గోమియా, నవాదీయ్ ఆదివాసుల గురించి ఆలోచిద్దాం
జార్ఖండ్ జనాధికార మహాసభ తన సహచర సంస్థలు (ఆదివాసి , మూలవాసి సంఘటన్, బోకారీ, ఆదివాసి ఉమెన్స్ నెట్‌వర్క్, బగైచా తదితర సంస్థలు) కలిసి ఆగస్ట్ 2021- జనవరి 2022 మధ్యకాలంలో బోకారీ జిల్లా గోమియా & నవాదీయ్ డివిజన్ పరిధిలో (బ్లాక్‌లో) అమాయకులైన, నిర్దోషులు ఆదివాసీలు, నిర్వాసితులు మావోయిస్టులని, ఇతర తప్పుడు ఆరోపణపై క్రిమినల్ కేసులు నమోదు చేసిన ఘటనపై నిజనిర్ధారణ కమిటీ విచారణ చేసింది. దాదాపు 31 మంది పీడిత కుటుంబాలను, బాధితులను విచారణ చేసింది. ఈ నిజనిర్ధారణ ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే బాధితుల పరిస్థితులను అర్థం చేసుకోవడం, అక్రమకేసుల నమోదును అర్థం చేసుకోవడం. ఈ అక్రమకేసుల వలన బాధితుల కుటుంబాలపైన ఉన్న తీవ్ర ప్రభావం తదితర విషయాలు వెలుగులోకి తీసుకురావడం. ఈ నివేదిక బాధితుల స్టేట్‌మెంట్స్ మరియు క్రిమినల్ కేసులకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా రూపొందించబడింది. ముఖ్యమైన ఘటనల సంక్షిప్త సమాచారాన్ని మొదటిభాగంలో మరియు బాధితుల సంక్షిప్త సమాచారాన్ని రెండోభాగంలో పొందుపరిచాము.
క్షేత్ర వివరణ
బోకారో జిల్లా గోమియా , నవాదీయ్ డివిజన్‌లలో ‘సంథాల్’ ఆదివాసి తదితర సముదాయాలు జీవిస్తున్నాయి. ఆదివాసి సముదాయాలు కొన్ని ప్రధాన పంచాయితీలలో ఎక్కువ సంఖ్యలోనే ఉన్నాయి. గోమియాలో ప్రసిద్ధ ఆదివాసీల పుణ్యక్షేత్రం ‘లుగుబూరు’ అనే కొండలు ఉన్నాయి. సంతాల్ అనే ఆదివాసి తెగ ఆదివాసిల మూలవిరాట్ జాతులుగా ‘ముండా’ జాతులుగా భావిస్తారు. వీరు జార్ఖండ్, అస్సాం, బీహార్, ఒరిస్సా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలలో కనిపిస్తారు. వీరి ఆస్ట్రో ఏసియాటిక్ భాష అయిన సంతాలీ భాషను మాట్లాడుతారు. గోమియా పరిధిలో పెద్ద సంఖ్యలో వ్యవసాయ భూమి ఉన్నది. ఇవీ అటవీప్రాంత పరిధిలో ఉన్నప్పటికీ 5వ షెడ్యూలలో (అటవీ సంరక్షణ, గిరిజన చట్టం) చేర్చబడలేదు.
ఈ ప్రాంత ఆదివాసీ పోరాటాలకు సుదీర్ఘ చరిత్ర ఉన్నది. శిబూసోరెన్ వడ్డీ వ్యాపారుల వ్యతిరేక ఆందోళన సమయంలో ఇక్కడి నుండి కూడా పెద్దయెత్తున ఆదివాసీలు సంఘటితమయ్యారు. స్వతంత్రం అనంతరం ఇక్కడ బొగ్గు గనులు, బొకారో థర్మల్ విద్యుత్ కేంద్రం, లేనుఘాట్ పవర్ ప్లాంట్, విస్ఫోటక పదార్థాల తయారీ కేంద్రం (గన్ ఫౌడర్ ఫ్యాక్టరీ) ప్రారంభించబడ్డాయి. తేనుఘాట్ ఆనకట్ట (డ్యామ్) నిర్మించడం 1965 సంవత్సరంలో నిర్మాణం మొదలయ్యింది. ఈ నిర్మాణం వలన 22 గ్రామ పంచాయితీల 31 గ్రామాల ప్రజలు దాదాపు 21264 కుటుంబాలు నిర్వాసితులయ్యారు. ఈ భారీ డ్యామ్ కోసం 17484 రైతుల దాదాపు 10,000 ఎకరాలు సముదాయాల భూమిని స్వాధీనం చేసుకున్నారు. ఈ నిర్మాణాల వల్ల ఆదివాసీ గిరిజనులు, ఇతర ప్రజల సముదాయాలన్నీ నిర్వాసితమయ్యాయి.
