(రాజ్యాంగ స‌వ‌ర‌ణ‌లు, మార్పు గురించి ముమ్మరంగా చ‌ర్చ జ‌రుగుతున్న నేప‌థ్యంలో
వ‌సంత‌మేఘంతో ప్ర‌ముఖ న్యాయ‌వాది, సామాజిక ఉద్య‌మ‌కారుడు వై.కే పంచుకున్న విమ‌ర్శ‌నాత్మ‌క అభిప్రాయాలు మీ కోసం..)

1. రాజ్యాంగాన్ని మార్చాల‌ని కేసీఆర్ అన‌గానే ఇంత ప్ర‌తిస్పంద‌న ఎందుకు వ‌స్తోంది? 

రాజ్యాంగాన్ని మార్చాలనడం, సవరించాలనడం – ఈ రెండూ ఒకటి కాదు. రాజ్యాంగంలోని ఆర్టికల్స్‌ను సవరించడానికి ఆర్టికల్‌ ౩68 ద్వారా రాజ్యాంగమే అవకాశం కల్పించింది. అయితే, సాధారణ బిల్లును ఆమోదించటానికి భిన్నంగా రాజ్యాంగ సవరణ చేయటానికి ఒక ప్రత్యేక ప్రొసీజర్‌ను 368లోనే పొందుపరిచారు. ఆ ప్రకారం 107 రాజ్యాంగ సవరణ చట్టాలను ఇప్పటికే పార్లమెంట్‌ ఆమోదించింది. కానీ, కెసిఆర్‌ చెబుతున్న కొత్త రాజ్యాంగం, సవరణలకి అతీతమైనదిగా వుంటుందని ఆయన భావనగా కనిపిస్తోంది. కనుకనే, “కొత్త రాజ్యాంగం” కావాలనే మాటని పదే పదే కెసిఆర్‌ చెబుతోన్నారు. అయితే, ఎస్‌.సి. రిజర్వేషన్‌లను 19 శాతానికి పెంచాలనీ, ఓబిసి కులాల జనగణన చేపట్టాలనే అభిప్రాయాలను కెసిఆర్‌ నిర్ధిష్టంగా వెలిబుచ్చుతోన్నారు. అలాంటి నిర్ధిష్టమైన అంశాలతో కూడిన సవరణలు ప్రస్తుత రాజ్యాంగ పరిధిలోనే చేసుకొనే అవకాశం వున్నది. అలాంటి పరిశీలన చేయకుండానే, కొత్త రాజ్యాంగం గురించి కెసిఆర్‌ నొక్కి చెప్పడం సరైనది కాదు. బహుశా, బయటికి చెప్పని కారణాలు మరింకేవైనా కెసిఆర్‌ మనస్సులో వున్నాయేమో, వేచి చూడాల్సి వుంది. ఎందుకంటే ఆధిపత్య కుల సంపన్న వర్గాలకి గిట్టని అంశాలు డా. బి.ఆర్‌. అంబేడ్మర్‌ రూపొందించిన రాజ్యాంగంలో వున్నాయి. బిజెపి, కాంగ్రెస్‌లపైనా, తాజాగా బిజెపి పైనా, కెసిఆర్‌ విసురుతున్న వాగ్బ్భాణాలు, ఆయన ఆధిపత్య కులాల సంపన్న వర్గాలకు ప్రతినిధి అనే వాస్తవాన్ని కప్పిపుచ్చుజాలవు.

రాజ్యాంగాన్ని మార్చాలనే భావజాలం బిజెపికి వున్నదనేది జగమెరిగిన సత్యం. బిజెపి రాజ్యాంగం ప్రకటించిన ప్రజాస్వామ్య, లౌకిక విధానం, సోషలిజం లక్ష్యాలకు బద్ధ‌ వ్యతిరేకి. అది నూటికి నూరుపాళ్ళూ ఆధిపత్య కులాల – సంపన్న వర్గాలకు ప్రాతినిధ్యం వహించే పార్టీయే. ఈ విషయంలో కాంగ్రెస్‌ తదితర రాజకీయ పార్టీలకీ, బిజెపికీ తేడా ఏమీ లేదు. అయితే, బిజెపి అదనంగా హిందుత్వ మతోన్మ్నాదాన్ని రెచ్చగొడుతూ, హిందూ ఓట్లకి గాలం వేస్తోంది. అందులో భాగంగానే ముస్లిం వ్యతిరేకతని రెచ్చగొడుతున్నది. క్రైస్తవ మత వ్యతిరేకత కూడా ఆ పార్టీకీ, ఆ  పార్టీని నియంత్రిస్తోన్న ఆర్‌ఎస్‌ఎస్‌ వంటి సంఘ్‌ పరివార్‌ శక్తులకూ వున్నప్పటికీ, దళిత ఓట్లను దూరం చేసుకోకూడదు గనుక, క్రైస్తవ  మతం మీద బాణాలు సూటిగా ఎక్కుపెట్టడం లేదు. అది ఒక రాజకీయ ఎత్తుగడ. కనుక, రాజ్యాంగంలోని స్ఫూర్తికి బిజెపి మౌలికంగానే వ్యతిరేకం. ఆ దృష్టానే వాజ్‌పేయి ప్రధానమంత్రిగా వున్న కాలంలోనే రాజ్యాంగాన్ని సమీక్షించాలని జస్టిస్‌ వెంకటాచలయ్య ఆధ్వర్యంలో ఒక కమీషన్‌ని నియమించారు.

