మనుషుల్లోని నమ్మకాల ప్రపంచం చాలా లోతైనది. ప్రతీకలతో,  భావనలతో అది పటిష్టంగా పని చేస్తూ ఉంటుంది.  కళ్ల ముందు కనిపించే  వాస్తవాలకన్నా విశ్వాసాల ప్రపంచమే సాధారణంగా మనుషులను నడిపిస్తుంటుంది.  అది ప్రాచీనమైనదే కానక్కరలేదు. ఆధునిక, సమకాలీన జీవితంలో కూడా అట్లాంటి నమ్మకాల ప్రపంచం నిరంతరం నిర్మాణమవుతూ ఉంటుంది. వాస్తవ ప్రపంచం  ఘర్షణ పడినప్పుడు అది  పెటిల్లున రాలిపోయినా ఆశ్చర్యపోనక్కర లేదు.

మే 28న కొత్త పార్లమెంట్‌ భవనాన్ని ప్రారంభించిన పద్ధతి చూసి చాలా మంది దిగ్భ్రాంతికి గురయ్యారు. అశాంతికి లోనయ్యారు. ఆగ్రహపడ్డారు. ప్రజాస్వామ్య ప్రక్రియకు కార్యక్షేత్రమైన పార్లమెంట్‌ భవనాన్ని వైదిక క్రతువులతో, సాధు సంతులతో ఆరంభించడం ఏమిటనే ప్రశ్న దేశమంతా వినిపించింది. మామూలుగా రాజకీయ నాయకులు తరచూ ఈ దేశ ప్రజలు నా వెంట ఉన్నారు..అని అంటూ ఉంటారు. ఆధునిక యుగంలో ఆ మాట పాలకులకు అపారమైన శక్తినిస్తుంది. ఆ పేరుతో ఇక ఏమైనా చేయవచ్చు. ప్రజలు తమ వెనుక ఉన్నారని చెప్పుకోడానికి ఎన్నికల్లో గెలిచిన సీట్ల నెంబర్‌ ఒక్కటే ఆసరా కాదు. అనేక భావనలతో ఆ సంగతి చెబుతూ ఉంటారు.  భారత ప్రధాని మోదీ నా వెనుక దేశంలోని సాధుసంతులు, మఠాధిపతులు ఉన్నారు చూడండి అని పార్లమెంట్‌ భవనం ప్రారంభోత్సవంలో ప్రకటించాడు. వాళ్లంతా  వెంట రాగా ఆయన రాజదండాన్ని ధరించి పార్లమెంట్‌ భవనంలోకి ప్రవేశించాడు. ఆయన తన అధికారాన్ని అట్లా పునర్‌ వ్యవస్థీకరించుకున్నాడు.

ఈ దేశ ప్రజాస్వామ్యం గురించి కొన్ని బలమైన నమ్మకాలతో జీవిస్తున్నవారిని ఇది కలచివేసింది. దేనికంటే పార్లమెంట్‌  కేవలం ఒక భవన కట్టడం  కాదు. ప్రజల ప్రాతినిధ్య అధికారానికి ప్రతీక. రాజ్యాంగం ఆ అధికార స్వభావాన్ని  నిర్వచించింది. అందులో కొన్ని విలువలు ఉన్నాయి. ప్రక్రియలు ఉన్నాయి. అందులో అతి ముఖ్యమైనది ఏమంటే ప్రజలు తమ ప్రాతినిధ్య బృందానికి అధికారాన్ని అప్పగించడం. తమ తరపున వాళ్లు పాలనా అధికారాన్ని నిర్వహిస్తూ ఉంటారు.  కానీ మోదీ తనకు ఈ అధికారాన్ని దేశంలోని ఆధ్యాత్మిక ముఠా  రాజదండం రూపంలో అప్పగించిందని, తన వెనుక సనాతన వైదిక శక్తులు ఉన్నందు వల్ల తనకీ అధికారం దఖలు పడిరదని ప్రకటించాడు. కాబట్టి పార్లమెంట్‌ భవనాన్ని ప్రారంభించడం అనేది ఒక క్రతువు మాత్రమే కాదు. ప్రజా ప్రాతినిధ్య ప్రక్రియ ద్వారా తన చేతిలోకి వచ్చిన అధికారానికి ఆయన కొత్త అర్థం చెప్పదలిచాడు.

