యుక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ యుద్ధం రెండో ప్రపంచ యుద్ధం అనంతరం ఐరోపాలో అతిపెద్ద సంక్షోభాన్ని సృష్టించింది. అమెరికా, ఇయు, నాటో దేశాలు రష్యాపై విధించిన ఆంక్షలు ప్రపంచార్థికంపై విస్తృత ప్రభావం చూపనున్నాయి. కొవిడ్‌ గడ్డు కాలాన్ని తట్టుకోవడానికి వివిధ దేశాల ప్రభుత్వాలు భారీగా ధన వ్యయం చేశాయి. అదిప్పుడు ద్రవ్యోల్భణానికి దారి తీస్తోంది. కొవిడ్‌ కాలంలో దెబ్బతిన్న సరఫరా గొలుసులు ఇప్పటికి పూర్తిగా పునరుద్ధరణ కాలేదు. గోరు చుట్టుపై రోకలి పోటులా ఇంతలోనే యుక్రెయిన్‌ సంక్షోభం వచ్చి పడింది. యుద్ధం ఎంత ఎక్కువ కాలం సాగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అంతగా నష్టం వాటిల్లనుంది. యుద్ధం దీర్ఘకాలం సాగితే ప్రధానంగా రష్యాతో పాటు ఐరోపా దేశాలు ఆర్థికంగా నష్టపోతాయి. ఆర్థిక వ్యవస్థలను మూడు అంశాలు ప్రభావితం చేస్తాయని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్‌) పేర్కొంది. ఒకటి, రష్యాపై ఆర్థిక ఆంక్షలు, రెండు సరఫరా గొలుసుకు  అంతరాయాలు, మూడు ద్రవ్యోల్బణం పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయి. ఫలితంగా ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి, ప్రజలు కష్టాలోకి వెళ్తారు.

కొవిడ్‌ విపత్తు వల్ల 2020లో తీవ్ర ఆర్థిక మాంద్యంలోకి జారిపోయిన ప్రపంచం 2021లో మళ్ళీ తేరుకుంటున్న సూచనలు కనిపించాయి. అంతలో యుక్రెయిన్‌పై రష్యా దండయాత్ర వల్ల 2022లో ప్రపంచ ఆర్థిక రథం మళ్ళీ పట్టాలు తప్పేట్లు కనిపిస్తోంది. చమురు ధరలు విజృంభించడంతో అగ్రరాజ్యం అమెరికాలోనూ ద్రవ్యోల్భణం కట్టు తప్పుతోంది. రష్యా, ఇరాన్‌లపై అమెరికా ఆంక్షలు విధించినందువల్ల చమురు ఉత్పత్తి పడిపోయి ప్రపంచ మార్కెట్‌కు సరఫరాలు తగ్గిపోయాయి. ఆ లోటును భర్తీ చేయడం  సౌదీ అరేబియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యుఎఇ)లకే సాధ్యం. ఆ రెండు దేశాల నాయకులతో, అమెరికా అధ్యకక్షుడు జో బైడెన్‌ మాట్లాడటానికి ప్రయత్నించినా వారు సానుకూలంగా స్పందించలేదు. 2017 లో రష్యాతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని, అనుసరించి చమురు ఉత్పత్తి పెంచకూడదని, సౌదీ యువరాజు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ నిశ్చయించారు. సౌదీ నాయకత్వంలో 13 దేశాలతో కూడిన పెట్రోలియం ఎగుమతి దేశాల సంఘం (ఒపెక్‌) 2016లో రష్యాతో సహా 12 చమురు ఉత్పత్తి దేశాలను కలుపుకొని ఒపెక్‌ ప్లస్‌గా అవతరించింది. అప్పటినుంచి ఉమ్మడిగా చమురు ధరలు నిర్ణయించాలని నిశ్చయించాయి. అందుకే సౌదీ, యుఎఇలు బైడెన్‌కు మొహం చాటేశాయి. 