వాస్తవానికి రాజ్యాంగంలోని అంశాలు అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు ఏ మేరకు అమలు జరిపాయో

సమీక్షించవలసిన ఆవశ్యకత ఎంతయినా వున్నది. కానీ, ఆ విధంగా రాజ్యాంగం అమలును సమీక్షించడానికి బదులుగా రాజ్యాంగాన్నే సమీక్షించాలనే కుట్రపూరితమైన వైఖరిని బిజెపి ప్రభుత్వం చేపట్టింది. దేశవ్యాపితంగా వచ్చిన నిరసన హోరు మధ్య ఆ కుయత్నం నెరవేరలేదు.

రాజ్యాంగాన్ని మార్చాలన్న కెసిఆర్‌ ప్రతిపాదనని బహుజన సామాజిక వర్గాలు సహజంగానే వ్యతిరేకించాయి. ఎందుకంటే, రాజ్యాంగంలో సమానత్వం, సామాజిక న్యాయం, సోషలిజం లక్ష్యాలు పొందుపరచి వున్నాయి. ఈ లక్ష్యాల సాధన బహుజనులకు అత్యంత ఆవశ్యకం, రాజ్యాంగాన్ని మార్చాలనే కెసిఆర్‌ ఆలోచనలో పై లక్ష్యాలకు ప్రమాదం వాటిల్లే అవకాశం వుండవచ్చును. కనుక, అంబేడ్కర్‌ రచించిన రాజ్యాంగాన్ని మార్చి, కొత్త రాజ్యాంగాన్ని తీసుకురావాలనే ప్రతిపాదనని సామాజిక దృక్పథంతో బహుజనులు వ్యతిరేకిస్తోన్నారు.

కానీ, కెసిఆర్‌ మీద బిజెపి విరుచుకు పడటం ఒక పెద్ద హైడ్రామా. బహుజనులపైన విసిరిన ఒక గాలంగానే బిజెపి వ్యతిరేకతను చూడాల్సి వుంటుంది. రాజ్యాంగాన్నే రద్దు చేయాలన్న వైఖరి కలిగివున్న బిజెపి, ఇప్పుడు కెసిఆర్‌పైన దుమ్మెత్తి పోయడం ఆ పార్టీ ద్వంద్వ నీతికి నిదర్శనం.

 2. అనేక  స‌వ‌ర‌ణ‌ల వ‌ల్ల రాజ్యాంగ మౌలిక స్వ‌భావ‌మే మారింద‌నే అభిప్రాయం ఉంది.  మీరు ఏమంటారు?

 అనేక  సవరణల ద్వారా రాజ్యాంగం మౌలిక స్వభావం మారిందనేది  సరైన అభిప్రాయం కాదు. ఇప్పటి వరకు చేసిన సవరణల్లో చాలా ముఖ్యమైన సవరణలు వున్నమాట నిజం. ఇక్కడ రాజ్యాంగం మౌలిక స్వభావాన్ని పీఠికలోని అంశాల ద్వారా అర్థం చేసుకోవచ్చును. సాంఘిక న్యాయం, ఆర్థిక న్యాయం, రాజకీయ న్యాయం పౌరులందరికీ దక్కాలన్న లక్ష్యంతో రాజ్యాంగాన్ని రూపొందించినట్లు పీఠికలోనే రాజ్యాంగ నిర్మాతలు స్పష్టం చేశారు. వీటితోపాటు భావ స్వేచ్ఛ‌, భావ ప్రకటనా స్వేచ్ఛ‌, నమ్మకాల స్వేచ్ఛ‌, ప్రార్ధనా స్వేచ్ఛ‌, హోదాల్లో, అవకాశాల్లో సమానత్వం, సౌభ్రాతృత్వాలు కూడా సాధించవలసిన లక్ష్యాలుగా పీఠికలో పేర్కొన్నారు. అలాగే, రాజ్యాంగంలోని ౩వ చాఫ్టర్‌లో, పౌరుల ప్రాథ‌మిక హక్కులను పేర్కొన్నారు. ఇక సామాజిక, ఆర్థిక మార్పులకు సంబంధించిన అంశాలను ప్రభుత్వం చేపట్టవలసినవిగా చాప్టర్‌ 4లోని ఆదేశిక సూత్రాల్లో పొందుపరిచారు. ఈ లక్ష్యాలకు భిన్నమైనటువంటి మౌలిక సవరణలు చేసినట్లుగా ఎవరైనా భావిస్తే, ఆ అంశాలపైన నిర్ధిష్టమైన చర్చ