అయితే ఈ ధోరణి ఇప్పటికిప్పుడు మొదలు కాలేదు. దేశంలో అత్యున్నత స్థాయి నుంచి గ్రామం దాకా ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలు వైదిక క్రతువులుగానే సాగుతున్నాయి. దీనికి ఎవరో కొందరు వ్యక్తులు మినహాయింపు కావచ్చు.  కొన్ని భిన్నమైన సందర్భాలు అక్కడక్కడా కనిపించవచ్చు. కానీ పాలకవర్గానికి రాజ్యాంగం ద్వారా లభించిన శాసన అధికారానికి ఆధ్యాత్మిక, మత అధికారం కూడా మొదటి నుంచీ తోడుగా ఉన్నది. అందుకే అది శాసన రూపంలో ఎంత ప్రదర్శితం అవుతున్నదో అంతగా సనాతన కర్మకాండలతో ప్రదర్శితమవుతోంది. ‘భారత దేశం’లోని రాజ్య పరివర్తనా క్రమం ఆధునిక యుగంలోకి ఎలా వచ్చిందో  గమనించడానికి ఈ కోణం బాగా ఉపయోగపడుతుంది.

ఆ రకంగా ఆధునిక భారత రాజ్యం తన అధికారాన్ని హిందుత్వ ప్రక్రియలతో, సైనిక విన్యాసాలతో చాటుకోవడం మొదటి నుంచీ ఉన్నది. ఇది భారత రాజ్య స్వభావంతో, దాని మీద అధికారం చెలాయిస్తున్న వర్గానికి ఉన్న లక్షణాలతో సంబంధం లేని సాంస్కృతిక విశేషం కాదు. రాజదండం ఫ్యూడల్‌ అధికారానికి సాంస్కృతిక ప్రతీక అయినప్పటికీ ఆధునిక యుగంలో కూడా అది కొనసాగుతున్నది. కాబట్టి దాన్ని కేవలం సాంస్కృతిక, ఆధ్యాత్మిక విషయంగానే చూడ్డానికి లేదు. రాజదండాన్ని ధరించి గత కాలపు సంస్కృతిలోకి దేశాన్ని తీసికెళుతున్నట్లుగానే చూడ్డానికి లేదు. హిందుత్వ ఫాసిస్టు భావజాల పునాది ఉన్న పార్టీ కాబట్టి బీజేపీ  ఆ పని బరితెగించి  చేసింది. భారత రాజ్యానికి ఉన్న ఈ స్వభావం  పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలోని కొన్ని విలువల, ప్రక్రియల పరదా చాటున  ఉండిపోయింది. ఫాసిజానికి ఇలాంటి దోబూచులాట నచ్చదు. ఈ సమాజాన్ని ఎట్లా మలచాలో ఫాసిస్టులకు చాలా స్పష్టమైన లక్ష్యం ఉన్నది. అధికారాన్ని స్థాపించుకోవడం,  దాన్ని వీలైనంత కాలం పొడిగించుకోవడం మాత్రమే  సంఫ్‌ుపరివార్‌ లక్ష్యం కాదు. రాజకీయ, రాజకీయార్థిక వ్యవస్థల మీద  అధికారం విషయంలో పూర్తి స్పష్టతతోనే ఈ సమాజాన్ని తాననుకున్న పద్ధతిలో తీర్చిదిద్దే బృహత్తర పథకం వాళ్ల దగ్గర ఉన్నది. ఇందులో అనేక అంచలు ఉన్నాయి. దీనికి అనేక ముఖాలు ఉన్నాయి.  అనేక క్రమాలు ఉన్నాయి. ఫాసిస్టులు తమ లక్ష్యానికి సంబంధించిన  భవిష్యత్‌ దృష్టితోనే  తరచూ గతంలోకి వెళుతున్నారు. ఒకసారి సంస్కృతి పేరుతో, మరోసారి చరిత్ర పేరుతో, ఇంకోసారి వ్యక్తుల స్థానం పేరుతో ఆ పని చేస్తున్నారు. ఇందులో గతానికి సంబంధించిన భావోద్వేగాలు, ప్రతీకలు ఉన్నట్లు కనిపించినా సారాంశంలో వీటి ఉద్దేశం గతంలోకి వెళ్లడం కాదు. గతాన్ని యథాతధంగా పునరుద్ధరించడం కాదు. తమ  భవిష్యత్‌ మెగా ప్రాజెక్టుకు  సంపూర్ణ రూపాన్ని ఇవ్వడానికే గతాన్ని ముందుకు తీసుకొస్తున్నారు. గత ప్రతీకలను వాడుకుంటున్నారు.  కొత్త పార్లమెంట్‌ భవన నిర్మాణానికి పూనుకోవడం,  దాని ప్రారంభోత్సవాన్ని ఈ పద్ధతిలో చేయడం హిందుత్వ పునాది మీద ఫాసిస్టులు చేపట్టిన ఈ దేశ భవిష్యత్‌ నిర్మాణ పథకంలో భాగమే.  అందులో రాజకీయాధికార స్వభావం కూడా ఒకటి.