ఆర్థిక సంక్షోభ సంకేతాలు :

యుద్ధం మొదలవ్వడంతో బ్రెంట్‌ చమురు ధర అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్‌ 116.83 డాలర్లకు చేరుకున్నది. 2014  తర్వాత ఈ స్థాయికి  క్రూడ్‌ ఆయిల్‌ ధర చేరుకోవడం ఇదే మొదటిసారి. త్వరలో పెట్రోల్‌, డిజిల్‌ ధరలు విపరీతంగా పెరిగిపోతాయనే ఆందోళన ప్రజల్లో వ్యక్తమౌతుంది. కరోనా సంక్షోభం, ఒపెక్‌ దేశాల మొండిపట్టు, పశ్చిమాసియాలో రెచ్చిపోతున్న తీవ్రవాద గ్రూపులు వలన అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్‌ ధరలు పెరుగుతూ పోయే కొద్దీ దేశంలో సాధారణ ప్రజల జీవన వ్యయం, హద్దులు మీరిపోయే గడ్డు స్థితే ముందు ముందు విరుచుకుపడగలదని చెప్పవచ్చు. ఆహార కొరత మితి మించుతుంది. సాధారణ ప్రజల బతుకులు చెప్పనలవికానంత దుర్భరమవుతాయి. ఇక అమెరికాలో రికార్డు స్థాయిలో 7.5 శాతం ద్రవ్యోల్భణం నమోదైంది. ఈ పెరుగుదల 125 డాలర్లకు పెరిగితే అమెరికా మాంద్యంలోకి జారుకుంటుంది. రష్యాపై ఆర్థిక ఆంక్షలు విధించినందుకు ప్రతికారంగా చమురు సరఫరా నిలిపి వేస్తే ఐరోపా దేశాల్లో సంక్షోభం తలెత్తుతుంది.

ఐరాస వాణిజ్య, అభివృద్ధి, వ్యవహారాల విభాగం నివేదిక :

ఐరాస వాణిజ్య, అభివృద్ధి, వ్యవహారాల విభాగం(యూఎన్‌సిటిఎడి) మార్చి 25న, విడుదల చేసిన నివేదిక ప్రకారం యుద్ధం కారణంగా భారత జిడిపి వృద్ధిరేటు పడిపోతుంది. ఇంధన సరఫరా, వాణిజ్య ఆంక్షలు, ఆహార ద్రవ్యోల్భణం, కఠిన ద్రవ్య పరపతి విధానం వెరసి, ఆర్థిక అనిశ్చితిని దేశం ఎదుర్కొనే అవకాశం ఉందని తెలిపింది. యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ప్రపంచ ఆర్థిక వృద్ధిరేటు 3.6 శాతం నుంచి 2.6 శాతానికి తగ్గనుందని యుఎన్‌సిటిఎడి తెలిపింది. రష్యా, పశ్చిమ ఐరోపా, దక్షిణ మధ్య ఆగ్నేయాసియాలోని కొన్ని ప్రాంతాల్లో, వృద్ధిలో గణనీయమైన మంద గమనం ఉంటుందని పేర్కొంది. రష్యా వృద్ధి 2.3 నుంచి మైనస్‌ 7.3 శాతానికి క్షీణించనుంది. ఇక అమెరికా వృద్ధి 3 శాతం నుంచి 2.4 శాతానికి, చైనా వృద్ధి 5.7 శాతం నుంచి 4.8 శాతానికి క్షీణించనుంది. ఫారెక్స్‌ మార్కెట్లలో రోజువారి టర్నోవర్‌ 6.6 ట్రిలియన్‌ డాలర్లు ఉంది. పెరుగుతున్న ఆహార ధరలు అభివృద్ధి చెందుతున్న దేశాలలో అత్యంత పేదలపై, దుర్బలమైన తక్షణ ప్రభావం చూపుతాయి. వీరి కొనుగోలు శక్తి దారుణంగా పడి పోనున్నది. దీనికి తోడు పలు దేశాల వాణిజ్యలోటు భారీగా పెరుగడం ఆందోళన కలిగించే అంశం. కొవిడ్‌-19తో తీవ్ర సమస్యల్లో కూరుకుపోయిన ప్రపంచ ఆర్థికానికి ఇప్పుడు యుద్ధం మరింత ప్రమాదం తెచ్చిపెట్టే పరిస్థితి నెలకొంది. 

