గ్రామీణ రైతాంగజీవితాన్ని చిత్రించిన సాహిత్యంలో  పురుషుడే కథానాయకుడు. ఆయా కథలు నవలలు నాటకాలలోని పాత్రలు సంఘటనలు సందర్భాలు పరిస్థితులు అన్నీ పురుషుడి కేంద్రంగానే కొనసాగాయి. రైతు సాహిత్యంలో మహిళారైతుల గురించి, రైతుకూలీల గురించి, వ్యవసాయేతర ,వ్యవసాయ అనుబంధరంగాల్లో నిరంతరం శ్రమించే దిగువ స్థాయి వారిని   కేంద్రంగా చేసుకొని వెలువరించిన సాహిత్యం చాలా తక్కువ.

రైతు జీవితం పొడవునా అమ్మమ్మ నానమ్మ తల్లి పిన్నమ్మ పెద్దమ్మ అత్త భార్య వదిన మరదలు అక్క చెల్లెలు కూతురు మనవరాలు ఇట్లా అనేక రూపాల్లో కనిపించే స్త్రీ పాత్ర విస్మరించలేనిది, అత్యంత ముఖ్యమైనది కూడా. అయినా రైతాంగజీవితాన్ని చిత్రీకరించిన రచనల్లో ఆమెకు ఉండాల్సినంత స్థానం ,ప్రాధాన్యత లేకపోవడం గమనార్హం. రైతాంగజీవిత చిత్రణలో ఆమె ప్రాధాన్యతను విస్మరించడం లేదా తగ్గించడం చాలాసార్లు ఆమె పాత్రను పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగిందన్న కఠినమైన వాస్తవాన్ని నిర్మొహమాటంగా ఒప్పుకోక తప్పదు.

రైతు మరణం  లేదా ఆత్మహత్య తర్వాత అతని భార్య తల్లి బిడ్డల సోదరీమణుల భావోద్వేగాలను, వారి జీవితాల్లో వచ్చిన మార్పును,  వాళ్ళు ఎదుర్కొన్న సంఘర్షణల్ని అత్యంత ప్రతిభావంతంగా చిత్రీకరించిన సందర్భాలు తెలుగు నవలల్లో కథల్లో అక్కడక్కడా బలంగా కనిపిస్తాయి.

అయితే రైతు జీవితంలో మొదటి నుండి అతని కష్టసుఖాల్లో దుఃఖంలో పోరాటాలలో అలసటలో అవిశ్రాంత జీవితంలో అన్ని సందర్భాల్లోనూ తప్పకుండా ప్రస్తావించాల్సిన మహిళ గురించి ఆయా సంఘర్షణల్లో ఆమె పడే వేదన గురించి ఆమె చూపే చొరవ గురించి ఆమె ధైర్యం గురించి ఆమె భాగస్వామ్యం గురించి ఆమె మనోనిబ్బరం ఆత్మవిశ్వాసం గురించి   సాహిత్యంలో ప్రధానంగా చిత్రీకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

భూమిపైన ఆస్తి పైన ఆమెకు హక్కు లేకపోవడం లేదా ఉన్నప్పటికీ అది కేవలం కాగితాలకే నామమాత్రంగా పరిమితం అయిపోవడం, ఆస్తుల పంపకాల్లో ఆమెకు ఉండాల్సినంత ప్రాధాన్యత లేకపోవడం వల్ల, జీవితాంతం పొలం పనుల్లో శ్రమించే ఆమెకు తన కుటుంబంలో, సమాజంలో,సాహిత్యంలో ఇచ్చిన స్థానం బాధ కలిగిస్తుంది. వాస్తవిక జీవితాన్ని కళాత్మకంగా చిత్రీకరించిన చాలా మంచి రచనల్లో కూడా మహిళా రైతు దుఃఖాన్ని ఆమె ఒంటరితనాన్ని ఆమె చైతన్యాన్ని భావోద్వేగాలను విపులంగా చిత్రీకరించడంలో రచయితలు కొంత వెనుకబడ్డారని చెప్పాల్సి ఉంటుంది.

పురుషున్ని ప్రధానంగా చేసుకొని పురుషుడి దృష్టి కోణంలో నుంచి కొనసాగిన రైతాంగజీవిత చరిత్రను ఇప్పుడు ఆమెను ప్రధానపాత్రగా చేసుకొని ఆమె దృష్టి నుండి ఆమెను కేంద్రీకంగా చేసుకొని రైతు జీవితాన్ని పునః పరిశీలించి, విస్తృతంగా రచనలు చేయాల్సిన అవసరం కనబడుతోంది.

