రచయితలారా మీరెటు వైపు అని శ్రీ శ్రీతో సహా రచయితలను ప్రశ్నించకపోతే విప్లవ రచయితల సంఘమే లేదు. ఆ శ్రీ శ్రీ అయినా ఇరవై సూత్రాల పథకాన్ని పొగుడుతూ కవిత్వం రాసినప్పుడు విరసం ఆయనను సస్పెండ్ చేసింది. అంతెందుకు విప్లవోద్యమంలో ప్రజాపంథాకు, దండకారణ్య ఉద్యమానికి సైద్ధాంతిక బీజాలు నాటి సెట్ బ్యాక్ కు గురైన విప్లవోద్యమాన్ని పునాదుల నుండి నిర్మించిన కొండపల్లి సీతారామయ్యపై కూడా విమర్శనాత్మక దృక్పథం లేకపోతే ఈనాటి విప్లవోద్యమం 1990 ల తరువాత ఏ దిశలో వెళ్ళేదో ఊహకు కూడా అందని విషయం. భారత విప్లవోద్యమానికి ‘లెజెండరీ’గా ఆయన చేసిన కాంట్రిబ్యూషన్ ను ఎవరు కాదనగలరు? అయినా సైద్ధాంతిక విషయాలలో కానీ, ఆచరణాత్మక విషయాలలో కానీ, వ్యక్తుల పట్ల కానీ విమర్శనాత్మక వైఖరి లేకపోవడం బూర్జువా పార్టీలకో, రివిజనిస్టు పార్టీలకో చెల్లుతుంది కానీ విప్లవ పార్టీకి, విప్లవ ప్రజా సంఘాలకూ అది ఆత్మహత్యా సదృశమైన విషయం. విప్లవ కాలంలో తమ జీవితాలను పణంగా పెట్టి పోరాడారు కాబట్టి కొందరు నాయకుల పట్ల అప్రమత్తత కోల్పోతే విప్లవానంతరం ఆ నాయకుల బూర్జువా ధోరణులను పసిగట్టి పోరాడకపోతే సాంస్కృతిక విప్లవమే ఉండేది కాదు. 

గద్దర్ చనిపోయినప్పటి నుండి కొంత మంది ‘విప్లవ శిబిరం లోని’ వ్యక్తులే గద్దర్ పట్ల విమర్శనాత్మక వైఖరి చేపట్టిన వ్యక్తుల పట్ల, సంస్థల పట్ల దాడిపూర్వక వైఖరిని చేపట్టి అనవసరంగా గద్దర్ కు అంత్య క్రియలు కూడా జరగక మునుపే ఆయన జీవితాన్ని చర్చలలోకి లాగారు. దీనికి తోడుగా గతితార్కిక దృక్పథం పూర్తిగా లోపించిన మరో వ్యక్తి గద్దర్ పై సోషల్ మీడియాలో ‘ప్రజా శత్రువు’ అని పూర్తిగా నెగెటివ్ గా చిత్రీకరించి ఈ అనవసరమైన చర్చకు మరింత ఆజ్యం పోసాడు.

ఇది గద్దర్ మీద చర్చ కోసం రాస్తున్న విషయం కాదు. పై రెండు ధోరణుల మీద చేస్తున్న విమర్శ.

