(భార‌త రాజ్యాంగానికి ఈ వ్య‌వ‌స్థ‌ను య‌థాత‌ధంగా ప‌ట్టి ఉంచే స్వ‌భావం ఉంద‌ని ఎన్ వేణుగోపాల్ అంటున్నారు. రాజ్యాంగంలోని ఉన్న ప్ర‌జానుకూల ఆద‌ర్శాలు అమ‌లు కాగ‌లిగే స్థితిలో మ‌న రాజ‌కీయార్థిక, సాంఘిక వ్య‌వ‌స్థ లేద‌ని అంటున్నారు. కాబ‌ట్టి రాజ్యాంగాన్ని మొత్తంగా నెత్తికెత్తుకోవ‌డ‌మో, తిర‌స్క‌రించ‌డ‌మోగాక విమ‌ర్శ‌నాత్మ‌కంగా ఉండాల‌ని ఈ ఇంటర్వ్యూలో అంటున్నారు..వ‌సంత మేఘం టీం)

1. రాజ్యాంగాన్ని మార్చాల‌ని కేసీఆర్ అన‌గానే ఇంత ప్ర‌తిస్పంద‌న ఎందుకు వ‌స్తోంది?

రాజ్యాంగాన్ని మార్చాలని కె సి ఆర్ స్పష్టంగానే అన్నప్పటికీ అన్న సందర్భం మాత్రం కేంద్ర రాష్ట్ర సంబంధాలలో భారతీయ జనతా పార్టీ అనుసరిస్తున్న పెత్తందారీ వైఖరిని ఖండించే సందర్భం. రాజ్యాంగం నిర్దేశించిన సమాఖ్య స్వభావాన్ని ఎన్ డి ఎ ప్రభుత్వం అమలు చేయడం లేదని విమర్శిస్తూ ఆయన రాజ్యాంగాన్నే మార్చాలని అన్నారు. నిజానికి ఆయన ముందూ వెనుకా మాట్లాడిన మాటలను బట్టి, రాజ్యాంగంలోని సమాఖ్య అవగాహనను కచ్చితంగా అమలు చేయాలని అనే సందర్భంలో ఒక అడుగు ముందుకు వేసి రాజ్యాంగాన్ని మార్చాలని అన్నారు.

ఆ మాట పెద్దఎత్తున తీవ్రమైన స్పందనలు రావడానికి దారి తీసింది. రాజ్యాంగాన్ని మార్చాలని ఎప్పటి నుంచో అంటున్న, మార్చడానికి ప్రయత్నాలు కూడ చేసిన, చేస్తున్న సంఘ్ పరివార్ శక్తులు రాజకీయ ఎత్తుగడలో భాగంగా ఆ మాటను ఖండించాయి. ఆ మాట వెనుక సంఘ్ పరివారపు భావజాలపు ధ్వని ఉంది గనుక పగతిశీల శక్తులు ఖండించాయి. ఆ మాట రాజ్యాంగ రచనా కమిటీ అధ్యక్షుడుగా పనిచేసిన డా. బి ఆర్ అంబేడ్కర్ మీద ప్రతికూల వ్యాఖ్య అనుకుని దళిత బహుజన శక్తులు ఖండించాయి. రాజ్యాంగంలో ప్రజా వ్యతిరేక అంశాలు ఉన్నప్పటికీ, దాన్ని వలసవాద వ్యతిరేక ప్రజా ఉద్యమపు ఒకానొక ఫలితంగా, ముఖ్యంగా ప్రవేశిక, ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు అనే మూడు ప్రజానుకూల అంశాలమీద గౌరవంతో రాజ్యాంగానికి విమర్శనాత్మక మద్దతు ఇచ్చేవారు కూడ ఆ మాటను ఖండించారు. అలా పరస్పర వ్యతిరేకమైన అభిప్రాయాలు కూడ ఉన్న భిన్నమైన నాలుగు శక్తులు కె సి ఆర్ మాటను ఖండించాయి. ఆయన మాట కచ్చితంగా ఖండనార్హమైనదే, అలాగే ఖండిస్తున్నవారందరి ప్రాతిపదికలూ ఒకటే కావు గనుక ఖండనలను కూడ జాగ్రత్తగా పరిశీలించవలసిందే.

