గద్దర్ లోని విప్లవ వాగ్గేయకారుడికి నివాళి..
తెలుగు ప్రజల విప్లవ సాంస్కృతిక చైతన్య ప్రతీక అయిన గద్దర్ హఠాన్మరణం దిగ్భ్రాంతికరం. తీరని విషాదం. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ప్రజానాట్యమండలి అందించిన ఒరవడిని మౌళి కంగానే విప్లవీకరించి, తెలంగాణ దళిత, వెనుకబడిన కులాల సాంస్కృతిక అభివ్యక్తిగా మార్చి రెండు మూడు తరాల ప్రజలను గద్దర్ పోరాటాల్లోకి కదిలించాడు. ఆర్ట్ లవర్స్‌తో ఆరంభమైన గుమ్మడి విఠల్ 1972లో ఏర్పడ్డ జననాట్యమండలికి దిశా నిర్దేశం చేయగల వాగ్గేయకారుడిగా రూపాంతరం చెందాడు. ఆ కాలంలో తెలంగాణ అంతటా ప్రజ్వరిల్లిన భూస్వామ్య వ్యతిరేక రైతాంగ సాయుధ పోరాటాల సాంస్కృతిక శక్తిగా కళారంగంలో చెరగని ముద్ర వేశాడు. వర్గపోరాటం చేరుకున్న అన్ని జీవన క్షేత్రాలలోకి చూపు సారించి, అక్కడి నుంచి పీడిత కులాల, వర్గాల బాణీలను, కళారూపాలను వెలికి తీశాడు. విప్లవ వాగ్గేయకార సంప్రదాయాన్ని తీర్చిదిద్ది తన వంటి వందలాది మంది పాటల రచయితలు, కళా ప్రదర్శకులు, గాయకులు తయారు కావడానికి ప్రేరణ అయ్యాడు. తెలుగు నేల మీద విప్లవ సాంస్కృతిక కార్యకర్తలకు ప్రత్యేకమైన ఆహార్యాన్ని, అభినయాన్ని, ఆలాపనను అందించాడు. దళిత కులాల డప్పుల శబ్దానికి సరిదోడుగా సాగే తన ఆలాపన తెలుగు ప్రజలను నిద్రలేపి రోమాంచితం చేసింది. గ్రామాల్లోని పీడిత కులాల ప్రజలను, అందునా యువతను, రైతుకూలీలను, విద్యార్థులను, మధ్య తరగతిని ఆయన గానం, అభినయం ఉర్రూతలూగించింది. ప్రజల నుంచి భాషను, వ్యక్తీకరణను, కవిత్వాన్ని, కళా రూపాలను ఎంచుకొని విప్లవ సందేశాన్ని తిరిగి ఆ ప్రజలకే అందించే రాజకీయ సాంస్కతిక ప్రయోగంలో జననాట్యమండలి సాధించిన అద్భుత విజయాల వెనుక గద్దర్ ఉన్నాడు. భారతీయ భాషల్లోనే ఆయన అరుదైన సాంస్కృతిక యోధుడిగా నిలిచిపోయాడు. విప్లవ రాజకీయాల ప్రచారంలో, విప్లవోద్యమ విస్తరణలో అంతర్భాగమయ్యాడు.