గద్దర్ ప్రపంచ స్థాయిలోనే చిర స్థాయిగా నిలిచిపోయే విప్లవ వాగ్గేయకారుడు, పర్ ఫార్మర్. దానితో పాటు ముఖ్యంగా తొంభైల నుండి 2012 దాకా ఎన్నో ఐక్య సంఘటనలకు, పోరాటాలకు, ఉద్యమాలకు ప్రత్యక్షంగా నాయకత్వం వహించిన ఉద్యమకారుడు కూడా. గద్దర్ తన గొప్ప సాహిత్య సృజన ద్వారా, పాట, ప్రదర్శనల ద్వారా దేశంలోని ఎన్నో భాషలలో అటువంటి సాహిత్య సృజనకూ, కళలకూ ప్రేరణ కలిగించిన వ్యక్తి. జీవిత కాలంలోనే లెజెండ్ గా మారిన విప్లవ కళాకారుడు. ఆయన విప్లవ కళాకారుడు కాకపోతే అట్లా లెజెండ్ గా కూడా మారేవాడు కాదు. విప్లవ దృక్పథం కలిగిన కళాకారుడు అయ్యాడు కాబట్టే ఆయన ‘గద్దర్’ అయ్యాడు. విప్లవోద్యమానికి, జన నాట్య మండలికి అతీతంగా గద్దర్ ఎదుగుదల లేదు. జన నాట్య మండలికి అతీతంగా ‘గద్దర్’ ను నిలబెట్టడానికి ఎవరు ప్రయత్నం చేసినా అది ఒక సంజీవ్ కు, ఒక దివాకర్ కు, ఒక రమేశ్ కు, ఒక పద్మకు, ఒక కుమారికి ఇంకా అటువంటి వందలాది కళాకారులకు అన్యాయం చేసినట్టు అవుతుంది. (అటువంటి వాదనలు ఎవ్వరూ చేయకపోవడం ఒక రిలీఫ్) ఒక కళాకారుడిగా గద్దర్ ప్రదర్శనలు 1970లు, 80 లలో కొన్ని వందల మందికి, వేలమందికి మాత్రమే చేరేవి. అదే తొంభైల నాటికి లక్షలాది మందికి చేరాయంటే దాని వెనుక విప్లవోద్యమ విస్తరణ, వందలాది మంది అమరుల త్యాగాలు ఉన్నాయి. అది గద్దర్ పాట ప్రతిభ మాత్రమే కాదు. వేలాది కార్యకర్తల కృషి ఉంది. ఆ విప్లవ కార్యకర్తల కృషి, త్యాగాల వల్లనే గద్దర్ లెజెండ్ కాగలిగాడు. విప్లవోద్యమ విస్తరణకు, గద్దర్ పాటకు గతితార్కిక సంబంధం ఉంది. ‘లాల్ సలాం లాల్ సలాం’ అనీ, ‘వీరులారా వీరులారా రాడికల్లు శూరులారా’ అనీ పాడిన గద్దర్ పాట లక్షలాది మందిని విప్లవోన్ముఖులను చేసిందంటే ఆ వీరుల పోరాటం, అమరత్వం ప్రాథమికమైనవి. ఆ తరువాతే పాట. ఆ అమరత్వం మీద ఆయన పాట ఆ అమరత్వాన్ని ‘అమరం’ చేసింది. మరింత మందిని విప్లవోన్ముఖులను చేసింది.

పై విషయాన్నంతా కాదంటున్నదెవరు అనే ప్రశ్న ఎవరైనా వేయవచ్చు కానీ, ఏ విప్లవోద్యమమైతే, ఏ విప్లవోద్యమ పంథా ఐతే గద్దర్ ను గద్దర్ గా మలిచిందో ఆ విప్లవోద్యమ పంథా నుండి పూర్తిగా వైదొలగిన తరువాత కూడా గద్దర్ పట్ల ‘అన్ క్రిటికల్’ గా విమర్శ రహిత వైఖరి అవలంబించాలనడం ‘వ్యక్తి పూజ’ అవుతుందేమో కానీ విప్లవ వైఖరి కాదు, మార్క్సిస్టు వైఖరి కాదు.