2.బీజేపీకి ముందే, కేసీఆర్ తాజా ఆలోచ‌న‌ల‌కంటే ముందే ఎన్నో రాజ్యాంగ స‌వ‌ర‌ణ‌లు జ‌రిగాయి. రాజ్యాంగ మౌలిక స్వ‌భావం, ఆద‌ర్శాల వైపు నుంచి వాటిని ఎలా చూడాలి?

రాజ్యాంగం అమలులోకి వచ్చిన ఏడాదిన్నరలో మొదటి సవరణ జరిగింది. ఆ తర్వాత డెబ్బై సంవత్సరాలలో మరొక 104 సవరణలు జరిగాయి. అంటే రాజ్యాంగాన్ని ఆయాకాలాల పాలకపక్షాలు తమకు తోచినవిధంగా, తమ ప్రయోజనాల కోసం మారుస్తూనే వచ్చాయి. కనుక రాజ్యాంగం మార్పులకు అతీతమైనది కాదని ఈ ఏడు దశాబ్దాల చరిత్ర చూపుతున్నది. అయితే రాజ్యాంగంలో మార్చగలిగినవేవి, మార్చగూడనివేవి అనే చర్చ కూడ ఉంది. 1970ల తొలిరోజుల్లో సుప్రీం కోర్టు ఒక సుప్రసిద్ధమైన కేసులో “రాజ్యాంగ మౌలిక నిర్మాణాన్ని మార్చగూడదు” అనే అవగాహనను ప్రకటించింది. ఈ యాబై సంవత్సరాలుగా అసలు రాజ్యాంగ మౌలిక నిర్మాణం ఏమిటి అనే చర్చ కూడ జరుగుతున్నది. ప్రవేశిక, ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు అనే మూడు అధ్యాయాలు కీలకమైనవని, కనుక వాటిని “మౌలిక నిర్మాణం” అనవచ్చునని ఒక స్థూల అవగాహన ఉంది. కాని ఎమర్జెన్సీలో ఇందిరా గాంధీ ప్రభుత్వం 42వ సవరణ ద్వారా ప్రవేశికలో కూడ మార్పులు చేసింది. రాజ్యాంగ సవరణలు చేసే అధికారాన్ని ప్రభుత్వం చేతికి ఇచ్చుకుంది. రెండు సంవత్సరాల తర్వాత జనతా పార్టీ ప్రభుత్వం 44 వ రాజ్యాంగ సవరణ ద్వారా పాత సవరణలను రద్దు చేసింది. ఈ సవరణల, రద్దుల చరిత్రంతా చెప్పేదేమంటే రాజ్యాంగం సవరణలకూ మార్పులకూ అతీతమైనది కాదు. కాకపోతే ఆ సవరణలు అప్పటికి ఉన్న పాలకపక్షపు ప్రయోజనాల కోసం జరిగినవైతే ప్రతిపక్షంలో ఉన్న పాలకవర్గ ముఠా కొన్నిసార్లు అభ్యంతరపెట్టింది. కొన్ని సార్లు పాలకవర్గ ముఠాలన్నీ కలిసి తమ ఉమ్మడి ప్రయోజనాలకు అనుగుణమైన సవరణలు చేశాయి. ప్రజలకు అవసరమైన, ప్రజల ప్రయోజనాలను తీర్చే సవరణలు చాల అరుదుగా మాత్రమే జరిగాయి, అవి మరింత అరుదుగా అమలులోకి వచ్చాయి. రాజ్యాంగ మౌలిక స్వభావం “భారత ప్రజలమైన మాకు మేము ఇచ్చుకున్న” రాజ్యాంగం అనే ఉమ్మడి స్ఫూర్తి అయితే అలా ప్రజల వైపు నుంచి సవరణలు జరగలేదనే చెప్పాలి. రాజ్యాంగ ఆదర్శాలు అంతకు రెండు వందల ఏళ్లుగా వలసవాదానికి వ్యతిరేకంగా, వేల ఏళ్లుగా అసమానతలకు వ్యతిరేకంగా సాగుతున్న ప్రజల ఆకాంక్షలను ప్రతిఫలించేవి. అందువల్లనే ఆర్థిక, రాజకీయ, సాంఘిక సమానత్వం, స్వేచ్ఛ, సామాజిక న్యాయం అనే ఆదర్శాలు ప్రవేశికలో చేరాయి.

