చాలా సన్నద్ధత తర్వాత పుతిన్ సైన్యం ఉక్రెయిన్‌పై దాడి చేసింది.అమెరికా, దాని మిత్రదేశాలు దీనిని పుతిన్ సామ్రాజ్యవాద అత్యాశ పరిణామంగానూ, పూర్వ సోవియట్ యూనియన్‌ను పునరుద్ధరించే చర్యగానూ ప్రకటించాయి. ఉక్రెయిన్‌ను ఆక్రమించే ఉద్దేశం తమకు లేదని, ఈ ʹసైనిక ఆపరేషన్ʹ లుహాన్స్క్, డొనెట్స్క్ రిపబ్లిక్‌ల పైన ఉక్రెయిన్ దాడులను అంతం చేయడానికి ఉద్దేశించబడిందని రష్యా ప్రభుత్వం ప్రకటించింది. దానితో పాటు ఇప్పుడు ఉక్రెయిన్‌లో రాజకీయంగా ఆధిపత్యం చెలాయిస్తున్న నాజీ శక్తులను నాశనం చేయాలనుకుంటున్నానని రష్యా అంటోంది. వీటికి మించి తమకు వేరే ఏ లక్ష్యాలు లేవని రష్యా పాలకులు పేర్కొంటున్నారు.


చెప్తున్నది యిదే  కానీ ఈ శక్తుల చర్యలు మాత్రం చాలా భిన్నంగా వున్నాయి. డోన్‌బాస్ ప్రాంతంలోని రిపబ్లిక్‌ల రక్షణ కోసం తన సైన్యాన్ని పంపుతున్నట్లు పుతిన్ అంటున్నప్పటికీ, రష్యా సైన్యం ఉక్రెయిన్ అంతటా తన దాడిని ప్రారంభించింది. రాజధాని కీవ్‌ను స్వాధీనం చేసుకునేందుకు కదులుతున్నట్లు తాజా నివేదికలు సూచిస్తున్నాయి. మరోవైపు, అమెరికా, దాని మిత్రదేశాలు ఉక్రెయిన్ సార్వభౌమాధికారాన్ని రక్షించడం గురించి చాలా మాట్లాడినప్పటికీ, వాటి చర్యలతో సరిపోలడంలేదు. రష్యా దాడి చేస్తే కనక అమెరికా తన బలగాలను పంపదని దాడి ప్రారంభానికి కొన్ని రోజుల ముందు బిడెన్ స్పష్టంగా పేర్కొన్నాడు. ఇలా అనడం రష్యా దాడికి దాదాపు పచ్చజెండా ఊపినట్లే. యుద్ధం ప్రారంభమైన తర్వాత ఆర్థిక ఆంక్షలు విధించినప్పటికీ, ఈ వైఖరిని ఆయన పునరుద్ఘాటించారు. ఇతర NATO సభ్యదేశాల  వైఖరి కూడా అలానే వుంది. తమ మద్దతు సైనిక సహాయం రూపంలో మాత్రమే ఉంటుందని స్పష్టంగా చెప్పాయి.


నిశితంగా పరిశీలిస్తే ఆర్థిక ఆంక్షలు అంత ప్రభావవంతంగా లేవని అర్థమవుతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక నిల్వలలో ఒకటిగా రష్యా ఉంది. దాని ఆర్థిక వ్యవస్థ మెరుగుపడింది. SWIFT (Society for Worldwide Interbank Financial Telecommunications) నుండి విడిగా, కొంతవరకు ఆర్థిక లావాదేవీలు నిర్వహించగల వ్యవస్థ కూడా అమలులో ఉందని అంటున్నారు. అంతేకాకుండా చైనా మద్దతు ఉంది. ఆంక్షలను తట్టుకోగలదు. వాటిని అమలు చేస్తున్న వారికి ఈ విషయం తెలుసు.


నార్డ్ 2 గ్యాస్-లైన్ (జర్మనీకి రష్యా గ్యాస్ ప్రవాహాన్ని రెట్టింపు చేసేందుకు రూపొందించిన నార్డ్ స్ట్రీమ్ 2 బాల్టిక్ సీ సహజ వాయువు పైప్‌లైన్ ప్రాజెక్టు) అంశం నుంచి ఈ ఆంక్షల వాస్తవ స్వభావం గురించి ఒక అంచనాకు రావచ్చు. రష్యా ఆక్రమిత ప్రాంతాలైన తూర్పు ఉక్రెయిన్‌లోని డోనెట్స్క్ లుహాన్స్క్ ప్రాంతాలను స్వతంత్ర రాష్ట్రాలుగా మాస్కో అధికారికంగా గుర్తించిన ఒక రోజు తర్వాత, ఆంక్షల్లో భాగంగా జర్మనీ ఇప్పుడు తన కమీషన్‌ను స్తంభింపజేసింది. కానీ, మరొక పైప్‌లైన్, నార్డ్ 1, 2011 నుండి పనిచేస్తోంది. ఇది కూడా బాల్టిక్ సముద్రం గుండా వెళుతుంది. రష్యా గ్యాస్‌ను జర్మనీకి చేరుస్తుంది.  ఇది ఇప్పటికీ పనిచేస్తోంది, ఉక్రెయిన్ గుండా వెళుతున్న పైప్‌లైన్‌లు కూడా అలాగే ఉన్నాయి. తూర్పు ఐరోపా దేశాలు చాలా వరకు రష్యన్ గ్యాస్‌పై ఆధారపడి ఉన్నాయి, ఇవి ఆంక్షల వల్ల ప్రభావితం కాలేదు.