గద్దర్ పట్ల విమర్శనాత్మక దృష్టిని ప్రదర్శించడమంటే ఆ అమరుల త్యాగాన్ని, ఇప్పటికీ మడమ తిప్పక పోరాడుతున్న విప్లవకారుల పంథాను ఎత్తిపట్టడమే. విప్లవోద్యమానికి గద్దర్ కాంట్రిబ్యూషన్ ను చూపించి విమర్శనాత్మక వైఖరి నోరు మూయించాలనుకుంటే అది విప్లవపంథాలో, కమ్యూనిస్టు విలువలతో తుదివరకూ జీవించి, తమ ప్రాణాలను అర్పించిన అమరులందరి త్యాగాలను, ఆ పంథాను కించపరచడమే. 2012లో  గద్దర్ కు మావోయిస్టు పార్టీ షో కాజ్ నోటీస్ ఇచ్చాక ఆయన రాజీనామా చేయక ముందే దాదాపు ఒకటిన్నర దశాబ్దం పాటు పార్టీకి, ఆయనకూ మధ్య వివిధ విషయాల మీద ఐక్యత, పోరాటం నడిచాయి. అవి అమరులు కా. సంతోష్, కా. ఆది రెడ్డి, కా. ఆజాద్ ల నాయకత్వంలో నడిచాయి, ఆ తరువాత కా. రామకృష్ణ తదితరుల నాయకత్వంలో నడిచాయి. అవి సిద్ధాంతానికో, రాజకీయాలకో మాత్రమే పరిమితమైనవి కాక, ఆచరణకు సంబంధించినవి కూడా. ఆయనతో ఆచరణకు సంబంధించిన విషయాలపై పోరాటాలు చేసిన సంస్థలకు, కమిటీలకు అవన్నీ సూక్ష్మ స్థాయిలో తెలిసిన విషయాలు. అయితే ఇప్పుడు గద్దర్ మరణం తరువాత చర్చించాల్సిన విషయాలు కావు అవి. ఆయన జీవించిన కాలంలోనే ఆ చర్చలు, ఆ ఐక్యత, పోరాటాలు ముగిసి గద్దర్ తన రాజకీయ వైఖరులను, పంథాను ఎంచుకున్నాడు. గద్దర్ తో వ్యక్తిగతంగా సన్నిహితంగా ఉన్న విప్లవాభిమానులు, ‘గద్దర్’ అభిమానులు ఆయన చేపడుతున్న పంథా గురించి తన ప్రతిష్టను తానే ఎందుకు దిగజార్చుకుంటున్నాడనే ఆవేదనతో నచ్చ జెప్పాలని చూసినా ఆయన తన మార్గాన్ని తాను ఎంచుకున్నాడు.

గద్దర్ సాంస్కృతిక యోధుడు మాత్రమే కాక, నాలుగు దశాబ్దాల పాటు ప్రజా యుద్ధ పంథాకు ఒక వాయిస్ లాగా, ఒక అభివ్యక్తీకరణ లాగా కూడా ఉన్న ఒక నాయకుడు కాబట్టే ఆయన చేపట్టిన మార్గం పై విమర్శ తప్పని సరిగా ఉండాలి. అందరి పట్లా – అంటే చిన్న కార్యకర్తల పట్ల, పెద్ద నాయకుల పట్ల కూడా ఒకే వైఖరి అవలంబించలేము. నాయకులు చేసే తప్పుల పట్ల మరింత ఎక్కువగానే అప్రమత్తంగా ఉండాలి – అది విప్లవోద్యమ కాలంలోనైనా, విప్లవానంతరమైనా. సాంస్కృతిక విప్లవ స్ఫూర్తియే అది కదా!

ఏక పక్షంగా గద్దర్ పట్ల విమర్శనాత్మక వైఖరి ఉండకూడదని వాదిస్తున్న వారే ఈ చర్చలకు కారకులు. ఆ చర్చలు, ఆనాటి ఘర్షణలు ఇప్పుడు చర్చకు రావడం గద్దర్ ‘ఇమేజ్’కు మంచిది కాదని కూడా గద్దర్  అన్ క్రిటికల్ ‘అభిమానులు’ గుర్తించాలి. రాజకీయంగా విమర్శనాత్మక వైఖరి తీసుకుంటున్న వారు కూడా గద్దర్ లోని విప్లవ కళాకారుడికి అభిమానులూ, ఆయన పాటల నుండి, ప్రదర్శనల నుండి ప్రేరణ పొందిన వాళ్ళే అని గ్రహించాలి.

