పది రోజులుగా అంతటా గద్దరే. అందరి నోటా గద్దరే. ఆయన పాటను తాము ఎట్లా విన్నామో చెప్పుకుంటున్నారు. ఆ పాట తమనెలా కుదిపి నిలబెట్టిందో గుర్తు చేసుకుంటున్నారు. ఆయన కవిత్వాన్ని, గొంతును, హావభావాలను, ఆహార్యాన్ని, ఆడుగుల సవ్వడిని తలపోసుకుంటున్నారు.  వ్యక్తిగా ఆయన గురించి తమకెట్లా ఎరుకైందో దగ్గరిగా చూసిన వారు తలచుకుంటున్నారు. ఈ మొత్తంలో దేనికదే చూస్తున్నవారున్నారు. అన్నీ కలిపి ఎట్లా అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నవారు ఉన్నారు. ఆయన పాటను అనుభవించాల్సిందేగాని కొలతలు వేయవద్దంటున్నవారు ఉన్నారు. తామూ అంచనా వేస్తున్నామనే సంగతి మర్చిపోయి కొంచెపు అంచనాలు వేయవద్దనే వాళ్లూ ఉన్నారు. అసలు ఏ అంచనాలకు గద్దర్‌  మూర్తిమత్వం లొంగదనే వాళ్లూ ఉన్నారు.  మొత్తం మీద ఒక మహా నిష్క్రమణకు లోనైన మన:స్థితిలో తెలుగు సమాజం తనను తాను వెతుక్కుంటున్నది. తాను నడిచి వచ్చిన దారుల్లో గద్దర్‌ ఆట పాటల ఆనవాళ్లను పునర్నిర్మించుకుంటున్నది. చరిత్రలో భాగమయ్యే ఆ చారిత్రక కళాభివ్యక్తి అన్ని రకాలుగా ఇప్పుడొక మరణానంతర వాస్తవంగా మారుతున్నది.  తన పాటల, మాటల, దారుల ఎగుడుదిగుడులన్నిటితో సహా ఆయన చరిత్రలో భాగమయ్యే అసలైన క్రమం 6వ తేదీ సాయంకాలం నుంచి మొదలైంది. చరిత్ర చేతిలో రూపొందిన గద్దర్‌ వ్యక్తిగా తనకూ, చారిత్రక పురోగామి క్రమానికి మధ్య వైరుధ్యాన్ని మరణంతో రద్దు చేసుకొని తన సకల పార్శ్వాలతో ఇక చరిత్రలో భాగమవుతున్నాడు. 

గద్దర్‌ మరణం ఇప్పటికీ దిగ్భ్రమే. కాలం గడిస్తేనే ఇది తీరవచ్చు. మన స్మృతి తలంలోకి గద్దర్‌ చేరుకోవచ్చు. మనతో శాశ్వతంగా ఉండిపోతుందని అనుకుంటున్న ఆయన పాట అప్పుడు జ్ఞాపకంగా మారిపోతుందా? గతంలో భాగమవుతుందా? ఈ మాట అనుకోవడం  కష్టమే. కానీ ఆ పాట ప్రభావం, ప్రాభవం కాలంతో పుట్టి పెరిగనవే. కాలమానానికి ఆవల గద్దర్‌ ఉండేవాడని, ఉంటాడని ఎవరైనా అనుకుంటే వాళ్లు ఆయన ప్రభావాన్ని అలౌకికంగా మార్చేసిన వాళ్లవుతారు.