రష్యాపై ఆంక్షలను వాస్తవంగా నీరుగార్చడంలో యూరోపియన్ శక్తులు, అమెరికా మధ్య వున్న వైరుధ్యాలు కూడా పాత్రను పోషించాయి. రష్యా నుండి మానేసి, అవి అమెరికా, కెనడాలనుండి గ్యాస్ తీసుకోవాలని అమెరికా ఆసక్తి.  రష్యన్ గ్యాస్‌పై ఆధారపడటాన్ని విచ్ఛిన్నం చేసే దళారిగా కనిపించినప్పటికీ, అమెరికాపై యూరప్ ఆధారపడటాన్ని బలోపేతం చేయడం, వారికి కొత్త మార్కెట్‌ను తెరవడం అసలు ఉద్దేశం. జర్మనీ, ఫ్రాన్స్ దీనికి సుముఖంగా లేవు.


సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైనప్పటి నుండి, అమెరికా సామ్రాజ్యవాదం ఐరోపాపై సంపూర్ణ ఆధిపత్యాన్ని స్థాపించడానికి ప్రయత్నిస్తోంది. అంతకుముందు ఐరోపా సోవియట్ సోషల్ సామ్రాజ్యవాద నియంత్రణలో వున్న వార్సా ఒప్పందం అధీనంలో వుండేది. ఆ ఒప్పందం ప్రపంచ ఆధిపత్యానికి నిర్ణయాత్మకమైనది. దాన్ని ఎవరు నియంత్రించాలన్నదే కీలకం. ఈ విషయాన్ని చాలా కాలం క్రితమే మావో త్సేతుంగ్ చెప్పారు. సోవియట్ సోషల్ సామ్రాజ్యవాదం చరమ దశలో రష్యా NATO తూర్పు వైపు విస్తరించబడదనే హామీపై వార్సా ఒప్పందం రద్దుకు అంగీకరించింది. కానీ సోవియట్ యూనియన్ అనేక స్వతంత్ర దేశాలుగా పతనం కావడంతో, అమెరికా సామ్రాజ్యవాదం ఈ హామీని విస్మరించి, NATOను విస్తరించడం ప్రారంభించింది. రష్యా ఎప్పటికీ అధీనంలో ఉండేలా చూడడమే దీని లక్ష్యం. అప్పటి నుండి 14 కొత్త దేశాలు NATOలో చేరాయి, అన్నీ తూర్పు ఐరోపా నుంచే.  వాటిలో చాలామటుకు యూరోపియన్ యూనియన్‌లో సభ్యులుగా ఉన్నప్పటికీ, అమెరికాకి అతి సన్నిహితంగా వుంటాయి.


US సామ్రాజ్యవాదులు తమ “అమెరికన్ శతాబ్ది” నిజంగా ప్రారంభమైందని, తమను ఎదిరించి నిలబడే సామర్థ్యం కలవారెవరూ లేరని తేల్చారు. ప్రపంచంపై పూర్తి ఆధిపత్యం కలిగిన ఏకైక శక్తి తమదేనని వారు అహంకారంతో ప్రకటించారు. ఈ ఆలోచనతో వారు ఐరోపాతో సహా ప్రపంచమంతటా యుద్ధాలు, దురాక్రమణలు చేశారు. ఇందులో చేరాలనుకునే వారు రావచ్చు అనే సందేశంతో ఏకపక్షంగా జరిగింది. ఏదైనా వ్యతిరేకత వస్తే కేవలం విస్మరించేవారంతే. UN నుండి లాంఛనమైన  గుర్తింపు పొందడానికి కూడా ప్రయత్నించకుండానే ఇది జరిగింది. ఇది సెర్బియా, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్, లిబియా, సోమాలియా తదితర అనేక దేశాలపై దాడి చేసింది. UN పర్యవేక్షణకు వెలుపల, ప్రపంచవ్యాప్తంగా US కమాండ్ కింద పనిచేసే సైనిక జోక్య దళంగా NATO రూపాంతరం చెందింది.


అయితే, ఈ దేశాలలో ఎదురైన ప్రతిఘటన ఈ లక్ష్యాలను భగ్నం చేసింది. అది తన డిక్టట్ (పిడివాద శాసనం)ను అమలుపరచి బయటకు రావడంలో విజయం సాధించలేకపోయింది. అంతులేని యుద్ధంలో చిక్కుకుంది. ఈ పరిస్థితిని ఉపయోగించుకుని రష్యా, చైనాలు తమ బలాన్ని పెంచుకున్నాయి. చైనా సామ్రాజ్యవాద దేశంగా మారింది. తన బలహీనతలను అధిగమించి రష్యా కూడా పుతిన్ నేతృత్వంలో తన అధికారాన్ని చాలా మటుకు తిరిగి పొందింది. తూర్పు ఐరోపా, ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో అమెరికా విస్తరణను నిరోధించడం ప్రారంభించింది. జార్జియా, అజర్‌బైజాన్‌లలో జరిగిన యుద్ధాలు, సిరియాలో అసద్ పాలనను రక్షించడానికి చేసిన సాయుధ జోక్యం ఈ పునరుద్ఘాటనకు ఉదాహరణలు. ఉక్రెయిన్‌లో దాని దురాక్రమణ ఈ విధానానికి కొనసాగింపు.


