‘శికారి’నవలలోని కథ జీవితానికి సంబంధించిన ఒక ప్రవాహం. ఆ ప్రవాహం కెసి కెనాల్ అనే జల ప్రవాహం ఒడ్డున పెనవేసుకున్న శికారీల జీవితం.
ఈ జీవన ప్రవాహం ఒక భార్యాభర్తల గొడవతో మొదలౌతుంది..అక్కడ నుండి శికారిల లోపలి, బైటి వైరుధ్యాల మీదుగా అలా కొనసాగుతుంది. చివరికి ఒక ఉత్సవంతో ముగుస్తుంది. ఈ ఆశ నిరాశల జీవన గమ్యం-గమనం ఏమిటి? నిత్యం మారే రాజకీయార్థిక పరిస్థితులు జీవితాన్ని స్థిమితంగా ఒక చోట ఉండనిస్తాయా? ఆ కదలిక ఈ కథలో ఉంది. చుట్టూ మారుతున్న రాజకీయార్థిక పరిస్థితులు శికారీలను కూడా ప్రభావితం చేస్తాయి. కథనంలో శికారీ పాత్రలు వస్తూ ఉంటాయి. జీవన ప్రవాహ మలుపుల్లో తమ పాత్రని నిర్వహిస్తూ ఉంటాయి. ఇందులో మంచి- చెడులు, ఉద్వేగాలు, కోపతాపాలు, కసి పెంచుకోవడాలు, పరిత్యాగం చేయడాలు, పరిష్కారం వెతుక్కోవడాలు- ఇలా కొనసాగే జీవన ప్రవాహం ఇది.
ఈ ప్రవాహం నిండా ఒడిదుడుకులే. తీవ్రమైన ఘర్షణే. అదే ఈ నవల లక్షణాల్లో ఒకటి.
ఈ ఘర్షణ శికారీలు అనబడే ఈ అతి చిన్న సమూహానిది. వారి మనుగడలో భాగమైనది. ఈ ఘర్షణ ఆ సమూహం లోపలిదీ, అలాగే సమూహం బయటి ప్రపంచంతో ఏకాలంలో సాగించేదీ! సమూహం లోపలి ఘర్షణ తనను తాను నిలబెట్టుకునేది. అంటే తను ఈ విశాల విభిన్నతల సమాజంలో కనుమరుగై పోకుండా తన అస్తిత్వ ప్రత్యేకతని నిలబెట్టు కోడానికి పడే ఘర్షణ. ఇందులో తీవ్రమైన హింస ఉంటుంది. తమ తెగ అస్తిత్వంలోని నియమ నిబంధనల్ని సమూహంలోని ఒక సభ్యుడు, సభ్యురాలు దాటి ప్రవర్తిస్తే, తమ నైతిక నియమావళిని కాదని ప్రవర్తిస్తే ఒళ్ళు చిరుకుపోయేలా కొరడా దెబ్బలు తినాల్సి వస్తుంది. వాళ్లు తల వంచి ఆ శిక్షని స్వీకరించడానికి సిద్ధపడతారు. దీన్ని విశిష్టత అనాలా? మరేమైనా అనాలా?
సారాయి కాచుకుంటూ, బ్లాక్ టికెట్లు అమ్ముకుంటూ, యాచించి కడుపు నింపుకుంటూ లేదా అంతకు ముందు వారి మూల వృత్తి అయిన ‘‘వేట” చుట్టూ అల్లుకున్న తమదైన సొంత రాజకీయార్థిక సాంస్కృతిక ప్రత్యేకత ఒక ప్రవాహంలా ఎలా సాగుతూవచ్చింది? ఇంత చిన్న మనుష్య తెగకు చెందిన నైతిక నియమావళి విశిష్టమైనది అవుతుందా? అయ్యే అవకాశం ఉందా?
మన రాజ్యం, సామాజిక వ్యవస్థ పునాదిగా ఉన్న ఆధిపత్య రాజకీయాలు, ఈ దేశంలో కొన్ని కులాలకు, లేదా కొన్ని మతాలకు వనరుల మీద ఆధిపత్యం తెచ్చిపెట్టాయి. అడవులను దోచుకునే సంపదను కూడబెట్టే అవకాశం వీరికే కట్టబెట్టాయి. ఆ కోణం నుంచి చూసినప్పుడు చిన్న చిన్న జాతుల చిన్న చిన్న సమూహాలు తమ మనుగడ కోసం పడే ఘర్షణలో దోపిడీ లేకపోవడం ఈ విశిష్టతకు కారణం. ఇలాంటి విశిష్టత ఒక కఠినమైన నియమావళిని ఏర్పాటు చేసుకుంటుంది. దోపిడీతో సంబంధం లేని ఏ సంస్కృతి అయినా గొప్పది కాకుండా ఎలా పోతుంది. బైటి సమాజం వాళ్ళ మీద దొంగలని ముద్ర వేసి దూరం పెట్టాక , వాళ్ళు ఈ *నాగరిక * సమాజపు దుర్మార్గంలో కలిసిపోకుండా తమదైన ప్రత్యేకతలను కాపాడుకోడానికి ప్రయత్నిస్తారు. అప్పుడు శికారిల సంస్కృతి గొప్పది కాకుండా పోతుందా? శికారి నవల అలాంటి శికారి ల సంస్కృతి పట్ల గౌరవం కలిగిస్తుంది.
