మనమంతా మరణించాల్సిందే 
నేనంగీకరిస్తాను

కానీ ఎవ్వరూ ఒక భవనం నుంచి మరొక భవనానికి, శిథిలం కావడానికో, మాంసధూళి  కావడానికో పరుగెత్తరాదు
ఏ తల్లీ తన పిల్లలకు వీడ్కోలు గాలిలో రాసే పరిస్థితి రాకూడదు
మృత్యువు కాసేపు నుదిటి పై నిలిచి పోవాలి 
ఆకులపై దట్టమైన మంచువలె 
అప్పుడు మనం దుఃఖించాలి
కరుగుతున్న మంచుబిందువులు నేలపై రాలుతున్నట్లుగా 
అర్థాంతరంగా, ఆకస్మికంగా, అమానవీయంగా మృత్యువు ఇంతటి కూృరమైన శత్రువు కాకూడదు

నేను నీ కోసం ఒక పతంగి తయారు చేస్తాను 
ఆ రోజు మనల్ని మనం విముక్తం చేసుకుంటాం
ఆ రోజు మనం స్వాతంత్య్రయాన్ని  పొందుతాం
అయితే నేను పతంగిని కఫన్ నుంచి తయారు చేయను 
నేను పతంగిని సూర్యకాంతి ముక్క  నుంచి తయారు చేస్తాను 
అది స్వేఛ్చా పాలస్తీనా గోధుమ క్షేత్రాన్ని తేజోమయం చేస్తుంది

కవిని చంపడం సాధ్యం కాదు రఫాత్
మొగ్గలోని ప్రతి వికసనలో 
ప్రతి విత్తన విస్పోటనం లో, ప్రతి ఆకాంక్ష లోని చిగురింతలో,
అందులో ఆశ గురించి గానం చేసే కవి ఉంటాడు
అందులో నువ్వుంటావు రఫాత్
నేను  నీకు వాగ్దానం చేస్తున్నాను
నేను నా ప్రతి అక్షరం లోను నీ కథలు సముద్రంపై  వెదజల్లుతాను
ఆ సముద్రాన్ని దాటుతున్న ప్రతి పక్షీ నీ కథలో  తమ రెక్కలను తడుపుకొని 
తాము దూర దూరాల దేశాలకు తీసుక పోతాయి
అప్పుడు ప్రతి పర్వతం నుంచి ప్రతి స్వరం నీ కోసం ఎలుగెత్తుతాయి 
- నీ స్వేఛ్చా స్వాతంత్ర్య పాలస్తీనా కోసం 

తుపాకీ గుండ్లు పర్వతాలనుచంపలేవు.
కిందికి ప్రవహించే నదులు -
ఈ క్రూర ఆకస్మికత కాకుండా,
అమానవీయ మరణం  నుంచి 
సహజమరణాలు పొందే కాలం దాకా పాడుతాయి
అపుడు నువ్వు స్వేఛ్చ పొందుతావు
స్వేఛ్చా పాలస్తీనా పై స్వేఛ్చ గా సూర్యుడు ఉదయిస్తాడు.

Leave a Reply