రైతాంగజీవితంలో ఆమె పాత్ర గురించి, ఆమె పాత్ర కొనసాగిన తీరు గురించి, ఆమె భావోద్వేగాల గురించి ఆమె అస్తిత్వం గురించి పరిశోధించి, చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే రైతుజీవితంలోని అన్ని సందర్భాల్లోనూ అన్ని ఉద్వేగాలకి సంఘర్షణలకి సందర్భాలకు ఆమె ప్రత్యక్ష సాక్షిగా ఉంటుంది. రైతు జీవితంలోని ప్రతి అంశంలో ఆమెకి భాగస్వామ్యం ఉంది. పురుషుడు ఎంత ప్రధాన పాత్రధారి అయినప్పటికీ ఆ రైతు ఇంట్లోపలి స్త్రీలు కూడా అతడి జీవితంలో, అతన్ని కేంద్రంగా చేసుకొని రాసిన రచనల్లో ప్రధాన భాగస్వాములుగా  ఉంటారు.

*

రైతు మనుగడను ఉనికినే ప్రశ్నార్థకంగా మార్చే రైతు వ్యతిరేఖ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రైతులు ఒకటై తిరుగుబాటు చేసి , దిఖ్ఖార స్వరాన్ని వినిపించడం, రైతుల ఉద్యమంలో అత్యంత కీలకమైన పరిణామం. ప్రాంతీయ భాషా విభేదాలను విభిన్నతను దూరంగా పెట్టి రైతులందరూ ఒకటి కావడం, రైతు వ్యతిరేఖ చట్టాలు అమలు కాకుండా చేయడం ఒక గొప్ప విషయం. ప్రస్తుతానికి ఈ చట్టాలు వెనక్కి వెళ్లినప్పటికీ ,భవిష్యత్తులో మళ్లీ ముందుకు రావని చెప్పలేం. ఆ దిశగా కూడా రైతులను అప్రమత్తం చేసే రచనలు సాహిత్యంలోకి విరిగా రావాల్సిన అవసరం ఉంది. రైతులలో చైతన్యం కలిగించే సాహిత్యం పట్ల రైతులతో ప్రత్యక్షంగా రచయితలు సంభాషణ జరపాల్సిన అవసరం ఉంది. రైతుల కోసం రాసిన సాహిత్యం రైతులను చేరాలి కదా.

భౌగోళిక రాజకీయ ఆర్థిక సామాజిక పరిస్థితులు వర్షం కరువుకాటకాలు అతివృష్టి అనావృష్టి తుఫానులు వరదలు ఇలా మీద ప్రకృతి‌ మొత్తం రైతుపైన పగబట్టినట్టే, ప్రారంభం నుండి  రాజ్యం కూడా రైతు పైన పగబట్టినట్టే  వ్యవహరిస్తోంది.

చరిత్రలో నమోదైన విషయాలను సాహిత్యం కూడా సమాంతరంగా సృజనాత్మకంగా నమోదు చేస్తుంది. చరిత్ర విస్మరించిన, మినహాయించిన అనేక సంఘటనలను సందర్భాలను ఉద్యమాలను సాహిత్యంలో నిష్పక్షపాతంగా చిత్రీకరించడం చరిత్రలోని కొన్ని ఖాళీలను పూరించటానికి ఉపయోగపడుతుంది.

ప్రజల దృష్టికోణం నుండి చరిత్రను చరిత్ర రచనను చరిత్ర క్రమాన్ని పునః పరిశీలించుకునే దశలో ఇదివరకే ఏర్పడిన ఖాళీలను పూరించడానికి బదులు, రాజ్యం చాలా నిశ్శబ్దంగా ఎలాంటి హడావిడి లేకుండా చరిత్రను మార్చి, చరిత్ర పాఠాలను తొలగించి,పాక్షికదృష్టితో, మతతత్వమే ప్రధానంగా కొత్త చరిత్ర పాఠాలను కొత్త చరిత్రను సృష్టించే ప్రయత్నం చేస్తోంది. ఒక కట్టడంలో ఏ ఒక్క రాయిని తొలగించడం కానీ, అదనంగా చేర్చడం కానీ ఎట్లా  అసంబద్ధంగా ఉంటుందో, అసమంజసంగా ఉంటుందో చరిత్ర పాఠాలు కూడా అంతే!

