ప్రజా క్షేత్రం గురించి బీజేపీకి బాగా తెలుసు. ఎంత బాగా తెలుసో అర్థమయ్యే కొద్దీ మనకు ఆందోళన పెరుగుతుంది. మామూలుగా  కామన్‌సెన్స్‌లో భాగంగా సంఫ్‌ుపరివార్‌  ఈ సమాజాన్ని మధ్య యుగాల్లోకి తీసికెళుతుందనే విమర్శ చాలా మంది చేస్తుంటారు. తన మీద ఇలాంటి అభిప్రాయం ఉన్న ఈ సమాజంతో  సంఫ్‌ు ఎట్లా వ్యవహరిస్తుంది? నిజంగానే ఈ దేశంలోకి ముస్లింలు రాకముందటి రోజులే ఉజ్వలమైనవని,  కాబట్టి  సమాజాన్ని  అక్కడికి తీసికెళతానని అనగలుగుతుందా? సంఫ్‌ుపరివార్‌కు ఇలాంటి భావజాలంలో కూడా ఉన్నది. ఒక ‘అద్భుతమైన’ గతాన్ని ఊహించి  చెప్పి, దాని చుట్టూ భావోద్వేగాలు లేవదీసి, ‘ఇతరుల’ మీద విద్వేష విషాన్ని నింపి, ‘తనదే’ అయిన గతంలోకి తీసికెళతానని ఎన్ని మాటలు చెప్పినా అది వర్క్‌ అవుట్‌ కాదని సంఫ్‌ుపరివార్‌కు తెలుసు.  గతంలోకి, గత కాలపు విలువల్లోకి తీసికెళతానని ఎవ్వరు చెప్పినా వినేవాళ్లు ఉండరు.

ప్రజాక్షేత్రంలో సంఫ్‌ుపరివార్‌ పని తీరు పూర్తిగా గతం మీద ఆధారపడిరది కాదని చెప్పడానికే ఇదంతా. అలాంటి మాటలు, చేస్టలు, విన్యాసాలు కూడా దాని అంబులపొదిలో ఉన్నాయి. వాటి వల్ల లాభపడుతోంది. అవి  కేవలం వ్యక్తీకరణలే కాదు. ఆయుధాలుగా వాడుకుంటోంది. ఉదాహరణకు పార్లమెంట్‌ భవనం ప్రారంభోత్సవం నాటి ప్రహసనం చాలు. రాజదండాన్ని సభలో ప్రతిష్టించడం కేవలం వ్యక్తీకరణే కాదు.   ఈ దేశంలో ఉన్న నామ మాత్ర, రూపమాత్ర ప్రజాస్వామ్యాన్ని కూడా ఖతం చేయడానికి, మధ్య యుగాల్లోకి తీసికెళ్లడానికి  రాజదండ పాలన  సన్నాహం అనే విమర్శ వచ్చింది.

ఆ దిగ్భ్రమ నుంచి సమాజం ఇంకా తేరుకోలేదు. ఇప్పుడు దానికి పూర్తి భిన్నమైన ఉమ్మడి పౌరస్మృతి అనే ఆయుధాన్ని ప్రభుత్వం బైటికి తీసింది. ఇప్పుడు రాజదండ పాలనను, ఉమ్మడి పౌరస్మృతి అనే చట్టబద్ధ పాలనను కలిపి పరిశీలించాలి. ఈ రెండూ రెండు అంచులకు సంబంధించినవి. ఆధునిక చట్ట ప్రతిపత్తికి వ్యతిరేకమైన రాజదండం, సమాజాన్ని ఒకే  పౌరస్మృతిలో బంధించాలనే చట్టం.. ఈ రెంటిలో ఏది సంఫ్‌ుపరివార్‌ అసలు పని తీరో తెలియపోతే ఇదొక  పెద్ద పజిల్‌గా మారుతుంది.  ఈ రెంటిలో ఏదో ఒక వైపే చూస్తే ఇండియన్‌ ఫాసిజం అర్థం కానట్లే. సంఫ్‌ుపరివార్‌ తొలి సిద్ధాంతకర్త సావర్కర్‌ కూడా హిందుత్వ గురించి బోలెడు చర్చించి, దాన్ని సాధించవలసి ఉన్నది అన్నాడు. చరిత్రలో వెనక్కి నడిస్తే హిందుత్వ వస్తుందని ఆయన అనలేదు. అంటే అది భవిష్యత్తుకు సంబంధించింది అని అర్థం.  అదే హిందూ రాష్ట్ర. అది కేవలం హిందుత్వ ఆలోచనలు ఉన్న పార్టీ శాశ్వతంగా అధికారంలో ఉంటే సాకారమయ్యేదే కాదు. అన్ని రంగాల్లో వ్యక్తి, సామూహిక (సమూహాలు ఉండవు) మానసికత హిందుత్వతో వర్ధిల్లగల సామాజిక, సాంస్కృతిక దశకు దేశాన్ని తీసికెళ్లినప్పుడే హిందూ రాష్ట్ర సిద్ధించినట్లు.   అంటే హిందుత్వ, హిందూ రాష్ట్ర అంటే గతంలోకి వెళ్లిపోవడం కాదు. రాజకీయార్థిక వ్యవస్థతో సహా అన్ని రంగాల్లో సాధించాల్సిన కర్తవ్యంగా సంఫ్‌ుపరివార్‌ భావిస్తుంది. ఇదీ దాని కోర్‌.  ఆ మేరకు గతంతో కూడా  వ్యవహరిస్తుంది. దాన్ని వైభవీకరిస్తుంది.