ఎనిమిదేళ్ల కింద అదాని వంటి కార్పొరేట్ల  పూనికతో ప్రధానిగా మోదీ రాజకీయాధికారాన్ని చేపట్టినప్పటికీ ఆయన మరోసారి సాధుసంతుల ఆధ్వర్యంలో, వాళ్ల ఆశీస్సులతో, రాజ దండానికి ప్రణమిల్లి, అధికారం అనే దాని పరమ భావనను పూర్తిగా సొంతం చేసుకుంటూ మరోసారి  సింహాసనం అధిష్టించాడు.  పార్లమెంటరీ ప్రజాస్వామ్యం  ఉన్నంత కాలం దాని మీద బూర్జువా వర్గ నిరంకుశ అధికారం కొనసాగేదే. అనుమానం లేదు. కానీ ఆ వర్గంలోని ముఠాలు సమయానుకూలంగా అధికారాన్ని పంచుకోవాల్సి వస్తుంది.  అధికారం చట్టపరిధిలో ఉండాలనే అతి పెద్ద వాస్తవ, నాటకీయత ఒక్కో ముఠా చేతిలో ఒక్కో రకంగా రక్తికడుతూ ఉంటుంది. భారతదేశంలో ఫాసిజానికి ఆధునిక పూర్వ మూలాలు ఎంత బలంగా ఉన్నప్పటికీ సంఫ్‌ుపరివార్‌ ఫాసిజం ఆధునిక యుగానికి చెందినది. అందువల్ల ‘చట్టబద్ధం’గానే అధికారాన్ని కొనసాగిస్తూ దాన్ని నిరపేక్ష, దైవదత్తమైన, మానవాతీతమైన అధికారంగా కూడా మార్చుకోడానికి హిందుత్వ ఫాసిజం ప్రయత్నిస్తున్నది. తన అధికారం కేవలం ప్రజలు ఓట్లు వేస్తేనో, అదాని కోరుకుంటేనో వచ్చింది మాత్రమే కాదు.. అది స్వయంసిద్ధమైన, అపరిమితమైన అధికారం అని చెప్పుకోవడం మోదీ ఉద్దేశం. ఈ స్వయంసిద్ధమూ, అపరిమితమూ అనేవి భారత నాగరికతలోంచి, సంస్కృతిలోంచి, ఆధ్యాత్మికతలోంచి వచ్చాయని చెప్పడం కూడా ఆయన ఉద్దేశం.

ఈ ధోరణికి హిందుత్వ ఫాసిజంలో మూలాలు ఉన్నాయి.  ఇప్పుడు వాటి గురించి అందరికీ తెలుసు.  అందులో ఏ సందేహాలూ లేవు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలోని రాజకీయాధికార స్వభావాన్ని మోదీ మతాంతీకరిస్తున్నాడని సులభంగానే చెప్పవచ్చు. దీని ప్రకారం రాజ్యాంగబద్ధ అధికారం హిందుత్వ అధికారంగా పరివర్తన చెందుతున్నదనే నిర్ధారణకు రావచ్చు.  పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, దాని రాజ్యాంగబద్ధత, చట్టబద్ధ పాలన వంటి అనేక భావనలు, వాటి ప్రతీకలు భంగపడినట్లు కనిపిస్తున్నది. గత డెబ్పై అయిదేళ్లుగా సగటు ఆలోచనాపరుల్లో  ప్రజాస్వామ్యం చుట్టూ ఒక రకమైన విశ్వాసాల ప్రపంచం తయారైంది. మోదీ చర్యలతో అది కుప్పకూలిపోయినట్లు కనిపిస్తున్నది. మే 28 నాటి పరిణామంలో ఇదే ఉన్నదా? ఈ వైపు నుంచి మాత్రమే దాన్ని పూర్తిగా అర్థం చేసుకోగలమా?