 ఈ ప్రయత్నాలకు వ్యతిరేకంగా సృజన కారులు చరిత్రకారులు మేధావులు రచయితలు విద్యావంతులు దేశవ్యాప్తంగా తమ కలాల ద్వారా గళాల ద్వారా మాట్లాడే ప్రయత్నం చేస్తుంటే, మరోవైపు  నిర్బంధాలు నిషేధాలు, అణచివేతల ద్వారా అడ్డుకునే ప్రయత్నం మరోవైపు చాలా బలంగా జరుగుతోంది.

రైతాంగజీవితాన్ని సృష్టించినంతగా   రైతాంగ ఉద్యమాలను, రైతుకుటుంబాల్లోని స్త్రీల భావోద్వేగాలను, స్త్రీలు అనుభవించే హింసను చిత్రీకరించే రచనలు విస్తృతంగా రాలేదనే చెప్పాలి. రైతు పక్షాన పెద్ద సంఖ్యలో కవులు, పరిమితంగా నవలా రచయితలు, విస్తృతంగా కథా రచయితలు నిలబడి తమ భాషల్లోని రచనలతో పాటు ఎన్నో విలువైన అనువాద రచనలను కూడా పాఠకులకు అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ అనువాద సాహిత్యం ద్వారా ఇతర రాష్ట్రాలలోని రైతు జీవితానికి రైతు ఉద్యమానికి సంబంధించిన ఎన్నో విలువైన లోతైన అంశాలను, తెలుసుకోగలుగుతున్నాం. ఒక చీకటి చరిత్రను తెలుసుకోగలుగుతున్నాం.

ఈ క్రమంలో కొత్త జీవితాలు కొత్త పాత్రలు  కొత్త భావోద్వేగాలు తెలుస్తున్నాయి, వాటితోపాటు ఎన్నో కొత్త ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. రైతు జీవితానికి సంబంధించి ఉద్యమాలకి సంబంధించి రైతు జీవితంలోని స్త్రీ కి సంబంధించి ఇప్పటికే ఉన్న ఎన్నో ఖాళీల గురించి చర్చిస్తూనే, ఈ కొత్త ప్రశ్నలకు కూడా సమాధానాలను సాహిత్యకారులు అన్వేషించాల్సి ఉంది.

*

ఈ నేపథ్యంలో రాయలసీమ ప్రాంతంలోని రైతుజీవితాన్ని వివిధ కోణాల్లోంచి చిత్రీకరించిన 18 కథలతో కర్నూలు- రాయలసీమ ప్రచురణల వారు 2022లో “వాన మెతుకులు” రాయలసీమ రైతు కథా సంకలనాన్ని వెలువరించారు.

 ఈ కథల సంకలనం అనేక వాస్తవాలను చర్చకు తీసుకు వచ్చింది. ఉన్నత చదువులు చదివి వ్యవసాయం వైపు మరలుతున్న యువతరం, వ్యవసాయాన్ని ఒక వ్యాపకంగా, కొత్త అదనపు ఆదాయ కేంద్రంగా చేసుకున్న యువతరం, పల్లెల నుండి వలస పోయిన రైతులతోపాటు పట్టణాల నుండి వ్యవసాయం పేరిట పాక్షికంగా వలస వస్తున్న ఆధునిక యువత గురించి, రైతాంగ జీవితంలోని అనేక లోతైన విషయాలను గురించి చిత్రీకరించిన  ఈ కథా సంకలనంలోని ప్రతి కథా విలువైనదే.

ఈ మొత్తం కథాసంకలనంలో ముగ్గురు రచయిత్రుల కథలు ప్రత్యేకంగా పరిశీలించాల్సి ఉంటుంది.

నల్లబోతుల నాగమణి రాసిన “బంధాల మొలక”, కే సుభాషిణి రాసిన “తోట అమ్మకానికి లేదు”,

డాక్టర్ ఎం.ప్రగతి రాసిన ” నేనూ రైతునే” కథలు విభిన్న కథాంశాలతో కొనసాగుతాయి. ఈ ముగ్గురు రచయిత్రులు రాసిన ఈ రైతు కథలు ప్రత్యేకమైనవి, కొత్త విషయాలను చెప్పినవి.

