రాయలసీమకు జరిగిన విద్రోహానికి నవలా రూపం సాధన. తెలుగు నవలా ప్రస్థానంలో సాధన నవల ఒక మలుపు. ఈ నవలా రచయిత అనంతపురం జిల్లాలోని శాంతి నారాయణ. ఇది వరకు చారిత్రక నవలలు, మనో వైజ్ఞానిక నవలలు, సాంఘిక రాజకీయ ఉద్యమ అస్తిత్వ నవలలు శాంతి నారాయణ రాశారు. సాధన నవల అస్తిత్వవాద నవల. రాయలసీమకు అనాదిగా జరుగుతున్న అన్యాయాన్ని ఎత్తి పట్టిన నవల. అందుకేనేమో ఈ నవలకు గాయపడిన నేల అనే ట్యాగ్ ఉంచారు.
కోస్తా ప్రాంతం వారి వివక్ష వల్లనే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి నీళ్లు, ఉద్యోగాలు తదితర అనేక విషయాలలో రాయలసీమకు అన్యాయం జరిగిందని, ఇటువంటి వివక్ష వల్లనే తెలంగాణ విడిపోయిందని ఈ నవల వివరిస్తుంది. కేవలం కేటాయింపులలోనే కాదు. రాయలసీమ ప్రాంత ప్రజలపై ఆంధ్ర ప్రాంతం వారికి సాంస్కృతిక వివక్ష, చిన్న చూపు, చులకన భావం ఉన్నాయని ఈ నవల చిత్రిస్తుంది.
అనంతపురం జిల్లాలోని కమ్మ సామాజిక వర్గానికి చెందిన భూస్వామి రామప్ప పాత్ర ఈ నవలలో ప్రధానమైనది. తగరకుంట మండలంలో గుర్తింపు గల కుటుంబం ఆయనది. కాలేజీ, ఆసుపత్రి భవనాలు సొంత ఖర్చులతో నిర్మించిన వితరణశీలి రామప్ప. తోట పంటలతో గొప్ప వ్యవసాయదారునిగా పెద్ద మనిషిగా ఆ ప్రాంతంలో రాజకీయ పలుకుబడి సంపాదించుకున్నాడు. రామప్పకు ముగ్గురు కుమారులు, ఒక కూతురు. రెండో కుమారుడైన హరికృష్ణ కూతురే ఈ నవలా నాయిక సాధన. ఆమె వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో రీసర్చ్ విద్యార్థిని. అక్కడే విజయవాడ ప్రాంతానికి చెందిన సతీష్ కూడా విద్యార్థి. వీరిద్దరి పరిచయం పెద్దల అంగీకారంతో పరిణయంగా మారింది. సంతోష్ మేనమామ దుర్గారావు జడ్పీ చైర్మన్. మంచి మాటకారి. ప్రాంతీయ దురభిమాని. వ్యక్తుల పరిచయాలను లాభనష్టాలతో బేరీజువేసే మనిషి.
రాయలసీమ ప్రాంతానికి చెందిన శివప్రసాద్ విజయవాడ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. ఇతని చెల్లెలు వసంత సాధన స్నేహితురాలు. వసంత విజయవాడకు చెందిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటుంది. కానీ రాయలసీమకు చెందిన సాధన, వసంత, శివప్రసాద్ ఆంధ్ర సమాజంతో విసిగిన వారే. సాధన పెళ్లయిన నెలరోజుల తరువాత సతీష్‌కు విడాకులు ఇచ్చి అనంతపురానికి బయలుదేరుతుంది. ఇది సంక్షిప్త కథ.
సామాజిక వివక్ష ఉంది కాబట్టి ఈ నవల అస్తిత్వ వాద నవల అయిందని ముందుమాట రాసిన బండి నారాయణస్వామి అంటారు. హంద్రీనీవా కాలువకు నీళ్లు రావడంతో చెరువులు, బోరుబావులకు నీరందిన మాట నిజమే అయినా పంట పొలాలకు కాలువలు తవ్వలేదని, కాలువకు కేటాయించిన మేరకు నీరు అందడం లేదనే శాంతి నారాయణ వాదన నవలలో ధ్వనిస్తూ ఉంటుంది. అయినా ఈపాటికే ఓ మోస్తరు పంటలు పండుతున్నప్పుడు సమృద్ధిగా నీరు అందితే రాయలసీమ సుభిక్షంగా ఉంటుందనేది అతని వాదన.