నిర్వాసితులైన కుటుంబాలకు రెండు దశాబ్ధాలు గడిచినా పునరావాసం లభించలేదు. ప్రభుత్వం హామీ ఇచ్చినట్టు నిర్వాసితులకు ఉద్యోగాలు కల్పించలేదు. ఈ నిర్వాసిత వేదనలు, బాధలు భరిస్తూ కష్టాలు అనుభవిస్తున్న ఆదివాసీ ప్రజల ముందుకు ‘‘చోరాతాండ’’ ప్రాంతంలో థర్మల్ పవర్ ప్రాజెక్టు పనులు మొదలు పెట్టారు. దీని వల్ల మరింతగా వేల స్థాయిలో ఆదివాసీ ప్రజలు నిర్వాసితులయ్యే ప్రమాదం ఏర్పడింది. ఈ విద్యుత్ వల్ల దేశానికి వెలుగు వస్తుందని, అభివృద్ధి వస్తుందని ప్రభుత్వాలు చెబుతున్నాయి. కానీ ఆదివాసీ ప్రజలు నివసిస్తున్న గ్రామాలకు విద్యుత్ సౌకర్యం లేదు. పైగా సిఆర్‌పిఎఫ్, బిఎస్‌ఎఫ్ పోలీసు బలగాలు వచ్చి బలవంతంగా ఆదివాసులను బలవంతంగా ఊళ్లు ఖాళీచేయిస్తున్నాయి. నిర్వాసితుల మీద నిరంతరం హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నాయి. మానవ హక్కులకు భంగం కలిగిస్తున్నాయి. ఈ హింస నేటికీ కొనసాగుతున్నది.
బాధితుల వివరణ
బాధితులందరి జీవన విధానం వ్యవసాయం, వ్యవసాయ కూలీలుగా జీవనం. పలు కుటుంబాల ఆర్థిక పరిస్థితి మరీ అధ్వాన్నంగా ఉన్నది. మేము మాట్లాడిన 31 బాధితుల్లో 18 మంది నిరక్షరాస్యులు. 13 మంది మాత్రం 10వ తరగతి వరకు చదువుకున్నారు. 30- 50 సంవత్సరాల వయస్సున్న వారు 17 మంది ఉన్నారు. 4 గురు ఇంతకన్నా తక్కువ వయసున్నవారు. వీరిపై తప్పుడు నిరాధార నేరారోపణ చేయబడినపుడు వీరంతా యువకులే. వీరిలో 31 మంది మావోయిస్టు పార్టీతో ఎలాంటి సంబంధం లేదు. బాధితుల పొలాలు అడవికి సమీపంలో ఉన్నాయి. అడవిలో మావోయిస్టులు వస్తూ, పోతూ ఉంటారు. మొదట పెద్ద సంఖ్యలో మావోయిస్టులు వారి పొలాల మీద అడవికి వెళుతూ ఉండేవారు. క్రమేణ వారి సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. ఈ ఆదివాసి గిరిజనులు మావోయిస్టు పార్టీతో సంబంధం లేకుండా స్వతంత్రంగా వారి హక్కులకై పోరాటం కొనసాగిస్తూ వస్తున్నారు. ఈ హక్కుల పోరాటాన్ని భరించలేని ప్రభుత్వాలు వీరిపై పలు తప్పుడు కేసులు పెట్టాయి. ఈ బాధితుల్లో ఎక్కువమంది రఘువర్‌దాస్ ప్రభుత్వంలో కేసులు పెట్టబడినవారు. రఘువర్‌దాస్ ప్రభుత్వం ఆదివాసీ, గిరిజనులపై వ్యతిరేకంతతో తీవ్ర నిర్భంధాన్ని సాగించింది. వీటికి వ్యతిరేకంగా నిలబడ్డ వారందరిపై ఈ కుట్రకేసులు నమోదు చేశారు.