జననాట్యమండలి ఏర్పడ్డప్పటి నుంచి ఎమర్జెన్సీ వచ్చేంత వరకు ఆ మూడేళ్లపాటు విప్లవోద్యమ నిర్మాణంలో కవిగా, గాయకుడిగా ఆయన అద్భుతమైన పాత్ర పోషించాడు. 1973లోనే ఆయన తొలి పాటల పుస్తకం ‘విబి గద్దర్ పాటలు’ విడుదలైంది. ఎమర్జెన్సీ ఎత్తేసిన ప్పటి నుంచి ప్రజాపంథాలో విప్లవోద్యమ పురోగతిలోని ప్రతి అడుగును ఆయన తన పాటల్లో రాశాడు. గొంతులో పలికించాడు. వేలాది, లక్షలాది జన సందోహం మధ్య ప్రదర్శనలు ఇచ్చాడు. 1985లో అప్పటి ఆంధప్రదేశ్‌లో ఆట మాట పాట బంద్ అయిందనే నుడికారం ప్రచారంలోకి రావడానికి ప్రధాన కారణం జననాట్యమండలి ప్రదర్శనలు ఆగిపోవడమే. అలాంటి తీవ్ర నిర్బంధంలో గద్దర్ ప్రవాసానికి వెళ్లిపోవాల్సి వచ్చింది. కానీ ఆ కాలంలో ఆయన పాట దేశమంతా ప్రతిధ్వనించింది. అనేక రాష్ట్రాల్లో గద్దర్ సభలు జరిగాయి. అనేక భాషల్లోకి ఆయన పాటలు అనువాదం అయ్యాయి. వేర్వేరు రాష్ట్రాల్లో గద్దర్, జననాట్యమండలి ప్రభావంలో విప్లవ సాంస్కృతికోద్యమం ఆరంభమైంది. అనేక విప్లవ సాంస్కృతిక సంస్థలు ఏర్పడ్డాయి. విప్లవ రచయితల సంఘం, జననాట్యమండలి పూనికతో ఈ సంస్థలన్నీ కలిసి 1983 అక్టోబర్ నాటికే అఖిల భారత సాంస్కృతిక సమితిగా ఒక వేదిక మీదికి వచ్చాయి. ఈ మొత్తం కృషిలో గద్దర్ ప్రత్యక్ష భాగస్వామ్యం ఉన్నది. భారతీయ భాషా సాహిత్యాల్లోకి విప్లవ సాంస్కృతిక పంథాను తీసికెళ్లడంలో ఆయన కృషి ఉన్నది.
1990 ఫిబ్రవరిలో గద్దర్ అజ్ఞాతం నుంచి బైటికి వచ్చాక అప్పుడున్న రాజకీయ అనుకూల వాతావరణంలో వరుసగా అనేక బహిరంగ కార్యక్రమాలు జరిగాయి. లక్షలాది మంది ప్రజల మధ్య గద్దర్ పాటలు పాడాడు. ప్రదర్శనలు ఇచ్చాడు. 1992 జూన్‌లో అప్పటి సీపీఐ ఎంఎల్ పీపుల్స్ వార్ పార్టీతో పాటు ఆరు ప్రజాసంఘాలను ప్రభుత్వం నిషేధించింది. జననాట్యమండలి విషయంలో కాగితం మీద నిషేధం లేకపోయినప్పటికీ ఆ సంస్థ బహిరంగంగా పని చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఆ సంస్థ కూడా అజ్ఞాతానికి వెళ్లిపోయింది. గద్దర్ బహిరంగ జీవితంలో ఉంటూ సాంస్కృతిక కృషి కొనసాగించాడు.
ఆ కాలంలో రాజకీయ ఖైదీల విడుదల పోరాటంలో, బూటకపు ఎన్కౌంటర్ల వ్యతిరేక ఉద్యమంలో, అమరవీరుల శవాల స్వాధీన కమిటీలో, ఎస్పీ వర్గీకరణ సంఘీభావ ఉద్యమంలో పని చేశాడు. ఆ పోరాటాల కోసం పాటలు రాశాడు. అమరవీరుల శవాల స్వాధీన ఉద్యమాన్ని దెబ్బతీయడానికి 1997 ఏప్రిల్ 6న ఆయన మీద హత్యాయత్నం జరిగింది. మృత్యుముఖంలోకి వెళ్లి బైటపడ్డాడు. ఆ కాల్పుల్లో దిగిన ఒక తూటా చివరి దాకా ఆయన శరీరంలోనే ఉంది. అయినా ఆట, పాట కొనసాగించాడు. 2001లో అఖిల భారత విప్లవ సాంస్కృతిక సమితి ప్రధాన కార్యదర్శిగా నాలుగేళ్లు బాధ్యతలు నిర్వహించాడు.
2001లో పౌర స్పందన వేదిక కృషి వల్ల విప్లవ పార్టీకి, ప్రభుత్వానికి మధ్య జరిగిన శాంతి చర్చల్లో పీపుల్స్ వార్ ప్రతినిధి బృందంలో సభ్యుడిగా పని చేశాడు. ఆ చర్చలు విఫలమైనప్పటికీ విప్లవ రాజకీయాల, ప్రజా సమస్యల ప్రచారానికి కృషి చేశాడు. తిరిగి 2004లో రెండు విప్లవ పార్టీలకు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య జరిగిన శాంతి చర్చల్లో సీపీఐ మావోయిస్టు పార్టీ ప్రతినిధి బృందంలో సభ్యుడిగా పని చేశాడు. ఈ చర్చలు విఫలమయ్యాక అనేక అక్రమ కేసులు ఆయన మీద కూడా నమోదయ్యాయి.
