… కానీ మనకు ఆ సంగతి తెలియదు. యుద్ధం జరుగుతూనే ఉన్నది. సరిగ్గా ఫాసిస్టు కాలంలో జరుగుతున్న యుద్ధం ఇది. జర్మనీలో గ్యాస్ ఛాంబర్స్ గురించి విన్నాం. ఇటలీలో బ్లాక్ షర్ట్స్ గురించి విన్నాం. జనంలోంచే ఉన్మాద మూకను కూడగట్టి సమాజం మీదికి ఎగదోసిన చరిత్ర చూశాం. ఇక్కడ జనం మీదికి సైన్యాన్ని ఉసిగొల్పి, వైమానిక దాడులు చేస్తున్న ఫాసిస్టు యుద్ధం మధ్యలో మనం జీవిస్తున్నాం.
జనవరి 11న తెల్లవారుజామున దండకారణ్యంలోని దక్షిణ బస్తర్ పామేడ్`కిష్టారం ప్రాంతంలో భారత ప్రభుత్వం హెలికాప్టర్‌తో బాంబు దాడులు చేసింది. దేశాల మధ్య సరిహద్దు యుద్ధాల్లో వాడే ఇండియన్ ఎయిర్ లైన్స్ చాపర్‌ను కేంద్ర ప్రభుత్వం ఈసారి వాడిరది. ఇందులో కోబ్రా కమాండోస్, సిఆర్పిఎఫ్ సైనికులు వెళ్లినట్లు బస్తర్ ఐజీ స్వయంగా ప్రకటించాడు.
ఘనత వహించిన భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి మాత్రమే సాధ్యమయ్యే యుద్ధం ఇది. జనవరి 7న రాయ్‌పూర్‌లో కేంద్రం హోంమంత్రి అమిత్‌షా మాట్లాడుతూ 2024 జనరల్ ఎన్నికల్లోగా మావోయిస్టు ఉద్యమాన్ని నిర్మూలిస్తామని ప్రకటించాడు. ఆ తర్వాత నాలుగు రోజులకే ఈ దాడి జరిగింది. ఇంత వరకు మానవ రహిత డ్రోన్లు వాయుమార్గంలో వెళ్లి బాంబులు వేసి వచ్చేవి. ఇలాంటి దాడులు మొదలై చాలా కాలం అయింది. 2022 ఏప్రిల్‌లో పెద్ద సంఖ్యలో డ్రోన్లతో బాంబులు వేశారు. ఈసారి డ్రోన్లతోపాటు హెలికాప్టర్లలో సైనికులు వెళ్లి బాంబులు వేశారు.
సరిగ్గా ముప్పై ఏళ్ల వెనక్కి 1991, 92లోకి వెళ్లండి. సరిహద్దుల్లో ఉండాల్సిన సైనిక బలగాలు ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించాయని గుర్తుకొస్తుంది. అప్పుడు సరిహద్దులు మారినా కాల్బలాన్నే ప్రజల మీదికి ఉసిగొలిపారు. ఇప్పుడు ఏ హద్దులూ, సరిహద్దులూ లేని వాయుమార్గంలో యుద్ధం జరుగుతోంది. ఈ యుప్పై ఏళ్లలో భారత ఆర్థిక వ్యవస్థలో చాలా మార్పులు వచ్చాయి. భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యం నిస్సిగ్గుగా బట్టలు విప్పుకొని తిరగడం మొదలుపెట్టింది. అదే సమయంలో ఎన్నికల మార్గంలోనే స్వర్గం చేరుకోవాలనే వాదనలూ పెరిగాయి. భారత ప్రభుత్వం ఇరవై ఏళ్లుగా మావోయిస్టు ఉద్యమాన్ని నిర్మూలించడమే లక్ష్యమని చెప్పుకుంటోంది. మావోయిస్టు రహిత భారత్‌ను స్థాపించడమే కర్తవ్యమని పదే పదే ప్రకటించుకుంటోంది. దీని కోసం పది లక్షల సైన్యం సరిపోక, నేల మీది యుద్ధంలో విజయాలు సాధించలేక వైమానిక యుద్ధానికి తెగబడింది.