3. అస‌లు రాజ్యాంగ నిర్మాణ‌ క్ర‌మంలోకి వెళ్లి దాని మౌలిక స్వ‌భావాన్ని ఎలా చూడాలి?

రాజ్యాంగం “భారత ప్రజలమైన మాకు మేము ఇచ్చుకుంటున్నామ”ని చెప్పుకున్నప్పటికీ, రాజ్యాంగ నిర్మాణక్రమంలో భారత ప్రజలు ఉన్నారని నిస్సందేహంగా చెప్పలేం. రాజ్యాంగ నిర్మాణం కోసం ఏర్పడిన రాజ్యాంగ నిర్ణయ సభ (కాన్ స్టిట్యుఎంట్ అసెంబ్లీ) లో ఉన్నవారు బ్రిటిష్ ప్రభుత్వం చేసిన భారత ప్రభుత్వ చట్టం 1935 కింద 1946లో రాష్ట్ర శాసనసభలకు జరిగిన ఎన్నికల్లో గెలిచిన “ప్రజా ప్రతినిధులు” ఎన్నుకున్న ప్రతినిధులు, బ్రిటిషిండియాలో భాగం కాని సంస్థానాధీశుల ప్రతినిధులు. వీరిలో మొదటి వారి ఎన్నికకు సార్వత్రిక వయోజన వోటు హక్కు ప్రాతిపదిక లేదు గనుక వారు ఎంతగా “ప్రజాప్రతినిధులు” అవుతారో చర్చనీయాంశమే. రెండో సమూహం ఫ్యూడల్ ప్రభువులు, సంస్థానాధీశులు గనుక వారు కచ్చితంగా “ప్రజలు” కాజాలరు. ఆ రాజ్యాంగ నిర్ణయ సభ తమ సభ్యులలోంచే రాజ్యాంగ రచనా కమిటీని నియమించింది. అలా రాజ్యాంగ నిర్ణయ సభ రూపొందిన తీరే దానికి ప్రజానుకూల స్వభావాన్ని ఇవ్వలేదు. సాధారణంగా విభిన్న వర్గాల, సమూహాల ప్రయోజనాల మధ్య సమన్వయం కుదురుస్తూ రాజ్యాంగ రచన జరుగుతుంది. భారత సమాజంలో ఉన్న ప్రత్యేకత దృష్ట్యా విభిన్న కులాల, మతాల, ప్రాంతాల, భాషల ప్రజల ప్రయోజనాల మధ్య సమన్వయం కుదుర్చవలసింది. అనేక వర్గాలకూ సమూహాలకూ ప్రాతినిధ్యమే లేదు గనుక ఆ పని జరగలేదు. రాజ్యాంగ రచనా కమిటీ అధ్యక్షుడుగా డా. బి ఆర్ అంబేద్కర్ ఉండడం వల్ల, రాజ్యాంగ నిర్ణయ సభలో ఉండిన ఉదార ప్రజాస్వామిక వాదులు కొందరి కృషి వల్ల ప్రవేశిక, ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు వంటి ఉదాత్త అంశాలు రాజ్యాంగంలో చేరాయి గాని, రాజ్యాంగపు మౌలిక స్వభావం ప్రధానంగా యథాస్థితిని కొనసాగించడంగానే ఉండింది. సామాజిక పరివర్తనకు రాజ్యాంగాన్ని సాధనంగా వాడుకోవాలనే ఆశయం ప్రవేశికకూ, ఆదేశిక సూత్రాలకూ మాత్రమే పరిమితమైపోయింది. ఆ ఆదేశిక సూత్రాలు కూడ న్యాయవ్యవస్థ ద్వారా సాధించుకోవడానికి వీలులేనివిగా (నాన్ జస్టిసియబుల్) ప్రకటించడం వల్ల అవి కాగితానికి పరిమితమై పోయాయి.       

