నక్సల్బరీ శ్రీకాకుళ పోరాటాల వెనుకంజ తర్వాత విప్లవోద్యమాన్ని ప్రజాపంథాలో పునర్నిర్మించడానికి అట్టడుగు స్థాయి నుంచి ప్రయత్నించిన నాయకుల్లో కటకం సుదర్శన్‌ ఒకరు. ఆనంద్‌ పేరుతో ఆయన సింగరేణి బొగ్గుబాయిల నుంచి, బస్తీల నుంచి, కళాశాలల నుంచి, పల్లెల నుంచి పని ఆరంభించి ప్రజాపంథాను సృజనాత్మకంగా ఆవిష్కరించి గోదావరి తీరం దాటించి దండకారణ్యం దాకా విస్తరింపజేశాడు. అక్కడి నుంచి వివిధ రంగాల్లో తన సహచరులతో కలిసి దేశవ్యాప్తం చేశారు. ఆచరణలో వర్గపోరాటం ఎన్నెన్ని తలాల్లో, ఎన్నెన్ని రూపాల్లో సాగడానికి అవకాశం ఉన్నదో నిరూపణ కావడానికి ఆయన అజరామర నాయకత్వం దోహదం చేసింది. ప్రత్యామ్నాయ ప్రజాఽధికారం, కింది నుంచి ప్రజాస్వామ్యం, అన్ని జీవన రంగాల్లో నూతన వ్యవస్థల నిర్మాణం, ప్రత్యామ్నాయ ఉత్పత్తి విధానం సాధించకుండా విప్లవం సాధ్యం కాదని దండకారణ్య క్రాంతికారీ జనతన సర్కార్‌ రుజువు చేసింది. ప్రపంచ విప్లవ ప్రజానీకానికి, విప్లవాభిమానులకు, బుద్ధిజీవులకు సహితం 21వ శతాబ్దంలో ఆశావహ అభివృద్ధి నమూనాగా, సాంఘిక సాంస్కృతిక విముక్తి మార్గంగా, విప్లవ ప్రత్యామ్నాయంగా జనతన సర్కార్‌ ఆవిర్భవించింది. ఈ నేపథ్యంలో విరసం సభ్యుడు పాణి 2013 నవంబర్‌, డిసెంబర్‌ నెలల మధ్య దండకారణ్యంలో పర్యటించి రాసిన జనతన రాజ్యం పుస్తకానికి ప్రతాప్‌ పేరుతో కటకం సుదర్శన్‌ రాసిన విస్తారమైన ముందుమాట ఇది. ఆయన అమరత్వాన్ని కన్నీటి జడిలో సగర్వంగా ఎత్తిపడుతూ ఆ నాయకుడు, దార్శనికుడు, ఆలోచనాపరుడు, అన్నిటినీ మించి మనకాలపు మహాద్భుత మావోయిస్టు రాసిన ఈ ముందుమాటను పాఠకులకు అందిస్తున్నాం… వసంతమేఘం టీం

1980లో ప్రారంభమైన వర్గపోరాటం ఫలితంగా 1995 నాటికి దండకారణ్యంలో గ్రామస్థాయి ప్రజారాజ్యాధికార అంగాలు (జనతన సర్కార్లు) నిర్మాణమయినాయి. ఆ తరువాతి నుండి అవి క్రమంగా సంఘటితపడుతూ, విస్తరిస్తూ, ఉన్నత స్థాయికి అభివృద్ధి చెందుతూ డివిజనల్‌ (జిల్లా) స్థాయి ప్రజా రాజ్యాధికార అంగాలుగా ఎదిగిన నేపథ్యంలో 2013 నవంబర్‌-డిశంబర్‌లో పాణి దండకారణ్యంలో పర్యటించి ఈ పుస్తకం రాశాడు.

దండకారణ్యంలో దీర్ఘకాలంగా సాగుతున్న వర్గపోరాటం, దాని ఉన్నత స్థాయిలో కొనసాగుతున్న ప్రజాయుద్ధం/గెరిల్లాయుద్ధం ఫలితంగా నిర్మాణమైన జనతన సర్కార్లు (ప్రజా ప్రభుత్వాలు) అమలు చేస్తున్న ప్రజా రాజ్యాధికారాన్ని, దానివల్ల అక్కడి ప్రజా జీవితంలో వస్తున్న మార్పులను పరిశీలించడానికి పాణి అక్కడ పర్యటించాడు.

జనతన సర్కార్ల ప్రజా రాజ్యాధికారం వల్ల దండకారణ్య ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక రంగాల్లోని మార్పులను తను మూడు పరిశోధనా తలాల్లో-సాంఘిక, సాంస్కృతిక మార్పులు, వ్యవస్థాగత మార్పులు, ప్రాథమిక రూపంలో రాజ్యవ్యవస్థ రూపొందుతున్న క్రమంగా అధ్యయనం చేశాడు. ఈ అధ్యయన ఫలితమే ‘జనతన రాజ్యం, దండకారణ్యంలో మావోయిస్టు ఆచరణ’ పుస్తకం.

2013 నవంబరులో జరిగిన ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో తను దండకారణ్య జనతన సర్కార్లను అధ్యయనం చేసి రాసిన ఈ పుస్తకం కాకతాళీయంగానే అయినా సరైన సందర్భంలో వెలువడుతోంది.

2014 సార్వత్రిక ఎన్నికల్లో ‘అచ్ఛేదిన్‌ లాయేంగే’ (మంచి రోజులు తెస్తాం) అంటూ బీజేపీ నరేంద్రమోడీ భారీ హంగు, ఆర్భాటాలతో దేశం నలుమూలలా సుడిగాలి పర్యటనలు చేసి ప్రజల్ని భ్రమల్లో ముంచెత్తాడు. అదే సమయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ నాయకుడు కేసీఆర్‌ తెలంగాణ పునర్నిర్మాణం ద్వారా ‘బంగారు తెలంగాణ’ను నిర్మిస్తానంటే, ‘స్వర్ణాంధ్ర ప్రదేశ్‌’గా ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చేస్తానని టీడీపీ నాయకుడు చంద్రబాబు ప్రజలకు హామీలు కురిపించారు. 2013 నవంబర్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ రమణ్‌సింగ్‌ ఏక్‌ ఔర్‌ మోఖాదో (మరోసారి అవకాశం ఇవ్వండి) అంటూ ప్రజల ముందుకు వెళ్లాడు. రాజకీయ బేహారులు- నరేంద్రమోడీ, కేసీఆర్‌, చంద్రబాబు, రమణ్‌సింగ్‌లు-ఎవరైనా ప్రజలను మోసగించడానికి ఆకర్షణీయమైన వాగ్దానాలు చేశారు. అయితే 1952 నుండి కొనసాగుతున్న పార్లమెంట్‌, అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌, బీజేపీ, జనతాపార్టీ/జనతా పరివార్‌ పార్టీలు, రివిజనిస్టు పార్టీలైన సీపీఐ, సీపీఎమ్‌, బీఎస్‌పీ, ప్రాంతీయ పార్టీలు టీడీపీ మొదలు తాజాగా ఆప్‌ దాకా అన్నిటి వాగ్దానాలు విని విని విసిగెత్తారు. కేంద్రంలోనైనా, రాష్ట్రాల్లోనైనా పార్టీలు వేరైనా, జెండాలు వేరైనా, రంగులు వేరైనా ఆ పార్టీలన్నీ సామ్రాజ్యవాద, దళారీ బడా బూర్జువా, బడా భూస్వామ్య వర్గాల ప్రయోజనాలను కాపాడడానికే ఉన్నవి. కాబట్టే అవి ప్రజల రోజువారీ సమస్యలను గానీ, మౌలిక సమస్యలను గానీ పరిష్కరించలేవని తేలిపోయింది. దోపిడీ వ్యవస్థ సహజ లక్షణమైన అవినీతి, బంధుప్రీతి, అశ్రిత పక్షపాతాలు 1991లో మొదలై కొనసాగుతున్న ‘ప్రపంచీకరణ’ నయా ఉదారవాద విధానాలతో మరింత తీవ్రతరమైనాయి.

ఈ స్థితిలో ప్రభుత్వపు శాసన నిర్మాణ వ్యవస్థలు (లెజిస్లేచరి), కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థలతో సహా అన్ని రాజకీయ పార్టీలు అవినీతి మురికి కూపాల్లో నిండా మునిగిపోయి, కుళ్లిపోతున్న స్థితి నెలకొంది. ఈ స్థితిలో ప్రజల్లో దోపిడీ వ్యవస్థ పట్ల, బూర్జువా రాజకీయ పార్టీల పట్ల నెలకొన్న క్రోధావేశాలు విప్లవమార్గం పట్టకుండా దారి మళ్లించడం కోసం దోపిడీ పాలకవర్గాలు ఆప్‌ పార్టీని (ఆమ్‌ ఆద్మీ పార్టీ) రంగంలోకి దించాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సమయాల్లో ఎన్ని వాగ్దానాలు చేసినా 62 ఏళ్లుగా పార్లమెంటరీ ఎన్నికలను చూస్తూ ఉన్న ప్రజానీకంలో అత్యధికులు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా, ఏ రాజకీయ నాయకుడు అధికారంలోకి వచ్చినా తమ బతుకులు మారేదేమీ లేదని నిర్లిప్తతతోనే ఉన్నా, విప్లవ ప్రత్యామ్నాయం లేని స్థితితోపాటు దోపిడీ వర్గ రాజకీయ నాయకుల వాగ్దానాల భ్రమలకు గురయిన ప్రజలు వేసిన ఓట్లతో కేంద్రంలో నరేంద్రమోడీ నాయకత్వంలోని ఎన్‌డీఏ, తెలంగాణలో కేసీఆర్‌ (టీఆర్‌ఎస్‌), ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు (టీడీపీ), ఛత్తీస్‌గఢ్‌లో రమణ్‌సింగ్‌ (బీజేపీ) పార్టీలు అధికారంలోకి వచ్చాయి. ఈ సంవత్సరం-సంవత్సరన్నర కాలంలో కేంద్రప్రభుత్వం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక, దేశ వ్యతిరేక, నయా ఉదారవాద విధానాలతో మరోసారి ప్రజల్లో, కనీసం గణనీయమైన సెక్షన్‌లో భ్రమలు తొలగిపోవడమే కాకుండా ఈ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చి పోరాటాలు చేయడం మొదలైంది. దేశాన్ని తెగనమ్ముతున్న మోదీ ప్రభుత్వ విధానాలతో సంఘ్‌పరివార్‌, బీజేపీ జాతీయవాద ముసుగు బహిర్గతమైంది. ఎన్‌డీఏ దేశ వ్యతిరేక, విద్రోహకర స్వభావం ప్రజలకు స్పష్టమవుతోంది. రమణ్‌సింగ్‌ ప్రభుత్వం ఈ సంవత్సరం చేపట్టిన ‘లోక్‌ సురాజ్‌ (ప్రజా సుపరిపాలన) అభియాన్‌’లో ప్రజలు అనేకచోట్ల ప్రభుత్వానికి తమ నిరసనల్ని తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ‘భూమి అధిగ్రహణ (స్వాధీన) బిల్లు, ఆర్డినెన్సులు’ రైతు వ్యతిరేక సామ్రాజ్యవాద, దళారీ నిరంకుశ బూర్జువా వర్గాల కార్పొరేట్‌ సంస్థలకు అనుకూలమైనవనే మాట సాధారణ జనవాక్యంగా మారింది. ఈ స్థితిలో దేశవ్యాప్తంగా ప్రజానీకం ప్రత్యామ్నాయం కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలతో సహా దేశవ్యాప్తంగా ప్రజలు ప్రత్యామ్నాయ రాజకీయాలను, ప్రత్యామ్నాయ వ్యవస్థలను కోరుకుంటున్నారు. ఈ స్థితిలో ‘జనతన సర్కారే (ప్రజా ప్రభుత్వం)’ ప్రత్యామ్నాయమంటూ ‘జనతన రాజ్యం’ పుస్తకం పాఠకుల ముందుకొస్తోంది.