ఆహార సంక్షోభ దిశగా ప్రపంచం :

దాదాపు ఐదు వారాలుగా రష్యా, యుక్రెయిన్‌ మధ్య కొనసాగుతున్న యుద్ధంతో ప్రపంచం ఆహార సంక్షోభం వైపుగా పయనిస్తోంది. సహజవాయువు ధరలు పెరిగిన కారణంగా ఎరువుల కంపెనీలు ఉత్పత్తిని సగానికి తగ్గించాయి. ఇది ప్రత్యక్షంగా పంట ఉత్పత్తిపై ప్రభావం చూపించనుంది. పంట ఉత్పత్తిని పెంచుకునేందుకు ఎరువులు కీలకం, యూరియా వంటి నత్రజని ఆధారిత ఎరువుల తయారీలో సహజవాయువు ప్రధానం. అయితే సహజవాయువు ధరలు రికార్డు స్థాయికి చేరిన నేపథ్యంలో ప్రముఖ ఫెర్టిలైజర్‌ కంపెనీ యారా ఇంటర్నేషనల్‌ ఐరోపాలో ఆమోనియా, యూరియా ఉత్పత్తి సామర్థ్యాన్ని 45 శాతం తగ్గించేసింది. యారా (నత్రజని) కంపెనీకి అమెరికా, యూరప్‌, ఆఫ్రికా, ఆసియాలో ఉత్పత్తి, విక్రయాలు, సేవలు, పరిశోధన, మద్ధతు కార్యకాలాపాలు ఉన్నాయి. వ్యవసాయంలో కీలకమైన నైట్రోజన్‌ ఉత్పత్తి తగ్గింపు వలన ప్రపంచ ఆహార ఉత్పత్తిపై ప్రభావం పడే అవకాశం ఉన్నదని కంపెనీ యజమాని స్వెయిన్‌ టోర్‌ పేర్కొన్నారు. దేశీయంగా ఉత్పత్తి లేని దేశాలపై యూరియా కొరత తీవ్ర ప్రభావం చూసే అవకాశం ఉన్నది. 

ప్రపంచ గోధుమ వాణిజ్యంలో 30 శాతం వాటా ఉన్న రష్యా, యుక్రెయిన్‌ల నుంచి సరఫరా ఇప్పుడు రిస్క్‌లో ఉన్నది. గత వారం ప్రారంభంలో గోధుమ ధరలు ఆల్‌టైమ్‌ రికార్డు స్థాయికి చేరుకున్నాయి. రష్యా నుంచి ఎగుమతులు నిలిచిపోవడంతో ధరలు విపరీతంగా పెరిగాయి. యుక్రెయిన్‌లో గోధుమ నాటే సీజన్‌ ప్రారంభంలోనే యుద్ధం వచ్చింది. మొక్కజొన్న, సోయాబీన్‌, వెజిటబుల్‌ ఆయిల్‌ ధరలు కూడా పెరిగాయి. రష్యా, యుక్రెయిన్‌ గోధుమ ఎగుమతుల్లో 20 శాతం కూడ ఇంకా నౌకలకు ఎక్కలేదు. ప్రధానంగా ఐరోపా గోధుమ, బార్లీ, మొక్కజొన్న అవసరాలు యుక్రెయిన్‌ ద్వారానే తీరుతాయి. ఇంకా ఇండోనేషియా 30 లక్షల టన్నులు, ఈజిప్ట్‌ 24 లక్షల టన్నులు, టర్కీ 15 లక్షల టన్నులు, పాకిస్తాన్‌ 11 లక్షల టన్నుల గోధుమలను యుక్రెయిన్‌ నుండి దిగుమతి చేసుకుంటాయి. యుద్ధం వల్ల ఈ దేశాలకు దిగుమతులు నిలిచిపోయాయి. 