ఇరాక్, ఆఫ్ఘన్ యుద్ధాల వల్ల బలహీనపడిన అమెరికా సామ్రాజ్యవాదం, దాని మిత్రపక్షాలు పుతిన్‌ను ఎదిరించే స్థితిలో లేవు. అంతేకాకుండా, ఈ కాలంలో రష్యన్ సామ్రాజ్యవాదం, చైనా సోషల్ సామ్రాజ్యవాదం షాంఘై కో-ఆపరేషన్, బ్రిక్స్ వంటి సంస్థలను ఏర్పాటు చేశాయి. వారు US-నియంత్రిత IMF, ప్రపంచ బ్యాంకులకు సమాంతరంగా ఒక ప్రత్యామ్నాయ, అంతర్జాతీయ ఆర్థిక సంస్థాగత నిర్మాణాన్ని ప్రారంభించాయి. మూడవ ప్రపంచ దేశాలకు ప్రముఖ ఆర్థిక, పెట్టుబడుల మూలాధారంగా చైనా మారింది. అమెరికా వ్యతిరేకతను పట్టించుకోకుండా ఐరోపాలోని అనేక దేశాలు దాని అంతర్జాతీయ వ్యాపారాలలో చేరడం ప్రారంభించాయి. ఆర్థిక పరిమాణంలో చైనా ఇప్పటికీ అమెరికా కంటే వెనుకబడి ఉన్నప్పటికీ, దాని వృద్ధి సామర్థ్యం చాలా ఎక్కువ. వీటన్నింటి ఫలితంగా, అమెరికా  ఏకీకృత నియంత్రణకు మించిన బహుళ-కేంద్రీకృత ప్రపంచ సామ్రాజ్యవాద వ్యవస్థ ఉద్భవించింది. ఉక్రెయిన్‌లో మనం చూసేది ఈ ప్రపంచ వ్యవస్థలో వున్న  వైరుధ్యాలు, ఈ ప్రపంచ వ్యవస్థ అనివార్యతలు.


ఒకవైపు అమెరికా సామ్రాజ్యవాదం, దాని మిత్రపక్షాలు, మరోవైపు రష్యన్ సామ్రాజ్యవాదం, చైనా సోషల్ సామ్రాజ్యవాదాల మధ్య వివాదం ఉక్రెయిన్ యుద్ధపు అసలు సమస్య. రష్యా, చైనాలు ఒక కొత్త సామ్రాజ్యవాద క్రమాన్ని ఏర్పాటు చేయడానికి, అమెరికా ఇప్పటికే ఉన్న దానిని సంరక్షించడానికి చేసే ప్రయత్నానికి మధ్య వివాదాన్ని పరిష్కరించడానికి వేసే వ్యూహాత్మక ఎత్తుగడను ఇది సూచిస్తుంది. ఉక్రెయిన్ సార్వభౌమాధికారం అమెరికా లేదా దాని మిత్రదేశాల సమస్య కాదు. రష్యాకు లుబాన్స్క్, డొనెట్జ్ రిపబ్లిక్‌ల స్వాతంత్ర్యం కూడా కాదు. ఇద్దరు పోటీదారులకు తమ ప్రపంచ వివాదంలో తమ స్థానాలను మెరుగుపరచుకోవడం, దృఢపరచుకోవడంలో  మాత్రమే ఆసక్తి వుంది.


ఉక్రేనియన్ ప్రజలు, డాన్‌బాస్ రిపబ్లిక్‌ల ప్రజల జాతీయ ప్రయోజనాలను ఈ సామ్రాజ్యవాద శక్తుల ప్రయోజనాల నుండి వేరుగా చూడాలి. ప్రస్తుతం ఈ ప్రయోజనాలు ఈ శక్తుల ఎత్తుగడలకు లోబడి ఉన్నాయి. అయినప్పటికీ వారు ఇప్పటికీ తమ స్వంత లక్ష్య ఉనికిని కలిగి ఉన్నారు. వారి స్వతంత్ర పాత్రను పొందే అన్ని అవకాశాలు ఉన్నాయని ప్రపంచ అనుభవాలు తెలియచేస్తున్నాయి.


సోవియట్ యూనియన్ ఏర్పాటులో ఉక్రెయిన్ కీలక పాత్ర పోషించింది. జార్ల క్రింద దాని స్వీయ-నిర్ణయాధికారం నిరాకరించబడింది. రష్యన్ విప్లవం దానిని గుర్తించి నిజం చేసింది. ఉక్రేనియన్ జనాభాలో 17 శాతం మంది రష్యన్ జాతికి చెందినవారు. రష్యన్ సంస్కృతి, సాహిత్యం శతాబ్దాల నుండి ప్రభావవంతంగా ఉన్నాయి. అందువల్ల రష్యన్ భాష మాట్లాడేవారి జనాభా గణనీయమైన సంఖ్యలో ఉంది. సోవియట్ యూనియన్ అధికార భాష రష్యన్ అయితే, పాఠశాలల్లో ఉక్రేనియన్ భాష తప్పనిసరి. ఇది జాతీయ భాషలు, సంస్కృతులపై లెనినిస్ట్ విధాన ఫలితం. పుతిన్ తన సామ్రాజ్యవాద దురహంకారంతో ఈ విధానాన్ని ఖండించారు. అతని దృష్టిలో ఉక్రెయిన్‌ను (ఎన్నడూ ఉనికిలో లేనిది) ఒక దేశంగా గుర్తించడం ద్వారా జార్లు నిర్మించిన రష్యన్ సామ్రాజ్యం బలహీనపడటం, ఉక్రేనియన్ (ఇది రష్యన్ మాండలికం మాత్రమే) ఒక ప్రత్యేక భాషగా అంగీకరించడం లెనిన్,  బోల్షెవిక్‌లు చేసిన రెండు నేరాలు. అందువల్ల రష్యన్ సామ్రాజ్యవాదపు ఈ ఆధిపత్య రూపకల్పన, ఉక్రేనియన్ ప్రజల న్యాయమైన జాతీయ ప్రయోజనాల మధ్య వైరుధ్యం ఈ యుద్ధంలో ఒక అంశం. అయినప్పటికీ, జాతీయ ప్రతిఘటన కోసం ఆకాంక్ష ఖచ్చితంగా స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ, అది ఇప్పటికీ అమెరికా సామ్రాజ్యవాదం, దాని బంటులుగా వ్యవహరిస్తున్న ఉక్రేనియన్ పాలకుల నుండి భిన్నమైన తన స్వంత తావుని రూపొందించుకోలేదు.