ఈ యుద్ధం దేని కోసం? ఈ యుద్ధోన్మాద సారాంశం ఏమిటి?
‘యుద్ధం అంటే రాజకీయాల కొనసాగింపు’ అనే సుప్రసిద్ధ లెనినిస్టు సూత్రీకరణను గుర్తు చేసుకుందాం. ఈ మాటను మరింత బాగా ‘యుద్ధం అంటే రాజకీయార్థికాల కొనసాగింపు’ అని కూడా చెప్పుకోవచ్చు. అన్ని యుద్ధాల సారం ఇదే. దండకారణ్య ప్రాంతంలో ఎన్నో యుద్ధాలు జరిగినట్లు పౌరాణిక కథనాల్లో చదువుకుంటాం. మూలవాసుల భూమిని విశ్వామిత్రుడు వంటి బ్రాహ్మణులకు కట్టబెట్టడానికి ఆ రోజు జరిగిన యుద్ధం రాజకీయార్థికాల కొనసాగింపే. రాజ్యధర్మంగా మారిన బ్రాహ్మణ ధర్మం రాముడికి ఏక పక్ష యుద్ధం చేయగల అధికారం ఇచ్చింది.
సరిగ్గా రాముడి వారసులు ఇవాళ ఆదానీ వంటి కార్పొరేట్లకు దండకారణ్యంలోని సహజ సంపదనకు అప్పగించడమనే రాజకీయార్థిక వ్యూహంలో భాగంగా వైమానిక యుద్ధం చేస్తున్నారు. అప్పుడూ ఇప్పుడూ బ్రాహ్మణ ధర్మం ఉన్నదే. అదనంగా ఆధునిక భారతదేశంలో రాజ్యాంగం ఇచ్చిన అధికారం ఉన్నది. రాజ్యాంగ నైతికత పేరుతో బుద్ధిమంతులు, పెద్ద మనుషులు, ఉదారవాదులు అల్లిన రక్షణ వలయమూ ఉన్నది. కాబట్టే మావోయిస్టులను నిర్మూలిస్తాం.. అని పాలకులు చంపుడు పందెం పెడుతున్నారు. అందులో పదే పదే భంగపడుతున్నా నిర్మూలనా ప్రకటన చేయగల అధికారాన్నయితే రాజ్యాంగం వాళ్లకు ఇచ్చింది.
దేశ ప్రజలను నిర్మూలిస్తానని, ఒక రాజకీయ తాత్విక విశ్వాసం ఉన్న వాళ్లను చంపేస్తానని ప్రకటించే హక్కు నీకెవరిచ్చారని ప్రభుత్వాన్ని కట్టడి చేసే శక్తి రాజ్యాంగానికి లేనే లేదు. మానవ హక్కుల విమర్శకు కూడా ఓ పక్క కాస్తంత చోటు ఇస్తూనే ఈ యుద్ధానికి మార్గదర్శకత్వం వహించగల టిపికల్ స్వభావం భారత రాజ్యాంగానికి ఉన్నది. అందుకే రాజ్యాంగాన్ని అవతల పెట్టి అమిత్‌షా ఈ యుద్ధం చేస్తున్నాడని అనకుందామా? లేక రాజ్యాంగ సమ్మతితోనే ఈ దారుణానికి ఒడిగుడుతున్నాడనుకుందామా?
ఈ యుద్ధంలో పాలకులు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారని తటస్థులను గెలుచుకోడానికి వాదిద్దాం. దాని ప్రయోజనం దానికి ఉంటుంది. ఇంతకూ ‘చట్టబద్ధపాలన’ అనేది ఏ అవకాశం ఇవ్వకుండానే పాలకులు ప్రజలపై యుద్ధానికి దిగారా?
యుద్ధంలో సత్యాలు మరుగున పడతాయని అంటారు. అది నిజం కాదు. మనల్ని అతలాకుతలం చేసే ప్రశ్నలు యుద్ధకాలంలోనే ఎదురెక్కి వస్తాయి. భారత రాజ్యం చేస్తున్న ఈ యుద్ధం దాచేస్తే దాగని సత్యాలను వెలికి తీస్తోంది. మనం ఈ యుద్ధాన్ని ఆపగలమా? లేదా? అనేది చాలా పెద్ద విషయం. కనీసం ఈ యుద్ధంలోంచి పుట్టుకొస్తున్న ప్రశ్నలనైనా స్వీకరించగలమా?