ఇప్పుడెవరైనా సరే.. ఆయన పాటను తెలుగు ప్రజల జీవన సంస్కృతిలో, కళాభివ్యక్తిలో చూడవలసిందే. అందరిలోని ఉమ్మడితనంలో చూడవలసిందే. మనందరి విశ్వాసాల్లో, ఆకాంక్షల్లో, విమర్శల్లో గద్దర్‌ను నిలుపుకోవలసిందే. ఆ సామూహికత వెనుక ఉన్న తాత్విక చింతనను, రాజకీయ, సాంస్కృతిక నిర్మాణాలను, వాటి నాయకత్వంలోని పోరాటాలను కలిపి అంచనా వేయవలసిందే.  ఇలాంటి ప్రమాణాలెన్నిటినో సమకూర్చుకొని అంచనా వేయాల్సిందే. ఇప్పటి దాకా మనకు తెలిసిన పద్ధతులు చాలవనుకుంటే కొత్త వాటిని తయారు చేసుకోవాల్సిందే. అంతేగాని మనకు ఇష్టమైనప్పుడు, ఇష్టమైనవాటిని మాత్రమే అంచనా వేస్తామని, కొలుస్తామని, తూస్తామని, తారతమ్య వివేచన పాటిస్తామనడానికి లేదు. మనకు ఇష్టం లేకుంటే.. అంచనా వేసే  పద్ధతే ఉండదని, ఉన్నా గద్దర్‌ను అంచనా వేయాలనుకోవడం కుదరదని ఎవరు అన్నా అది వెర్రితనం అవుతుంది.  ఆయనను అంచనా వేయకపోవడం వల్ల ఆయనకు వచ్చే లాభం ఏమీ లేదు. మనమే నష్టపోతాం. మరణానంతర గద్దర్‌కు  మనకు దూరమవుతాం.  దేనికంటే గద్దర్‌ తెలుగు ప్రజల రాజకీయ సాంస్కృతిక పోరాటాల ప్రతిరూపం. ఒకానొక   కవి గాయకుడు గద్దర్‌గా మారడం, తెలుగు ప్రజల,  భారతీయ భాషా సమూహాల భావోద్వేగాల్లో భాగం కావడం, అనేక అద్భుత, అభ్యంతరకర పరిణామాలకు లోనుకావడం, తిరుగులేని ఆశ్వాసంగా ఎదిగి, విచారకంగా స్ధిరపడిపోవడం  అనే పలుకోణాలు అందులో ఉన్నాయి.

ఆ కాలపు కల్లోలమంతా, సామూహిక సృజనాత్మకత అంతా,  ఆయనలోని మహాద్భుతమైన ప్రతిభ అంతా కలగలసిన ఆ పాటలు మనల్ని ఆయన దగ్గరికి తీసికెళ్లాయి.  ఆ పాటలతో సహా ఆయననూ అంచనా వేయడం ద్వారానే మరణానంతర గద్దర్‌ మనకు దగ్గర అవుతాడు.  గతం సరే.. భవిష్యత్తు  సరే.. ఇటీవల కొన్నేళ్ల తెలుగు సమాజాల ఆరాట పోరాటాలకు గద్దర్‌ గొంతు ఏ స్వరంతో శృతి కలిపిందో,  ఆ గొంతులో ఏ ధ్వని వినిపించిందో  అంచనా వేయక తప్పదు. వాడల్లో, కొండ కోనల్లో, వేలాది వేదికలపై లయబద్ధంగా, ఉగ్రంగా సాగిన ఆ మువ్వల పాదాల చలనాలను మళ్లీ మళ్లీ చూడాల్సిందే. అంతిమంగా గద్దర్‌ను, ఆయన పాటను ఎక్కడ వేరు చేయగలమో తెలిసి ఉండాలి. ఆ రెండూ ఎక్కడ  అభేదమో స్పష్టత ఉండాలి.  విస్తారమైన ప్రజా జీవితం ఉన్న వ్యక్తుల విషయంలో ఇది అంత సులభం కాకపోవచ్చు. ఇది భావోద్వేగాలతో ఆయన పాటల్లో కలిసిపోయినంత తేలిక కాకపోవచ్చు. కేవలం మన ఇష్టాఇష్టాలతోగాక అనేక ఆధారాల, వాస్తవాల ప్రాతిపదికలమై విశ్లేషించడానికి సిద్ధం కావాల్సిందే.