జరపవచ్చును. కేశవానంద భారతి కేసులో సుప్రీం కోర్టు రాజ్యాంగంలోని మౌలిక స్వభావాన్ని మార్చే అధికారం పార్లమెంటుకు కూడా లేదని స్పష్టం చేసి వున్నది. ఏదైనా ఒక సవరణ ద్వారా  రాజ్యాంగంలోని మౌలిక స్వభావాన్ని మార్చితే అది రాజ్యాంగ విరుద్ధ‌మైనదిగా పేర్కొని కొట్టివేసే అధికారం సుప్రీంకోర్టుకు వున్నది.

అయితే, రాజ్యాంగంలోని మౌలిక స్వభావాన్ని మార్చకపోయినా, అందుకు భిన్నమైన సవరణలు చేసిన సందర్భాలు వున్నాయి. ఉదా : 108వ రాజ్యాంగ సవరణ చట్టం. “ఆర్థికంగా బలహీన వర్గాలు” అనే మాట ఆర్టికల్‌ 46లో పొందుపరచి వుండటాన్ని అవకాశంగా తీసుకొని, ప్రస్తుత బిజెపి ప్రభుత్వం కేవలం ఆధిపత్య కులాలకు ప్రత్యేకంగా 10 శాతం రిజర్వేషన్‌లు కల్పిస్తూ 103వ రాజ్యాంగ సవరణ చట్టం చేసింది. రిజర్వేషన్లు అనేవి సాంఘిక అసమానతలు తగ్గించడానికే తప్పా, కేవలం ఆర్థిక వెనుకబాటుతనాన్ని సరిదిద్దడానికి ఉద్దేశించినవి కావు. అంతేగాక ఆర్టికల్‌ 16లో “తగినంత ప్రాతినిధ్యం లేని వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించాలని చెప్పారే తప్పా ఇప్పటికే అధిక ప్రాతినిధ్యం వున్న ఆధిపత్య కులాల కోసం కాదు. ఈ సవరణ చట్టాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేయడమైనది. కేసు విచారణలో వున్నది. అయితే, సుప్రీం కోర్టు ఈ చట్టం అమలుపైన

స్టే ఇవ్వాలన్న పిటీషన్‌ను తిరస్కరించింది. ఇప్పుడది దేశవ్యాప్తంగా అమలవుతోంది. అయితే, ఈ సవరణ చట్టం రాజ్యాంగ మౌలిక స్వభావానికి ఖచ్చితంగా భిన్నమైనదే. అయినప్పటికీ, అంత మాత్రాన మొత్తం రాజ్యాంగం మౌలిక స్వభావమే మారిపోయిందని భావించలేం.

కొన్ని సవరణలు రాజ్యాంగ స్ఫూర్తిని అమలు జరిపేందుకు ఉద్దేశించినట్టివి. ఉదాహరణకు రాజ్యాంగానికి చేసిన మొట్టమొదటి సవరణ. అది 1951లోనే చేయవలని వచ్చింది. న్యాయశాఖామంత్రిగా డా॥ అంబేద్క‌ర్‌ ఆ సవరణని పార్లమెంట్‌లో ప్రతిపాదించారు. మద్రాసు రాష్ట్రంలో అప్పుడు కమ్యూనల్‌ జి.వో. ద్వారా విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు అమలు జరుగుతోన్నాయి. ఒక ఆధిపత్య కులానికి చెందిన వైద్య విద్యార్థినికి ఎక్కువ మార్కులు వొచ్చినా, సీటు రాలేదని ఆ విద్యార్థిని మద్రాసు హైకోర్టులో కేసు వేసింది. ఆర్టికల్‌ 15 ప్రకారం మతం, జాతి, కులం, జందర్‌, పుట్టిన ప్రాంతాల వంటి కారణాలతో ఏ పౌరుడి యెడలా వివక్ష చూపకూడదనీ, అందుకు విరుద్ధంగా తనకు సీటు రాలేదన్న ఆ విద్యార్థి వాదనని మద్రాసు హైకోర్టు ఆమోదించి, ఆ జివోని కొట్టివేసింది. ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లగా, ఆ కోర్టు కూడా హైకోర్టు ఉత్తర్వుని ఖాయం చేసింది. ఆ పరిస్థితుల్లో రాజ్యాంగంలో పొందుపరచిన సామాజిక న్యాయం కోసం పెరియార్‌ ఉద్యమించారు. పార్లమెంట్‌లో దాన్ని సవరించవలసి వొచ్చింది. ఆ విధంగా ఎస్‌.సి., ఎస్‌.టి., బి.సి.లకు రిజర్వేషన్‌ సౌకర్యం కల్పించడమైంది .

