క్రీశ 1017-1137 మధ్య జీవించిన రామానుజుడికి ముందే విశిష్టాద్వైతం ఉంది. దాన్ని ఆయన తాత్వికంగా, ఆచరణాత్మకంగా వ్యవస్థీకృతం చేశాడు. రామానుజుడు రంగం మీదికి వచ్చేనాటికి ఉన్న చారిత్రక , తాత్విక పరిస్థితులతో సంబంధం లేకుండా ఆయన *సమతా వాదాన్ని* కీర్తించడం వల్ల ప్రయోజనం ఏమీ ఉండదు.
రామానుజుడి విశిష్టాద్వైతానికి ముందు ఆదిశంకరుడి అద్వైతం బలంగా ఉండింది. *బ్రహ్మ సత్యం- జగం మిధ్య* అనేది ఆయన ప్రధాన సిద్ధాంతం. దీన్నుంచే తత్వమసి అనే భావనను తీసుకొచ్చాడు. పరబ్రహ్మవు నీవే. ఈశ్వరుడు, మానవుడు(ఆత్మ) వేరే కాదు. రెండూ ఒకటే అనేది అద్వైతం.
జగం మిధ్య అనడంలోని అద్వైత మాయావాదాన్ని రామానుజుడు అంగీకరించలేదు. జగత్తు ఉన్నది. మానవులకు భౌతిక జీవితం ఉంది. జీవితానుభవం ఉంది. రామానుజుడు దాన్ని ముందుకు తెచ్చాడు. దీన్ని వివరించడానికి రామానుజుడు తత్వత్రయాన్ని ప్రవేశపెట్టాడు. చిత్, అచిత్, ఈశ్వరుడు అనే ఈ మూడింటిలో మొదటి రెంటి ద్వారా ప్రకృతి అనే వాస్తవాన్ని చెప్పాడు. మూడోది ఈశ్వరుడు అనబడే పురుషుడు. భగవంతుడు సత్యం, సుగుణుడు, సౌందర్యవంతుడు. అందుకే వైష్ణవ సాహిత్యంలో భగవంతుడు సర్వశక్తి సంపన్నుడైన మహాకాయుడిగా చెబుతారు. తిరుగులేని మహాశక్తి వంతుడు, గొప్ప సౌందర్యవంతుడు అనే భావనల చుట్టూ సాగే వర్ణనలే వైష్ణవ రచనలు.
ఈ పనులు రామానుజుడు ఎందుకు చేశాడు? అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. జగం మిథ్య అన్న ఆది శంకరుడైనా, అంతకంటే మెరుగ్గా … జగత్తు ఉన్నది అన్న రామానుజుడైనా సనాతన ధర్మాన్ని మారుతున్న కాలానికి తగినట్లు పునర్ వ్యవస్థీకృతం చేయదలుచుకున్నారు. దానికి తిరుగులేని శక్తిని ఇచ్చి ఆధ్యాత్మిక, సామాజిక, నైతిక రంగాల్లో ప్రతిష్టించాలనుకున్నారు. బలోపేతం అవుతున్న భూస్వామ్యానికి తగినట్లు వైదిక ధర్మాన్ని తయారు చేయాలని అనుకున్నారు. క్రీశ280-550 కాలంనాటికే గుప్తుల పాలనలో వర్ణాశ్రమ ధర్మాలకు స్వర్ణయుగం ఆరంభమైంది. ఆదిశంకరుడు ఆ తర్వాత 8వ శతాబ్దంలో వచ్చాడు.
దీనికి నేపథ్యంలో చార్వాక, బౌద్ధ, జైనాలు ఉన్నాయి. ఇవి వాటి వాటి పద్ధతుల్లో వేదాలను అంగీకరించలేదు. ఆర్యకర్మకాండను వ్యతిరేకించాయి. హేతుచింతనను ప్రవేశపెట్టాయి. దీంతో ఆర్య సంస్కృతి సంక్షోభంలో పడింది. వైదిక కర్మకాండలు కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. తిరిగి వైదికమతం లేచి కూచోడానికి చాలా ప్రయత్నాలు చేసింది. ఇదంతా ఒక ధారగా జరగలేదు. అనేక దశల్లో జరిగింది. ఇందులో అనేక స్రవంతులు ఉన్నాయి. ఇందులో భాగంగా మారిన చారిత్రక ప్రపంచానికి తగినట్లు తిరిగి వేద ప్రామాణ్యాన్ని నిలబెట్టడానికి ఆదిశంకరుడు వచ్చాడు. ఆయన వాదంలోని లోపాన్ని రామానుజుడు గుర్తించి సవరించాడు. ప్రపంచం ఉన్నది.., మానవ భౌతిక జీవితం ఉన్నది… భగవంతుడు సర్వాంతర్యామి కాబట్టి ఆయనకు అందరూ లోబడి ఉండాలి.. అన్నాడు. ఆ రకంగా రెండు లేవు.. ఒకటే (అద్వైతం) అనే వాదనను రామానుజుడు ఓడించాడు. దీనికి ఆయన ఎన్నుకున్నది భక్తి మార్గం. వేద కాలంనాటి కర్మకాండలను కేంద్రం చేసుకొని వేద ప్రమాణంగా సమాజాన్ని తిరిగి తీర్చి దిద్దడం సాధ్యం కాని ప్రత్యేక దశకు చరిత్ర ఎదిగింది. దీనికి తగినట్లు ఉండటానికి భక్తి మార్గాన్ని తీసుకొచ్చాడు.