అమెరికా లాంటి సామ్రాజ్యవాద దేశం తయారు చేసే బి52 బాంబర్ కంటే పాలస్తీనా వాడు ఎత్తే రాయి ఎప్పటికీ గొప్పదే!
అగ్రవర్ణాల గానాబజాన ముందు దళితుడు వాయించే డప్పు ఎప్పటికీ గొప్పదే!!
పెట్టుబడిదారుడి డబ్బు కంటే కార్మీకుడి శ్రమశక్తి గొప్పదే!
భారత ప్రభుత్వం ఆదివాసీలను అణచడానికి ఉపయోగించే అన్ని కుటట్రపూరిత యుధ్ధ విద్యలకంటే ఒక ఆదివాసీ తన అడవిని కాపాడుకోడానికి ఉపయోగించే విల్లంబులు ఎప్పటికీ గొప్పవే!!
అట్లాగే ఈ కర్నూలు మహానగరం ‘‘అభివృద్ధి’’ చెందడానికి దీనిలో సంపద ఇంతగా పోగవడానికి ఆధిపత్య వర్గాలు లేదా పాలకవర్గాలు చేస్తున్న వనరులను విధ్వంసం పాత్ర గొప్పగా ఉంది.
ఈ విధ్వంసమే అసమానతలకు కారణం.
ఇది చిన్న సమూహాల జీవితాన్ని హాలాహలం చేయకుండా ఉంటుందా?
ఎప్పుడో శివాజీ కాలంలో ఓ చారిత్రక సందర్బంలో శికారీలు ఇక్కడికి వచ్చి పడ్డారు. అప్పటి నుండి ఇప్పటి దాకా ఈ దుర్మార్గ వ్యవస్థ నుండి వేరుపడే ఉన్నారు. ఈ సమాజం వీళ్ళని తమలో ఇముడ్చుకోక పోవడానికి, వీళ్ళ జీవితం చుట్టూ చాలా జుగుప్సాకరమైన కథలు అల్లి ఉంటారు. తాగుబోతులనీ, హింసావాదులనీ, దొంగలనీ ఇలా చాలా చాలా కథలు అల్లి ఉంటారు. ఓ భయానక వాతావరణాన్ని వాళ్ళకు ఆపాదించి ఉంటారు. అన్నింటికి మించి వాళ్ళని ఈ సో కాల్డ్ అల్ట్రా మాడ్రన్ సంస్కృతిలోకి రానీయకుండా అత్యంత భయంకరమైన వ్యాధులకూ, అంతే భయంకరమైన అనారోగ్యకరమైన పొల్యూషన్ లో ఉంచేశారు.
వేటలో ఆరితేరిన వీళ్ళు ఇప్పుడు ఆ ప్రధాన వృత్తి నుండి వేరు చేయబడ్డారు అడవుల నరికివేత వల్ల దూరం చేయబడ్డారు.
సారాయి కాచడం తెలుసు కాబట్టి దాన్ని వృత్తిగా స్వీకరిస్తే బడా బాబుల ఖరీదు సారాయికి పోటీగా ఉందని దాని నుండీ దూరం చేయబడ్డారు. ఎన్టీఆర్ తీసుకొచ్చిన మద్యపాన నిషేధం వీళ్ళ ని ఇంకా ఆర్థిక కష్టాల్లోకి నెట్టింది. ఆ తర్వాత యాచక స్థాయికి దిగజార్చబడ్డారు ఇంక బతకడానికి మార్గం లేక బ్లాక్ టికెట్ లకు అలవాటుపడేలా చేశారు. దొంగతనాలకు రాజకీయ హత్యలకు ఉపయోగించుకోబడ్డారు. అది వీళ్ళ ఆర్థిక స్థాయిని, సామాజిక స్థాయిని పెంచిందా? లేదు. వాళ్లను ఇప్పటికీ అక్కడే అదే కేసీ కెనాల్ ఒడ్డునే ఉంచేసింది. ఆ తర్వాత నగర అభివృద్ధిలో విస్తాపనకు గురయ్యారా అక్కడే ఉన్నారా?
