‌అక్టోబర్‌ 14వ తారీఖు భారతదేశ విప్లవోద్యమానికి, విప్లవ శ్రేణులకు, విప్లవ కార్యకర్తలకు అత్యంత దుఃఖదాయకమైన రోజు. ఒక ఆత్మీయుడు, ఒక స్నేహశీలి, ఒక ఓదార్పు, ఒక ఊరట, ఒక నిరాడంబర, నిస్వార్థజీవి,  ఒడిదుడుకుల్లో ఆత్మవిశ్వాసం నింపే ఒక ఆపన్నహస్తం, మచ్చుకైనా కోపతాపాలు ప్రదర్శించని సహన సౌమ్యశీలి, ఒక అన్వేషి, ఒక ఆర్గనైజర్‌, ఒక సైద్ధాంతిక రాజకీయ వ్యూహాకర్త, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు రామకృష్ణగా చిరపరిచితుడైన  ప్రియతమ నాయకుడు కామ్రేడ్‌ సాకేత్‌, రామకృష్ణ, శ్రీనివాస్‌ (యస్‌.వి.), గోపాలం మాష్టారు (అక్కిరాజు హరగోపాల్‌) తీవ్రమైన కిడ్నీ జబ్బుతో 2021వ సంవత్సరం అక్టోబర్‌ 14వ తేదీన ఉదయం 6.30 నిమిషాలకు అమరత్వం చెందారు.   వెలకట్టలేని ఆ మహొన్నతమూర్తి ఆచరణను మన కార్యాచరణగా ఆచరిద్దాం!

పదహేనవ తేదీ ఉదయం 7.45 నిమిషాలకు రేడియోలో వచ్చిన పిడుగులాంటి ఈ వార్త మనసును కుదిపేసింది. ఈ వార్త నిజం కాకపోతే ఎంత బాగుండును?! అనిపించింది. నిజమే అని ‘రూఢ’ అయ్యేటప్పటికీ మనసంతా ఒకలాంటి ఒంటరితనం, వెలితి ఆవహించింది. విప్లవోద్యమంలో అమరత్వం సహజమైనప్పటికీ జీర్ణించుకోవటం కష్టంగా ఉంటుంది. అందునా పరిచయం ఉన్న కామ్రేడ్స్‌ అమరత్వం చెందితే మరీనూ. ఆ బాధను అక్షరాలు, పదాలుగా పేర్చటం కష్టమే అవుతుంది. అయితే ప్రజల కోసం, సమాజ మార్పు కోసం జీవితాన్ని త్యాగం చేయడమంటే హిమాలయ పర్వతం కన్న ఉన్నతమైనది. వారి జీవితం ప్రత్యేకించి ఆదర్శంగా ఉంటుంది. విప్లవోద్యమంలో అసువులు బాసిన ప్రతి విప్లవకారుల జీవితాల్లో కొన్ని సాధారణాంశాలు, కొన్ని ప్రత్యేకాంశాలు ఉంటాయి. అవి విప్లవోద్యమానికి, విప్లవకారులందరికీ ఆదర్శప్రాయం. విప్లవోద్యమాన్ని మరింత బోల్షివీకరించేందుకు ఎంతగానో తోడ్పడతాయి. అలా మన ప్రియతమ నాయకులు కామ్రేడ్‌ ఆర్‌.కె. విప్లవ జీవితం కూడా ఎంతో ఆదర్శప్రాయమైనది. అజరామరమైన ఆ అమరమూర్తి గురించి కొన్ని వాక్యాలు..

కామ్రేడ్‌ ఆర్‌.కె. గుంటూరు జిల్లాలోని చారిత్రాత్మకమైన పల్నాడు ప్రాంతంలోని పిడుగురాళ్ళ మండలం గుత్తికొండ గ్రామంలో జన్మించారు. తండ్రి రెంటచింతల మండలం తుమృకోట గ్రామంలో హెడ్మాష్టారుగా పనిచేస్తూ అక్కడే స్థిరపడ్డారు. ఒక స్కూలు మాష్టారిగా ప్రారంభించిన ఆర్‌.కె. విప్లవ అడుగులు అంచెలంచెలుగా ఎదిగి భారత విప్లవోద్యమానికి నాయకత్వం వహించే శీర్షనేతల్లో ఒకరిగా అగ్రస్థానం సంపాదించారు. కేడర్లు, ప్రజలను అక్కున చేర్చుకొని వారి సమస్యలకు, బాధలకు ఊరట ఓదార్పు అందించిన కామ్రేడ్‌ యస్‌.వి. అమరుడవ్వటం తెలుగు కామ్రేడ్సందరికీ తట్టుకోలేని బాధ. విప్లవోద్యమానికి పూడ్చలేని నష్టం.