భగవంతుడికి ప్రజలకు మధ్య అడ్డుగోడలు ఉంటే భక్తి మార్గం ఆచరణలోకి రాదు. దీనికి రెండు ఆటంకాలు ఉన్నాయి. భగవంతుడికి భక్తులకు మధ్యవర్తులు ఉన్నారు. సమాజంలో కుల అంతరాలు ఉన్నాయి. అందుకే రామానుజుడు విష్ఘు మంత్రాన్ని ఆలయం గోపురం మీదికి ఎక్కి అందరికీ వినిపించాడు. అంతకాలం రహస్యంగా ఉన్నదాన్ని బహిరంగం చేశాడు. భగవంతుడ్ని చేరుకోడానికి మధ్యవర్తుల సాయం అక్కర లేదు. కుల అంతరాల నిమిత్తం లేకుండా అందరూ భక్తి మార్గానికి వచ్చేందుకు అర్హులే.. అని చెప్పడం ఆయన ఉద్దేశం. అందుకే అకడమిక్ పుస్తకాల్లో సహితం భక్తి ఉద్యమంలో రామానుజుడ్ని చెబుతారు.
భక్తి మార్గంలో కుల అంతరాలు అక్కరలేదని మాత్రమే రామానుజుడు అన్నాడు. అంతరాల సామాజిక వ్యవస్థగా కులం ఉండకూడదని అనలేదు. ఆ రకంగా ఆయన సామాజిక సంస్కరణ దృష్టి చాలా పరిమితం. భక్తి మార్గంలో సనాతన వైదిక ధర్మాన్ని ఆ కాలానికి తగినట్లు సంస్కరించాడు. ఇది ప్రధాన కోణం. ఆయనకంటే చాలా భిన్నంగా సామాజిక సాంస్కృతిక కోణాల్లో కూడా కులాన్ని ప్రశ్నించిన వాళ్లు భక్తి ఉద్యమంలో ఉత్తర, దక్షిణ భారతదేశాల్లో ఉన్నారు. వాళ్ల దరిదాపుల్లోకి కూడా రామానుజుడు రాడు.
భక్తిలో శరణాగతి అతి ముఖ్యమైన భావం. భక్తితో పూజించడమే కాదు. భక్తితో నిన్ను నీవు మహాశక్తి సంపన్నుడు, సర్వాంతర్యామి అయిన భగవంతుడికి అర్పించుకోవాలి. ఇక్కడ మనకు భగవద్గీతలోని . *సర్వ ధర్మాన్ పరిత్యంజ్య.. * అనే మాట గుర్తుకు వస్తుంది. అన్నీ వదిలి నన్ను శరణు కోరుకో.. అంటాడు. రామానుజుడి భక్తి మార్గంలో అర్పణ అనే భావం ఉంది. మనుషులు తమ వ్యక్తిత్వాన్ని, జ్ఞానాన్ని వదులుకొని భగవంతుడికి సాగిలపడాలి. తర్కచింతన పనికి రాదు. భక్తి ఒక్కటే ఉండాలి. భక్తి తప్ప మరేదీ లేని మానవ వ్యక్తిత్వం, మేథ ఎలా ఉంటాయో ఊహించవచ్చు.
భక్తిమార్గంలో ఆలయ ప్రాధాన్యతను విశిష్టాద్వైతం తీసుకొచ్చింది. సంపన్నుల, రాజుల పోషకత్వంలో ఆలయాల నిర్మాణం, నిర్వహణ మొదలైంది. ఆలయం సంపదకు కేంద్రంగా మారింది. ఆలయానికి, రాజ్యానికి, పాలనకు సన్నిహిత సంబంధం ఏర్పడింది. భక్తి మార్గంలో కులాలతో సంబంధం లేకుండా అందరికీ చోటు ఉందని చెప్పిన మతమే రాజ్యమతంగా మారిపోయింది. ఆలయం అంతక ముందే ఉన్నప్పటికీ వైష్ణవం వ్యవస్థీకృతం అయ్యే క్రమంలో ఆలయం స్థానం మారింది.