అక్రమకేసులు – కుటుంబాలపై ప్రభావం
అక్రమకేసుల కారణంగా పీడిత కుటుంబాలు దుర్భర పరిస్థితికి లోనయ్యాయి. లాల్‌జీ మంజీ (బిర్‌హోర్ డేరా గ్రామం), ఫియరీ పంచాయితీ, గోమియా ఊరు) కుటుంబానికి అత్యంత అల్పస్థాయిలో వ్యవసాయ భూమి ఉన్నది. జీవించడానికి కుటుంబం కూలీ చేసుకునేవారు. అడవిలో లభించే వస్తువులు అమ్మి నిర్భయంగా జీవనం చేసేవారు. 2014లో లాల్‌జీ అక్రమ కేసులో జైలుకు వెళ్లిన తర్వాత ఆయన కూతుళ్లు చదువు మానుకొని కూలీ పనులు చేయడం మొదలు పెట్టారు. ఈ కేసు నుండి బయటపడడానికి చేసిన అప్పులు ఇంకా ఉన్నాయి. 24 సంవత్సరాల హీరాలాల్ టుడూ ఇంటర్ మీడియట్ వరకు చదివాడు. రామ్‌ఘడలో కంప్యూటర్ కోర్సు ఇంటర్ అనంతరం కొనసాగించాడు. ఇతడు తను కంప్యూటర్ కోర్సు పూర్తిచేసి తన గ్రామంలో ప్రజ్ఞాకేంద్రాన్ని ఏర్పాటుచేసి ‘‘కంప్యూటర్’ విద్యను ఆదివాసీలకు అందించాలనుకున్నాడు. కానీ సెప్టెంబర్ 2014లో మావోయిస్టు అనే అరోపణతో అరెస్ట్ చేసి రెండు సంవత్సరాల పాటు ఎలాంటి విచారణ లేకుండా జైలులో ఉంచారు. ఈ కారణంగా అతని కంప్యూటర్ చదువు పూర్తికాలేదు. 53 సంవత్సరాల వయసున్న షికారీ మాజీ 2015 -2016 లో అక్రమ కేసులో జైలులో ఉంచారు. ఇతని కుటుంబం కూడా కూలీలే. కొద్దిపాటి వ్యవసాయ భూమి ఉన్నది. వీరి కుటుంబం వలస కూలీలుగా కూడా పనిచేసేవారు. జైలులో 2 సంవత్సరాల అనంతరం విడుదల అయినప్పటికీ ‘‘షికారీ మాజీ’’ కూలీ చేయలేని అనారోగ్య పరిస్థితిలో ఉన్నారు. కేసును ఎదుర్కొనడానికి చేసిన ‘‘అప్పులు’’ భారమయ్యాయి.
ఈ కేసులు కోసం పలు కుటుంబాలు ఇల్లు, పొలం, పశువులు అమ్ముకున్నారు. దాదాపు అన్ని కుటుంబాలు అప్పుల పాలయ్యాయి. ఈ కేసుల వలన ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నం అయి పిల్లల చదువులపై పడింది. ఈ కుటుంబాలలోని పిల్లలు ఆర్థిక భారం వలన చదువులు మానుకొని కూలీపనులు చేస్తున్నారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ‘‘విద్యార్థులు’’ కూలీలుగా ఈ అక్రమ కేసుల వలన మారవలసి వచ్చింది.