మొట్టమొదట కామ్రేడ్‌ యస్‌.వి. పరిచయం నేను దళంలోకి వచ్చిన కొత్తలో. అది గుంటూరు జిల్లా ప్లీనం సందర్భంగా. ప్లీనం తయారీ పనుల్లో అందరూ తలమునకలై ఉండగా ‘ఎవరో పెద్దాయన వస్తాడం’టని మా సీనియర్‌ కామ్రేడ్‌ చెప్పగా తెలిసింది. కొద్దిరోజులకు ఆ పెద్దాయన రావటం, ప్లీనం మొదలవటం జరిగింది. ఆ సమయంలో ప్రతిరోజూ ఒక సంఘటన నన్ను దూరంనుంచే అమితంగా ఆకర్షించింది. ఆ పెద్దాయన క్షణం తీరిక దొరకగానే తనకు ప్రొటెక్షన్‌గా వచ్చిన మహిళా కామ్రేడ్‌కు స్కూలు చెప్పేవాడు. అది కూడా చాలా నిదానంగా, ఒత్తులు, పొల్లులు ఎలా పలకాలని తను ఉచ్ఛరిస్తూ చెప్పేవాడు. ఇది గమనించిన నాకు ‘అబ్బా! ఇలా కూడా ఉంటారా?’ అని నాలో నేను ముచ్చటపడ్డాను. వాళ్లూ వీళ్లూ పిలుస్తుండగా తెలిసింది ఆ పెద్దాయన పేరు శ్రీనివాస్‌ అని.  యస్‌.వి. అని పిలుస్తారని. తర్వాత్తర్వాత ఆ పెద్దాయనతో పరిచయం ఏర్పడింది. నా పేరుతో కాకుండా అప్పుడప్పుడు ‘అమ్మాయ్‌’ అని పిలిచేవాడు. ‘అమ్మాయ్‌’ అనే పిలుపుతో నా ఒళ్ళంతా పులకరించిపోయేది. ఒక్కసారిగా అమ్మా, నాన్న, అన్నాయ్‌ పిలిచినట్లనిపించేది. అందుకే ‘అమ్మాయ్‌’ అని పిలిచిన ప్రతిసారి రెక్కలు కట్టుకొని యస్‌.వి. ముందు వాలేది. అలా యస్‌.వి. అంటే మనసులో ఒకలాంటి అభిమానం, గౌరవం ఏర్పడిరది. (అమ్మాయ్‌ అని అమరుడు యమ్‌.ఆర్‌. గారు, యస్‌.వి.గారే పిలిచేది.)

కేడర్లు, ప్రజలను అమితంగా ప్రేమించే కామ్రేడ్‌ యస్‌.వి. వారి కష్టసుఖాల్లో పాలు పంచుకొనేవాడు. ప్రతి సమస్యను నిశితంగా పరిశీలించి, దానికి సరైన పరిష్కారం చూపేవాడు. అందుకే కామ్రేడ్‌ యస్‌.వి. అంటే అందరికీ గౌరవం, అభిమానం కూడా. ప్రజలతో ఎంతైతే మమేకమవ్వాలో అంత మమేకమయ్యాడు, కాబట్టే ఎన్ని సంవత్సరాలు గడిచినా ప్రజలు మరచిపోలేదు. వారి మనోఫలకంపై జీవించే ఉన్నాడు.

గుంటూరు జిల్లాలో  దాచేపల్లి ఏరియా చిన్న చిన్న తుప్పలు మాత్రమే ఉన్న మైదాన ప్రాంతం. ఒకవైపు కృష్ణా నది, నది అంచెమ్మటి సిమెంటు ఫ్యాక్టరీలు, ఊర్ల అంచున ముగ్గు మిల్లులు, పిడుగురాళ్ళ సున్నపుబట్టీలు, నాపరాయి క్వారీలు ఉండేవి. క్వారీలు, చిన్న చిన్న పరిగకంప పొదల్లో దళం మకాం ఉండేది. అవి కూడా లేనిచోట పత్తి, మిర్చి, కంది చేలల్లోనే మకాం వేసేది. రోడ్డు, రైల్వేలైను, కమ్యూనికేషన్‌ వ్యవస్థ, పోలీస్టేషన్లు కూతవేటు దూరంలోనే ఉన్నప్పటికీ ప్రజలు వాళ్లను కంటికి రెప్పలా కాపాడుకునేవారు. ఆ ప్రజలకు ఉద్యమం  పట్ల అంతటి విశ్వాసం కలిగించింది కామ్రేడ్‌ యస్‌.వి. రామాపురం, గామాలపాడు, పొందుగల, శ్రీనగర్‌, భట్రుపాలెం, పిన్నెల్లి, మాదినపాడు, తుమ్మలచెరువు గ్రామాలలో ‘గోపాలం పంతులు’ గా తిరుగుతూ అణగారిన బతుకులకు అండగా నిలబడి వర్గపోరాటాన్ని అడ్వాన్స్‌ చేయించాడు. పీడిత ప్రజలకు, అందునా దళిత ప్రజలకు అండగా నిలబడి వారిని ఒక తాటిపై నిలబెట్టాడు. అందుకే ఎన్ని సంవత్సరాలైన ‘గోపాలం పంతులు గారి’ని ప్రజలు మరచిపోలేదు. ఏ ఇంటి గడప తొక్కినా, ఏ అన్నను, అక్కను కదిలించినా ‘గోపాలం పంతులు గారి’ ఊసే లేకుండా ఉండేది కాదు.