 ఈ పని చేస్తూనే ఇంకో పక్క  గొప్ప చతురతను ప్రదర్శిస్తుంది. ఎంతగానంటే ‘రాజదండ ప్రతిష్టాపన అనేది మధ్యయుగాల సంస్కృతి అని సూడో సెక్యులరిస్టులు విమర్శించారు కదా, రాజ్యాంగం ఆదేశించిన ఉమ్మడి పౌరస్మృతి చట్టాన్ని ఎట్లా వ్యతిరేకిస్తారు? సమాజాన్ని మార్పు దిశగా తీసికెళ్లే ఉమ్మడి పౌరస్మృతిని అంగీకరించని వాళ్లంతా రాజ్యాంగ వ్యతిరేకులే..’ అనే ఎదురు దాడికి దిగింది. 

సంఫ్‌ుపరివార్‌ నడిపే జాగృతి వార పత్రిక జులై 3`9 సంచిక ఉమ్మడి పౌరస్మృతి మీదే స్పెషల్‌గా తీసుకొచ్చారు. అందులోని సంపాదకీయం ‘మార్పును స్వాగతించడమే ఆధునికతకు మొదటి సంకేతం’ అని ఆరంభమవుతుంది. లోపల ఈ లైన్‌లో ఎనిమిది వ్యాసాలు ఉన్నాయి. సమాజంలో మెజారిటీ, మైనారిటీ అనే తేడాల నుంచి పుట్టకొచ్చిన అనేక వైరుధ్యాలను పరిష్కరించేందుకే ఏకరూప చట్టం అవసరాన్ని అనేక వైపుల నుంచి వివరించారు. గత కాలపు వైరుధ్యాలను పరిష్కరించకుంటే మార్పు సాధ్యం కాదని, ఆధునిక సమాజం ఏర్పడదని ఆ వాదనల సారాంశం.  రాజ్యాంగ ఆదేశాలతోనే ఈ పనికి దిగామని సమర్థించుకున్నారు.

 ‘మార్పు’, ‘ఆధునికత’, ‘రాజ్యాంగబద్ధత’ అనే భావనలతో ప్రజాక్షేత్రంలోకి ఉమ్మడి పౌరస్మృతిని తీసుకొచ్చారు. రామాలయ వివాదంలాంటిది కాదు ఇది. ఈ వ్యూహాన్ని గుర్తించకపోతే సంఫ్‌ుపరివార్‌ అర్థం కాదు. దాని ఫాసిజం అర్థం కాదు. సంఫ్‌ుపరివార్‌ భావాలనే కాదు, వాటిని భౌతిక రూపంలోకి  మార్చడానికి ఎన్నుకున్న వ్యూహాన్ని కూడా గురి చూడాలి. నిజానికి ఆధిపత్య భావాలు ప్రమాదకరంగా మారేది వాటి ఆచరణ ప్రక్రియల వల్లే. ఈ సంగతిని రాజదండ ప్రతిష్టాపనలో చూడాలి. ఉమ్మడి పౌరస్మృతిలో కూడా చూడాలి. అట్లాంటి వాటన్నిటినీ కలిపి చూడాలి.

ఉమ్మడి పౌరస్మృతి చర్చలో రాజ్యాంగబద్ధ, చట్టపరమైన కోణాలు ఉన్నాయి. రాజకీయార్థిక కోణాలు ఉన్నాయి. సామాజిక సాంస్కృతిక జీవితంలోని బహుళత్వ కోణాలు ఉన్నాయి. ఈ అన్ని వైపుల నుంచి విస్తృత చర్చ జరగవలసి ఉన్నది. సంఫ్‌ుపరివార్‌ ఒరలో మూడు అస్త్రాలు ఉండేవి. అయోధ్యలో బాబ్రీ మసీదు`రామాయలం వివాదం, 370 రద్దు, ఉమ్మడి పౌరస్మృతి అనే మూడిరటిలో 1992 డిసెంబర్‌6న బాబ్రీ మసీదును కూల్చేశారు.  2019 ఆగస్టు 5న 370 అధికణాన్ని రద్దు చేశారు. ఇక మిగిలింది ఉమ్మడి పౌరస్మృతి.