పార్లమెంటరీ ప్రజాస్వామ్య రాజకీయాధికారం హిందుత్వ రాజదండ పాలనగా మారడం వెనుక  ఒక క్రమం ఉన్నది. ఆధునిక పూర్వ యుగంలోని రాజకీయాధికారానికి కుల సామాజిక అంతరాల, సాంస్కృతిక, ఆధ్యాత్మిక ఆధిక్యాల, నైతిక కోణాలు ఉండేవి. సారాంశంలో రాచరిక వర్గ ఆధిపత్యం  ప్రశ్నించడానికి వీల్లేని పవిత్రతను చెలాయించడానికి, దాన్ని ప్రజలు  ఆమోదించి లోబడి ఉండటానికి మత, ఆధ్యాత్మిక కోణం అవసరమైంది. భారతదేశంలో వలస పాలన తర్వాత పార్లమెంటరీ ప్రజాస్వామ్యం  రాజ్యాంగం రూపంలో వ్యవస్థీకృతం అయినా రాజ్య రూపం పూర్తిగా గతం నుంచి విడిపోలేదు. రాజకీయాధికారం, మతాధికారం కలిసి కొనసాగుతున్నాయి. సమాజంలోని అన్ని వ్యవస్థల్లో ఈ సంక్లిష్టమైన కొనసాగింపు ఎలా ఉన్నదో, ఆ వ్యవస్థలన్నిటినీ అదుపులో పెట్టే రాజ్య రూపం కూడా అట్లాగే కొనసాగుతున్నది. మతంతో సంబంధం లేదని ప్రకటించుకున్న పెట్టుబడిదారీ రాజ్యాలు మతాన్ని వాడుకోడానికి, భారత దేశంలో రాజ్య వ్యవస్థ మతంతో కలిసి కొనసాగడానికి తేడా ఉన్నది. ఆ తేడా గురించి ప్రగతిశీల శక్తులకు బాగానే తెలుసు. మే 28న  మోదీ పార్లమెంటరీ ప్రజాస్వామ్య రాజ్యాన్ని  మతాంతీకరించడమే కాదు. భారత రాజ్యానికి ఉన్న హిందుత్వ స్వభావాన్ని బట్టబయలు  చేశాడు.

చరిత్రను తిరగరాసి అధికారిక చరిత్రను ప్రకటించాలనే వాళ్ల వ్యూహం కేవలం చరిత్ర అనే ఒక అకడమిక్‌ అంశానికి సంబంధించిందే కాదు. సంస్కృతిని, అందులోని వైవిధ్యాలను, వాటికి వారసులైన ప్రజలను, వారి ఆకాంక్షలను రద్దు చేసే లక్ష్యం ఉన్నట్లే రాజ్యాంగం ప్రకారం  ప్రజలకు సంక్రమించిన రాజకీయ అధికారాన్ని పూర్తిగా పక్కన పెట్టి, రాజ్యాంగం దాపున ఇంత కాలం ఉన్న ఫ్యూడల్‌ బ్రాహ్మణీయ మత, వర్గ రాజకీయాధికార స్వభావాన్ని పూర్తిగా బట్టబయలు చేయాలనే ఉద్దేశంతో రాజదండ పాలనను ముందుకు తీసుకొచ్చారు.

కాబట్టి పార్లమెంట్‌ భవనం ప్రారంభోత్సవ సన్నివేశం మీద విసుగుతో, అసహనంతో దాన్నంతా సంస్కృతి ఖాతాలో వేయడానికి లేదు.  ఇంత కాలం దోబూచులాడుతూ వచ్చిన ఆధునిక భారత రాజ్య వ్యవస్థ స్వభావం బైటపడిన సందర్భంగా దీన్ని చూడాలి. ఫాసిస్టులు ఏ పనీ కాకతాళీకంగా  చేయడం లేదు. చాలా దీర్ఘకాలిక లక్ష్యంలో భాగంగా చేస్తున్నారు. హిందుత్వ పునాది మీద భవిష్యత్‌ భారత దేశం గురించిన వాళ్ల సమగ్ర వ్యూహంలో భారత రాజ్యం  ఒక ముఖ్యమైన అంశంగా ఎందుకు ఉండదు? అది ఎలా ఉండబోతోందో ఒక సన్నివేశాన్ని పార్లమెంట్‌ భవనం ప్రారంభోత్సవం నాడు చూపించారు. అంతే.

One thought on “రాజ్యాంగమూ రాజదండమూ

  1. పరివారం బరితెగింపు.. మంచి సంపాదకీయం

Leave a Reply