 3. రాజ్యాంగంలోని అతి మౌలిక‌మైన ప్ర‌జ‌ల సార్వ‌భౌమాధికారాన్ని తాక‌ట్టు పెట్టే రాజ‌కీయార్థిక విధానాల ప‌ట్ల   కేంద్రంలోగాని, రాష్ట్రాల్లోగాని అధికారం చెలాయించిన‌, చెలాయిస్తున్న రాజ‌కీయ‌పార్టీల మ‌ధ్య తేడా క‌న‌బ‌డ‌టం లేదు.  చివ‌రికి ప‌శ్చిమ బెంగాల్‌లో ఒక‌ప్పుడు ఉండిన‌ వామ‌పక్ష ప్ర‌భుత్వం దాకా. మ‌రి రాజ్యాంగం అమ‌లు,  ప‌రిర‌క్ష‌ణ గురించి ఈ పార్టీల అవ‌గాహ‌న‌ల్లో ఏమైనా తేడా చూడ‌వ‌చ్చునా? 

రాజ్యాంగం ప్రజల సార్వభౌమాధికారాన్ని ఆమోదించింది. ఒక మనిషికి  ఓటు, ఒకే విలువ అనే సూత్రం ప్రకారం ప్రభుత్వాలు ఏర్పాడుతున్నాయి. కానీ, అవి అనుసరిస్తోన్న ఆర్థిక విధానాలు రాజ్యాంగంలో పొందుపరచిన సోషలిజం స్థాపన లక్ష్యానికి పూర్తిగా విరుద్ధం.

అమెరికావంటి బలమైన ఆర్థిక వ్యవస్థలు గల దేశాలతో అసమాన ఒప్పందాలు చేసుకొంటూ, దేశ సార్వభౌమాధికారాన్ని ఏదో ఒక మేరకు తాకట్టు పెట్టిన చరిత్రే, అన్ని పార్టీల ప్రభుత్వాల చరిత్ర. అదే సమయంలో సాంఘిక, ఆర్థిక అసమానతలున్న దేశంలో పౌరుడి ఓటు హక్కు సక్రమంగా, స్వేచ్ఛ‌గా వినియోగించుకొనే పూర్తి అవకాశం వుండదని చరిత్ర రుజువు చేస్తోంది.

రాజ్యాంగం పేర్కొన్న సమానత్వం, సామాజిక న్యాయం లక్ష్యాలు అమలు కాకపోవడం పూర్తిగా వాస్తవం. డా॥ అంబేడ్కర్‌ ఈ విషయమై “రాజ్యాంగం ఎంత గొప్పదయినా, పాలకులు మంచివారు కాకపోతే అది అమలు జరగదు, అని స్పష్టంగా చెప్పివున్నారు. సమానత్వం, సామాజిక న్యాయం లక్ష్యాలకు ఈ దేశంలో సరిగ్గాపైన అంబేడ్కర్‌ చెప్పిందే జరిగింది. ఆదికాలంలో కాంగ్రెస్‌ నుండి నేటి కాలంలో బిజెపి దాకా దేశాన్ని పరిపాలించిన రాజకీయ పార్టీలన్నీ రాజ్యాంగాన్ని వమ్ము చేయడంలో పోటీలు పడ్డాయి. అందుకు ప్రధాన కారణం ఒక్కటే. అవి ఆధిపత్య కులాల కార్పోరేట్‌ పెట్టుబడిదారీ భూస్వామ్య వర్గాలకు ప్రాతినిధ్యం వహించేవి కావడమే. యు.పి.ఏ.-1 కాంగ్రెస్‌ ప్రభుత్వం 2004లో సి.పి.ఐ., సి.పి.ఎం.ల మద్దతుతో ఏర్పడి కొనసాగినప్పటికీ, ఆ ప్రభుత్వ విధానాలని ఈ రెండు పార్టీలూ ప్రభావితం చేయలేక పోయాయి. అలాంటి శక్తిగానీ, బలమైన, ఖచ్చితమైన,