ఆ ప్రశ్నలను తొలుచుకుంటూ వెళదాం. యుద్ధం గురించి కాకపోయినా మనం విశ్వసిస్తున్న ప్రజాస్వామ్యం గురించి అయినా స్పష్టత వస్తుంది. దండకారణ్యంలోనూ, దేశవ్యాప్తంగానూ జరుగుతున్న సైనికీకరణ వెనుక మనం భ్రమపడుతున్నట్లు ప్రజాస్వామ్యం లేదని, కార్పొరేట్‌స్వామ్యం ఉన్నదని తెలుస్తుంది. పాలకులకు ప్రజాస్వామ్యంపట్ల ఎలాంటి భ్రమలూ లేవు. కార్పొరేట్స్వామ్యానికి తాము రాజకీయ ప్రతినిధులమని నిస్సిగ్గుగా చెప్పుకోడానికి మోమాటపడటం లేదు.
ఈ సత్యం నగ్నంగా బైటపడ్డాక కలిగే దిగ్భ్రమ నుంచి తేరుకున్నాకయినా కాస్త ఓపికగా మనం ఈ యుద్ధం గురించి తెలుసుకోవచ్చు. రాజ్యం తన దేశంలోని ప్రజల మీదే గగనతల యుద్ధం చేయడం మనల్ని కొంచెమైనా డిస్ట్రబ్ చేయాలి. కనీసం విస్తుపోయేలా చేయాలి. ఇది నిజమేనా? అనే సందేహమైనా కలగాలి. మన దేశంలో మన కళ్లెదుటే ఇది జరుగుతున్నదా? అనే సందిగ్థతకైనా లోను కావాలి. ఇదేమైనా అభూత కల్పనా సాహిత్యంలోని అసంబద్ధ సన్నివేశమా? అనిపించాలి.
భారత ప్రజలు తమ సర్వసత్తాక సార్వభౌమాధికారాన్ని నెరపుతున్న భూభాగంపై భారత రాజ్యమే ఏ అర్ధరాత్రో, వేకువజామునో తన ఆయుధాగారంలోని హెలికాప్టర్లతో, బాంబులతో యుద్ధానికి దిగడం ఏమిటనే ప్రశ్న కొన్ని నిమిషాలైనా మనల్ని కుదిపివేయాలి కదా. ప్రజా ప్రాతినిధ్య పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలోని ఈ యుద్ధ భీభత్సం కలిచి వేయాలి కదా.
పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలోని గుణగణాలను లెక్కించడానికి మేధో కసరత్తు ఎంతయినా చేద్దాం. కానీ మౌలికంగా అది ప్రజలకూ, కార్పొరేట్ పెట్టుబడిదారులకు మధ్య యుద్ధ వైరుధ్యం ఉన్నదని రుజువు చేస్తున్నది. ఈ దేశ ప్రజలను, ముఖ్యంగా ఆదివాసులను చంపేసైనా సరే మాకు అక్కడి సంపదను ఇచ్చెయ్యమని కార్పొరేట్ సంస్థలు ప్రభుత్వాన్ని ఆదేశిస్తున్నాయి. అందుకే ఇది కార్పొరేట్ యుద్ధం. ఆదానీ కోసం జరుగుతున్న యుద్ధం. రాజ్యాంగ నిబంధనల మేరకు మైనింగ్‌కు అనుమతి లేని హస్దేవ్ అటవీ ప్రాంతంలో బొగ్గు తొవ్వుకొనిపోవడానికి బీజేపీ ప్రభుత్వం ఆదాని తదితర కార్పొరేట్లకు అనుమతి ఇచ్చాడు. ఈ నిర్ణయాన్ని ఆదివాసులు ఏడాదిగా ప్రతిఘటిస్తున్నారు. వాళ్లు సైనికీకరణకు, కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా సాహసిక పోరాటం చేస్తున్నారు. ఇది కేవలం తమ జీవన్మరణ సమస్య మాత్రమే కాదనే సందేశం వాళ్లు ఇస్తున్నారు. దేశ ప్రజలందరి ఉనికిని నిర్ణయించే పర్యావరణ పరిరక్షణ కోసం కూడా ఈ పోరాటం చేస్తున్నామని అన్నారు.
