(మొట్టమొదట ఈ పుస్తకం గురించి రాయడానికి  నిన్న నేటికి, నేడు రేపటికి విమర్శనీయం అవుతుందని మనస్ఫూర్తిగా నమ్మడమే ప్రధాన కారణమని చెప్పాలి. అయితే నిన్నటి తప్పులను నేడు సరిచేయలేం. ఆ తప్పుల నుండి పాఠాలు నేర్చుకొని నేడు అటువంటివి జరగకుండా ఆచరించడమే సరియైనది. ఎందుకంటే –నిజమైన మార్క్సిస్టుల దృష్టిలో నేర్చుకోవడమంటే మారడమే.)

ఏ కాలపు మనుషుల జీవితాలైనా విలువలేనివేం కావు. కాని  విస్తృత సామాజిక సంబంధాలతో  కూడిన కొందరి జీవితానుభవాలు చాలా విలువైనవి. నిర్దిష్ట స్థల కాలాల జీవన వాస్తవికతను అవి సజీవంగా పట్టిస్తాయి. జీవన క్రమంలో స్వయం నిర్ణయపు  వ్యక్తిత్వ విశిష్టతలు, ఆత్మాభిమానపు స్పందనలు, సంవేదనలు ఎన్నెన్నో వారి అనుభవాలలో దాగి ఉంటాయి.

పైగా, ఒకవేళ మనుషులు  మెరుగైన, మౌలికమైన సామాజిక మార్పు క్రమంలో ఇచ్చాపూర్వకంగా భాగస్వాములయితే, వారి జీవితానుభవాలు ఎంతో సామాజిక, చారిత్రక ప్రాధాన్యతలను సంతరించుకుంటాయి. కనుకనే అలాంటి మనుషుల జ్ఞాపకాలను రికార్డ్ చేసిన  రచనలు కేవలం వారి ఆత్మకథలుగా మాత్రమే కాదు, అవి నిర్దిష్ట స్థల, కాలాలకు సంబంధించిన చలన  జీవితచిత్రాలుగా చరిత్రలో నిలుస్తాయి. వాటిలో ఇతరులనే కాకుండా మనల్ని మనం కూడా (ఆత్మ)విమర్శనాత్మకంగా పరిశీలించి చూసుకొని సరిగ్గా అర్థం చేసుకోగలుగుతాం. అలాంటి అసామాన్య జీవితానుభవాల ఒకానొక స్వీయ  కథనమే కొండపల్లి కోటేశ్వరమ్మ గారు రాసిన  “నిర్జన వారధి” అనే యీ  పుస్తకం.

కొండపల్లి కోటేశ్వరమ్మ గారు 1918 లో కృష్ణా జిల్లా పామర్రు లో జన్మించారు. ఆమెకు 7 సంవత్సరాలకే తన మామతో బాల్య వివాహం అయ్యింది. ఆ తర్వాత రెండు సంవత్సరాల లోపే తన భర్త మరణించగా ఆమె 9 సంవత్సరాల వయసులోనే బాల వితంతువు అయింది. కేవలం పది సంవత్సరాల వయసులోనే ఆమె అనేక చోట్ల ఎన్నో దేశభక్తి గీతాలను పాడి భారత స్వాతంత్ర్య పోరాటంలో చురుకైన పాత్ర పోషించింది. మళ్లీ పంతొమ్మిది సంవత్సరాల వయసున్నప్పుడు  ఆమెను మొదటి తరం కమ్యూనిస్టు నాయకుడు కొండపల్లి సీతారామయ్య గారు వితంతు వివాహం చేసుకున్నారు. పుచ్చలపల్లి సుందరయ్య గారి లాంటి వాళ్లతో కలిసి ఇద్దరూ  ఆనాటి ఉమ్మడి భారత కమ్యూనిస్టు పార్టీ కార్యకలాపాల్లో పాల్గొన్నారు. తెలంగాణ సాయుధ పోరాట విరమణ తరువాత రెండేళ్ళకు తన భర్త విడిచిపెట్టడంతో ఆమె ఒంటరి వివాహిత మహిళ అయింది.

అప్పటి నుండి ఒంటరి పోరాటం చేస్తూనే ఆమె మెట్రికులేషన్ చదివింది. ఆ తర్వాత కాలంలో కొన్ని రచనలు చేస్తూ, రేడియోకు ప్రోగ్రాంలు ఇస్తూ, పాలిటెక్నిక్ కాలేజీ లో మాట్రన్ గా పని చేస్తూ డబ్బు సంపాదించి స్వతంత్రంగా ఆత్మాభిమానంతో బతికింది.ఆమెకు ఒక కూతురు కరుణ,ఒక కొడుకు చంద్రశేఖర్  ఉండేవారు. చంద్రశేఖర్ వరంగల్ రీజినల్ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతూ విప్లవోద్యమం లోకి వెళ్లి అమరుడయ్యాడు. కూతురు కరుణ డాక్టరయ్యి  రమేష్ ను వివాహం చేసుకుని ఇద్దరు కూతుర్లను  కన్నది. వారు అనురాధ, సుధ గార్లు. ఆ తర్వాత కాలంలో కొన్ని అనూహ్యమైన పరిస్థితుల్లో కూతురు కరుణ కూడా మరణించింది.

