మార్క్ ట్వైన్ రాసిన “ప్రిన్స్ అండ్ పాపర్” ఇంగ్లీష్ నవలకు తెలుగు అనువాదం ఇది. సాహిత్యంలో కధలూ, నవలలనూ ఫిక్షన్ అంటారు. అంటే, కల్పన అని అర్ధం. కధలు యెంత సహజంగా రాసినా, యెంత సమాజాన్ని ప్రతిబింబించినా అవి కల్పనలే. ఆ పాత్రలు బయట ఎక్కడా కనిపించవు కదా! అయితే, కొన్ని కధలు ఒక కాలం నాటి చారిత్రక పరిస్థితులను చూపిస్తాయి. ఆనాటి ప్రజల జీవన స్థితిగతులు ఎలా వున్నాయో చెబుతాయి. ఈ “రాజూ-పేదా“ అలాంటి నవలే.

1535 నాటి లండన్ నగరం. దుర్భర దారిద్ర్యం, ఆకలీ, భిక్షాటనా, దొంగతనాలూ. ఒకవైపు అంతులేని దుఃఖం, కన్నీళ్ళూ. హద్దులు లేని  సిరిసంపదలూ, అంతులేని భోగ భాగ్యాలూ. అధికారం, హోదాలూ మరో వైపూ. ఇదీ అందరూ అనుకునే అందమైన  ఆ మహా నగర ద్రుశ్యం. అలాంటి నగరంలో ఒకే రోజు ఇద్దరు మగపిల్లలు పుట్టారు. ఒకరు రాజ సౌధంలో ఎనిమిదవ రాజు హెన్రీ కి ఎడ్వర్డ్ ట్యాడర్. మరొకడు పేదవాడు జాన్ కాంటీ కొడుకు టామ్ కాంటి. ఆశ్చర్యకరంగా ఒక తల్లి పిల్లలు కాకపోయినా ఇద్దరూ ఒకే పోలికలతో పుడతారు. వాళ్ళు పన్నెండేళ్ళ వారవుతారు. ఒకానొక విపత్కర పరిస్థితుల్లో వారి స్థానాలు మారిపోతాయి.

రాచబిడ్డ అయిన ఎడ్వర్డ్, కాంటి రూపంలో దారిద్యాన్ని అనుభవిస్తాడు. “నేను కాంటిని కాదు. యువరాజుని” అని అందరితోనూ చెబుతుంటాడు. ఎవరూ నమ్మరు. పైగా పిచ్చిక్కింది అనుకుంటారు. తండ్రి వట్టి జూదరి. తాగుబోతు. ఇంట్లో ఎప్పుడూ దారిద్ర్యం తాండవిస్తుంటుంది. తినడానికి సరిగ్గా తిండి వుండదు. తండ్రి  చేత తన్నులు తింటాడు. ఆకలికి బయటకు వెళ్లి భిక్షం ఎత్తుతాడు. అలాంటి పరిస్థితుల్లో జేమ్స్ హేండన్, ఎడ్వర్డ్ కి చాలా సహాయపడతాడు. అతన్ని రాజు గా గుర్తుపట్టకపోయినా, సాటి మనిషిగా మానవతా ద్రుక్పధంతో శక్తికి మించి సహాయపడతాడు. ఒకానొక సందర్భంలో ఎడ్వర్డ్ బదులు హేండన్ కొరడా దెబ్బలు కూడా  తింటాడు. [ఈ పాత్రను సినిమాలో రేలంగి వేశారు]

ఇక ఎడ్వర్డ్ రూపంలో వున్న కాంటి. నేను రాజుని కాను అని చెప్పినా ఎవరూ నమ్మరు. యువరాజుకు పిచ్చెక్కిందని అనుకుంటారు.తండ్రి కూడా అలాగే అనుకుంటాడు. చుట్టూ పరిచారికలు కాలు కిందపెట్టకుండా సేవలు చేస్తుంటారు. ఎన్నడూ కలలో కూడా ఊహించని భోజనం. అంతా అయోమయంగా వుంటుంది. మరొక పెద్ద గదిలో తండ్రికి అనారోగ్యం. రాజ వైద్యులు, వైద్యం చేస్తుంటారు. తండ్రి రమ్మనమని కబురు చేస్తాడు. సమజపుపోకడలూ, రాజ భవనాల్లో, కుట్రలూ, కుతంత్రాలూ, వీటన్నిటి మధ్యా చాలా అప్రమత్తంగా వుండాలి. అని రాజు అనేవాడు ఎలా వుండాలో చెప్పి కన్ను మూస్తాడు. తను బ్రతికి ఉండగానే కొడుక్కి పట్టాభిషేకం చేయాలని అనుకుంటాడు కానీ, అది జరగక ముందే చనిపోతాడు. అయితే, రాజ్యాధికారం మాత్రం ఎడ్వర్డ్ రూపంలో వున్న కాంటికి వచ్చేస్తుంది.