ఈ సమూహం చాలా చిన్నది ఈ కర్నూలు నగర చుట్టూ పక్కల ప్రాంతాలు రాయలసీమ లో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఉన్నట్టు ఉంది. అటు కార్మీకులు ఇటు బహుజనులు ఇటు మైనారిటీలు ఈ దేశంలో చాలా అభద్రతలో బతుకుతున్నారు. ఆ మాటకొస్తే సామ్రాజ్యవాద ప్రపంచీకరణ చాలా సమూహాలను గిరిజనులను వారి సాంస్కృతిక వారసత్వాన్ని మింగేసింది. అమెరికాలో రెడ్ ఇండియన్స్ గతి ఏమైందో మనందరికీ తెలుసు. ఈ అసమ సమాజంలో తన అస్తిత్వాన్ని కాపాడుకుంటూ ఒక సమూహం మనుగడ సాగిస్తూ ఉందంటే దాని కంటే గొప్ప విషయం లేదు. అలాంటి ఒక శికారి సమూహానికి సంబంధించిన జీవితాన్ని ఇంత బాగా పాఠకులకు పరిచయం చేయడం లో పాణి విజయం సాధించారు.
మన చూపుతో చూడడానికి, మన చేతితో తాకడానికి, మన జీవితంతో ముడివేసుకోడానికి ఇష్టపడని ఒక సమూహం శికారి. వారి జీవన సంఘర్షణని అత్యంత ప్రతిభావంతంగా మన ముందుంచినందుకు పాణిని అభినందిందించాలి. ఇందులో పాత్రలు కాల్పానికమైనవా, కాదా అనేది పక్కన పెడితే ఆ పాత్రల స్వరూప స్వభావాలు అబ్బుర పపరుస్తాయి. పాత్రలకు ఒక వ్యక్తిత్వాన్ని ఆపాదించాలంటే గొప్ప పరిణితి కావాలి. ఆ పాత్రలకే చెందిన ప్రవర్తనా పాత్రల మధ్య వైరుధ్యాలు అదే సమయంలో ఐక్యత సాధించాలంటే గొప్ప పరిశీలనా శక్తి కావాలి. నిజానికి ఈ వైరుధ్యాలు పాత్రల మధ్య ఘర్షణ ఎప్పుడూ బైటి సమాజంలోకి పొక్కదు. అది నియమంగా పాత్రలు నిబధ్ధతగా ప్రవర్తిస్తాయి. (ఈ పాత్రలకు ఎంచుకున్న పేర్లు ఎంత ముచ్చటగా ఉన్నాయో! ) రచయిత వాళ్ళతో మమేకమై రాయడంతో సహజంగా నవల నడక సాగింది. కర్నూలు పట్టణానికే చెందిన అత్యంత సొగసైన జీవభాషని పాఠకులు ఈ నవల ద్వారా రుచి చూస్తారు. నిజానికి ఇది మట్టిమనుషుల భాష. అచ్చంగా రాయలసీమ ఆర్థిక భౌతిక, బౌధ్ధిక పరిణామాల్లోంచి ఉధ్బవించిన జీవధ్బాష. ఇది శికారీల మాతృ భాష కాకపోవచ్చు. కర్నూలు నగరంలోని భాషని, ఇతరులతో శికారీలు మాట్లాడే భాషను ఇందులో రాయడం ప్రత్యేకత. ఈ నవల చదివాక ప్రపంచానికి పరిచయం కాకుండా ఇంకా ఎన్ని సమూహాలిలా మిగిలిపోయాయి? ఇంక ఎన్ని సమూహాలు తమ మనుగడను కాపాడుకోడానికి మిగతా ప్రపంచపు ఆధిపత్యంతో ఘర్షణ పడుతున్నాయి? అనే ప్రశ్నలు తలెత్తుతాయి. సామాజికశాస్త్రాలకే ఒక పని పెట్టే ప్రశ్నలివి? మనం మన సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవడంలో పూర్తిగా విఫలం చెందాం. ఇక్కడ సంస్కృతి అంటే అగ్రవర్ణాలదీ, బ్రాహ్మణీయ భావజాలం నుండి మిగతా సమూహాలని పూర్తిగా వేరు చేసేది అని అర్థం చేసుకోవాలి. ఇంకా ఇలాంటి సమూహాలు ఈ దేశంలో ఎన్ని ఉన్నాయో. వాళ్ళ జీవనంలో సంస్కృతి లో ఎన్ని ప్రత్యేకతలున్నాయో వెలితీయడానికి రచయితలను ఈ నవల ఉసిగల్పుతుందని నమ్ముతున్నాను.. అట్లాగే ఈ రాజ్య దుర్మార్గాలతో ఇబ్బంది పడుతున్న అన్ని సమూహాలు తమ ప్రత్యేకతలను నిలుపుకుంటూనే కలిసి ఈ రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడే సంఘటనగా తయారు కావడానికి కూడా ఈ నవల దోహద పడుతుందని ఆశిస్తున్నాను.