‘మా బతుకులిలా ఉండేవా? ముందు ఎంత పెత్తనం, రెడ్ల ఇళ్ళ ముందు నుంచి పోటానికుందా? ఇప్పుడు గానీ పోతున్నాం. ఇదంతా గోపాలం మాష్టారు వచ్చినప్పటి నుంచే’… ఒక సందర్భంలో గుర్తు చేశాడు దానియేలు.

‘నిజం! విప్లవోద్యమం చేసిన కృషి లేకుంట  పెద్ద కులపోళ్ళకు ఎదురుపడటం ఉందా? మంచం మీద కూర్చున్నవాళ్ళు కూడా లేవాల్సిందే! మావైపు విప్లవోద్యమం  ఉందని కిమ్మనకుండా ఉంటున్నారు. లేదంటే వాళ్ళు పాడిందే పాట-ఆడిందే ఆట. అప్పటి పరిస్థితులను కళ్ళకు కట్టినట్టు చెప్పేవాళ్ళు ఏసోబన్న, మరియమ్మలు.

                        0          0          0

ఒక చల్లని సాయంకాలం. అప్పుడే చీకటి పడుతోంది. చలిగాలికి చీర గట్టిగా కట్టి వడివడిగా అడుగులు వేస్తూ ఊరి అంచుకు వచ్చేశాను. ‘హమ్మయ్య’ అని ఊపిరి పీల్చుకొని మిరప చేలోంచి సన్నని కాలిబాట గుండా ఊళ్ళోకి దారి తీశాను. దొడ్డి దారిన ఇంట్లోకి ప్రవేశించాను. నా పని వీలయినంత తొందరగా అన్నం వండించుకుని తిరుగుముఖం పట్టాలి. ఎందుకంటే పక్కనే స్టేషన్‌, ఇంటిముందు బైపాస్‌ రోడ్డు. ఆ ఊరు బాగా పేరున్న గామాలపాడు. ఆ కుటుంబం బాగా పరిచయమున్న కుటుంబం. ఉద్యమాన్ని,  అందునా యస్‌.వి.ని అమితంగా అభిమానించే జంట అది. నేనొచ్చిన పని ఇట్టే అర్థమైన ఇంటక్క వంట పనిలో నిమగ్నమైంది. అక్కకు సాయం చేస్తూ మాటలు కలిపాను. మాటల మధ్యలో ఇంటక్క ‘గోపాలం పంతులుగారున్నారా? ఎట్టా ఉన్నారు? చాన్నాళ్ళయ్యింది చూసి. మా పెళ్ళి  చేసింది గోపాలం పంతులుగారే. చిన్నప్పుడు పంతులు గారితో తిరిగేది. ఈయనైతే అస్సలు వదిలేవాడు కాదు. ఎప్పుడొచ్చినా పల్లెకే వచ్చేవాడు. ఎన్నిరోజులైనా మా ఇంట్లోనే ఉండేవాడు. అందర్నీ పోగేసి బడి చెప్పేవాడు. మందు బిళ్ళలు కూడా ఇచ్చేవాడు’ అని ‘పంతులు గారి’ గురించి అక్క ఇంకా ఇంకా చెప్పుకుపోతూనే ఉంది. నిజంగా  య.స్‌.వి.పై ఆ జంట పెంచుకున్న ప్రేమకు చలించిపోయాను.

భట్రుపాలెం తండాలో కూడా ‘మా పంతులు గారెలా ఉన్నార’ని కలిసిన ప్రతిసారి  సోమ్లా నాయక్‌ బాగా గుర్తు చేసేవాడు.

ఒక ముఖ్యమైన పని మీద జిల్లాకు వచ్చినప్పుడు జనం మిమ్మల్ని గుర్తు చేస్తున్నారు అని యస్‌.వి. దృష్టికి తెచ్చినప్పుడు చిరు మందహాసంతో ‘అట్టానా?’ అని  అప్పటి కష్టాలు, కడగండ్లు ప్రజల్లో విప్లవోద్యమాన్ని సొంతం చేయటానికి చేసిన పోరాటాలు, అప్పటి  గ్రామాలు, పరిచయస్తులు, నాయకులు అప్పటి పట్టణోద్యమ పరిస్థితి (గుంటూరు, విజయవాడ)ని అంతా పూసగుచ్చినట్టు చెప్పాడు. విజయవాడ టౌన్‌లో సానుభూతిపరుల పేర్లు, ఇళ్ళను కూడా గుర్తుకు తెచ్చుకుంటూ ఇప్పుడు ఎలా ఉన్నారో? అని  కలత చెందారు. ప్రజలతో, కేడర్లతో నిరంతరం ఆత్మీయ సంబంధాన్ని కలిగి ఉంటూ, దూరంగా ఉన్నప్పుడు వారి యోగక్షేమాలను లెటర్స్‌ ద్వారా ఆరా తీసేవాడు. అందుకే యస్‌.వి. అంటే అందరికీ చాలా అభిమానం. తను సి.వో.గా తిరిగినప్పటి పరిచయస్తులు, సానుభూతిపరులను జిల్లాకు వచ్చినప్పుడు పిలిపించుకొని మాట్లాడేవాడు.