దోపిడీ వర్గాల పార్లమెంటరీ వ్యవస్థకు, సామ్రాజ్యవాద నిర్దేశిత పరాధీన ఆర్థిక వ్యవస్థకు, ‘అభివృద్ధి’ నమూనాకు, జీవన విలువల పతనంతో కుళ్ళి కంపుకొడుతున్న దోపిడీ వర్గాల సంస్కృతికి జనతన సర్కారే నిజమైన ప్రత్యామ్నాయమని ఈ పుస్తకం అద్భుతంగా ఆవిష్కరిస్తుంది.

ఈ అద్భుతానికి కారణం రచయిత తన పరిశీలన పద్ధతులను స్పష్టంగా నిర్వచించుకోవడం. పరిశోధన లక్ష్య సాధనకు మార్గదర్శకంగా మార్క్సిస్టు సిద్ధాంత సంవిధానాన్ని ఉపయోగించడం. క్షేత్ర స్థాయిలో ప్రత్యక్షంగా వందలాది మంది ప్రజలతో, పార్టీ కార్యకర్తలతో, పార్టీ నాయకులతో, ప్రజావిముక్తి గెరిల్లా సైన్యంలోని కామ్రేడ్స్‌తో, వివిధ స్థాయి కమాండర్లతో, జనతన సర్కారు కార్యకర్తలతో, నాయకులతో, వివిధ ప్రజా సంఘాల కార్యకర్తలతో, నాయకులతో సంభాషించడం. అంటే జనతన సర్కారు కృషిని అకడమిక్‌ పద్ధతిలో కాకుండా దాని ప్రత్యక్ష ఆచరణ ద్వారా విశ్లేషించి, సంశ్లేషించడం. తన పరిశోధనకు మావోయిస్టు పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనతన సర్కారు నాయకులు, కార్యకర్తలు అన్ని రకాలుగా సహకరించి, అవసరమైన రిపోర్టులను అందించడమే కాకుండా వాళ్ళు స్వయంగా జనతన సర్కారు నిర్మాణ-నిర్వహణ కృషిలో భాగస్వాములైనందువల్ల దాని బలాన్ని-బలహీనతలను, పరిమితులను, సవాళ్ళను రచయిత ముందుంచి వాటిని రాయమని గైడ్‌ చేశారు. తమ ‘జనతన సర్కారు’ను అధ్యయనం చేయడమంటే మేధో ప్రపంచపు నైతిక మద్దతుగా, సంఘీభావంగా భావించిన ప్రజలు అన్ని రకాలుగా రచయితకు సహకరించారు. వీటన్నింటి ఫలితమే ఈ ఆవిష్కరణ.

రచయిత దాదాపు నెల రోజులపాటు దండకారణ్యంలో క్రాంతికారీ జనతన సర్కార్లను అధ్యయనం చేశాడు. అందులో భాగంగా 10 గ్రామాల జనతన సర్కార్లను అధ్యయనం చేసి, వాటి రిపోర్టును, 12 మంది ఇంటర్వ్యూలను ఈ పుస్తకంలో పొందుపరిచాడు. ఒక ఏరియా జనతన సర్కారు మహాసభ (ఎన్నికల సభ)లో పాల్గొన్నాడు.

దండకారణ్య పరిశోధన పర్యటనలో తనకు కలిగిన జ్ఞానదాయకమైన అనుభవాలను, ఆలోచనలను రాయడానికి కథనం, డాక్యుమెంటరీ, విశ్లేషణ రూపాలను ఎంచుకోవడం  ఉపయోగకరంగా ఉంది. ఈ పద్ధతి ద్వారా దండకారణ్య, జనతన సర్కారు ఏర్పాటు నేపథ్యంలో పారిస్‌ కమ్యూన్‌ కాలం నుండి నక్సల్బరీ, శ్రీకాకుళ, ఉత్తర తెలంగాణ పోరాటాల వరకున్న చరిత్రను చెప్పడానికి వీలయ్యింది. ఈ పద్ధతి ద్వారా జనతన సర్కార్లను నిజమైన ప్రత్యామ్నాయంగా దేశ ప్రజల ముందుంచగలిగాడు. ఈ క్రమంలో తనకు కలిగిన అభిప్రాయాలను విప్లవోద్యమం ముందుంచాడు.

దండకారణ్యంలోని దోపిడీ ఉత్పత్తి సంబంధాలను, వాటిని నిలిపి ఉంచే రాజ్యవ్యవస్థను, సంస్కృతిని ధ్వంసం చేస్తూ, ఈ విధ్వంసంలో సాధించే ఫలితాలపై, స్థాయిపై ఆధారపడి ఆమేరకు నూతన ప్రజాస్వామిక ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక వ్యవస్థ ఇక్కడ నిర్మాణమవుతోంది. అందులో భాగంగా ఉత్పత్తిశక్తుల అభివృద్ధి జరుగుతూ ఉంది. బయటి సమాజంలో విప్లవోద్యమం సాగిస్తున్న విధ్వంసం గురించే వార్తలు వస్తుంటాయి. ఆ విధ్వంసపు రాజకీయ లక్ష్యం ఏమిటి?, ఏ సిద్ధాంత, రాజకీయాల ఆధారంగా ఈ విధ్వంసం జరుగుతోంది? అనేది ప్రచారం కాకపోవడంతో ఈ విధ్వంసం తీవ్రవాదమనో, ఉగ్రవాదమనో (టెర్రరిజం) ప్రచారమవుతుంటుంది. ఇలాంటి స్థితిలో ఈ విధ్వంసపు సిద్ధాంత, రాజకీయాల గురించి చెబుతూ ఆ విధ్వంసం స్థానంలో ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక రంగాల్లో జరుగుతున్న నిర్మాణాన్ని కళ్ళకు కట్టినట్టుగా రచయిత వర్ణించాడు. ఇది ఈనాటి అవసరం. దోపిడీ పీడనలతో తరతరాలుగా అణిగిమణిగి ఉన్న వ్యవసాయ కూలీ, పేద రైతాంగం, ముఖ్యంగా మహిళలు విప్లవ రాజకీయాలతో చైతన్యవంతమయ్యి జనతన సర్కారు నిర్మాణ-నిర్వహణ కృషిలో పోషిస్తున్న పాత్ర విశిష్టమైనది. జనతన సర్కార్లలో ఈ సెక్షన్ల పాత్రను ఈ పుస్తకం చక్కగా వివరిస్తుంది.

దండకారణ్యంలో నిర్మాణమయి, ప్రజా రాజ్యాధికారాన్ని అమలు చేస్తున్న జనతన సర్కార్లు సామ్రాజ్యవాద, దళారీ నిరంకుశ బూర్జువా, బడా భూస్వామ్య, అర్ధ వలస, అర్ధ భూస్వామ్య వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా నూతన ప్రజాస్వామిక ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక వ్యవస్థలను  ప్రాథమిక స్థాయిలో నిర్మిస్తున్నాయి. క్రాంతికారీ జనతన సర్కార్లు నిర్మిస్తున్న ఈ ప్రజా ప్రత్యామ్నాయాన్ని ఈ పుస్తకం ద్వారా సరిగా అర్థం చేసుకోవడానికి తోడ్పడేలా దండకారణ్య విప్లవోద్యమ చరిత్రను సంక్షిప్తంగానైనా పేర్కొనడం అవసరం.

దండకారణ్యంలో క్రీ.పూ 600 నాటికి గణాలు ఏర్పడ్డాయి. అప్పటి నుండి క్రీ.శ. 1324 వరకు దండకారణ్యంలో గణాలు, గణ రాజ్యాలు కొనసాగాయి. క్రీ.శ 1324లో తెలంగాణ ప్రాంతం నుండి కాకతీయులు దండకారణ్యంపై దాడిచేసి, ఈ ప్రాంతంలో తమ రాజ్యాన్ని నెలకొల్పారు. ఆనాటి నుండి దాదాపు 450 సంవత్సరాలపాటు అంటే 1324 నుండి 1774 వరకు కాకతీయులే దండకారణ్యాన్ని పరిపాలించారు. ఈ కాలంలో మధ్య మధ్యలో ఇతర రాజవంశాలు/రాజులు దండకారణ్యంపై దండెత్తి కొద్ది భూభాగంపై, కొంతకాలం రాజ్యమేలారు. అందులో భాగంగా 1369-1534 నడుమ తెలంగాణ రెడ్డి రాజులు, ఉత్తరాది నుండి కలచూరి రాజులు దండెత్తి, రాజ్యమేలారు. 1602-25 నడుమ దక్షిణ కుతుబ్‌షాహీలు బస్తర్‌పై దాడులు చేశారు. 1721-1731 నడుమ రీవాకు చెందిన చందేలి రాజులు బస్తర్‌పై దాడులు చేశారు. ఈ రకంగా తమ రాజ్యాన్ని కాపాడుకోవడానికి రాజులందరిలాగే కాకతీయ రాజులు కూడా ప్రజల నుండి పెద్దఎత్తున పన్నులు వసూలు చేశారు. ఆనాడు అత్యంత వెనుకబడిన వ్యవసాయం, పశుపోషణ, చేతివృత్తులు, వ్యాపారం చేసే వర్గాలుండేవి. వీరినుండి వస్తు రూపేణా రాజులు పన్నులు వసూలు చేసేవారు. ఇతర రాజులను ఎదుర్కొనే క్రమంలో కాకతీయ రాజుల ఆర్థిక పరిస్థితి బలహీనపడింది. ఈ స్థితిలో నాగ్‌పూర్‌ కేంద్రంగా రాజ్యమేలిన మరాఠా భోంస్లేలు 1777లో బస్తర్‌/దండకారణ్యంపై దండెత్తి కాకతీయులను ఓడించారు. 1818లో మరాఠా రాజులకు బ్రిటిష్‌వారికి నడుమ సంధి జరిగింది.

1853లో బ్రిటిష్‌వాళ్ళు మరాఠాల నాగ్‌పూర్‌ రాజ్యాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నారు. దీంతో దండకారణ్య ప్రాంతమంతా (బస్తర్‌, గడ్చిరోలి) అప్పటి నుండి బ్రిటిష్‌ వారి ప్రత్యక్ష రాజ్యాధికారంలోకి వెళ్ళింది.

బ్రిటిష్‌వాళ్లు బస్తర్‌లో 1861 నుండి రైత్వారీ పద్ధతిని ప్రవేశపెట్టారు. రైత్వారీ పద్ధతి ప్రకారం తమ గ్రామ సమీప భూములపై వ్యక్తిగత అధికారాల్ని కల్పిస్తూ రైతాంగానికి పట్టాలు ఇచ్చారు. రైత్వారీ వ్యవస్థ ఉద్దేశమే రెవెన్యూ వసూళ్ల కోసం కాబట్టి, రైతాంగం నుండి రెవెన్యూ వసూళ్ల కోసం ‘పటేళ్ల’ను నియమించారు. దీంతో అప్పటి వరకు ఆదివాసీ తెగల్లో గ్రామపెద్దలుగా ఉన్న గైతాల్‌/పెద్దాల్‌లే పటేళ్లుగా కూడా వ్యవహరించారు. వీరిపైన ‘పరగణ’ ముఖ్యులుగా ‘మాంజీ’లుండేవారు. 1910 నాటికి బస్తర్‌లో 84 పరగణాలుండేవి.