కొద్ది వారలే అయినా ప్రజల్ని దయార్ద హ్రుదయం పరిపాలన సాగిస్తాడు. నిర్ధిషి అని తెలిసిన ఒకరిని వురిశిక్ష నుండి తప్పిస్తాడు. అనేక సందర్భాల్లో తన వుదరత్వాన్ని చూపుతాడు. పక్కనున్న అధికారులులకు ఇది ఆశ్చర్యంగా వుంటుంది. ఎందుకంటే, వాళ్ళు పెద్ద రాజుగారి దగ్గర నుండి పనిచేస్తున్నారు. పెద్దరాజు చాలా కర్కసుడు. కానీ, యువరాజు నిర్ణయాన్ని కాదనే ధైర్యం ఎవరికీ లేదు.

కొద్ది వారాల తర్వాత నిజం తెలిసి, ఎవరి స్థానాల్లోకి వారు మారిపోతారు. స్వల్ప కాలం పేదరికం అనుభవించినా ఎడ్వర్డ్ తరవాత రోజుల్లో అనుభవాన్ని మరచిపోలేదు.దయా, జాలీ, దుఃఖం, కన్నీళ్ళూ లాంటి మాటలకు నిజమైన అర్ధాలను అనుభవ పూర్వకంగా తెలుసుకున్నాడు కాబట్టీ, తన కొత్త ఆలోచనలకు అనుగుణంగా ప్రవర్తిస్తాడు. కొందరు అధికారులు “ప్రభూ! మీరు మితిమీరిన దయ చూపిస్తున్నారు. “అంటే, “నువ్వు భోగాభాగ్యల్లో పొర్లాడేవాడివి దుఃఖం, అన్యాయం, కన్నీళ్లు యెంత తీవ్రమైనవో నీకేం తెలుసు?నాకూ, నా ప్రజలకూ తెలుసు. నీవు యెంత ప్రయత్నించినా అర్ధం కావు.”అని మందలిస్తాడు.

తను పేదరికం అనుభవించిన రోజుల్లో తనకు సహకరించిన వారందరినీ తగు రీతిన సత్కరిస్తాడు. సంవత్సరాలు గడచిపోతున్నాయి. ఇదంతా ప్రజలకు మర్చిపోతున్నారు.   టాం కాంటీ వ్రుద్దుడయ్యాడు.  తను మాత్రం రాజు దుస్తులు వేసుకొని వీధుల్లో తిరుగుతుంటాడు. అతనికి రాచరికపు దుస్తులు వేసుకోవడానికి ప్రత్యేక అనుమతి వుంది. “ఇతను కూడా ఒకప్పుడు రాజేనట. కొద్ది వారాలు దేశాన్ని పరిపాలించాడట.”అని వీధుల్లో నుండి వెళుతుంటే కొత్త తరం యువకులు అనుకుంటారు.

ఎంతో ప్రతిభావంతంగా అనువదించిన ‘రాజూ-పేదా’ నవలను ఈ దిగువ వాక్యాలతో ముగిస్తాడు.”ఆనాటికీ, ఈనాటికీ చాలా తేడా వుంది. ఈ రోజుల్లో మనం ఏవి అక్రమాలనీ, అన్యాయలనీ అనుకుంటున్నామో, అవి ఆరోజుల్లో న్యాయ సమ్మతాలైన మామూలు విషయాలు. కాబట్టి ఆ కాలాన్ని బట్టి చుస్తే, ఎడ్వర్డ్  పరిపాలన చాలా దయావంతమైనదే అని చెప్పాలి. ఈ నవల ఇదే పేరుతో చలన చిత్రంగా కూడా వచ్చింది.         

తర్వాత కాలంలో ఎడ్వర్డ్ ఎలా పాలించి వుంటాడు అని మనం ఊహిస్తే…దేశంలో మరికొన్ని గంజి కేంద్రాలూ,  ధర్మ సత్రాలూ  స్థాపించి ఉండవచ్చు. కొంత పన్నులు తగ్గించవచ్చు, కొరడా దెబ్బలు లేకుండా చేయవచ్చు. అంతే, అంతకన్నా ప్రజారంజకమైన పాలన వుండదు. అయితే, చుట్టుపక్కల వున్న ఇతర రాజులతో పోలిస్తే, అది చాలా ఎక్కువనే అనుకోవాలి. ఆ పాటి సంస్కరణలకే ప్రజలు సంతోషపడతారు. ”మీ రాజుగారు  కన్నా మా రాజుగారు చాలా మంచి వారు” అంటారు పొరుగూరి వాళ్ళతో. ‘గారు’ అనే సంభోదన నిత్య జీవితం లో కలసి పోతుంది. ‘శ్రమ సంబంధాలూ, శ్రమ దోపిడీ’ అనే పదాలు అప్పటికి ఇంకా శతాబ్దాల దూరంలో వున్నాయి. అయితే,  ‘రాజు‘ అనే వాడు ఎవడైనా, ధనిక వర్గపు ప్రతినిధే. ఆనాటికి వున్న ధర్మాలూ, నీతులూ ధనిక వర్గానికి అనుకూలంగానే వుంటాయి. కాబట్టి రాజు ఆ చట్రంలో వుండి, దానికి అనుగుణంగా, కొంత పరిమితిలతోనే చేయగలడు. అంతకు మించి చేయడు. చేయలేడు. ధనిక వర్గ ప్రయోజనాలు కాపాడడానికే రాజు వుంటాడు. ఒకవేళ ఏ రాజుకైనా బుద్ది పుట్టి, అంతకన్నా ఎక్కువ చేద్దామని అనుకున్నాడనుకుందాం. అంటే, కొన్ని రకాల పన్నులు రద్దు చేయడం. పంటలో పన్ను భాగాన్ని బాగా తగ్గించడం. లాంటివి.