విప్లవోద్యమ పంథా నుండి వైదొలగిన తరువాత, నలభై ఏళ్ల పాటు ఏ బూర్జువా పార్లమెంటరీ పంథాను తిరస్కరిస్తూ విప్లవ గానం చేసాడో ఆ పంథాలోనే ఆయన ఆశ్రయం వెతుక్కోవడాన్ని విస్మరించి, గద్దర్ ను విమర్శించకుండా ఎత్తిపట్టాలని ఆశించడం ఎంత ఆత్మ వంచన, ఎంత పర వంచన! విప్లవ ప్రజానీకానికి అది ఏ సందేశం ఇస్తుంది? పేరు ప్రతిష్టలు వచ్చిన వారి పట్లనో, నాయకుల పట్లనో ఒక వైఖరి, సాధారణ కార్యకర్తల పట్ల ఒక వైఖరి ఎట్లా తీసుకుంటారనే కార్యకర్తల ప్రశ్నలకు ఒక పార్టీ లేదా సంస్థకు జవాబుదారీతనం ఉండదా? విప్లవోద్యమంలో గద్దర్ కంటే ముందు నుండి కూడా పూర్తి కాలం కార్యకర్తలుగా, నాయకులుగా పనిచేసిన వారైనా వారు విప్లవ పంథా నుండి తొలగి పోయినప్పుడు పార్టీ నుండి తొలగించడం చూస్తూనే ఉన్నాం.

తాను కొత్త పార్టీని పెడతానని ప్రకటించినా కాంగ్రెస్ వేదికలు ఎక్కడాన్ని, కాంగ్రెస్ పాదయాత్రలో పాల్గొనడాన్ని పట్టించుకోకూడదని వాదించడం ఎవరి విజ్ఞతకైనా వదిలేయవలసిన విషయాలే. ఒక వేళ బి‌జే‌పి ఫాసిజానికి వ్యతిరేకంగా పోరాడటానికి కాంగ్రెస్ తో కూడా షరతులతో కూడిన ఐక్యత చేపట్టాడని వాదించినా అది బహిరంగంగా ప్రజలకు జవాబుదారీతనంతో ప్రకటించినట్టు నా దృష్టికైతే రాలేదు.

ఇక బ్రాహ్మణ పండితుల వద్ద కొంగు చాచి ఆశీర్వచనం కోసం మోకాళ్లపై కూర్చోవడం, గుళ్ళకు, గోపురాలకు తిరగడం, పాటలు కట్టడం – ఇవన్నీ విప్లవ దృక్పథం కాదు కదా, కనీసం అంబేడ్కరిస్టు దృక్పథం కూడా కాదే!

వీటన్నింటి పట్ల ఉపేక్షను ప్రదర్శించాలని కోరడం ఎంత హాస్యాస్పద వైఖరి! వేరే ఎవరైనా ఇట్లాంటి, లేదా ఇంత కంటే చాలా తక్కువ స్థాయి బలహీనతలను ప్రదర్శించినా వీళ్ళ వీరంగం మాత్రం మరో స్థాయిలో ఉంటుంది!