*

 వ్యవసాయరంగంలో సంపూర్ణంగా పురుషుడితో సమానంగా స్త్రీ కూడా కష్టపడుతున్నప్పటికీ, ఆమె శ్రమకు కుటుంబంలో సమాజంలో చట్టంలో ప్రభుత్వ లెక్కల్లో ఎలాంటి విలువ గుర్తింపు లేకపోవడం ఒక దారుణమైన విషయం.

గ్రామీణరంగంలో ఇప్పటికీ పురుషుల ఆస్తి విషయాలు ఆర్థిక లావాదేవీలు భూ సంబంధమైన విషయాలు ఏవి కూడా వాళ్ల తాలూకు స్త్రీలకు ఏమాత్రం తెలియవు. అలా తెలియాల్సిన తెలపాల్సిన అవసరం లేదని పురుషులు భావించడమే అందుకు కారణం. పేరుకుపోయిన ఫ్యూడల్ మనస్తత్వం, పురుషాధిక్యత ఇందుకు ప్రధాన కారణాలు.

స్త్రీల ద్వారా వచ్చిన భూమిపై బంగారంపై సర్వహక్కుల్ని అనుభవించే పురుషుడు ఆ స్త్రీలకు సంబంధించిన భూమిని కానీ, బంగారాన్ని కానీ తాకట్టు పెట్టే సందర్భాలలో కానీ వాటికి సంబంధించిన లాభాదేవిల విషయంలో కానీ , ఆ సొత్తుకు, సంపదకు వాస్తవ యజమానురాలైన స్త్రీలకు చెప్పకపోవడం  మానవ అనాగరికతను,  పురుష అహంకారాన్ని సూచిస్తుంది. అయితే ఇందుకు ఆయా కుటుంబాలలోని ఇతర స్త్రీలు పురుషులను ఆ దిశగా ఆ విధంగా ప్రోత్సహించటం, ప్రేరేపించడం ఒక తప్పిదం. స్త్రీల పట్ల వ్యవహరించే ధోరణిలోఎప్పుడో రావాల్సిన మార్పుల గురించి, ఇప్పటికైనా ఖచ్చితంగా రావాల్సిన మార్పుల గురించి ఈ కథ చెబుతుంది.

*

“మంచిదయ్యా, మీరెల్లబారితే నేను నా పనికి పోతా” అంటుంది హనుమక్క.రైతు భార్య, స్వయంగా రైతు కూడా అయిన  హనుమక్క మాటలివి. గుండెలు మండించే మాటలు!

పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న రైతు నారాయణ భార్య హనుమక్కను పరామర్శించడానికి వచ్చిన నలుగురి ప్రశ్నలన్నిటికీ ఓపికగా సమాధానం చెబుతుంది హనుమక్క.

తన భర్త ఆత్మహత్య గురించిన వివరాలను ఎవరెవరికో చెబుతున్నదనే సాకుతో, బియ్యం కార్డు కూడా తీసిపారేసారని, ఎవరితో అయితే మాట్లాడుతున్నదో వాళ్లతోనే డబ్బు ఇప్పించుకోండి అంటూ, మేము ఇవ్వం అని అంటున్నారని, పరమార్శ కోసం ఎవరు వచ్చినా ఏదైనా డబ్బులు వస్తాయేమో అని అప్పుల వాళ్ళు చుట్టూ కాచుకొని ఉన్నారని, మాటలు చెప్పినంత మాత్రాన పరామర్శించినంత మాత్రాన తనకు ఒరిగేది ఏమీ లేదని, ముఖం మీద చెబుతూ, ఆ సందర్భంలో ఆమె పదునుగా ఆ మాట అంటుంది. నరాలు మెలిపెట్టే మాట అది.

“..ఏమనుకోవద్దు సామీ, ఇట్ల మీరూ మీరూ వచ్చినంత మాత్రాన మాకు ఒరిగేదేందీ లేదు, పంచేటు, బరువు సేటు తప్ప.” ముఖం మీద కొట్టినట్టు తగిలాయి మాటలు.

