‘అందరి వెంట, అందరి అభివృద్ధి’ అనే నినాదంతో తన రాజకీయాధికారాన్ని ప్రారంభించిన బిజెపి ప్రభుత్వం గత అయిదు సంవత్సరాలలో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాన్ని ఎక్కడికి చేర్చింది అనే విషయం తెలుసుకోవాల్సిన అవసరం వుంది.

తలసరి ఆదాయం: 2020లో ఉత్తరప్రదేశ్  మొత్తం జనాభా దాదాపు 23కోట్లు వుంది. ఆదాయ వార్షిక సంవత్సరం 2011-12లో  2015-16, 2016-17లలో దాదాపు 12 శాతం వుండిన స్థిరమైన విలువ అభివృద్ధి రేటు సగటు 4శాతానికి పడిపోయింది. మొదటి రెండు సంవత్సరాలలో 8 నుంచి 10 శాతం వుండిన తలసరి ఆదాయం పడిపోయి 4 శాతం అయింది. ఆ తరువాత 2.4 నుంచి 4.4 మధ్య వుంది.

వ్యవసాయ రంగం: వ్యవసాయం పశుపాలన రంగాల్లో భాగస్వామ్యం – 2015-16లో 21.9% వుండగా, 2016-17లో 20.6%, 2017-18లో 20.4%, 2018-19లో 20.1%, 2019-20లో 19.8%గా వుంది. ఈ విధంగా రాష్ట్ర ఆదాయంలో వ్యవసాయం, పశుపాలన రంగాల ఆదాయ పాలు తగ్గిపోతూనే వచ్చింది. దాదాపు 86% నీటిపారుదల వున్నప్పటికీ పంట ఉత్పత్తి కేవలం 1.63 మాత్రమే వుండింది.  ఫలితంగా వ్యవసాయంలో మెరుగుదల ఏ మాత్రం లేనట్లే. నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం ఉపయోగం 4:2:1 నిష్పత్తి లో వుండాల్సింది కానీ 2014-15లో 17:5:1 వుండింది. 2019-20లో 18.71:6.21:1 కి పెరిగింది. ఈ విధంగా వ్యవసాయాయానికి సంబంధించి శాస్త్రజ్ఞుల సలహాలుతీసుకునే ఏర్పాటు లేకపోవడం వల్ల పంట భూమి, పంట రెంటి మీదా చాలా ప్రభావం పడింది. ప్రాధమిక సమస్యల పరిష్కారం మీద ఏ మాత్రం దృష్టి పెట్టకపోవడం వల్ల పంట నష్టం, పెట్టుబడి ఎక్కువ అవడమే కాకుండా భూమి ఉత్పత్తి శక్తి మీద కూడా ప్రభావం చూపింది. మొత్తం ప్రాధమిక రంగంలోని ఆదాయం కూడా ప్రభావితమై 25.4శాతం భాగస్వామ్యం నుంచి 24.1 శాతానికి పడిపోయింది.

పరిశ్రమల రంగం: పరిశ్రమల రంగం భాగస్వామ్యం 18-6%నుండి తగ్గి 14.3% అయింది. గనులు, ఖనిజాల ఉమ్మడి కంపెనీల సంఖ్య 26 నుంచి 24 అయింది. 2011-12లో పెద్ద పరిశ్రమల సంఖ్య 158 వుండింది. వీటిలో 50930 మంది కార్మికులు వుండగా, పెట్టుబడి 5873కోట్లు వుండింది. అప్పటి నుంచి కొత్తగా ఒక్క పెద్ద ఫ్యాక్టరీ కూడా రాలేదు. ఈ నాటికీ ఆ సంఖ్య అంతే వుంది. అత్యధిక వస్తువుల, ఉదాహరణకు, ఆహార సామాగ్రి, నూలు, వనస్పతి నెయ్యి, తోలు సామాగ్రి, మోటారు వాహనాలు, మిశ్ర ధాతు సామాగ్రి, విద్యుత్పరికరాలు మొదలైనవాటి పారిశ్రామిక ఉత్పాదన సూచిక తగ్గిపోయింది. చిన్న పరిశ్రమల నమోదు సంఖ్య ఎక్కువైనప్పటికి చిన్న పరిశ్రమలు, చిన్న ఉపాధులపై బాగా దుష్ప్రభావం పడింది. ముఖ్యమంత్రి యోగి అధికారంలోకి వస్తూనే తన అవతారం చూపించడం మొదలుపెట్టాడు. దేశంలో ప్రధానమంత్రి మోడీ ‘నోట్ల రద్దు’ చేయడం వల్ల రాష్ట్రంలో ఎంతోమంది ఉపాధి కోల్పోయారు. తరువాత ‘మాంసనిషేధం’ వల్ల మాంస పరిశ్రమ, వ్యవసాయ రంగాలు కూడా ప్రభావితమయ్యాయి.  గ్రామాలు, వ్యవసాయంలో ‘దేశ దిమ్మరి పశువుల’ సమస్య ఎక్కువైంది.