స్వాతంత్ర్యం పొందిన తరువాత, ఉక్రెయిన్ కొత్త పాలకులు జాతీయ మైనారిటీల పట్ల అణచివేత విధానాన్ని అనుసరించారు. జాతీయ గుర్తింపును పటిష్టం చేసే పేరుతో, అత్యంత నీచమైన జాతీయ మతోన్మాదాన్ని చురుకుగా ప్రచారం చేశారు. స్థానిక మెజారిటీ ప్రజలు మాట్లాడే భాషను స్థానిక అధికారిక భాషగా ఉపయోగించడాన్ని అనుమతించే చట్టం గతంలో ఉండింది. ఇది 2014లో రద్దు చేయబడింది. ఈ జాతీయ అణచివేత రష్యన్ కళాకారులు, సాంస్కృతిక కార్యక్రమాలు, సంగీతాన్ని కూడా నిషేధించే స్థాయికి వెళ్లింది. వీటన్నింటికీ తీవ్ర మితవాద రాజకీయ సారం ఉంది. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో సోవియట్ యూనియన్‌కు వ్యతిరేకంగా హిట్లర్‌తో కలిసి చురుకుగా సహకరించిన ఉక్రేనియన్ నాజీ నాయకుడు జాతీయ హీరోగా గుర్తింపు పొందాడు. స్పష్టంగా, ఈ విధానాలు, చర్యలన్నీ దేశంలోని రష్యన్ మెజారిటీ ప్రాంతాలలో తీవ్ర అసౌకర్యానికి కారణమయ్యాయి. తమ భాష, సంస్కృతి నిలదొక్కుకోవాలంటే విడిపోవడం తప్పదనే భావన బలంగా మారింది. రష్యా మరింతగా  రెచ్చగొట్టింది. లుబాన్స్క్, డోనెట్జ్‌లలో వేర్పాటువాద ఉద్యమాలుగా వాస్తవరూపం దాల్చింది. ఈ యుద్ధంలో ఇది కూడా ఒక అంశం. రష్యా దానిని ఉపయోగించుకుంటోంది. ఉక్రేనియన్ ప్రజల జాతీయ ప్రతిఘటన మాదిరిగానే, రష్యన్ జాతీయ మైనారిటీల జాతీయ ప్రతిఘటన కూడా తన  స్వంత అవకాశాల్ని ఇంకా రూపొందించుకోలేదు.


ఈ వైరుధ్యాలు సామ్రాజ్యవాదులు, వారి తాబేదార్ల వైరుధ్యాల కంటే భిన్నమైనవి. వారిలో ఒక ధృవం ప్రజలు. అందువల్ల అవి వేరే దిశకు సంభావ్యతను కలిగి ఉంటాయి. ఉక్రేనియన్ పాలకుల జాతీయ అణచివేతతో బాధపడుతున్నప్పటికీ, ఆ దేశంలోని పెద్ద సంఖ్యలో రష్యన్ మాట్లాడేవారు తమను తాము ఉక్రేనియన్లుగా భావించుకుంటారు. ఆ భూమిలో వారి మూలాలు తరతరాలుగా ఉన్నాయి. ఉక్రేనియన్ మాట్లాడేవారికి కూడా, రష్యన్ భాష, సంస్కృతి పరాయిది కాదు. పాలకుల మతోన్మాద విధానాలు వారి సాంస్కృతిక, సామాజిక జీవితాలను కూడా ప్రభావితం చేస్తాయి. ఉక్రేనియన్,  రష్యన్ మూలకాలు ఒకదానితో ఒకటి పెనవేసుకొన్నదే ఉక్రేనియన్ గుర్తింపు. వారిని బలవంతంగా విడదీయడానికి లేదా రష్యన్ నుండి వేరుగా ఉనికిని కలిగి ఉందని తిరస్కరించడానికి జరిగే ఏ ప్రయత్నమైనా ప్రజల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉంటుంది. అవి వస్తుగత వాస్తవానికి అనుగుణంగా లేవు. ఈ వైమనస్యానికి మూలం ప్రజల ప్రయోజనాలకు, వారి దోపిడీదారుల, అణచివేతదారుల ప్రయోజనాలకు మధ్య ఉన్న వ్యతిరేకతలో వున్నది. అందుకే దాని వ్యక్తీకరణకు వస్తుగత ప్రాతిపదిక ఇప్పటికీ ఉందని ఒకరు నమ్మకంగా చెప్పగలరు. రష్యా అంతటా జరుగుతున్న యుద్ధ వ్యతిరేక ప్రదర్శనలు ఇందుకు రుజువు.