                నిజానికి గద్దర్‌ కళా వ్యక్తీకరణలాగే ఆయన వ్యక్తిత్వ వ్యక్తీకరణ ఉన్నదా? బహుశా  ఎవరి విషయంలో అయినా ఇట్లాగే ఉండవచ్చు. అయితే గద్దర్‌ గత యాభై ఏళ్లుగా తనలోని పరిణామాలను తేటతెల్లంగా అర్థం చేసుకోడానికి  ఎన్నో ఆధారాలు ఇచ్చాడు. అవి ఎంత సరళమైనవో, అంత సంక్లిష్టమైనవి. అస్పష్టత లేనివి. వీటన్నిటి మధ్యే  గద్దరూ, ఆయన పాటా  విడదీయలేనంతగా కలిసిపోవడం వల్లే  సమాజం ఇంత ప్రభావానికి లోనైంది. కాబట్టి ఆయనలో వచ్చిన మార్పులను గద్దర్‌కు బైట చూడ్డానికి లేదు. గద్దర్‌లోని రాజకీయ పరిణామాలను, ఆయన పాటలను వేర్వేరుగా చర్చించడం కుదరదు.

ఆనాటి సామాజిక సంఘర్షణలు, పోరాటాలు ఆయన వ్యక్తిత్వంలోంచి  పాటలుగా వెల్లువెత్తాయి.  ఆ కాలంలోని రాపిడి, ఆయనలోని ప్రతిభ కలిసి ఆయన వ్యక్తిత్వం రూపొందింది.  గద్దర్‌ తయారయ్యాడు. ఆ తర్వాత  కాలం మరింత మండిపోయింది. మరింత తేజస్సుతో వెలిగిపోయింది. అనేక తీవ్ర సంక్షోభాల్లో చిక్కుకుంది. వాటి పరిష్కారాల కోసం తల మునకలవుతున్నది. ఆ పరిష్కార మార్గమే గతంకంటే మరింత ప్రాసంగికతను సంతరించుకుంటున్నది. ఇంకేవైనా ప్రత్యామ్నాయాలుంటాయా? అనే వెతుకులాటల ఎండమావులు కూడా అదృశ్యమవుతున్నాయి. కాలం అంతగా ఇంకో దశలోకి ఎదిగింది. ఇప్పుడు ఆయనలో వచ్చిన మార్పులను ఈ కాల అవధిలో చూడాల్సిందే. ఆయన వ్యక్తిత్వంతో సహా అంచనా వేయాల్సిందే. 

ఎవరైనా తమ మీద గద్దర్‌ ప్రభావాన్ని ఆరాధానగా చూసుకోవచ్చు. అంత వరకు బాగానే ఉంటుంది. అది వ్యక్తులను, వాళ్ల ప్రత్యేకతలను, ప్రతిభలను, పాత్రలను, ప్రభావాలను చూడ్డానికి పనికి రాదు. వాటిని చరిత్రతో ముడిపెట్టడానికి సరిపోదు. ముఖ్యంగా మరణానంతరం ఆ వ్యక్తులు  చరిత్రలో భాగమవుతున్న తీరును తెలుసుకోవాలంటే విమర్శనాత్మక అంచనా ఒక్కటే సాధనం. చరిత్ర అంటేనే  నిరంతర విమర్శనాత్మక పునర్నిర్మాణం. చరిత్రలో భాగమయ్యే వ్యక్తులకూ ఇది వర్తిస్తుంది.

కానీ వ్యక్తులను, అందునా అత్యంత ప్రభావశీలమైన వ్యక్తులను  పురాస్మృతులతో చూసుకొనేవాళ్లు ఉంటారు.  ఈ ధోరణి ఆ వ్యక్తులకు  కూడా నష్టం చేస్తుంది. వాళ్లను గతంలోకి తోసేస్తుంది.  గద్దర్‌కు వర్తమానం ఉంది. దాన్ని నిర్దిష్టంగా, హేతుబద్ధంగా చూడాల్సిందే. చీకటి వెలుగుల సంధ్యావర్ణాన్ని గుర్తించాల్సిందే.  వర్తమానంలోంచి అంచనా వేసి భవిష్యత్‌ దిశగా సాగే చరిత్రలో సముచితంగా నిలబెట్టవలసిందే.

Leave a Reply