క్రీశ 1-3 శతాబ్దాలనాటికి భగవద్గీత మహాభారతంలో ప్రక్షిప్తం కావడం, అప్పుడే గుప్తుల స్వర్ణయుగం ఆరంభం కావడం, కొంత దక్షిణ భారతదేశం మినహా ఉపఖండంలోని చాలా భాగం గుప్త సామ్రాజ్యంలో భాగం కావడం, కింది నుంచి భూస్వామ్యం పదిలంగా ఎదగడం, దానికి అండగా చాతుర్వర్ణ వ్యవస్థ బలోపేతం కావడం, బ్రాహ్మణ మతం రాజ మతంగా మారడం, దీనికి తగినట్లు మత తాత్విక రంగంలో ఆదిశంకరుడు, రామానుజుడు రావడం, వైష్ణవ భక్తిమార్గం(రామానుజుడికి ముందే అళ్వారుల సంప్రదాయం బలపడటం) విస్తరించడం.. ఇదంతా ఒక సుదీర్ఘ చారిత్రక పరిణామం.
భక్తి మార్గంలో కుల అంతరాలు ఉండవని రామానుజుడు చెప్పిన మాటను ఈ మొత్తంలో భాగంగా చూడాలి. అంతకంటే ఎక్కువ చేయడానికి లేదు. తక్కువ చేయడానికి లేదు. ఇవాళ సమానత్వ భావనకు రామానుజుడి *సమతా వాదాన్ని* అంటుకట్టే పని చేయడం అచారిత్రకం. అహేతుకం. దేనికంటే రామానుజుడి రచనలు వేదార్థ సంగ్రహం, గీతా బాష్యం, వేదాంత దీపం, శరణాగత గద్యం మొదలైనవి. అంటే ఆయన వేద ప్రమాణాన్ని పూర్తిగా అనుసరించాడు. వాటిని వ్యాఖ్యానించాడు. అలాంటప్పడు భక్తిమార్గంలో కుల అంతరాలు తగవనే ఆయన మాటను ఎలా చూడాలి? భక్తి మార్గంలో శ్రీవైష్ణవాన్ని ఆయన ముందుకు తెచ్చి వైదికధారను బలోపేతం చేశాడు. దీన్ని విస్మరించి ఆయనను సమతావాది అనగలమా?
అందుకే సాహిత్యంలో భక్తి ఉద్యమాన్ని కూడా విమర్శనాత్మకంగా చూడాలి. అందులోని భిన్న పాయలను వేర్వేరుగా చూడాలి. కొన్ని పాయల్లోని ప్రతిక్రియలను, వాటి పర్యవసానాలను పరీక్షించాలి. విశిష్టాద్వైతంలోని అనుభవం అనే భావన ప్రబంధ సాహిత్యంలోకి భోగలాలసతగా ప్రవేశించిందని మధ్యయుగాల తెలుగు సాహిత్యంపై త్రిపురనేని మధుసూదనరావు ఒక పరిశీలన చేశారు. మతం రాజ్యమతంగా మారిపోయాక అది అన్ని రంగాల్లో ప్రతీఘాతుకంగా మారిపోతుంది. రామానుజుడి వైదిక పునరుద్ధరణ లక్ష్యం రాజ్యం అండ లేకుండా సాధ్యమయ్యేది కాదు. అందువల్లే భక్తి అనేది కేవలం ఒక ఆధ్యాత్మిక వ్యవహారంగా మిగిలిపోలేదు. అదొక భావజాలంగా, సంస్కృతిగా మారింది. జీవనశైలి అయింది. పరంపరగా కొనసాగుతున్నది. ఆనాటి సనాతన వైదిక సంస్కృతి భక్తి సంస్కృతిగా మారింది. భారతీయ సంస్కృతి అని సంఘ్పరివార్ ఘనంగా చెప్పుకుంటున్నది ఇదే. వాళ్లవరకే ఇది పరిమితమైతే ఇబ్బంది ఉండేది కాదు. అది రాజ్య సంస్కృతిగా మారింది. ప్రజల జీవితాలతో పెనవేసుకొని పోయింది. ఆలయాల నిర్మాణం, కార్పొరేట్ సంస్థల భూరి విరాళాలు, మసీదులను కూల్చి మందిరాలను నిర్మించడం, కేసీఆర్ కోట్ల రూపాయల ప్రజాధనాన్ని, వందల ఎకరాల భూమిని చిన్న జియర్ స్వామికి ఇచ్చి రామానుజుడి వెయ్యేళ్ల వేడుకలు జరపడం అంతా మన రాజకీయ, సామాజిక సంస్కృతిగా మారిపోయింది. అందువల్ల కూడా సంస్కృతీ అధ్యయనపరులు రామానుజాచార్యుల భక్తి మార్గాన్ని మళ్లీ చూడాలి. ఆయన సమతా వాదం ఏపాటితో, దేన్ని స్థాపించడానికి ఆయనకు ఆ సమత అవసరం అయిందో, దాని పర్యవసానాలు ఏమిటో విమర్శనాత్మకంగా చూడాలి.
We cannot live without religion (GOD) PANI garu ??? Kcr & jiyyam garala garadi ata ??????