రాజీలేని ఆలోచనా విధానంగానీ, ఈ రెండు పార్టీలకు కూడా లేక పోవడం గమనార్హం. కొన్ని రాష్ట్రాల్లో – పశ్చిమ బెంగాల్‌, కేరళ, ఉత్తరప్రదేశ్‌, బీహార్‌, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో కమ్యూనిస్టు పార్టీలు, ఎస్‌.పి., బి.ఎస్‌.పి., డి.ఎం.కె. వంటి పార్టీలు అధికారంలోకి వచ్చినప్పటికీ, అవి కూడా సమానత్వం, సామాజిక న్యాయం లక్ష్యాలకు నికరంగా కట్టుబడి వ్యవహరించిన పార్టీలు కావు. అధికారం లక్ష్యంగా పెట్టుకొని తద్విరుద్ధమైన భావజాలం, విధానాలు కలిగివున్న పార్టీలతో చెలిమి చేయడం ద్వారా, ఆ ఉన్నత లక్ష్యాలను సాధించే ఎజెండా నుండి ప్రక్కకు జరిగిపోయాయి. ఆ పార్టీలు మాటల్లో మార్క్స్‌, ఫూలే, అంబేడ్కర్‌ సిద్ధాంతాలు వల్లించినా, ఆ పార్టీలు ఆచరణలో మౌలికంగా పాత పార్టీల విధానాలకే పరిమితమై పని చేశాయి. పర్యవసానంగా, సమానత్వం, సామాజిక న్యాయం లక్ష్యాలు

ఎండమావులుగానే మిగిలిపోయాయి.  దోపిడీ వర్గాల కులాల పెత్తనం కొనసాగుతుండటమే ఇందుకు  ముఖ్య కారణం అని చెప్పవచ్చును.

4. .  దీనికి రాజ్యాంగమే దోపిడీని  చ‌ట్ట‌బ‌ద్ధం చేయ‌డం, రాజ్యాంగ‌యంత్రం మీద దోపిడీ వ‌ర్గాల‌, కులాల పెత్త‌నం కొన‌సాగుతుండ‌టం  ఒక ముఖ్య కార‌ణం అన‌వ‌చ్చునా? 

రాజ్యాంగమే దోపిడిని చట్టబద్ధం చేసిందా?  రాజ్యాంగంలో ఎక్కడా శ్రమ దోపిడీ రద్దు కావాలి అని చెప్పని మాట నిజమే. కానీ, అసమానతలు తొలగించాలని, కార్మికుల తదితర శ్రమజీవుల జీవన పరిస్థితులు మెరుగు పడాలనీ, అంటరానితనం పోవాలనీ, అణచబడ్డ  కులాలకి సామాజిక న్యాయం జరగాలనీ తదితర అభివృద్ధికరమైన అంశాలను పేర్కొన్నది అంతేతప్పా, శ్రమ దోపిడీని రాజ్యాంగం చట్టబద్ధం చేయలేదు, రద్దు చెయ్యనూ లేదు. అట్లాగే ప్రైవేట్ ప్రాప‌ర్టీని క‌ళ్లెం వేసే విధానం ఏదీ రాజ్యాంగంలో లేదు. ప్రైవేట్ ప్రాప‌ర్టీ అంటేనే ఆస్తులు పోగేసుకోవ‌డం. దాన్ని పెట్టుబ‌డిగా వినియోగించి లాభాలు పొంద‌డం. అట్లా సోష‌లిజానికి, రాజ్యాంగానికి వైరుధ్యం ఉంది. సోష‌లిజం గురించి రాజ్యాంగం ప్ర‌స్తావించింది. అంత‌కంటే ఏమీ లేదు. అయితే అంబేద్క‌ర్ బ్రాహ్మ‌ణిజం, కేప‌టిలిజం రెండు శ‌తృవులు అన్నాడు. ఆయ‌న స్టేట్ కేప‌టిలిజం కావాల‌న్నారు. అదే  సమ‌యంలో భూమిని నేష‌న‌లైజ్ చేయాల‌న్నాడు. త‌న భావాలను పొందుప‌ర‌చ‌డానికి రాజ్యాంగంలో ప‌రిమితులు ఉండ‌వ‌చ్చు. అయినా స‌రే.. రాజ్యాంగం ద్వారా సోష‌లిజం సాధించ‌డానికి అందులో ఉండాల్సిన‌వి లేవు. 