4. రాజ్యాంగంలోని మిగ‌తా విష‌యాలు ఎన్ని ఉన్నా స‌మాన‌త్వం, సామాజిక న్యాయం, చ‌ట్ట‌బ‌ద్ధ‌ పాల‌న అనేవి అతి ముఖ్య‌మైన‌వి. అవే అమ‌లు కాక‌పోవ‌డానికి కార‌ణం ఏమిటి?

సమానత్వం, సామాజిక న్యాయం, చట్టబద్ధ పాలన ఆదర్శాలుగా ఉదాత్తమైనవే గాని అవి శూన్యంలో ఉండవు. నిర్దిష్ట స్థలకాలాల్లో వాటికి ఒక ప్రత్యేక అర్థం వస్తుంది, వాటి అమలుకు అనుకూల లేదా ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. భారత సమాజం 1950కి గాని, 2020 కి గాని ఆ మూడు ఆదర్శాలు, అటువంటి అనేక ఆదర్శాలు, రాజ్యాంగ ప్రవేశికలో రాసుకున్న ఆదర్శాలు అమలు చేసే స్థితిలో లేదు. ఆ కారణాలను రాజ్యాంగంలోనో, రాజ్యాంగం అమలు చేసే వ్యక్తులలోనో, సంస్థల లోనో చూడడం అమాయకత్వం. ఆ కారణాలు వ్యవస్థాగతమైనవి. భారత సామాజిక, రాజకీయార్థిక వ్యవస్థ ఆ రాజ్యాంగ ఆదర్శాల అమలుకు సానుకూలమైన స్థితిలో లేదు. నిజానికి ఈ ఎరుక డా. బి ఆర్ అంబేడ్కర్ కు కూడ ఉండిందని ఆయన 1949 నవంబర్ 26న రాజ్యాంగ ముసాయిదా పూర్తయిన రోజున చేసిన ప్రసంగం తెలియజేస్తుంది.   

5. పితృస్వామ్యం, అగ్ర‌కుల‌త‌త్వం, హిందుత్వం వంటి సామాజిక స‌మ‌స్య‌ల‌ను రాజ్యం వాడుకుంటున్న‌దా? లేక రాజ్యం రూపొందే క్ర‌మంలో ఇవి దానిలో కూడా భాగ‌మ‌య్యాయా?

రాజ్యం అనేది ఒక వర్గపు దోపిడీ పీడనలను కొనసాగించే యథాస్థితి గనుక అందుకు అవసరమైన అన్ని అసమానతలనూ దురభిప్రాయాలనూ కాలం చెల్లిన భావాలనూ అది వాడుకుంటుంది. వాటిని బలోపేతం చేస్తుంది. వాటివల్ల రాజ్యం బలపడుతుంది. పాలిత వర్గాలను భ్రమల్లో ముంచడానికి అప్పుడప్పుడు వాటికి వ్యతిరేకంగా మాట్లాడుతుంది, చట్టాలు కూడ చేస్తుంది. కాని ఆ మాటలను చేతలుగా మార్చడంలో, చట్టాలను అమలు చేయడంలో అరకొర చిత్తశుద్ధి మాత్రమే కనబరస్తుంది. రాజ్యాంగానికి, ముఖ్యంగా ఆదేశిక సూత్రాలకు సృజనాత్మక వ్యాఖ్యానం చేసి ఉంటే, అమలు చేయడానికి ప్రయత్నించి ఉంటే కచ్చితంగా భారత రాజ్యం పితృస్వామ్యం మీద, కులవ్యవస్థ మీద, మతోన్మాదం మీద పోరాడి ఉండేది. కాని భారత రాజ్యాన్ని గుప్పెట్లో పెట్టుకున్న పాలకవర్గాలకు ఆ కోరిక గాని, ఆసక్తి గాని ఎంతమాత్రం లేవు. ఈ ఏడు దశాబ్దాల భారత రాజ్య పరిణామ చరిత్ర చూస్తే రాజ్యం ఎంతగా కుల, మత, లింగ ఆధిపత్యాలతో కలగలిసి సాగిందో, ఒకదాన్ని మరొకటి ఎంతగా బలోపేతం చేసుకున్నాయో అర్థమవుతుంది.  