ఆంధ్ర రాష్ట్ర అవతరణ నుంచి ప్రారంభమైన కథలోని రాజకీయ చర్చ సమైక్యాంధ్ర ఉద్యమం రాష్ట్ర విభజనతో ముగుస్తుంది. ఈ మధ్యలో రామప్ప అనేక సందర్భాలలో రాయలసీమకు జరిగిన ద్రోహాన్ని, రాయలసీమ కరువు చరిత్రను, రాజకీయ నాయకుల ద్రోహ చరిత్రను వివరిస్తూ వస్తాడు. తొలి ఆంధ్ర మహాసభ నుంచే రాయలసీమ నాయకులు ఆంధ్ర వాళ్లకు కలిసి ఉండటానికి ఇష్టపడలేదు. విజయవాడలోని సభలో ఏనుగుల మీద ఊరేగించి సన్మానించడంతో ఆంధ్ర రాష్ట్ర ఉద్యమంలో సీమ నాయకులు కలిసిపోయారు. ఇది అంతా చరిత్ర. రామప్ప తన గ్రామస్తులతోనూ, మనవడు చంద్రశేఖర్ మనవరాలు సాధనతోనూ మాట్లాడే సందర్భంలో ఈ చరిత్రను అంతా వివరిస్తాడు. నవలలో దాదాపు 40 పేజీల పైనే ఉన్న చరిత్ర రామప్ప ఉపన్యాసంలాగా కాకుండా సంభాషణలలోనే చరిత్ర సాగింది. దీని వల్ల నవలా స్వభావాన్ని ఒక మేరకు రచయిత నిలబెట్టగలిగాడు. మొత్తం మీద సీమకు ద్రోహం ఆంధ్ర నాయకుల వల్ల, సీమ నాయకుల వల్లనే జరిగిందని పాఠకులతో రామప్ప అంగీకరింపజేస్తాడు. ఏ ప్రాంతానికైనా అన్యాయం బైటి ప్రాంతం వారి వల్ల జరగడం సహజం. కానీ రాయలసీమకు బైటి ప్రాంత నాయకులతో సరిసమానంగా స్థానిక నాయకులతో కూడా జరిగింది. ఈ ప్రత్యేకతను ఈ నవల గుర్తించింది.
ఆంధ్ర వాళ్ల కుటిల నీతి మీద చర్చ సాధన పెళ్ళికి ముందే జరుగుతుంది. అయినా సాధన ఆంధ్రాకు చెందిన సంతోష్‌తో పెళ్లికి ఎందుకు ఒప్పుకున్నట్టు అన్న సందేహం వస్తుంది. సాధన, సతీష్ ఇద్దరూ పరిశోధక విద్యార్థులు, ఉన్నత విద్యావంతులు. ఉన్నత భావాలు కలిగిన వారు. రెండు ప్రాంతాల మధ్య తేడాల గురించి తెలిసినా సతీష్ వ్యక్తిత్వం కూడా తెలుసు కాబట్టి అతనిలో ఆంధ్ర దురహంకారం లేదని, ఈ విషయం మీద ఇంట్లో చర్చ జరిగిన సందర్భంలో సాధన అంటుంది. సతీష్ అటువంటి వాడు కాదని, ఐఏఎస్ సాధిస్తాడని కుటుంబంలోని వారందరితో ఒప్పిస్తుంది.