కానీ అది మొత్తం పరిస్థితిలో వున్న ప్రబల స్వభావం కాదు. అందువల్ల, వివిధ జాతీయ ప్రజల న్యాయమైన ప్రయోజనాలు ఈ యుద్ధంలో భాగమైనప్పటికీ, సామ్రాజ్యవాద శక్తుల మధ్య వివాదమే ప్రత్యేకంగా నిలుస్తుంది. ప్రస్తుతం ఇది పరిగణనలోకి తీసుకోవలసిన ప్రధాన అంశం. విప్లవకారులు, అభ్యుదయవాదులు ఎవరి వైపూ ఉండకూడదు. ఉక్రెయిన్ ప్రజలకు లేదా డోన్‌బాస్‌కు వారు సంఘీభావం అలా తెలియజేయకూడదు. బదులుగా, వారు సామ్రాజ్యవాద శక్తుల ప్రయోజనాలను బహిర్గతం చేయాలి ఈ సామ్రాజ్యవాద ప్రేరేపిత యుద్ధాన్ని అంతం చేయడానికి తమ గళాన్నెత్తాలి. ఉక్రెయిన్‌లోని నిజమైన ప్రజా శక్తులు, డాన్‌బాస్‌లోని రిపబ్లిక్‌లు కొత్త సోషలిస్ట్ దేశం కోసం ఐక్య పోరాట పతాకాన్ని ఎగురవేయాలి, ఇది ఉక్రెయిన్‌లోని అన్ని జాతీయ మైనారిటీల స్వీయ-నిర్ణయాధికారం, ప్రజాస్వామ్య హక్కులకు హామీ ఇస్తుంది. తద్వారా రష్యన్ సామ్రాజ్యవాదం దురాక్రమణ, US బంటు జెలెన్స్కీ ప్రాతినిధ్యం వహిస్తున్న పాలక వర్గాల నుండి తమను తాము వేరు చేసుకున్నట్లవుతుంది. వారు కొత్త దిశను స్థాపించడానికి ఇదే ఏకైక మార్గం.

గత అనేక దశాబ్దాలుగా, అమెరికా సామ్రాజ్యవాదం చైనాకు వ్యతిరేకంగా తన శక్తులను కేంద్రీకరించడానికి ప్రయత్నిస్తోంది. ఐరోపా భద్రతా అవసరాలలో ఎక్కువ భాగాన్ని యూరోపియన్ శక్తులు భరించాలని  నొక్కి చెబుతోంది.  ఖర్చులను NATO తగినంతగా పంచుకోవడం లేదని నిరంతరం ఫిర్యాదు చేస్తూనే ఉంది.

ట్రంప్ ఒక అడుగు ముందుకేసి నాటోను రద్దు చేసినా పర్వాలేదని ప్రకటించాడు. చైనాతో తలపడాలంటే రష్యాతో ఉన్న   సమస్యలను అమెరికా పరిష్కరించుకోవాలని లేదా పక్కన పెట్టేయాలనే అమెరికా పాలక వర్గాలలోని ఒక విభాగం అభిప్రాయాలకు అనుగుణంగా వుంది.

కానీ అలా చేయడం ఆచరణ సాధ్యం కాదు. అలా చేస్తే కనక, బహుశా యూరప్‌పై అమెరికా తన పట్టును పూర్తిగా కోల్పోవచ్చు.  సోవియట్ యూనియన్‌ను మాత్రమే తనిఖీ చేయడం NATO ఉద్దేశం కాదు. జర్మనీని అదుపులో ఉంచుకోవాలనే లక్ష్యం కూడా ఉంది. ఇంకా అది మిగిలి ఉంది. గత కొంత కాలంగా ఐరోపా రక్షణ దళాన్ని ఏర్పాటు చేయాలని ఫ్రాన్స్ డిమాండ్ చేస్తోంది. NATOను రద్దు చేస్తే కనక, ఫ్రాన్స్, జర్మనీ నేతృత్వంలోని యూరోపియన్ సైనిక సంస్థ ఏర్పడవచ్చు. ఇది బహుశా రష్యాతో ఒక ఒప్పందానికి రావచ్చు.

రష్యాను చుట్టుముట్టడంతో పాటు, US అనుకూలమైన NATO విస్తరణ ఈ అవకాశాన్ని కూడా దృష్టిలో ఉంచుకుంటుంది. ముఖ్యంగా పునరుద్ఘాటించే రష్యా ఉండగా విడిచిపెట్టదు. తూర్పు యూరోపియన్ దేశాలకు రష్యా ప్రధాన ముప్పు. ఈ ముప్పును ఎదుర్కోవడానికి జర్మనీ,  ఫ్రాన్స్ లు సరిపోవు. వారికి అమెరికా అవసరం, అందుకే NATO. ఐరోపాలో తన స్వంత ఆర్థిక, సైనిక భారాన్ని తగ్గించుకుంటూ NATOను చురుకుగా ఉంచడానికి US దీనిని ఉపయోగించుకోవడానికి ప్రయత్నించింది. ఉక్రెయిన్ సంక్షోభం, యుద్ధం దీనిని చాలా వరకు కలవరపరిచింది.