బతికున్నంత కాలం కోటేశ్వరమ్మ అమ్మగా తన పిల్లలను ప్రేమించింది. ఒక స్త్రీగా ఆత్మాభిమానంతో స్వతంత్రంగా బతికింది. ఒక పౌరురాలిగా సమాజం పట్ల బాధ్యతలు నిర్వహించింది. కుమార్తె  మరణం తర్వాత ఆమె ఆనాటి తొలితరపు కమ్యూనిస్టు నేత చంద్ర రాజేశ్వర్ రావు గారి  వృద్ధాశ్రమంలో ఉండింది. ఆ తర్వాత అవసాన దశలో తన మనవరాలి దగ్గర విశాఖపట్నంలో ఉండి వందేళ్లు జీవించి తుదకు  2018 లో మరణించింది.

ఆమె ఒంటరి మహిళగా నైనా చదువుకొని  రచయితగా ఎదిగింది. 1972 లో  “అమ్మ చెప్పిన ఐదు గేయాలు” ; 19 91 లో “అశ్రు సమీక్షణం” , “సంఘమిత్ర కథలు” ; 2012లో “నిర్జన వారధి” లాంటి రచనలు ఆమె వెలువరించారు. నిర్జన వారధి అనే ఈ పుస్తకాన్ని 2015లో వి.బి. సౌమ్య గారు The Knife of Memory  పేరిట ఇంగ్లీషులోకి అనువదించారు.

ఓల్గా గారన్నట్లుగా  కొండపల్లి కోటేశ్వరమ్మ గారి జీవితం వ్యక్తిగతం, సామాజికం, రాజకీయం అనే సరిహద్దులు లేని జీవితం. కాబట్టి ఆమె జ్ఞాపకాల్లో గాని, అనుభవాల్లో గాని వైయక్తిక అంశాల కన్నా సామాజిక అంశాలే ఎక్కువగా కనబడతాయి. అవి ఎంత వ్యక్తిగతమో అంత  సామాజికం. అదేసమయంలో అవి ఎంత సామాజికమో అంత  సాంస్కృతికపరమైనవి, అంతే రాజకీయపరమైనవి  కూడా.

ఇలా మార్పు క్రమం ఏకకాలంలో వ్యక్తిగత, సాంస్కృతిక, రాజకీయ తలాలలో  కొనసాగుతున్నప్పుడు, మనుషుల పరస్పర అవగాహనల్లో  గాని, వైఖరుల్లో గాని  తేడాలు రావడం/ఉండడం ఎంత సహజమో, అవి మనుషుల సంబంధాలలో ప్రతిఫలించడం కూడా అంతే సహజం. అయితే ఆ తేడాలతో/ వైరుధ్యాలతో కూడిన మానవ సంబంధాల పట్ల తీసుకునే వైఖరులే మనుషుల (సైద్ధాంతిక) పరిపక్వతను తెలియజేస్తాయి. ఎందుకంటే, మనుషుల పరస్పర సంబంధాలలో  ప్రతిపాదించకుండా ఉండేది, లేదా మనుషుల సంబంధాలకు ఆవల ఉండేది ఏ (భావవాద) సిద్ధాంతమైనా అవుతుందేమో కాని  చారిత్రిక భౌతికవాద( మార్క్సిస్టు) సిద్ధాంతం మాత్రం కాదు. కనుక పరస్పర మానవ సంబంధాలలో ప్రతిఫలించే అంశం మనుషుల వ్యక్తిత్వాలలో ఇంకిపోయిన సైద్ధాంతిక అంశమే తప్ప వేరుగాదు.