ఉద్యమ  లైను పట్ల స్పష్టమైన అవగాహన ఉండాలనేవాడు. ఎన్ని సమస్యలొచ్చినా లైనును, పాలసీలను ఒంటబట్టించుకోవాలి. వాటికి కట్టుబడి ఉండాలి, ప్రజలకు అవి నేర్పాలి. అప్పుడే మన మీద మనకు, ఉద్యమంపై నమ్మకం ఏర్పడుతుంది అనేవాడు.

విప్లవోద్యమంలో  వచ్చిన అంతర్గత సంక్షోభాలను యస్‌.వి. చాలా చాకచక్యంతో పరిష్కరించి అందరి విశ్వాసాన్ని చూరగొన్నాడు. రెండు వేల సంవత్సరంలో గుంటూరు జిల్లా పార్టీ కమిటీలో అంతర్గత ఘర్షణలు వచ్చి పార్టీ రెండు గ్రూపులుగా అయిపోయింది.  కాన్ఫరెన్స్‌ నిర్వహించినా సమస్య తెగని కారణంగా యస్‌.వి.నే వచ్చి ప్లీనం నిర్వహించాడు. ఎవరి తప్పులు ఎంతున్నదో సీరియస్‌గా  వారి దృష్టికి తీసుకుపోయాడు. మైనారిటీ గ్రూపులో అరాచకంగా ఉన్న వారికి విప్లవోద్యమంలో స్థానం లేదని ఖరాఖండిగా చెప్పాడు. దాని తర్వాత మైనారిటీ గ్రూపులో ఉన్న ముఖ్యమైన వారు శత్రు పంచన చేరటం కూడా జరిగింది.

2003 సంవత్సరంలో వచ్చిన మరో సమస్యను కూడా అప్పటికప్పుడు ప్లీనం నిర్వహించి జిల్లా క్యాడర్‌కు ఒక అవగాహన కల్పించాడు. అందరి మన్ననలను పొందాడు. అగ్రవర్ణంలో పుట్టి పెరిగిన కామ్రేడ్‌ యస్‌.వి. చాలా సౌమ్యంగా, స్నేహంగా, నిర్మలంగా వ్యవహరించేవాడు. ఏ విషయమైనా నిశితమైన పరిశీలనతో విశ్లేషించేవాడు. పురోగామి శక్తి భావజాలాన్ని నిరంతరం వెన్నంటి పెట్టుకున్న కామ్రేడ్‌ యస్‌.వి. మనందరికీ ఆదర్శప్రాయుడు.

మహిళా ఉద్యమమన్నా, మహిళా కామ్రేడ్స్‌ అన్నా ప్రత్యేక శ్రద్ధ పెట్టి ముందుకు నడిపించేవాడు యస్‌.వి. తన పనులరీత్యా ఎంత బిజీగా ఉన్నప్పటికీ దొరికిన అతి కొద్ది సమయాన్ని మహిళా కామ్రేడ్స్‌కు కేటాయించేవాడు. వారి ఎదుగుదల, ఆరోగ్యం, కుటుంబ విషయాలను చాలా ఓపికగా మాట్లాడేవాడు. తనున్నంతసేపు, మాట్లాడుతున్నంతసేపు ‘మనకంటూ పట్టించుకునేవారు ఒకరున్నార’నే ఆత్మవిశ్వాసం, ఓదార్పు, ఊరట కలిగించేవాడు. అలా ఎపి నుంచి రిలీవ్‌ అయిన (2005) మీటింగు సందర్భంలో తక్కువ సమయంలోనే కా. రమణ డి.సి.యమ్‌ (శేషాచలం ఎన్‌కౌంటర్‌లో అమరురాలైంది)తో,  కా. శాంతితో, నాతో ‘చర్చలు విఫలమై శత్రు నిర్భంధం పెరిగింది’ కనుక చాలా జాగ్రత్తలు తీసుకొని పని చేయాలని ధైర్యం చెప్పి అందరికీ చేతులు కలిపి విడిపోయాడు.