అంతేకాకుండా, ప్రత్యక్ష సైనిక పాత్రను నివారించే బిడెన్ విధానం, అతను మాట్లాడుతున్న దానికి భిన్నంగా ఉండడం, ఖచ్చితంగా సందేహాలకు దారి తీస్తుంది. అమెరికాపై ఆధారపడవచ్చా లేదా ఎంత వరకు  ఆధారపడవచ్చు అనేది ఇందులో ప్రధానంగా ఉంటుంది.

నాటోకు వ్యతిరేకంగా ట్రంప్ ప్రకటించిన కొద్ది కాలంలోనే ఇది జరుగుతోంది. అమెరికా సైనిక శక్తిపై ఆధారపడే బదులు రష్యాతో ఒప్పందం కుదుర్చుకోవడమే మంచిదనే నిర్ణయానికి అనేక యూరోపియన్ దేశాలు రావడం ఒక ఊపునిస్తుంది.

యుద్ధం ప్రారంభం కావడానికి ముందే,  రష్యాకు చట్టబద్ధమైన భద్రతా సమస్యలున్నాయని, వాటిని పరిష్కరించాల్సిన అవసరం ఉందని జర్మనీ, ఫ్రాన్స్ రెండూ చెప్పాయి. యుద్ధం ప్రారంభమైన తర్వాత ఫ్రాన్స్ రష్యాకు చెందిన వ్యాపార నౌకను స్వాధీనం చేసుకుంది.

ప్రాణాంతకమైన పరికరాలను సరఫరా చేయకూడదని తీసుకున్న తన నిర్ణయానికి విరుధ్ధంగా జర్మనీ వాటిని ఉక్రెయిన్‌కు సరఫరా చేయడం ప్రారంభించింది. అమెరికా ఒత్తిడికి లొంగిపోతున్నట్లు స్పష్టమవుతోంది. అయినప్పటికీ, అమెరికా విధానాలపై వచ్చిన ఆందోళనలను అవకాశంగా తీసుకుని, ఈ దేశాలు ఐరోపాలో తమ చొరవను భద్రపరచుకొనేందుకు చేస్తున్న ప్రయత్నాన్ని కూడా ఇది సూచించవచ్చు.

కనీసం కొంతకాలమైనా చైనాను లక్ష్యంగా చేసుకునే తక్షణ కర్తవ్యం నుండి తన దృష్టిని మళ్లించాల్సిన పరిస్థితి అమెరికాకు వచ్చింది.  అదే సమయంలో యూరప్‌పై పూర్తిగా దృష్టి పెట్టలేని సమస్యను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది.

కాబట్టి బిడెన్ ఈ మలుపు ఎందుకు తీసుకున్నాడు? ఇది కేవలం తప్పనిసరి పరిస్థితులను సూచిస్తుందా? లేదా  రాబోయే పరిణామాల గురించి బాగా తెలిసే కావాలని తీసుకున్నాడా?  సందేహించడానికి చాలా కారణాలున్నాయి.

నేను ఇంతకు ముందే చెప్పినట్లుగా, సరిహద్దులలో పుతిన్ తన సైన్యాన్ని మోహరిస్తున్న తరుణంలోనే అమెరికా తన బలగాలను యుక్రెయిన్‌లో మోహరించడం లేదని బిడెన్ ప్రకటించాడు.

రష్యాను యుద్ధంలో చిక్కుకునేట్లు చేసి, తద్వారా చైనా- రష్యాల మధ్య మైత్రిని బలహీనపరిచి ఐరోపాపై నియంత్రణను నిలుపుకోవడానికి ఇది జరిగిందా? ఉక్రెయిన్‌లో రాగల ప్రతిఘటనపై వేసిన అంచనాలు ఈ పన్నాగానికి కారణం కావచ్చు. జాతి రష్యన్ జాతీయులు, రష్యన్ భాష మాట్లాడేవారి వాటా చాలా ముఖ్యమైనదయినప్పటికీ, వారిలో ఎక్కువ మంది తమను తాము ఉక్రేనియన్లుగా భావిస్తారు. డాన్‌బాస్ ప్రజలు విడిపోయినప్పుడు, పుతిన్ ఉక్రెయిన్‌లోని రష్యన్ మెజారిటీ దక్షిణ ప్రాంతాలలో ఇలాంటిదే చేయాలని ప్రయత్నించాడు. విఫలమయ్యాడు. అందువల్ల, రష్యా దురాక్రమణ వల్ల ఉద్భవించిన జాతీయ భావాలు, రక్షణ పుతిన్ ఊహించలేనంతగా ప్రతిఘటనగా రూపాంతరం చెందుతాయని అమెరికా పాలకులు నిర్ధారించి ఉండవచ్చు. ఈ మొత్తం వ్యవహారం నాటోను కఠినతరం చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. బహుశా ఈ కారకాలు బిడెన్‌ను అతని ఎంపికలలో మార్గనిర్దేశం చేసేవి కావచ్చు.