అయితే శ్రమ దోపిడీని రద్దు చేసే అంశాలు ఇప్పుడైనా రాజ్యాంగంలో పొందుపరచడం అవసరమే. అంతేగాక, 42వ రాజ్యాంగ సవరణ ద్వారా భారతదేశాన్ని “సోషలిస్టు రిపబ్లిక్‌”గా కూడా ప్రకటించిన నేపధ్యంలో, ఆ లక్ష్య సాధనకు దోహదకారిగా శమదోపిడీ రద్దుకు అవసరం అయిన సవరణలు రాజ్యాంగానికి చేసి వుండాల్సింది. కానీ, చిత్తశుద్ధి లేని ఆనాటి కాంగ్రెస్‌ ప్రభుత్వంగానీ, తరువాత కాలంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ తదితర పార్టీల ప్రభుత్వాలుగానీ, సోషలిజం లక్ష్యాన్ని చేరుకోడానికి దోహదపడే సవరణలేవీ చెయ్యలేదు. పైపెచ్చు కాంగ్రెస్‌ ప్రధానమంత్రి పి.వి.నరసింహారావు హయాంలోనే మన్‌మోహన్‌సింగ్ ఆర్థికమంత్రిగా, ఆర్థిక సంస్కరణలు అనే ముసుగులో పచ్చి ప్రైవేటీకరణ, పెట్టుబడిదారీ విధానాలనుఅనుసరించారు. పబ్లిక్‌ రంగ సంస్థలను కూడా ప్రైవేటీకరించారు. అదే విధానాన్ని తరువాత అధికారంలోకి వచ్చిన బిజెపి కూడా మరింత నగ్నంగా కొనసాగిస్తోన్నది. ఆ విధంగా రాజ్యాంగంలో పొందుపరచిన సోషలిజం లక్ష్యానికి ఎగనామం పెట్టిన చరిత్రే ఈ అన్ని పార్టీల చరిత్ర.

5. అస‌లు సామాజిక న్యాయం, స‌మాన‌త్వ సంస్కృతి వంటివి అమ‌లు చేయ‌గ‌ల ఆధునిక స్వ‌భావం భార‌త రాజ్యానికి ఎంత వ‌ర‌కు ఉన్న‌ది? 

భారత రాజ్యానికి సామాజిక న్యాయం, సమానత్వ సంస్కృతి వంటివి అమలు చేయగల ఆధునిక స్వభావం లేదుగాక లేదు. ఇండియాలోని రాజ్య వ్యవస్థ, పాలక కులాధిపత్య శ్రమ దోపిడీ వర్గాలు తమ ప్రయోజనాల రక్షణకై నిర్మించుకున్న రాజ్య వ్యవస్థే (స్టేట్‌. “బూర్జువా వర్గ వ్యవహారాలను చక్కపరిచే మేనేజింగ్‌ కమిటీయే రాజ్య వ్యవస్థ” (State is the Managing committee to look after the affairs of the Borgeosie). పాలక వర్షాల ప్రయోజనాల పరిరక్షణకై, వాటిపై తిరగబడే శక్తుల అణచివేతకై ఏర్పరచుకొన్నదే రాజ్య వ్యవస్థ, అని మహనీయుడు లెనిన్‌ “రాజ్యము – విప్లవము” (State of Revolution) గ్రంథంలో అద్భుతంగా విశ్లేషించి వున్నారు. ఇండియాలోని రాజ్యంకూడా అలాంటిదే.  అందుకు భిన్నమైనదేమీ కాదు. కనుక, కులాధిపత్య శ్రమ దోపిడీ శక్తులు తమ అవసరాల నిమిత్తమై ఏర్పరచుకొన్న భారత రాజ్య వ్యవస్థకి సామాజిక న్యాయం సమానత్వ సంస్కృతి వంటి వాటిని అమలు చేయగల ఆధునిక స్వభావం వుండదు.

6.  పితృస్వామ్యం, అగ్ర‌కుల‌త‌త్వం, హిందుత్వం వంటి వాటిని భార‌త రాజ్యం వాడుకుంటున్న‌దా?  దాని స్వ‌భావంలోనే, ప‌ని తీరులోనే అవి ఉన్నాయా? 

సాంప్రదాయంగా ప్రజలు ఆచరిస్తోన్న పితృస్వామ్యం, అగ్రకుల తత్వం, హిందుత్వం వంటి వాటిని భారత రాజ్యం ఖచ్చితంగా తన ప్రయోజనాల కోసమై వాడుకొంటోంది. అవి రాజ్య వ్యవస్థకి స్వాభావికంగానే సంక్రమించాయి. అయోధ్యలో రామమందిరం నిర్మాణం అందుకు ఒక గొప్ప ఉదాహరణ : తాజాగా హైదరాబాద్‌ సమీపంలోని ముంచింతల్‌లో సమతామూర్తి పేరిట రామానుజాచార్య విగ్రహావిష్కరణ, తదితర నిర్మాణాలని కూడా రాజ్య వ్యవస్థ మోసపూరితంగా తన ప్రయోజనాల కోసం వినియోగించుకొంటోంది. ఒకవైపున సమానత్వం, సమతామూర్తి అంటూనే  మరోవైపున మూఢ నమ్మకాలకీ, అసమానతల శాశ్వితీకరణకీ వాడుకొంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే, ప్రజల్లో వున్న ప్రతి వెనుకబాటు భావజాలాన్నీ హేతుబద్ధం కాని నమ్మకాలనీ రాజ్యం విచ్చలవిడిగా బరితెగించి వాడుకొంటోంది.