తనకంటూ ఏదీ ఆలోచించని నిస్వార్థజీవి కామ్రేడ్‌ యస్‌.వి. ఎపి నుంచి రిట్రీట్‌ అయ్యి దండకారణ్యం వచ్చిన ఏడు సంవత్సరాలకు ఒక ఉదయాన యస్‌.వి.ని కలవటమైంది. మనిషి ఎంతలా ఉన్నాడంటే అసలు తనేనా?! కాదా! అన్నంత ఎముకల గూడులా అయిపోయాడు. మాట్లాడుతానని కబురు పంపిస్తే తన మకాంకు వెళ్ళాను. రాళ్ళు, రప్పలు, రక్తం పీల్చే దోమలు చూడగానే అర్రె! అనిపించింది. ‘ఏంటి యస్‌.వి. దోమతెర కట్టుకోలేదా?’ అని అడిగాను. ‘సాయంత్రం కడతార’ని చెప్పాడు. మాట్లాడుతూనే తీరిక లేకుండా కుడుతున్న దోమల దెబ్బకు తన కిట్టులో నుండి టవల్‌ తీసి ‘బాగా కుడుతున్నాయ్‌ కాళ్ళకు కప్పుకో’ అని నాచేతికిచ్చాడు. ‘టవల్‌ కదా!’ అన్నప్పుడు ‘ఏం కాదులే!’ అన్నాడు. ఎంత ఔన్నత్యం, ఎంత ఉదాత్తమూర్తి. యస్‌.వి. ఈ సంఘటన ఎప్పటికీ మరపురాని గుర్తుగా మిగిలిపోయింది. తన పేరు స్ఫురణకు వచ్చినప్పుడు ఆనాటి సంఘటన కళ్ళముందు లీనమవుతుంది.

 ఆ సమయంలోనే కుటుంబ విషయాలు చెప్పి నా చేత ఇంటికి లెటర్‌ రాయించాడు. ఎన్నో మైళ్ళ దూరంలో ఉన్న నాకు కుటుంబ సమాచారం తెలియటం గానీ, నా సమాచారం కుటుంబానికి తెలియటం గానీ అసాధ్యమనుకున్న నాకు యస్‌.వి. ఇచ్చిన సలహాతో నేను ఇంటికి లెటర్‌ రాయటం, తక్కువ సమయంలోనే అమ్మ నుంచి రిప్లై రావటం చాలా సంతోషమేసింది.

మరల ఐదు సంవత్సరాలకు ఉద్యమానికి  ప్రపోజల్‌ పెట్టుకుని కలిశాము. కలిసిన రోజు దూరం నుంచి యస్‌.వి.ని చూసిన నాకు తట్టుకోలేక కళ్ళ వెంబడి నీళ్ళు కారాయి. చేతులు కలుపుతూనే ‘ఏడ్వద్దు ధైర్యంగా ఉండాలి’ అని సముదాయించాడు. మాకిచ్చిన రెండు రోజులు కూడా పూర్తి కాకుండానే విడిపోవాల్సి వచ్చింది. కానీ కలిసున్న ఆ కొద్దిపాటి సమయంలోనే చాలా విషయాలు మా ముందుకొచ్చాయి. ఎపి, తెలంగాణా, ఎఓబిల ఉద్యమ పరిస్థితి – శత్రు ఎత్తుగడలు, సీరియస్‌ నిర్భంధంలో కూడా మనవాళ్ళు చేస్తున్న కృషి చెప్తుంటే.. ఒక్కసారిగా ఎపికి పోయినట్టనిపించింది. విడిపోతున్నప్పుడు ఇంకొద్ది సేపు తనతో గడపాలని మనసు ఆరాటపడిరది.

ఎపిలో ఉన్న సీరియస్‌ నిర్బంధం వలన నీటి తావుల దగ్గర మకాం వేయలేని పరిస్థితి. ప్రతిరోజూ నీళ్ళు మోసుకోవాల్సిందే. అందరం లైన్లో నిలబడగానే యస్‌.వి. కూడా ఠంచనుగా వచ్చి  లైన్లో నిలబడేవాడు. ‘మేం ఉన్నాం గదా!’ అన్నప్పుడు ‘కొద్ది సేపేగా!’ అని రెండు చేతుల్లో రెండు పది-పది లీటర్ల క్యాన్లు మోసేవాడు.

శత్రు దాడులు ఊపిరాడకుండా ఉన్న సమయంలో దక్షిణ తెలంగాణా రీజినల్‌ సెక్రటరీగా, ఎపి రాష్ట్ర కమిటీ సెక్రటరీగా, ఎఓబి స్పెషల్‌ జోనల్‌ కమిటీ సెక్రటరీగా నిస్వార్థమైన తన సేవలను ప్రజలకు అందించాడు. శత్రు దాడులు, అనారోగ్యం, శరీరం సహకరించకున్నా సరే నడకలో వెనుకపడ్డ కామ్రేడ్స్‌కు అన్ని విధాలా సహాయపడుతూ ఉత్సాహపరిచేవాడు.