హిందూ రాష్ట్ర సాధనను వేగవంతం చేయడానికి ఇదే సరైన సమయం అని సంఫ్‌ుపరివార్‌ ఇదే జాగృతి పత్రికలో గతంలో రాసింది. ఆ దిశగా ఉమ్మడి పౌరస్మృతి ఇప్పుడు రంగం మీదికి వచ్చింది. అసలు హిందుత్వ ప్రక్రియల్లో రాజకీయ అధికారాన్ని సంపాదించడం, నిలబెట్టుకోవడం ఒక అంశం మాత్రమే. అందులో ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ కొనసాగితేనేగాని వాళ్ల ఆలోచనల ప్రకారం హిందూ రాష్ట్ర ఏర్పడదు.   ఈ పని ప్రభుత్వాధికారం ద్వారా ఎంత జరుగుతుందో, సమాజంలో ఎంత జరుగుతుందో సంఫ్‌ుపరివార్‌కు బాగా తెలుసు. కాబట్టి ఉమ్మడి పౌరస్మృతిని కేవలం రాబోయే ఎన్నికల వ్యూహంగానే చూడ్డానికి కూడా లేదు. అదీ ఉన్నది. తద్వారా తక్షణ రాజకీయ ప్రయోజనాలు ఉన్నమాట నిజమే. కానీ ఉమ్మడి పౌరస్మృతికి అంత పరిమిత వ్యూహమే లేదు. సామాజిక, సాంస్కృతిక జీవితాన్నంతా ఏకరూపంగా మార్చేయాలనే ఫాసిస్టు లక్ష్యం దీని వెనుక ఉన్నది. ఈ ఏకరూపతను సాధించడానికి వైవిధ్యాలను రద్దు చేయాలి. భావజాల, సాంస్కృతిక, మానసిక కోణాల్లో ఏకరూపతను తీసుకరావాలి.  బహుళత్వాన్ని ఏక రూపంలోకి మార్చి ఉమ్మడి పౌరస్మృతి అనే చట్టం చట్రంలో బంధించి ముద్ద చేయాలి. 

దీని కోసం చట్టం ముందు అందరూ సమానమే, అందరికీ ఒకే చట్టం, అందరికీ ఒకే విలువ.. అనే ఆధునిక భావనలను వాడుకుంటున్నారు. ఉమ్మడి పౌరస్మృతిని ఇలాంటి ప్రమాణాలతో చర్చించాలని సమాజంలోకి వదిలేశారు. దీని వల్ల  సంఫ్‌ుపరివార్‌ ఇప్పుడు ఆధునికత అనే ముసుగు ధరించి వీధుల్లో వికటాట్టహాసం చేస్తుంది. ఈ ‘ఆధునికతను’, ‘రాజ్యాంగబద్ధతను’ ఎదుర్కొనేవాళ్లు రాజ్యాంగ వ్యతిరేకులుగా, దేశద్రోహులుగా, మార్పును అడ్డుకొనే వాళ్లుగా ముద్ర వేయించుకోవాల్సి వస్తుంది.

నిజానికి ఉమ్మడి పౌరస్మృతిలోని ఏకత ఈ నాటిది కాదు.  సంఫ్‌ుపరివార్‌ పుట్టుకలోనే  ఉంది. ఏకాత్మ అనే భావన దగ్గరికి వెళ్లకుండా దేశం మొత్తానికి వర్తించే ఏక రూప పౌర చట్టం  ఉద్దేశం అర్థం కాదు. దీనికి ఉన్న చట్టపరమైన ‘ఆధునిక’ చర్చ వెనుక భారతీయ సనాతనత్వంలోని ఏకాత్మ ఉన్నది. అయితే దీని లక్ష్యం సనాతన యుగంలోకి తీసికెళ్లడం కాదు. ఏకతను ఆధునిక చట్టపరిధిలోకి తీసుకరావడం.

 సంఫ్‌ుపరివార్‌ గత కాలపు భావజాలంలో ఉన్నప్పటికీ ఆచరణలో ఈ స్థల కాలాలకు తగినట్లే ఉంటుందనడానికి ఉమ్మడి పౌరస్మృతి ఒక ఉదాహరణ. సామాజిక, సాంస్కృతిక జీవితంలో అధునిక పూర్వ అధికార రూపాలపట్ల మక్కువ ఉన్నప్పటికీ ఆధునిక యుగంలో అధికారం చట్టరూపంలో ఉంటుందనే కనీస విషయం వాళ్లకు బాగా తెలుసు.  అందుకే నూరేళ్లుగా ప్రవచిస్తూ వచ్చిన ఏకతకు ఇప్పుడు చట్టబద్ధరూపాన్ని ఇవ్వాలనుకుంటున్నారు. ఎంత ప్రజా వ్యతిరేక విషయమైనా  చట్టబద్ధతను సంతరించుకోవడం అంటే ఆధునిక రూపాన్ని ప్రదర్శించడమే. అందుకే ఇప్పుడు సంఫ్‌ుపరివార్‌ ఉమ్మడి పౌరస్మృతిని ఆధునికతా పరిధిలోకి తీసుక రాగలిగింది. రాజ్యాంగ ఆదేశాలను అమలు చేసే మహత్తర కార్యంగా ప్రచారం చేసుకుంటున్నది.