ఈరోజు వాడవాడలా గద్దర్ కు నీరాజనాలు పడుతున్నవారిలో, సంస్మరణ సభలు జరుపుతున్న వారిలో – గద్దర్ విప్లవ పంథా నుండి తప్పుకున్నందు వల్ల జరుపుతున్న వారు కూడా తక్కువ కాదు. గద్దర్ అంటే మొట్ట మొదటగా గుర్తొచ్చే ఏ విప్లవ పంథా ఐతే ఉందో ఆ పంథాతో ఏ మాత్రం ఏకీభావం లేనివాళ్ళు కూడా గద్దర్ కు నీరాజనాలు పడుతున్నారు. ఒక గొప్ప ప్రజా వాగ్గేయకారుడిగా అందుకాయన పూర్తిగా అర్హుడే కానీ, అటువంటి వాళ్ళు విప్లవ సంస్థలపై పిల్లి శాపనార్థాలు పెట్టడం, దూషణలకు దిగడమే హాస్యాస్పదం.

గద్దర్ పట్ల ఆయన జీవిత కాలంలో ఉండిన కొన్ని విమర్శలను అసందర్భంగా, ఆయన మరణించిన తక్షణమే లేవనెత్తడమే కాకుండా ‘ప్రజా శత్రువు’ అని ఒకరు సోషల్ మీడియాలో రాశారు. అలా రాయడం అత్యంత బాధ్యతా రాహిత్యమైన విషయం, ఖండించతగిన విషయం.

ఇక – 1981లో మా భూమి సినిమా, ‘బండెనుక బండి కట్టి’, ‘పల్లెటూరి పిల్లగాడా’ పాటలతో విప్లవ రాజకీయాల పట్ల ఆకర్శితుడినైన నేను గద్దర్ చివరి దాకా విప్లవోద్యమంలో కొనసాగక పోవడం అత్యంత విషాదకరమైన విషయంగా భావిస్తాను.

విప్లవోద్యమానికి మాత్రమే అది నష్టదాయకం కాదు, వ్యక్తిగతంగా గద్దర్ కు కూడా అది నష్టదాయకమైన ఒక విషాదం.  విప్లవ పంథా నుండి వైదొలగినాక ఆయన కనీసం బూర్జువా పార్లమెంటరీ పంథాలోకి వెళ్లకుండా, బ్రాహ్మణవాద పూజారుల చుట్టూ, గుళ్ళు, గోపురాల చుట్టూ తిరగకుండా ఉండిపోయినా విప్లవ చరిత్రలో ఆయన పేరు చిరస్థాయిగా, మచ్చ రహితుడిగా ఉండిపోయేది.