కామ్రేడ్‌ యస్‌.వి.కి రామకృష్ణ అనే పేరు బాగా ప్రాచుర్యం పొందింది. 1992వ సంవత్సరంలో వెల్దుర్తి ఏరియాలో కృష్ణానది ఒడ్డున ఉన్న చంద్రవంక దగ్గర జరిగిన ఎన్‌కౌంటర్‌లో అమరుడైన కమాండర్‌ పేరే రామకృష్ణ. ఈ ఎన్‌కౌంటర్‌లో రామకృష్ణతో పాటు జిల్లా కమిటీ సభ్యుడు ఏసన్న, మాధవీలత, నలుగురు జాలర్లు అమరులయ్యారు. ఎన్‌కౌంటర్‌ జరిగి సంవత్సరాలు గడిచినా గానీ అప్పటికప్పుడు జరిగిన సంఘటనగా ఇప్పటికీ ప్రజలు చెపుతుంటారు. అందుకే చంద్రవంక పేరు వినగానే ఆ సంఘటనలో లేనప్పటికీ ఘటన తాలూకు భావ సన్నివేశం మనసులో ఏర్పడుతుంది.

1999వ సంవత్సరంలో కొయ్యూరు బూటకపు ఎన్‌కౌంటర్‌లో కేంద్ర కమిటీ సభ్యులు కామ్రేడ్స్‌ శ్యాం, మహేష్‌, మురళిలను హత్య చేసిన శత్రువు  రకరకాల ప్రచారాల ఊపందుకున్నాడు. ఈ ప్రచారాల మధ్యనే శత్రు దిమ్మ తిరిగి పోయేంతగా ప్రజా గెరిల్లా సైన్యాన్ని ఏర్పాటు చేయటంలో ముఖ్య భూమిక పోషించాడు. కొయ్యూరు ఎన్‌కౌంటర్‌కు కారణమైన అప్పటి హోం మంత్రి మాధవరెడ్డిపై చర్య తీసుకొని  విప్లవోద్యమానికి  కొత్త ఊపిరులందించాడు.

కారంచేడులో దళితుల నరసంహారానికి కారకుడైన దగ్గుబాటి చెంచురామయ్యపై, వేంపేంట దళితుల మారణహోమానికి కారకుడు భూస్వామి బుడ్డా వెంగళరెడ్డిపై, రామాపురం అచ్చిరెడ్డి, అంకిరెడ్డిలపై, ఉమేశ్చంద్ర లాంటి వారిపై చర్యలు తీసుకోవడంలో  ముందున్నాడు.

2016 అక్టోబర్‌ నెలలో ఎఓబిలో జరిగిన రామగూడ ఎన్‌కౌంటర్‌ అప్పటి భారతదేశ విప్లవోద్యమ చరిత్రలోనే పెద్ద ఘటన. ఎంతో విప్లవోద్యమ అనుభవం ఉన్న కామ్రేడ్సును కోల్పోయిన ఈ ఘటనలో యస్‌.వి. కొడుకు మున్నా కూడా అమరుడయ్యాడు. కంటి ముందే కన్న కొడుకు జీవచ్ఛవంలా పడి ఉన్నా బాధను పంటి బిగువున అదిమి పట్టుకుని కర్తవ్య దీక్షలో లీనమైనాడు. ఈ ఘటన అనంతరం కొద్దిమంది కుహనా మేధావులు ‘పీఎల్‌జీయే అంటే చావు సైన్యమని’ ప్రచారం చేశారు. ‘త్యాగాలు లేకుండా చరిత్ర పురోగమనం ఉండదు. తమ స్వార్థ ప్రయోజనాలకు, డబ్బు సంచులకు అమ్ముడుపోయే మేధావులు ఈ విషయం అర్థం చేసుకోరు. మాది అజేయమైన సైన్యం. మా సుదీర్ఘ ప్రయాణంలో, లక్ష్య సాధనలో ఈ నష్టం, చిన్న అవరోధం అనివార్యమే. ప్రజలే చరిత్ర నిర్మాతలు’ అని సూటిగా, ధీటైన జవాబు చెప్పాడు.

యస్‌.వి. రచనా వ్యాసంగం కూడా చాలా సింపుల్‌గా అందరికీ అర్థమయ్యే విధంగా ఉంటుంది. అలాగే కామ్రేడ్స్‌కు కూడా రాతల్లో సలహాలు, సూచనలు అందించేవాడు. అలా నేను కలిసిన ఒక సందర్భంలో నేను రాసిన ఒక లెటర్‌ను చూపించాను. ఆ లెటర్‌లో ఒకచోట ‘మార్క్సిజం కార్మికవర్గానికి దిశా నిర్దేశం చూపిస్తుంది అని రాశాను. దాన్ని ఒకటికి రెండుసార్లు చదివిన యస్‌.వి.‘కార్మికవర్గం’ అన్నచోట ‘పురోగామి శక్తి’ పెట్టమని, పురోగామి శక్తి అంటే చాలా విస్త్రత అర్థముంటుందని సలహా ఇచ్చాడు.

పిఎల్‌జీఏ ఇరవయ్యవ వార్షికోత్సవం సందర్భంగా విడుదలైన  సావనీర్‌ పుస్తకంలో యస్‌.వి. వ్యాసం హెడ్డింగ్‌  చూసి అందరూ వెరైటీగా హెడ్డింగులు  పెడితే ఈయనేంటి, ఇంత సింపుల్‌గా పెట్టాడని నా చిట్టి బుర్రకు తట్టింది. ఆ వెంటనే గతంలో తనిచ్చిన విశ్లేషణ గుర్తుకొచ్చింది.