6. అస‌లు సామాజిక న్యాయం, స‌మాన‌త్వ సంస్కృతి వంటివి అమ‌లు చేయ‌గ‌ల ఆధునిక స్వ‌భావం భార‌త రాజ్యానికి ఎంత వ‌ర‌కు ఉన్న‌ది?

సామాజిక న్యాయ భావననూ సమానత్వ సంస్కృతినీ ఒకే స్థాయిలో చూడడానికి వీలు లేదు. సామాజిక న్యాయం అనేది భారత సమాజం వంటి అంతరాల సమాజంలో ఇంతవరకూ న్యాయం దక్కని వర్గాలకు, కులాలకు, సమూహాలకు న్యాయం ఇవ్వాలనే భావన. అది కాలరీత్యా ఆధునికత పరిధిలోకి వస్తుందేమో గాని, నిజానికి అది ఆధునికతకు పూర్వపుదీ కావచ్చు, ఆధునికతలో భాగమూ కావచ్చు. కాని సమానత్వ సంస్కృతి అనేది తప్పనిసరిగా ఆధునికతలో భాగమైన విలువ. ప్రపంచ చరిత్రలో ఆధునికత అనేది బూర్జువా ప్రజాస్వామిక విప్లవాల నుంచి తన బలాన్ని సంతరించుకుంది. ప్రతి మనిషికీ సమాన విలువ ఉందనే భావన నుంచి సమానత్వ సంస్కృతి వస్తుంది. భారత సామాజిక రాజకీయార్థిక వ్యవస్థ సామాజిక న్యాయాన్ని చాల పరిమిత అర్థంలోనైనా ఇవ్వగలదేమో గాని, సమానత్వ సంస్కృతిని ఆమోదించదు. సమానత్వ సంస్కృతిని ఆమోదించడానికి కుల అంతరాలు, మత అంతరాలు, భాషా అంతరాలు, ప్రాంతీయ అంతరాలు, ఈ అన్ని అంతరాలనూ కలగలుపుకున్న దురభిప్రాయాలు, ఆభిజాత్యాలు, ఆధిపత్యాలు, న్యూనతలు అనేకం ఉన్నాయి. వాటిని రద్దు చేసి సమానత్వ సంస్కృతిని అమలు చేయగల ఆధునిక స్వభావం భారత రాజ్యానికి లేదు, భారత రాజ్యం ఆ స్వభావాన్ని సంతరించుకోవడం ప్రస్తుత పాలకవర్గాలకు ఎంతమాత్రం ఇష్టం లేదు. 

7. అప్పుడు రాజ్యాంగ మార్గ‌ద‌ర్శ‌క‌త్వం మాటేమిటి? మొద‌టి నుంచి మ‌న దేశంలో ఏ హ‌క్కులు, అవ‌కాశాలు లేని స‌మూహాల వైపు నుంచి సామాజిక ప‌రివ‌ర్త‌న‌లో రాజ్యాంగం పాత్ర‌ను ఎలా అర్థం చేసుకోగ‌లం?

సామాజిక పరివర్తనలో తన పాత్ర విశాలమైనదని, బృహత్తరమైనదని రాజ్యాంగం గుర్తించనేలేదు. అక్కడక్కడా అతుకులూ మాట్లూ వేసి ఉన్న సమాజాన్నే యథాతథంగా కొనసాగించాలని భావించింది. మౌలిక పరివర్తన అవసరమనే గుర్తింపు, ఆ మౌలిక పరివర్తనకు మార్గం ఏమిటనే అన్వేషణ చేయడంలో విఫలమైనందువల్లనే రాజ్యాంగం హక్కులు, అవకాశాలు లేని సమూహాలకు అత్యంత పరిమితమైన, తాత్కాలిక ఉపశమనాల వంటి పరిష్కారాలనే చూపింది గాని నిజమైన పరివర్తన గురించి ఆలోచించలేదు. 