“అట్లగాదమ్మా, మీ ఒక్క కుటుంబమే గాదు ఈ సమస్యల్లో ఉన్నది, ఇంకా చాలామంది రైతులు పంటలు పండక, పండిన వాటికి ధర రాక అగచాట్లు పడుతున్నారు. అప్పుల్లో కూరుకుపోయిన రైతులు పదుల సంఖ్యలో ఆత్మహత్యలు చేసుకున్నారు. పరిహారం రాక, అప్పులు తీర్చలేక వాళ్ల కుటుంబాల వాళ్లు అవస్థపడుతున్నారు. ప్రభుత్వం మీద వత్తిడి తెచ్చేకి మీ నుంచి వివరాలు తెలుసుకోవాలని వచ్చినాము. మీకు అండగా ఉంటామని ధైర్యం చెప్పేకి వచ్చినాము. మీరు చెప్పిన విషయాలన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకపోయి మీకు న్యాయం జరిగేటట్టు చూస్తాము. వస్తామమ్మా.” బయల్దేరడానికి లేచారు.

“మంచిదయ్యా, మీరెల్లబారితే నేనూ నా పనికిపోతా.” చేతులు జోడించింది హనుమక్క

*

నారాయణకు అప్పులే ఆదాయమవుతున్నాయి అని ఒక మాటలోనే రైతు జీవితం మొత్తాన్ని పాఠకులకు పరిచయం చేస్తుంది రచయిత్రి.

నారాయణ కొడుకు టౌన్ లో డిగ్రీ చదువుతున్న వెంకటేశుకి తండ్రి బాధలు పూర్తిగా తెలియవు. పురుగుల మందు తాగి ఆత్మహత్యా ప్రయత్నం చేసిన నారాయణను ఎలాగైనా కాపాడుకోవాలని, పట్టణంలోని ఖరీదైన ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చి చికిత్స ఇప్పిస్తున్నప్పుడు అక్కడి డాక్టర్లు మరొక యాభై వేల రూపాయలు కట్టండి అంటారు. అప్పుడు వెంకటేశు విపరీతంగా ఆందోళన పడతాడు. అయితే అతని ఆందోళన తండ్రి బ్రతకడం గురించి కాదు, ఇక్కడ కూడా డబ్బే ప్రధానం అవుతుంది.

అతడి పరిస్థితిని మనస్తత్వాన్ని వాచ్యంగా రచయిత్రి ఎక్కడా చెప్పదు. అతని మాటల రూపంలోనే అతని మనసు ఏమిటో చెబుతుంది.

అతడు వాళ్ళ అమ్మ హనుమక్కను ఇంత డబ్బు ఖర్చు చేయడం గురించి, ఇంకా డబ్బు అవసరం అవడం గురించి విసుక్కుంటాడు.

 కథనం ఇలా కొనసాగుతుంది.

….

ఉన్న బోరెండిపోతే అప్పు మీద అప్పు తెచ్చి ఒకచోట కాదు, ఆరు చోట్ల బోరేయించాలని ప్రయత్నించాడు నారాయణ. అప్పుల ఊట ఉబికింది గానీ, భూమిలో నీళ్లు మాత్రం పడలేదు. వాన చినుకుల్ని నమ్ముకొని విత్తనాలకు, ఎరువులకు ఖర్చు చేశాడు. విత్తనాలేసినప్పుడు రాని వాన కాస్తో కూస్తో పంట పండి, కోతకొచ్చినప్పుడు కురిసి, ఆ కాస్త పంటను మట్టిపాలు చేసింది. అప్పుల మొలకలు మాత్రం దినదిన ప్రవర్ధమానంగా ఎదిగిపోయాయి. ప్రతి ఏడాదీ ఇదే తంతు. పదెకరాల పొలం అప్పుడింత ఇప్పుడింత కరిగిపోయి, మూడెకరాలకు కుంచించుకుపోయింది. చేయడానికి మరోపని చేతకాదు, చేయాలన్నా మనసు రాదు. మళ్ళీ మళ్ళీ అప్పులు, కురవని వాన, నీళ్లూరని నేల – ఎన్నున్నా ఆశల విత్తనాలు మాత్రం విత్తుతూనే ఉన్నాడు నారాయణ. విత్తనాలకు, పురుగు మందులకు, ఎరువులకు అంగట్లో చేసిన అప్పులు, బయట చేసిన అప్పులు అన్నీ కలిపి మూడున్నర పైమాటే.