ఇది తాజా ఉదాహరణ. మధ్యభారతదేశంలో లెక్కకు లొంగని సహజ సంపదను కార్పొరేట్ల పరం కాకుండా దశాబ్దాల తరబడి ఉద్యమాలు జరుగుతున్నాయి. కేవలం అది కార్పొరేట్ల వ్యతిరేక పోరాటమే కాదు. భారత ప్రజలు నిర్మించుకోవాల్సిన నూతన జగత్తుకు అవసరమైన శాస్త్రీయ వర్గపోరాట ఆచరణ అక్కడ కొనసాగుతున్నది. అమానవీయ దోపిడీ రాజకీయార్థిక వ్యవస్థకు ప్రత్యామ్నాయ నిర్మాణ ప్రయత్నం జరుగుతున్నది. సాంఘిక సాంస్కృతిక బంధనాల నుంచి మానవాళికి విముక్తి సాధ్యమే అనే నిరూపణ జరుగుతున్నది. సారాంశంలో కార్పొరేట్ల దోపిడీకి, ప్రజల స్వావలంబనకు తీవ్రమైన ఘర్షణ సాగుతున్నది. నియంతృత్వంగా మారిన బూర్జువా రాజకీయాలకు, వాటికి ప్రత్యామ్నాయంగా విప్లవ ప్రజాస్వామ్యానికి మధ్య రాపిడిలో ఈ యుద్ధం తీవ్రమైంది.
కార్పొరేటీకరణపై జరుగుతున్న ఈ పోరాటాల్లో హిందుత్వ ఫాసిస్టు వ్యతిరేక స్వభావం ఉన్నదా? ఇది కేవలం ఆడవుల్లో ఉండే జనాల జీవన్మరణ పోరాటమేనా? దీనికీ.. భారత సమాజం ఎదుర్కొంటున్న ఫాసిస్టు రాజకీయార్థిక, సాంస్కృతిక సంక్షోభాలకు సంబంధం ఏమైనా ఉన్నదా? మొత్తంగా కార్పొరేటీకరణ వ్యతిరేక పోరాటాలను ధ్వంసం చేయడానికి నేల మీద లక్షలాది సైన్యంతో, ఆకాశంలో డ్రోన్లతో, హెలికాప్టర్లతో భారత రాజ్యం చేస్తున్న యుద్ధం ఫాసిస్టు సందర్భంలో భాగమేనా? లేక ఫాసిజంతో ఏ సంబంధం లేని వేరే దీవుల్లో, వేరే భూ ఖండాల్లో ఈ కార్పొరేట్ వ్యతిరేక పోరాటాలు జరుగుతున్నాయా?
ఇన్ని ప్రశ్నలు మనకే. అవతలివాళ్లకే సందేహాలు లేవు. చాలా స్పష్టంగా ఫాసిస్టు వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. 2024 ఎన్నికల్లోగా మావోయిస్టు ఉద్యమాన్ని నిర్మూలిస్తామనే అమిత్‌షా ప్రకటనలో తెంపరితనం కూడా ఉండవచ్చు. కానీ ఆయన కార్పొరేట్ రాజకీయాలకు అవసరమైన వ్యూహాత్మక ప్రకటన చేశాడు. హిందుత్వ ఫాసిస్టు రాజకీయార్థిక సాంస్కృతిక భావాల ఎత్తుగడల్లో భాగంగానే 2024 ఎన్నికలను తీసుకున్నాడు. రాబోయే ఎన్నికలు ఏ రకంగా చూసుకున్నా హిందుత్వ ఫాసిస్టులకు చాలా కీలకమైనవి. గత ఎనిమిదేళ్లుగా విప్లవోద్యమం మీద చేస్తున్న యుద్ధాన్ని తీవ్రం చేయవలసిన అవసరం ఆయనకు బాగా తెలుసు. మావోయిస్టు ఉద్యమం ఉండగా కార్పొరేట్ ప్రయోజనాలను పూర్తిస్థాయిలో తీర్చలేమని బీజేపీ అధినాయకత్వానికి తెలుసు. తమ రాజధర్మాన్ని నెరవేర్చాలంటే ముందు మావోయిస్టు ఉద్యమాన్ని నిర్మూలించాలనే ముందుచూపు ఫాసిస్టులకు 2014లోనే ఉన్నది. ఆ మాటకొస్తే 2004లో అధికారం చేపట్టిన యూపీఏ ప్రభుత్వానికే ఈ స్పష్టత ఉన్నది. మన్మోహన్సింగ్ ప్రభుత్వం ఈ పని ‘సమర్థవంతం’గా చేయడం లేదనే అనుమానంతోనే కార్పొరేట్లు హిందూ ఫాసిస్టు భావజాల పునాది ఉన్న బీజేపీని అధికారంలోకి తెచ్చుకున్నాయి.