కా.యస్‌.వి.కి కొరియర్‌గా పనిచేసిన గుంటూరు ఆర్‌.కె. మాటల్లో.. ‘మూడు నెలలకొకసారి రూమ్‌కి వచ్చేవాడు. ఒక్కోసారి నాలుగు, ఐదు నెలలకు. ఒకసారి కలిశాడంటే మళ్ళీ ఎప్పుడు కలుస్తాడోనన్న ఆత్రుతతో ఎదురుచూసే వాడిని. కలిసిన ప్రతిసారి రోజువారి పనులను, రాజకీయ, సిద్ధాంత అధ్యయనానికి నిర్దిష్టంగా ప్లాను చేసేవాడు. విడిపోయేటప్పుడు కూడా అంతే. అలా కామ్రేడ్స్‌ ఉత్సుకతను పెంచేవాడు. పనులు పురమాయించటమే కాకుండా పనిలో నైపుణ్యం, రాజకీయ స్ఫూర్తి కలిగించే విధంగా డీల్‌ చేసేవాడు. కష్టకాలాల్లో (అరెస్టులు, అమరత్వాలు) గుండె నిబ్బరం పెంచే విధంగా ఓదార్పు ఇచ్చేవాడు. తప్పులను నిశితంగా విమర్శిస్తూనే దాన్నుండి బయటపడే విధంగా సహాయ సహకారాలు అందించేవాడు. ఒక్కోసారి కొందరికి నాయకత్వం దగ్గర మాట్లాడాలంటే ఒకలాంటి బెరుకు అనిపిస్తుంది. కానీ యస్‌.వి. దగ్గర అలాంటివేవి లేని ఒక ప్రజాస్వామికమైన రాజకీయ వాతావరణం, ఏ విషయమైనా ఫ్రీగా చెప్పుకునే స్వేచ్ఛ ఉండేది. అది ప్రజలకైనా, కేడర్లకైనా. అందుకే తను కలుస్తాడంటేనే కొండంత ధైర్యమొచ్చేది. తనతో ఏవేవో పంచుకోవాలనే ఆత్రుత వెంపర్లాడేది’.

నిజం! అక్షరాలా ఇది నిజం! ఉన్నతమైన కమ్యూనిస్టు విలువలు, ఆదర్శాలు పుణికిపుచ్చుకున్న కా. యస్‌.వి. జీవితాచరణ  నుంచి మనం నేర్చుకోవాల్సిన, ఆచరించాల్సిన ఎన్నో  విషయాలున్నాయి. అందుకే కామ్రేడ్‌ యస్‌.వి. అంటేనే తరగని విప్లవాల గని.

వీలయినంత మేరకు అందుబాటులో ఉన్న ఎపి కామ్రేడ్స్‌ను కలవటం, దూరంగా ఉన్న వారికి లెటర్స్‌ ద్వారా యోగక్షేమాలు, ఉత్సుకతను నింపే ఎపి రిపోర్టుతో కూడిన లెటర్స్‌ రాసేవాడు. అలా నాకు రాసిన లెటర్‌లోని కొన్ని వాక్యాలు..

‘ప్రతి సమావేశంలోనూ మెదడు భావాల సంఘర్షణను ఎన్నో రెట్లు పెంపొందించుకొని ఎంతో కొంత అదనపు జ్ఞానాన్ని సముపార్జించుకుంటుంది’.

‘నీ ఉత్తరం చూడగానే కాసేపు పాత దినాల్లోకి వెళ్ళిపోతాను. నీ అల్లరి మాటలు, అమరుడు యమ్‌.ఆర్‌. గారి పెద్దరికపు మాటలు గుర్తుకు వచ్చి నవ్వుకుంటాను. మళ్ళా నేటి బాధ్యత గల నాయకత్వ కామ్రేడ్‌గా హుందాగా కనిపిస్తావు’.

‘ఎప్పుడూ రెండు భావాల మధ్య సంఘర్షణ జరగాలి. అప్పుడే నూతనమైన భావాలు ఉద్భవిస్తాయి. అవే మన ఆలోచనా పరిధిని పెంచటానికి దోహదం చేస్తాయి’.

ఎపి నుంచి చాలా దూరంగా పని చేస్తున్న కామ్రేడ్స్‌ కుటుంబాల క్షేమ సమాచారాన్ని తీసుకుంటూ కామ్రేడ్స్‌కు పంపటం, అలాగే కామ్రేడ్స్‌ చేత లెటర్స్‌ రాయించేవాడు. ‘ఇప్పుడున్న పరిస్థితుల్లో కుటుంబాలను కలవలేము, కనీసం ఉన్నామా?! లేమా? అని ఇంటివారికి తెలియాలి కదా! మనమీదే ఆశలు పెట్టుకున్న వారికి కనీసమైన ఊరట కలిగించే కబురుండాలి కదా!’ చివరిసారి కలిసినప్పుడు అన్న మాటలు.