విప్లవ రాజకీయాలతోపాటు కారంచేడు, చుండూరు మారణకాండలకు వ్యతిరేకంగా సామాజిక, సాంస్కృతిక ఉద్యమంలో కృషి చేశాడు. దళిత విముక్తి కోసం పాటలు రాశాడు. దీనికి కొనసాగింపుగా మలి విడత తెలంగాణ ఉద్యమవ్యాప్తికి కళాకారుడిగా, ఉద్యమకారుడిగా కీలకంగా పని చేశాడు. తెలంగాణ ప్రజాఫ్రంట్ చైర్మన్‌గా ప్రజాస్వామిక తెలంగాణ నినాదాన్ని ప్రజల్లోకి తీసికెళ్లాడు.
ఏ ప్రజా సమస్య మీద పాట రాసినా, ఉద్యమించినా ఆయన నక్సల్బరీ రాజకీయాల సాంస్క్సతిక ప్రతినిధిగా ప్రభావం వేశాడు. అయితే ఆ మార్గంలో ఆయన చివరి దాకా కొనసాగలేకపోయాడు. 2013 నుంచే తన రాజకీయ వైఖరిలో మార్పు వచ్చిందని స్వయంగా ప్రకటించుకున్నాడు. విస్తారమైన ప్రజా జీవితంలో సాయుధ వర్గ రాజకీయాలను నిరుపమానంగా ప్రచారం చేసిన వ్యక్తి పార్లమెంటరీ రాజకీయ మార్గంలోకి వెళ్లిపోయాడు. ఇప్పుడు కావాల్సింది ఓట్ల విప్లవమని దృఢంగా ప్రచారం చేశాడు. విప్లవాత్మక భౌతిక దృక్పథానికి భిన్నమైన వైఖరులు చేపట్టాడు. కాంగ్రెస్ కు చేరువయ్యాడు
1972 నుంచి 2014 దాకా విప్లవోద్యమానికి, దళిత బహుజన ఆత్మగౌరవ పోరాటాలకు, మలి దశ తెలంగాణ పోరాటానికి కవిగా, కళాకారుడిగా, ఉద్యమకారుడిగా ఆయన చేసిన కృషి అజరామరమైనది. అది భారత విప్లవ, ప్రజా సాంస్కృతిక కోద్యమంలో విడదీయలేని భాగం. ఆ తర్వాత విప్లవ రాజకీయాలకు దూరం జరిగానని ఆయనే చెప్పుకున్నప్పటికీ ఆ రోజుల్లో ఆయన రాసిన, పాడిన పాటలు ఎప్పటికీ విప్లవోద్యమానికి దోహదం చేస్తునే ఉంటాయి. ఆ పాటల్లోని ప్రచండమైన శక్తి ప్రజా ప్రత్యామ్నాయ రాజకీయాల్లో జీవించే ఉంటుంది. గద్దర్ వ్యక్తిగా ఏ రాజకీయ తీరానికి చేరుకున్నా, వాటి మీద ఎన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నా గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది. విప్లవం విజయవంతమయ్యే వరకు ఆయన పాటలు తిరుగుబాటును ప్రబోధిస్తూనే ఉంటాయి. వర్గ పోరాటానికి తిరుగులేని కళా వ్యక్తీకరణలుగా నిలిచి ఉంటాయి. విప్లవోద్యమానికి, పీడిత అస్తిత్వాల విముక్తికి ఆయన తొలి దశ అంతా చేసిన కృషిని విరసం సగౌరవంగా స్మరించుకుంటోంది. ఆయనకు నివాళి ప్రకటిస్తోంది. ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేస్తోంది.
అరసవిల్లి కృష్ణ(అధ్యక్షుడు)
రివేరా (కార్యదర్శి)
Lal salam /salutes to gadder —he is a great guy — but
Meeting with babu —and kissing Rahul Gandhi —believe in god —-some are wrong steps
THE BUCK STARTS FROM YOU —-missing last few years