అక్రమ కేసులు – తప్పుడు ఆరోపణలు
ఈ నిజనిర్ధారణ ద్వారా స్పష్టమైనది ఏమిటంటే ఆ ప్రాంతంలో ఎలాంటి హింసాత్మక ఘటన/ మావోయిస్టు ఘటనలు జరిగితే, స్థానిక పోలీసు యంత్రాంగం నిర్దోషులైన ఆదివాసీలపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తారు. అనుమానం ప్రాతిపదికన ఎఫ్‌ఐఆర్ దాఖలు చేస్తారు. ఒకసారి ఎఫ్‌ఐఆర్‌లో పేరు నమోదు అయితే, తదనంతరం ఎప్పుడు, ఎలాంటి ఘటనలు జరిగినా వారినే అనుమానితులుగా కేసులు నమోదు చేస్తారు. ఈ 31 మంది ఆదివాసీల ఘటన ఉదాహరణగా భావిస్తే వీరితోపాటు, ఈ అక్రమకేసుల వలన ఆయా కుటుంబాలు దీర్ఘకాల ప్రభావానికి గురవుతాయని స్పష్టమవుతుంది. బాధితులు జైలులో ఉండి వేదనను అనుభవిస్తే, పౌరసమాజంలో ఆయా కుటుంబాలు సైతం వివిధ రూపాల్లో శిక్షకు గురయ్యి, దుర్భర పరిస్థితులకు లోనవుతున్నాయి. లాల్‌ఘడలో 50 సంవత్సరాల వయసున్న ఆదివాసి ‘‘సంజయ్‌మాజి’’ అనే నిరక్షరాస్యుడైన భవన కార్మికుడు ఉండేవాడు. 27 డిసెంబర్ 2021న జోగేశ్వర్‌విహార్ పోలీస్‌స్టేషన్ నుండి రమ్మని పిలుపువచ్చింది. అతని ఇంటిని జప్తు (అటాచ్‌మెంట్) ఆదేశాల నోటీసు ఇవ్వబడిరది. అతనితో పోలీసులు చెప్పినదేమిటంటే, మావోయిస్టులతో కలిసి రైలు పట్టాలు తొలగించాడని క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఈ కేసులో పరారిలో ఉన్నందువలన ఇల్లు జప్తు ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. ఇతను ఎప్పుడూ పరారీలో లేడు. 2014లో మావోయిస్టుల చర్యలతో ఎలాంటి సంబంధం లేదు. ఈ తప్పుడు కేసులో ముద్దాయిగా ఉండడం వలన బొగ్గు దొంగతనం చేసినట్టు ఎఫ్‌ఐఆర్ 26/13 పేరుతో గోమియా పోలీస్‌స్టేషన్ యందు మరొక కేసు నమోదు చేసారు. కండిషన్ బెయిల్‌పై ఉంటూ న్యాయస్థానానికి తేన్‌ఘాట్‌లో హాజరవుతూ పలు ఇబ్బందులకు గురవుతున్నాడు.
‘‘టూటీ జర్‌నా’’కు చెందిన ప్రస్తుతం 20 సంవత్సరాల వయసున్న ‘‘సూరజ్ మునికుమారి’’ అనే మహిళను సెప్టెంబర్ 2014న అరెస్ట్ చేశారు. ఏప్రియల్ 2014లో జరిగిన మావోయిస్టు ఘటనలో ముద్దాయిగా ఈమెను సెప్టెంబర్‌లో అరెస్ట్ చేసారు. ఈమె 16/17 సంవత్సరాల వయస్సున్న అమ్మాయి. తన తల్లితో కలిసి గోమియా రైల్వేస్టేషన్‌లో తన బంధువుల ఊరికి రైలులో వెళ్ళేందుకు స్టేషన్‌లో ఉండగా తల్లీకూతుళ్లను సిఆర్‌పిఎఫ్ జవాన్లు ఎత్తుకెళ్లారు. విచారణ పేరుతో చిత్రహింసలు పెట్టారు. మావోయిస్టులతో కలిసి తిరిగినట్టు, వారి తుపాకులను తన వద్ద ఉంచుకున్నట్టు ఆరోపణలతో మూడు రోజుల చిత్రహింసల అనంతరం (సిఆర్‌ఫిఎఫ్ క్యాంపులో) తేనూఘాట్ జైలుకు తరలించారు. అప్పుడు ఈమె మైనర్ బాలిక (16-17 సంవత్సరాలు) జైలుకు వెళ్ళడం వలన ఈమె చదువు ఆగిపోయింది.
ఛోర్ పనియా గ్రామానికి చెందిన నిరుపేదయిన ‘‘బీర్సామంజీ’’ ని డిసెంబర్ 2021న స్థానిక పోలీస్ స్టేషన్‌కు పిలిపించి ‘‘నీవు నక్సలైట్‌వు. నీపై లక్ష రూపాయల రివార్డు ఉన్నది. తక్షణమే లొంగిపోవాలని’’ ఆదేశించారు. వాస్తవంగా ఈ నిరుపేద ఆదివాసికి మావోయిస్టు పార్టీతో కానీ, వారి ఘటనలతో కానీ ఎలాంటి సంబంధం లేదు. ఇతడు గ్రామంలో నిరుపేద. తన కొడుకుతో కలిసి ‘‘ఇంటా భట్టా’’లో దినసరి కూలీగా జీవనం కొనసాగిస్తున్నాడు.