ఒకవైపు రైత్వారీ వ్యవస్థను ప్రవేశపెట్టిన తరువాత బ్రిటిష్‌వాళ్లు మరోవైపు 1894లో అటవీ చట్టాన్ని రూపొందించారు. ఈ చట్టం ప్రకారం అడవిని నాలుగు భాగాలుగా 1. ప్రొటెక్టెడ్‌ (రక్షిత), 2. రిజర్వు, 3. తేలికపాటి అడవులున్న/పొదలున్న ప్రాంతం. దీనిని హిందీ/మరాఠీలో జుడిపి జంగల్‌ అంటారు. 4. నిస్తార్‌ అడవులు-ఈ అడవిలో ప్రజలు తమ పశువులను మేపుకోవచ్చు. ఈ రకంగా విభజించి అడవులను ఆదివాసుల నుండి లాగేసుకున్నారు. అప్పటి వరకు తమదిగా ఉన్న అడవిపై అధికారం కోల్పోయిన ఆదివాసులు పశువులు మేపుకోవాలను కున్నా, పొయ్యిలోకి కర్రలు తెచ్చుకోవాలనుకున్నా, ఇళ్ళు కట్టుకోవడానికి కర్రలు తెచ్చుకున్నా ప్రభుత్వానికి పన్నులు కట్టాల్సి వచ్చింది. ఈ పన్నుల వసూళ్లతోపాటు, బ్రిటిష్‌వారి వ్యాపార, పారిశ్రామిక అవసరాల కోసం అడవి సంపదను తరలించడానికి అటవీ విభాగం (ఫారెస్ట్‌ డిపార్ట్‌మెంట్‌) ఉనికిలోకి వచ్చింది. ఈ అటవీ విభాగపు సిబ్బంది ఆదివాసులను తీవ్రంగా హింసించేవారు.

ఆదివాసులు తాగే కల్లుపై టాక్సు వసూలు చేయడానికి 1901లో అబ్కారీ విభాగాన్ని ఏర్పాటు చేశారు. తమ వ్యాపార, పారిశ్రామిక అవసరాల కోసం అడవి సంపదను తరలించడంతోపాటు, తమ రాజ్యాన్ని సంఘటితం చేసుకోవడానికి తోడ్పడేలా రోడ్ల నిర్మాణాన్ని చేపట్టారు.

1898లో రాయ్‌పూర్‌-జగదల్‌పూర్‌ రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేశారు. 1904 నాటికి ఈ రోడ్డును కుంట వరకు విస్తరింప చేశారు. రాయ్‌పూర్‌ నుండి కుంట 600 కిలోమీటర్లు   ఉంటుంది. ఇదే సమయంలో జగదల్‌పూర్‌ నుండి చంద్రపూర్‌ (ఆ కాలంలో చాందా అనే వాళ్ళు) రోడ్డు నిర్మాణం కూడా పూర్తి చేశారు.

గడ్చిరోలి జిల్లాలో ఎన్నో జమిందారీలుండేవి. అందులో ముఖ్యమైన వాటిలో ఒకటి అహిరి జమిందారీ. ఆ జమిందారు ప్రతి సంవత్సరం 77వేల రూపాయల పన్ను బ్రిటీిష్‌ వాళ్లకు చెల్లించేవాడు.

బ్రిటిష్‌వాళ్లు భారతదేశాన్ని ఆక్రమించిన తరువాత భూస్వామ్య విధానంలో ముఖ్యమైన మార్పులు వచ్చాయి. అవి :

1.           రైత్వారీ పద్ధతిని ప్రవేశపెట్టి భూమిని వ్యక్తిగత ఆస్తిగా మార్చి, దాన్ని అమ్మకపు సరుకుగా మార్చడం.

2.           వ్యవసాయంలో వ్యాపార పంటల్ని ప్రవేశపెట్టడం.

3.           పన్నులు, అప్పులు కట్టలేక భూములు కోల్పోయిన రైతాంగం కూలీలుగా, పారిశ్రామిక కార్మికులుగా మారారు.

ఈ మార్పుల ఫలితంగా భూస్వామ్య దేశంగా ఉన్న భారతదేశం అర్ధ భూస్వామ్య-వలస దేశంగా మారిపోయింది. ఈ లక్షణాలు దండకారణ్యంలో ప్రాథమిక స్థాయిలో ప్రారంభ మయ్యాయి.

బ్రిటిష్‌వారు 1894లో అటవీ చట్టం ప్రవేశ పెట్టేనాటికి బస్తర్‌లో 70% భూభాగంలో అడవులుండేవి. అప్పుడున్న జనాభాలో 2/3వ వంతు మంది ప్రజలు పోడు వ్యవసాయం (షిఫ్టింగ్‌ కల్టివేషన్‌) చేసేవాళ్ళు. దీన్ని కోయలో ‘పేంద (పోడు) నడకనా (నరకడం)’ అంటారు. బ్రిటిష్‌వారు ఒకవైపు ఆదివాసీ ప్రాంతాలతోసహా దేశవ్యాప్తంగా రైత్వారీ, జమిందారీ వ్యవస్థలను ప్రవేశ పెట్టడంతోపాటు, అడవీ చట్టాల్ని తీసుకువచ్చి అటవీ విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఆదివాసులు అడవిపై హక్కులు కోల్పోయారు. దీంతో పోడు వ్యవసాయాన్ని క్రమక్రమంగా వదులుకోవాల్సి వచ్చింది. బ్రిటిష్‌వారి అడుగుజాడల్లో నడిచిన భారత పాలకవర్గాలు 1947 ఆగష్టు 15 అధికార మార్పిడీ తరువాత కూడా అవే ప్రజావ్యతిరేక చట్టాలను అమలు చేయడంతో ఫారెస్టు సిబ్బంది, అధికారులు ఆదివాసులను నిరంతరం వేధింపులకు గురిచేస్తూ వచ్చారు. ఈ స్థితిలో దండకారణ్య ప్రాంతమంతటా 1980కి ముందే పోడు వ్యవసాయం స్థానంలో స్థిర వ్యవసాయం ఉనికిలోకి వచ్చింది.

అయితే 1947 నుండి ఇప్పటి వరకు భారత దోపిడీ పాలకవర్గాలు అనుసరించిన ఆదివాసీ వ్యతిరేక విధానాలకు తోడు వడ్డీ వ్యాపారుల, కాంట్రాక్టర్ల, గైరాదివాసీ భూస్వాముల దోపిడీ పీడనలలో ఆదివాసుల వ్యవసాయం అభివృద్ధి కాకుండా వెనుకబడి పోయింది. ఈ వెనుకబడిన వ్యవసాయ విధానపు లక్షణాలు ఏమిటంటే.. నీటిపారుదల సౌకర్యాలు దాదాపుగా లేకపోవడంతో వ్యవసాయం వర్షాధారం కావడం, ఫలితంగా సంవత్సరానికి ఒకే పంట తీయడం, తమ సంస్కృతి, సాంప్రదాయాల వల్ల కలుపు తీయకపోవడం, ఎరువులు వేయకపోవడం, ఫలితంగా ఉత్పాదకత అత్యంత తక్కువగా ఉండడం. ఇలాంటి వెనుకబడిన వ్యవసాయ పద్ధతులను అభివృద్ధి చేయడానికి జనతన సర్కార్లు కృషి చేస్తున్నాయి.

కాకతీయ రాచరికపు రోజుల నుండి ఆదివాసీ తెగపెద్దలు రాజులకు వస్తురూపేణా పన్నులు వసూలు చేసేవాళ్లు. వీరే బ్రిటిష్‌వారి కాలంలో పటేళ్లుగా మారి వారికి రెవెన్యూ వసూలు చేసి ఇచ్చేవారు. 1947 తదనంతరం వీరి కుటుంబాల వాళ్లే వివిధ ప్రభుత్వ విభాగాల ప్రభుత్వ అధికార సిబ్బందిగా, అధికారులుగా మారారు. మరోవైపు గ్రామాల్లో తెగ సంస్కృతి-సంప్రదాయాల పేరుతో ‘వెట్టి’ పనులు చేయించుకోవడం (దున్నించుకోవడం, తమ భూముల్లో చెరువుల, కుంటల నిర్మాణం పనులు చేయించుకోవడం), అటవీ ఉత్పత్తుల సేకరణ నుండి ఉచితంగా వాటా పొందడం వగైరా రూపాల్లో ప్రజల శ్రమశక్తిని దోపిడీ చేసి, మిగులును తమ స్వంతం చేసుకునేవారు. ఈ రకంగా స్థానికంగా ప్రజానీకాన్ని దోపిడీ చేస్తూ, ప్రభుత్వానికి సామాజిక పునాదిగా ఉండేవారు. దీనికితోడు గ్రామాల్ని రాజకీయంగా, తమ నియంత్రణలో ఉంచుకుంటూ, సాంస్కృతికంగా తెగ రీతి రివాజులను అమలు చేయిస్తూ ఉత్పత్తి శక్తుల అభివృద్ధికి అడ్డుగా నిలిచారు. వీరిపట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉండేది. మరోవైపు దోపిడీ ప్రభుత్వాలు వాటి అధికార గణం వీరి మద్దతుతో అడవిని, అడవిలో ప్రజలను దోచుకునేవారు. ఈ రకంగా తెగపెద్దలు దోపిడీ ప్రభుత్వానికి సామాజిక పునాదిగా పని చేసేవారు.

పీపుల్స్‌వార్‌ పార్టీ అడవిలోకి ప్రవేశించి ప్రజలను ఆర్గనైజ్‌ చేసే క్రమంలో ఈ తెగ పెద్దల్లో ఒక సెక్షన్‌ ప్రజానుకూలంగా మారారు. ఒక సెక్షన్‌ తటస్థం కాగా, మరో సెక్షన్‌ ప్రజా వ్యతిరేకులుగా, పార్టీ వ్యతిరేకులుగా నిలబడ్డారు. ఈ ప్రజా వ్యతిరేక తెగపెద్దలు, పెత్తందార్లలో అత్యధికులకు ఉత్పత్తి సాధనాలైన భూమి, పశు సంపద, నాగళ్లు అధికంగా ఉండేవి. ప్రజలతో వెట్టి చేయించుకోవడం, డబ్బు, ధాన్యం, పశువుల్ని అప్పుగా ఇచ్చి వడ్డీలు లాగటం, రాజకీయంగా, సాంస్కృతికంగా ప్రజల్ని దోపిడీ, పీడనలకు గురిచేయడంతో విప్లవోద్యమం వీరిని భూస్వాములుగా, ప్రజా వ్యతిరేకులుగా గుర్తించి వీరికి వ్యతిరేకంగా వర్గపోరాటాన్ని నడిపింది. ఈ కుటుంబాల నుండి వచ్చినవారే 1947 తరువాత దోపిడీవర్గ రాజకీయ పార్టీల కార్యకర్తలుగా, నాయకులుగా మారారు. వీరికితోడు బయటి ప్రాంతాల నుండి వచ్చిన భూస్వాములు, బడా వ్యాపారులు, వడ్డీ వ్యాపారులు, కాంట్రాక్టర్లు, రాజకీయ నాయకులు తమ ఆర్థిక, రాజకీయ ప్రయోజనాల రీత్యా విప్లవోద్యమానికి వ్యతిరేకంగా, దోపిడీ ప్రభుత్వానికి సామాజిక పునాదిగా దృఢంగా నిలబడ్డారు. ఈ రకంగా స్థానిక గ్రామాల్లో ప్రజావ్యతిరేక తెగపెద్దలు, పెత్తందార్లు, బయటి ప్రాంతాల నుండి వచ్చి దండకారణ్యంలో స్థిరపడ్డ దోపిడీదార్లు సమైక్యమయ్యి జనజాగరణ్‌, సల్వాజుడుం పేర్లతో ఉద్యమానికి వ్యతిరేకంగా నిలబడ్డారు. ఈ శక్తులే ఇప్పుడు ఆపరేషన్‌ గ్రీన్‌హంట్‌కు కూడా మద్దతుగా నిలుస్తున్నాయి.