కార్మికుల పట్ల ప్రభుత్వ క్రూర వైఖరి వల్ల సమ్మెలు, లాక్‌అవుట్‌ల వల్ల 2018-19&2019-20 లలో 66.5&65 వేల పని దినాల నష్టం జరిగింది. అందువల్ల గత రెండు సంవత్సరాల్లోనే 131.5 వేల మానవ దినాల పని నష్టం జరిగింది. ఫలితంగా మొత్తం కార్మిక రంగపు ఆదాయం 31శాతం నుంచి 27శాతానికి పడిపోయింది. సేవారంగంలో కంపెనీలు 6631 నుంచి 4459కి తగ్గిపోయాయి. సేవా రంగంలో భాగస్వామ్యం కొంత పెరిగి 48.6 నుంచి 48.8 అయింది.

విద్యుదుత్పాదన: విద్యుదుత్పాదన సామర్ధ్యంలో ఏ మాత్రం పెరుగుదల లేదు. 2018-19లో వుండిన 5999మెగావాట్స్, 2019-20లో కూడా అంతే వుంది. 2018-19లో వుండిన 306269లక్షల కిలోవాట్లు నుంచి తగ్గిపోయి 2019-20లో 261996 లక్షల కిలోవాట్లు అయింది. ఈ విధంగా ఉత్పత్తిలో 44273 లక్షల కిలోవాట్లు తక్కువ అయింది. వినియోగం పెరిగిపోవడం వల్ల ప్రభుత్వం విద్యుత్తును కొంటోంది. ఉత్తర ప్రదేశ్ విద్యుత్ మండలి ప్రకారం, అన్ని 97814 గ్రామాల్లోనూ, దళితుల బస్తీల్లోనూ విద్యుత్తు సౌకర్యం వుంది. అంటే దీనర్ధం ప్రతి యింటికీ విద్యుత్ సరఫరా అవుతుందని ఎంతమాత్రమూ కాదు. వున్నచోట సరిపడా లేదు. దేశంలో తలసరి విద్యుత్ వినియోగం 1181కెవి, గుజరాత్ లో 2378కెవి, హర్యానాలో 2082, పంజాబ్‌లో 2046, ఒడిశాలో 1628, మధ్యప్రదేశ్‌లో 1084 కెవి వుండగా ఈ రాష్ట్రంలో 600 కే‌వి మాత్రమే వుంది.

ఉద్యోగావకాశాలు: ఈ అంశానికి సంబంధించి గణాంకాలు అందుబాటులో లేవు. చాలా మందికి ఉపాధి కల్పనా కేంద్రాల మీద నమ్మకం పోయి తమ పేర్లు నమోదు చేసుకోవడం మానేశారు. అయినప్పటికీ 2019లో నమోదు చేసుకున్న 33,04,800లో కేవలం 95,900మందికి మాత్రమే ఉద్యోగాలు దొరికాయి. ఈ సంఖ్య గత సంవత్సరం ఒక లక్షా 13వేలు వుండింది.