గోషా గ్రామంలో 50 సంవత్సరాల వయసున్న మహేంద్ర మాజీ 2017లో అతని ఇంటిలో పోలీసులు అరెస్టు చేసారు. రెండురోజులు అక్రమంగా పోలీస్ స్టేషన్‌లో ఉంచిన అనంతరం ‘తేనూఘాట్’లో ఒక బుగురు చెట్టు దగ్గరకి తీసుకెళ్లి పోలీసులు తుపాకిపెట్టి ఫొటోలు తీసారు. పోలీసులు ఇతని ఆ రైఫిల్‌తో తల్‌బుల్ అటవీప్రాంతంలో అదుపులోనికి తీసుకున్నట్టు తప్పుడు కథనాలు అల్లారు. ఇతన్ని నక్సలైట్‌గా నిర్థారించినట్టు, రైలు పట్టాల తొలగింపు కార్యక్రమంలో మావోయిస్టులతో సంబంధాలున్నట్టు, 2016లో రైలుపట్టాలు పేల్చివేతలో పాల్గొన్నట్టు ఆరోపణలతో కేసులు పెట్టారు.
ఆదివాసీలపై అక్రమ చట్టాల ప్రయోగం
నిరక్షరాస్యులైన ఈ ఆదివాసీలపై అక్రమంగా మోపబడిన తప్పుడు ఆరోపణలు :
1. వీరే మావోయిస్టులుగా పేర్కొనడం 2. మావోయిస్టులకు సహాయం చేసారనే ఆరోపణ 3. మావోయిస్టుల చర్యల్లో భాగస్వాములు అయ్యారనే ఆరోపణలు. ఈ ఆదివాసీలపై నమోదుచేసిన క్రిమినల్ కేసుల్లో ఉపా చట్టంలోని వివిధ సెక్షన్లు, క్రిమినల్ అమెండ్‌మెంట్ యాక్ట్ 17 , ఐపిసి లోని వేర్వేరు సెక్షన్స్ క్రింద క్రిమినల్ కేసులు నమోదు చేసారు. కొన్నింటిలో ఎక్స్‌ప్లోజివ్ యాక్ట్ కూడా నమోదు చేసారు.
బాధితుల్లో వారిపై నేరారోపణ చేయబడ్డ ఏ అంశాలు తెలియవు. మావోయిస్టులుగా ముద్రవేసే 17 సిఎల్‌ఎ లు గురించి వినడం తప్ప తెలియదు. ఉపా చట్టం గురించి కనీసంగా ఎప్పుడూ బాధితులు వినలేదు.
న్యాయ పోరాటం
బాధితుల దగ్గర వారిపై నమోదైన కేసులకు సంబంధించిన కాగితాలు లేవు. ఇవన్నీ వకీళ్ల దగ్గర ఉన్నాయి. ఇందువలన అధిక సంఖ్యలో ఆదివాసీలకు తమపై ఏయే కేసులు నమోదు చేయబడినాయనే విషయం కూడా తెలియదు. స్థానిక కోర్టుల్లో బెయిల్ పిటిషన్ వేయడం అది తిరస్కరణ (రిజెక్ట్) కావడం, జిల్లాస్థాయి కోర్టుకు నివేదించడం పరిపాటిగా మారింది. జిల్లా న్యాయస్థానాల్లో కూడ పలుకేసుల్లో బెయిల్ లభించలేదు. హైకోర్టుకు నివేదించడం అక్కడ కూడా తిరస్కరించారు. ఐపిసి సెక్షన్‌లతో పాటు ఉపా చట్టం క్రింద కేసులు నమోదు చేయడం వలన పలుకేసుల్లో బెయిల్ లభించలేదు. ఒకవేళ లభించినప్పటికీ 2/3 సంవత్సరాలు పట్టాయి. న్యాయవాదులు కూడా బాధితులకు సరైన రీతిలో సమాచారం ఇవ్వరు.