కానీ రాజ్యాంగ ఆదేశాల్లో ఉమ్మడి పౌరస్మృతి ఒక్కటే లేదు. ఎన్నో సామాజిక భావనలు ఉన్నాయి. సమానత్వ సాధన, వ్యక్తి స్వేచ్ఛ వంటివి ఉన్నాయి. గత ప్రభుత్వాలైనా, ఇప్పటి బీజేపీ ప్రభుత్వమైనా వాటిని సాధించాలనుకోలేదు. సమానత్వం చట్టాల వల్లనే రాదు. చట్టాల వల్ల అసమానత్వంలో కునారిల్లుతున్న వాళ్లకు రక్షణ దొరుకుతుంది. ఆ మేరకు మేలు జరుగుతుంది. చట్టాలతోపాటు అనేక రంగాల్లో, అనేక తలాల్లో ప్రజాస్వామిక ప్రక్రియలు జరగాలి. ఒక వేళ ఆర్థిక సమానత్వం వచ్చినా సామాజిక, సాంస్కృతిక సమానత్వానికి ప్రత్యేక కృషి చేయాలి. ఈ పనులేవీ చేయకుండా ఉమ్మడి పౌరస్మృతిని తెచ్చి రాజ్యాంగ కర్తవ్యాలు నెరవేర్చానని చెప్పుకోవడం బూటకం.  

నిజానికి రాజ్యాంగమే సమానత్వాన్ని ఒక ఆదర్శంగా ప్రకటించుకుందిగాని వ్యక్తిగత ఆస్తి అనే దోపిడీ రూపాన్ని చట్టబద్ధం చేసింది. కాబట్టి సమానత్వానికే రాజ్యాంగం ప్రకారమే అవకాశం లేదు. ఇక దేశంలోని వందలాది జన సమూహాలు వేల ఏళ్ల సాంస్కృతిక అంతరాల మధ్య జీవిస్తున్నాయి. వీటన్నిటి మధ్య సమానత్వం చట్టరూపంలో ఎన్నటికీ రాదు. కులాలు, మతాలు, తెగల రూపంలో సొంత సంప్రదాయాలు, జీవన విధానాలు, వివాదాస్పద అంశాలు, వివాదాలను పరిష్కరించుకొనే స్వీయ పద్ధతులు ఉన్నాయి.  వాటిలో నిలిపి ఉంచుకోవాల్సినవీ ఉన్నాయి. రద్దు కావాల్సినవీ ఉన్నాయి. ఆ ప్రజల చైతన్యవంతమైన ఆచరణలో వాళ్లే నిర్ణయించుకోవాల్సిన అంశాలూ ఉన్నాయి. అందుకే ఉమ్మడి పౌరస్మృతి రాజ్యాంగం తయారైనప్పటి నుంచి  వివాదాస్పద అంశంగానే ఉండిపోయింది. ఇప్పుడు బీజేపీ దాన్ని సెటిల్‌ చేసి తనను తాను రాజ్యాంగ ఆదర్శాలకు ప్రతినిధినని చెప్పుకోవాలనుకుంటున్నది.  భారతదేశంలోని సంక్లిష్టమైన సామాజిక బహుళత్వాన్ని ఒకే చట్టం కిందికి తీసుకరావాలనుకోవడం వెనుక ఉద్దేశాలను గుర్తించాలి. అందరికీ ఒకే చట్టం అనే మాటలో సమానత్వం, మార్పు ఉన్నదని సంఫ్‌ుపరివార్‌ బుకాయిస్తున్నది.  దేశమంతా ఒకే జీఎస్టీ కంటే ఏక రూప చట్టం మరింత దుర్మార్గమైనది. 

ఉమ్మడి పౌరస్మృతి సందర్భంగా ఒక మహత్తర చర్చ జరగవలసి ఉన్నది. అంత విస్తృతి దీనికి ఉన్నది. అనేక రంగాల వైపు నుంచి భారత సామాజికత మీద చూపు సారించాలి. అది  సంఫ్‌ుపరివార్‌ కోరుకుంటున్న ఏకత దిశగా కాకుండా బహుళత్వం దిశగా విస్తరించాలి.  

Leave a Reply