7. అప్పుడు రాజ్యాంగ మార్గ‌ద‌ర్శ‌క‌త్వం మాటేమిటి?

ఇట్టి పరిస్థితుల్లో రాజ్యాంగంలోని సెక్యులర్‌ స్వభావాన్ని సామాజిక న్యాయ లక్ష్యాన్ని అమలు జరిపే విధంగా రాజ్యాంగ మార్గ దర్శకత్వం వుండాలి. పాలక వర్గాలకు చిత్తశుద్ధి గనుక వుంటే, ప్రస్తుత రాజ్యాంగం చూపిస్తున్న మార్గ దర్శకత్వంలోనే కొన్ని చట్టాలు చేయటం ద్వారా, వాటిని ఖచ్చితంగా అమలు జరపడం ద్వారా రాజ్యాంగ లక్ష్యాల సాధనకి మార్గాన్ని సుగమం చేసుకోవచ్చును. కానీ, అలా చెయ్యరు గాక చెయ్యరు.

8.  మ‌న సామాజిక సాంస్కృతిక స్థితికి-రాజ్యాంగ ఆద‌ర్శాల‌కు వైరుధ్యం ఉన్న‌ట్లే, రాజ్య స్వ‌భావానికి-రాజ్యాంగ ఆద‌ర్శాల‌కు వైరుధ్యం లేదంటారా?

ఆ విధంగా రాజ్య స్వభావానికి, రాజ్యాంగ ఆదర్శాలకు మధ్య వున్న వైరుధ్యాన్ని పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలి. అలాంటి ప్రయత్నం అనేది ప్రస్తుతం ఏ ప్రభుత్వాలూ చేయటం లేదు. అసలు రాజ్య స్వభావానికీ రాజ్యాంగ ఆదర్శాలకు మధ్య ఒక వైరుధ్యం వున్నదనే వాస్తవాన్ని కూడా పాలక వర్గాలు అంగీకరించవు. ఇక పరిష్క‌రించే ప్రశ్న ఎక్కడ ?

9. ప్ర‌తి మ‌నిషికీ ఓటు, ప్ర‌తి మ‌నిషికీ ఒకే విలువ‌, ప్ర‌జా ప్రాతినిధ్యం, చ‌ట్ట‌బ‌ద్ధ పాల‌న‌వంటివి వ‌ల‌స పాల‌న నేప‌థ్యంలో స్వీక‌రించి  ఆధునిక స్వ‌భావాన్ని ప్ర‌క‌టించుకున్న రాజ్యాంగం   దోపిడీని చ‌ట్ట‌బ‌ద్ధం చేయ‌డం వ‌ల్ల  ఎంత మేర‌కు ఆధునిక‌త‌ను సంత‌రించుకున్న‌ట్లు?  ఈ విమ‌ర్శ‌నాత్మ‌క వైఖ‌రిని మీరెట్లా చూస్తారు?

దోపిడీని రాజ్యాంగం చట్టబద్దం చేసిందా, అనే అంశాన్ని పై ప్రశ్నల సందర్భంలో చర్చించడమైనది. ఇది ఒక రకంగా పునరుక్తి అవుతుంది. ఒక మనిషికి ఒకే ఓటు – ఒకే విలువ అనే సూత్రాన్ని ఆమోదించి అమలు జరిపినంత మాత్రాన ప్రజాస్వామిక పరిపాలనగానీ, సామాజిక జీవనంలో ప్రజాస్వామ్యం వచ్చి పడిందనిగానీ భావించలేం. ఆటోమేటిక్‌గా ఏదీ రాదు. ప్రతిదీ కృషి ఫలితమే. కనుక, నిజమైన ఆధునికత రావాలంటే, సమానత్వం, సామాజిక న్యాయం, సామాజిక ప్రజాస్వామ్యం, సోషలిజం లక్ష్యాలు సాధించగల భావజాలం పరిపాలకులకీ, రాజ్య వ్యవస్థకీ వుండాలి. అనగా, కార్ల్‌మార్స్చ్‌ ప్రవచించిన శ్రమ దోపిడీ రద్దు సిద్ధాతం, ఇండియాలో మహాత్మా జోతిరావు ఫూలే, డా॥ బి.ఆర్‌. అంబేద్క‌ర్‌లు ప్రబోధించి ఆచరించిన సామాజిక సిద్ధాంతాల ప్రాతిపదికగా రాజ్యాంగ వ్యవస్థలు, పరిపాలనా వ్యవస్థలు ఏర్పడాలి. అవే స్వభావంగల ఆర్థిక, సాంఘిక విధానాలను రూపొందించుకొని అమలు జరపాలి.

