యాది వెన్నెల కాస్తుంది
వన భూమంత
పురా కాల మ్రానుకోటలో
జ్ఞాపకాల జాతర

ఒక కుంకుమ్భరిని
వీర మరణాల మీంచి
నడిచి వస్తున్న కాలాన్ని కథలు చెబుతుంది

కరువు గెల్చిన నేల మీద
కడుపు పగుళ్ళు బడి
ఆకలికన్నీళ్లతో
కొండలు కోనలు తడిసిపోయినా
ఓరుగల్లు మట్టికోట చెమ్మగిల్ల లేదు

నిలువెల్లా గాయల్తో ఆత్మాభిమానం
ఆదివాసీ యుద్ధ మైంది

శక్తి వంత ఆయుధాల్ని
సవాల్ చేసిన
సంప్రదాయబాణం

చెల్లా చెదురైన మోసం గెలిచాక
తుది శ్వాస చిలుకలగుట్టందుకుంది
ఆగిపోకుండా-

ప్రాణాల్ని దాచుకోలేని
ఒక నిష్కల్మష కాలం
ప్రాణం పోస్కోని

మానవాళికి
ఆకుపచ్చ తోరణాల అడివి కడుతుంది

ఒక వీరోచిత త్యాగాల
సంస్మరణప్రకృతోత్సవం
ఒక చేదు నిజాలతియ్యని
బంగారి జాతర

పాలకుల కుటుంబ కణకణం
ప్రజల సొమ్మని ప్రకటించిన
బతుకుపోరు

వెదురుచెట్లషామియనాలు
పెద్ద పెద్ద చెట్లపందిళ్ళు
ప్రకృతి పిలిచిన ధ్వని

ఇప్పపువ్వై గుప్పుమంటూ
ఒక ఆదిమ జీవనవాసనేదో
మనసును ముద్దాడుతుంది

ఒడిసేలా పట్టుకొని పాశ్చాత్యాన్ని తర్ముతూ
జనహేలో జల హేలో
జంపన్నవాగు పురాగానంలో
రేలా… రేలా…రేలా… రేలా… రేలా… రేలారే…!

గుమ్ముల కొద్దికుమ్మరిస్తూ
కొన్ని ప్రేమల్ని కొన్ని ఆత్మీయతల్ని
కొన్ని విలువల్ని
మళ్ళీ మళ్ళీ అల్లే
నేల గంధపు నెమలి పువ్వు!

One thought on “వీరగాధ

Leave a Reply