డును నిర్దాక్షిణ్యంగా పోలీసులు కావాలనే కాల్చి చంపారు. ఆదివాసీ మహిళలను పోరాటాల నుండి భయపెట్టి దూరం చేయడానికే ఇలా చేశారు. ‘మంగ్లీ’ నెత్తుటి జ్ఞాపకాల తడి ఆరకముందే ఆ హత్యకు వ్యతిరేకంగా గోర్నం అనే గ్రామంలో జరుగుతున్న ప్రజాధర్నాకు పక్కనే వున్న గొట్టోడు అనే మరో పది ఇండ్లున్న ఊరి నుండి వెళ్తున్న సోనీ, నాగీ అనే మహిళలతో పాటు కోసా అనే పురుషున్ని పోలీసులు కాల్చి చంపారు. ఈ కాలంలో మరో డజన్‌కు పైగా పురుషులను పోలీసులు హత్య చేశారు. పోలీసులు ఎవరిని కాల్చి చంపుతున్నప్పటికీ, వారి హత్యలకు సాధికారత కోసం ఎదురుకాల్పులలో మావోయిస్టులు మరణం అని ప్రకటిస్తున్నారు. బస్తర్ అడవులలో ప్రజాయుద్ధం దోపిడీకి వ్యతిరేకంగా, అవమానాలకు, హత్యలకు, అత్యాచారాలకు వ్యతిరేకంగా నిజమైన విమన్ ఎంపవర్మెంట్ కోసం జరుగుతోంది. ఆ అడవులలో ఆదివాసీలు తమదైన జనతన సర్కార్లను నడుపుకుంటున్నారు. ఆ ప్రభుత్వాలలో మహిళలు సమాన భాగస్తులు. ఆ భాగస్వామ్యం పోరాడి గెలుచుకుంది. త్యాగాలతో సాధించుకున్నది.
‘‘ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న్ యోజనా’’ ద్వారా తలసరి నెలకు 5 కిలోల చొప్పున బియ్యం లేదా గోధుమలు పొందుతున్న ఈ దేశంలో మహిళా సాధికారిత అసంభవం. ప్రభుత్వం విదిలించే సంస్కరణలతో చాలీ చాలని జీవితాలు గడపక తప్పని దేశంలో ఎంపవర్‌మెంట్ అనేది ఒక మోసకారి మంత్రం. డ్వాక్రాలతో, చిన్న పొదుపు మొత్తాలతో, వడ్డీ లేని రుణాలతో మహిళల ఎంపవర్ మెంట్ పచ్చి మోసం. పొట్టకూటి కోసం మోదీ గ్యారంటీ, వంట పొయ్యి కోసం ఉజ్వల అంటూ మోదీ గ్యారంటీ, నిలువ నీడ కోసం మోదీ గ్యారంటీ, మల విసర్జన కోసం మోదీ గ్యారంటీ అంటూ హోరెత్తిస్తున్న ఈ దేశంలో, ప్రజలకు తమ శ్రమశక్తిపై స్వతంత్రంగా, తల ఎత్తుకొని గర్వించే విధంగా సంపాదించుకునే మార్గాలు కల్పించలేని ప్రభుత్వాలు, ఉద్యోగాలు చూపలేని ఉపాధి రహిత జీడీపీ వృద్ధి, పరాధీన బతుకులతో ప్రజలుండగా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పందేరంలో అగ్రస్థానానికి పాలకులు పరుగు నేటి వాస్తవం. ఇలాంటి చోట విమన్ ఎంపవర్మెంట్ కోసం ఎవరిని దేబరించాలి? పురుషాధిక్య సమాజంలో మహిళ సమాన హోదా కోసం ఏ చట్టాలను ఆశ్రయించాలి? సంస్కరణలతో, చట్టాలతో మహిళల ఎంపవర్మెంట్, మహిళా విముక్తి అనూహ్యం. బ్రాహ్మణియ హిందుత్వ పాలకులు 8 మార్చ్ జరిపినా, సావిత్రీబాయి పూలేకు నీరాజనాలు పలికినా అది పీడితులను వంచించడానికేనన్న వాస్తవాన్ని ఈ సందర్భంగా గుర్తించాలి. మహిళా విముక్తి కోసం భారత సైన్యాలను సైతం ఎదిరిస్తూ, యుద్ధ టాంకులతో సవాలు చేస్తూ అన్నిటికి తెగించి కార్పొరేట్ వర్గాలతో, వారి పాశవిక బలగాలతో జీవన్మరణ పోరాటం సాగిస్తున్న ఆదివాసీ, పీడిత మహిళలకు అండగా నిలుస్తూ, ఆ పోరాటాల బాటలో పోరాడకుండా మహిళా విముక్తి, మహిళా సాధికారత కల్ల.
గ్రామసభ, గడ్‌చిరోలీ