4 thoughts on “విమర్శనాత్మక దృక్పథం లేకపోతే విప్లవమే లేదు

  1. మా సత్యం
    దుర్గాప్రసాద్ గారు
    మీరు ఒక జర్నలిస్టు, మూలాల్లోకి వెళ్లి వాస్తవాలను విశ్లేషించుకుని పరిశీలించుకుని గద్దర్ పట్ల ఒక వ్యాసం రాస్తే బాగుంటుంది సార్.
    మరొక విషయం ప్రసాద్ గారు
    మీరు రాసిన కామెంట్ లో
    “కాంగ్రెస్ లోచేరిండు అనే తప్పుడు నింద ను బాధ్యత గల సంస్థ గా
    వెయొద్దు కదా…
    ఏదీ చెప్పిన ఫ్యాక్ట్ ప్రధాన ము కదా. ఇక్కడ ఫ్యాక్ట్ వుండాలి అంటున్న…” అని పేర్కొనడం సమంజసంగా లేదు.
    రవి గారు తన వ్యాసంలో కాంగ్రెస్ పార్టీలో చేరాడని ఎక్కడ పేర్కొలేదు.
    “తాను కొత్త పార్టీని పెడతానని ప్రకటించినా కాంగ్రెస్ వేదికలు ఎక్కడాన్ని, కాంగ్రెస్ పాదయాత్రలో పాల్గొనడాన్ని పట్టించుకోకూడదని వాదించడం ఎవరి విజ్ఞతకైనా వదిలేయవలసిన విషయాలే.” అని అన్నారు.
    మీరు ఏకంగా ” కాంగ్రెస్లో చేరిండు” అని రాస్తే ఎట్లాగూ సార్.
    మరొక విషయము గద్దర్ అన్ని పార్టీల వైపు తిరగడము తల వగ్గి నమస్కరించడం, చిన్న జీయర్ స్వామి లాంటి వారి దగ్గరికి వెళ్లడము వీటి అన్నింటిని ఎట్లా అర్థం చేసుకుందాం!?.
    యుద్ధనౌక గద్దర్ పట్ల దేశీ దేశాలలో శ్రామికులు, రైతు కూలీలు , మధ్యతరగతి, ఉన్నత తరగతి, సామాన్యులు మేధావులు అందరికీ అత్యంత అభిమానం. అందులో నేను ఒకడిని.
    రవి నార్ల రాసిన వ్యాసం గతి తార్కిక చారిత్రక భౌతిక వాద కోణంలో విశ్లేషించి ప్రామాణికతతో సామాన్య ప్రజలకు అర్థమయ్యే రీతిలో వ్యక్తం చేశారు.
    రవి నార్ల రాసిన వ్యాసం లోని తాత్వికతను అర్థం చేసుకోండి.
    వారు రాసిన వాక్యాలను పేర్కొంటూ…
    ” గద్దర్ పట్ల విమర్శనాత్మక దృష్టిని ప్రదర్శించడమంటే
    ఆ అమరుల త్యాగాన్ని, ఇప్పటికీ మడమ తిప్పక పోరాడుతున్న విప్లవకారుల పంథాను ఎత్తిపట్టడమే. విప్లవోద్యమానికి గద్దర్ కాంట్రిబ్యూషన్ ను చూపించి విమర్శనాత్మక వైఖరి నోరు మూయించాలనుకుంటే అది విప్లవపంథాలో, కమ్యూనిస్టు విలువలతో తుదివరకూ జీవించి, తమ ప్రాణాలను అర్పించిన అమరులందరి త్యాగాలను,
    ఆ పంథాను కించపరచడమే.”
    నిజమే.
    రోజులు చాలా ప్రమాదకరంగా మారాయి నిరంతరం వెంటాడుతున్న
    రాజ్య హింసకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలను ఇంకా ఇంకా ఎలా బలోపేతం చేయాలో వాటికి సమయాన్ని,ఆలోచనలనలతో ఆచరణాత్మకంగా ఉద్యమంలో భాగస్వాములం అవుతాం.

  2. మా సత్యం
    రవి నార్ల గారు రాసిన వ్యాసం విమర్శనాత్మక కోణంలో బాగా ఆలోచింపచేస్తుంది.
    గద్దర్ అన్ని పార్టీల వైపు తిరగడము తల వగ్గి నమస్కరించడం, చిన్న జీయర్ స్వామి లాంటి వారి దగ్గరికి వెళ్లడము వీటి అన్నింటిని ఎట్లా అర్థం చేసుకుందాం!?.
    యుద్ధనౌక గద్దర్ పట్ల దేశీ దేశాలలో శ్రామికులు, రైతు కూలీలు , మధ్యతరగతి, ఉన్నత తరగతి, సామాన్యులు మేధావులు అందరికీ అత్యంత అభిమానం. అందులో నేను ఒకడిని.
    రవి నార్ల రాసిన వ్యాసం గతి తార్కిక చారిత్రక భౌతిక వాద కోణంలో విశ్లేషించి ప్రామాణికతతో సామాన్య ప్రజలకు అర్థమయ్యే రీతిలో వ్యక్తం చేశారు.
    వారు రాసిన వాక్యాలను పేర్కొంటూ…
    ” గద్దర్ పట్ల విమర్శనాత్మక దృష్టిని ప్రదర్శించడమంటే
    ఆ అమరుల త్యాగాన్ని, ఇప్పటికీ మడమ తిప్పక పోరాడుతున్న విప్లవకారుల పంథాను ఎత్తిపట్టడమే. విప్లవోద్యమానికి గద్దర్ కాంట్రిబ్యూషన్ ను చూపించి విమర్శనాత్మక వైఖరి నోరు మూయించాలనుకుంటే అది విప్లవపంథాలో, కమ్యూనిస్టు విలువలతో తుదివరకూ జీవించి, తమ ప్రాణాలను అర్పించిన అమరులందరి త్యాగాలను,
    ఆ పంథాను కించపరచడమే.”
    నిజమే.
    రోజులు చాలా ప్రమాదకరంగా మారాయి నిరంతరం వెంటాడుతున్న
    రాజ్య హింసకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలను ఇంకా ఇంకా ఎలా బలోపేతం చేయాలో వాటికి సమయాన్ని,ఆలోచనలనలతో ఆచరణాత్మకంగా ఉద్యమంలో భాగస్వాములం అవుతాం.
    లాంగ్ లీవ్ ఇండియన్ రెవల్యూషన్
    డౌన్ డౌన్ ఇండియన్క్రి
    మినల్ గవర్నమెంట్
    డౌన్ డౌన్ ఇండియన్
    క్రిమినల్ కోర్టు