‘‘బీర్‌హోర్ దేరా’’ కు చెందిన ‘‘లాల్‌జీ మాజీ’’ పై మావోయిస్టు అనే తప్పుడు కేసు పెట్టారు. దాదాపు 6 సంవత్సరాల పాటు విచారణ కొనసాగింది. 6 సంవత్సరాలు జైలులో ఉన్నాడు. పోలీసులు ఒక్క సాక్ష్యం కూడా కోర్టుకు సమర్పించలేకపోయారు. 6 సంవత్సరాల అనంతరం నిర్దోషిగా కోర్టు విడుదల చేసింది. 6 సంవత్సరాల జైలు, కోర్టు జీవితాన్ని బాధితుడు గడపవలసి వచ్చింది.
ఈ న్యాయపోరాటంలో బాధిత ఆదివాసీలకు అధికంగానే ఖర్చలయ్యాయి. మేము పరిశీలించిన 28 మంది ఆదివాసీ నిందితులకు దాదాపు 90,000 రూపాయల ఖర్చు అయ్యాయి. (చిన్నపాటి క్రిమినల్ కేసుల్లో) ఉపా మరియు 17 సిఎల్‌ఎ లాంటి కేసుల్లో 3 లక్షల రూపాయల వరకు ఖర్చయినట్టు మా విచారణలో తేలింది. ‘‘న్యాయం’’ ఖరీదు కూడా ఈ దేశంలో ఎక్కువగానే కనిపిస్తున్నది.
సంవత్సరాల విచారణ అనంతరం ఒక్కొక్కరుగా నిర్దోషులుగా విడుదల అవుతున్నారు. మేము విచారణ చేసిన 29 మందిలో 9 మందికి మాత్రమే పూర్తిస్థాయిలో నిర్దోషులుగా విడుదల అయ్యారు. 20 మంది ఆదివాసీలపై ఇంకా విచారణ కొనసాగుతున్నది. వీరిలో 18మందికి బెయిల్ లభించింది. ఇంకా ఇద్దరు జైలులోనే మగ్గుతున్నారు. 2014లో 16 మందిపై, 2014-2019 మధ్యకాలంలో 9 మందిపై ఆ తర్వాత 31 మందిపై నేరారోపణ మోపబడినాయి. 22 మంది బాధితుల్లో కొందరు 2 సంవత్సరాలు జైలులో ఉన్నారు. మరికొంతమంది 5 సంవత్సరాలు జైలులో అధిక సంఖ్యలో ఆదివాసీలు ఉన్నారు.
ముగింపు
ఈ నిజనిర్ధారణ ద్వారా స్పష్టీకరణ ఏమిటంటే నిరుపేదలు, నిరక్షరాస్యులుగా ఉన్న ఆదివాసీలు కేవలం సందేహం పేరుతో మావోయిస్టు చర్యల్లో భాగస్వాముల్లాగా చిత్రీకరిస్తారు. బాధితులు కేవలం మావోయిస్టులకు భయంతోనో/ ప్రేమతోనో భోజనాలు పెట్టడం, గ్రామాల్లో వారు పెట్టిన మీటింగ్‌లకు హాజరవ్వడం తప్ప ఏ కార్యకలాపాలతో సంబంధం లేదు. ఇది కూడా ప్రభుత్వం, పోలీసుల దృష్టిలో పెద్ద నేరంగా భావించబడుతుంది. ఆదివాసీలు అధిక సంఖ్యలో నిరక్షరాస్యులు. వీరికి మావోయిస్టు కార్యకలాపాలతో ఎలాంటి సంబంధం లేదు.
స్థానిక న్యాయస్థానాల్లో పోలీసులు ఛార్జిషీట్‌లు వేయకుండ ఉద్దేశ్యపూర్వకంగా ఆలస్యం చేస్తారు. దీనివలన బాధితులకు త్వరితగతిన విచారణ జరుగదు. మరియు ‘‘బెయిల్’’ లాంటి న్యాయసహాయాలు అందవు. ఈ కారణంగా విచారణ పేరుతోనే ఆదివాసీ ప్రజలు ఏండ్ల తరబడి జైళ్లలో మగ్గుతున్నారు. వాయిదాల పర్వంతో కొన్ని సంవత్సరాల అనంతరం ఎక్కువ కేసులు కొట్టివేయబడతాయి. ఈ అక్రమ కేసుల నుండి బయటపడే క్రమంలో కుటుంబాలు పలురకాల మార్పులకు గురవుతాయి. పిల్లల చదువులు ఆగిపోతాయి. అప్పులు చేసి మరింత పేదరికంలోనికి నెట్టివేయబడతారు. కుటుంబంపై ఆర్థికభారం పెరిగి కుటుంబాలు కుదేలవుతాయి.