అడిగినంత డబ్బు ఇచ్చి ఎంత ఖర్చు పెట్టినా ఆ రైతు ప్రాణం నిలబడదు. రైతు ప్రాణంతో వ్యాపారం చేసిన  పే.. ద్ద.. ఆసుపత్రి గురించి ఎంత తిట్టుకున్నా ఆమె కోపం బాధ తగ్గవు.

*

ఈ కథలోనే మరొక ముఖ్యమైన కథ లచ్చుమమ్మది. ఆమె భర్త ఈరన్న ఏమి చేతకానివాడు. అప్పు  ఇచ్చిన ఆసామి ఎవరో ఇచ్చిన అప్పు తీర్చలేదని ఇంటి మీదకు వచ్చి ఇష్టారాజ్యంగా అరుస్తాడు. ఈరన్న మారు మాట్లాడకుండా నిర్వికారంగా చూస్తూ ఉంటాడు. లచ్చుమమ్మ ఎంతగానో బతిమాలుతుంది. “మా మర్యాద తీయకుండా వెళ్ళండి ఈ ఒకసారికి. పంట అమ్మిన తర్వాత మొత్తం ఇచ్చేస్తాను” అని బ్రతిమాలుతుంది.ఆ దుర్మార్గుడు ఆ మాట వినిపించుకోడు. రేపటి లోగా తన అప్పు తీర్చకపోతే ఆమె కూతురు 17 ఏళ్ల గౌరీని తోలకపోతానని ఈరన్న వైపు

వేలు చూపిస్తూ అప్పుల వాడు వెళ్లిపోతాడు.

“అసలు తన బిడ్డ ఏంచేసింది?వాళ్ల నాయన చేసిన అప్పుకు ఈ పిల్లను ఎందుకు అంటాడు. నరాలు కోసినట్లుగా ఉంది “అని తలబాదుకుంటూ లచ్చుమమ్మ ఏడుస్తూ ఇంట్లోపలికి వెళ్ళిపోతుంది.

మసటి రోజు ఉదయాన చూసే సరికి లచ్చుమమ్మ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని ఉంటుంది.అప్పుడు కూడా ఆమె భర్త ఈరన్న ఏమి పట్టనట్టు శూన్యంలోకి చూస్తూ ఉంటాడు.

తన భర్త ఆత్మహత్య చేసుకుని చనిపోయినప్పుడు ముందుగా చెప్పాల్సిన అధికారులకు చెప్పలేదు కాబట్టి నష్టపరిహారం రాలేదని, గుర్తు చేసుకుంటూ లచ్చుమమ్మ గౌరమ్మను ముందస్తుగా వెంటనే హెచ్చరిస్తుంది. ముందుగా పోలీసులకు ఆఫీసర్లకు చెప్పమని, లేదంటే ఏదో ఒక సాకు చూపించి వాళ్ళు ఆ డబ్బులు ఇవ్వకుండా ఎగవేస్తారని నష్టపరిహారం వస్తుందో రాదో అని ముందు జాగ్రత్తగా సలహా ఇస్తుంది.

కథలో మలుపు ఇక్కడే ఉంది.

నెల తర్వాత గౌరమ్మను హనుమక్క అడుగుతుంది. అధికారులు ఏమైనా డబ్బులు విషయం చెప్పారా అని?

అప్పుడు గౌరి బదులిస్తుంది.”ఏందీ రాదంట సిన్నమ్మా. మాయమ్మ అసలు రైతే గాదంట! బూమి మీయమ్మ పేరు మింద లేదు గాబట్టి మీయమ్మ రైతు గాదు అన్న్యారు.” గౌరి మాటలతో తెల్లబోయింది హనుమక్క.

పొలం ఎవరి పేరు మీద ఉంటే వాళ్ళు చనిపోయి ఉంటేనే పరిహారం వస్తుందని, ఊర్లో  ఆడవాళ్ళు ఎవరికీ పొలాలు లేవు కనుక వాళ్ళు రైతులు కాదంటున్నారని లచ్చుమమ్మ కొడుకు వెంకటేష్ వివరంగా తల్లికి చెబుతాడు.

ఆమె ఆలోచనల్లో వచ్చిన మార్పుతో, ఆమె తీసుకునే సాహసోపేతమైన నిర్ణయంతో ఈ కథ ముగుస్తుంది. ఈ కథ మొదట ప్రజాశక్తి ఆదివారం స్నేహలో  జనవరి 2022 లో ప్రచురితమయింది.