  3. మా సత్యం
    రవి నార్ల రాసిన వ్యాసం సద్విమర్శనాత్మకంగా ఆలోచింపచేస్తోంది.
    గద్దర్ అన్ని పార్టీల వైపు తిరగడము తల వగ్గి నమస్కరించడం, చిన్న జీయర్ స్వామి లాంటి వారి దగ్గరికి వెళ్లడము వీటి అన్నింటిని ఎట్లా అర్థం చేసుకుందాం!?.
    యుద్ధనౌక గద్దర్ పట్ల దేశీ దేశాలలో శ్రామికులు, రైతు కూలీలు , మధ్యతరగతి, ఉన్నత తరగతి, సామాన్యులు మేధావులు అందరికీ అత్యంత అభిమానం. అందులో నేను ఒకడిని.
    రవి నార్ల రాసిన వ్యాసం గతి తార్కిక చారిత్రక భౌతిక వాద కోణంలో విశ్లేషించి ప్రామాణికతతో సామాన్య ప్రజలకు అర్థమయ్యే రీతిలో వ్యక్తం చేశారు.
    రవి నార్ల రాసిన వ్యాసం లోని తాత్వికతను అర్థం చేసుకోండి.
    వారు రాసిన వాక్యాలను పేర్కొంటూ…
    ” గద్దర్ పట్ల విమర్శనాత్మక దృష్టిని ప్రదర్శించడమంటే
    ఆ అమరుల త్యాగాన్ని, ఇప్పటికీ మడమ తిప్పక పోరాడుతున్న విప్లవకారుల పంథాను ఎత్తిపట్టడమే. విప్లవోద్యమానికి గద్దర్ కాంట్రిబ్యూషన్ ను చూపించి విమర్శనాత్మక వైఖరి నోరు మూయించాలనుకుంటే అది విప్లవపంథాలో, కమ్యూనిస్టు విలువలతో తుదివరకూ జీవించి, తమ ప్రాణాలను అర్పించిన అమరులందరి త్యాగాలను,
    ఆ పంథాను కించపరచడమే.”
    ఇప్పుడు రోజులు చాలా ప్రమాదకరంగా మారాయి నిరంతరం వెంటాడుతున్న
    రాజ్య హింసకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలను ఇంకా ఇంకా ఎలా బలోపేతం చేయాలో వాటికి సమయాన్ని,ఆలోచనలనలతో ఆచరణాత్మకంగా ఉద్యమంలో భాగస్వాములం అవుతాం.

  4. Gander ji -lal salam —-meeting with babu —China Jir swamy— kissing Rahul Gandhi —-he crossed the lines — last few years his actions are not good
    Sri Sri — supported INDIRA Gandhi emergency —great great poet —wrong steps
    Ravi garu —agree with u sir

Leave a Reply