మైదాన ప్రాంత భూస్వామ్య శక్తులతో తెగపెద్దలను పోల్చడం కుదరనప్పటికీ వీరు విడిగా లేరు. వీళ్ళు బయటి ప్రాంతాల నుండి వచ్చిన దోపిడీ శక్తులతో మిలాఖత్తయి, దోపిడీ ప్రభుత్వానికి సామాజిక పునాదిగా నిలుస్తున్న ఫలితంగా ఇక్కడ వర్గపోరాటం తీవ్రంగానే కాకుండా, హింసాయుతంగా, రక్తపాతంతో సాగుతోంది. మహేంద్రకర్మలాంటి ఆదివాసీ భూస్వామ్య కుటుంబాలు బ్రిటిష్‌వారి కాలం నుండి దోపిడీ ప్రభుత్వాల తరపున దృఢంగా నిలబడి ప్రజా వ్యతిరేంగా కొనసాగుతూ ఉన్నాయి. ఈ కుటుంబాల్లో కొంతమందిని విప్లవోద్యమం నిర్మూలించినప్పటికీ, ఇప్పటికీ ప్రజా వ్యతిరేకులుగా దోపిడీ ప్రభుత్వం పక్షానే దృఢంగా నిలబడుతున్నారు. దీనికి తాజా ఉదాహరణ మహేంద్రకర్మ కొడుకు ఛబీంద్రకర్మ బస్తర్‌లో విప్లవోద్యమం అభివృద్ధికి అడ్డుగా నిలిచిందని ప్రచారం చేస్తూ మావోయిస్టులకు వ్యతిరేకంగా బస్తర్‌ వికాస్‌ సంఘర్ష్‌ కమిటీని నెలకొల్పుతున్నట్లు ఈ ఏడాది మే 5నాడు ప్రకటించాడు. అంటే ఇది రెండవ సల్వాజుడుం అన్నమాట. కాబట్టి దోపిడీ వర్గానికి ఆధారంగా (సామాజిక పునాది) ఉండే వర్గాన్ని ఈ నేపథ్యంలో చూడాలి. అంటే చారిత్రకంగా రాచరికపు రోజుల నుండే రాచరిక రాజ్యానికి, ఆ తదనంతరం ఏర్పడ్డ అర్ధ ఫ్యూడల్‌-వలస రాజ్యానికి, అధికార మార్పిడి తరువాత అర్ధ ఫ్యూడల్‌-అర్ధ వలస రాజ్యానికి తెగపెద్దలు, ఈ ప్రాంత భూస్వాములు, వడ్డీ వ్యాపారులు, బడా వ్యాపారులు సామాజిక పునాదిగా పనిచేస్తున్నారు. బ్రిటిష్‌వారు అటవీ చట్టం తీసుకువచ్చిన 1891-94 నుండి పోడు వ్యవసాయం క్రమక్రమంగా తగ్గిపోతూ స్థిర వ్యవసాయం మొదలైంది. వేర్వేరు వెట్టి రూపాల్లో ప్రజల మిగులును కాజేసిన తెగపెద్దల ఆర్థికపునాది బలపడింది. 1947 తరువాత దోపిడీ ప్రభుత్వంతో మిలాఖత్తు అయితేనే వారి ఆర్ధిక, రాజకీయ ప్రయోజనాలు నెరవేరే పరిస్థితి ఉండటంతో దండకారణ్యంలో దోపిడీ వర్గ ప్రభుత్వానికి వీరు సామాజిక పునాదిగా ఏర్పడ్డారు. అందుకే దండకారణ్యంలో స్థానికంగా ప్రజా వ్యతిరేక తెగపెద్దలకు, భూస్వాములకు వ్యతిరేకంగా తీవ్రమైన వర్గపోరాటం సాగింది. ఆ వర్గాలు దోపిడీ వర్గ రాజ్యంతో మిలాఖత్తయి ప్రజలకు, విప్లవోద్యమానికి వ్యతిరేకంగా సాగించిన జనజాగరణ్‌, సల్వాజుడుంలను అణచివేయడం వల్లే ఇక్కడ ప్రజా రాజ్యాధికార అంగాలు ఏర్పడి, కొనసాగుతున్నాయి.

అయితే సహజంగానే మైదాన గ్రామీణ ప్రాంత ఉత్పత్తి/ఆర్థికవ్యవస్థ బలంగా ఉండడంతో, ఆ ఉత్పత్తిలోని మిగులును దోపిడీచేసే వర్గాలు ఆర్థికంగా బలంగా ఉండి, దోపిడీ రాజ్యానికి బలమైన సామాజిక పునాదిగా నిలుస్తాయి. దాంతో దండకారణ్య ఆర్థిక వ్యవస్థను పోల్చలేము.

దండకారణ్యం అపారమైన సహజ వనరులకు నిలయం కావడంతో వాటిని కొల్లగొట్టుకుపోవడానికి దేశీ, విదేశీ కార్పొరేటు సంస్థలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ రెండు మిలాఖత్తయి గానీ, విడివిడిగా గానీ ఇక్కడ పెద్దఎత్తున పెట్టుబడులు పెడుతున్నాయి.

ఈ పెట్టుబడుల లూటీకి తోడ్పడడం కోసం ‘మౌలిక వసతులు’ కల్పన పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రపంచబ్యాంకు, ఐఎమ్‌ఎఫ్‌, ఆసియా డెవలప్‌మెంట్‌ బ్యాంకు తదితర సామ్రాజ్యవాద ద్రవ్యసంస్థల నుండి పెద్దఎత్తున పెట్టుబడుల్ని తెచ్చి రోడ్డు, రవాణా, మ్యూనికేషన్‌, ఇన్‌ఫర్మేషన్‌, విద్యుచ్ఛక్తి ప్రాజెక్టులు తదితరాల్ని నిర్మిస్తోంది. దేశ, విదేశ కార్పొరేట్‌ సంస్థల పెట్టుబడులూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలూ కలసి ఇక్కడ చేస్తున్న వనరుల లూటీకి తెగపెద్దల, పెత్తందార్ల కుటుంబాల వాళ్లు, మరికొంత మంది కలిసి కాంట్రాక్టర్లుగా, మేనేజర్లుగా, సూపర్‌వైజర్లుగా, రాజకీయ నాయకులుగా, సర్పంచ్‌ నుండి మొదలుకుని ఎమ్‌ఎల్‌ఏ/ఎమ్‌పీ, మంత్రులుగా సహకరిస్తున్నారు. ఆ లూటీలో భాగమవుతున్నారు. ఈ క్రమంలో శ్రామికుల శ్రమశక్తి దోపిడీ ద్వారా అదనపు విలువను కొల్లగొట్టడంతోపాటు, ప్రజలకు, దేశానికి చెందాల్సిన వనరులు వీరి స్వంతమవుతున్నాయి. ఈ లూటీలో కేంద్రంలో ఆ కొసన ప్రధానమంత్రి ఉంటే, ఈ కొసన గ్రామస్థాయిలో సర్పంచ్‌లు, ఆ కొసన కేంద్ర ప్రభుత్వపు బ్యూరాక్రసీ ఉంటే, ఈ కొసన రాష్ట్ర ప్రభుత్వపు బ్యూరాక్రసీతోపాటు గ్రామ సేవక్‌లు (సర్పంచ్‌లకు గ్రామ పంచాయితీ వ్యవహారాల్లో సహకరించే ప్రభుత్వ ఉద్యోగి) ఉన్నారు. ఈ లూటీకి కేంద్ర పారా మిలిటరీ బలగాల నుండి స్థానిక పోలీసుల వరకు సాయుధ దన్ను అందిస్తున్నారు. కాబట్టి స్థానిక స్థాయిలోని తెగపెద్దలను, పెత్తందార్లను విడిగా కాకుండా సామ్రాజ్యవాద, దళారీ బూర్జువా సంస్థల పెట్టుబడులు అడవి ప్రాంతాల్లోకి ప్రవహించే క్రమంలో వాటి లూటీకి, వాటికి సాయుధ దన్ను అందించే దోపిడీ రాజ్యానికి వాళ్ళు సామాజిక పునాదిగా మారుతున్న క్రమాన్ని చూడాలి. లేకుంటే ప్రస్తుత ప్రపంచీకరణ నేపథó్యంలో గ్రామస్థాయి వరకు జరుగుతున్న పరిణామాలను పరస్పర సంబంధంలో చూడని జడతార్కిక పద్ధతి తలెత్తుతుంది. జడతార్కిక అధ్యయన ఫలితంగా గ్రామాల్లోని ఆదివాసీ తెగ పెద్దల్ని అస్తిత్వవాద దృష్టితోనో, మరో దృష్టితోనో చూసే ప్రమాదం ఏర్పడుతుంది. అందుకేే ప్రస్తుతం దండకారణ్యంలో జరుగుతున్న వర్గపోరాటానికి సామ్రాజ్యవాద వ్యతిరేక, దళారీ బూర్జువా వ్యతిరేక, భూస్వామ్య వ్యతిరేక, ప్రజా వ్యతిరేక తెగ పెద్దలకు వ్యతిరేకంగా సాగే స్వభావం ఉన్నది. గ్రామాల్లోని తెగ పెద్దలు, పెత్తందార్లు, ఏకకాలంలో ఉత్పత్తి శక్తుల అభివృద్ధిని ఆటంకపరిచే వెనుకబడిన ఉత్పత్తి సంబంధాలకు ప్రతినిధులుగానే కాకుండా, మరోవైపు సహజ వనరుల దోపిడీలో సామ్రాజ్యవాద, దళారీ బూర్జువా పెట్టుబడికి సామాజిక పునాదిగా పనిచేసే శక్తులుగా కూడా వ్యవహరిస్తున్నారు. అందుకే రాజ్యం దన్నుతో ఈ వర్గాలు విప్లవోద్యమాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. సామ్రాజ్యవాద పెట్టుబడి ప్రవాహం, చలనం గ్రామస్థాయి వరకు కలిగిస్తున్న ఆర్థిక, రాజకీయ, సామాజిక మార్పుల నేపథ్యంలో చూసినప్పుడు తెగపెద్దలు, పెత్తందార్లు రాజ్యానికి సామాజిక పునాదిగా నిలుస్తున్న దాంట్లోని బలమూ, దాన్ని వెన్నంటే ఇక్కడ సాగుతున్న వర్గపోరాటపు-సాయుధ పోరాటపు తీవ్రతా, లోతూ, విస్తృతీ అర్థమవుతాయి.

దండకారణ్యం నుంచి వనరుల లూటీకి అడ్డుగా ఎదిగిన విప్లవోద్యమాన్ని భారతరాజ్యం పెద్దఎత్తున పారామిలిటరీ, పోలీసు బలగాల్ని మోహరించి అణచివేయదల్చుకున్నది. ఫలితంగా దోపిడీ వర్గాల సాయుధ బలగాలకు, ప్రజా గెరిల్లా బలగాలకు నడుమ తీవ్రమైన యుద్ధం కొనసాగుతోంది. ఈ యుద్ధాన్ని వెన్నంటే, ఈ యుద్ధంలోని ఫలితాల ఆధారంగానే దండకారణ్యంలో ప్రజారాజ్యాధికారం (జనతన రాజ్‌) అమలవుతోంది.