అయితే, అమెరికా పాలక వర్గాల్లోనే దీనిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇప్పుడు జెలెన్స్కీని ప్రశంసించిన ట్రంప్, అంతకు ముందు  పుతిన్‌ను అభినందించాడు. అతని వెర్రి, అస్థిరమైన ప్రవర్తనకు ఉదాహరణ అదొకటి మాత్రమే కాదు. ఇది రిపబ్లికన్ పార్టీలో ఒక బలమైన సెక్షన్ ఆలోచనను ప్రతిబింబిస్తుంది. రష్యా దురాక్రమణపై వచ్చిన ప్రపంచవ్యాప్త వ్యతిరేకత,  అమెరికాలో రాబోయే ఎన్నికలపై యుద్ధ అనుకూల వైఖరి చూపే పరిణామాల దృష్ట్యా వారు తమ బహిరంగ వైఖరిని మార్చుకుని ఉండవచ్చు. అది ఏమైనప్పటికీ, చైనాను ఎదుర్కోవడం అనేది అమెరికా ప్రపంచ రాజకీయ, సైనిక వ్యూహ దృష్టి. అధికారికంగా ఇంకా నాటో సభ్యదేశం కానప్పటికీ, ఉక్రెయిన్ ఇప్పటికే దానితో అధికారిక ‘స్నేహాన్ని’ ఏర్పరచుకుంది. నాటో భాగస్వామ్యంతో పదేపదే యుద్ధ క్రీడల్ని ప్రదర్శించింది. ఇటీవలి ఒకదానిలో, పొరుగు దేశం మద్దతుతో వేర్పాటువాదుల కారణంగా కోల్పోయిన భూభాగాన్ని తిరిగి పొందడంకోసం శిక్షణ పొందడం. అంతకంటే స్పష్టంగా ఉండదు. డ్రోన్‌లను మోహరించడం ద్వారా అర్మేనియా నుండి నాగోర్నో-కరాబాఖ్‌ను తిరిగి స్వాధీనం చేసుకోవడంలో అజర్‌బైజాన్, తన చిన్న సాయుధ బలంతో సాధించిన విజయం ఈ యుద్ధ క్రీడకు ముఖ్యమైన మార్గదర్శకత్వాన్ని అందించింది. ఈ పరిణామాల దృష్ట్యా ఆలస్యం చేయకుండా చర్యలు తీసుకోవాలని పుతిన్ నిర్ణయించుకుని వుండవచ్చు. చైనా విషయంలో నిమగ్నమై వుండడం వల్ల అమెరికా పెద్దగా ఆసక్తి చూపదని కూడా అతను లెక్కించి ఉండవచ్చు.

యుద్ధం రాజకీయాలకు కొనసాగింపు. నిర్దిష్ట రాజకీయ లక్ష్యాలను సాధించుకోవడానికి దేశాలు యుద్ధం చేస్తాయి. రష్యా వ్యతిరేక చర్యలను అనుమతించని పాలనను కీవ్‌లో ఏర్పాటు చేయడం, NATO విస్తరణను నిరోధించడం, రష్యా సామ్రాజ్యవాద ప్రయోజనాలను నిర్ధారించే కొత్త భద్రత/శాంతి ఒప్పందాన్ని యూరప్‌లో తీసుకురావడం – పుతిన్ రాజకీయ లక్ష్యాలు. అందుకే ఉక్రెయిన్‌ను ఆక్రమించే ఉద్దేశం రష్యాకు లేదని పదే పదే చెబుతున్నాడు. ఇందుకు విరుద్ధంగా, రష్యా తన లక్ష్యాలను నెరవేర్చుకోలేని పరిస్థితిని సృష్టించడానికి లేదా నిరంతరం సైనిక జోక్యాన్ని కొనసాగించడానికి అమెరికా సామ్రాజ్యవాదం ప్రయత్నిస్తోంది. ఎవరు విజయం సాధిస్తారనేది భవిష్యత్తులో తెలుస్తుంది. ఇంతలో, లక్షలాది మంది మానవులు చనిపోతారు, గాయపడతారు, వికలాంగులు అవుతారు, నిరాశ్రయులు, నిరుద్యోగులవుతారు. భయంకరమైన దుస్థితిని ఎదుర్కోబోతున్నారు. ఈ సామ్రాజ్యవాద వివాదంలో కోట్లాది రూపాయలు, డబ్బు, ఆస్తులు తగలబడుతున్నాయి. సూక్ష్మ  వైరస్‌ను ఎదుర్కోవడానికి, దాని బాధితులకు చికిత్స చేయడానికి లేని డబ్బు ఇప్పుడు మృత్యువును శాసించడానికి సమృద్ధిగా ప్రవహిస్తుంది. సామ్రాజ్యవాదం అంటే యుద్ధం. యుద్ధం ఏదో రీతిలో ఎల్లప్పుడూ చంపుతుంది.