8. ప్ర‌తి మ‌నిషికీ ఓటు, ప్ర‌తి మ‌నిషికీ ఒకే విలువ‌, ప్ర‌జా ప్రాతినిధ్యం, చ‌ట్ట‌బ‌ద్ధ పాల‌న‌వంటివి వ‌ల‌స పాల‌న నేప‌థ్యంలో స్వీక‌రించి ఆధునిక స్వ‌భావాన్ని ప్ర‌క‌టించుకున్న భార‌త రాజ్యాంగం దోపిడీని చ‌ట్ట‌బ‌ద్ధం చేయ‌డం వ‌ల్ల ఎంత మేర‌కు ఆధునిక‌త‌ను సంత‌రించుకున్న‌ట్లు? ఈ విమ‌ర్శ‌నాత్మ‌క వైఖ‌రిని మీరెట్లా చూస్తారు?

యథాస్థితిని కొనసాగించడానికి, కాపాడడానికి ప్రయత్నించడం, విధివిధానాలను ఖరారు చేయడం దోపిడీ పీడనలను సాధికారం చేయడమే. చట్టబద్ధం చేయడమే. మరొకవైపు ఆ యథాస్థితి కొనసాగింపు వల్ల అణగారిపోతున్న ప్రజాసమూహాలకు కొన్ని అవకాశాలు కల్పించే వోటుహక్కు, ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం, చట్టబద్ధపాలన, రిజర్వేషన్లు వంటి సాధనాలను కూడ చట్టబద్ధం చేసింది. ఈ సాధనాలు ఉపయోగకరమైనవే అయినప్పటికీ సమగ్ర సామాజిక పరివర్తన సాధించగలిగేవి కావు. ఈ ఏడు దశాబ్దాల్లో వీటి పాత్ర చెప్పుకోదగినంతగా ఉన్నప్పటికీ సమాజంలో అవసరమైన మౌలిక మార్పులు రాలేదు. అంబేడ్కర్ మాటల్లో చెప్పాలంటే అది సామాజిక సమానత్వాన్ని సాధించకుండానే రాజకీయ సమానత్వాన్ని హామీ ఇవ్వడం. అందువల్ల ఆ రాజకీయ సమానత్వం కూడ అరకొరగానే దక్కింది. పైగా ఆ సాధనాలను ప్రదర్శనా వస్తువులుగా చూపుకోవడానికి రాజ్యానికి అవకాశం వచ్చింది. ఈ కారణాల వల్ల భారత రాజ్యాంగం ఆధునికతను సంతరించుకున్నదని చెప్పడం పూర్తి అర్థంలో సాధ్యం కాదు. రాజ్యాంగంలో ఆధునికతను ప్రవేశపెట్టడం కోసం జరిగిన ప్రయత్నాన్ని ఆమోదిస్తూనే, యథాస్థితి కొనసాగింపు ప్రయత్నాన్ని కూడ గుర్తించే విమర్శనాత్మక వైఖరి కావాలి.

9. మ‌న సామాజిక సాంస్కృతిక స్థితికి – రాజ్యాంగ ఆద‌ర్శాల‌కు, రాజ్య స్వ‌భావానికి – రాజ్యాంగ ఆద‌ర్శాల‌కు  మ‌ధ్య వైరుధ్యాలను ఎలా విశ్లేషించుకోవ‌చ్చు?

ఒక్క మాటలో చెప్పాలంటే మన సామాజిక సాంస్కృతిక స్థితి అసమానతా స్థితి, అంతరాల స్థితి. రాజ్యాంగ ఆదర్శాలు సమానత్వ ఆకాంక్ష. మన రాజ్య స్వభావం దోపిడీ పీడనలను యథాతథంగా కాపాడడం, పాలకవర్గ ప్రయోజనాలకు హామీ ఇవ్వడం. రాజ్యాంగ ఆదర్శాలు ప్రవేశికలో చెప్పినట్టు “సామాజిక, ఆర్థిక రాజకీయ న్యాయం, ఆలోచనా, భావప్రకటనా, విశ్వాస, మత, ప్రార్థనా స్వేచ్ఛ, హోదాలో, అవకాశాలలో సమానత్వం, సౌభ్రాతృత్వం”. ఈ వైరుధ్యం ఉన్నదని డా. అంబేడ్కర్ గుర్తించారు, రాజ్యాంగ నిర్ణయ సభలో తన చివరి ఉపన్యాసంలో ప్రస్తావించారు కూడ.