భారత విప్లవ యుద్ధపు స్వాభావిక లక్షణాల ఆధారంగా మనం మిలిటరీ పంథాను దీర్ఘకాలిక ప్రజాయుద్ధ పంథాగా నిర్వచించుకున్నాం. దాని ప్రకారం భారత రాజ్యం కేంద్రీకృతమైనది, బలమైనది కాబట్టి కొండలు, గుట్టలు, అడవులతో కూడుకొని ఉన్న వ్యూహాత్మక ప్రాంతాల్లో, శతృవు బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో మొదట విముక్తి ప్రాంతాన్ని నిర్మించాలనీ, వాటి ఆధారంగా, దేశంలోని ఇతర ప్రాంతాల్లో గెరిల్లాజోన్లను, స్థావర ప్రాంతాలను నిర్మించాలనీ లేదా స్థావర ప్రాంతాలను సంఘటితపరుస్తూ, విస్తరించాలనీ నిర్ణయించుకున్నాం.

రాజ్యం శక్తివంతంగా ఉండే మైదాన ప్రాంతాల్లో ప్రజా రాజ్యాధికార అంగాలు నిర్మించడం సాపేక్షికంగా కష్టమే. కానీ దేశంలో, అంతర్జాతీయంగా ఉండే ఆర్థిక, రాజకీయ సంక్షోభాలను ఉపయోగించుకుని అలాంటి ప్రాంతాల్లో కూడా ప్రజా రాజ్యాధికార అంగాలను నిర్మించవచ్చు. లాల్‌గఢ్‌ లాంటి ప్రజా ప్రభంజనాలు వెల్లువెత్తినప్పుడు కొంతకాలం పాటు ప్రజారాజ్యాధికార అంగాల్ని నిర్మించవచ్చు. వ్యూహాత్మక ప్రాంతాల్లో ఏర్పడిన విముక్తి ప్రాంతాలు సంఘటితపడుతున్న క్రమంలో మైదాన ప్రాంతాల్లో కూడా ప్రజా రాజ్యాధికార అంగాల్ని నిర్మించడమేకాకుండా వాటిని కూడా విముక్తి ప్రాంతాలుగా మార్చవచ్చు. మైదాన ప్రాంతాల్లో శతృవు బలంగా ఉంటాడనే అంశాన్ని పరిగణనలోకి తీసుకుని అలాంటి ప్రాంతాలు దీర్ఘకాలం గెరిల్లాజోన్లుగా  ఉంటాయని మనం గుర్తిస్తాం. కాబట్టి వ్యూహాత్మక ప్రాంతాల్లో విముక్తి ప్రాంతాలు నిర్మించే కృషికి ప్రాధాన్యతనిస్తూ శతృవు బలంగా ఉండే మైదాన ప్రాంతాల్లో గెరిల్లాజోన్లు నిర్మించాలి. ఈ క్రమం పాటించడం ద్వారా ప్రజాయుద్ధంలో వ్యూహాత్మక మార్పులకు కృషి చేయాలి. మొదట దేశంలో ఒకటి-రెండు చోట్లనయినా విముక్తి ప్రాంతాల్ని నిర్మించగలిగితే అవి మైదాన, పట్టణ ప్రాంత ప్రజానీకంపై వేసే ప్రభావాన్ని ఉపయోగించుకుని మైదాన ప్రాంతాల్లో సైతం ప్రజా రాజ్యాధికార అంగాలను నిర్మించవచ్చు. మైదాన గ్రామీణ ప్రాంతాల్లో ప్రజారాజ్యాధికార అంగాలను నిర్మించడం కష్టమే గానీ అది అసాధ్యం కాదు.

దండకారణ్యం ఆదివాసీ సమాజమే. 1947 ఆగస్టు 15 అధికార మార్పిడి తరువాత దండకారణ్య సమాజం అర్ధ వలస-అర్ధ భూస్వామ్య సమాజంలో భాగమైంది. ఇది పరస్పర వ్యతిరేకమైన రెండు భిన్నమైన వర్గాలున్న సమాజం. బ్రిటిష్‌ వారు ఏర్పాటు చేసిన పోలీసు, రెవెన్యూ, అటవీ, అబ్కారీ శాఖలు 1947 తరువాత మరింతగా విస్తరించి, బలపడి తమ దోపిడీని పెంచాయి. వీటితోపాటు రకరకాల అటవీ ఉత్పత్తులను సేకరించే కాంట్రాక్టర్లు, పేపరు మిల్లులు, అడవిని నరికించే కార్పొరేషన్లు, రోడ్లు, ప్రభుత్వ భవనాల నిర్మాణం చేయించే కాంట్రాక్టర్లు, వ్యాపారులు, వడ్డీ వ్యాపారులు రావడం పెరిగింది. స్థానిక తెగ పెద్దలతో కలిసి వారంతా ఇక్కడి ప్రజానీకాన్ని దోపిడీ చేసే వర్గంగా ఉనికిలోకి వచ్చారు.

1947 తరువాత స్థానిక తెగపెద్దలు, పెత్తందార్లు భారత దోపిడీ వర్గాలకు సామాజిక పునాదిగా మారారు. 1950ల చివర్లో ఉనికిలోకి వచ్చిన పంచాయితీరాజ్‌ వ్యవస్థ ద్వారా సర్పంచ్‌లు కూడా దోపిడీ రాజ్యానికి సామాజిక పునాదిగా మారారు. వీరికి తోడుగా గైరాదివాసీ భూస్వాములు, వడ్డీవ్యాపారులు, బడా వ్యాపారులు రకరకాల కాంట్రాక్టర్లు కలిసి దోపిడీ వర్గంగా సంఘటితపడ్డారు. వలస పాలన అనంతర కాలం నుండి సామ్రాజ్యవాద, దళారీ నిరంకుశ బూర్జువా పెట్టుబడులు వనరుల దోపిడీ కోసం, మార్కెట్‌ కోసం దండకారణ్యంలోకి నిరంతరం ప్రవహిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో అదనపు విలువను కొల్లగొట్టే కాంట్రాక్టర్లు, మేనేజర్లు, రాజకీయ నాయకులు, వివిధ స్థాయిల ప్రభుత్వ అధికార గణం సామ్రాజ్యవాదులకు, దళారీ నిరంకుశ బూర్జువాజీకి సామాజిక పునాదిగా మారుతున్నారు. వీరంతా దోపిడీవర్గంలో భాగమే. దండకారణ్యంలో దోపిడీ వర్గాలంటే కేవలం ఆదివాసీ తెగపెద్దలు, పెత్తందార్లే కాదు. వాళ్ళతోపాటుగా ఈ సమాజంలోని మిగులును కొల్లగొట్టే (ఆదివాసీ-ఆదివాసేతర) వర్గమంతా కలిసే దోపిడీ వర్గం. రాజ్యం దన్నుతో ఈ వర్గాల దోపిడీ, పీడనలు తీవ్రతరమవుతూ వచ్చాయి. ఇలాంటి స్థితిలో 1980లో భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు-లెనినిస్టు) (పీపుల్స్‌వార్‌) పార్టీ దళాల రూపంలో దండకారణ్యంలోకి ప్రవేశించింది.

1980లో దండకారణ్యంలోకి ప్రవేశించిన పీపుల్స్‌వార్‌ పార్టీ ఆనాటి నుండి ఈనాటి వరకు వర్గపోరాట సిద్ధాంతమైన మార్క్సిజం-లెనినిజం-మావోయిజాన్ని, దీర్ఘకాలిక ప్రజాయుద్ధ పంథాను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేసింది. దాన్ని దండకారణ్యంలోని నిర్దిష్ట పరిస్థితులకు సృజనాత్మకంగా అన్వయించిన ఫలితంగానే ఇక్కడ గెరిల్లా జోనును, గెరిల్లాబేసులను నిర్మించగలిగింది. అందులో భాగమే క్రాంతికారీ జనతన సర్కార్ల నిర్మాణం.

దండకారణ్యాన్ని గెరిల్లాజోన్‌గా అభివృద్ధి చేసే క్రమంలో స్థానిక దోపిడీ వర్గాలను, స్థానిక శతృవులను, శతృవుకు చెందిన సాయుధ బలగాలను (పోలీసు, పారామిలిటరీ, కమాండోలు) తీవ్రంగా ఎదుర్కొంటున్నాం. 1988 నాటికి దండకారణ్యం గెరిల్లాజోన్‌గా అభివృద్ధి అయిన నాటి నుండి మరింత స్పష్టంగా 1990 నుండి ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర పోలీసు బలగాలతో విప్లవోద్యమం తలపడుతూ వస్తోంది. మరోవైపు రాజ్యం దన్నుతో స్థానిక శతృవులు ప్రారంభించిన జన జాగరణ్‌ అభియాన్లను విప్లవోద్యమం ఓడించింది. ఈ క్రమంలోనే 1995 నుండి గ్రామరాజ్య కమిటీల (క్రాంతికారీ జనతన సర్కార్ల) నిర్మాణం మొదలైంది. దాదాపు దశాబ్దకాలం పాటు అనేక గ్రామాల్లో నిర్మించిన గ్రామరాజ్య కమిటీల అనుభవాలను సమీక్షించుకుని, వాటి సంఘటిత పునాదిపై ఆధారపడి ఏరియా జనతన సర్కార్లను 2005 డిశంబరు నుండి నిర్మించడం మొదలైంది. అంతర్జాతీయంగా సమకాలీన మావోయిస్టు సాహిత్యంలో స్థానిక స్థాయి ప్రజా ప్రభుత్వాలను విప్లవ ప్రజా కమిటీలు (రెవల్యూషనరీ పీపుల్స్‌ కమిటీస్‌-ఆర్‌పీసీలు)గా పేర్కోవడాన్ని పరిగణనలోకి తీసుకుని 2001 నుండి గ్రామరాజ్య కమిటీలనే విప్లవోద్యమం విప్లవ ప్రజాకమిటీలుగా పిలుస్తోంది. అయితే ఈ ఆర్‌పీసీల భావనను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళడం కోసం దండకారణ్యంలో కోయభాషలో జనతన సర్కార్లుగా/క్రాంతికారీ జనతన సర్కార్లని అంటున్నాం.

భూస్వామ్య వ్యతిరేక, సామ్రాజ్యవాద వ్యతిరేక శక్తుల పోరాట సాధనంగా; ఏరియా, డివిజనల్‌ జనతన సర్కార్ల సమన్వయ కేంద్రంగా జోన్‌ స్థాయిలో (రాష్ట్ర స్థాయిలో) ప్రజా రాజ్యాధికార ప్రచార కేంద్రంగా భవిష్యత్తులో నిర్మాణమయ్యే ప్రజా రాజ్యాధికారానికి పిండరూపంగా 2008లో జోన్‌ జనతన సర్కారు సన్నాహక కమిటీని ఏర్పాటు చేశాం.

ఈ ప్రజా రాజ్యాధికార అంగాలను ధ్వంసం చేసేందుకు 2005 జూన్‌ నుండి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సల్వాజుడుం అభియాన్‌ (క్యాంపెయిన్‌) పేరిట పెద్ద సైనిక క్యాంపెయిన్‌ను నడిపాయి. దీన్ని ప్రజలు, పీఎల్‌జీఏ, పార్టీ సమైక్యంగా తప్పికొట్టి 2009 నాటికి ఓడించాయి. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 2009 మధ్యభాగం నుండి ఆపరేషన్‌ గ్రీన్‌హంట్‌ పేరుతో మరో పెద్ద సైనిక దాడిని ప్రారంభించాయి. సల్వాజుడుం, ఆపరేషన్‌ గ్రీన్‌హంట్‌ దాడుల రూపకల్పనలో భారతసైన్యం పాత్ర ఉంది. ఈ అభియాన్‌కు అమెరికా సామ్రాజ్యవాదుల మార్గదర్శకత్వం ఉంది. ఈ రెండు దాడులు మంద్రస్థాయి యుద్ధతంత్రం (ఎల్‌ఐసీ) ప్రకారం సాగిన, సాగుతున్న బహుముఖ దాడులు.