నిజం. ఏ సమయంలో ఏం జరుగుతోందో తెలీని పరిస్థితుల్లో పిల్లల మీదున్న మమకారం తల్లిదండ్రులను నిరంతరం ఆందోళనకు గురి చేస్తుంది. ఈ సమయంలో ఆయన సహచరి  ఎలా ఉందో? ఒకవైపు కా. మున్నా అమరత్వం, మరోవైపు కా. యస్‌.వి. అమరత్వం. రెండిరటినీ ఆమె ఎలా సంభాలించుకుంటుందో? మానసికమైన ఒంటరితనంతో ఎంత తల్లడిల్లిపోతుందోననిపిస్తుంది.

కామ్రేడ్‌ సాకేత్‌ అమరత్వం అందరికీ విషాదమే. ఒక కామ్రేడ్‌ అన్నట్లు ‘ఎన్ని గొంతులు పెగలకుండా పూడుకొనిపోయాయో, ఎన్ని మనో అగ్నిపర్వతాలు బద్దలయ్యాయో ఊహించడం కష్టమే’. కామ్రేడ్‌ సాకేత్‌ అమరత్వం నుండి తేరుకోకముందే మరొక పిడుగులాంటి వార్త.  మరో భారీ నష్టం. ఉత్తర గడ్‌చిరోలి జిల్లాలో నవంబరు పదమూడవ తేదీన మహారాష్ట్ర సి-60 కమాండోలు వెంటాడి, వేటాడి హత్య చేసిన ఘటనలో మన ప్రియతమ కామ్రేడ్స్‌, ప్రజల ముద్దు బిడ్డలు ఇరవై ఏడు మంది కామ్రేడ్స్‌ అమరులవ్వటం – వారిలో కేంద్రకమిటీ సభ్యుడు కా. దీపక్‌దా అమరత్వం. ఇది వెంటనే కోలుకోలేని దెబ్బ.

కా. దీపక్‌ దాదాని చూసింది, మాట్లాడింది రెండేసార్లు. కానీ ఎంతో పరిచయం ఉన్న కామ్రేడ్‌లా ముద్ర వేశాడు. ఒకరకంగా తన మాటల్లోనే అక్కున చేర్చుకొనే స్వభావం కలవాడు. అందుకే తొలిసారి పరిచయమైనప్పుడే ఆయనంటేనే ఒక ప్రత్యేకత ఏర్పడిరది. ‘జ్వాలాగ్రహి’ అనే తన కలం పేరుతో వెలువడే సాహిత్యం విప్లవ శక్తులు అభిమానించేవిగా, విప్లవ ప్రతిఘాతక శక్తులకు వాడిగా, వేడిగా, పదునుగా గుచ్చుకొనేవిగా ఉండేవి. ఎంతో రాజకీయ పరిణితి ఉన్న కా. సాకేత్‌, కా. దీపక్‌ దాదా ఈ మధ్యకాలంలో  సీనియర్‌ నాయకులు కా. అంబర్‌ దా, కా. హరిభూషణ్‌ దాదాల అమరత్వం నేడున్న విప్లవోద్యమ పరిస్థితిలో వెంటనే కోలుకోలేనటువంటిది. ఒక పక్క వెంటాడే శత్రువు, మరో పక్క సీరియస్‌ అనారోగ్యాలు. సకాలంలో సరైన వైద్యసౌకర్యాలు అందకుండా చేస్తూ, తిండి పదార్థాల్లో విష ప్రయోగాలు చేస్తూ  నాయకత్వాన్ని పాశవికంగా హత్య చేస్తున్నాయి ఈ ప్రభుత్వాలు. శత్రువు అమలు చేస్తున్న పాశవిక నిర్బంధాన్ని, ప్రతిఘాతుక విప్లవ ఎత్తుగడలను తిప్పికొడదాం! ఓడిద్దాం! అమరులు నెలకొల్పిన ఆదర్శాలను, ఆశయాలను చివరికంటా కొనసాగిద్దాం! వారి జీవితాచరణను మన కార్యాచరణగా ఆచరిద్దాం! అదే అమరులకు ఇచ్చే నిజమైన నివాళి.

నిర్మలమైన నీ మనసు

సౌమ్యమైన నీ పలకరింపు

ఒడిదుడుకుల్లో నింపే ఆత్మవిశ్వాసం

బాధలను అక్కున చేర్చుకునే ఆపన్నహస్తం

‘గోపాలం పంతులు’గా ప్రజల్లో

నీవేసిన ముద్ర ఎప్పటికీ మా కాదర్శం.

(తమకంటూ ఏదీ ఆలోచించకుండా ఉన్నతమైన ఆదర్శాలతో జీవించిన కా. యస్‌.వి. మరియు కా. దీపక్‌దా ల జ్ఞాపకాలతో..)

Leave a Reply