ఉక్రేనియన్లు రష్యన్ దండయాత్రను ద్వేషిస్తారనడంలో సందేహం లేదు. అయినప్పటికీ, నేటి వరకు, ఈ ప్రజల వ్యతిరేకత జెలెన్స్కీ పాలన నుండి స్వతంత్రంగా సాయుధ ప్రతిఘటనగా ఏకమవుతున్న సూచన కనబడడం లేదు. యుద్ధం దీర్ఘకాలం కొనసాగితే, ఆక్రమిత ప్రాంతాలలోని ప్రజలు రష్యా పాలనలో జీవించవలసి వస్తే, ఇది ఖచ్చితంగా బయటపడుతుంది. పైగా, కీవ్‌లో కీలుబొమ్మ పాలనను ఏర్పాటు చేయడంలో పుతిన్ విజయం సాధించినా, ఉక్రెయిన్ లో  శాంతి ఏర్పడదు. దానికి వ్యతిరేకంగా ప్రతిఘటన, గెరిల్లా యుద్ధాల్ని మనం ఖచ్చితంగా ఆశించవచ్చు. అందువల్ల ఏదేమైనా రష్యా అక్కడ చిక్కుకుపోతుంది. ఆ దేశంలో శక్తివంతమైన యుద్ధ వ్యతిరేక భావాలు, నిరసనలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా యువతలో గమనించవచ్చు. రష్యన్ క్రిస్టియన్ చర్చి చురుకైన ప్రమేయంతో ఉద్భవించిన జింగోయిస్ట్ రష్యన్ జాతీయవాదం దీనిని నిరోధించడంలో విఫలమైంది. ఈ నిరసనలు ఉక్రెయిన్‌లో ప్రతిఘటనకు మరింత ఊపునిస్తాయి. ఇది జెలెన్స్కీ, అతని మిత్రదేశాలు ప్రోత్సహించిన ఉక్రేనియన్  దురహంకారాన్ని కూడా బలహీనపరుస్తుంది. ఆ విధంగా, యుద్ధం రష్యాలో కొత్త రాజకీయ జాగృతిని కలిగించింది. యుద్ధం దీర్ఘకాలం కొనసాగితే, అనుకున్న కాలావధిలో పుతిన్ తన యుద్ధ లక్ష్యాలను చేరుకోలేకపోతే, ఉక్రెయిన్‌లో ప్రతిఘటన శక్తివంతమై రష్యా సైన్యానికి భారీ నష్టాన్ని కలిగిస్తే, అది అతని పాలన అంతం కావడానికి కారణం కావచ్చు.

ప్రపంచం అస్తవ్యస్థ కాలంలోకి ప్రవేశిస్తోంది. గతంలో, చాలా కాలం పాటు రెండు అగ్రరాజ్యాల మధ్య – అమెరికా నేతృత్వంలోని సామ్రాజ్యవాద శిబిరం, సోవియట్ సోషల్ సామ్రాజ్యవాద నేతృత్వంలోని శిబిరం మధ్య వివాద సమయంలో సోషలిస్ట్ చైనా, అల్బేనియాల రాజకీయ, దౌత్యపరమైన జోక్యం, తద్వారా యిచ్చిన విప్లవాత్మక సందేశంతో ప్రపంచ ప్రజలు స్ఫూర్తి పొందారు. చైనాలో పెట్టుబడిదారీ విధానం పునరుద్ధరణ తర్వాత కూడా కొనసాగిన లేదా ఉద్భవించిన విప్లవ పోరాటాలు ప్రపంచ స్థాయిలో ఆ పాత్రను పోషించాయి. నేడు సోషలిస్టు దేశాలు లేవు. కమ్యూనిస్టు పార్టీల నేతృత్వంలో జరిగిన విప్లవ పోరాటాలు చాలా తక్కువ. అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమం ఇంకా బలహీనంగానే ఉంది. అందువల్ల, ఈ అస్తవ్యస్థతను విప్లవం వైపు మళ్లించడం చాలా కష్టమైన పని. అయితే, గుర్తించాల్సిన మరొక విషయం ప్రజల చైతన్యంలో వచ్చిన మార్పు. కోవిడ్ విపత్తు సమయంలో వారి అనుభవాల ఫలితంగా వచ్చిన మార్పును ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం ఉంది.  అభివృద్ధి చెందిన దేశాల్లో, మూడవ ప్రపంచ దేశాల్లోనూ పాలకుల అసమర్థత, వారి అమానవీయ విధానం తీక్షణంగా బట్టబయలైంది. కోట్లాది మంది ప్రాణనష్టానికి వైరస్ కంటే, దీనితో చాలా ఎక్కువ సంబంధం ఉందని ప్రజలు చూశారు. పాలకులు చెప్పినదానికి భిన్నమైన నిజం ఉందని, కాబట్టి వారిని  విశ్వసించలేమనే ఆలోచన ప్రపంచంలో విస్తృతంగా వ్యాపించింది. అనేక దేశాల్లో ప్రభుత్వ, పాలకులపై వ్యతిరేకతా భావం, ప్రతికూలత  కనిపిస్తోంది.

 చాలా తరచుగా ఇది ఆందోళనలుగా రూపాంతరం చెందుతుంది. ప్రత్యర్థి పక్షాలు భిన్న వాదనలు చేస్తున్న ఈ పరిస్థితిలో, కమ్యూనిస్టు శక్తులు, అభ్యుదయవాదులు, ఈ వాదనలకు అంతర్లీనంగా ఉన్న సంకుచిత సామ్రాజ్యవాద ప్రయోజనాలను బహిర్గతం చేయడంపై దృష్టి సారించి, ప్రజలను అప్రమత్తం చేస్తే, వారు త్వరగా నిజాన్ని అర్థం చేసుకుంటారు. ఈ శక్తులు బలహీన స్థితిలో ఉన్నప్పటికీ ఈ అస్తవ్యస్థతను విప్లవానికి అనుకూలంగా మార్చుకోగలుగుతారు. ఇలా చేసే  అవకాశం పూర్తిగా ఉంది. వారు సరైన రాజకీయ అవగాహన, ఆచరణ ద్వారా దీనిని నిజం చేసే దిశలో ముందుకు సాగాలి. ఎవరో ఒక పోటీదారుడి వెంబడిపోవడం అంటే  ఈ అవకాశాన్ని కోల్పోవడమే అవుతుంది.

(01-03-2022)

Leave a Reply