అప్పటి నుంచే దేశంలో ఫాసిజం వచ్చేసిందనే ఉదారవాద మేధావులు హిందుత్వ ఫాసిజానికి ఉన్న కార్పొరేట్ ఫాసిజం అనే రెండో ముఖాన్ని చూడలేకపోతున్నారు. అందుకే జనవరి 11న జరిగిన వైమానిక దాడి మీద మౌనంగా ఉన్నారు. ఇది ప్రభుత్వానికి, మావోయిస్టులకు మధ్య ఎప్పటి నుంచో ఉన్న సాయుధ ఘర్షణ అని సరిపెట్టుకుంటున్నారు. ఫాసిస్టు ప్రమాదం గురించి మధన పడుతున్న ప్రగతిశీల శక్తులు కూడా ఈ ఘటనను ఫాసిస్టు యుద్ధంగా గుర్తించే స్థితిలో లేరు. దేనికంటే వాళ్ల లెక్క ప్రకారం ఇందులో భావజాల విషయం లేదు. సాంస్కృతిక కోణం లేదు. బాధితులు దళితులో, ముస్లింలో, మహిళలో కాదు. చట్టబద్ధపాలనకు ఈ చర్య వల్లే కొత్తగా వచ్చిన విపత్తు ఏమీ లేదు. కాబట్టి ఇది ఫాసిజం పరిధిలోకి రాదు. ఇది కేవలం సాయుధ సంఘర్షణ. బూర్జువా రాజ్య లక్షణం. ఇది మొదటి నుంచీ ఉన్నదే! ఫాసిజం గురించిన ఇలాంటి వైఖరి ఉండటం కూడా ఇండియన్ ఫాసిజంలోని ప్రత్యేకతే. ఈ వైఖరి దాని పర్యవసానమే.
రాజ్యాంగ వ్యవస్థలన్నిటినీ ఫాసిస్టులు భ్రస్టు పట్టిస్తున్న తరుణంలో భారత సైనిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను కార్పొరేటీకరించడానికి అడ్డంగా ఉన్న విప్లవశక్తులను నిర్మూలించడానికి ఏకైక పరిష్కారంగా దేశాన్ని సైనికీకరిస్తున్నారు. హిందుత్వ భావజాల, సాంస్కృతిక నియంతృత్వం, కార్పొరేటీకరణ, సైనికీకరణ అనే త్రిముఖ వ్యూహంతో భారత ఫాసిజం పని చేస్తున్నది.
ఇంత విస్తారమైన, అమానుషమైన, యుద్ధ స్వభావం ఉన్న ఫాసిజం సమగ్ర రూపాన్ని ఇప్పటికీ చూడలేకపోవడం భారత ఫాసిస్టు సందర్భంలోని ప్రత్యేకత. భిన్న తలాల్లో ఫాసిజం పని తీరు, హిందుత్వ భావజాలంతో సహా దాని కార్పొరేట్ దోపిడీ పునాది తెలియలేదంటే ఫాసిజం గురించి ఏమీ తెలియనట్లే. భారతదేశంలో ఫాసిజాన్ని సంకుచిత అర్థంలో విశ్లేషించడానికి లేదు. ఈ యుద్ధకాలపు వాస్తవం ఏమిటో గుర్తించకుండా, చెప్పవలసిన మాట చెప్పకుండా దాటేయడానికి లేదు. అదే జరిగితే ఓడిపోయే పోరాటం చేయడానికి సిద్ధమవుతున్నట్లే.