10. దోపిడీ వ్య‌వ‌స్థ ప‌రిధిలోనే ఆధునిక‌తా వికాసంలో భాగంగా రాజ్యాంగం, చ‌ట్ట‌బ‌ద్ధ పాల‌న అనేవి పాశ్చాత్య స‌మాజాల్లో వ‌చ్చాయి. ఆ వైపు నుంచి మ‌న దేశంలో దోపిడీని, రాజ్యాంగ‌బ‌ద్ధ పాల‌న‌ను ఎలా చూడొచ్చు?

బూర్జువా ప్రజాస్వామిక విప్లవాలు కూడ మౌలిక సామాజిక పరివర్తనను లక్ష్యంగా పెట్టుకున్నవేమీ కావు. దోపిడీ వ్యవస్థ పరిధిలోనే, యథాస్థితిని కొనసాగించడానికి జరిగినవే. కాని వాటి ముందర తమ ప్రయోజనాల కోసమే అయినా శ్రమశక్తిని భూస్వామ్య బంధనాల నుంచి విముక్తి చేయడం, శ్రామికుల నైపుణ్యం పెంచడం, కొత్త నైపుణ్యాలు కల్పించడం, విపరీతంగా పెరిగిపోతున్న తమ ఉత్పత్తికి అవసరమైన మార్కెట్ సృష్టించుకోవడం వంటి అనేక కర్తవ్యాలు ఉండినాయి. అందువల్ల అవి లోతైన సమాజ మథనం సాగించాయి. పాత నుంచి మౌలిక విచ్ఛేదం తో కొత్తను సృష్టించదలచాయి. ఆ క్రమం లోనే వ్యక్తి ఆవిర్భావం, వ్యక్తిస్వేచ్ఛ అనే విలువ, ఒక వ్యక్తికి ఒక వోటు అనే విలువ, మనుషులందరూ సమానమే అనే విలువ, ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం, చట్టబద్ధ పాలన, అందరికీ విద్య, పత్రికాస్వేచ్ఛ, మతాన్ని రాజ్యపాలన నుంచీ, విద్యాశిక్షణ నుంచీ, సామాజిక జీవితం నుంచీ విడదీసి, వ్యక్తిగత జీవితానికి పరిమితం చేయడం అనే విలువ తదితరాలు ఆవిర్భవించి, నిలదొక్కుకున్నాయి. భారత సమాజంలో వలసవాదం రాకపోయి ఉంటే, అది భూస్వామ్యంతో మిలాఖత్తు కాకుండా తొలినాళ్ల భూస్వామ్య వ్యతిరేక ప్రగతిశీల విలువలను నిలబెట్టుకుని ఉంటే చరిత్ర వేరే రకంగా ఉండేది. కాని ఆ ఆధునికతా వృక్షం ఇక్కడి నేలలో పుట్టి పెరగకుండా అడ్డుకున్న వలసవాదం, తన నేలలో పెరిగిన ఆధునికతా వృక్షపు బోన్సాయి కురచ కుండీలో మొక్కను ఇక్కడ అంటుకట్టింది. అందువల్ల పాశ్చాత్య సమాజాల్లో దోపీడీ వ్యవస్థ పరిధిలోనే ఉన్న మేరకైనా ఆధునికతా చిహ్నాలు భారత సమాజంలో రాకుండా ఉండిపోయాయి.

11. ఫాసిస్టు ప్ర‌మాదం చుట్టుముట్టిన స‌మయంలో రాజ్యాంగ ప‌రిర‌క్ష‌ణ‌, అమ‌లు అనే నినాదాలు ముందుకు వ‌చ్చాయి. ఈ వాతావ‌ర‌ణంలో రాజ్యాంగం పాత్ర‌ను గుర్తిస్తూనే ఎలాంటి విమ‌ర్శ‌నాత్మ‌క వైఖ‌రి తీసుకోగ‌లం?