తలసరి ఆదాయం: తలసరి ఆదాయం రూ. 38934 నుంచి రూ. 44011కి పెరిగినప్పటికీ, ఆదాయ పంపిణీలో తారతమ్యం పెరిగిపోయింది. గ్రామ ప్రాంతాల్లో యిది మరీ ఎక్కువగా వుంది. 2016-17లో గౌతమ బుద్ధ నగర్ జిల్లాలో తలసరి ఆదాయం రూ. 331188రూపాయలు వుంటే, బరూచీలో రూ. 17736  వుండింది, అంటే 18.67యింతలు తేడా వుండింది. 2018-19లో గౌతమబుద్ధనగర్‌లో తలసరి ఆదాయం రూ. 439022 వుంటే బరూచీలో రూ. 20749  వుండింది. అంటే 21.16యింతల అంతరం అయింది. యిది కేవలం ఒక జిల్లా సమస్య కాదు, అత్యధిక జిల్లాల ఆదాయం రాష్ట్ర సగటు ఆదాయం కంటే తక్కువగా వుంది.

బ్యాంకింగ్ వ్యాపారం: ఈ రాష్ట్రంలో బ్యాంకులు ఎప్పుడూ కూడా అప్పులివడంలో ఉదారంగా లేవు. సేవింగ్స్ –పెట్టుబడి నిష్పత్తి 46.76 వుంది. అంటే ప్రజలు బ్యాంకులో ఎంత డిపాజిట్ చేస్తారో అందులో 47శాతం మాత్రమే బ్యాంక్ అప్పు యిస్తుంది. దేశంలో ఈ నిష్పత్తి 76 శాతంగా వుంది. గ్రామీణ ప్రాంతంలో ఈ నిష్పత్తి మరీ తక్కువగా వుంది.

విద్య: రాష్ట్రంలో ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలలను మూసేస్తున్నారు. 2018-19లో ప్రాథమిక పాఠశాలల సంఖ్య 161366 నుంచి 2019-20లో 138185కి తగ్గిపోయింది. 2018-19 లోవుండిన 227.87 నుంచి 156.63లక్షలకి తగ్గిపోయింది. యిందులో బాలుర సంఖ్య 117.89 లక్షల నుంచి 80.29 లక్షలకు తగ్గిపోతే, బాలికల సంఖ్య  109.98 లక్షల నుంచి 76.34లక్షలకు తగ్గిపోయింది. ఆడపిల్లని రక్షించండి- చదివించండి అని నినాదాలిచ్చే మోడి-యోగి ప్రభుత్వాలు ఆడపిల్లలకు, పేద కుటుంబాల పిల్లలకు విద్యను దూరం చేసాయి.

ఆరోగ్యం: ఆరోగ్య వ్యవస్థ మరింత దారుణంగా వుంది. ఒక లక్ష జనాభాకు 2.1 ప్రభుత్వ ఆసుపత్రులు, 34 పడకలు వున్నాయి. చికిత్స పొందే వారి సంఖ్య తగ్గిపోయింది. 2018-19 లో వుండిన 107.39 లక్షలు 9.58 లక్షలకు పడిపోయింది. గత సంవత్సరం కంటే 361 మెడికల్ ఆఫీసర్లు తగ్గిపోయారు. కరోనా కాలంలో ఆరోగ్య వ్యవస్థలోని లోపాలు ప్రస్ఫుటమయ్యాయి. ఆక్సిజన్ దొరకక చనిపోయినవారి చనిపోవడానికి సంబంధించి ముఖ్యమంత్రి స్వంత జిల్లా మాత్రమే కాదు పూర్తి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రమే పతాక శీర్షికలలోకి ఎక్కింది.

ఈ విధంగా అన్ని మౌలిక రంగాలలోనూ దారుణ పరిస్థితులు వుండగా మతపర కల్లోలాలను రేపి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నాలు చేస్తోంది. రైతాంగ ఉద్యమ సఅమయంలో లఖీంపుర్ ఖీరి ఘటన ప్రజాస్వామిక వ్యవస్థపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది.

దస్తక్ పత్రిక నుంచి

అనువాదం : కొండిపర్తి పద్మ

Leave a Reply