దండకారణ్యంలోకి పార్టీ అడుగిడిన తొలినాళ్ల నుండే శతృ సాయుధ బలగాలతో, వర్గ శతృవులతో తలపడుతూ తీవ్రమైన వర్గపోరాటం, దాని కొనసాగింపుగా ప్రజాయుద్ధం సాగిస్తున్న ఫలితమే నేటి జనతన సర్కార్లు. వర్గపంథా-ప్రజాపంథా ఆధారంగా సాగుతున్న విస్తృత ప్రజల భాగస్వామ్యం, పీఎల్‌జీఏ సైనిక దన్ను, పార్టీ గైడెన్స్‌ల ఫలితంగానే జనతన సర్కార్లు నిర్మాణమై కొనసాగుతున్నాయి.

ఈ జనతన సర్కార్లు కేవలం ప్రజా పరిపాలనా అంగాలు మాత్రమే కాదు. ఇవి పీడిత ప్రజల రాజ్యాధికార అంగాలు. ఇవి ఏకకాలంలో శాసన నిర్మాణ, కార్యనిర్వాహక, న్యాయ పాలనా అంగాలు. జనతన సర్కారు విధాన కార్యక్రమం రూపంలో వీటికి స్థూలమైన కార్యక్రమం ఉంది. దీని ఆధారంగా ప్రజలతో, ప్రజా శతృవుతో వ్యవహరించే, ప్రజా జీవనంలో తలెత్తే సమస్యలతో వ్యవహరించే ప్రాథమిక చట్టాలు ఉన్నాయి. ఈ కార్యక్రమాల్ని, చట్టాలను జనతన సర్కార్లు అమలు చేసే క్రమంలో వాటికి స్థానిక స్థాయిలో ప్రజా మిలీషియా, ఏరియా స్థాయిలో లోకల్‌ గెరిల్లా స్క్వాడ్స్‌ (ఎల్‌జీఎస్‌లు), ప్లటూన్లు; డివిజన్‌ స్థాయిలో కంపెనీలు; రీజియన్‌, జోన్‌ స్థాయిలో కంపెనీలు, బెటాలియన్లు సైనిక దన్ను అందిస్తున్నాయి. ప్రజా మిలీషియా, పీఎల్‌జీఏ యూనిట్లు, జనతన సర్కార్ల కార్యకర్తలు (పాలనా యంత్రాంగం), ప్రజా కోర్టులు ప్రాథమిక స్థాయిలోని రాజ్యపు రూపాలుగా ఉన్నాయి.

ఈ ప్రజా రాజ్యపు దన్నుతోనే జనతన సర్కార్లు ప్రాథమిక స్థాయిలో నూతన ప్రజాస్వామిక ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక వ్యవస్థలను నిర్మిస్తున్నాయి. గ్రామరాజ్య కమిటీల రూపంలో బీజరూపంలో మొదలైన ప్రజారాజ్యాధికార అంగాలు మొలకెత్తి, విస్తృతమై వేలాది, లక్షలాది ప్రజలను కదిలిస్తున్నాయి. నూతన ప్రజాస్వామిక ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక వ్యవస్థలను నిర్మిస్తున్నాయి. అందులో భాగంగా భూమి సమతలీకరణలో ప్రతి సంవత్సరం జనవరి-ఫిబ్రవరి నెలల్లో దండకారణ్య వ్యాప్తంగా 10-15 రోజులపాటు ప్రతిరోజూ దాదాపు ఒక లక్షమంది ప్రజలు పాల్గొంటారు. ప్రతిరోజూ జనతన సర్కారుకు చెందిన వేలాదిమంది కార్యకర్తలు (స్త్రీలు, పురుషులు) దాని నిర్వహణలో, రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొంటారు. అలాగే ఆర్థిక, రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనేలా ప్రజల భావాలను మలుస్తూ, కాలం చెల్లిన, అశాస్త్రీయ భావాలతో ఘర్షణ పడుతూ వేలాదిమంది కార్యకర్తలు సాంస్కృతిక కృషిలో భాగమవుతున్నారు.

దండకారణ్యంలో గత 20 సంవత్సరాల క్రితం గ్రామ స్థాయిలో నిర్మాణమయి, ప్రస్తుతం డివిజన్‌ (జిల్లా) స్థాయి ప్రజా రాజ్యాధికార అంగాలుగా ఎదిగిన జనతన సర్కార్ల నిర్దిష్టతను, విశిష్టతను, దాని సారాన్ని ఈ సందర్భంగా తెలుసుకోవడం అవసరం.

భారతదేశంలో విప్లవాన్ని విజయవంతం చేయడం కోసం సీపీఐ, సీపీఎమ్‌ల రివిజనిజంతో, నయా రివిజనిజంతో, వాటి పార్లమెంటరీ పంథాలతో తెగతెంపులు చేసుకుంటూ 1969 నాటికే చారుమజుందార్‌, కన్హయ్‌ఛటర్జీల నాయకత్వంలో విప్లవశక్తులు ప్రాంతాలవారీగా అధికారాన్ని హస్తగతం చేసుకునే దీర్ఘకాలిక ప్రజాయుద్ధ పంథాను చేపట్టాయి. ఈ పంథాను అనుసరించి చెలరేగిన నక్సల్బరీ, శ్రీకాకుళం, బీర్భూమ్‌, కాంగ్షా, సోన్‌పూర్‌ తదితర రైతాంగ పోరాట ప్రాంతాలంతటా విప్లవ కమిటీలను, విప్లవ రైతాంగ కమిటీలను ఏర్పాటు చేయడానికి ప్రయత్నించారు, కొన్నిచోట్ల ఏర్పాటు చేశారు. వీటి ద్వారా పిండరూపంలో ప్రజల రాజకీయ అధికారాన్ని నెలకొల్పారు. అయితే ఆనాడు అమలైన తీవ్ర శతృ నిర్బంధంతోపాటు విప్లవశక్తులు/విప్లవ పార్టీ అనుసరించిన అతివాద ఎత్తుగడల ఫలితంగా, ఇతర లోపాల వల్లా ఆనాటి మహత్తర రైతాంగ పోరాటాలు, విప్లవోద్యమం తాత్కాలికంగా ఓటమి పాలయ్యాయి.

ఈ ఓటమికి దారితీసిన కారణాలను సమీక్షించుకున్న నిజమైన విప్లవశక్తులు నూతన ఎత్తుగడలను రూపొందించుకుని కార్యాచరణలోకి దిగాయి. ఇందులో భాగంగా, సీపీఐ (ఎమ్‌ఎల్‌) నాయకత్వంలో 1978 నుండి ఆంధ్రప్రదేశ్‌లోని కరీంనగర్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లో, ఎంసీసీ నాయకత్వంలో, బీహార్‌లోని హజారీబాగ్‌, గయ, గిరిడి తదితర జిల్లాలో రైతాంగ ఉద్యమాలను నిర్మించడం ఆరంభించాయి. సీపీఐ (ఎంఎల్‌) (పీపుల్స్‌వార్‌) 1978-80నాటికి రూపొందించుకున్న ‘మన ఎత్తుగడల పంథా’ ఆధారంగా, 1994 జులైలో పార్టీ కేంద్రకమిటీ ‘గ్రామ కమిటీలు’ సర్క్యులర్‌ను విడుదల చేసింది. ఈ సర్క్యులర్‌లోని గైడెన్స్‌ ఆధారంగా తెలంగాణ, దండకారణ్యం, ఆంధ్ర-ఒడిశా సరిహద్దు (ఏఓబీ) ప్రాంతంలో 1995 ప్రారంభం నుండి గ్రామ కమిటీల/గ్రామ రాజ్య కమిటీల రూపంలో ప్రజారాజ్యాధికార అంగాలను నిర్మించడం ప్రారంభించాం. మరోవైపు ఎమ్‌సీసీఐ ‘వ్యూహం-ఎత్తుగడల’ ఆధారంగా 1978 నుండి 2004 వరకు క్రాంతికారీ కిసాన్‌ కమిటీ (విప్లవ రైతాంగ కమిటీ)ని రైతాంగ ప్రజల రాజకీయాధికార అంగంగా నిర్మిస్తూ వచ్చింది.

గ్రామ కమిటీల/గ్రామ రాజ్యాధికార కమిటీల అనుభవాలను సంశ్లేషించుకోవడంతోపాటు గెరిల్లాజోన్లను విముక్తి ప్రాంతాలుగా అభివృద్ధి చేసే ప్రక్రియను మరింత స్పష్టంగా రూపొందించుకోవడం కోసం సీపీఐ (ఎమ్‌ఎల్‌)(పీపుల్స్‌వార్‌) పార్టీ చైనా, వియత్నాం, మలయా, థాయ్‌లాండ్‌, ఫిలిప్పైన్స్‌, పెరూ అనుభవాలను, తెలంగాణ పోరాట కాలం నాటి (1946-51) అనుభవాలను అధ్యయనం చేసి 2001 ఏప్రిల్‌లో విప్లవ ప్రజా కమిటీలు (రెవెల్యూషనరీ పీపుల్స్‌ కమిటీ-ఆర్‌పీసీ)పై సర్క్యులర్‌ను రూపొందించింది.

తదనంతర కాలంలో పీపుల్స్‌వార్‌ పార్టీ నేపాల్‌ విప్లవోద్యమ అనుభవాలను కూడా అధ్యయనం చేసింది. వీటన్నింటి ఆధారంగా 2004లో దండకారణ్యంలో ఏరియా స్థాయిలో విప్లవ ప్రజాకమిటీని ఏర్పరచే సందర్భంగా జనతన సర్కార్ల విధాన కార్యక్రమాన్ని రూపొందించింది. 2007లో సీపీఐ (ఎమ్‌ఎల్‌)(పీపుల్స్‌వార్‌), ఎమ్‌సీసీఐ పార్టీలు ఐక్యమై సీపీఐ (మావోయిస్టు) ఆవిర్భవించాక ప్రజా రాజ్యాధికార అంగాల నిర్మాణంలో ఇరుపార్టీల అవగాహనను, అనుభవాలను సంశ్లేషించుకుని వ్యూహం-ఎత్తుగడల డాక్యుమెంట్‌ను సంపద్వంతం చేసుకోవడంతోపాటు 2007 నవంబర్‌లో విప్లవ ప్రజాకమిటీల విధాన పత్రానికి మెరుగులు దిద్దాం.

ప్రాంతాలవారీగా అధికారాన్ని హస్తగతం చేసుకునే పంథాను అనుసరించి భారతదేశ నిర్దిష్ట పరిస్థితుల్లో గెరిల్లాజోన్లను విముక్తి ప్రాంతాలుగా అభివృద్ధిపరిచే ఎత్తుగడల్లో భాగంగా విప్లవ ప్రజాకమిటీలను (జనతన సర్కార్లను) గ్రామస్థాయి నుండి విముక్తి ప్రాంత స్థాయి వరకు నిర్మించే సైద్ధాంతిక, రాజకీయ అవగాహన గత 48 ఏళ్ళల్లో దేశంలో సాగిన అనేక రైతాంగ పోరాటాల అనుభవాల సంశ్లేషణతో ఎంతో సంపద్వంతమైంది. ఈ అనుభవాల ఉన్నత స్థాయి వ్యక్తీకరణే దండకారణ్య జనతన సర్కార్‌ విధాన కార్యక్రమం.