నిర్ధోషులైన ఆదివాసీలపై పోలీసు యంత్రాంగం ఉద్దేశ్యపూర్వకంగా తప్పుడు కేసులు పెట్టడం ఆనవాయితీగా మారింది. పోలీసుల కార్యశీలనపై అనుమానం తలెత్తక మానదు. ప్రభుత్వ విధానాల్లో భాగంగానే ఈ తప్పుడు కేసుల ప్రక్రియ జరుగుతుందని స్పష్టమవుతున్నది. దీనికి తోడు స్థానిక న్యాయస్థానాలు కేసులోని వాస్తవాలు పరిశీలించకుండ తిరస్కరణ చేయడం ఒక అలవాటుగా మారింది. న్యాయవ్యవస్థ, పోలీసు వ్యవస్థకు దాసోహమయిందని స్పష్టమవుతుంది. వీరిపై పెట్టబడిన కేసులు దాదాపు 98% చివరకు కొట్టివేయబడతాయి. చివరకు వీరు నిర్దోషులుగా విడుదల అయ్యేటప్పటికీ విచారణ ఖైదీల పేరుతో సంవత్సరాల తరబడి జైలులోనే ఉండవలసి వస్తుంది. ఇవి న్యాయవ్యవస్థలో ‘‘శిక్ష’’లుగా గుర్తింపబడని ‘‘శిక్ష’’లు. ‘‘ఉపా’’ చట్టం ఈ ఆదివాసీలను మరింత పీడనకు గురిచేస్తుంది.
ఈ 31 మంది బాధితులపై ఆరోపణలన్ని పూర్తిగా అవాస్తవాలు. ఉపా చట్టం కేసులతో వేలసంఖ్యల్లో ఆదివాసీలు, దళితులు, నిరుపేదలు రాజ్యం& పోలీసుల నిర్భంధకాండ మరియు వ్యవస్థీకృత హింసలకు గురవుతున్నారు.
డిమాండ్స్
మేము జార్ఞండ్ ప్రభుత్వాన్ని క్రింది డిమాండ్స్ చేస్తున్నాం
1. ఈ నివేదికలో పేర్కొన్న 31 మంది బాధితులపై నమోదు చేయబడిన కేసులన్నింటిని వెనక్కి తీసుకోవాలి. సంవత్సరాలుగా ఈ అక్రమకేసుల వలన జైళ్లల్లో మ్రగ్గుతున్న / మ్రగ్గిన ఆదివాసీ కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి. ఇది ప్రభుత్వం నుండి అందవలసిన కనీస నష్టపరిహారమని ప్రభుత్వం గుర్తించాలి. ఆదివాసీలపై అక్రమకేసులు బనాయించిన పోలీసు యంత్రాంగంపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.
2. ఇలాంటి ఘటనలు ఒక్క గోమియా జిల్లాలోనే కాక జార్ఞండ్ రాష్ట్రంలో పలుప్రాంతాల్లో ఈ పరిస్థితి కొనసాగుతున్నది. ఈ పరిస్థితులపై హైకోర్టు న్యాయమూర్తితో నిష్పక్షపాతంగా విచారణ చేపట్టాలి.
3. ఇలాంటి అక్రమ కేసులు బనాయించవద్దని స్థానిక పోలీసు యంత్రాంగానికి ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలి. ముఖ్యంగా ఆదివాసీలపై అక్రమకేసులు వేధింపులు నిలిపివేయా?లి. నక్సల్స్ పేరుతో ఆదివాసీలను హింసించకుండా తగు చర్యలు తీసుకోవాలి.
4. జార్ఖండ్ రాష్ట్రంలో ఉపా చట్టాన్ని తక్షణ నిలిపివేయాలి. కేంద్ర ప్రభుత్వం ఉపాను తక్షణమే రద్దు చేయాలి. రాజద్రోహ చట్టాన్ని రద్దు చేయాలి.
5. పోలీసుల మాన్యువల్‌ను సవరించాలి. కేవలం అనుమానంతో, మావోయిస్టులకు అన్నం పెట్టేవారి మీద, సమావేశాలకు హాజరయ్యే ఆదివాసీలపై మావోయిస్టుల పేరుతో కేసులు నమోదు చేయకుండా చట్టసవరణ చేయాలి.
అనువాదం : అల్లాబక్ష్