10. చివ‌రిగా.. సామాజిక ప్ర‌జాస్వామ్య సాధ‌న‌కు రాజ్యాంగం ఇవ్వ‌గ‌ల మార్గ‌ద‌ర్శ‌క‌త్వం గురించి చెప్పండి? 

కుల వ్యవస్థ, అది పునాదిగా ఏర్పడిన ఆర్థిక వ్యవస్థల్లో సామాజిక అణచివేత శ్రమ దోపిడీలు జమిలిగా సాగిపోతున్నాయి. ఈ సామాజిక, ఆర్థిక వ్యవస్థలు విడివిడిగా లేవు. జమిలిగా, విడదీయ వీల్లేనివిగా పెనవేసుకొని వున్నాయి. ఏక కాలంలో జమిలిగా కొనసాగుతోన్న ఈ ప్రతికూల, విప్లవ ప్రతి ఘాతుక రుగ్మతలు రద్దయిపోవడం కూడా ఏక కాలంలోనే జరుగుతాయి. అవి కలిసే జంటగా జీవిస్తాయి; జంటగానే నశిస్తాయి (They sail together and also sink to together). ఆ రెంటినీ భారతదేశంలో విడదీసి చూడటం అవాస్తవిక దృక్పథం.

భౌతికవాద ప్రాథ‌మిక సూత్రాలకు విరుద్ధ‌ దృక్పథం. ప్రజాస్వామ్య స్థాపనా లక్ష్యం సమస్త వ్యవస్థల్నీ ప్రజాస్వామికీకరించడం, ఇండియాలో అత్యంత అప్రజాస్వామికమైన వ్యవస్థ కుల వ్యవస్థ. ఆ వ్యవస్థను ప్రజాస్వామ్యీకరించడం అత్యంత అవసరం. అనగా, సామాజిక ప్రజాస్వామ్యం నేటి తక్షణ అవసరం. నూతన ప్రజాస్వామ్యం (New Democracy), జనతా ప్రజాస్వామ్యం (Peoples Democracy), జాతీయ ప్రజాస్వామ్యం (National Democracy) వంటి లక్ష్యాలు అవసరమైనవే; కానీ, కుల వ్యవస్థ వేళ్ళునుకొని పోయి, సామాజిక అణచివేత సమస్త జీవన రంగాల్లో విచ్చలవిడిగా అమలవుతున్న దేశంలో, సామాజిక ప్రజాస్వామ్య ప్రధాన ద్వారం (main gate) గుండా ప్రవేశించి, ప్రయాణం చేయటం ద్వారానే సూతన ప్రజాస్వామ్య లక్ష్యాన్నిగానీ, మరో ప్రజాసామ్య లక్ష్యాన్ని గానీ భారతదేశం చేరుకో గలుగుతుంది. ఆ లక్ష్య సాధనలో కుల వ్యవస్థ – దోపిడీ ఆర్థిక వ్యవస్థ – రెండింటికీ బాధితులైన బహుజనులు సమీకృతులై లక్ష్యాన్ని సాధించుకొంటారు. చిత్తశుద్ధిగల బహుజనేతర ప్రజాస్వామికవాదులు సంఘీభావ శక్తులుగా వ్యవహరిస్తారు.

ఈ క్రమంలో ప్రస్తుత రాజ్యాంగం ఇవ్వగల మార్గదర్శకత్వాన్ని స్వీకరిస్తూనే, అవసరమైన మార్పులు చేర్పులు చేసుకొనవలసి వుంటుంది. కారణం చూపకుండానే రాజ్యాంగాన్ని మార్చాలనే శక్తులూ, వ్యతిరేక శక్తులూ హతాశులౌతారు. లక్ష్య సాధనకై అవసరమైన ఉద్యమ, పోరాట రూపాలను బహుజనులు ఆయా స్ధల, కాలమాన పరిస్థితుల కనుగుణ్యంగా అనివార్యంగా రూపొందించుకొంటారు.

 హైకోర్టు న్యాయవాది

సామాజిక న్యాయ కేంద్రం

రాష్ట్ర కన్వీనర్‌, సెంటర్‌ ఫర్‌ సోషల్‌ జస్టీస్‌

తేది : 16-02-2022

Leave a Reply