భారత ఆర్థిక, ఉపాధి రంగాలపై ప్రభావం :

ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా అన్ని దేశాలపై ఏదో ఒకరకమైన ప్రభావం పడడం సహజమే. భారత ఇందుకు మినహాయింపేమి కాదు. యుద్ధ పరిస్థితుల్లో ఆర్థిక కార్యకలాపాలు మందగించడం వల్ల ప్రతికూల ప్రభావం తప్పదు. ఫలితంగా దేశార్థికం దెబ్బతింటుంది. యుక్రెయిన్‌పై రష్యా యుద్ధం పరిణామాలు కూడ ఇలాంటి పరిస్థితులకే దారి తీస్తున్నాయి. ఫలితంగా దేశవ్యాప్తంగా నిత్యావసరాల ధరలు పెరుగుతున్నాయి. పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపు ప్రారంభమైంది. ఈ ప్రభావం అన్ని రంగాలపై ఉండనుంది. తయారీ సంస్థలకు ముడి సరుకుల ధరలు భారంగా మారే అవకాశం ఉంది. ఉత్పత్తి ఖర్చులు పెరిగితే, ఆ భారాన్ని సంస్థలు వినియోగదారుల పైకి బదిలీ చేస్తాయి. ఫలితంగా నిత్యావసరాల ధరలు పెరుగుతాయి. ఇప్పటికే కరోనా సంక్షోభం కారణంగా ఆదాయాలు దెబ్బతిన్న వారికి ఈ ధరల మోత పెద్ద తలనొప్పనే చెప్పాలి. ఆర్థిక అవసరాలను సర్దుబాటు చేసుకుంటూ నెట్టుకొస్తున్న వారికి పరిస్థితులు మరింత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. రుణాలు, ఇఎంఐలు చెల్లించడం కష్టతరంగా మారి పూర్తి ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం ఉంది. 

రష్యా యుక్రెయిన్‌ల మధ్య ఉద్రిక్తతలు ఆగకపోతే భారత్‌కు మరింత సెగ పెరిగేలా ఉంది. దేశీయంగా పొద్దుతిరుగుడు నూనె, గోధుమలు, సెల్‌ఫోన్ల ధరలు జోరందుకునే ప్రమాదం ఉంది. 2020-21లో భారత్‌ దిగుమతి చేసుకున్న నూనెలో రష్యా వాటా 20 శాతం, యుక్రెయిన్‌ వాటా 70 శాతంగా ఉంది. యుక్రెయిన్‌ నుంచి ఇప్పటికే సరఫరా ఆగిపోయిన ఫలితంగా ధరలకు రెక్కలు మొలుస్తున్నాయి. రష్యా పలు దేశాలకు భారీగా ముడిచమురును ఎగుమతి చేస్తోంది. యుద్ధం మూలంగా అంతర్జాతీయంగా దీని ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. దీనివల్ల భారత్‌ కూడా పలు విధాలుగా నష్టపోయే ముప్పుంది. భారత తేయాకుకు రష్యా చిరకాలంగా సుస్థిరంగా కొనసాగుతున్న విపణి బార్లీ ఎగుమతుల్లో యుక్రెయిన్‌ వాటా 18 శాతం. భారత్‌లోని బీరు ఉత్పత్తిదారులు ముడిసరుకైన బార్లీని ఎక్కువగా స్థానికంగానే పొందుతున్నా, యుద్ధం వల్ల స్థానికంగానూ బార్లీ ధరలు పెరిగే అవకాశం ఉంది. ఇది ఉత్పత్తి వ్యయంపై ప్రభావం చూపి, ధరల పెరుగుదలకు దారితీస్తుంది. పారిశ్రామీకరణ కుంటుపడే ప్రమాదం ఉంది. 

