సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ళ పసిపాపను అత్యంత దుర్మార్గంగా అత్యాచారం చేసి చంపిన రాజు రైలు పట్టాలపై శవమయ్యాడు. రాజు ఆత్మహత్య చేసుకున్నాడా, అతన్ని చంపేసి పట్టాలపై పడేశారా అన్న విషయంపై అనుమానాలున్నాయి కాని జనం న్యాయం జరిగిందని ఊపిరి పీల్చుకున్నారు. నిలువెల్లా గగుర్పాటు కలిగించిన సైదాబాద్ సంఘటనకు చలించని మనసు లేదు. ఎంత మంది తమ పిల్లలని పొదువుకొని గుండెలు గుబగుబలాడగా దుఃఖితులై ఉంటారో అందరూ ఆ పని చేసినవాడ్ని ఏం చేసినా పాపం లేదని అనుకొని ఉంటారు. అందరూ శపించినట్లుగానే రాజు దిక్కులేని చావు చచ్చిపోయాడు. న్యాయం జరిగిందని చాలా మంది అనుకుంటున్నారు. నిజంగా న్యాయం జరిగిందా? అసలు న్యాయం జరగడం అంటే ఏమిటి?

2008 లో ఇద్దరు అమ్మాయిలపై యాసిడ్ దాడి చేసిన ముగ్గురు యువకులను పోలీసులు కాల్చి చంపారు. ఇప్పటి లాగే న్యాయం జరిగిందని జనం అనుకున్నారు. అక్కడ అసలు విషయం మరుగున పడిపోయిందని ఎవరో గాని గ్రహించలేదు. రూల్ ఆఫ్ లా, చట్టం గురించి మాట్లాడిన పౌరహక్కుల సంఘాలను హేళన చేసారు. ఇప్పుడైతే ట్రోల్ చేస్తున్నారు. ఈ వాతావరణంలో అంతో ఇంతో ఆలోచనా శక్తి ఉండి, విషయాల్ని లోతుగా పరిశీలించగలిగే వాళ్ళు కూడా గందరగోళ పడుతున్నారు. ఇంతకీ 2008 కేసులో అసలు విషయం ఏమిటంటే బాధితురాలు యాసిడ్ దాడి కంటే ముందే తనపై జరిగే వేధింపుల గురించి పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని సంఘటన జరిగినప్పుడు జనం విమర్శించారు. అసలు ఎన్ని కేసులు పోలీస్ స్టేషన్ల దాకా పోతున్నాయని, పోయినా ఎన్నిటిని నమోదు చేస్తున్నారని, చేసినా ఎన్నిటిపై చర్య తీసుకుంటున్నారని ఒక చర్చ జరిగింది. ప్రేమ పేరుతో జరుగుతున్న దాడులపై కూడా ఏంతో మంది స్పందించారు. వంకర మాటలు, ఆడపిల్లలది కూడా తప్పనే కామెంట్లు కూడా ఉన్నాయనుకోండి. సమాజంలో మార్పు కోసం జరుగుతున్న ఒక ఆరోగ్యకరమైన చర్చ ప్రభుత్వాలకు పట్టదు. అవి అట్లాంటి వాతావరణంలో కూడా తమకు లాభించే పని ఏదై ఉంటుందని ఆలోచిస్తాయి. కఠినమైన చట్టాలు చేయాలని ఒక వైపు, నిందితులను చంపేయాలని ఒకవైపు ఆవేశపరులు డిమాండ్ చేస్తున్నారు. ఈ రెండూ రాజ్యానికి చాలా బాలాన్నిచ్చేవి. ప్రజలు ఆలోచించకుండా, ఒక పాజిటివ్ మార్పుకు చొరవ చేయకుండా చేసేవి. ఆ ముగ్గురు పోకిరి పిల్లల్ని చంపేశాక అప్పటి వరకూ పోలీసులను, ప్రభుత్వాన్ని విమర్శించిన ప్రజలు జయజయధ్వనులు చేశారు. అమ్మాయి కంప్లైంట్ మీద కనీసం స్పందించని ఆ పోలీసులే హత్యలు చేశాక హీరోలయ్యారు. సరిగా ఇదే 2019 లో రిపీట్ అయింది. రెండు చోట్లా అదే పోలీసు అధికారి కావడం కాకతాళీయం కావొచ్చు, కాకపోవచ్చు. కానీ ప్రభుత్వానికి, పోలీసులకు ఒక సులభమైన పరిష్కార మార్గం దొరికింది.