సీపీఐ (మావోయిస్టు) తన కార్యక్రమంలో ప్రకటించిన ప్రజల ప్రజాస్వామిక రాజ్యాధికార, నూతన ప్రజాస్వామిక ప్రభుత్వ కర్తవ్యాలపై ఆధారపడి దండకారణ్య జనతన సర్కారు విధాన కార్యక్రమం రూపొందింది.

ఈ విధాన కార్యక్రమంలో ప్రజల ప్రజాస్వామిక ప్రభుత్వపు మౌలిక విధానాన్ని, బాధ్యతలనూ, దాని కర్తవ్యాలనూ పేర్కొన్నార. భారత విప్లవ విజయానంతరం ఇక్కడ ఏర్పడే జనతా ప్రజాస్వామిక ఫెడరల్‌ రిపబ్లిక్‌ ఒక నిర్దిష్ట విధాన కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడానికి ఇది పునాది వేసింది.

దండకారణ్య జనతన సర్కారు విధాన కార్యక్రమంలో ప్రకటించిన జనతా ప్రజాస్వామిక ప్రభుత్వ మౌలిక విధానాల్లో భాగంగా ప్రకటించిన ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక విధానాలను సంక్షిప్తంగానయినా ఇక్కడ పేర్కొనడం అవసరం.

”భూస్వాముల, మత సంస్థల భూములన్నింటినీ స్వాధీనం చేసుకుని ‘దున్నేవారికే భూమి’ ప్రాతిపదికన పేద, భూమిలేని రైతాంగానికి, వ్యవసాయ కూలీలకు పంచుతుంది. ధనిక రైతుల ఆస్తులను స్వాధీనం చేసుకోదు. రైతాంగం మీద వడ్డీ వ్యాపారుల దోపిడీకి స్వస్తి చెబుతుంది.

సామ్రాజ్యవాదులకూ, దళారీ నిరంకుశ బూర్జువా వర్గానికి చెందిన అన్ని పరిశ్రమలూ, బ్యాంకులూ, ఇతర సంస్థలన్నింటినీ స్వాధీనం చేసుకుంటుంది. సామ్రాజ్యవాద అప్పులన్నింటినీ రద్దు చేస్తుంది. సామ్రాజ్యవాదులతో దోపిడీ ప్రభుత్వం చేస్తున్న అసమాన ఆర్థిక ఒప్పందాలను రద్దు చేస్తుంది.

ప్రజా జీవితాన్ని శాసించే స్థితిలో లేనటువంటి పెట్టుబడిదారీ ఉత్పత్తిని అడ్డుకోదు. ప్రైవేటు ఆస్తులను స్వాధీనం చేసుకోదు. చిన్న పరిశ్రమలను, మధ్య తరహా పరిశ్రమలను అంటే జాతీయ పెట్టుబడిదారీ వర్గ పరిశ్రమలను అదుపు చేస్తుంది, నియంత్రిస్తుంది”.

పైన పేర్కొన్న వ్యవసాయ, పారిశ్రామిక విధానాలను అవలంబిస్తూ జనతా ప్రజాస్వామిక ఆర్థిక వ్యవస్థ సోషలిస్టు ఆర్థిక వ్యవస్థకు మార్గం సుగమం చేస్తుంది.

ఈ విధాన కార్యక్రమం, దళిత, ఆదివాసీ, మహిళా, జాతుల సమస్యలపై మతంపై తన విధానాన్ని కింది విధంగా పేర్కొన్నది.

”కుల వివక్షతనూ, కుల విభేదాలను రద్దు చేస్తుంది. అంటరానితనాన్నీ, మొత్తంగా కుల వ్యవస్థనే సంపూర్ణంగా నిర్మూలిస్తుంది.

మహిళలపై కొనసాగుతున్న అన్ని రకాల వివక్షతనూ రద్దు చేయడానికీ, పితృస్వామ్యాన్నీ, పురుషాధిక్యతనూ అంతం చేయడానికీ పూనుకుంటుంది.

ఆదివాసీ సమాజాల సమగ్ర అభివృద్ధికై స్వయం పాలనకు గ్యారెంటీనిస్తుంది. సామ్రాజ్యవాద బహుళజాతి కంపెనీల ద్వారా ఈ ప్రాంతాల ప్రకృతి వనరులను కొల్లగొట్టడాన్ని అడ్డుకుంటుంది.

నూతన ప్రజాస్వామిక ప్రభుత్వం పీడిత జాతుల, జాతీయ అల్ప సంఖ్యాకుల స్వయం నిర్ణయాధికార హక్కులను గుర్తిస్తుంది. ఈ జాతులకు విడిపోయే హక్కుతో సహా స్వయం నిర్ణయాధికార హక్కును గుర్తిస్తూ దేశాన్ని సమైక్యం చేస్తుంది.

జనతా ప్రజాస్వామిక ప్రభుత్వం అన్ని రకాల ప్రాంతీయ అసమానతలను తొలగించి, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తుంది.

మతం నుండి రాజ్యం విడివడి పూర్తిగా లౌకిక లక్షణం కలిగి ఉంటుంది. మతం వ్యక్తుల వ్యక్తిగత వ్యవహారంగా ఉంటుంది.

ప్రస్తుత విప్లవ దశలో అర్ధ వలస, అర్ధ భూస్వామ్య సంస్కృతితో పాటు సామ్రాజ్యవాద సంస్కృతినీ, మొత్తంగా దోపిడీ భావజాలాన్నీ పెకిలించి ఒక నూతన సంస్కృతిని, అంటే శాస్త్రీయ, ప్రజాస్వామిక సంస్కృతిని నెలకొల్పడం ప్రభుత్వం కర్తవ్యం”.

పైన పేర్కొన్న జనతా ప్రజాస్వామిక మౌలిక కర్తవ్యాలను దండకారణ్యలోని నిర్దిష్ట పరిస్ధితులపై ఆధారపడి జనతన సర్కారు అమలు చేస్తున్నది. జనతా ప్రజాస్వామిక మౌలిక కర్తవ్యాలు ప్రస్తుతం దండకారణ్యంలోని ఆదివాసీ ప్రాంతంలో అమలవుతున్నప్పటికీ అవి కేవలం ఆదివాసీ ప్రాంతాలకే పరిమితమైనవి కావు.

సామ్రాజ్యవాదం, బడా భూస్వామ్య, దళారీ నిరంకుశ బూర్జువా వర్గాల దోపిడీ, పీడనలకు గురవుతున్న పీడిత వర్గాలన్నింటి, పీడిత సాంఘిక సముదాయాలన్నింటి ఆకాంక్షల ప్రతిరూపాలే ఆ కర్తవ్యాలు. వాటి అమలుతోనే భారతదేశ పీడితవర్గ, పీడిత సాంఘిక సముదాయాల విముక్తి ఆధారపడి ఉంది. భారతదేశ వ్యాప్తంగా ప్రజలు సాగించే ప్రజాయుద్ధపు తీవ్రత, విస్తృతి, విజయాలపై ఆధారపడి దేశవ్యాప్త విప్లవ విజయం సిద్ధించినప్పుడు ఈ కర్తవ్యాలనే భారత జనతా ప్రజాస్వామిక రిపబ్లిక్‌ దేశవ్యాప్తంగా అమలు చేస్తుంది. అందుకే జనతన సర్కారు రూపొందించి, అమలుచేస్తున్న కర్తవ్యాలు కేవలం ఆదివాసీ ప్రాంతాలకు పరిమితమైనవి కావు. అవి దేశవ్యాప్తంగా పీడిత ప్రజల విముక్తి కోసం అమలు చేయాల్సినవి. అందుకే జనతన సర్కారు విధాన కార్యక్రమంలోని మౌలిక కర్తవ్యాలు భారత దేశ పీడిత ప్రజానీకానికి నిజమైన ప్రత్యామ్నాయం.

పార్లమెంటరీ రాజకీయ పార్టీలు సహజంగానే దోపిడీ వర్గాల ప్రయోజనాల పరిరక్షణ విధానాల్ని అమలు చేస్తాయి. ప్రజలను మోసగించే వాగ్దానాలు చేస్తాయి. అందుకే 1947నాటి బూటకపు స్వాతంత్య్రం తరువాత గత 68 ఏళ్లుగా అమలవుతున్న దోపిడీ వర్గాల అనుకూల ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక విధానాలు భారత పీడిత ప్రజల ఏ ఒక్క సమస్యను కూడా పరిష్కరించలేవని తేలిపోయింది. అయితే వివిధ రకాల పెటీ బూర్జువా సంస్థలు, ఎన్‌జీఓలు, అస్తిత్వవాద ఉద్యమాలు/సంస్థలు పీడిత ప్రజల సమస్యలకు పరిష్కారంగా సంస్కరణవాద మార్గాల్ని ప్రజల ముందుంచుతున్నాయి. వీటికి ఆ ప్రజల్లోని ఒక సెక్షన్‌ ప్రభావితమవుతూ వస్తోంది. వీటన్నింటికీ జనతన సర్కారు అమలు చేస్తున్న విధానాలే నిజమైన ప్రత్యామ్నాయం. ఈ విప్లవకర ప్రత్యామ్నాయ ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక కార్యక్రమమే జనతన సర్కార్ల బలం, సారం. విశాలమైన ప్రజాపునాదిపై ఆధారపడి, పీఎల్‌జీఏ (పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ-ప్రజావిముక్తి గెరిల్లా సైన్యం) అందించే దన్నుతో కొనసాగడమే దాని బలం, సారం.

దండకారణ్య జనతన సర్కార్లు అమలుచేస్తున్న విధానాలు నూతన ప్రజాస్వామిక విప్లవపు ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక విధానాలు కాబట్టి అవి కేవలం దండకారణ్యానికి పరిమితమైనవి కావు. నూతన ప్రజాస్వామిక విప్లవపు మౌలిక కార్యక్రమం దండకారణ్య ఆదివాసీ సమాజపు నిర్దిష్టతలకు అనుగుణంగా అమలవుతున్నది. నిర్మాణమవుతున్న ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక వ్యవస్థలు నూతన ప్రజాస్వామిక వ్యవస్థ నిర్దిష్ట వ్యక్తీకరణలే. ఈ నిర్మాణంలోని నిర్దిష్టతలు ఇక్కడ దేశంలోని ఇతర ప్రాంతాల్లో నిర్మాణం కావాల్సిన నూతన ప్రజాస్వామిక వ్యవస్థకు ఒక అనుభవంగా నిలుస్తాయి. అందుకే దండకారణ్య జనతన సర్కార్లు భారత పీడిత ప్రజానీకానికి ఒక వేగుచుక్క, ఒక ఆశాకిరణం, ఒక విప్లవకర ప్రత్యామ్నాయం. ఏ దేశంలోనయినా ముఖ్యంగా అర్ధ వలస, అర్ధ భూస్వామ్య దేశాల్లో ఎక్కడయినా నూతనంగా ఏర్పడే రాజ్యం స్థానిక స్థాయిలోనే, ఒంటరి ప్రాంతంలోనే, బలహీనంగానే ప్రారంభమై, బలోపేతమై, విశాల ప్రాంతాలకు విస్తరించి, కేంద్రస్థాయిలోకి అభివృద్ధి చెందుతుంది. ఇదే దీర్ఘకాలిక ప్రజాయుద్ధ పంథా సార్వజనీనత.

స్టాలిన్‌ మరణానంతరం 1950ల చివరి నాటికే సోవియట్‌ రష్యాలో సోషలిజం స్థానంలో పెట్టుబడిదారీ విధానం అధికారంలోకి వచ్చింది. మావో మరణానంతరం 1980ల ప్రారంభానికే చైనాలో సోషలిజం స్థానంలో పెట్టుబడిదారీ విధానం అధికారంలోకి వచ్చింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా పీడిత ప్రజానీకానికి, విప్లవ పార్టీలకు విప్లవాలకు స్థావర ప్రాంతాలు లేకుండా పోయాయి.