పైన పేర్కొన్న దృష్టి కోణం లోంచి చూసినప్పుడు, కొండపల్లి కోటేశ్వరమ్మ గారి “నిర్జన వారధి” ఎన్నో పాఠాలు నేర్పే జీవితకథ. ఆమెది అనేక ఉద్యమాలతో ముడిపడి ఉన్న క్రియాశీలమైన జీవితం గనుక అది నల్లేరు మీద బండి నడకలా సాఫీగా సాగలేదు. పలు సంఘటిత ఉద్యమ నిర్మాణాలలో భాగంగా ఆమె జీవితం ఎన్నో ఆటుపోట్లకు గురైంది. అనంతమైన  దుఃఖం, వేదనా పేరుకపోయి మహా పర్వతమంత స్థాయికి  హెచ్చినప్పటికీ, ఆమె తనదైన వ్యక్తిత్వాన్ని చెక్కుచెదరని రీతిలో నిర్మాణం చేసుకున్నది. అనేక రకాల మనుషులతో సంబంధాలు నెరపుతూ తన వ్యక్తిత్వ పునాదిని బలోపేతం చేసుకున్నది.

తన జీవితంలో ఎదురైన అనేక కఠిన సందర్భాలలో, నిర్జన వాతావరణంలో ఒంటరి ఎడారులు ఎన్నో ఆమెను చుట్టుముట్టినప్పటికీ, ఆమె గడ్డకట్టుకపోయి గిడసబారలేదు. ఆమెలోని వ్యక్తిత్వ పునాదే ఒయాసిస్సు గా మారి ఒంటరిగానైనా సరే ఆమె జీవించి నిలిచింది, జీవచ్ఛవం కాలేదు. ఆమె మౌనంగా ప్రశ్నించింది. సున్నితంగా ప్రతిఘటించింది. మానవీయంగా పోరాడింది. కుటుంబం పట్ల, సమాజం పట్ల తన బాధ్యతను విస్మరించకుండా అనంతమైన ప్రేమమయిగా  ప్రవహించింది. అన్నింటికన్నా గొప్ప విషయం ఏమిటంటే– ఆమె ఎన్నడూ  పరాధీనురాలిగా ఉండకుండా స్వార్జితంతో జీవించి ఇతరులెందరికో సహాయపడింది. ఉద్యమ క్రమంలో తన  సాంగత్యం లోకి వచ్చిన మనుషులందరినీ ఆమె అంచనా వేసింది. ఈ పుస్తకంలో లో అనుబంధంగా అచ్చు వేసిన కథనాలే ప్రబలమైన రుజువులు. అవి కేవలం చివర  చేర్పులు చేసి జోడించబడినవి కాదు. ఆమె మనుషులతో ఏర్పరుచుకున్న  అనుబంధానికి గుర్తులుగా కూడా వాటిని మనం అర్థం చేసుకోవచ్చు. కనుక ఎవరు ఎంత గౌరవానికి అర్హులో  కూడా ఆమె విలువ కట్టిందని నిస్సందేహంగా చెప్పవచ్చు.

ఏ  ఉద్యమాల క్రమంలోనైనా  సామాన్యుల్లో కొందరు  అసామాన్యులుగా, మాన్యులుగా పరిణమించడం చాలా సహజం. అయితే ఆ మనుషుల అసామాన్యతను కేవలం వీరత్వంగా మాత్రమే చూస్తే, వారితో పాటు నడచిన ఎందరో  సామాన్యుల సాహసోపేత వైవిధ్యపూరిత ఆచరణలను, స్వయం నిర్ణయాధికార వ్యక్తిత్వ విశిష్టతలు మన  పరిగణనలోకి రాకుండా పోతాయి.  అలాగాక, ఎందరెందరో సామాన్యుల వైవిధ్యమైన సాహసాలు క్రోడీకరించబడితేనే ఆ కొందరు మనుషులు అసామాన్యులుగా మాన్యు(వీరు)లుగా పరిణమిస్తారనేది అక్షర సత్యం. అది మనుషుల అవగాహనలోకి రావాలంటే మౌలిక మార్పు క్రమంలో ప్రజల సాంస్కృతిక పార్శ్వానికుండే  పాత్ర గురించి లోతయిన ఎరుక ఉండాలి. అది లేకపోతే మౌలిక మార్పు క్రమానికి ప్రజా శ్రేణులు దూరమవుతారనేదే ఈ పుస్తకం నేర్పే ఈనాటి పాఠం.

ఇక ఈ పుస్తకానికి “నిర్జన వారధి” అనే శీర్షిక ఆమె అనుభవించిన భయంకరమైన ఒంటరితనానికి ప్రతీకగా పెట్టినట్టు అర్థమవుతుంది. భౌతిక వాస్తవం  రీత్యా అది నిజమే అయినప్పటికీ, కొండపల్లి కోటేశ్వరమ్మ గారు మానసికంగా ఎన్నడూ ఒంటరి కాదు. సామాజికమైన ఆలోచనలు చేసే ఒంటరి జీవి. అందుకే ఆమె ఒంటరి సామాజిక జీవి. కనుక నా దృష్టిలో ఆమె ఎప్పటికీ  ప్రేమమయి జన వారధియే.

Leave a Reply