 అప్పుడేం జరుగుతుంది? రాజ్య నిర్వహణ కష్టమైపోతుంది. తమ విలాసాలూ, ఆడంబరాలూ తగ్గించుకోవాలి. దానికి ఏ రాజు ఒప్పుకోడు. పైగా  ధనికవర్గం “తమ పై వేసే పన్నులు తగ్గించడం మంచిదే గానీ, ఇతర పన్నులు వసూలు చేయాలి” అంటారు. ఈ కొత్త సంస్కరణలకి ధనిక వర్గం నుండి తీవ్ర వ్యతిరేకత మొదలవుతుంది. దానికి రాజు అంగీకరించకపోతే, రాజు మీదే ధనిక వర్గం, తిరుగుబాటు చేస్తారు. వున్న రాజుని దించేసి, తాము చెప్పినట్లు నడచుకొనే వాడిని, రాజుని చేసేస్తారు. అంత వరకూ ఏ రాజూ తెచ్చుకోడు. ఎందుకొచ్చిన లేనిపోని తంటా అనుకొని, బ్రతికినన్నాళ్లు విందులూ, విలాససాలూ అనుభవించి పోతాడు. ఏ రాజైనా అంతే. సాక్షాత్తు రాముడూ, ధర్మరాజు వచ్చి పరిపాలించినా అంతే.  ఆనాడే కాదు. ఈనాడు వున్న ప్రభుత్వలు కూడా ధనిక వర్గపు ప్రయోజనాలు కాపాడడానికే వున్నాయి. కాకపొతే పేర్లు మారాయి. అప్పుడు భూస్వాములే, ఇప్పుడు పెట్టుబడిదారులయ్యారు. అప్పుడు రాజులే, ఇప్పుడు చట్ట సభల్లో సభ్యులయ్యారు. దీనికి రుజువు అందరికీ కళ్ళ ముందు కనిపిస్తున్న నిజం. సామాన్యుడికి ఒక లక్ష రూపాయలు అప్పు ఇస్తే, ముక్కు పిండి వసూలు చేసే, బ్యాంకులు, వేల కోట్ల రూపాయలు  ఎగ్గొట్టీ దర్జాగా తిరుగుతున్న వాళ్ళను ఏమీ అనకపోవడం. ఎందుకని?

ఈ నవలలో 16 శతాబ్ధపు లండన్ నగరాన్ని చూడవచ్చు. పెద్ద నగరాలనగానే మనకు అందమైన రోడ్లూ, పెద్ద పెద్ద భవంతులూ కనిపిస్తాయి. కానీ, ఈ నవలలో లండన్ నగరపు దుర్భర దారిద్ర్యం. మురికి వాడలూ పేద ప్రజలు ఎంతటి నిక్రుష్ట బ్రతుకులు బ్రతుకుతున్నారో కనిపిస్తుంది. చెత్తా, చెదారం పక్కనున్న నదిలో పారవేయడం.  కలుషితమైపోయిన నదీ ప్రవాహం. ఏనాడైనా నగరాలు పెరగడానికి కారణం జనాభా పెరగడం. జనాభా పెరగడానికి కారణం. భారీ పారిశ్రామీకరణ. ఆనాటికి ఇంకా పరిశ్రమలు భారీగా ప్రారంభ కాకపోయినా చిన్న స్థాయిలో నైనా మొదలయ్యాయి. దాంతో బ్రతుకు తెరువు కోసం నగరాలకు వలసలు వస్తారు. దాంతో జనాభా పెరుగుతుంది. ఇదంతా వేరే చర్చ. కధలో నాటకీయత కాస్త ఎక్కువగా వున్నా, ఒకనాటి రాచరికపు వ్యవస్థను కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది. తప్పకుండా చదవండి. ఇదే కాదు మార్క్ ట్వైన్ రాసిన ‘హకల్ బెరీ ఫిన్’ కూడా చాలా బాగుంటుంది.

Leave a Reply