ఇక్కడ ఇంకో సంఘటన కూడా చెప్పుకోవాలి. 2007 లో వాకపల్లి అనే ఆదివాసీ పల్లెపై ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పార్టీ పోలీసులు దాడి చేసి 11 మంది మహిళల్ని రేప్ చేశారు. ఈ సంఘటన మీద మహిళా సంఘాలు, హక్కుల సంఘాలు ఏళ్ల తరబడి పోరాటం చేశాయి. బాధితులు ఎన్నో బాధలు, బెదిరింపులు, అవమానాలు కూడా ఎదుర్కొని తమకు న్యాయం చేయాలని కోర్టుకెళ్లారు. నిందితులు 13 మందిపై కేసు నడిచింది. న్యాయమైతే జరగలేదు. ఏ పోకిరీ వెధవో తప్పు చేస్తే ఎన్ కౌంటర్ చేయాలని డిమాండ్ చేస్తారు. పోలీసులే తప్పు చేస్తే?? వాళ్ళను ఎన్ కౌంటర్ చేయమనే దమ్ము ఎవరికైనా ఉందా? డబ్బు, పరపతి, హోదా ఉన్నవాళ్ళు నేరం చేస్తే? వాళ్ళను కనీసం అరెస్ట్ చేస్తారా? ఆయేషా మీరా అత్యాచారం, హత్య కేసులో నిందితులు ఇప్పుడు అమెరికాలో హ్యాపీగా ఉన్నారు. వాళ్ళను ఎన్ కౌంటర్ కాదు కదా, వాళ్ళ పేర్లు కూడా బైటికి రానివ్వకుండా పోలీసులు జాగ్రత్త పడ్డారు. సత్యం బాబు అనే ఒక అనామకుణ్ణి తెరపైకి తీసుకొచ్చి అతన్ని చిత్ర హింసలు పెట్టి చివరికి నేరం రుజువు చేయలేక కొన్నేళ్ళ తర్వాత వదిలేశారు. ఇక్కడ సత్యం బాబును చంపేసి ఉంటే కేసు పూర్తిగా మూతపడేది. కానీ అప్పటికే ఈ కేసును తప్పుదారి పట్టిస్తున్నారని, నిందితులు వేరే అని ఆయేషా తల్లిదండ్రులు అనేకసార్లు మీడియా ముందు చెప్పారు. నిందితుడిని చంపడం తప్పు కాదు అని ఆమోదం దొరికితే, ఏ మాత్రం అవకాశం ఉన్నా పోలీసులు సత్యం బాబు లాంటి అమాయకులను చంపేసి జనం ముందు హీరోలుగా నిలబడతారు. ఎంతో మందిని ఇళ్ల నుండి పట్టుకుపోయి చంపేసి, నక్సలైట్ బట్టలు తొడిగి ఎదురు కాల్పులు జరిగాయని కథనాలు చెప్పిన చరిత్ర మన పోలీసులకుంది.  

రాజు వంటి పోకిరిని, కనీస మానవత్వం లేని దుర్మార్గున్ని చంపితే తప్పేంటి అని అడుగుతున్నారు. రాజు దుర్మార్గుడే. కానీ రాజు కన్నా దుర్మార్గులున్నారు. సింగరేణి కాలనీలు ఒకప్పుడు పోరాటాలకు, గొప్ప ప్రజా చైతన్యానికి కేంద్రాలు. వరంగల్ కూడా అంతే కదా! ప్రజల ఉమ్మడి చైతన్యం నేరాల్ని జరక్కుండా నిరోధిస్తుంది. తాగి, రోడ్ల మీద అసభ్యంగా అమ్మాయిల మీద కామెంట్ చేయడానికి, పిచ్చెక్కినట్లు బైకులు నడిపి ఉన్మాదం ప్రదర్శించడానికి అటువంటి సమాజం అనుమతించదు. ఆ సమాజంలో ప్రజా చైతన్యాన్ని చంపేసి, సారాయి పారించి, డ్రగ్స్ పంచి పెట్టి, బెట్టింగ్ గ్యాంగులను నడిపించి, రౌడీ మూకలను ప్రోత్సహించి నేరసామ్రాజ్యాన్ని తయారు చేసినవాళ్ళు రాజు కన్నా దుర్మార్గులా, కాదా? ఈ దుర్మార్గులలో డ్రగ్ మాఫియా దగ్గరి నుండి, స్థానిక నాయకులు, పోలీసులు, అన్నిటినీ అలా కొనసాగించే ప్రభుత్వం ఉంది. అదంతా చాలా పెద్ద విషయం. ఇప్పటికిప్పుడు న్యాయం చేయాలంటే ఏం చేయాలి? అని కూడా అడుగుతున్నారు. ఒకటే సమాధానం. ఇప్పటికిప్పుడు న్యాయం చేయాలంటే పై చెత్తను తొలగించే పని ఇప్పుడే మొదలు పెట్టాలి. ఒక దోమను కసితీరా చంపి పండగ చేసుకోవడం కాదు.