మావోయిస్టు సేనాని హిడ్మా లక్ష్యంగా ప్రజలపై చేసిన వైమానిక దాడులు యుద్ధనేరం కిందికి వస్తుంది. ఒక ప్రభుత్వం తన దేశ ప్రజలపై గగనతల దాడులకు సాయుధ దళాలను, యుద్ధ విమానాలను వాడటం అంతర్జాతీయ నిబంధనలకు విరుద్ధం. గత కొద్ది కాలంగా దండకారణ్యంలో వైమానిక దాడులకు అమెరికా ఇంటలిజెన్స్ నేతృత్వం ఉన్నట్లు తెలుస్తోంది. సామ్రాజ్యవాద అనుకూల ఆర్థిక విధానాలకు అలవాటుపడిన భారత పాలకవర్గం సామ్రాజ్యవాద వెన్నుదన్నుతో ఈ యుద్ధానికి తెగబడిరది. జనవరి 11 ఘటనతో భారత ప్రభుత్వం ప్రజలపై యుద్ధాన్ని కొత్త దశలోకి తీసికెళ్లింది. లౌకిక ప్రజాస్వామిక శక్తులపై, ఈ దేశ ప్రజలు తరతరాలుగా నెలకొల్పుకున్న మానవీయ జీవన సంస్కృతులపై, సహజీవన రీతులపై, ప్రజాతంత్ర వ్యవస్థలపై జరుగుతున్న దాడి ఇంకా తీవ్రస్థాయికి వెళ్లనున్నదని జనవరి 11 ఘటన సంకేతాలు ఇస్తున్నది.
దేశ రాజకీయాల్లో, అణచివేత విధానాల్లో కీలక మార్పులను ఈ ఘటన సంకేతిస్తున్నది. ఇది ఫాసిస్టు యుద్ధ స్వభావానికి నిదర్శనం. భవిష్యత్తు ఎలా ఉండబోతోందో దీన్నిబట్టి ఊహించవచ్చు. ఈ సమస్య కేవలం మావోయిస్టులదే అనుకుంటే ఫాసిజం అంటే ఏమిటో తెలియనట్లే. ఫాసిజానికి వ్యతిరేకంగా ఎవరు గట్టిగా పోరాడినా.. వాళ్ల నెత్తిన బాంబులు వేసి పోగలరు. ఏ ఊళ్లోకైనా సైన్యాన్ని తరలించగలరు. దండకారణ్యానికైతే సైన్యం వెళుతుంది.. మన దగ్గరికి ఎందుకు వస్తుందనే నిశ్చింతతో ఫాసిజాన్ని ఓడిద్దామనే భ్రమల్లో ఎవ్వరూ ఉండేందుకు లేదు. దేశ ప్రజల మీద వైమానిక దాడులకు ఈ ప్రజాస్వామ్యం ఇచ్చిన ఆమోదం అక్కడి దాకా రాదనే గ్యారెంటీ ఏమీ లేదు.
అమిత్‌షా ఈ హెచ్చరిక ఇచ్చాడు. వాళ్ల దుర్మార్గాల గురించి మాట్లాడుకొని అలిసిపోవడం కంటే సమస్యను మనం ఎలా అర్థం చేసుకుంటున్నాం.. అనేదే ముఖ్యం. భారత ప్రజలు ఫాసిస్టు యుద్ధ క్షేత్రంలోకి బలవంతంగా ఈడ్వబడుతున్నారు. ఇప్పటికైనా హిందుత్వ ఫాసిజాన్ని కార్పొరేట్ ఫాసిజంగా గుర్తిస్తామా? కార్పొరేటీకరణను, సైనికీకరణను వ్యతిరేకించగలమా? ఈ యుద్ధోన్మాదానికి వ్యతిరేకంగా శాంతి, ప్రజాస్వామ్యం, సహ జీవన సంస్కృతి కోసం దృఢమైన మానవీయ విలువల ప్రాతిపదికపై పోరాడగలమా? అనేదే మన ముందున్న సవాల్.