పెళ్లయి భర్త ఇంటికి పోయిన తర్వాతే అసలు వ్యక్తులు బయటపడినారు. పెళ్లికి ముందు సాధన తమ్ముడు చెప్పిన మాటలన్నిటినీ సతీష్ ఇంట్లో అందరి సమక్షంలో బట్టబయలు చేస్తాడు. మొత్తానికి ఆంధ్రావాళ్లతో రాయలసీమ వాళ్లకు అనుబంధాలు కుదరవని, ఈ రెండు సమాజాలు కలిసిపోవని శాంతి నారాయణా ఈ నవలలో వివరిస్తాడు. కొన్ని చారిత్రక ఘటనలను, వాటిలో రాయలసీమకు జరిగిన విద్రోహాన్ని చెప్పడం, రాయలసీమ సమస్యలకు ప్రత్యేక రాష్ట్రమే పరిష్కారం అని ఒప్పించడం వరకు ఈ నవల విజయవంతమైంది. ఇలాంటి చారిత్రక విషయాలకే పరిమితం అయి ఉంటే ఇది కేవలం చారిత్రక నవల అయ్యేది. రచయిత దృక్పథం అస్తిత్వవాదం. ఆ వైపు నుంచి సీమ అస్తిత్వాన్ని చూడటం అంటే సీమ మీద వైఖరిని ప్రకటించడమే కాదు. అవతల ఉన్న కోస్తా సమాజం మీద కూడా వైఖరి ప్రకటించవలసి ఉంటుంది. రాయలసీమ, కోస్తా అనే రెండు అస్తిత్వాల మీద అస్తిత్వ దృక్పథంతో నవల రాయడం వల్ల ఈ నవల అనేక ప్రశ్నలను ఎదుర్కొంటుంది. సందేహాలకులోను చేస్తుంది.
ఆంధ్రాను ఒకే ముద్దగా నవలా రచయిత భావిస్తాడు. ఆ ప్రాంత వ్యక్తుల గురించి, ఆ ప్రాంతానికి, రాయలసీమకు ఉన్న సంబంధాల గురించి ఈ భావనే నవల అంతా ఉంటుంది. రచయితది అస్తిత్వవాదం కాబట్టి ఇలా చూడటం సమజమే.
రాయలసీమకు జరిగిన మోసాన్ని, రాయలసీమ నాయకుల స్వార్థాన్ని వివరిస్తూ చంద్రశేఖర్ వంటి పాత్రల ద్వారా రాయలసీమ రాష్ట్ర సాధన ఏకైక మార్గమని శాంతి నారాయణ అంటారు. ఆంధ్ర ప్రాంతం ఇటువంటి కరువు కాటకాలతో ఉండేదని, జొన్న అన్నం తినేవాళ్లని, కాటన్ దొర వల్ల ధవళేశ్వరం, ప్రకాశం బ్యారేజీ వల్ల అభివృద్ధి చెందిందనే చరిత్ర అట్టడుగు విషయాలను నవలలోకి శాంతి నారాయణ తీసుకొచ్చారు. ముట్నూరు కృష్ణారావు తన పత్రికలో సీమను కించపరుస్తూ వ్యాసాలు రాస్తే అనంతపురంలో పప్పూరు రామాచార్యులు సాధన అనే పత్రిక ద్వారా కృష్ణారావు వ్యాసాలను ఖండిస్తూ రాసేవాడట. అందుకే రామప్ప తన మనవరాలికి సాధన అనే పేరు పెట్టుకున్నాడు. ఆపేరే శాంతి నారాయణ తన నవలకూ పెట్టుకున్నాడు. ఆంధ్రా వాళ్ళ మోసపూరిత విధానాల వల్ల, రాయలసీమ నాయకుల స్వార్థ విధానాల వల్ల రాయలసీమ ఎండిపోయిందని చెప్పడం ఈ నవల ఇతివృత్తం. కోస్తాంధ్ర విద్రోహానికి నీలం సంజీవ రెడ్డి దగ్గరి నుంచి జగన్మోహన్రెడ్డి దాకా సీమ నాయకులు చేసిన అన్యాయం తోడై రాయలసీమ రాళ్ల సీమగా మారిందనే సంగతి చెబుతూ కూడా ఈ నవలను ఎన్టీ రామారావుకు, వైఎస్ రాజశేఖరరెడ్డికి అంకితం ఇవ్వడం అసలు విషయం.
ఇప్పటికీ ఎన్ని జంటలు ఈ విధంగా మీరు చెపుతున్న కారణాలవల్ల విడిపోయారు.