రాజ్యాంగం అమలులోకి వచ్చిన సందర్భంలోనే దాన్ని గుర్తించబోమని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రకటించింది. భారతీయ జనతా పార్టీకి కేంద్ర ప్రభుత్వ అధికారం వచ్చిన మొట్టమొదటి పర్యాయమే అది రాజ్యాంగాన్ని మార్చివేయడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ పర్యాయం అధికారానికి వచ్చినప్పటి నుంచీ, గత ఎనిమిది సంవత్సరాలుగా అది రాజ్యాంగంలోని ప్రగతిశీల, ప్రజానుకూల అంశాలను రద్దు చేయడానికి, కత్తిరించడానికి ప్రయత్నిస్తున్నది. ఈసారి రాజ్యాంగ సవరణ గురించో, మార్పు గురించో మాట్లాడకుండానే దాన్ని లోలోపలి నుంచి తూట్లు పొడుస్తున్నది. ఫాసిజానికి చట్టబద్ధ పాలన అన్నా, సమానత్వాన్ని ప్రబోధించే రాజ్యాంగమన్నా కంటగింపు. అందులోనూ కుల అంతరాలు యథాతథంగా ఉండాలని కోరుకునే మనువాద బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిజానికి, సమానత్వాన్ని, సామాజిక న్యాయాన్ని ఆదర్శాలుగా పెట్టుకున్న భారత రాజ్యాంగం అంటే కంటగింపు. ఇలా ఫాసిస్టు దాడి చుట్టుముడుతున్న సమయంలో తప్పనిసరిగా సమానత్వాన్ని ఎత్తిపట్టడానికి ఆమేరకు రాజ్యాంగ ఆదర్శాలను, ప్రవేశికను, ప్రాథమిక హక్కులను, ఆదేశిక సూత్రాలను పరిరక్షించాలని, ఇంకా దృఢంగా అమలు చేయాలని పోరాడవలసి ఉన్నది. అయితే అది భాజపా వ్యతిరేక ప్రతిపక్ష పాలకవర్గ ముఠాలు, ఉదార ప్రగతిశీల వాదులు, పార్లమెంటరీ వామపక్షాలు కోరుతున్నట్టుగా రాజ్యాంగ పరిరక్షణ అనే గుండుగుత్త నినాదంగా ఉండనక్కరలేదు. రాజ్యాంగంలో అనేక అప్రజాస్వామిక, నిరంకుశ, పాలకవర్గ ప్రయోజన అంశాలు ఉన్నాయని గుర్తిస్తూనే, వాటిని విమర్శిస్తూనే, రాజ్యాంగంలో ఉన్న ప్రజాస్వామిక అంశాల అమలు కోసం జరిపే ఒత్తిడిగా ఉండాలి. రాజ్యాంగం పాలకవర్గాల రాజ్యాంగ నిర్ణయ సభ రాసినప్పటికీ, అప్పటికి కొన్ని శతాబ్దాల ప్రజా ఆకాంక్షలు అందులో వ్యక్తమయ్యాయని, ఆ కారణం వల్లనే అది వైరుధ్యాల మయం అయిందని గుర్తించి, ప్రజా ప్రయోజనాల కోసం అవకాశం ఉన్నంతవరకు అమలు జరపమని పోరాడాలి. నిజానికి ఐదు దశాబ్దాల కింద నక్సల్బరీ విప్లవోద్యమం రాజ్యాంగం పాలకవర్గాల దోపిడీ, పీడనలను కాపాడే సాధనమని భావించింది. రాజ్యాంగబద్ధమైన న్యాయవ్యవస్థను కూడ తాము అంగీకరించబోమని, న్యాయస్థానాలను బహిష్కరిస్తామని కూడ తొలితరం విప్లవకారులు ప్రకటించారు. “ఈ దొంగల రాజ్యాంగం రచనే ఒక కుట్ర” అని చెరబండరాజు 1974లో రాసిన పాట ఆ అవగాహనకు చిహ్నమే. అయితే ఎమర్జెన్సీ అనుభవం తర్వాత, పౌరహక్కుల ఉద్యమం విస్తరించిన తర్వాత, రాజ్యాంగం పట్ల సంపూర్ణ వ్యతిరేకతా, సంపూర్ణ ఆమోదమూ రెండూ సరైన అవగాహనలు కావని, విమర్శనాత్మక వైఖరి తీసుకోవాలని ఆలోచన పెరిగింది.  

మార్చ్ 2, 2022

Leave a Reply