వెంకటేశు మాటలకు లచ్చుమమ్మ కళ్లల్లో కదిలింది హనుమక్కకు.

‘నాలుగు సినుకులు రాలితే సాలు మొగుని కంటే ముందు గంప నెత్తినబెట్టుకొని, పార తీసుకొని చేనికి పోయేది లచ్చుమమ్మ. యిత్తనాలేసేకి, నాట్లేసేకి, కలుపుతీసేకి, కోతకోసేకి, గడ్డి వాము ఏసేకి ఎంతెంత పంజేసేది లచ్చుమమ్మ! అన్ని పనులు జేసినా కడాకు పంట అమ్మేతప్పుడు ఆయిమ మొగునిదే పైమాట, ఎంతకమ్మిండేదీ తెల్దు, ఎంత వచ్చిండేదీ తెల్దు. ఆ మాటకొస్తే లచ్చుమమ్మ మటుకే గాదు, సేద్యం జేసే అన్ని ఇండ్లల్లోనూ ఆడోల్లకే దండిగా పన్లు, ఎవరో పెద్దపెద్ద ఆసాముల ఇండ్లల్లో తప్పిస్తే. దున్నేతప్పుడు ఎడ్లకు బదులు కాడి మోసి, కూలోల్లతో పంజేపిచ్చి, వేరే పొలాల్లో బదులు పంజేసి, నూర్పిడి జేసి, యిత్తనాలు మల్లా పంటకు దాసిపెట్టి లెక్కలేనన్ని పనులు జేసే ఆడోల్లు రైతమ్మలు గాదంట. వచ్చే సేద్యం సార్లు గుడక ఏం పంట పెట్టాల, ఎరువులేమెయ్యాల అని మొగోల్లతో మాట్లాడేదే గానీ ఏపొద్దూ ఆడోల్లతో మాట్లాడి ఎరగరు. పట్టాదారు పాసుబుక్కుంటేనే రైతా? ఏందీ అన్యాయం? మొగోని ఆస్తిలో బాగమైనట్టు, ఆ పొలాల్లో కూలి లేకుండా బతికినంతకాలం పారా, కొడవలి తిన్న పంజేస్తా ఉండాలా?”

“మా!”

వెంకటేశు పిలుపుతో హనుమక్క ఆలోచనల్లోంచి బయటికొచ్చింది.

“మా… ఎమ్మార్వో ఆఫీసులో పట్టా పాసుబుక్కు నా పేరు మింద మార్చుకునేకి పోవల్లంట.”

“అట్లనేలేరా!” నిమిషమాగి, “వొద్దులేరా!” అంటున్న తల్లిని ఆశ్చర్యంగా చూశాడు వెంకటేశు.

“నీపేరు మీదొద్దులేరా, నా పేరు మింద రాపిస్తాం.”

వెంకటేశు ముఖంలో క్వశ్చన్ మార్కు మరింత పెద్దదయింది.

“అదేంది మా, నీపేరు ఎట్ల రాపిచ్చల్ల?”

“ఏం ఏంటికి రాపీగూడదు? నేను సేద్యం పన్లు జేస్తాండ్లేదా? సేన్లో పంజేసేకి మేంగావాల గానీ, పాసుబుక్కులో పేరెక్కిచ్చేకి తరుంగామా? నేనూ రైతునేరా, నా పేరు మిందే ఉండనీ. నేను పొయినంక నువ్వూ, నీ సెల్లెలూ సగం సగం తీసుకుందురు.” హనుమక్క గొంతు స్థిరంగా పలికింది.

భూములపైనా, బంగారం పైనా స్త్రీలు హక్కులు సాధించడం అంటే అదేదో వారి  హక్కులు అధికారాలకు  సంబంధించిన విషయం మాత్రమే కాదని అది మనందరి బాధ్యత అని, రైతు అంటే కేవలం మగవాడు మాత్రమే కాదని, స్త్రీ కూడా రైతే అని, ఆమెకు కూడా చట్ట ప్రకారం అన్ని హక్కులు ఉన్నాయని, ఉండాలని, వ్యవసాయ శాఖ అధికారులు మాట్లాడాల్సింది కేవలం మగరైతులతో మాత్రమే కాదని ఈ కథ చెబుతుంది.

Leave a Reply