చమురుతో పాటు గ్యాస్‌ అవసరాలకు కూడా భారత్‌ దిగుమతులపై ఆధారపడుతోంది. ఈ గ్యాస్‌లో అత్యధిక దిగుమతులు రష్యా నుంచే వస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రష్యా నుంచి 25 లక్షల టన్నుల లిక్విఫైడ్‌ నేచురల్‌ గ్యాస్‌ను గ్యాస్‌ ఆథారిటీ ఆఫ్‌ ఇండియా దిగుమతి చేసుకుంటోంది. రష్యా నుంచి గ్యాస్‌ దిగుమతులు నిలిచిపోతే స్థానిక అవసరాలకు తీవ్ర అవరోధం తప్పదు. ఈ థలో గ్యాస్‌ ధరలు కూడా అనూహ్యంగా పెరుగుతాయి. ఇది అన్ని రంగాలపైన ప్రభావితం చూపిస్తుంది. చమురు, గ్యాస్‌ ధరల పెరుగుదల, వీటి కొరత విద్యుత్‌ నుంచి పరిశ్రమలు, రవాణారంగం వరకు కుదేలవుతాయి. ఉపాధి రంగాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి. నిరుద్యోగం పెరుగుతుంది. అలాగే దేశంలో మోటార్‌ వాహనాలు, మొబైల్‌ ఫోన్ల తయారీలో వినియోగించే పల్ల్లేడియం అనే లోహాన్ని కూడా రష్యా నుంచే దిగుమతి చేసుకుంటాం. దీని సరఫరా నిల్చిపోతే ఈ రెండు రంగాలు ప్రభావితమయ్యే ప్రమాదం కనిపిస్తోంది.

యుద్ధం దీర్ఘకాలం కొనసాగితే విదేశీ వ్యాపారాలకు అంతరాయం కలిగి, నష్టం అపారంగా ఉంటుంది. సరుకుల దిగుమతి నిలిచిపోతే, దేశీయంగా ఆహార వస్తువుల కొరత పెరుగుతుంది. ధరలకు రెక్కలొస్తాయి. ఆర్థిక వ్యవస్థలో అనిశ్చిత వాతావరణం, గిరాకీ క్షీణత, పెట్టుబడుల స్తంభన, ద్రవ్యోల్భణం, వాణిజ్య లోటు వంటి ప్రతికూలతలు ఎదురవుతాయి. యుద్ధం మరింత కాలం కొనసాగితే సరఫరా గొలుసుపై తీవ్ర ప్రభావం పడుతుంది. చాలా ఓడరేవుల్లో అనిశ్చితి మూలంగా కంటైనర్లు నిలిచిపోయాయి. కొవిడ్‌ తదితర కారణాలతో దిగజారిన వృద్దిరేటును పెంచేందుకు, పెరిగిన ద్రవ్యోల్భణాన్ని తగ్గించేందుకు తీవ్ర కసరత్తు సాగుతున్న వేళ వచ్చిపడిన యుద్ధం మరింత  భారం మోపనుంది. యుద్ధ ప్రభావం అంతర్జాతీయ వాణిజ్యం, పెట్టుబడులు, ఆర్థిక నిపుణులు, సాంకేతిక లభ్యతల పైనా పడుతుంది. యుద్ధం కారణంగా ప్రతికూల పరిస్థితులు నెలకొన్నప్పుడు ఏ దేశంలోనైనా ఇబ్బంది పడేది సామాన్యులే. ఒకవేళ సత్వరమే యుద్ధం సమసిపోయినా, సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు చాలా రోజులు పట్టవచ్చు. భారత్‌కు సంబంధించి వ్యూహాత్మక ఆర్థిక, రాజకీయ, సైనిక అంశాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళడంలో భారత్‌కు కొత్త సవాళ్లు ఎదురయ్యే అవకాశాలున్నాయి.    

Leave a Reply