రాజు దుర్మార్గుడే అయినా రాజును చంపడం రాజ్యాంగం ప్రకారం, రూల్ ఆఫ్ లా ప్రకారం తప్పు. (రాజ్యాంగ విలువల గురించి గొప్పగా మాట్లాడే మేధావులు కొందరు దళిత అమ్మాయిలపై అత్యాచారం జరిగితే, రాజ్యాంగ విరుద్ధంగా నిందితుల్ని చంపాలి అని డిమాండ్ చేయడం విషాదం.) ఆధునిక రాజ్యాంగాలు నేర మూలాలను చూడాలంటాయి. నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో విచారించేది అందుకే. నిర్భయ కేసులో నిందితుల్ని విచారించినప్పుడు షాకింగ్ విషయాలు బైట పడ్డాయి. ఇంచు మించు వాళ్ళలా ఆలోచించేవాళ్ళు బహుశా ప్రతి ఇంట్లోనూ ఉంటారు కదా అనిపించింది. ఇప్పటి సంఘటన మరీ దారుణం. చిన్న పిల్లలను చూస్తే ఎవరికైనా ప్రేమ, అప్యాయతా పొంగుకొస్తాయి. మనలోని వికృతాలన్నీ వాళ్ళ అమాయకపు చూపుల్లో, ముద్దు మాటల్లో, నవ్వుల్లో కడిగేసుకుంటాము. కానీ అంతలా హింసించాలని వాడికి ఎందుకనిపించింది? సమాధానం వేతకాలా, వద్దా? రాజు లాంటి వాళ్ళు సమాజంలో ఉన్నారు కాబట్టి ‘ఎందుకు’ అనే ప్రశ్నకు సమాధానం వేతకాల్సిందే. సమాధానం వెతకడానికి, స్తిమితంగా ఆలోచించడానికి ఓపిక ఉండాలి. సమాజం పట్ల బాధ్యత ఉండాలి. ప్రభుత్వమైతే బాధ్యత పడటం కాదు, కనీసం ఇష్టపడదు. ఎందుకంటే మూలాలను వెదకడం ప్రారంభిస్తే తాను కూడా దోషి అవుతుంది. నేర వ్యవస్థను, చీకటి సామ్రాజ్యాలను నడిపే వ్యవస్థకు రాజ్యం కాపలాదారు. అదెట్లా కాపుగాస్తుందో ‘మాయ’ కథలో రావిశాస్త్రి చెప్తాడు.

సమాజంలో తక్కిన నేరాల కన్నా లైంగిక నేరాలను ప్రత్యేకంగా చూడాల్సి వస్తుంది. మన సమాజంలో సెక్స్ ఎడ్యుకేషన్ అంటే పెద్ద బూతులా చూస్తారు. ఇట్లా మూసిపెట్టినన్ని రోజులూ తప్పుడు మార్గాలు తెరుచుకుంటాయి. ఈ విషయంలో శాస్త్రీయంగా, సామాజికంగా, ప్రజాస్వామికంగా ఆలోచించలేని సమాజం ‘ప్రేమోన్మాదాలనీ’, ‘హత్యాచారాలనీ’ విచిత్రమైన పేర్లు పుట్టిస్తూ ఉంటుంది. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించే కాదు, సెక్స్ లో పరస్పర అంగీకారం, ప్రేమ ఉండాలని ఏ స్థాయిలోనైనా పిల్లలకు నేర్పిస్తున్నామా అనేది పెద్ద ప్రశ్న. చాలా ప్రాథమికమైనది – ప్రేమలు, పెళ్ళిళ్ళ విషయంలోనే  విధినిషేధాలు, విపరీత ధోరణులు ఉంటే సెక్స్ గురించి శాస్త్రీయంగా, ప్రజాస్వామికంగా ఆలోచించే అవకాశమే ఉండదు. సవ్యంగా ఆలోచించడం, అర్థం చేసుకోడం నేర్పకపోతే మనిషిలో ప్రేమ రాహిత్యం, సెక్స్ కోరికలు, డిప్రెషన్ అన్నీ వికృతంగా బైటికొస్తాయి. మార్కెట్ సంస్కృతి, సినిమాలు, పోర్న్ వీడియోలు వీటికి ఎంత కారణమో మన సమాజంలో వేళ్లూనుకున్న సనాతన ఫ్యూడల్ భావాలు అంతకన్నా ఎక్కువ కారణం. మగవాడి అవసరాలు, కోరికలు, పితృస్వామిక కుటుంబం కేంద్రంగానే సెక్స్ నీతి కూడా ఉంటుంది. సంసారం అనగానే మగవాడిని ఎట్లా సుఖపెట్టాలి అని స్త్రీలకు ఎన్ని సూక్తులు చెబుతారో. పితృస్వామ్యం ‘సుఖం’ అనే విష‌యంలో మ‌గ‌వాళ్ల‌ను ఎంత బ‌రితెగింపుకు తీసికెళుతుంది అంటే దానికి స్త్రీ ఇష్టాయిష్టాలతో పనిలేదు.  భార్య అయితే ఇక చెప్పనవసరం లేదు. ఎప్పుడైనా ఎట్లయినా వాడుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు.