1991లో సోవియట్‌ రష్యా అగ్రరాజ్యం పతనమైన తరువాత ప్రపంచ వ్యాప్తంగా సామ్రాజ్యవాదులు, వారి తైనాతీలు, సామ్రాజ్యవాదానికి కాపలాకాసే దోపిడీవర్గ మేధావులు చరిత్ర అంతమయిందని, ప్రపంచ ప్రజానీకానికి పెట్టుబడిదారీ విధానమే ప్రత్యామ్నాయమని, పెట్టుబడిదారీ విధానమే శాశ్వతమైన వ్యవస్థగా నిలబడుతుందని పెద్దఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఈ తరుణంలో వాటన్నిటినీ తిప్పికొడుతూ దండకారణ్య జనతన సర్కారు 1990వ దశకంలో భారతదేశపు పీడిత ప్రజానీకానికి ఆశాకిరణంగా, ప్రత్యామ్నాయంగా నిర్మాణమయింది. గత 20 సంవత్సరాలుగా అది సంఘటితపడుతూ, విస్తరిస్తూ, అభివృద్ధి చెందుతున్నది. భారత బూర్జువా పార్లమెంటరీ వ్యవస్థకు, సామ్రాజ్యవాద నిర్దేశిత పరాధీన ఆర్థిక వ్యవస్థకు, కాలం చెల్లిన సంస్కృతికి ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్నది.

రెండవ ప్రపంచ యుద్ధానంతరం మరీ ముఖ్యంగా ప్రపంచీకరణ మొదలైన 1991 నుండి సామ్రాజ్యవాద ద్రవ్యపెట్టుబడి ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో అన్ని సెక్షన్ల ప్రజానీకంపై అంతులేని దోపిడీ, పీడనలను కొనసాగిస్తూ ఉంది. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా అది ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలను సామ్రాజ్యవాద ఆధీన/పరాధీన ఆర్థికవ్యవస్థలుగా, మార్కెట్‌ నియంత్రిత ఆర్థిక వ్యవస్థలుగా పునర్నిర్మాణం చేస్తోంటే దండకారణ్య జనతన సర్కారు స్వతంత్ర, స్వావలంబన, ప్రజాస్వామిక ఆర్థిక వ్యవస్థను నిర్మిస్తూ ఉంది. ఇది దండకారణ్య జనతన సర్కార్ల విశిష్టత. సామ్రాజ్యవాద ద్రవ్యపెట్టుబడి దాడికి, వనరుల దోపిడీలో దాని అంతులేని దాహానికి అడ్డుకట్టవేసి దండకారణ్య వనరులను కాపాడుతున్నది జనతన సర్కార్లే.

పారిస్‌ కమ్యూన్‌ మొదలుకుని రష్యా, చైనా, వియత్నాం తదితర దేశాల్లోని సోషలిస్టు, నూతన ప్రజాస్వామిక రాజ్యాల సకారాత్మక, నకారాత్మక అనుభవాల నుండి; ఫిలిపైన్స్‌, పెరూ, నేపాల్‌ దేశాల్లో కొనసాగిన, కొనసాగుతున్న ప్రజా రాజ్యాధికార అంగాల సకారాత్మక, నకారాత్మక అనుభవాల నుండి జనతన సర్కార్లు నేర్చుకున్నాయి. వీటన్నింటి సారం కార్మికవర్గ నియంతృత్వాన్ని, ప్రజాస్వామిక వర్గాల నియంతృత్వాన్ని వర్గపంథా-ప్రజాపంథాను అనుసరించి నేటి చారిత్రక పరిస్థితుల్లో నిర్దిష్టంగా, సృజనాత్మకంగా అన్వయించడమే. వర్గపంథా-ప్రజాపంథాను దృఢంగా అనుసరిస్తూ, ఆచరిస్తూ నూతన ప్రజాస్వామిక ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక వ్యవస్థను ప్రాథమిక స్థాయిలో నిర్మిస్తూ ప్రజల అవసరాలు తీర్చుతున్నందువల్లే, ప్రజలను విప్లవీకరిస్తూ, పరిపాలనా పద్ధతుల్లో ప్రజాస్వామ్యాన్ని అమలు చేస్తున్నందువల్లే దండకారణ్య జనతన సర్కార్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 1995 నుండి అమలు చేస్తున్న విప్లవ ప్రతీఘాతుక దాడులను ఎదుర్కొని నిలబడుతున్నాయి.

భారతదేశంలో ప్రాంతాలవారీగా అధికారాన్ని హస్తగతం చేసుకునే పంథా అన్వయింపుకు నిర్దిష్ట వ్యక్తీకరణ దండకారణ్య జనతన సర్కారు. దండకారణ్య ఆదివాసీ సమాజపు నిర్దిష్టతలకు అనుగుణంగా నిర్మాణమవుతున్న నూతన ప్రజాస్వామిక ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక వ్యవస్థలే దాని బలం, సారం. సామ్రాజ్యవాద ద్రవ్యపెట్టుబడి దాడికి ఎదురొడ్డి నిలుస్తూ స్వతంత్ర, స్వావలంబన ఆర్థిక వ్యవస్థను నిర్మిస్తుండడమే దాని విశిష్టత. వీటన్నింటి ఫలితంగానే భారత అర్ధ వలస, అర్ధ భూస్వామ్య వ్యవస్థకు ప్రత్యామ్నాయం జనతన సర్కార్లు అంటున్నాం. అందుకే ఈ జనతన సర్కార్లను భారతదేశంలోని విశాల మైదాన ప్రాంతాలకు విస్తరించే కృషిలో పాలుపంచుకోవాలని భారత ప్రజానీకానికి పిలుపునిస్తున్నాం. ఆ పిలుపుకు ‘జనతన రాజ్యం, దండకారణ్యలో మావోయిస్టు ఆచరణ’ పుస్తకం బలమైన ఆధారంగా నిలవాలని కోరుతున్నాం.

భారత విప్లవ పంథాను, ఎత్తుగడలను సంపద్వంతం చేసుకోవాల్సిన అవసరం రీత్యా రచయిత సూచించిన వాటిలో కొన్నింటిని విప్లవోద్యమం అంగీకరిస్తోంది. అవి ..

1.   సామ్రాజ్యవాదం వలస దశ నుండి ద్రవ్య పెట్టుబడి దశకు మారి, పెట్టుబడి ప్రపంచీకరించ బడిన దశలో భారత ఆర్థిక వ్యవస్థ పనితీరును, వలసానంతర కాలపు భారతదేశ రాజకీయార్థిక పరిణామాలను, ఈ రాజకీయార్థిక పరిణామాల వల్ల పాత సాంఘిక వ్యవస్థల్లో మార్పులను, వాటి చారిత్రక మూలాలతో పాటు, వర్తమానంలో అవి ఏ శక్తుల మీద ఆధారపడి బతికి బట్టకడుతున్నాయి అనే అంశాల అధ్యయనం.

2.   మైదాన, పట్టణ ప్రాంత ప్రజానీకాన్ని విప్లవోద్యమంలో సమీకరించడానికి వారిపై సాగుతున్న అదనపు విలువ దోపిడీని గుర్తించి, దానికి వ్యతిరేకంగా నూతన పోరాట, నిర్మాణ రూపాలను ఆవిష్కరించుకోవడం.

ఈ విషయాలపై విప్లవోద్యమం ఇప్పటికే అధ్యయనం చేస్తూ ఉంది. తెలుగు మేధో ప్రపంచంలోని విప్లవ శక్తులు కూడా అభినందించదగ్గ కృషి చేస్తున్నాయి. ఈ రకంగా రెండు వైపుల నుండి సాగుతున్న కృషి రానున్న రోజుల్లో మరింత విస్తృతమయ్యి మెరుగైన ఫలితాలను ఇస్తుందని ఆశిద్దాం.

ప్రస్తుతం దండకారణ్యంలో పీడితవర్గం జనతన సర్కారు రూపంలో నిర్మించుకున్న తమ అధికారాన్ని సంఘటిత పరచుకోవడానికి, దోపిడీవర్గంతో, దాని సాయుధ బలగాలతో ప్రతిఘటనా యుద్ధం చేస్తోంది. జనతన సర్కారును ధ్వంసం చేసి దెబ్బతిన్న, బలహీనపడ్డ తమ అధికారాన్ని తిరిగి పునర్నిర్మించుకొని బలోపేతం చేసుకోవడానికి దోపిడీ వర్గాలు బహుముఖదాడిని, అందులో భాగంగా ప్రధానంగా సైనికదాడి చేస్తున్నాయి. ఈ స్థితిలో జనతన సర్కార్లను కాపాడుకోవడానికీ, వాటిని సంఘటితం చేసి దేశవ్యాప్తంగా విస్తరింపజేయడానికీ, దేశం నలుమూలల నుండి కార్మికులు, రైతులు, విద్యార్థులు, మేధావులు, వ్యవసాయరంగ నిపుణులు, టీచర్లు, డాక్టర్లు, పీడిత సామాజిక సముదాయాలు అన్నీ దండకారణ్య విప్లవోద్యమానికి అండగా నిలవాలి. అందులో పాలుపంచుకోవాలి. ఈ దిశగా తెలుగు ప్రజానీకాన్ని కదిలించడానికి ఈ పుస్తకం తోడ్పడుతుందని ఆశిస్తున్నాం. జనతన సర్కార్ల నిర్మాణ కృషిలో భాగమవుతూ, దాని విజయాలను ఎత్తిపట్టడానికి మరిన్ని ఇలాంటి రచనలు చేయడానికి తెలుగు మేధో ప్రపంచానికి, రచయితలకు ఆహ్వానం పలుకుతున్నాం.

 15. 5. 2015

2 thoughts on “దండకారణ్య నిర్మాణ చిత్తరువు

  1. ✊✊
    మా సత్యం
    లాంగ్ లీవ్ ఇండియన్
    రెవల్యూషన్

    కామ్రేడ్ ప్రతాప్
    (కటకం సుదర్శన్)
    భారత దేశ పీడిత/ప్రపంచ దేశ పీడిత ప్రజల విముక్తికై MLM తాత్విక దృక్పథంతో సాయుధ పోరాట మార్గంలో పయనిస్తూ అంతర్జాతీయంగా గుర్తింపు పొందుతూ సాయుధ పోరాట మార్గం లో అనారోగ్యంగా మరణించిన కామ్రేడ్ సుదర్శన్ కి జోహార్లు తెలుపుతూ… పాణి గారు రాసిన జనతన సర్కార్‌ కి కామ్రేడ్ ప్రతాప్ (కటకం సుదర్శన్) రాసిన ముందుమాట వాక్యాలను గుర్తు చేసుకుంటూ… “ఈ విప్లవకర ప్రత్యామ్నాయ ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక కార్యక్రమమే జనతన సర్కార్ల బలం, సారం. విశాలమైన ప్రజాపునాదిపై ఆధారపడి, పీఎల్‌జీఏ (పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ-ప్రజావిముక్తి గెరిల్లా సైన్యం) అందించే దన్నుతో కొనసాగడమే దాని బలం, సారం.”–ప్రతాప్ (కటకం సుదర్శన్)

  2. Sudershan ji —joharlu
    Unity-support—togetherness —-missing from medhavulu ,ryithulu ,students ,doctors ,kaarmikulu —still no change
    To day CPI AND CPM are colourless -odourless -tasteless political parties —no smell /NO VISION
    COUNTRY NEEDS LEADERS

Leave a Reply