మొత్తంగా ఆడవాళ్ళంటే చులకన, వాళ్ళను హేళన చేయడం సరదా. అమ్మాయిలంటే ఫిగర్స్, ఐటమ్స్ తప్ప సాటి మనుషులు కాదు. మగవాడికి కోరికలుంటాయి కాబట్టి అత్యాచారాలు జరుగుతాయి. స్త్రీలు వాటిని ప్రేరేపించకుండా జాగ్రత్త పడాలి. ఇంట్లోనే ఉండాలి, ఒంటరిగా బైటికి పోకూడదు, ముఖం కూడా కనిపించకుండా బట్టలు వేసుకోవాలి వగైరా వగైరా… ఇట్లా రేపిస్ట్ కు ముందుగానే ఒక సమర్థన ఉంటుంది. వాళ్ళు అట్లా ఉంటే వీళ్ళట్లా చేయకుండా ఎలా ఉంటారు అని సాధారణ ప్రజల దగ్గరనుండి మంత్రుల దాకా మాట్లాడతారు.

ఎంతగా అత్యాచారాలు జరుగుతాయో అమ్మాయిల స్వేచ్చ మీద అంత నియంత్రణ పేరుగుతున్నదంటే ఎంత అపసవ్య ఆలోచనా ధోరణితో, ఎంత కరడుగట్టిన పితృస్వామ్యంలో ఉన్నామో అర్థం అవుతుంది. అత్యాచారాలు జరుగుతున్నాయి కాబట్టి, ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు కాబట్టి ఆడపిల్లలకు చిన్న వయసులో పెళ్లి చేసేయాలనే ఆలోచన ఇటీవల పెరుగుతున్నది. కొన్ని ప్రాంతాల్లో బాల్యవివాహాలు కూడా పెరిగిపోతున్నాయి. ఇటీవలే రాజస్థాన్ ప్రభుత్వం (కాంగ్రెస్) బాల్యవివాహాలను రిజిస్టర్ చేయాలనే ఒక విచిత్రమైన బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. మనం వెనక్కిపోతున్నామా, ముందుకు పోతున్నామా అర్థం కావడం లేదు.

ఇదంతా ఎందుకు ఆలోచించాలి? జనాల బుర్రలకు ఎందుకు పదును పెట్టాలి? అప్పుడప్పుడూ ఒక ‘చిల్లర’ పోరగాన్ని చంపేస్తే సరిపోతుంది. అందరూ అన్నీ మర్చిపోతారు. ప్రభుత్వాన్ని, పోలీసులను చికాకు పెట్టే  మహిళా సంఘాలను, పౌరహక్కుల సంఘాలను జనాలే చూసుకుంటారు. ఏ ప్రజల గురించయితే ప్రజా సంఘాలు మాట్లాడతాయో, ఆ ప్రజలే వాళ్ళను తప్పుపట్టేలా చేయగలగడం ప్రభుత్వం సాధించిన తాత్కాలిక విజయం. కానీ, సమస్య పరిష్కారంకానంత వరకు ప్రశ్న ఆగిపోదు.

One thought on “రాజును చంపడం ఎందుకు తప్పు?

  1. 👍✊🙏
    మా సత్యం
    వసంత మేఘం లో (19-9-2021)
    “రాజును చంపడం
    ఎందుకు తప్పు?”
    పీ. వరలక్ష్మి గారు రాసిన వ్యాసంలో ఆవేదన, ఆవేశం, ఆలోచనతో సమ్మిళితమై మనోవిశ్లేషణ కోణంలో వ్యవస్థలో నిక్షిప్తమై ఉన్న రుగ్మతలను విశ్లేషిస్తూ చాలా క్లిష్టమైన సమస్యలను
    సమాజంలోని బుద్ధి జీవుల ముందు ప్రశ్నలు రూపంలో ప్రశ్నిస్తున్నాయి?. అందరిని ఆలోచింపజేస్తుంది.

Leave a Reply